অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్రం

నిత్యజీవితంలో విజ్ఞానశాస్త్రం

 1. వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది
 2. భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్‌ ఉనికిని ఎలా కనిపెడతారు
 3. అంతరిక్షంలో ఉన్నవారు భూమిపై ఉన్నవారితో ఎలా ట్లాడుతారు
 4. నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా మార్చవచ్చంటారు. అది ఎలా సాధ్యం
 5. సిమెంటును ఎలా తయారు చేస్తారు? నీటితో కలిస్తే అది ఎలా గట్టి పడుతుంది
 6. రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు
 7. వజ్రము బొగ్గు(కార్బన్‌) నుండి పుట్టినదని అంటారు మరి ఆ వజ్రానికి  ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి
 8. వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది
 9. కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం
 10. పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా
 11. చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు
 12. ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి
 13. డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి
 14. ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది
 15. విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి
 16. చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి
 17. మంట ఎలా మండుతుంది
 18. పసుపును పసుపుకొమ్ముల నుంచి చేస్తారు కదా, మరి కుంకుమను ఎలా చేస్తారు
 19. పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా?
 20. అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది
 21. టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి
 22. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అంటారు. తుపాకీతో పేల్చినా ప్రమాదం ఉండని విధంగా వాటిని ఎలా తయారు చేస్తారు
 23. మొక్కల నుంచి మందులను ఎలా తయారు చేస్తారు
 24. పాలు ఎలా పెరుగు అవుతుంది
 25. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది, దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయా
 26. పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుంది
 27. సూర్యుడు ప్రకాశవంతంగా ఎలా మెరుస్తున్నాడు? అందులో హైడ్రోజన్‌ నిల్వలు ఉన్నాయంటారు. అవెక్కడివి
 28. ఈ మధ్య కొన్ని టార్చిలైట్లు చీకట్లో మెరుస్తున్నట్టు మనకి కనిపిస్తాయి. ఈ కాంతి ఎక్కడిది
 29. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు నిర్జీవ పదార్థాలు కదా? వాటిలోకి మామూలు వైరస్‌ ఎలా ప్రవేశిస్తుంది
 30. కంప్యూటర్లలోకి వైరస్‌ ఎలా వస్తుంది?మొదట అసలు వైరస్‌ ఎలా పుట్టింది
 31. వేడి నీటి బుగ్గలు ఉంటాయని తెలుసు. మరి చల్లని నీటి బుగ్గలు కూడా ఉంటాయా? అసలివి ఎలా ఏర్పడతాయి
 32. ఇన్‌స్టెంట్‌ కాఫీని ఎలా తయారు చేస్తారు
 33. ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం
 34. రిఫ్రిజిరేటర్‌లో డీప్‌ఫ్రీజర్‌ అర అడుగున, చుట్టుపక్కల మంచు పేరుకుపోతుంది కదా? అక్కడ గడ్డకట్టే నీరు ఎక్కడిది
 35. నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది
 36. ఇసుక నుంచి గాజును తయారు చేస్తారని చదివాను. ఎలా చేస్తారు
 37. పెద్ద పెద్ద వృక్షాల వయసు ఎలా కనుగొంటారు
 38. పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు
 39. ముక్కుతో వాసన పసిగాట్టేదేలా
 40. మన కళ్లు వివిధ వర్ణాలను ఎలా గుర్తించ గలుగుతున్నాయి
 41. విమానం నడిపే పైలట్‌కు దారి ఎలా తెలుస్తుంది
 42. తుపాకీ గుండు నుంచి బులెట్‌ప్రూఫ్‌ కార్లు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు మనని ఎలా రక్షిస్తాయి
 43. చెకుముకి రాయి నుంచి నిప్పు కణాలు ఎలా వస్తాయి

వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది

వైర్‌లెస్‌ ఫోన్లను కార్డ్‌లెస్‌ ఫోన్లు అని కూడా అంటారు. వింటూ, మాట్లాడే హేండ్‌సెట్‌కు మనం నంబరు డయల్‌ చేసే బేస్‌సెట్‌కు మధ్య విద్యుత్‌ తీగ ( wire or cord) ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్‌సెట్‌నుంచి దూరంగా హేండ్‌సెట్‌ను పట్టుకుని గదిలో మనం అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్‌లెస్‌ ఫోను అంటారు. ఇందులో హేండ్‌సెట్‌కు, బేస్‌సెట్‌కు మధ్య రేడియో తరంగాల ద్వారాగానీ, సూక్ష్మతరంగాల ద్వారాగానీ సమాచార రవాణా డిజిటల్‌ పద్ధతి అనే ఎలక్ట్రానిక్‌ ప్రక్రియ ద్వారా వీలవుతుంది. అందుకే హేండ్‌సెట్‌లోను, బేస్‌సెట్‌లోను రెంటిలో విద్యుచ్ఛక్తిని ఇచ్చే బ్యాటరీ ఉండాలి. సాధారణంగా బేస్‌సెట్‌ను ఏదైనా అడాప్టర్‌ (adopter)ద్వారా ఇంట్లో స్విచ్‌ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్తు (dc)ని అందిస్తారు. హేండ్‌సెట్‌లో రీఛార్జబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇందులోని బ్యాటరీలలో విద్యుత్‌ శక్తి తగ్గినపుడు తిరిగి రీఛార్జి చేసుకోవచ్చు. బేస్‌సెట్‌కే సెల్‌ఫోన్‌ వైరును కలపడం వల్ల అక్కడ్నించి మనం మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి అవతలి వ్యక్తికి చేరతాయి.
మైక్రోఫోను అనే మైకును వైర్లు ఉన్నా లేకున్నా మైక్రోఫోను అనే అంటారు. కార్డ్‌లెస్‌ ఫోను పద్ధతిలోనే మైక్రో ఫోనును ఉపయోగించగలిగితే అపుడు దాన్ని కార్డ్‌లెస్‌ మైక్రోఫోను లేదా కార్డ్‌లెస్‌ అనడం కద్దు. మనం మాట్లాడిన మాటలు తొలుత విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారతాయి. ఆ తర్వాత అవి రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్‌ తరంగాలుగా మారి స్పీకర్లకు అందించే ఆంప్లిఫియర్‌ దగ్గర ఉన్న బేస్‌ స్టేషను అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని చేరతాయి. అక్కడ అవి తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

భూమి లోపల అమర్చిన లాండ్‌మైన్స్‌ ఉనికిని ఎలా కనిపెడతారు

భూమిని తవ్వి లోపల పేలుడు పదార్థాలను అమర్చి మట్టిని కప్పేయడం వల్ల లాండ్‌మైన్స్‌ (మందుపాతరలు) ఉనికి పైకి తెలియదు. దాని మీంచి బరువైన వాహనాలు ప్రయాణించినప్పుడు ఆ ఒత్తిడికి పేలుతాయి. లేదా వాటిని అమర్చిన దుండగులు రిమోట్‌ కంట్రోలు సాయంతో దూరం నుంచి పేలుస్తుంటారు. మందుపాతరల ఉనికిని కనిపెట్టడం మెటల్‌ డిటెక్టర్ల సాయంతో కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాటిలో అమర్చే పేలుడు పదార్థాలను లోహమిశ్రమాలతో కాకుండా కృత్రిమమైన సింథటిక్‌ మెటీరియల్స్‌తో చేస్తారు. అయితే కప్పెట్టిన పేలుడు పదార్థాల పరమాణువులు ఆవిరవుతూ నేలలోని పగుళ్లగుండా బయట వాతావరణంలో కలుస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని కనిపెట్టగలిగే పరికరాలు ఉంటాయి. మానవ శరీరంలోని భాగాలను చిత్రాల ద్వారా తెరపై చూపించే 'న్యూక్లియర్‌ మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌' సాధనం ద్వారా మందుపాతరల ఉనికిని చూడవచ్చు. వీటి ద్వారా వెలువడే విద్యుదయస్కాంత తరంగాల సాయంతో పేలుడు పదార్థాల నుంచి వెలువడే అణువులను కనిపెట్టవచ్చు. అలాగే కొన్ని పరికరాల ద్వారా శక్తిమంతమైన శబ్దతరంగాలను భూమి లోపలికి ప్రసరించేలా చేస్తారు. అవి మందుపాతరలను స్వల్పంగా కంపింపజేస్తాయి. ఈ కంపనాలను గ్రాహకాల ద్వారా నమోదు చేసి పేలుడు పదార్థాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి తీవ్రత ఎంత, ఏ రకానికి చెందినవి అనే విషయాలను కనిపెడతారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

అంతరిక్షంలో ఉన్నవారు భూమిపై ఉన్నవారితో ఎలా ట్లాడుతారు

మీరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల శబ్దతరంగాలు మొదట విద్యుదయస్కాంత తరంగాలు (electromagnetic waves)గా మారతాయి. వాటిని సెల్‌ఫోన్‌ కంపెనీ వాళ్లు తమ మైక్రోవేవ్‌ కారియర్‌ తరంగానికి జోడించి టవర్ల ద్వారా ప్రసారం చేస్తారు. అవి అవతలి వైపు సెల్‌ఫోన్‌ను చేరుకోగానే అందులో తిరిగి శబ్ద తరంగాలుగా మారతాయి. సాధారణంగా మైక్రోవేవ్‌ తరంగాలు, రేడియో తరంగాలు, తక్కువ దూరాలకు పరారుణ (infra red) తరంగాలను వాడతారు. వీటి ప్రసారానికి వాతావరణం కానీ, పదార్థాలు కానీ అవసరం లేదు. నిజానికి శూన్యంలోనే ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. అంతరిక్షంలోని వ్యోమగామికి, భూమ్మీద ఉండే కేంద్రానికి మధ్య ఇలాగే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో మైక్రోవేవ్‌ తరంగాల ద్వారా సమాచారం బట్వాడా అవుతుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

