మాట - పాట
పని - పాట
ఆట - పాట
ఏం చేసినా ప్రక్కన ఈ పాటేమిటి? ప్రాస కోసమా?
కాదు, కాదు.
మాటకి అందం పాట
పనికి తోడు పాట
ఆటకి జోడీ పాట. అన్నిటికీ దన్ను పాట!
ఎక్కడుందీ పాట? ఎక్కడ లేదీ పాటు?
పాపాయి ఏడుపులో పాట - కిలకిల నవ్వులో పాట
గాలి ఈల పాట - అలల సవ్వడి పాట
చిటపట చినుకుల పాట - ఆకుల గలగల పాట
ఈ కవిత్వం మాకు తెలియందా?
అసలింతకీ పాటెందుకు’ అని కదా ప్రశ్న! దాని దగ్గరకే వద్దాం.
జోలపాట పాడందే పాపాయి నిద్రపోదు.
చిట్టిపొట్టి పాటలకు చిన్నారి చిందులేస్తుంది.
పాట పాడితే బుజ్జీగాడు ఏడుపాపేస్తాడు.
పాటలంటే పిల్లలకిష్టమని వేరే చెప్పాలా?
పాటలోని రాగం, లయ పిల్లల్లో అత్యంత సహజంగా ప్రవహిస్తుంటాయి.
పాట వినడం, పాట పాడడం రెండూ పిల్లలకు అత్యంత ఇష్టమైన పనులు.
పిల్లలు రకరకాల ఆందోళనలకు, ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వాటిని దూరం చెయ్యడానికి ఆటలు ఒక మార్గమైతే, పాటలు పాడడం, వినడం గొప్ప స్వాంతన కలిగిస్తుంది.
హడావడిగా, గందరగోళంగా, చికాకుగా ఉండే పిల్లలలో పాట గొప్ప తీసుకొస్తుంది.
పాటల ద్వారా ఎన్నో సంగతులు పిల్లలకు చెప్పడం ఇప్పడు క్రొత్త విషయం కాదు. పూర్వం నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రధానంగా పాటద్వారానే జరిగేదని, రోజువారీ పనుల దగ్గర్నుండీ జీవితసత్యాల వరకు పాటల్లోనే చెప్పడం జరిగేదనీ మనకు తెలుసు.
ఇష్టమైనది ఎంత కష్టమైనా చేస్తారు పిల్లలు. కష్టమైన పనిని ఇష్టమైన విధంగా చెబితే నేర్చుకోవడం సులభతరమరొతుంది.
అక్షరాలు - అంకెలు; రంగులు - ఆకారాలు జంతువులు - పక్షులు; అలవాట్లు - బదులు నీతులు - నిజాలు ఎన్నో - మరెన్నో విషయాలు పాటల ద్వారా చెప్లే అలవోకగా గ్రహించేస్తారు పిల్లలు.
పాట ద్వారా నేర్చుకున్న విషయం గాఢంగా వారి మనసులో ఉండిపోతుంది. మర్చిపోవడం అనే ప్రశ్న ఉండదు. పాటలను మళ్ళీ మళ్ళీ ఇష్టమైనప్పడల్లా పాడుకుంటారు కాబట్టి ఎవరు చెప్పకుండానే పునశ్చరణ జరిగిపోతుంది.
పాటల్లో వచ్చే అనేక సందేహాలను ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం చేస్తుంటారు. అందువల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి.
వచనంలోకంటె పాటలో పదాల వాడుక, అమరిక అందంగా ఉంటుంది. పిల్లలను ఆకట్టుకుంటుంది. భాషపట్ల ఇష్టం పుట్టడానికి ఇది అత్యంత అవసరం.
పాటల్లో వాడబడిన పదకట్లు, పదాల అల్లిక, పోలిక, ప్రాస వంటి అంశాలు పిల్లలను తమ సొంతంగా ప్రయోగించడానికి ఉత్సాహపరుస్తాయి.
ఎన్నో తెలియని పదాలు పాటల ద్వారా తెలుసుకుంటారు — ఎప్పటికీ వాటిని గుర్తుపెట్టుకుంటారు. పాటలు పరోక్షంగా చదవడాన్ని ప్రేరేపిస్తాయి. చదవడమంటే ఆసక్తి లేని పిల్లలకు బాణీలు కట్టమని చిన్న చిన్న మాటలను వ్రాతలో ఇవ్వడం ద్వారా వారిని చదివేందుకు సిద్ధం చెయ్యవచ్చు.
పిల్లలు అత్యంత సహజంగా పదాలను జిగిబిగిగా అల్లి పాటలను తయారుచేసి తమ సొంత బాణీలో పాడెయ్యగలరు. ఈ సహజ సిద్ధమైన ఆసక్తినీ, నైపుణ్యాన్నీ వ్రాయడం ప్రోత్సహించడానికి ఉపయోగించుకోవచ్చు.