నిమ్మకాయలను విద్యుత్‌ బ్యాటరీలుగా మార్చవచ్చంటారు. అది ఎలా సాధ్యం

మామూలు బ్యాటరీ ఎలా తయారవుతుందో పాఠాల్లో చదువుకుని ఉంటారు. జింకు, రాగి లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు) సజల సల్ఫ్యూరిక్‌ ఆమ్లము (ఎలక్ట్రోలైట్‌) ఉండే పాత్రలో దూరదూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న విద్యుత్‌ బల్బును రాగితీగతో అనుసంధానిస్తారు. దాన్నే విద్యుత్‌ ఘటము (electric cell) అంటారు. కొన్ని విద్యుత్‌ ఘటాల అనుసంధానమే బ్యాటరీ. ఇక్కడి సూత్రం రెండు వేర్వేరు లోహాల మధ్య విద్యుత్‌ శక్తి ప్రవహించడమే.
ఒక నిమ్మకాయలో ఒక ఇనుము లేదా జింకు మేకును, కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని గుచ్చి వాటి మధ్య రాగి తీగ ద్వారా ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయ తగినంత విద్యుత్‌ ప్రవాహాన్ని కలుగజేయదు. కాబట్టి బల్బు వెలిగినా ప్రకాశవంతంగా ఉండదు. అదే ఐదో, ఆరో నిమ్మకాయలను రాగి తీగ ద్వారా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ ఏర్పాటు ఎలక్ట్రిక్‌ బ్యాటరీలాగా పనిచేస్తుంది.

సిమెంటును ఎలా తయారు చేస్తారు? నీటితో కలిస్తే అది ఎలా గట్టి పడుతుంది

సిమెంటు ఒక సంయోగ పదార్థం (compound) కాదు. ఎన్నో ఘన లవణాల సమ్మేళనం. ఇందులో ఉన్న పదార్థాల్ని సంయుక్త సమ్మేళన పదార్థాలు (composits) అంటారు. ఇవి నీటిలో కరగవు. నీటినే తమలో ఇముడ్చుకుంటాయి. సున్నపు రాయి (lime), అల్యూమినియం ఆక్సైడు, ఫెర్రిక్‌ ఆక్సైడు, ఇసుక (sand) వంటి పదార్థాల్ని బాగా చూర్ణం చేసి గుండ్రంగా తిరిగే గొట్టంలాంటి బట్టీలోకి పంపుతారు. ఇందులో ఈ పొడిని వివిధ స్థాయిల్లో అత్యధిక ఉష్ణోగ్రతకు లోను చేస్తారు. క్రమేపీ పెరిగే ఉష్ణోగ్రతల వద్ద ఈ ఘన చూర్ణాల్లో వివిధ రకాలైన నిరింద్రియ రసాయనిక ప్రక్రియలు (inorganic reactions) జరుగుతాయి. మిశ్రమ ఆక్సైడులు ఏర్పడుతాయి. చివరకి ఇవన్నీ ద్రవస్థితిలోకి వేళ్లేంతగా వేడి చేస్తారు. ఆ స్థితిలో ఏర్పడే రసాయనిక మార్పులు, వాటికి నీటిని ఆహ్వానించే లక్షణాలను చేరుస్తాయి. ఆ ద్రవ మిశ్రమాన్ని చల్లబర్చి బాగా చూర్ణం చేస్తారు. ఈ పొడి ఎంత సూక్ష్మంగా ఉంటే అంత నాణ్యతగల సిమెంటుగా భావిస్తారు. ఈ మిశ్రమానికి నీటిని కలిపినప్పుడు ప్రతి సిమెంటు రేణువుకు మధ్య నీటి అణువులు మొదట సంధాన కర్తలుగా ఏర్పడి అన్నింటినీ దగ్గర చేరుస్తాయి. ఈ దశనే సెట్టింగ్‌ అంటారు. ఘన, ద్రవ పదార్థాలతో ఏర్పడిన ఈ స్థితిని జెల్‌ అని కూడా అంటారు. క్రమేపీ నీటి అణువులతో సంధానమైన పదార్థాలు దృఢమైన బంధాలతో రాయిలాగా గట్టి పడతాయి. దీన్నే హార్డెనింగ్‌ అంటారు. ఇలా సిమెంటు నీటితో కలిసినప్పుడు గట్టిపడిపోతుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

రాజుల కాలంలో వాడిన ఫిరంగులు ఎలా పనిచేసేవి? అందులో నుంచి లోహపు గుండ్లు ఎలా వదిలేవారు

నాటి ఫిరంగులైనా, నేటివైనా, తుపాకులైనా, రివాల్వరులైనా సూత్రం ఒకటే. పేలుడు పదార్థం, గుండు లేదా బుల్లెట్‌సైజు, గుండు బయటకొచ్చే ద్వారం అడ్డుకోత వైశాల్యం, పేల్చే విధానం మొదలైన విషయాల్లోనే తేడా.
ఫిరంగి ఓ వైపు మూసుకొని మరోవైపు తెరచుకొని ఉండే దళసరి లోహపు గోడలున్న ఓ గొట్టం. మూసుకుని ఉన్న చివర అంటిస్తే ఉన్నఫళాన పేలే రసాయనిక పేలుడు పదార్థం ఉంటుంది. మనం దీపావళి సమయంలో అంటిస్తే పేలినట్టే ఇది కూడా పేలుతుంది. ఈ పేలుడు పదార్థాన్ని తెరచి ఉన్న చివరి నుంచే బాగా లోపలికి దట్టిస్తారు. ఆ తర్వాత గుండును ఆ రంధ్రంలోకి జొప్పుతారు. గొట్టం మూసి ఉన్న చివర వత్తి మాత్రమే లోపలికి వెళ్లేలా సన్నని రంధ్రం ఉంటుంది. దాన్ని వెలిగిస్తే కాలుతూ లోపలికి వెళ్లి పేలుడు పదార్థాన్ని పేలుస్తుంది. ఒక్క ఉదుటున పేలుడు వాయువులు విడుదలవుతాయి. అవి అటూ ఇటూ పోవడానికి దారిలేకపోవడం వల్ల గుండును అతివేగంగా నెడుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో గుండు విపరీతమైన శక్తితో బయటకు దూసుకు వస్తుంది. పొడవైన గొట్టం సరళమార్గంలో ఉండడం వల్ల గుండు కూడా బయటకు నేరుగా వేగంగా వస్తుంది. గుండు గమ్యాన్ని బట్టి అది ఉన్న దూరాన్ని బట్టి ఫిరంగి గొట్టపు వాలు కోణాన్ని మార్చేలా ఫిరంగిలో యంత్రాంగం ఉంటుంది.

వజ్రము బొగ్గు(కార్బన్‌) నుండి పుట్టినదని అంటారు మరి ఆ వజ్రానికి  ఆ మెరుపులు కాంతులు ఎలా ఏర్పడ్డాయి

అనేక లక్షల సంవత్సరాల క్రితము భూమి చల్లబడినపుడు శిలాద్రవము భూమిలోపలి పొరల్లో వుండిపోయింది అని ... కాలక్రమములో ఉష్ణోగ్రత , ఒత్తిడుల ప్రభావాన కార్బన్‌ పార్టికిల్స్ ఒకదానికొకటి చేరి స్పష్టమైన స్పటికల్లా ఏర్పడి ఉండవచ్చుననని అంటారు . అవే స్పచ్చమైన కార్బన్‌ స్పటికలు . సాధారణ స్థితిలో వాటికి మెరుపులు ఉండవు . దొరికిన వజ్రాన్ని రెండుగా కోసి ... వచ్చిన రండుముక్కలను రెండు గుండ్రని రూపములోకి తెస్తారు. ఆ తర్వాత వజ్రాన్ని సానపడతారు. అలా సానబట్టగా వచ్చినటువంటి వజ్రముఖ కోణాలనుండి కాంతి మిగిలిన పదార్ధాలకన్నా మెరుగా వెలుపలికి పంపుతుంది.. . . కాబట్టి వజ్రము మెరుస్తుంది.

వేడినీటిలో ఉతికితే మురికి ఎలా వదులుతుంది

బట్టల్కు బాగా మురికి పట్టినపుడు వాటిని వదిలించేందుకు వేడినీటిలో వేసి ఉతుకుతారు . వేడినీటికి " తలతన్యత "('surfaceTension) తగ్గించే గుణము ఉండడము వలన నీటికి చొచ్చుకుపోయే శక్తి పెరుగుతుంది. ఫలితము గా వేడినీరు సులభముగా బట్టల పోగుల లోపలకెళ్ళి మురికిని బయటకు నెడుతుంది. నీటిలో ఉడికించి , బయటకు తీసి బట్టలను బండరాయి మీద బాదగానే మురికి పదార్ధము సులభముగా బట్టను వదిలి బయటకు వెళ్ళిపోతుంది. సబ్బులు , డిటర్జెంట్స్ వాడకుండానే మురికి పోగొట్టె విధాము వేడినీటిలో ఉడకపెట్టి బట్టలను ఉతకడము .

కేవలం గాలిని ఉపయోగించి కారుని నడిపారని పత్రికల్లో చదివాను. ఇదెలా సాధ్యం

సాధారణంగా వాహనాలు పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాలలోని రసాయనిక శక్తిని తమ అంతర్దహన యంత్రాంగం (internal combustion mechanism) ద్వారా యాంత్రిక శక్తిగా మార్చుకుని పని చేస్తాయి. ఈమధ్య వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ యాంత్రిక పద్ధతుల్లో వాహనాలను నడిపే ప్రక్రియలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటివే ఈ వాయు చోదక వాహనాలు. మామూలు గాలిని ప్రత్యేక మోటార్ల ద్వారా సిలండర్లలో అధిక పీడనంతో నింపుతారు. వీటి మూతులకు ప్రత్యేకమైన రెగ్యులేటర్లను అమర్చడం ద్వారా కావలసిన పీడనం, వేగాలతో బయటకి పంపే ఏర్పాటు ఉంటుంది. ఇలా అత్యధిక ఒత్తిడితో బయటకి వచ్చే గాలి టర్బైన్‌ను తిప్పే విధంగా అమరిక ఉంటుంది. అంటే వాయుశక్తి యాంత్రిక శక్తిగా మారుతోందన్నమాట. ఈ టర్బైన్‌కు అనుసంధానంగా చక్రాల ఇరుసులను అమర్చడం వల్ల అవి తిరిగి కారు ముందుకు కదులుతుంది. ఇలాంటి ఇంజిన్లను వాయుచలన యంత్రాలు (Pneumatic engines) అంటారు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

పక్షులు, జంతువులు అవి పయనించే దిశల విషయంలో భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయని అంటారు. నిజమేనా

వలస పక్షులు, పావురాలు, తాబేళ్లు, సొరచేపలు, తిమింగలాలు వంటివి పయనించే దిశ విషయంలో భూ అయస్కాంత క్షేత్రం (earth magnetic field) సహాయాన్ని తీసుకుంటాయి. ఈ ప్రాణులన్నీ అయస్కాంత కణాలు ఉండే ప్రత్యేకమైన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటాయి. ఈ కణాలు అతి చిన్న ఇనుము లేక నికెల్‌ లోహ కణాల మయం. ఇవి అయస్కాంత సూచి (magnetic compass)లాగా పనిచేస్తాయి. ఏ ప్రాణిలోని ఏ జ్ఞానేంద్రియంలో ఈ అయస్కాంత కణాలు ఉంటాయో అనే విషయం ఇంకా కనిపెట్టవలసి ఉంది. ఆ జ్ఞానేంద్రియంలో జరిగే జీవరసాయన చర్యలను అవగాహన చేసుకొనే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి.


వలసపోయే పక్షుల విషయంలో ఈ అయస్కాంత సంబంధిత జ్ఞానం వాటి కుడికంటిలో ఉన్నట్లు అధ్యయనం ద్వారా తెలిసింది. కుడికన్ను గ్రహించిన సమాచారం మెదడులోని ఎడమభాగంలో క్రమబద్ధీకరింపబడి, ఆ ఆలోచనతో కాంతి గ్రాహకాల (light sensors) ను ప్రేరేపించడం ద్వారా పక్షులు అయస్కాంత క్షేత్రాలను పసిగట్టగలుగుతాయి.

సొరచేపలలో ఈ అయస్కాంత ఇంద్రియం వాటి ముక్కులలో ఉంటుంది. ఇది విద్యుదయస్కాంత క్షేత్రాలను కనిపెట్టే అతి సున్నితమైన 'ఏరియల్‌'లాగా పనిచేస్తుంది. సొరచేపలు ఒక 'వోల్ట్‌' లోని పదిలక్షలవ వంతు విద్యుత్‌ పొటన్షియల్‌ను కూడా కనిపెట్టగలవన్నమాట. ఈ విధంగా పక్షులు, జంతువులు భూ అయస్కాంత క్షేత్ర ఉనికిని కనిపెట్టి దిశానిర్దేశం చేసుకోగలవు.

చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు

బరువు ఎత్తడం ఎత్తకపోవడం అనే విషయం కేవలం చిన్న ప్రాణి, పెద్ద ప్రాణి అన్న లక్షణానికే పరిమితం కాలేదు. శరీర నిర్మాణం, నేలకు బరువుకు మధ్య ఉన్న దూరం, ఎన్ని బిందువుల మీద నేలకు శరీరం తాకి ఉంది అన్న అనేక విషయాలు బరువు నెత్తే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. చీమ ఆర్థ్రోపొడ (కీళ్లు అధికంగా ఉన్న కాళ్లుగల) వర్గంలో కీటకాల తరగతికి చెందిన జీవి. ఇది చతుష్పాది (tetrapod) అంటే తాను ఎత్తే బరువు నాలుగు కాళ్ల మీదికి విభజన అవుతుంది. పైగా కాళ్లు గట్టిగా ఉన్న కైటిన్‌ అనే ప్రోటీన్‌ నిర్మితం. కాబట్టి తన బరువు కన్నా చాలా రెట్లు అధికంగా ఉన్న బరువును కూడా కొంత దూరం పైకి ఎత్తి పట్టుకోగలదు. తాను ఎత్తే బరువుకు నేలకు మధ్య ఉన్న దూరం కూడా తక్కువే ఉండడం వల్ల తనకు అవసరమయ్యే శక్తి కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే పైకెత్తబడిన వస్తువు స్థితి శక్తి (potential energy) mgh ని కలిగివుంటుందని, దాన్ని ఎమ్‌జీహెచ్‌గా కొలుస్తారని తరగతుల్లో చదివే ఉంటారు. ఇక్కడ mg అంటే బరువు, h అంటే ఎత్తు అని అర్థం. కానీ మనిషి ద్విపాది (bipod). రెండు కాళ్ల మీదే భారమంతా పడుతుంది. కాబట్టి శరీర పరిమాణంతో పోల్చితే నాలుగు కాళ్లున్న చీమ రెండు కాళ్లున్న మనిషికన్నా ఎక్కువ బరువు ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. అయితే చీమ తన బరువు కన్నా అయిదారు రెట్ల బరువును మాత్రమే ఎత్తగలదు కానీ 50 రెట్లు అధిక బరువును ఎత్తగలదనడంలో నిజం లేదు.

ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి

నీరు అత్యల్పంగా దొరికే ఇసుక నేలలతో కూడిన ఎడారుల్లో జీవనం కష్టమని అనిపించినా, ఆ పరిసరాలకు అనుగుణంగా బతికే మొక్కలు, జీవులు ఉంటాయి. ఎడారుల్లో ఎక్కువగా నత్తలుంటాయి. వీటితో పాటు బల్లులు, పాములు, ఎలుకలు, తొండలు, గుడ్లగూబలు, కీటకాలు ఉంటాయి. ఇలాంటి ఎడారి జీవుల్లో చెమట, మూత్రం ఎక్కువగావెలువడని శరీర నిర్మాణం వల్ల వాటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కలైన ముళ్లపొదలు, కాక్టస్‌లాంటి మొక్కలకు ఆకులు తక్కువగా ఉండడం వల్ల వాటిలోని నీరు త్వరగా ఆవిరి కాదు. అరుదుగా వర్షాలు పడినా ఇవి ఆ నీటిని కాండాల్లో నిల్వ చేసుకోగలుగుతాయి. ఇక ఎడారి ఓడగా పేరొందిన ఒంటె అక్కడి ముళ్లపొదల్ని మేయగలదు. దీని మూపురంలో కొవ్వు పదార్థం పేరుకుని ఉండి శక్తినిస్తూ ఉంటుంది. ఒంటె ఒకేసారి 25 గ్యాలన్ల వరకూ నీరు తాగి దాన్ని శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎడారి జీవుల్లో ఎక్కువ బొరియల్లో జీవించేవి కావడం వల్ల అత్యధికమైన వేడి వాటిని బాధించదు

డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి

డాల్ఫిన్లు నిద్రపోయేప్పుడు వృత్తాకార మార్గంలో ఈదుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే అవి నిద్రపోయేప్పుడు వాటి మెదడులోని సగ భాగం మాత్రమే నిద్రావస్థను పొందుతుంది. అందువల్ల గుంపు నుంచి తప్పిపోకుండా ఉండడానికి అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్లు మేల్కొని ఉన్నప్పుడు ఈల లాంటి శబ్దం చేయడం ద్వారా ఒకదాని ఉనికిని మరొకటి సులువుగా తెలుసుకోగలుగుతాయి. కానీ నిద్రపోయేప్పుడు అలాంటి శబ్దాలు చేస్తే శత్రుజీవులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అవి గుంపుగా ఈదుతుండడంతో శత్రుజీవులు దగ్గరకు రావు.

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది

ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.

విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి

విద్యుత్ప్రసారం అంటే శాస్త్రీయంగా విద్యుదావేశం ఒక చోట నుంచి మరో చోటుకి స్థానభ్రంశం (displacement) చెందడమే. అంటే విధిగా ఎలక్ట్రాన్ల ప్రసారమే కానక్కర్లేదు. అయితే విద్యుత్‌ను ప్రసారం చేసే సాధనాల్లో దాదాపు 80శాతం ఎలక్ట్రాన్ల ప్రవాహమే.సాధారణంగా లోహాలు (metals), మిశ్రమలోహాలు (alloys), గ్రాఫైటు, బొగ్గు వంటి ఘనపదార్థాల్లోను, పాదరసం, బ్రోమీను వంటి ద్రవపదార్థాల్లోను విద్యుత్‌ ఎలక్ట్రాన్ల గమనం ద్వారానే సంభవిస్తుంది. రబ్బరు, కాగితం, ప్లాస్టిక్కు వంటి విద్యుత్‌ నిరోధక పదార్థాల్లో జరిగే కొద్దిపాటి విద్యుత్‌ ప్రసారం కూడా ఎలక్ట్రాన్ల మందకొడి ప్రవాహమే. అయితే ట్యూబ్‌లైట్లు, ద్రావణాలు, వాయువులు, నీరు వంటి సాధనాల్లో విద్యుత్‌ ప్రసారం ఎలక్ట్రాన్ల ప్రవాహంతో పాటు విద్యుదావేశిత కణాల (ions) ద్వారా కూడా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ప్రవహించడం ద్వారా విద్యుత్‌ ప్రసారం జరిగే పదార్థాలను ఎలక్ట్రానిక్‌ కండక్టర్లు అంటారు. ఇలాంటి పదార్థాల్లో సులభంగా అటూ, ఇటూ పరమాణువుల, అణువుల మధ్య కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటినే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. ఇలాంటివన్నీ కలగలిసి ఓ సందోహంలాగా అన్ని పరమాణువుల్ని కలుపుకుని దుప్పటిలాగా పైపైన ఉంటాయి. ఎటువైపున ఏమాత్రం ధనావేశిత ధ్రువం (ఆనోడ్‌) ఉన్నా అటువైపు చలిస్తాయి. అదే పదార్థానికి మరో వైపు రుణధ్రువం (కేథోడ్‌) కూడా ఉంటుంది. ఆనోడ్‌ ద్వారా పదార్థం నుంచి జారుకునే ఎలక్ట్రాన్లను కేథోడ్‌ నింపుకుంటుంది. ఇంటిపైన ఉండే వాటర్‌ ట్యాంకులో నీరు వేలన్సీ ఎలక్ట్రాన్ల దండు అనుకుంటే, కుళాయి ద్వారా బయటపడేవి ఆనోడు వైపు వెళ్తున్నట్లు, పంపు ద్వారా ట్యాంకును చేరేవి కేథోడ్‌ ద్వారా వచ్చేవని ఊహించుకోండి.

చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి

చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.

మంట ఎలా మండుతుంది

మంట లేక అగ్నిజ్వాల అంటే పదార్థాల కలయిక వల్ల జరిగే రసాయనిక, భౌతిక మార్పులు. ఈ ప్రక్రియలో పదార్థాలు ఉష్ణ, కాంతి శక్తులతోపాటు పొగ, బూడిదలు కూడా విడుదలవుతాయి. విద్యుత్‌ తీగలపై ఉండే ప్లాస్టిక్‌ తొడుగులో ఉత్పన్నమయ్యే మంటలోనైనా, నూనె లాంటి పదార్థాల్లో ఏర్పడే మంటలోనైనా, మామూలుగా ఇంట్లోని పొయ్యిలో కట్టెలు, బొగ్గులతో ఏర్పడే మంటలోనయినా వాటికి కావలసిన ముఖ్యమైన అంశాలు మండే స్వభావం గల పదార్థం, ఆక్సిజన్‌, ఉష్ణాన్ని ఉత్పన్నం చేసే మీట. వీటిలో ఏ అంశం లేక పోయినా మంట ఏర్పడదు. ఈ సూత్రం పైనే మంటలు మండకుండా ఆర్పుతారు. మంటలార్పాలంటే వాటికి అందే ఆక్సిజన్‌ను తీసివేయాలి. మండే స్వభావం గల పదార్థాన్ని తొలగించాలి.

మండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకు కొయ్య, ప్లాస్టిక్‌(ఘన), నూనె(ద్రవ), హైడ్రొజన్లు(వాయు), ఉష్ణోగ్రతల విలువలు అత్యధికంగా ఉంటే, ఇనుములాంటి లోహాలు కూడా మండుతాయి. మంటకు కావలసిన ఆక్సిజన్‌ వాతావరణంలోని గాలి అందిస్తుంది. మంటను రాజేయడానికి కావలసిన శక్తి పదార్థాల మధ్య ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యే నిప్పు కణాల నుంచి, మెరుపుల నుంచి అందించవచ్చు.

పసుపును పసుపుకొమ్ముల నుంచి చేస్తారు కదా, మరి కుంకుమను ఎలా చేస్తారు

కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ (Kumkum) హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.
ఆ కుంకుమ తయారి గురించి .
కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .

ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .
ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .
పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

మూలము : భవాని మల్లాది-తెలుగింటి ఆడపడుచు.

పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా?

ఆకుల పచ్చదనానికి, పువ్వుల్లో పచ్చదనానికి, మాగని అరటి, మామిడి, జామ, నిమ్మ వంటి పళ్ళతోళ్ల (peels) లో ఉండే పచ్చదానికి ప్రధాన వర్ణద్రవ్యం (pigment) క్లోరోఫిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవజాతి అంతా క్లోరోఫిల్‌కు ఎంతో ఋణపడి ఉంది. దాని ద్వారానే సౌరశక్తి, కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా జీవులన్నింటికీ అవసరమైన ఆహారంగా తయారవుతోంది. ముఖ్యముగా క్లొరోఫిల్ లో నాలుగు / ఐదు రకాలు ఉన్నాయి . కొద్దిగా రంగులో తేడా ఉన్నా దానిలో ఉన్న ముఖ్యమైన పిగ్మెంట్ .. క్లొరోఫిల్ జాబితాలోకే వస్తుంది .

అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది

ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ (Lie Detector)ను రూపొందించారు.?
ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు (pneumograph tube) అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.
శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు.

టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి

సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు అంటారు. తుపాకీతో పేల్చినా ప్రమాదం ఉండని విధంగా వాటిని ఎలా తయారు చేస్తారు

తుపాకీ పేల్చినప్పుడు దూసుకు వచ్చే బుల్లెట్‌ విపరీతమైన వేగంతో ప్రయాణించి లక్ష్యాన్ని తాకుతుంది. ఆ వేగం వల్ల ఏర్పడే శక్తివిధ్వంసాన్ని సృష్టిస్తుంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్టు ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల దాన్ని తాకే తుపాకీగుండు యొక్క శక్తి ఒకే చోట కేంద్రీకృతమవకుండా నలుదిక్కులకు చెదిరిపోతుంది. అంతేకాకుండా ఆ జాకెట్‌కు తగలగానే తుపాకి గుండు ఆకారం కూడా మారిపోవడంతో ఒకవేళ ఆ తూటా ఆ కోటును దాటి దాన్ని ధరించిన వారికి తగిలినా లోతైన గాయం ఏర్పడదు.
బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ను దృఢమైన స్టీలు పలకలతో తయారు చేస్తారు. కొన్ని మందు గుండు సామాగ్రులు(Ammunition) స్టీలు గుండా కూడా చొచ్చుకొని పోయేలా ఉండడంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకట్లను కూడా మరింత దృధమైన పదార్థాలతో రూపొందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పింగాణీ, టిటానియం లాంటి తెలిక పదార్థాలతో చేసే సన్నటి పొరలు ఒకదానిపై ఒకటి ఉండేలా వీటిని చేస్తున్నారు. ఇవి స్టీలు జాకెట్ల కన్నా ఎంతో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా తేలికగా కూడా ఉంటున్నాయి. ఈ పదార్థాలతో పాటు కెవ్‌లార్‌(Kevlar) అనే పదార్థం నుంచి తీసిన దృఢమైన పోగులతో వలలాగా అల్లుకుని ఉండేలా ఈ జాకెట్లను చేస్తారు. దీన్ని తాకే తుపాకీగుండు ఈ వలలో చిక్కుకొని తన శక్తిని, ఆకారాన్ని కోల్పోంతుంది. అందువల్ల దీన్ని ధరించిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగదు.

మొక్కల నుంచి మందులను ఎలా తయారు చేస్తారు

మందుల తయారీలో మొక్కలు ప్రాచీన కాలం నుంచీ ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానంలో జన్యుశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత మందుల తయారీలో మొక్కల ఉపయోగం మరీ ఎక్కువైంది. మొక్కల్లో ప్రత్యేకమైన జన్యువులను ప్రవేశ పెట్టడం ద్వారా టీకాలు, రోగనిరోధక యాంటీ బాడీస్‌, హార్మ్లోన్లు, ప్రోటీన్లను తయారు చేస్తున్నారు. వీటిని జంతువుల కణాల నుంచి కాకుండా మొక్కల ద్వారా ఉత్పన్నం చేయడం సులువే కాకుండా, చవక కూడా. జీన్‌గన్‌ అనే యంత్రం ద్వారా కావలసిన జన్యువులను మొక్కల కణాలలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రాచుర్యంలో ఉంది. మరో పద్ధతి ద్వారా సూక్ష్మక్రిములను ఉపయోగించి రకరకాల జన్యువులను మొక్కల్లోకి ప్రవేశపెడతారు. మానవ శరీరానికి ఉపయోగపడే హార్లోన్లను ఉత్పత్తి చేసే ఫార్మాస్యూటికల్‌ పొగాకును తొలిసారిగా 1986లో తయారు చేశారు. ప్రస్తుతం వివిధ జన్యువుల ద్వారా పరివర్తన చెంది, మందుల తయారీలో ఉపయోగపడే 80 జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి.

పాలు ఎలా పెరుగు అవుతుంది

ఇది ఒక రకమైన సూక్ష్మజీవులు చర్య . పాలలోని కెసిన్‌(Casin) అనే ప్రోటీన్‌ తో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే బ్యాక్టీరియా జరిపే చర్య . ఈ బ్యాక్టీరియా ఉప్తత్తిచేసే ఆమ్లము - లాక్టిక్ ఆమలము లోని హైడ్రోజన్‌ అయాన్లు జరిపే చర్య తో పాలు అలా బిగుసుకొని పెరుగు అవుతాయి. ఇలా పెరుగు అవ్వాలంటే పాలను కొద్దిగా వేడి చేయాలి . మరీ వేడి పాలలో తోడు వేస్తే బ్యాక్టీరియాలు చనిపోతాయి.

ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది, దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమైనా ఉన్నాయా

వాతావరణంలో మిగిలిన కాలాల కన్నా వర్షాకాలంలో నీటి ఆవిరి పెద్ద పెద్ద బిందువుల రూపంలో ఉంటుంది. సూర్యుని నుంచి వెలువడే ధవళకాంతి ఆ నీటి బిందువుల గుండా వెళ్లేప్పుడు గాలిని, నీటిపొరను వేరుచేసే అంతరోపరితలం(interface) వద్ద వక్రీభవనం (refraction)చెందుతుంది. ఇలా వక్రీభవనం చెందే కోణాలు వివిధ తరంగదైర్ఘ్యాల (wavelengths)కు వేర్వేరుగా ఉండడం వల్ల ధవళకాంతిలోని వివిధ కాంతి తరంగాలు ఏడు రంగులుగా విడిపోతాయి. ఇలా విసిన కర్రలాగా విస్తరించుకున్న సప్తవర్ణాలు, ఆ బిందువు అవతలివైపున ఉండే అంతరోపరితలం వద్ద అంతర్గత సంపూర్ణ పరావర్తనం (Total Internal Reflection) చెంది మన కంటిని చేరుతాయి. కాబట్టి ఇంద్రధనుస్సు మన కంటిలోనే ఏర్పడుతుంది కానీ, ఆకాశంలో కాదు. అందుకే హరివిల్లనేది మిధ్యాబింబం(virtual image). దాని వల్ల లాభనష్టాల సమస్య లేదు. కాబట్టి ప్రకృతి కల్పించే ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా చూడ్డమే.

పట్టు పురుగు నుండి దారం ఎలా వస్తుంది

పట్టు దారం తో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది.
పట్టు పురుగు గుడ్డు చీల్చుకుని బయటికి వస్తుంది. ఇది తన చుట్టూ గూడు అల్లడం మొదలుపెడుతుంది.ఇది ఎంత చిక్కగా గూడు అల్లితే అంత మంచి దారం తయారు అవుతుంది. గూడు పూర్తి కాకుండానే చాలా పురుగులు చచ్చిపోతాయి. ఈ గూళ్ళు కూడా అంత మంచివి కాకపోవచ్చు. ఇరవై కిలోల గూళ్ళ నుండి ఒక కిలో దారం మాత్రం వస్తుంది. పట్టులో చాలా రకాలు వున్నాయి.

* మల్బరీ పట్టు
* టస్సర్
* ఈరి
* మూగా

మూగా అనే పట్టుదారం మనదేశంలోనే దొరుకుతుంది.'ఈరి'అనే పట్టుదారం తయారుచేయడంలో మన దేశం ముందు వుంది. టస్సర్ పట్టుదారం తయారీలో మనది 2వ స్ధానం. మల్బరీ తయారీలో 5స్ధానం.
కొత్త రకం పట్టు పురుగులు:
విదేశీ పట్టు పురుగులను మన వాటితో కలిపారు. సంకర జాతి పట్టు పురుగులు పుట్టాయి. నాణ్యత బాగా పెరిగింది. విదేశీ పట్టు పురుగుల్ని యిక్కడే పెంచుతున్నారు. దీని వల్ల నాణ్యత పెరిగింది. పట్టు తయారీ 15 వేల టన్నులు పెరిగింది. పట్టు పురుగుల్ని చక్కగా పెంచడం ఒక పద్ధతి.పట్టు పురుగులు మల్బరీ చెట్ల ఆకులు తింటాయి. వీటికి మంచి ఆహారాన్ని అందించాలి. అప్పుడే చిక్కని గూడు కడుతుంది. అందువల్ల మల్బరీ తోటలను బాగా ఎక్కువ సంఖ్యలో పుట్టించాలి. మల్బరీ ఆకులు ఏపుగా ఆరోగ్యంగా వుండాలి. ఈ ఆకులను కత్తిరించి వీటికి ఆహారంగా వేస్తారు. ఇలాంటి ఆకులు తిని పట్టు పురుగులు బాగా పెరుగుతాయి. మంచి గూళ్ళు కడతాయి.

ప్రశ్న: కొన్ని పదార్థాలకు వాసన ఎలా అబ్బుతుంది?
జవాబు: పదార్థాలు వివిధ భౌతిక, రసాయనిక స్థితుల్లో ఉంటాయి. ఘన, ద్రవ, వాయు స్థితులతో పాటు, రసాయనికంగా రకరకాల అణునిర్మాణాలతో ఉంటాయి. వాసన వచ్చే పదార్థాలకు ఆవిరయ్యే లక్షణం ఉంటుంది. అవి ఘన రూపంలో ఉన్నా, ద్రవ రూపంలో ఉన్నా ఎంతోకొంత మేరకు సాధారణ ఉష్ణోగ్రతల వద్దే ఆవిరవుతూ ఉంటాయి. ఆ ఆవిరిలో వాటి అణువులు ఉంటాయి. ఇవి మన నాసికా రంధ్రాలను చేరినప్పుడు మన ముక్కులోపలి తడిపొరల మీద ఉన్న ఘ్రాణ నాడులు ప్రేరేపితమవుతాయి. అందుకనే వీటిని రసాయనిక గ్రాహకాలు అని కూడా అంటారు. ఇలా వివిధ పదార్థాల ఆవిరులలో వేర్వేరు అణువులు ఉండడం వల్ల ముక్కులోని నాడుల మీద వీటి ప్రభావం వాటి విలక్షణతతో ఉంటుంది. వీటి వల్ల ప్రేరేపితమయ్యే నాడులు ఆయా విశిష్ట సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి. వాటిని బట్టి మనం వేర్వేరు వాసనలను గుర్తించగలుగుతాం.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

సూర్యుడు ప్రకాశవంతంగా ఎలా మెరుస్తున్నాడు? అందులో హైడ్రోజన్‌ నిల్వలు ఉన్నాయంటారు. అవెక్కడివి

విశ్వంలోని రోదసి (space) అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించి ఉంటాయి. వీటిని 'నెబ్యులా' లంటారు. ఈ మేఘాల్లో 99 శాతం హైడ్రోజన్‌, కొద్దిపాటి ఇతర వాయువులు, సూక్ష్మహిమకణాలు, కాస్మిక్‌ ధూళి ఉంటాయి. వీటి ఉష్ణోగ్రత మైనస్‌ 263 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉంటుంది. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుంచించుకుపోతుంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రత అత్యధికంగా పెరుగుతుంది. ఈ చర్య కొనసాగడం వల్ల ఈ మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పది మిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. ఆ స్థితిలోనే హైడ్రోజన్‌ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల ఉత్పన్నమైన అత్యధిక శక్తి కాంతి రూపంలో ఉంటుంది. అదే నక్షత్రం. విశ్వంలోని కోట్లాది నక్షత్రాలలో తక్కువ కాంతి గల చిన్న నక్షత్రమే సూర్యుడు. అయితే అన్ని నక్షత్రాల కన్నా భూమికి దగ్గరగా ఉండడం వల్ల సూర్యుడు పెద్దగా, ప్రకాశవంతంగా కనబడతాడు.
ఇక సూర్యకాంతి విషయానికి వస్తే, సూర్యుని అంతర్భాగం 1,50,00,000 డిగ్రీల సెల్సియస్‌. అత్యధికమైన ఈ ఉష్ణోగ్రత వల్ల అక్కడి హైడ్రోజన్‌ వాయువు కేంద్రక సంలీనం (nuclear fusion) అనే చర్య వల్ల హీలియంగా మారుతుంది. కొంత హైడ్రోజన్‌, పూర్తిగా శక్తి (energy)గా రూపాంతరం చెందుతుంది. అలా ప్రతి సెకనుకూ 40 కోట్ల టన్నుల హైడ్రోజన్‌ శక్తిగా రూపాంతరం చెంది, నెమ్మదిగా సూర్యుని ఉపరితలం చేరుతుంది. ఆ విధంగా మండుతున్న వాయువు, శక్తి మూలంగా వెలువడిన ప్రకాశవంతమైన కాంతి రోదసిలో కోట్లాది కిలోమీటర్ల దూరం విస్తరిస్తుంది. ఇక ఉపరితలంలో ఉన్న ఎక్కువ సాంద్రత గల హైడ్రోజన్‌ మళ్లీ సూర్యుని అంతర్భాగంలోకి వెళుతుంది. దాంతో ఈ ప్రక్రియంతా నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

ఈ మధ్య కొన్ని టార్చిలైట్లు చీకట్లో మెరుస్తున్నట్టు మనకి కనిపిస్తాయి. ఈ కాంతి ఎక్కడిది

ఉన్నట్టుండి కరెంటు పోతే ఆ చీకట్లో టార్చిలైటు ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా ఈమధ్య వాటిని ఓ ప్రత్యేకమైన పదార్థంతో తయారు చేస్తున్నారు. ఇవి చీకట్లో మంద్రస్థాయిలో వెలుగులీనుతూ కనిపిస్తాయి. కాంతికీ, పదార్థాలకూ మధ్య చాలా విధాలైన భౌతిక, రసాయనిక సంబంధాలున్నాయి. వాటిలో ఒకటి ఫాస్ఫారిసెన్స్‌(Phosphorescence) అనే ధర్మం. ఈ ధర్మాన్ని ప్రదర్శించే పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు జింకు సల్ఫైడు, స్ట్రాన్షియం అల్యూమినేట్‌ మొదలైన ఇలాంటి పదార్థాల అణువులు కాంతి సమక్షంలో ఉత్తేజం (exitation) పొందుతాయి. ఇవి ఈ ఉత్తేజ స్థాయిలోనే చాలా సేపు ఉంటూ మెల్లమెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటాయి. అకస్మాత్తుగా కాంతి పడడం ఆగిపోయినప్పుడు కూడా ఇవి ఇలాంటి స్థితిలోనే ఉండడం వల్ల వాటి నుంచి ప్రత్యేకమైన కాంతి వెలుగులీనుతూ కనిపిస్తుంది. దీన్నే ఫాస్ఫారిసెన్స్‌(Phosphorescence) అంటారు. టార్చిలైట్లతో పాటు గదుల సీలింగ్‌కు అతికించే నక్షత్రాలు, గ్రహాల లాంటి చిన్న చిన్న పరికరాలను కూడా ఇలాంటి పదార్థాలతోనే చేస్తారు. గదిని చీకటి చేసినప్పుడు ఇవి వెలుగు చిమ్ముతూ ఆకట్టుకోవడాన్ని గమనించే ఉంటారు. అయితే కాసేపటిలోనే వాటి కాంతి ఆగిపోతుంది.

సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు నిర్జీవ పదార్థాలు కదా? వాటిలోకి మామూలు వైరస్‌ ఎలా ప్రవేశిస్తుంది

కంప్యూటర్‌ వైరస్‌ అంటే జీవుల్లో రోగాలు కలిగించే వైరస్‌ కాదు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు ఒక విధమైన యాంత్రిక సంకేతాలతో (machine language) నిర్దేశితమయ్యే విద్యుత్‌ ప్రేరణల ద్వారా పని చేస్తాయి. దీన్నే ప్రోగామ్‌ అంటారు. కంప్యూటర్‌ పరిభాషలో పట్టుకోడానికి, చూడడానికి వీలయ్యే భాగాలను హార్డ్‌వేర్‌ అంటారని, అలా వీలుకాని ప్రోగాములను సాఫ్ట్‌వేర్‌ అంటారని తెలిసే ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ అనే ఈ ప్రోగామే సెల్‌ఫోన్లకు, కంప్యూటర్లకు జీవం లాంటిది. కొంతమంది జులాయిలు ఇంటర్నెట్‌ ద్వారా మోసపూరిత ప్రవృత్తితో అవాంఛనీయమైన సాఫ్ట్‌వేర్‌లను సృష్టిస్తారు. ఇవి ఒక పరికరంలోంచి మరో పరికరంలోకి వ్యాప్తి చెందుతూ విస్తరిస్తాయి. ఇది చేరిన పరికరాలు ఆశించిన విధంగా కాకుండా అసంబద్ధంగా, అనర్థంగా పని చేస్తాయి. రోగాలను వ్యాప్తి చేసే వైరస్‌లు ఎలాగైతే ఒకరి నుంచి మరొకరికి సోకుతాయో అలాగే ఈ కంప్యూటర్‌ వైరస్‌లు కూడా వ్యాపిస్తాయి కాబట్టి ఆ పేరుతో వ్యవహరిస్తారు.

కంప్యూటర్లలోకి వైరస్‌ ఎలా వస్తుంది?మొదట అసలు వైరస్‌ ఎలా పుట్టింది

మన శరీరంలోకి, బాక్టీరియాల కణాల్లోకి వెళ్లే వైరస్‌ వేరు, కంప్యూటర్‌ వైరస్‌ వేరు. మామూలుగా జలుబు, ఎయిడ్స్‌, హెపటైటిస్‌, మశూచి వంటి జబ్బుల్ని కలిగించే వైరస్‌లకు భౌతిక రూపం ఉంటుంది. వాటిని మనం సూక్ష్మదర్శినుల్లో చూడవచ్చు. కానీ కంప్యూటర్‌ వైరస్‌లకు భౌతిక అస్తిత్వం లేదు. అవి కేవలం చిన్న చిన్న కంప్యూటర్‌ ప్రోగ్రాములు. మనకు ఉపయోగపడే కంప్యూటర్‌ ప్రోగ్రాముల్లో దూరి తమను తాము పునరుత్పత్తి చేసుకునేలా లాజిక్‌ ఉండే తేలికపాటి కంప్యూటర్‌ ప్రోగ్రాములే వైరస్‌లు. మరి వీటికి వైరస్‌ అని పేరు ఎందుకు పెట్టారు? మనకు సంబంధించిన మన స్వంత జీవకణాల్లోకి జబ్బును కలిగించే వైరస్‌ దూరి తన లాంటి వైరస్‌లనే పదే పదే తయారు చేసేలా మన స్వంత జీవ కణాన్ని నియంత్రించేదే సాధారణ వైరస్‌. ఆ క్రమంలో మనం వ్యాధి గ్రస్తులు కావడం, మంచాన పడి పని చేయలేకపోతాం కదా! అలాగే మనకు కావాల్సిన కంప్యూటర్‌ ప్రోగ్రాముల్లోకి వివిధ పద్ధతులు (ఇంటర్నెట్‌ ద్వారా, ఫ్లాపీలు, ఫ్లాష్‌డ్రైవ్‌లు ఒక కంప్యూటర్‌ నుంచి తీసి మరో కంప్యూటర్‌కు కలిపి వాడటం) ద్వారా సంక్రమిస్తాయి. అసలు ప్రోగ్రాము పని తీరును అడ్డుకుంటాయి. కాబట్టి వీటిని వైరస్‌ అన్నారు. ఇంటర్నెట్‌, ఇ-మెయిల్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక కంప్యూటర్‌ నుంచి మరో కంప్యూటర్‌కు మొబైల్‌ ఫోన్లకు వైరస్‌లు విస్తరిస్తున్నాయి. 1970లో ఈ కంప్యూటర్‌ వైరస్‌లు తయారయ్యాయి. అప్పట్నించి ఇప్పటి వరకు కంప్యూటర్‌ వైరస్‌ల దాడి అధికమవుతోంది. సుమారు లక్షకోట్ల రూపాయల మేర ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కంప్యూటర్‌ వైరస్‌ల వల్ల నష్టం కలుగుతోంది. వ్యాపార లాభాలకు, రహస్యాల్ని తెలుసుకునేందుకు, పోకిరీగాళ్లు, స్వార్థ పరులు కంప్యూటర్‌ వైరస్‌లను రూపొందిస్తారు. రకరకాల ఆకర్షణ పూరితమైన ప్రకటనల ద్వారా మన కంప్యూటర్లలో ప్రవేశపెడతారు. సమర్థవంతమైన యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ వాడటం ద్వారా వైరస్‌లను నియంత్రించగలం.

వేడి నీటి బుగ్గలు ఉంటాయని తెలుసు. మరి చల్లని నీటి బుగ్గలు కూడా ఉంటాయా? అసలివి ఎలా ఏర్పడతాయి

భూమి లోతుల నుంచి భూ ఉపరితలానికి 'ఫౌంటెన్‌'లాగా వెదజల్లే చల్లని నీటి బుగ్గలు ఉంటాయి కానీ, వాటిని వేడి నీటి బుగ్గలతో పోల్చడానికి వీలు లేదు. భూమి లోపలి పొరల నుంచి వేడి నీరు హఠాత్తుగా భూమి ఉపరితలంపైకి చిమ్ముకురావడానికి కారణం ఆ నీరు అధిక ఒత్తిడికి గురి కావడమే. అయితే చల్లని నీరు పైకి చిమ్మడానికి కారణం ఒక విధమైన రసాయనిక చర్య. భూమి లోపల ఏర్పడే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇలా జరుగుతుంది. భూగర్భంలో ఉండే గుహలలో కార్బన్‌ డయాక్సైడు విడుదలై అక్కడి నీటిలో కరిగిపోతే, వాయువుతో కూడిన కార్బానిక్‌ ద్రవం ఉత్పన్నమవుతుంది. ఈ ద్రవం భూ ఉపరితలానికి తన్నుకు వస్తుంది. చల్లని నీటి బుగ్గలు చూడడానికి వేడి నీటి బుగ్గలలాగానే ఉన్నా, కార్బన్‌డయాక్సైడు కరిగి ఉండడంతో నురగతో, తెల్లగా ఉంటుంది.

ఇన్‌స్టెంట్‌ కాఫీని ఎలా తయారు చేస్తారు

మనం ఒక కప్పు ఇన్‌స్టెంట్‌ కాఫీని తయారు చేస్తున్నామంటే ఆ కాఫీని రెండవ సారి మరిగిస్తున్నామన్నమాటే. ఎందుకంటే కాఫీ తయారీతోనే ఈ పొడి ఉత్పాదన మొదలవుతుంది. ముందుగా కాఫీ గింజలను వేయించి, పొడి చేసి, ఆ పొడిని నీటిలో కలిపి అధిక ఉష్ణోగ్రత వద్ద సలసలా మరగబెడతారు. ఈ ప్రక్రియలో నీరు చాలా వరకూ ఆవిరైపోయిన తర్వాత గింజల భాగాలను తొలగించగా మిగిలిన చిక్కని ద్రవాన్ని ఒక సన్నని నాజిల్‌ ద్వారా స్ప్రే రూపంలో వేడిగా, పొడిగా ఉండే గాలి ప్రవహిస్తున్న ఒక డ్రయింగ్‌ టవర్‌ లోకి పంపిస్తారు. ఇందులో కాఫీలో ఉన్న తేమంతా ఆవిరైపోయి పొడిగా ఉండే ఇన్‌స్టెంట్‌ కాఫీ పౌడర్‌ మిగులుతుంది. మార్కెట్లో దొరికే ఈ పొడిని వేడి పాలలో కానీ, నీటిలో కానీ కలిపితే తక్షణ కాఫీ సిద్ధం.

ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం

ఏ పండుకైనా గింజకానీ, విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను 'క్లోనింగ్‌' అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.
ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే 'సీడ్‌లెస్‌' (గింజలు లేని) పండ్లన్నమాట.
నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడుతాయి. కానీ క్లోనింగ్‌ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజలలాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.