పువ్వుమీద, వానమీద, బంతిమీద, అమ్మమీద - ఇష్టమైన ఏ విషయం గురించైనా, వాళ్ళు స్పందించే అంశాలు గ్రహించిన పెద్దలు పాటలను వ్రాయమని ప్రోత్సహిస్తే ఎంతో ఇష్టంగా వ్రాస్తారు పిల్లలు.
మాట్లాడేటప్పడు సరిగా పలకలేని పదాలను పాటలలో స్పష్టంగా పలకడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా మాటల్లో వాడని పదాలను చక్కగా పలకడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఉచ్చారణ మెరుగవుతుంది.
పాట ఒక్కళ్ళే పాడుకోవడం ఓ సంతోషం - అందరితో పాడడం ఓ సంతోషం. దెబ్బలాటలు, తారతమ్యాలు మర్చిపోయి, అందరూ సంతోషంగా సమయం గడపడానికి ఇదొక మంచి మార్గం.
ఆత్మవిశ్వాసం కోసం.
చదువుల్లో హెచ్చుతగ్గులు ఆర్ధిక, సామాజిక తారతమ్యాల వల్ల చిన్నబుచ్చుకునే పిల్లలు గొంతెత్తి కమ్మగా పాడుతూ ప్రత్యేకంగా నిలవడం అసాధారణమైన విషయం కాదు.
సహజసిద్ధమైన ఈ నైపుణ్యం పిల్లలకు ప్రత్యేక గుర్తింపునిచ్చి వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. తాము బాగా చేయగలిగిన పనులెన్నిటిలో పిల్లలు పాల్గొంటే అది వారిమీద వారికి అంత ఎక్కువ నమ్మకాన్నిస్తుంది. తన మీద అపనమ్మకమే ఓటమి. తనపై విశ్వాసమే గెలుపు.
బృందగానం పిల్లలలో బెరుకు, బిడియం తగ్గిస్తుంది. పదిమందితో పాడడంలో ధైర్యం పెంపొందుతుంది. మెల్లగా ఒక్కరే పాడడానికి కూడా ముందుకొస్తారు.
శారీరకంగా చురుకుగా ఉండని పిల్లలు ఆటలకు దూరమౌతారు. వారికి పాటలు గొప్ప స్వాంతన కలుగజేస్తాయి. ఉల్లాసాన్నిస్తాయి.
'నా పాట - నా ఇష్టం
అనే అవకాశం పిల్లలకిస్తే పిల్లలు తమ సొంత బాణీలతో ప్రయోగాలు చేస్తారు.
పాటను తిరగేసి - మరగేసి
రాగాన్ని సాగదీసి - కత్తిరించి
పిల్లలు గమ్మత్తులు చేస్తారు.
వాటిని వారి సృజనాత్మక వ్యక్తీకరణగా, సరదా ప్రయోగాలుగా చూడాలి.
కొంతమంది పిల్లలకు చెప్పింది చెప్పినట్టు పాడడం అసలు నచ్చదు. చెప్పింది చెప్పినట్టు పాడకపోతే పెద్దలకు నచ్చదు. ఉభయతారకంగా కొన్ని పాటలనైనా వారి స్వేచ్చకొదిలి వెయ్యడం అవసరం. పెద్దల ముందు కుదరని స్వేచ్చని వాళ్ళు ఎలానో పరోక్షంలో తీసుకుంటారనుకోండి.
ఆ స్వేచ్చలేని పిల్లలు పాటలను పూర్తిగా ఆస్వాదించరు. అయిష్టం పెంచుకుంటారు. గొప్ప వాళ్ళు చేసే ప్రయోగాలని మెచ్చుకొని వీరతాళ్ళ వేస్తాం గానీ, పిల్లల ప్రయోగాలను ఆకతాయితనంగా పరిగణిస్తాం. ఆలోచిస్తే అది నిజం కాదని తెలుస్తుంది. పిల్లల సృజనాత్మకత అర్థమవుతుంది.
పాటలెందుకంటే.
కేవలం వేదిక మీద పాడి మొప్ప పొందడానికి కాదు.
శాస్త్రీయ సంగీతంలో దిట్టలవడానికి మాత్రమే కాదు.
పోటీల్లో పాల్గొని బహుమతులు తేవడానికి కాదు.
టి.వి.లో పాడి మనకి గుర్తింపు తేవడానికి కాదు.
పాట పేరిట బాల్యానందాల్ని కోల్పోవడానికి కాదు.
పాటలు ఎందుకంటే.
పిల్లలు హాయిగా సంతోషంగా పాడుకోవడానికి,
గొంతు ద్వారా మనసు విచ్చుకొని విరబూయడానికి,
ఒళ్ళు మరిచి కమ్మగా వాళ్ళు పాడుతుంటే మనం మురిసిపోవడానికి,
పిల్లలతో కలిసి పాడుకుని మనమూ పిల్లలమైపోవడానికి,
ఇంట్లో - వారికి నచ్చిన పాటలను నచ్చిన విధంగా పాడుకునే స్వేచ్చనిద్దాం.
అందరు పిల్లలకీ బడిలో కూడా పాటలు నేర్పమని కోరదాం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020