రిఫ్రిజిరేటర్‌లో డీప్‌ఫ్రీజర్‌ అర అడుగున, చుట్టుపక్కల మంచు పేరుకుపోతుంది కదా? అక్కడ గడ్డకట్టే నీరు ఎక్కడిది

మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌లాంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందని చదువుకుని ఉంటారు. మనం తలుపులు తీసినప్పుడల్లా గాలి లోపలికి చొరబడి డీప్‌ఫ్రీజర్‌కి తగులుతూ ఉంటుంది. ఆ గాలిలోని నీటి ఆవిరి అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతకి గురై క్రమేణా మంచు పొరల్లాగా మారుతుంటుంది. ఫ్రిజ్‌ లోపల చల్లని పరిస్థితుల్లో పీడనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే తలుపులు తీసినప్పుడల్లా బయటి గాలి వేగంగా లోపలికి చొరబడుతుంది.

నాణేలు సరైనవో, నకిలీవో ఎలా తెలుస్తుంది

నాణేలు సరైనవో, నకిలీవో తెలుసుకోడానికి 'కాయిన్‌ టెస్టర్‌' అనే యంత్రాన్ని వాడతారు. ఇందులో ఉండే అయస్కాంత ధ్రువాల మధ్య నుంచి నాణేలు ప్రయాణించే ఏర్పాటు ఉంటుంది. ఆ ధ్రువాల మధ్య ఉండే అయస్కాంత క్షేత్రాన్ని, అయస్కాంత బలరేఖలను నాణేలు ఖండించడం వల్ల వాటిలో ఆవర్తన విద్యుత్‌ ప్రవాహాలు (Eddy currents) ఉత్పన్నమవుతాయి. వీటి కారణంగా నాణేల వేగం మారుతుంది. అలాగే నాణేలు కాంతి శక్తిని ఉద్ఘారించే డయోడ్ల (LED) గుండా కూడా ప్రయాణిస్తాయి. అక్కడ ఉండే కాంతి గ్రాహకాలు (light sensors) ఆ నాణేల వేగం, వ్యాసాలను కొలుస్తాయి. సరైన నాణేల వేగం, వ్యాసాల విలువలు ముందుగానే ఆ యంత్రంలో నిక్షిప్తమై ఉంటాయి. నాణేలు నకిలీవైతే ఏర్పడే సున్నితమైన మార్పులను యంత్రం గుర్తించగలుగుతుంది. నకిలీ నాణేలు అదే యంత్రంలో వేరే అరలోకి చేరే ఏర్పాటు ఉంటుంది.

ఇసుక నుంచి గాజును తయారు చేస్తారని చదివాను. ఎలా చేస్తారు

గాజు తయారీలో క్వార్ట్జ్‌ ఇసుక, సోడా తగుపాళ్లలో ఒక పెద్ద పాత్రలో ఉంచి ఆ మిశ్రమాన్ని యంత్రాల సాయంతో మెత్తని పొడిగా చేస్తారు. ఈ పొడిని ఒక గాజు బట్టీలో నింపి దాదాపు 1400 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 1600 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ ఉష్ణోగ్రత వల్ల రసాయనిక చర్య జరిగి ఆ మిశ్రమం బుడగలతో కూడిన మెత్తని, జిగురులాంటి పదార్థంగా మారుతుంది. అంటుకుపోయే స్వభావం ఉన్న ఈ పదార్థాన్ని సుమారు 1000 డిగ్రీల సెంటిగ్రేడు వరకు చల్లారుస్తారు. ఈ దశలో మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ కలుపుతారు. దీని వల్ల ఆ మిశ్రమంలో ఏమైనా మలినాలు ఉంటే తొలగిపోయి, స్వచ్ఛమైన పారదర్శకత కలిగిన గాజు పదార్థం తయారవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని లోహపు ఆక్సైడులను కలపడం ద్వారా కావలసిన రంగులు వచ్చేలా కూడా చేయవచ్చు. చల్లార్చిన గాజు పదార్థాన్ని అచ్చుల యంత్రాల సాయంతో కావలసిన మందం కలిగిన గాజు పలకలు, దిమ్మలు, కడ్డీల రూపంలోకి మలుస్తారు. ఆ తర్వాత మెరుగు పెట్టడం, చెక్కడం అదనంగా చేస్తారు.

పెద్ద పెద్ద వృక్షాల వయసు ఎలా కనుగొంటారు

పెద్దపెద్ద వృక్షాల కాండాల అడ్డుకోతను పరిశీలించి ఆ వృక్షాల వయసును నిర్ధరిస్తారు. చెట్లు పెరగాలంటే అవి విధిగా నీటిని, లవణాలను భూమినుంచే తీసుకోవాలి. ఇందుకోసం వృక్షం కాండంలో ప్రత్యేకమైన వృక్ష కణజాలం (plant tissue) ఉంది. ఇందులో ప్రధానమైంది జైలం (xylem) కణజాలం. వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారయిన చక్కెరలను ఇతర భాగాలకు సరఫరా చేసే మరో కణజాలం ఉంది. దాని పేరు ఫ్లోయం (floyem) . ఈ జైౖలం, ఫ్లోయం కణజాలాలు చెట్టు బెరడు (bark) కిందనే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రత్యేక రుతువులో బాగా వర్షాలు పడ్డం వల్ల లవణాల్ని, నీటిని బాగా సరఫరా చేసేందుకు తయారైన ఆహారాన్ని రవాణా చేసేందుకు జైలం, ఫ్లోయంలు బాగా వదులుగా, పెద్దగా ఉండే కణాల సముదాయంగా ఉంటాయి. దీన్నే కేంద్రీయ పొర అంటారు. కానీ వర్షాలు ఆగిపోతే అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల అవి గట్టిపడతాయి. ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ కొత్త కేంద్రీయం పాత గట్టిపడ్డ పొరమీద ఏర్పడతాయి. అంటే ప్రతీ సంవత్సరం ఓ కొత్త వలయంలా కణజాలం వృద్ధి చెందుతుంది. ఇలా వలయాకారంలో ఏర్పడ్డ పాత, కొత్త రింగుల స్వరూపంలో తేడా ఉండడం వల్ల మనం సులభంగా వాటిని గుర్తించగలం. ఇలాంటి వలయాలను వార్షిక వలయాలు లేదా వృద్ధి వలయాలు అంటారు. వృక్షం కాండంలో ఉన్న వార్షిక వలయాల సంఖ్యే దాని వయసు. పడిపోయిన చెట్ల వయస్సును కార్బన్‌ డేటింగ్‌ అనే కేంద్రక భౌతిక సాంకేతిక పద్ధతి (nuclear physical radio method) ద్వారా కనుగొంటారు.

పాల స్వచ్ఛతను ఎలా కొలుస్తారు

పాల స్వచ్ఛతను కొలిచే సాధనాన్ని లాక్టో మీటర్‌ అంటారు. ఇది సిలిండర్‌ ఆకారంలో ఉంటుంది. ఒక అంచును బల్బులా ఉండే కొద్దిగా సన్నపాటి ట్యూబ్‌తో ఊదుతారు. ఈ ట్యూబ్‌ రెండో వైపు మూసి ఉంటుంది. దాని పైన ఎం, డబ్ల్యు అనే అక్షరాలు వాటి మధ్య 1, 2, 3, 4 అంకెలు ఉంటాయి. ఈ ట్యూబ్‌ను పాలు ఉన్న సీసాలో ముంచుతారు. దీని పాయింటర్‌ పైకి తేలితే స్వచ్ఛమైన పాలుగా గుర్తిస్తారు.స్వచ్ఛమైన పాలు బరువుగా ఉంటాయి. తర్వాత దీన్ని నీటిలో ముంచుతారు. అపుడు నీటిలో సమాంతరంగా ఉండకుండా డబ్ల్యూ వైపు మొగ్గితే పాలలో నీరు ఉన్నట్టు స్పష్టమవుతుంది. పాలలో పాలు, నీటిశాతం వివరంగా తెలుసుకోవడానికి ట్యూబ్‌పై ఉన్న అంకెలను పరిశీలిస్తారు. పాలలో ముంచినపుడు పాలసీసాలో ఈ ట్యూబ్‌ 'ఎం' దాటి మునిగితే .. అంటే 3 అంకె వరకూ మునిగితే పాలల్లో 75శాతం పాలు స్వచ్ఛమైనవిగా గుర్తిస్తారు. అదే 2 లేదా 1కి స్థాయి చేరితే పాలు స్వచ్ఛమైనవి కాదని నీరు కలిసినట్టుగా గుర్తిస్తారు. లాక్టో మీటర్‌ ను తరచూ ఉపయోగిస్తూ వుంటారు గానీ దీన్ని ఆధారంగా చేసుకుని పాల స్వచ్ఛతను నమ్మడం అనేది అంతగా ఉండదు. సాధారణ పాలు కంటే స్కిమ్‌డు  పాలు ఎక్కువ బరువుగా ఉంటాయి. వీటి విషయంలో స్వచ్ఛతను ఈ పరికరం స్పష్టం చేయలేదు.

ముక్కుతో వాసన పసిగాట్టేదేలా

ఏదైనా పదార్ధం వాసన తెలియాలంటే దాని నుంచి వెలువడే కొన్ని అణువులు మన ముక్కును చేరుకోవాలి . బ్రెడ్ ,ఉల్లిపాయలు , ఫేర్ఫ్యుములు ,పౌడర్లు , పండ్లు , పూలు లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే వాటి నుండి అతి తేలికైన అణువులు ఆవిరై .. గాలిలో ప్రయాణించి మన ముక్కును చేరుకుంటాయి. ఉక్కు ముక్క వాసన వేయడు ... కారణం దానినుంచి ఆవిరయ్యే పదార్ధం అంటూ ఏదీ ఉండదు .

ముక్కులో ఉండే నాసికారంద్రాల పైభాగం లో పోస్టల్ స్టాంపు పరిమాణము లో ఉండే మచ్చలాంటి ప్రదేశం లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు (neurons)ఉంటాయి .. వాటిపై 'సీలియా' (celia)అనే వెంట్రుకల లాంటి విక్షేపాలు (projections) వాసనకు సంభందించిన అణువులను బంధించి నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి . మెదడు సాయము తో మనము వాసలను పోల్చుకోగాలుగుటాము .
మానవులు పదివేల రకాల వాసనలను సంబందిత న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు . ఇలా ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ గ్రాహకాలలో కొన్నింటికి ఒక నిర్దిష్టమైన జీన్-కోడ్ (సంకేతం ) ఉంటుంది . ఆ కోడ్ లోపించిన లేక దానికి హాని జరిగినా , ఆ వ్యక్తి ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు . ఒక పండు లేక పుష్పము వాసనను పసిగడుతున్నామంటే వాటి నుంచి బాష్ప రూపములో వెలువడే ఈస్టర్లను వాసన చూస్తున్నామనే చెప్పాలి . ఈ ఈస్టర్లు కార్బన్ సంబందిత (organic) అణువులు . ఈస్టర్లను కుత్రిమము గా తాయారు చేసి ఆయా పూలు , పండ్లు నుంచి వచ్చే వాసనలను అనుభూతిలోకి తేవచ్చును . అలా తయారైనవే మనము వాడే సుగంధ ద్రవ్యాలు , అత్తర్లు .

మన కళ్లు వివిధ వర్ణాలను ఎలా గుర్తించ గలుగుతున్నాయి

మనం ఏదైనా వస్తువును చూస్తున్నామంటే దానర్థం దాని మీద పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది మన కంటిని చేరుతున్నాయనే. మనిషి కన్ను వూదా (Indigo) రంగు నుంచి ఎరుపు రంగు వరకు విస్తరించి ఉండే వర్ణపటాన్ని గుర్తించగలదని తెలిసిందే. తెల్లగా ఉండే సూర్యకాంతిలో ఈ రంగులన్నీ కలిసి ఉంటాయని చదువుకుని ఉంటారు. మన ముందు కనిపించే వివిధ వస్తువులు తమపై పడే కాంతిలో కొంత భాగాన్నే పరావర్తనం చెందించి, మిగతా భాగాన్ని శోషించుకుంటాయి. ఏ వస్తువు ఏ రంగు కాంతిని పరావర్తనం చేస్తే ఆ రంగులోనే ఆ వస్తువున్నట్టు మనం గుర్తిస్తాం. ఇలా పరావర్తనం చెందిన కాంతి మన కంటిలోకి ప్రవేశించి రెటీనాపై పడుతుంది. రెటీనాపై కాంతిని గ్రహించి స్పందించే గ్రాహక కణాలు (receptor cells) ఉంటాయి. ఇవి ప్రసారం చేసే నాడీ సంబంధిత ప్రేరేపణల(impulses) ఆధారంగా మన మెదడు రంగులను గుర్తిస్తుంది.
రెటీనాపై ఉండే కణాలు ప్రధానంగా రెండు రకాలు. వీటిని రాడ్స్‌, కోన్స్‌ అంటారు. కణికల్లాంటి ఆకారంలో ఉండే రాడ్‌ సెల్స్‌ తక్కువ కాంతి, చీకట్లను గుర్తిస్తాయి. ఇవి దాదాపు 125 మిలియన్ల వరకూ ఉంటాయి. శంకువు ఆకారంలో ఉండే కోన్‌ సెల్స్‌ రంగులను గుర్తిస్తాయి. దాదాపు 6 మిలియన్ల వరకూ ఉండే వీటిలో మళ్లీ మూడు రకాలుంటాయి. వీటిలో కొన్ని నీలి కాంతికి, కొన్ని ఆకుపచ్చని కాంతికి, మరికొన్ని ఎరుపు కాంతికి స్పందిస్తాయి. ఈ కణాలు స్పందించే తీరును బట్టే అనేక వర్ణ మిశ్రమాలను కన్ను గుర్తించగలుగుతుంది. ఈ మూడు రకాల కణాలూ ఒకేసారి స్పందించినప్పుడు మెదడు తెలుపు రంగుకి సంబంధించిన సంకేతాన్ని అందుకుంటుంది.

విమానం నడిపే పైలట్‌కు దారి ఎలా తెలుస్తుంది

విమానాన్ని నడిపే పైలట్‌కు ఎదురుగా టీవీలాంటి తెరలు ఉంటాయి. వాటి మీద భూమి అక్షాంశాలు, రేఖాంశాలు(altitudes and longitudes) ఉంటాయి. వీటి ద్వారా భూమి మీద ఉండే ప్రతి ప్రాంతం ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకు మన హైదరాబాద్‌ అక్షాంశం 17.366 డిగ్రీల ఉత్తరం, రేఖాంశం 78.476 డిగ్రీల తూర్పు. ఇలా ప్రతి పట్టణం, నగరం వివరాలు నిర్దేశితమై ఉంటాయి. ఉపగ్రహపు జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం) అనే నియంత్రణ ద్వారా విమానాన్ని పైలట్‌ నడుపుతాడు. ఏవియానిక్స్‌ అనే కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్స్‌ ద్వారా బయల్దేరిన చోటును, గమ్యాన్ని నిర్దేశిస్తే, అక్కడున్న కంప్యూటరే పైలట్లకు సూచనలు ఇస్తుంది. అలాగే విమానాశ్రయాల్లోని నియంత్రణ కేంద్రాల్లో ఉండే సిబ్బంది ఎప్పటికప్పుడు విమానం ప్రయాణాన్ని కంప్యూటర్‌ వ్యవస్థ ద్వారా గమనిస్తూ అవసరమైన సూచనలు అందిస్తుంటారు. మైక్రోవేవ్స్‌ ద్వారా జరిగే ఈ కమ్యూనికేషన్స్‌కు అవరోధం కలగకూడదనే ఉద్దేశంతోనే ప్రయాణికులు సెల్‌ఫోన్లను వాడరాదని చెబుతారు.

తుపాకీ గుండు నుంచి బులెట్‌ప్రూఫ్‌ కార్లు, బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు మనని ఎలా రక్షిస్తాయి

మామూలు కారు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగుల్తాయి. తుపాకీ గుండు వాటి నుంచి దూసుకుపోగలదు కూడా. అయితే బులెట్‌ప్రూఫ్‌ కారు అద్దాల విషయంలో అలా జరగదు. కారణం, ఆ అద్దాలను మామూలు గాజుతో కాకుండా అత్యంత పటిష్ఠమైన సిలికాన్‌ నైట్రైడ్‌ (silicon nitride)తో కూడిన పింగాణీ పదార్థం, అతి దృఢమైన స్టీలు, గరుకైన నైలాన్‌ పొరలను ఉపయోగించి తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు తలుపులోకి చొచ్చుకుపోకుండా ఆ ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకీగుండు ఆ గాజులోని నైలాన్‌ పొరల వల్ల ఏర్పడిన గజిబిజి జాలీలో చిక్కుకుపోతుంది.
బులెట్‌ప్రూఫ్‌ జాకెట్‌ కూడా ఇలా ప్రత్యేకంగా తయారయిందే. దీంట్లో సుమారు 20 నుంచి 25 దృఢమైన, సున్నితమైన తేలికపాటి నైలాన్‌ పొరలు ఉంటాయి. ఈ పొరల్లో తుపాకీ గుండు చిక్కుకుపోతుంది.

చెకుముకి రాయి నుంచి నిప్పు కణాలు ఎలా వస్తాయి

చెకుముకి రాయి (Flint stone) మెరిసే నిప్పు కణాలను ఉత్పన్నం చేయడానికి గల కారణం దాని దృఢత్వమే. చెకుముకి రాయి తీవ్రంగా కొట్టగల సాధనమే కానీ నిప్పుకణాలు వెలువడేది మాత్రం ఇనుము, గంధకాల సమ్మేళనంతో కూడిన పైరైట్‌ (Pyrite) లేక స్టీలు లాంటి పదార్థాల నుండే రాతి యుగంలో నిప్పును పుట్టించడానికి పైరైట్‌ ముద్దను, ఎండుటాకులు పీచులాంటి పదార్థాలను ఒకచోట ఉంచి దానిపై దృఢమైన చెకుముకి రాయిని తాటించేవారు. మధ్యయుగంలోని పిస్తోళ్లలో చెకుముకి రాయిని, ఇనుమును తాటించడం వల్ల నిప్పు కణాలు వెలువడేవి. సిగరెట్‌ లైటర్లను చెకుముకి రాయితో చేయబడిన ఒక చక్రం అక్కడి మిశ్రమ లోహంపై ఘర్షణ కలిగించడంతో స్పల్పమైన మెరుపుతో కూడిన నిప్పు కణాలు వెలువడతాయి. ఆ కణాలు అందులో ఉండే పెట్రోలు, భాష్పం నుండి చిన్న మంట వచ్చేటట్లు చేస్తుంది. ఖరీదైన లైటర్లలో స్పార్క్‌లను ఉత్పన్నం చేయడానికి పీజో ఎలక్ట్రిక్‌ క్వార్ట్జ్‌ స్ఫటికాలను (Pieza electric quartz crystals) ఉపయోగిస్తారు.

ఆధారము: వందనం మద్దు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate