অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ విజ్ఞానం - ఎందుకు? ఏమిటి? ఎలా?

శాస్త్రీయ విజ్ఞానం - ఎందుకు? ఏమిటి? ఎలా?

  1. మొసళ్ల లైంగికత జన్యు పరంగా ముందే నిర్ణయం కాదని, పొదిగే క్రమంలోనే అవి ఆడ, మగ వేరు అవుతాయని విన్నాను. నిజమేనా?
  2. పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల?
  3. మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?
  4. శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?
  5. ౩ జి సెల్ ఫోన్ అంటే ఏమిటి?
  6. మన చేతి బొటనవేలితో, మధ్యవేలితో కలిపి 'చిటిక' వేస్తే శబ్దం ఎలా వస్తుంది?
  7. మీటలు నొక్కితే డబ్బులిచ్చే ఏటీఎం ఎలా పనిచేస్తుంది?
  8. పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి?
  9. బాణము ఎక్కుపెట్టినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తోనే చూస్తారు ఎండుకు ?
  10. సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు అందులోంచి బయటకి వచ్చే గాలి ఎందుకు చల్లగా ఉంటుంది?
  11. గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా. మరి భూమి మీదున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?
  12. తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా?
  13. ప్రశ్న నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?
  14. రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?
  15. ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి?
  16. మన ఆంధ్రప్రదేశానికి త్రిలింగదేశమని పేరు ఉంది . అంటే ఆంధ్ర , రాయలసీమ ,తెలంగాణ అని అర్ధమా?
  17. జంతువులకు శుభ్రత అవసరం లేదా?,మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటున్నజంతువులకు జబ్బులేమీ రావా?
  18. మనిషి తప్ప మిగతా జంతువులేవీ బ్రష్‌ చేసుకోవు కదా? మరి వాటి పళ్లు పాడవకుండా ఎలా ఉంటాయి?
  19. చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బ తగలదు. ఎందుకని?
  20. ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది.ఎందుకు?
  21. ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?
  22. వేపాకు చేదుగా ఎందుకు ఉంటుంది?
  23. ఆ శిల్పాల కధేమిటి?
  24. రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?
  25. మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా?
  26. డెడ్‌ సీ (మృత సముద్రం)లో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా?
  27. బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?
  28. వాతావరణానికి సంబంధించి అల్పపీడన ద్రోణి వాయుగుండం వల్ల భారీ వర్షాలు అని చెబుతుంటారు. అంటే ఏమిటి?
  29. మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు?
  30. పురుషులలో బట్టతల వస్తుంది కానీ స్త్రీలలో రాదు. ఎందుకని?
  31. ఉష్ణోగ్రత ప్రభావము బంతి పై ఉంటుందా?
  32. ప్రయాణంలో ఉన్నప్పుడు బాల్‌పాయింట్‌ పెన్నులు ఇంకును కక్కుతాయి. ఎందుకు?
  33. బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో ?
  34. బారోమీటార్ లో వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయి?
  35. మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు?
  36. గబ్బిలాలు రాత్రి పూటనే ఎందుకు సంచరిస్తాయి? పగలు కన్నా రాత్రి బాగా కనిపిస్తుందా?
  37. అన్ని పక్షులు వాటి పిల్లలకు పాలు ఇవ్వవు. కానీ గబ్బిలం మాత్రం పిల్లలకు పాలు ఇస్తుంది. ఇది కూడా పక్షే కదా?
  38. చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు. ఎందుకని?
  39. మనం వేళ్లు విరిచినపుడు శబ్దం ఎందుకు వస్తుంది?
  40. భూమి పైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?
  41. ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఏది ?
  42. ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది?
  43. ఆ కలువ పువ్వు సంగతేమిటి?
  44. చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి?
  45. పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో చోటికి ఎలా వలస పోతాయి?
  46. కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?
  47. కృష్ణ ద్రవ్యము
  48. మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?
  49. రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?
  50. బ్లూ గ్రొట్టో గుహ సంగతేమిటి?

దైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుత్సాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

మొసళ్ల లైంగికత జన్యు పరంగా ముందే నిర్ణయం కాదని, పొదిగే క్రమంలోనే అవి ఆడ, మగ వేరు అవుతాయని విన్నాను. నిజమేనా?

జవాబు: ఇది నిజమే. మనుషులు తదితర క్షీరదాలు, చాలా జంతువుల్లో లైంగిక క్రోమోజోములు ఉంటాయి. తద్వారా ఆడ జంతువు, మగ జంతువు కలిసినపుడు ఆడ జంతువు అండంలో, మగ జంతువు శుక్ర కణం లేదా తదనుగుణమైన కణం సంయోగం చెందుతుంది. ఆ క్రమంలో సంయుక్త బీజకణం (Zygote) ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజ కణంలోని జీవి ఆడనా, మగనా అక్కడే నిర్దేశితమవుతుంది. కాబట్టి గర్భధారణ తర్వాత ఆడ బిడ్డగానీ, మగ శిశువుగానీ జన్మిస్తాయి. అలాగే కోడి పుంజు, కోడిపెట్ట కలిశాక ఏర్పడ్డ గుడ్డును పొదగకముందే పుట్టబోయేది పెట్టనా లేదా పుంజా ముందే నిర్ణయమయి ఉంటుంది. కానీ మొసళ్లు, అలిగేటర్లు వంటి జంతువులలో ఆడ, మగ లైంగికత ఉన్నా వాటిలో లైంగికతను నిర్ణయించే క్రోమోజోములు లేవు. కాబట్టి అండ దశలోనే లైంగికత నిర్ధారణ అయి ఉండదు. గుడ్డు పొదిగే ఉష్ణోగ్రతను బట్టి పుట్టబోయే మొసలి ఆడా, మగనా నిర్ణయమవుతుంది. మొసలి గుడ్డు 30 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ ఉంటే ఆడ మొసలి వస్తుంది. మొసళ్లు ఒకసారి అనేక గుడ్లు పెడతాయి కాబట్టి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెంటిగ్రేడు మధ్య ఉంటే గుడ్లలో కొన్ని ఆడవి, కొన్ని మగవిగా బయటికొస్తాయి. అదే 35 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువుంటే మగ మొసళ్లు బయటికొస్తాయి.

- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ శాతం ఇప్పటి కన్నా ఎక్కువగా ఉండి ఉంటే, పురుగుల దేహ పరిమాణం కూడా ఇప్పటి కన్నా ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. వెన్నెముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్‌ను అందజేస్తుంది. అందువల్ల, పురుగు పరిమాణం పెద్దదయే కొలదీ, దాని దేహానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా, చిక్కుపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థ పరుగుల పరిమాణంపై కొంత పరిమితిని విధిస్తుంది. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్‌ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది.
ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్‌ 21 శాతం ఉంటే, భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలి రోజుల్లో గాలిలో ఆక్సిజన్‌ 35 శాతం ఉండేది అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం 760 మిల్లీ మీటర్లు ఉండే రాక్షస తూనీగలు ఉండేవి.
అంతేకాకుండా, పురుగుల గరిష్ఠ పరిమాణంపై ఆంక్షలు విధించే మరో అంశం- పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే, ఆ భాగాలకు ఆక్సిజన్‌ లభించదు. అందువల్లే పురుగుల శరీర పరిమాణం అంత తక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌ ,Dr.Seshagirirao - MBBS.-

మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు?

జవాబు: రేస్‌కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. దీనికి కారణం నైట్రోజన్‌ వాయువులో ఉష్ణం వల్ల ఉత్పన్నమయే సంకోచ, వ్యాకోచాలు సమంగా ఒకే తీరులో ఉంటాయి. మామూలు గాలిలో కొంత శాతం తేమ కూడా ఉండటం వల్ల దాని సంకోచ, వ్యాకోచాలు ఒకే తీరుగా ఉండవు. ఫలితంగా టైర్లలో ఉండే ఒత్తిడిలో తేడాలు వస్తాయి. రేస్‌ కార్లు అత్యంత వేగంతో ప్రయాణించేటపుడు టైర్లలో ఎక్కువ వేడి పుడుతుంది. దాని ప్రభావం వాటి లోపల ఉండే వాయువు మీద పడుతుంది. గాలి కన్నా నైట్రోజన్‌పై ఉష్ణ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్రోజన్‌ను వాడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌

శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?

జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.

౩ జి సెల్ ఫోన్ అంటే ఏమిటి?

సెల్ ఫోన్ వాడకం బాగా పెరిగినది . మొదటిలో సెల్ ఫోన్ లో కెమెరా uన్డేది కాదు . ఇపుడు అన్ని సెల్ ఫోన్ ల లో కెమెరా తో ఎఫ్ .ఎం .రేడియో , ఇంటర్ నెట్ ఫెసిలిటి వుంటున్నాయి . ఈ విదంగా ఒక తరం సెల్ ఫోన్ ల నుండి అభివృద్ది చెంది మరో ఉన్నతమైన రకం గా మార్పు నే సెల్ ఫోన్ జనరేషన్ గా పిలుస్తారు . 1G,2G,3G ,4G . లు గా పరిగనిస్తారు . 3G సెల్ ఫోన్ ల లో వీడియో కెమెరా ఉన్నందున వీడియో లు చూడడానికి , పంపించేందుకు వీలు ఉంటుంది. కెమెరా కన్ను వెనభాగము లో కాకుండా ముందు భాగము లో వుంటే ... అది మీ రూపాన్నే గ్రహించి , మాటల ధ్వని తరంగాల తో పటు , మన రూపాన్ని కూడా విద్యుత్ సంకేతాలు గా మార్చి ప్రసారం చేసి ఎదే సదుపాయం ఉన్న అవతలి ఫోన్ లో మతాల తో మాట్లాడే మన ఫోటో కనిపిస్తుంది .

ముఖ్య మంత్రులు జిల్లా లలో ఉండే కలక్టర్లు తో మాట్లాడే వీడియో కాన్ఫెరెన్స్ ల గురుండి వినే ఉంటారు . ఈ విధానం ఇప్పటికే ఇంటర్ నెట్ , ఐ -గవర్నెన్స్ లోను అమల్లో ఉంది . కంప్యుటర్ మానిటర్ పై ఉండే కెమెరా (దీన్నే వెబ్ కెమెరా అంటారు ) మన బొమ్మలను , మైక్రో ఫోన్ మన మాటల్ని ఇంటర్నెట్ ద్వారా అవతలి వారికి వ్హేరుస్తుండడం వల్లనే ఎక్కడో అమెరికా లో ఉన్నా మనవాళ్ళని చుస్తూ మాట్లాడుకోగాలుగు తున్నాం . ఇది ఇప్పుడు సెల్ ఫోన్ ల కు వచ్చేసింది .

డా.శేషగిరిరావు .శ్ర్రీకాకుళం

 

మన చేతి బొటనవేలితో, మధ్యవేలితో కలిపి 'చిటిక' వేస్తే శబ్దం ఎలా వస్తుంది?

జవాబు: చిటిక అంటే బొటనవేలు మద్యవేలు కలుపుతూ చేసే శబ్ధము..మనం చిటిక వేసినపుడు స్థిరంగా ఉండే బొటన వేలు, కదిలే మధ్యవేలు మధ్య చిక్కుకున్న గాలి ఒత్తిడికి గురవుతుంది. అలా అక్కడ ఎక్కువ పీడనంతో ఉన్న గాలిని చిటికవేయడం ద్వారా తటాలున వదలడంతో శబ్దం వస్తుంది. వూదిన బెలూన్‌ లోపలి గాలి కూడా అత్యంత పీడనంతో ఉంటుంది కాబట్టే ఆ బెలేన్‌ పగిలినపుడు సైతం 'ఢాం' అనే శబ్దం వస్తుంది. చిటిక, బుడగల ద్వారా పుట్టే శబ్దాలు ఒత్తిడిలో ఉన్న గాలి వల్ల వచ్చేవే.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

మీటలు నొక్కితే డబ్బులిచ్చే ఏటీఎం ఎలా పనిచేస్తుంది?

జవాబు:ఏటీఎం (ATM) అంటే Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ(magnetic strip)లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే కేంద్రీయ(central) కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. కేంద్రీయ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే పరారుణ స్పర్శీయ సాధనం (Infrared Sensing Device) ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్‌ బాక్స్‌'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్‌ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్‌ ఎకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో కొందరీ యంత్రాన్ని సరదాగా 'Any Time Money’అంటారు.
A.T.M. వాడకము లో జాగ్రత్తలు :
బ్యాంకులలో పొడవాటి క్యూలలో గంటల తరబడి నిలబడే దాదాపు ఎక్కడపడితే అక్కడ అమర్చిన " ఏ.టి.ఎం " వినియోగం ఈ రోజుల్లో భా పెరిగింది . ఎప్పుడు కావాలంటే అప్పుడు , ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి భలే సదుపాయము గా ఉంది .

  • ఏ.టి.ఎం. కార్డును మీరు వినియోగించే సమయము లో చుట్టుప్రక్కలవారెవ్వరూ మీ పిన్‌ నెంబరును గమనించకుండా జాగ్రత్త పడాలి .
  • కార్డు నెంబరు , పిన్‌ నెంబరు ఏ సందర్భములోనూ ఇతర వక్తులకు చెప్పద్దు .
  • కొన్ని ఏ.టి.ఎం. లలో ట్రాంసాక్షన్‌ జరిపేందుకు ఏటిఎం లోని స్లాట్ లో కార్డును ఇంసర్ట్ చేయాలి ... కొన్ని మెషిన్‌ లలో స్క్రాపింగ్ సిస్టం ఉంటుంది ... అటువంటి సమ్యాలలో దాని పంప్యూటర్ స్క్రీన్‌ పై వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి . తర్చుగా ఒక ట్రాంసాక్షన్‌ పూర్తికాగానే " do you want to proceed further " అనే ప్రశ్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది . మరో ట్రాంసాక్షన్‌ అవసరము లేనపుడు ' no' బటన్‌ క్లిక్ చేస్తే మీ పని పూర్తి అవుతుంది , లేదంటే మెమరీ లో మీకార్డు డేటా తరువాతవారు చూసే అవకాశము ఉంటుంది .
  • ఏటిఎం కార్డు ను డెబిట్ కార్డు వలె ఉపయోగించాలి . ఏటిఎం - కమ్‌-డెబిట్ కార్డు తో షాపింగ్ కనుక చేస్తే ఆ సమ్యములో కార్డు ఒకసారికి మించి స్కాప్ కాకుండా జాగ్రత్త వహించాలి . ఒకవేళ అలా జరిగితే దానిని గమనించి షాపింగ్ రశీదును మీ వద్ద జాగ్రత్త గా దాచుకోవాలి .
  • షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపధం లోనే ఉండేలా చూసుకోవాలి ఆలా చేయడం వల్ల కార్డు ఏసందర్భములోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది .
  • ఏటిఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్‌ వ్యాల్యు (సి.వి.వి.) నెంబరు ఉంటుంది .. ఆనెంబరు నూ మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి . ఈ నెంబరు కూడా ఇతరులము తెలియనివ్వకూడదు . ఈ నెంబరు చాలా ముఖ్యమైనది . ఈ నెంబరు మీవద్ద ఉంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచి అయినా షాపింగ్ చేసుకునే వీలుంటుంది .
  • ఏటిఎం కార్డు పోగొట్టుకున్న సందర్భాలలో సదరు బ్యంక్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తప్పక తెలియజేయాలి . కాల్ సెంటర్ లో మీ పేరు నమోదు చేయించుకొని " కంప్లైంట్ నెంబరు " ను తప్పక నోట్ చేసుకోండి .

ఏ.టి.ఎం. కార్డు పోయినట్లైతే :
కార్డు పోయిన వెంటనే కార్డు జారీచేసిన బ్యాంక్ కు ఆ సమాచారము అందించాలి . ఇందుకోసం కాల్ సెంటర్ లో కంప్లైంట్ నమోదుచేసుకొని ' కంప్లైంట్ నెంబరు ' నోట్ చేసుకోవాలి . మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటిఎం నెంబర్ ను బ్లాక్ చేస్తుంది . తరువాత మీరు ఆ కంప్లైంట్ నెంబరును ఉదహరిస్తూ పోలీష్ స్టేషన్‌ లో పిర్యాదు చేసి , ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయించుకోవాలి .
మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటిఎం కార్డును వినియోగిస్తే ఆ వ్యక్తి భారతీయ శిక్షాస్మృతి ప్రకారము శిక్షార్హుడవుతాడు .
బ్యాంక్ పిర్యాదు నమోదులో జాప్యము జరిగినా లేదా నమోదు చేసుకోకపోయినా , వినియోగదారుడు '' కన్‌స్యూమర్ యాక్ట్ " కింద బ్యాంక్ పై కేసు పెట్టవచ్చును .

పైలట్‌ రహిత విమానాలు, క్షిపణులు ఎలా ప్రయాణిస్తాయి?

జవాబు: భూగోళం మొత్తాన్ని ఊహాయుత రేఖలతో విభజించుకున్న సంగతి తెలిసిందే. అడ్డంగా ఉండే అక్షాంశాలు, నిలువుగా ఉండే రేఖాంశాలుగా ఏర్పాటు చేసుకున్న ఈ గీతల ఆధారంగా భూమ్మీద ఏ ప్రాంతాన్నయినా గుర్తించగలుగుతాం. అట్లాసును పరిశీలిస్తే మీకీ సంగతి అర్థమవుతుంది. విమానాల్లోను, రాకెట్లలోను అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు ఉంటాయి. వాటి మెమొరీలో ముందుగానే వివిధ విమానాశ్రయాలు, చేరవలసిన లక్ష్యాలను ఈ ఊహాయుత రేఖలను ఆధారంగా గుర్తించి ఆ సమాచారాన్ని ఫీడ్‌ చేసి డేటాబేస్‌గా ఉంచుతారు. పైలట్‌ ఉండే విమానాల్లో సైతం ఆ విమానం ఏ దిశలో, ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ప్రయాణించాలో కంప్యూటర్లతో అనుసంధానమైన వ్యవస్థే చెబుతుంది. పైలట్‌ లేని విమానాలు, క్షిపణుల విషయంలో అవి ప్రయాణించాల్సిన మార్గం మొత్తాన్ని కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఆయా విమానాల గమనాన్ని కంప్యూటర్లు, భూమ్మీద ఉండే నియంత్రణ వ్యవస్థలే నియంత్రిస్తూ ఉంటాయి. ఇదంతా ఆధునిక సాంకేతిక విజ్ఞానం చేసే మాయాజాలం.

బాణము ఎక్కుపెట్టినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తోనే చూస్తారు ఎండుకు ?

జవాబు:ఒక దృశ్యము ఎంతదూరము లో ఉంది , ఎంత ఎత్తు , లావు ఉంది తెలియాలంటే తప్పకుండా రెండు కళ్ళుతో దూడాల్సిందే . కాని గురి ఎక్కు పెట్టినప్పుడు మాత్రము లక్ష్యము ఎంతదూరము లో ఉన్నది తెలిస్తే చాలు . కాబట్టి ఒక కన్ను సరిపోతుంది . రెండు కళ్ళు తో చూస్తే రెండో కన్ను చూసే దృస్టికోణము అడ్డంకి అవుతుంది . అందుకే గురి ఒక కన్నుతోనే సూస్తారు .

సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు అందులోంచి బయటకి వచ్చే గాలి ఎందుకు చల్లగా ఉంటుంది?

జవాబు: ఇందుకు కారణం వాయువుల ధర్మాలకు సంబంధించిన సూత్రం. ఎక్కువ పీడనంలో ఉన్న వాయువు అక్కడి నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి అతి సన్నని మార్గం ద్వారా ప్రవహించినప్పుడు ఆ వాయువు చల్లబడుతుంది. దీన్ని భౌతిక శాస్త్రంలో ఔల్‌-థామ్సన్‌ ఫలితం అంటారు. సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు ఇదే జరుగుతుంది. సైకిల్‌ టైరులో అమర్చిన ట్యూబ్‌లోకి ఎక్కించిన గాలి బయటి వాతావరణంలోని గాలితో పోలిస్తే, ఎక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్‌కు పంక్చర్‌ అయినప్పుడు, లోపల అధిక పీడనంతో ఉండే గాలి సన్నని రంధ్రం ద్వారా తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి వస్తుంది. అలా రంధ్రం ద్వారా గాలి వేగంగా బయటకు రావడానికి ఆ వాయువ్యవస్థ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయడానికి కావలసిన శక్తి, బయటకి పోయే గాలిలో ఉండే ఉష్ణశక్తి నుంచి లభిస్తుంది. అందువల్ల ఉష్ణోగ్రత తగ్గి ఆ గాలి చల్లబడుతుంది.

గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా. మరి భూమి మీదున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?

జవాబు:  అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాల వైపు వ్యాపనం (diffusion) చెందడం గాలుల లక్షణం. భూమ్మీద గాలి ప్రవాహాలు, తుపానులు, సుడిగాలులు ఇలా ఏర్పడేవే. గాలికి ద్రవ్యరాశి (mass) ఉంది. భూమ్మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు సుమారు 5X1018కిలోలు భూమి బరువు దాదాపు 6X10 24కిలోగ్రాములు. రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ ఉంటుందనేది తెలిసిందే. అలాగే భూమికీ, భూమ్మీద ఉన్న గాలికీ మధ్య గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావం గాలికి ఉన్న వ్యాపన లక్షణం కన్నా అధికం కావడం వల్లనే భూమిని గాలి అంటిపెట్టుకునే ఉంటుంది. భూవాతావరణంలో ఉన్న గాలి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్నా, గాలిలోని 75 శాతం కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉండే టోపోస్ఫియర్‌ పొరలోనే ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి వాతావరణ వ్యాపనాన్ని నివారించగల స్థాయిలో లేనందువల్ల అక్కడ గాలి లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

తాగిన వ్యక్తిపై నీళ్లు కుమ్మరిస్తే మత్తు దిగిపోతుందని అంటారు. నిజమేనా?

జవాబు: తాగుబోతులు తాగే ద్రావణంలో నీరు అధికంగానూ, ఇథైల్‌ ఆల్కహాలు కొద్దిగానూ ఉంటాయి. ఆల్కహాలు మోతాదునుబట్టి ఆయా పానీయాల మత్తు తీవ్రత ఆధారపడుతుంది. ఇథైల్‌ ఆల్కహాలుకు తనంత తానుగా మత్తును కలిగించే గుణం లేదు. తాగినప్పుడు ఏ జీర్ణ ప్రక్రియ అవసరం లేకుండానే కొద్దిసేపటికే రక్తంలో కలిసే గుణం దీనికి ఉంది.
రక్తంలో కలిసిన వెంటనే అది దేహంలోని కణ జాలాల్లోకి బాగా త్వరితంగా చేరుకోగలుగుతుంది. కణాల్లోకి వెళ్లక అది సాధారణంగా అసిటాల్డిహైడుగా మారుతుంది. సారాయి తాగిన వాళ్ల దగ్గర్నుంచి వెలువడే దుర్గంధం దీనిదే. ఇది మెదడు కణాల్లోని అమైనో ఆమ్లాలలో చర్య జరిపి మత్తును, కైపును కలిగిస్తుంది.
తీసుకున్న మోతాదును బట్టి ఆ తాగుబోతు ప్రవర్తన, శరీర క్షేమం ఆధారపడ్తాయి. సారాయి, అసిటాల్డిహైడ్‌ నీటిలో బాగా కరుగుతాయి. మత్తులో జోగుతున్న మనిషి మీద బకెట్టు నీళ్లు పోస్తే అవి బట్టలను తడపడం వల్ల చాలా సేపు చర్మం చెమ్మగా ఉంటుంది కాబట్టి కనీసం చర్మంలో ఉన్న కణాల్లోని ఆల్కహాలు సంబంధిత రసాయనాలు బయటపడతాయి. ఒక్కసారిగా శరీర ఉపరితల ఉష్ణోగ్రత మారడం వల్ల కూడా ఆల్కహాలు ప్రభావం తగ్గుతుంది.

ప్రశ్న నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?

జవాబు:  నాటిన గింజ మొలకెత్తాలంటే ఆ గింజలో ఫలజీవం సజావుగా ఉండాలి. సాధారణంగా పూర్తిస్థాయి క్రోమోజోములున్న సంయుక్త జీవ కణం (Zygote) విత్తనంలో ఉంటుంది. విత్తనం మొలకెత్తగానే కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి సొంతంగా ఆహారం తయారు చేసుకునేంతవరకు తన ఎదుగుదలకు సహాయ పడేలా విత్తనంలో పోషణ ఉండాలి. అందుకే విత్తనాలలో సంయుక్త బీజకణ లక్షణాలతోపాటు పప్పు, కొబ్బరి, ముట్టె వంటి భాగాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి క్షీణించి ఉన్నాగానీ, రసాయనిక కారణాల వల్లగానీ, జన్యులోపం వల్ల గానీ అధిక వేడివల్లగానీ తదితర కారణాల వల్ల విత్తనంలో ఉన్న జీవం నశించి ఉంటే అలాంటి విత్తనాలు మొలకెత్తవు.
అందుకే రైతులు విత్తనాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటారు. తాము పండించిన విత్తనాలు తిరిగి పంటకొచ్చే అవకాశం లేకపోవచ్చు లేదా, టెర్మినేటర్‌ సీడ్స్‌ అనే విత్తనాల్లో అన్నీ బాగున్నాగానీ, వీటి క్రోమోజోముల్లో కంపెనీల వాళ్లు కావాలనే జన్యు నిర్మాణం చేయడం వల్ల మొలకెత్తవు కాబట్టి జన్యులోపం లేకుండా, ఆహార సమృద్ధి బాగా ఉంటూ సజీవంతో ఉన్న విత్తనాలే మొలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు బాగున్నా నేలలో ఉండే సారం విత్తనం మొలకెత్తేందుకు అనువుగా లేకున్నా ఆ ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

రక్తనాళాలన్నీ ఒక్కటి కాదా?

జవాబు:  శరీరము లో రక్తము తీసుకువెళ్ళేవి రక్తనాళాలే అయినా వీటిలో ప్రవహించే రక్తము , నాళము నిర్మాణము బట్టి వాటిని ధమనులు , సిరలు అని వేరు వేరుగా గుర్తిస్తారు. శరీరబాగాలనుండి చెడు (ఆక్షిజన్‌ తక్కువైన) రక్తాన్ని గుండెకు తీసుకొని వచ్చేవాటిని సిరలుగాను , ఆక్షిజన్‌ తో కూడుకొని స్వచ్చమైన మంచి రక్తాన్ని గుండెనుండి  శరీరభాగాలకు మోసుకుపోయే వాటిని ధమనులు గాను అంటారు . వీటన్నింటిలోనూ గోడలు మూడు పొరలతో నిర్మించబడినా ధమనుల గోడలు , సిరల గోడలుకన్నా మందముగా ఉంటాయి. ధమనులలో రక్తము గులాబీ రంఫులో వేగము గా ప్రవహిస్తుంది. సిరలలో రక్తము కాఫీ డికాక్షన్‌ రంగులో ఉండి నెమ్మదిగా ప్రవహిస్తుంది. సిరలలో రక్తప్రవాహము వెన్నకి జరుగకుండా కవాటాలు ఉంటాయి. ఇక్కడ పల్మొనరీ ధమనులలో చెడురక్తము , పల్మొనరీ సిరలలో మంచిరక్తము ఉండటాన్ని గమనించగలరు.

ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్‌ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి?

జవాబు: తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్‌ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్‌ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్‌ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్‌ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్‌ సంస్థ, స్విట్జర్లాండ్‌ దేశస్థుడైన హెన్రీ డునాంట్‌ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవచేసే వారిని గుర్తించి, ఎవరూ దాడి చేయకుండా ఉండడానికి ఈ చిహ్నం ఉపయోగపడేది. అదే నేడు ఆరోగ్య రంగానికి చిహ్నంగా మారింది. వాస్తవానికి చట్టపరంగా రెడ్‌క్రాస్‌ సంస్థకు చెందని వారు ఈ చిహ్నాన్ని వాడకూడదు.

మన ఆంధ్రప్రదేశానికి త్రిలింగదేశమని పేరు ఉంది . అంటే ఆంధ్ర , రాయలసీమ ,తెలంగాణ అని అర్ధమా?

జ : 14 వ శతాబ్దములో త్రిలింగ దే్శమని ఆంద్రప్రదేశాన్ని పిలవడము మొదలు పెట్టారు . శ్రీశైలము , ద్రాక్షారామము , కాళహస్తి - ఈ మూడు పుణ్యక్షేత్రాలలో మూడు శివలింగాలూ ఈ మూడు ప్రాంతాల ప్రజలని రక్షిస్తాయని .. అవిధము గా త్రిలింగదేశమని అన్నారు . అంతేకాని ఆంధ్ర , రాయలసీమ , తెలంగాణ అని అర్ధము కాదు .

జంతువులకు శుభ్రత అవసరం లేదా?,మట్టిలో ఉన్న ఆహార పదార్థాల్ని తింటున్నజంతువులకు జబ్బులేమీ రావా?

జవాబు:  ఈ భూమి ఏర్పడ్డ కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమి మీద జీవ లక్షణాలున్న కణాలు ఏర్పడ్డాయి. అవే వైరస్‌లు, బ్యాక్టీరియాలుగా రూపొందాయి. జీవ కణం ఆధారం లేకుంటే వైరస్‌లు ఏమీ వృద్ధి చెందలేవు కాబట్టి అవి బ్యాక్టీరియా కణాల్ని కూడా కబళిస్తాయి. ఈ విధంగా ప్రపంచంలో వైరస్‌లు లేని ప్రాణి లేదు. వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పాటు మన పరిసరాలలో మనకు వ్యాధుల్ని కలిగించే ఏకకణ జీవులు, బహుకణ జీవులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధాన సమస్య బ్యాక్టీరియాలే.
భూమ్మీద ప్రతీ గ్రాము మట్టిలో సగటున నాలుగు కోట్ల బ్యాక్టీరియాలు, శుభ్రమైన తాగే నీటిలో ప్రతి పది మిల్లీ లీటర్లకు కోటి చొప్పున బ్యాక్టీరియాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జంతు, వృక్షజాతుల జనాభాకన్నా బ్యాక్టీరియాలే అధికం. ప్రతీ మనిషిలోనూ సుమారు 10లక్షల కోట్ల మానవజీవ కణాలు ఉండగా, ప్రతి వ్యక్తి శరీరంమీద ఉండే బ్యాక్టీరియాల సంఖ్య వాటికి పదిరెట్లు ఎక్కువ. ఇందులో కొన్ని మనకు సహకరించేవి. మరికొన్ని హాని కలిగించేవి. హాని కలిగించేవి కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మనం బతికున్నంత కాలం శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ వీటిమీద సైన్యంలా దాడిచేస్తూ మనల్ని కాపాడుతుంది. బ్యాక్టీరియాల సంఖ్య ఈ మోతాదుకు మించితే అనారోగ్యం కలుగుతుంది.
మనం చేతులు కడుక్కోవడం అంటే బయటి బ్యాక్టీరియాను తొలగించుకోవడమే. జంతువుల్లో కూడా వాటివాటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. అవి మురికిలోనూ మలిన ప్రాంతాల్లోనూ బతికే పరిస్థితి సహజంగా ఉండడం వలన పరిణామ క్రమంలో వాటికున్న రక్షణ వ్యవస్థ మనకన్నా సమర్థంగా ఉంటుంది. పైగా వాటి శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు కూడా జంతువులకు అదనపు రక్షణ వ్యవస్థను సమకూరుస్తాయి. అయితే మురికి, మలినాలు ఎక్కువైతే జంతువులు కూడా రోగాల బారిన పడక తప్పదు.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, -నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

మనిషి తప్ప మిగతా జంతువులేవీ బ్రష్‌ చేసుకోవు కదా? మరి వాటి పళ్లు పాడవకుండా ఎలా ఉంటాయి?

జవాబు: కేవలం ఆధునిక మానవుడు మాత్రమే పళ్లు తోముకుంటున్నాడు. నాగరికత నేర్చిన మానవుడు పళ్లు తోముకోడానికి కేవలం సూక్ష్మక్రిముల నిర్మూలనే కారణం కాదు. ఇది సౌందర్యపరమైన అంశం కూడా. సంఘజీవులైన మనుషులు చనువుగా, దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దుర్వాసన ఒక సమస్యగా మారుతుంది. పళ్ల మధ్యలో చిక్కుకున్న ఆహారపు అణువులపై సూక్ష్మక్రిములు ఏర్పడ్డం వల్ల దుర్వాసనే కాదు, దంతాలు కూడా పాడవుతాయి. ఇక మనుషులు తినేంత వైవిధ్యభరితమైన ఆహారపు అలవాట్లు జంతువులకు లేవు. శాకాహార జంతువులు పీచు బాగా ఉండే ఆకులు, గడ్డి మేస్తాయి. మొక్కల రసాలు వాటి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి .చంతాల మధ్య, చిగుళ్ళ మీద సూక్ష్మజీవులు చేరకుండా వాటిని సంహరించగలిగిన రసాయనాలు జంతువులు తినే గడ్డి , ఇతర వృక్షపదార్ధాల ద్వారా సమకూరుతాయి. శాఖాహారజంతుల్వుల పళ్లు దగ్గరగా, పెద్దగా ఉంటాయి. మాంసాహార జంతువుల పళ్ల మధ్య ఎడం బాగా ఉంటుంది. జంతువుల నాలుకలు పొడవుగా, గరుకుగా ఉంటాయి. వాటితో అవి పళ్లను పదే పదే నాకుతూ శుభ్రం చేసుకోగలుగుతాయి. అలాగే వాటి లాలాజలంలోని లవణీయత, జిహ్వస్రావాల లాంటివి కూడా దంతక్షయం కాకుండా కాపాడుతాయి.

చీమ ఎంత ఎత్తు నుంచి పడినా దానికి దెబ్బ తగలదు. ఎందుకని?

జవాబు:  ఏదైనా వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే. పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం(momentum)లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు 20 మీటర్ల ఎత్తు నుంచి పడిపోతూ 2 సెకన్లలో నేలను తాకిందనుకుందాం. ఈ ప్రయాణంలో అది సుమారు గంటకు 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆ వేగాన్ని, దాని ద్రవ్యరాశితో గుణిస్తే దానిలో ఏర్పడే ద్రవ్యవేగం తెలుస్తుంది. చీమల ద్రవ్యరాశి చాలా తక్కువ కావడం వల్ల తక్కువ ద్రవ్యవేగంలోనే అవి కింద పడతాయి. అంటే కింద పడిన చీమపై కలిగే శక్తి ప్రభావం కూడా తక్కువే. మనుషుల్లాంటి బరువైన జీవులు కింద పడితే ద్రవ్యవేగం ప్రభావం ఎక్కువై గాయాలు ఏర్పడుతాయి.

ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@ ఈనాడు దినపత్రిక

ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది.ఎందుకు?

జవాబు:  ఆపిల్‌ పండులో 'టానిక్‌ యాసిడ్‌' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్‌ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్‌ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్‌ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్‌ బ్రౌన్‌ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్‌ ముక్కలు ఆ రంగులోకి మారతాయి.
అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండులో ఉండే టానిక్‌ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

జ : 'జీవం' అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, 'కణ నిర్మాణం' అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది. ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. ఆపిల్‌పండును నోటికి తాకిస్తే నాలుక మీదున్న రుచిగుళికల (taste buds) మీదకు ఆయా పదార్థాలు కొద్దిగా చేరుకుంటాయి.
అక్కడ పరీక్ష చేసే డాక్టరులాగా రుచి నాడీ చివర్లు (taste nerve ends) ఉంటాయి. అక్కడ జరిగే విద్యుద్రసాయనిక చర్యల సారాంశంలో ప్రత్యేకమైన సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాలను మెదడు 'తీయదనం'గా భావించి ఇంకాస్త తినమని ప్రోత్సహిస్తుంది. వేపపండులో చేదుగుణాన్ని కలిగించే 'పిక్రిక్‌ ఆమ్లము' తదితర అవాంఛనీయమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటికి క్రిమిసంహారక లక్షణాలు (antibiotic characters) ఉన్నాయి. కాబట్టి పొలాల్లో క్రిమి సంహారిణులుగా వాడితే మంచిది. నోట్లో వేసుకొంటే ఆ నాడీ చివర్ల జరిగే రసాయనిక సంకేతాలు 'మరోలా' ఉండడం వల్ల ఆ సంకేతాల సారాన్ని మెదడు 'చేదు' అంటూ మానెయ్యమంటుంది. తినగాతినగా వేము తియ్యగా ఎప్పుడూ మారదు.

వేపాకు చేదుగా ఎందుకు ఉంటుంది?

జవాబు: వేప చెట్టులో దాదాపు అన్ని భాగాలు చేదుగా ఉంటాయి. ప్రత్యేకంగా వేపాకులో మరీను. కారణం వేపాకులో చెడు రుచిని కలిగించే వృక్ష సంబంధ సేంద్రియ పదార్థాలే. (Phyto organic chemical) ఉంటాయి. ఇందులో ప్రధానమైనవి నింబిన్‌(Nimbin) , నింబిడిన్‌(Nimbidin)లు.
20వ శతాబ్దపు 4వ దశకంలో సిద్ధిక్వి అనే పాకిస్తాన్‌ శాస్త్రవేత్త వేపలోని రసాయనాల మీద పరిశోధనలు చేశారు. 1995 సంవత్సరంలో ఐరోపా పేటెంటు సంస్థ అమెరికా వ్యవసాయ సంస్థ (American department of agriculture) అదే దేశానికి చెందిన wr grace and company కి వేప మీద పేటెంటు హక్కుల్ని ఇచ్చింది. కానీ 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం దాదాపు 2వేల సం||రాల తరబడి వేప వినియోగం భారత దేశంలో ఉందని వాదించగా అమెరికా వారి పేటెంటు హక్కుల్ని తీసేసి భారత దేశానికి ఇచ్చారు. కానీ 2005 సం. లో తిరిగి wr grace and company భారత్‌లో వేప వాడకం ఆచరణలో ఉన్నా ప్రచురణ (publication) లేదని వాదించి తిరిగి పేటెంటు హక్కుల్ని సాధించుకొంది.
Courtesy :
prajashakti news paper

ఆ శిల్పాల కధేమిటి?

ఏ శిల్పీ చెక్కలేదు... ఏ కూలీ కట్టలేదు... సహజంగా ఏర్పడ్డాయి...ఒకటా రెండా? వేల కొద్ది ఆకారాలు... అదే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌!
ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాలుగా కనిపిస్తేనే సంబరపడతాం. అలాంటిది వేలాది ఎకరాల్లో విస్తరించిన ప్రదేశంలో శిలలన్నీ అద్భుతమైన రూపాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అలా అబ్బురపరిచే ప్రాంతమే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్కు. అక్కడ ఎటు చూసినా కనిపించేది సాండ్‌స్టోన్‌ పరుచుకున్న ప్రదేశమే. ఇదంతా కోట్లాది ఏళ్లుగా ప్రకృతిలో ఏర్పడిన మార్పుల వల్ల రకరకాల ఆకారాలను సంతరించుకుని ఆశ్చర్యపరుస్తూ కనిపిస్తాయి. కొన్ని గుడి గోపురాల్లా ఉంటే, మరి కొన్ని చర్చి శిఖరాల్లా ఉంటాయి. ఇక పుట్టలు, మెలికలు తిరిగే వంపులు, గుమ్మటాల్లాంటివెన్నో రూపాలు కనిపిస్తాయి. మీకు సహజ శిలా తోరణమంటే తెలుసుగా? ఒకే శిల ఈ వైపు నుంచి ఆ వైపు వరకు ఒక తోరణంలా, వంతెనలా ఏర్పడడం. ఇలాంటి శిలాతోరణాలు ఇక్కడ ఏకంగా రెండువేలకు పైగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌ అంటారు. ఇక్కడుండే శిలాతోరణాల్లో అతి పెద్దది ఏకంగా 290 అడుగుల వరకు వెడల్పుతో ఉంటే, చిన్నవి మూడు అడుగుల వెడల్పుతో చూడముచ్చటగా ఉంటాయి.
అమెరికాలోని ఉతా (Utah)లో విస్తరించిన ఈ అందాల ప్రదేశం విస్తీర్ణం ఎంతో తెలుసా? 76 వేల ఎకరాల పైనే. దాదాపు 30 కోట్ల ఏళ్ల కిత్రం ఈ ప్రదేశమంతా సముద్రంతో నిండి ఉండేదని చెబుతారు. ఆ సముద్రం భౌగోళిక మార్పుల వల్ల ఇగిరిపోయింది. అందుకనే ఇక్కడి భూగర్భమంతా ఉప్పు మేటలు, ఇసుకరాతి శిలలతో కూడి ఉంటుంది. క్రమంగా ఇవి గట్టిపడిపోయి సాండ్‌స్టోన్‌ గుట్టలుగా మారింది. కాలక్రమేణా గాలులు, వర్షాల కోత వల్ల ఈ శిలలన్నీ వింత ఆకారాల్లోకి మారిపోయాయన్నమాట.
ఇక్కడి శిలాతోరణాల్లో డెలికేట్‌ ఆర్చ్‌ ఎంతో అందమైనదిగా పేరొందింది. 52 అడుగుల ఎత్తుతో ఉండే ఈ తోరణంలో నుంచి 2002లో శీతాకాల ఒలింపిక్స్‌ టార్చిని పట్టుకెళ్లారు. గతంలో ఈ ఆకారాలపైకి రాక్‌ క్త్లెంబింగ్‌కు అనుమతి ఇచ్చేవారు. కానీ అవి దెబ్బతింటున్నాయన్న కారణంగా వీటిపైకి ఎక్కనివ్వడంలేదు. 1929 నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. ఏటా సుమారు 8 లక్షల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?

జ : కాదనలేము , ఔననలేము ... ఎందుకంటే ఈ భూగోళము ఎప్పుడూ ఒకే రకము గా ఉండబోదు . లక్షల సంవత్సరాల క్రితము ఈ గోళము లో ఐదు ఖండాలు లేవు . అంతా ఒకే మట్టి ముద్ద . ఒకనాడు అగాధ సముద్రము వుండే చోట హిమాలయాలు మొలిచాయి అని శాస్త్రజ్ఞులు అంటున్నారు . పర్వతాలు పెరుగు తున్నాయి. నదులు గతులు మారుస్తున్నాయి. సముద్రాలు ఒక వంక మేటవేసి మరోవైపు పల్లెలు, నగరాలు మునుగుతున్నాయి . ఖండాలు అటూ ఇటూ జరుగుతున్నాయి. అందుచేత లంక , శ్రీలంక కి అటో ఇటో తప్పక ఉండవచ్చు . అదీకాక రామాయణములోనే కిషిందకాండములో భూగోళ వర్ణన వున్నది. భారతములో భీష్మపర్వములో భూగోళ విశేషాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటిలో తేడా కనిపిస్తుంది . అంటే రామాయణము నాటి భూగోళం భారతం నాటికి మారింది . అలా మారుతునే ఉంటుంది .
మూలము : ఉషశ్రీ. ->www.ushasri.org

మగవారితో పోలిస్తే ఆడవారు తక్కువ బలంతో ఉంటారు. ఆహారం కూడా తక్కువ తీసుకుంటారు. ఎందుకిలా?

జవాబు:  ప్రకృతి సహజంగా మగవారికి, ఆడవారికి కొన్ని తేడాలున్నా బలాబలాల్లోను, దృఢత్వంలోనూ పెద్ద తేడా ఉండదు. కానీ లక్షలాది సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధమైన సహజ లక్షణాలకి తోడుగా సామాజికాంశాలు ప్రభావం చూపడం వల్ల ఆడవారి శరీర పరిమాణం మగవారి కన్నా చిన్నగా, నాజూకుగా తయారైంది. ఆ మేరకు ఆహార అవసరం కొంత తగ్గినా శ్రమ విషయంలో ఆడవారు తక్కువేమీ కాదు.
ప్రపంచవ్యాప్తంగా మానవాళి చేసే అన్ని రకాల సామాజిక, ఉత్పత్తి సంబంధ శ్రమలో ఆడవారి పాత్రే అరవై శాతంగా ఉందని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చూస్తే ఆహారపు అవసరం ఆడవారికే అధికం. కానీ సమకాలీన సామాజిక, సంస్కృతిక నేపథ్యం ఆడవారిని సన్నగా, నాజూగ్గా ఉండాలని ప్రేరేపిస్తోంది. ఇది ఫ్యాషన్‌ కాదు. ఏమైనా ఆడవారు మగవారి కన్నా దేహదారుఢ్యంలో అబలలు కారు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

డెడ్‌ సీ (మృత సముద్రం)లో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా?

జవాబు:  డెడ్‌సీ (Dead sea) అని పిలిచే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలనులాగా ఉంటుంది. సుమారు 50 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ దేశాల మధ్య విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు. దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత పదిరెట్లు ఎక్కువ. అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు, తిమింగలాలు, నాచు, కోరల్స్‌ వంటి పెద్ద జీవజాతులు బతకలేవు. అందుకే దీన్ని మృత సముద్రం అన్నారు. కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బాక్టీరియాలు, ఫంగస్‌ జీవులు ఉంటాయి.
మృతసముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత 1.24 గ్రా/మి.లీ. ఉంటుంది. అందుకే మనుషులు తదితర జీవులు మునగవు. ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే నీళ్లలో తేలవచ్చు. మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోడానికి లేదు. ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువయితే ఆ వస్తువులు ఆ ద్రవంలో మునుగుతాయి. తక్కువయితే తేలుతాయి. కాబట్టి 1.24 గ్రా/మి.లీ. కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము, రాళ్లు వంటివి తప్పకుండా మునుగుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద తెల్లగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు:  బొగ్గులో కార్బన్‌ కణాలుంటాయి. వాటి రంగు నలుపు. బొగ్గును కాల్చినపుడు ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌ డై ఆక్సైడ్‌గా మారుతుంది. అలా అయితే, బొగ్గు పూర్తిగా కాలిపోతే ఆ ప్రదేశంలో మరేమీ మిగిలి ఉండకూడదని, ఒకవేళ పూర్తిగా కాలకపోతే కొన్ని నల్లని కార్బన్‌ కణాలు మాత్రమే ఉండాలని అనుకుంటాం. కానీ అలా జరగడంలేదు. ఎందువల్లనంటే, బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలే కాకుండా కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.
బొగ్గును కాల్చినపుడు కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడడంతోపాటు అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌లుగా విడివడతాయి. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారితే, హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసి నీటి ఆవిరిగా మారుతుంది. ఇక ఖనిజ లవణాలలోని ఖనిజాలు ఆక్సిజన్‌తో కలిసి ఖనిజ ఆక్సైడ్లుగా మారుతాయి. ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్ల సులభంగా విడివడకపోవడంతో తెల్లని పొడి (బూడిద) రూపంలో మిగిలిపోతాయి. ఒక్కోసారి కాలకుండా మిగిలిన కార్బన్‌ కణాలు, ఖనిజ ఆక్సైడ్‌లతో ఏర్పడిన తెల్లని బూడిదతో కలవడం వల్ల ఈ పొడి బూడిదరంగులో కూడా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

వాతావరణానికి సంబంధించి అల్పపీడన ద్రోణి వాయుగుండం వల్ల భారీ వర్షాలు అని చెబుతుంటారు. అంటే ఏమిటి?

జవాబు:గాలులు ఎక్కువగా గుమిగూడి ఉంటే ఆ ప్రాంతంలో అధిక పీడనమనీ, పల్చగా ఉండే ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఈ రెండు పీడనాలూ ఏర్పడుతూనే ఉంటాయి. గాలులు కిందకీ, పైకీ పయనిస్తుంటాయి. ఒక ప్రాంతంలో గాలులు చాలా నెమ్మదిగా దిగుతుంటే అక్కడ అధిక పీడనం ఉందనుకోవచ్చు. అలా దిగిన గాలులు వేడెక్కి తిరిగి పైకి వెళతాయి. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కినప్పుడు అది వ్యాకోచించి తేలికవుతుంది. అలా తేలికైన గాలులు పైకి ప్రయాణిస్తాయి. అవి పైకి వెళ్లడంతో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అందువల్ల వేరే ప్రాంతాల్లో ఉండే గాలులు ఆ ప్రాంతం వైపు వేగంగా కదులుతాయి. వేడెక్కి పైకి బయల్దేరిన గాలులు భూమి వాతావరణం పైపొరల్లోకి వెళ్లేకొద్దీ చల్లబడుతుంది. దాని వల్ల ఆ గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మబిందువులు, మంచు స్ఫటికాలుగా మారతాయి. ఈ గాలుల కదలికల వల్ల ఒకోసారి ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడుతాయి. సుడుల వల్ల గాలి కదలికలు మరింత తీవ్రమై ఎక్కువ గాలి పోగుపడడం, పైకి వెళ్లే గాలులు చల్లబడి పెద్ద పెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. అల్ప పీడనం మరీ తీవ్రంగా మారిపోతే దాన్ని వాయుగుండం అనీ, అది ఇంకా బలపడితే తుపాను అనీ అంటారు. అల్ప పీడనాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినా, సముద్రాల మీద వాటికి ఎలాంటి అడ్డంకులు ఉండని నేపథ్యంలో గాలుల అలజడి తీవ్రమై, సుడుల్లాగా మారే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే తుపానులు కేవలం సముద్రాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. సముద్రాలు వెడెక్కిన కొద్దీ నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఇదంతా గాలుల సుడుల వల్ల పైకి పోయి బాగా చల్లబడి మేఘాలుగా మారతాయి. ఈ సుడులు తీరాన్ని తాకగానే చెదరిపోవడంతో మేఘాలు చెల్లాచెదరై ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మనకు వినిపించే రకరకాల పేర్లనీ ఆ గాలుల కదలికల తీవ్రతను తెలియజెప్పేవే.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు?

జవాబు: శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.

పురుషులలో బట్టతల వస్తుంది కానీ స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు:అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.

ఉష్ణోగ్రత ప్రభావము బంతి పై ఉంటుందా?

జ: చలికాలము లో రబ్బరుబంతిని నేలకు కొట్టినపుడు అది వేసవికాలము లో ఎగిరిన విధము గా పైకి ఎగరదు . దీనికి కారణము బంతిలోపలి గాలి మీద ఉష్ణోగ్రత ప్రభావము ఉండటమే . గాలి చల్లబడినందున ఆ గాలి ఎక్కువ రాపిడిని ఇస్తుంది .
అదేవిధము గా చలి ప్రభావము రబ్బరు మీద ఉంటుంది. రబ్బరు అంతగా సాగదు . ఈ కారణాలవల్ల బంతి నేలకేసి కొట్టినప్పుడు అక్కడే ' ధబ్ ' మని ఆగినట్టనిపిస్తుంది కాని గాలిలోకి తిరిగి అంతగా ఎగరదు . వేసవికాలము లో ఉష్ణోగ్రత వలన వ్యాకోచము చెందిన బంతి లోపలి గాలి, రబ్బరుమీద ఉషోగ్రతవలన రబ్బరు సాగే గుణము ఎక్కువగా ఉండడము వల్ల చురుకుగా ఎగరటం జరుగుతుంది .

ప్రయాణంలో ఉన్నప్పుడు బాల్‌పాయింట్‌ పెన్నులు ఇంకును కక్కుతాయి. ఎందుకు?

జవాబు:  ప్రయాణం చేసే ప్రతి సారీ కాకపోయినా సాధారణంగా వేసవిలో ఈ సమస్య కనిపిస్తుంది. వేసవిలో బయటకు వెళ్లినప్పుడు పరిసరాల్లోని వేడిమికి పెన్ను గురవుతుంది. పెన్ను పైభాగం, రీఫిల్‌ మొదలైనవి ఘనపదార్థాలైనా, ఇంక్‌ మాత్రం ద్రవ పదార్థమని తెలిసిందే. ఉష్ణోగ్రతకు గురయినప్పుడు ఘనపదార్థాల కన్నా, ద్రవ పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. కాబట్టి పెన్ను పైభాగాల కంటే రీఫిల్‌లో ఉండే ఇంకు ఎక్కువగా వ్యాకోచిస్తుంది. వ్యాకోచించిన ద్రవానికి సరిపడ స్థలం రీఫిల్‌లో లేకపోతే అది సన్నని సందుల ద్వారా బయటకి వస్తుంది. పలుచని సిరాతో పనిచేసే ఫౌంటెన్‌ పెన్నులు కూడా ఇలాగే కక్కుతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో ?

బ్యాండ్ ఎయిడ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం-మనకు ఏ కాస్త దెబ్బ తగిలినా, బ్లేడుకోసుకున్నా, రక్తం వచ్చినా వెంటనే బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటుంటాం.
బ్యాండ్ ఎయిడ్‌ను సృష్టించిన వ్యక్తి పేరు 'ఎర్లే డిక్సన్' ఈయన 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ ( అమెరికా) లో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయన భార్య ఇంట్లో వంట చేసేటప్పుడు తరచుగా చేయి కోసుకోవడం, కాల్చుకోవడం వంటి ప్రమాదాలకు గురయ్యేది. అప్పట్లో తెగిన, కాలిన గాయాలకు దూదితో కట్టు కట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా టైము పట్టే తతంగం. డిక్సన్ తన భార్యకు పదే పదే కట్టు కట్టలేక సులభంగా ఉండే 'బ్యాండ్ ఎయిడ్' ను 1920 లో కనిపెట్టాడు. నడిమధ్యలో దూది ఉండి, సులభంగా అంటుకుపోయే ఈ టేప్‌ను తయారు చేశాక డిక్సన్‌కు ఇంట్లో కష్టాలు తీరాయి. ఈ సంగతి 'జాన్సన్ అండ్ జాన్సన్' వాళ్ళతో డిక్సన్ చర్చించాడు. ఇతని ఆలోచనను మెచ్చిన ఆ సంస్థ 'బ్యాండ్ ఎయిడ్' తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బ్యాండ్ ఎయిడ్ ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. చూశారా! ఒక చిన్న ఆలోచన డిక్సన్‌తో పాటు అందరికీ ఎంత మేలు చేసిందో...

బారోమీటార్ లో వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయి?

బారోమీటర్ లోని పాదరసం మట్టం వాతావరణం లో ఉండే గాలి పీడనాన్ని తెలియజేస్తుంది . పాదరసం మట్టం పైకి పోయిందంటే గాలిపీడనం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం , ఆ మట్టం కిందకు పడిందంటే గాలి పీడనం తగ్గిందన్నమాట . బారోమీటర్ ని అంతరిక్షం లోకి తీసుకెళితే , ఆ శూన్య ప్రదేశం లో గాలి పీడనమనే ప్రశ్నే ఉండదు కాబట్టి ... పాదరసం మట్టం పూర్తిగా కిందికి పడిపోతుంది .
భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తికు వ్యాపించి ఉండే వాతావరణం లోని గాలి గురుత్వాకర్షణ వల్ల ఒత్తిడి (pressure) కలుగజేస్తుంది . భూమి పై వివిధ ప్రదేశాలలో గాలి పీడనం వేరువేరు గా ఉండడమే కాకుండా కాలం తో పాటు మారుతూ ఉంటుంది . చల్లని గాలి కన్నా వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది . అంటే వేడి గాలి , చల్ల గాలి కన్నా తేలిగా ఉంటుంది . అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఎడారుల్లో గాలి పీడనం తక్కువగా ఉంటే , మంచు వలన చల్లగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది .
వాతావరణం లోని గాలి పీడనం హెచ్చు తగ్గులను సూచించే బారోమీటర్ రీడింగులను బట్టి వాతావరణం లో కలుగాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోవచ్చు . పీడనం ఎక్కువై బారోమీటర్ లోని పాదరసం మట్టం పైకి పోయిందంటే ఆ ప్రాంతం నిర్మలం గా ఉండబోతున్నట్లు . పీడనం తగ్గి పాదరసం మట్టం తటాలున పడిపోతే ఆ ప్రాంతం మేఘాలతో కూడిన వర్షాలు రాబోతాయని అర్ధం . మట్టం మరీ పడిపోతే తుఫాన్ లాంటి బీబత్సాలకు సూచిక .

మామూలు కరెంటు వైర్లను పట్టుకుంటే షాక్‌ కొడుతుంది. కానీ అదే కరెంటును ఇచ్చే ఇన్వర్టర్‌ బ్యాటరీ ధ్రువాలను పట్టుకుంటే షాక్‌ కొట్టదు ఎందుకు?

జవాబు:  విద్యుత్‌ వల్ల మనకు షాక్‌ కొడుతుందా? లేదా అన్న విషయం విద్యుత్‌ ప్రవాహం మీద కన్నా, విద్యుత్‌ పొటన్షియల్‌ మీద ఆధారపడుతుంది. ఆ పొటన్షియల్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదం. సాధారణ ప్రమాదస్థాయిలో పొటన్షియల్‌ ఉన్నా, డి.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలకన్నా అదే పొటన్షియల్‌ ఉన్న ఎ.సి. కరెంటును ఇచ్చే ధ్రువాలు మరింత ఎక్కువ ప్రమాదం. మామూలు ఇన్వర్టర్‌ బ్యాటరీలో (+) గుర్తుకు (-) గుర్తుకు మధ్య పన్నెండు వోల్టుల డి.సి. కరెంటు తరహా విద్యుత్‌ పొటన్షియల్‌ భేదం ఉంటుంది. అటువంటి ధ్రువాలను కుడి, ఎడమ చేతులతో పట్టుకుంటే ప్రమాదం ఉండదు. చాలా మంద్ర స్థాయిలో విద్యుత్‌ మన శరీరం గుండా ప్రయాణించినా అది హానికర స్థాయిలో ఉండదు. అదే డి.సి. బ్యాటరీ కరెంటును ఇన్వర్టర్‌ ద్వారా ఎ.సి. విద్యుత్తుగా 230 వోల్టులకు మారుస్తారు. అలాంటి స్థితిలో న్యూట్రల్‌ (N)ధ్రువాన్ని, లైన్‌ (L)ధ్రువాన్ని వేర్వేరు చేతులతో పట్టుకుంటే మన శరీరంలోని జీవభౌతికరసాయనిక చర్యలు(bio physical and bio chemical actions)తాత్కాలికంగా స్తంభిస్తాయి. ఇలాంటి చర్య ఓసారి గుండెను, మెదడును అచేతనం చేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

గబ్బిలాలు రాత్రి పూటనే ఎందుకు సంచరిస్తాయి? పగలు కన్నా రాత్రి బాగా కనిపిస్తుందా?

జవాబు: పగలైనా, రాత్రయినా గబ్బిలాలు చూడలేవు. వాటికి కళ్లున్నా అవి నామమాత్రమే. కాంతిని గ్రహించే శక్తి వాటికి లేదు. అవి కేవలం నోరు, చెవుల సమన్వయంతో మాత్రమే పరిసరాలను అంచనా వేయగలవు. అంటే ఒక విధంగా అవి చెవులతో చూస్తాయని చెప్పవచ్చు. అలాగని గబ్బిలాలు తమ కళ్ల ద్వారా చూడలేవని అనుకోకూడదు. వాటి కళ్లు వెలుగు, చీకటుల తేడాను గుర్తించగలవు. తద్వారా వస్తువుల ఆకృతులను తెలుసుకోగలవు. అంతే కాకుండా గబ్బిలాలు తాము అంతకు ముందు సంచరించిన ప్రాంతాలను సులువుగా గుర్తుపెట్టుకోగలవు.
గబ్బిలాలు నోటితో అతిధ్వనులను (ultrasonic sounds) చేస్తాయి. మనకి వినబడని ఆ ధ్వని తరంగాలు గాలిలో ప్రయాణిస్తూ దారిలో ఎదురయ్యే అడ్డంకులను ఢీకొని వెనుదిరుగుతాయి. అలా వెనక్కి వచ్చే ప్రతిధ్వని తరంగాలను వినడం ద్వారా గబ్బిలాలు తమ పరిసరాల్లో ఎలాంటి అడ్డంకి ఉందో గ్రహించగలుగుతాయి. ఇలా అవి గాలిలో వేలాడదీసి ఉన్న సన్నని తీగెలను కూడా తప్పించుకుని ఎగరగలగడం విశేషం. రాత్రిపూట సంచరించే నిశాచర (nocturnal) జంతువులైన ఎలుకలు, నక్కలు, గుడ్లగూబల కోవలోకే గబ్బిలాలు కూడా వస్తాయి కాబట్టి అవి రాత్రులే సంచరిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

అన్ని పక్షులు వాటి పిల్లలకు పాలు ఇవ్వవు. కానీ గబ్బిలం మాత్రం పిల్లలకు పాలు ఇస్తుంది. ఇది కూడా పక్షే కదా?

జవాబు: గబ్డిలం పక్షి కాదు. పక్షిలాగా రెక్కలున్న ఓ క్షీరదం(mammal) . ఇది కైరాప్టెరా అనే క్రమానికి చెందిన పాలిచ్చే జంతువు. ముందు వెనక కాళ్లవేళ్ల మధ్య బాతు కాళ్లకున్నట్టు చర్మపైపొర ఉండడం వల్ల ఇది పక్షిలాగా ఎగరగలదు. పదునైన కొక్కెంలా ఉన్న గోళ్లసాయంతో చెట్ల కొమ్మలకు తలకిందులుగా వేలాడుతుంది. దీనికి కళ్లున్నా గుడ్డిది. తన నోటితో తానే అతి ధ్వనులను (ultrasonic sounds) చేస్తూ ఆ ధ్వనుల ప్రతిధ్వనుల (echos)ను వినడం ద్వారా పరిసరాలను, వస్తువులను ఆహారాన్ని చూస్తుంది. మిగిలిన క్షీరదాలలోలాగానే ఆడ, మగ లైంగికత ఉంది. ఆడ గబ్బిలం గర్భం ధరించి పశువులు, మనుషులలాగానే పిల్లల్ని కంటుంది. తడవకు ఒకే బిడ్డను కంటుంది. ఆడమగ గబ్బిలాలు కలుసుకున్నా ఆహారం సమృద్ధిగా దొరికే వరకు ఫలదీకరణం జరగకుండా శుక్రకణాల్ని, అండాన్ని విడివిడిగా తన శరీరంలోనే ఉంచుకోగల అద్భుత సామర్థ్యం ఆడగబ్బిలాలకు ఉంది. బిడ్డ గబ్బిలం తనలాగే ఎగిరే వరకు తల్లి పాలిచ్చి పోషిస్తుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

చలికాలంలో బ్యాటరీలు సరిగా పనిచేయవు. ఎందుకని?

జవాబు: బ్యాటరీలో ఉండే రెండు లోహపు పలకల మధ్య రసాయనిక చర్యల ద్వారా ఎలక్ట్రాన్లు ప్రవహించే తీరును బట్టి అది ఉత్పత్తి చేసే విద్యుత్‌ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాటరీలలో జింకు, రాగి లోహపు పలకలను వాడతారు. వీటిని ఎలక్ట్రాన్లు సులువుగా ప్రవహించే ద్రవంలో ఉంచుతారు. వీటి మధ్య జరిగే రసాయనిక చర్యల ఫలితంగా ఎలక్ట్రాన్ల ప్రవాహం మొదలై ఎక్కువ మోతాదులో రాగి పలకపైకి చేరుకుంటాయి. ఇవే బ్యాటరీని అనుసంధానం చేసిన విద్యత్‌ వలయంలో కూడా ప్రవహిస్తాయి. చలికాలంలో, వర్షాకాలంలో వాతవతరణంలో ఉండే చల్లదనం వల్ల ఉష్ణోగ్రత తగ్గి రసాయనిక చర్య వేగం మందగించడంతో బ్యాటరీలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం తక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో వాటిని కొంచెం వేడి చేస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. చలికాలంలో మోటారు వాహనాలు వెంటనే స్టార్ట్‌ కాకపోవడానికి కూడా ఇదే కారణం.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్.

మనం వేళ్లు విరిచినపుడు శబ్దం ఎందుకు వస్తుంది?

జవాబు: చేతి వేళ్లలో ఎన్నో కీళ్ల (joints)తో కూడిన ఎముకలుంటాయి. జీవనిర్మాణ శాస్త్రం (anatomy) ప్రకారం వీటిని జారుడు కీళ్లు(gliding joints) అంటాము.నిజానికి ఐదువేళ్ల ఎముకలు ఈ కీళ్ల సాయంతో విడివిడి గొలుసుల లాగా ఉంటాయి. వేళ్లు కదిలేటప్పుడు కీళ్ల దగ్గరే ఎముకలు అటూ ఇటూ కదులుతాయి. కదిలే యంత్ర భాగాల వద్ద ఘర్షణను నివారించడానికి ఎలాగైతే కందెనలు (lubricants) వాడతామో, అలాగే మన వేళ్ల ఎముకులు కదిలే కీళ్ల దగ్గర ఒక రకమైన చిక్కని ద్రవం (మ్యూకస్‌) ఉంటుంది. కదలికల కారణంగా జీవన ప్రక్రియల్లో భాగంగా ఇందులో అప్పుడప్పుడు అతి చిన్న పరిమాణంలో గాలి బుడగలు ఏర్పడతాయి. మనం వేళ్లను మిటకరించినప్పుడు ఈ గాలి బుడగలు పగిలి ఆ ద్రవంలో చెదిరిపోతాయి. అప్పుడే శబ్దం ఏర్పడుతుంది.

భూమి పైన అన్నింటి కన్నా పెద్ద పక్షి ఏది?

భూమి మీద ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులన్నింటి కెల్లా అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ కళ్లు 50 మిల్లీమీటర్ల (రెండు అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటాయి. ఆస్ట్రిచ్ కాళ్లు, మెడ చాలా పొడవుగా ఉండటం వలన ఇది చాలా ఎత్తుగా ఉంటుంది. ఆస్ట్రిచ్‌లు దాదాపు 1.8 నుంచి 2.75 మీటర్ల (ఆరు నుంచి తొమ్మిది అడుగులు) ఎత్తు, బరువు 63 నుంచి 130 కిలో గ్రాములు ఉంటుంది. కొన్ని మగ ఆస్ట్రిచ్‌లు 155కిలో గ్రాములు వరకు బరువు ఉంటాయి. ఆస్ట్రిచ్ కళ్లు పెద్దవిగా ఉండటం వలన అవి చాలా దూరంలో ఉన్న శత్రువులను కూడా సులభముగా కనిపెట్టగలవు.
శత్రువులను చూసిన వెంటనే ఆస్ట్రిచ్‌లు నేలపై పడుకుంటాయి లేదా పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు గంటకు 60 నుండి 72.4 కిలోమీటర్ల (45 మైళ్ల ) వేగంతో పరుగెత్తుతాయి. ఆస్ట్రిచ్‌లు నిలువకుండా 30 నిమిషాలు పరుగెత్త గలవు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఏది ?


నదులపై ఆనకట్టలు కడతారని తెలుసుగా? మరి ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట ఎక్కడుందో తెలుసా? చైనాలో! దీని నిర్మాణం ఈమధ్యనే పూర్తయిన సందర్భంగా సంగతులేంటో చూద్దామా!
పదిహేనేళ్లుగా ఆ ఆనకట్ట నిర్మాణం జరుగుతూనే ఉంది... దాదాపు పాతిక వేల మంది కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు... 1994 నుంచి నిర్విరామంగా జరుగుతున్న పని వల్ల ఇప్పటికి దాని నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చింది. మొన్ననే నీటిని వదిలి పరీక్షించి చూశారు కూడా. అదే చైనాలోని 'త్రీ గార్జెస్‌ డ్యామ్‌'. మూడు దశలుగా నిర్మించిన ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్‌ మాత్రమే కాదు, అతి పెద్ద జల విద్యుత్‌ కేంద్రం కూడా. దీనిని కట్టడానికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా? 180 బిలియన్ల యెన్‌లు. అంటే మన రూపాయలో సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయలు!ఈ ఆనకట్ట విస్తీర్ణం ఒకటిన్నర మైలు కాగా, ఎత్తు 600 అడుగులు.
ఈ ఆనకట్ట ఏకంగా 40 బిలియన్ల ఘనపు మీటర్ల నీటిని నిల్వ చేయగలదు! అంటే ఎంతో తెలుసా? ఆ నీటినంతా ఒక పెద్ద ఘనాకారమైనగదిలో ఉంచాలనుకుంటే ఆ గది కొలతలు సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు ఉండాలి! ఇక ఆ డ్యామ్‌ నిర్మాణానికి మొత్తం 160 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీటును వాడారు.
ఈ ఆనకట్టలో నిల్వ చేసిన నీటిని ఉపయోగించి 150 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇంతే విద్యుత్‌ను బొగ్గు ఆధారితమైన విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి చేయాలంటే అందుకు ఏటా 310 లక్షల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. అంటే, ఈ ఆనకట్ట పరోక్షంగా అంత బొగ్గు వినియోగాన్ని ఆదా చేస్తుందన్నమాట. ఇందువల్ల వాతావరణంలోకి విడుదలయ్యే పది కోట్ల టన్నుల వాయు కాలుష్యాన్ని ఇది ఆపుతున్నట్టే.
అయితే చైనాలో ఈ ఆనకట్టను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. దీని వల్ల పది లక్షల మందికి పైగా జనాల్ని వారి నివాస ప్రాంతాల నుంచి తరలించాల్సి వచ్చింది. ఆనకట్ట పూర్తిగా వినియోగంలోకి వస్తే 13 పట్టణాలు, 4500 గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది?


అతి పెద్ద గడియారంలో అన్నీ వింతలే!
1983 అడుగుల ఎత్తయిన టవర్‌... నాలుగువైపులా నాలుగు గడియారాలు... 20 లక్షల విద్యుద్దీపాలు... 12,000 కోట్ల రూపాయల ఖర్చు! అన్నీ కలిపితే.... అది ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం!
ప్రపంచంలోనే అతి పెద్ద గడియారం ఎక్కడుంది? ఈ ప్రశ్నకి కొత్త సమాధానం తెలుసుకోండి. సౌదీ అరేబియాలోని మక్కాలో దీన్ని ఈమధ్యనే ప్రారంభించారు. సుమారు 600 మీటర్ల (1983 అడుగులు) ఎత్తయిన టవర్‌పై నాలుగువైపులా కనిపించేలా నాలుగు భారీ గడియారాలను ఏర్పాటు చేశారు. ఒకో గడియారం వ్యాసం 151 అడుగులు ఉంటుంది. మక్కాలో ప్రపంచంలోనే అతిపెద్ద మసీదు ఉన్న సంగతి తెలుసుగా? అక్కడే రంజాన్‌ పండుగ సందర్భంగా ఆవిష్కరించిన ఈ గడియారం నిర్మాణానికి 3 బిలియన్‌ డాలర్ల ఖర్చయింది. అంటే మన రూపాయల్లో 12000 కోట్ల రూపాయలన్నమాట.
ఇన్నాళ్లూ అతి పెద్ద గడియారం రికార్డు దేనిదో తెలుసా? ఇస్తాంబుల్‌లో 108 అడుగుల వ్యాసంతో ఉన్న సెవాహర్‌ మాల్‌ క్లాక్‌ది. ఇప్పుడు ఈ రికార్డు మక్కా గడియారం సొంతమైందన్నమాట. ఈ గడియారాలను ఏర్పాటు చేసిన 'మక్కా క్లాక్‌ రాయల్‌ టవర్‌'లో 76 అంతుస్థులు ఉన్నాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న దీనికి త్వరలో మరిన్ని రికార్డులు దక్కుతాయి. అవేంటో తెలుసా? ప్రపంచంలోనే రెండో ఎత్తయిన భవనం (బుర్జ్‌ దుబాయ్‌ తర్వాత), ప్రపంచంలో అతి ఎత్త్తెన హోటల్‌, ప్రపంచంలోనే ఎక్కువ చదరపు అడుగుల విస్తీర్ణం గల జనావాస భవనం ఇదే కాబోతోంది.
మక్కా మసీదుకు అధిపతి అయిన రాజు అబ్దుల్లా ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ దీని రూపకల్పన చేసింది. గడియారాల చట్రాలన్నీ బంగారంతో చేసినవే. ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిని 9 కోట్ల రంగు గాజు ముక్కలతో అలంకరించారు. మొత్తం గడియారాలపై 20 లక్షల లెడ్‌ బల్బులను ఏర్పాటు చేశారు. గడియారాలపై 'అల్లా' అక్షరాలను 21 వేల ఆకుపచ్చ విద్యుత్‌ బల్బులతో ముస్తాబు చేశారు. ముస్లిములు ప్రార్థనలు జరిపే సమయాల్లో రోజుకు అయిదు సార్లు ఇవి వెలుగుతాయి. ఈ గడియారాలు 25 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తాయి. గడియారాలను దగ్గరగా చూసేందుకు వీలుగా టవర్‌పైకి లిఫ్టులు ఉంటాయి. టవర్‌ పైభాగంలో బంగారు చంద్రవంక రూపంలో ఏర్పాటుచేసిన లేజర్‌ కిరణాల వెలుగులు ఆకాశంలోకి 10 కిలోమీటర్ల దూరం వరకూ కనిపించేలా ప్రకాశిస్తాయి.

ఆ కలువ పువ్వు సంగతేమిటి?

దోసిలిలో ఒదిగే అందమైన కలువ పువ్వుల్ని చూశాం. మరి ఏకంగా 91 అడుగుల పొడవుండే కలవపువ్వు గురించి తెలుసా? చూడాలనుకుంటే కేరళ వెళ్లాల్సిందే. అసలేంటా కలువపువ్వు? తెలుసుకుందాం రండి.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌, ఈజిప్టులోని పిరమిడ్‌లు, ఢిల్లీలో అందమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న హూమయూన్‌ టూంబ్‌ ఇవన్నీ ఎవరో ఒకరి స్మారక నిర్మాణాలే. ఇలా చక్కని కట్టడాలని ఆప్తుల కోసం కట్టించడం మనకు తెలిసిందే. అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఓ స్వామిజీ మీద ప్రేమతో ఆయన శిష్యులు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. పెద్ద కలువ పువ్వు ఆకారంలో ఉన్న ఇది మ్యూజియం కూడా. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద స్మారక భవనాల్లో ఒకటిగా పేరు తెచ్చుకోనుంది. కొన్ని కిలో మీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. దీనిని ఈ రోజే మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ ప్రారంభిస్తున్నారు.
రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన చలువరాయితో దీన్ని నిర్మించారు. సుమారు లక్ష చదరపు అడుగుల చలువరాయిని ఉపయోగించారని అంచనా. ఈ కలువ పువ్వు ఎత్తు 91 అడుగులు, వెడల్పు 84 అడుగులు. లోపలి భాగంలో 12 గదులు ఉంటాయి. అందులో స్వామీజీ వాడిన వస్తువులను భద్రపరిచారు. కలువ పువ్వుకి ఉండే 21 రేకుల్లో, 12 పైకి ఉంటే, 9 పూర్తిగా కిందికి ఉంటాయి. పైకి ఉండే ఒకో రేకు పొడవు 41 అడుగులు ఉంటే, కిందికి ఉండేవి 31 అడుగుల పొడవుతో ఉంటాయి. దీనిని నిర్మించడానికి మొత్తం 50 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అందులో లోపల నిర్మించిన ప్రత్యేకమైన గదులకి, వస్తువులకే 20 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా. దీని లోపల 27 అడుగుల ఎత్తులో పై కప్పు ఉంటుంది.
దీన్ని ఎవరికోసం కట్టారో ఆ స్వామిజీ కరుణాకర గురూ చరిత్ర కూడా ఆసక్తికరమే. వెనుకబడిన కులంలో పుట్టి 42 ఏళ్ల వయసు వరకు వంటవాడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత స్వామీజీగా గుర్తింపు పొందారు. తిరువనంతపురంలోని పోతెన్‌కోడ్‌ గ్రామంలో 1968లో శాంతిగిరి ఆశ్రమాన్ని స్థాపించారు. అందులోకి కుల, మత భేదాలు లేకుండా అందరినీ ఆహ్వానించారు. ఆశ్రమంలో పర్ణశాలగా పిలుచుకునే చిన్న గుడిసెలో ఆయన అధిక సమయం ధ్యానంలోనే గడిపేవారు. స్వామిజీ నిరాడంబర జీవితానికి ప్రభావితులైన మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ తన ఇంటిని ఆశ్రమానికి విరాళంగా కూడా ఇచ్చారు. 1999లో స్వామిజీ పరమపదించగా ఆయన శిష్యులు పర్ణశాల స్థలంలో స్మారక భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు. అలా 2000లో పని మొదలు పెడితే ఇప్పటికి పూర్తయింది.

చెట్ల మీద ఉండే పక్షులు రాత్రిపూట కింద పడకుండా ఎలా నిద్ర పోగలుగుతాయి?

జవాబు: అన్ని ప్రాణుల్లాగే పక్షులకు నిద్ర అవసరమే. ఆహారం తీసుకున్న తర్వాత, రాత్రిపూట తమ స్థావరాల్లో పక్షులు నిద్రపోతాయి. గూళ్లు కట్టుకుని కొన్ని పక్షులు అందులో నిద్రపోతే, మరికొన్ని చెట్ల కొమ్మలమీదే నిలబడి నిద్రిస్తాయి. ఒక్కోసారి ఒంటికాలిమీద నిలబడి ఏమాత్రం కిందపడకుండా ఉంటాయి కూడా. పక్షుల కాళ్లలో ఒక ప్రత్యేకమైన నరాల నిర్మాణం ఉంటుంది. అదే వాటిని కొమ్మల మీద నిద్రపోయినా కిందపడకుండా కాపాడుతుంది. పక్షుల కాళ్లలో సులభంగా వంగే బలమైన మెత్తని నరాలుంటాయి. ఇవి పక్షుల కాళ్లలో తొడభాగంలోని కండరాలనుంచి మోకాళ్లద్వారా కాలి చివరి వరకు అక్కడి నుంచి మడమచుట్టూ వ్యాపించి కాలివేళ్ల కింద దాకా ఉంటాయి. కొమ్మలపై వాలగానే పక్షుల శరీరపు బరువు వాటిని మోకాళ్లపై వంగేట్టు చేస్తుంది. అప్పుడు కాళ్లలోని నరాలు వాటంతటవే బిగుసుకుపోతాయి. దాంతో కాలిగోళ్లు ముడుచుకొని చెట్టు కొమ్మలను గట్టిగా పట్టేసుకుంటాయి. కాళ్లని నేరుగా సాచేదాకా ఆ పట్టు జారదు. అందువల్లే పక్షులు కిందపడిపోకుండా కొమ్మలపై నిద్రపోగలుగుతాయి. పక్షుల కాలిగోళ్లు కొమ్మలను ఎంత బిగువగా పట్టుకుంటాయంటే ఒకవేళ అవి అక్కడ చనిపోయినా కిందకు వేలాడుతూనే ఉంటాయిగానీ కిందపడిపోవు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో చోటికి ఎలా వలస పోతాయి?

జవాబు : ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. సముద్రాలను దాటి వలసపోయే ముందు పక్షులు సముద్ర తీరంలో ఒక నిర్ణీత ప్రాంతంలో గుమిగూడుతాయి. తర్వాత వాటి దృష్టి వ్యవస్థ ఆధారంగా సముద్రాలను దాటుతాయి. వాటి తలలో మాగ్నటైట్‌ అనే సూక్ష్మకణాలు అయస్కాంత సూచికలాగా పనిచేయడంతో ఆ ప్రభావం వల్ల భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగడుతూ, దానికి అనుగుణంగా దృష్టి వ్యవస్థను అనుసంధానించుకుని ముందుకు సాగుతాయి. ఆపై సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తాము వలసపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

కరెంటు తీగను తాకితే మనిషికి షాక్‌ కొడుతుంది. కానీ పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు. ఎందుకు?

జవాబు: ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే స్తంభాలకు సాధారణంగా నాలుగు తీగలు ఉంటాయి. అందులో మూడు తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది. ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి. ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో రెండు తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు కూడా అడపాదడపా జరుగుతూ ఉంటాయి.కలర్ టీవీ తెర అంచు చుట్టూ నల్లటి పట్టీ ఉంటుంది ఎందుకు ? ఒక విధం గా చెప్పాలంటే రంగుల టీవీ తెర అంచు చుట్టూ కనిపించే నల్లని పట్టీ టీవీ లోని పిక్చర్ ట్యూబ్ కి రక్షణ కవచం లాంటిది . పిక్చర్ ట్యూబ్ లోపల ఉండేది శూన్య ప్రదేశం కాబట్టి అది టీవీ వెలుపల ఉండే వాతావరణ పీడనాన్ని తట్టుకోవాలి . పాతకాలం టీవీ లలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీల్డులు పిక్చర్ ట్యూబ్ చుట్టూ అమర్చి ఉండేవి . పిక్చర్ ట్యూబ్ కి లోపల ,వెలుపల ఉండే వాతావరణ పీడనాల తేడా వల్ల పేలుడు సంభవించకుండా ఇవి కాపాడేవి . . . కాని ఇప్పటి టీవీ లలో పేలుళ్ళ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్ షీల్దులకు బదులు " కిమ్ కోడ్ "అనే లోహపుచాత్రాన్ని పిక్చర్ ట్యూబ్ చుట్టూ తన్యతతో ఉండే పట్టీతో బిగిస్తున్నారు . మనకు తెర అంచుల చుట్టూ కనిపించే నల్లని పట్టీ ఇదే .

కృష్ణ ద్రవ్యము

జవాబు: ఈ విశాల విశ్వంలో, బ్రహ్మాండాలను (గెలాక్సీలను) ఒకటిగా ఉంచడానికి, అవి గుంపులుగా కదలడానికి ఎంత ద్రవ్యరాశి (Matter)కావాలో గణనలు చేయడం ద్వారా శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కానీ వారు గమనించిన ద్రవ్యం, విశ్వంలో ఉన్న ద్రవ్యంలో 4 శాతం మాత్రమే. కాబట్టి, ఆ కనిపించని, వెలుగునీయని ద్రవ్యాన్ని డార్క్‌మేటర్‌ (కృష్ణ ద్రవ్యము) అంటారు. ఈ ద్రవ్యము నల్లని మేఘాలు, ధూళి లేక కాలం తీరిన నక్షత్రాల (Dead Stars) రూపంలో ఉందనుకోవడం సరికాదు.
అతి నల్లని ద్రవ్యాన్ని కనుగొనే శాస్త్ర పరికరాలున్నప్పటకీ, ఈ కృష్ణ ద్రవ్యాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహా విస్ఫొటనం (బిగ్‌ బ్యాంగ్‌) తర్వాత జరిగిన కేంద్రక చర్యల (Nuclear reaction) ఆధారంగా విశ్వంలో ఎంత ద్రవ్యం ఉందనేదాన్ని శాస్త్రజ్ఞులు కచ్చితంగా లెక్కకట్టగలరు. ఈ లెక్కల వల్ల తేలిందేమంటే, ఇప్పుడు విశ్వంలో ఉన్న మొత్తం ప్రోటాన్ల, న్యూట్రాన్ల ద్రవ్యరాశి, మొత్తం విశ్వంలో ఉండాల్సిన ద్రవ్యరాశి కన్నా అతి తక్కువ అని. ఈ తప్పిపోయిన ద్రవ్యాన్వేషణ విశ్వజ్ఞాన శాస్త్రజ్ఞుల (Cosmolodist)ను కణభౌతిక శాస్త్రజ్ఞులను ఒక చోటికి చేర్చింది.
ఈ కృష్ణ ద్రవ్యరచన న్యూట్రాన్లు, న్యూట్రినోలు, పెక్సియన్‌ కణాలతో జరిగి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. కాని వాటి ఉనికిని ఇంతవరకు కనిపెట్టలేదు. కారణం ఈ మూడు రకాల కణాలలో విద్యుదావేశం శూన్యం కాబట్టి, అవి వాటిపై పడే కాంతిని శోషణం (absorb) చేయడం కాని, పరావర్తనం (reflection) చేయడంగాని చేయలేవు. అందువల్లనే ఆ కణాలతో నిర్మితమైన ఆ ద్రవ్యం కనిపించదు. కానీ కృష్ణద్రవ్యం మహా విస్ఫోటన ధాటికి తట్టుకుని విశ్వంలో నిశ్చలంగా ఉంది.

మన దేహంలో రక్తకణాలు ఎలా ఏర్పడతాయి?

జవాబు: శరీరంలోని రక్తంలో ఉండే ఎర్రరక్తకణాలు, రక్త పట్టీలు (ప్లేట్లెట్స్‌), సుమారు 70 శాతం తెల్ల రక్త కణాలు ఎముకల్లో ఉండే మూలగ (Bone Marrow) నుంచి తయారవుతాయి. మిగతా తెల్లరక్త కణాలు రససంబంధిత ధాతువుల (lymphatic tissues) నుంచి తయారవుతాయి.
ఎర్ర కణాలు, తెల్లకణాలు, దేహంలో మొదటి నుంచి ఉండే వంశానుగత కణాలు (Stem Cells) ద్వారా క్రమేపీ జరిగే అతిక్లిష్టమైన పరివర్తనం వల్ల ఎముకల్లోని మూలగలో ఉత్పన్నమవుతాయి. మూలగలో ఉండే రక్తకణం కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఆ రక్తకణం మూలగ నుంచి వెలువడేటపుపడు తన కేంద్రకాన్ని పోగొట్టుకుంటుంది. అపుడా రక్తకణం అసంపూర్ణ కణం. అలా వెలువడిన కణం ఊపిరి తిత్తులలోని ప్రాణవాయువును గ్రహించి, దాన్ని కణ జాలాల్లోని (Tissue) కార్బన్‌ డై ఆక్సైడ్‌తో మార్పిడి చేసుకుంటుంది. రక్తకణాలు ముఖ్యంగా మూడు విధులను నిర్వర్తిస్తాయి. అందులో మొదటిది ఎర్రరక్త కణాలు ఆక్సిజన్‌ను రవాణా చెయ్యడమైతే, రెండవది తెల్ల రక్తకణాలు వ్యాధి నిరోధక కణాలుగా వ్యవహరించడం, మూడవది గాయాల నుంచి రక్తం అదేపనిగా కారిపోకుండా గడ్డ కట్టే ప్రక్రియలో తోడ్పడడం.
source : Eenadu news paper- ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

రక్తం ఎర్రగా ఎందుకుంటుంది?

జ : రక్తము ద్రరూపములో ఉండే కణజాలముల సమూహము . అందులో ప్లాస్మా , ఇతర అనేకరకాల కణాలు ఉంటాయి. తెల్లరక్త కణాలు , ఎర్రరక్తకణాలు , ప్లేట్లెట్స్  అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎర్రరంగులో ఉండే రక్తకణాలు మానవ రక్తం లో ప్రతి చుక్క లో 30 కోట్ల వరకూ ఉంటాయి. ఆ రక్త కణాలలో " హీమోగ్లోబిన్‌ " అనే వర్ణక పదార్ధమువలన రక్తానికి ఎర్ర రంగు వస్తుంది. మనము పీల్చిన గాలిలోని ఆక్సిజన్‌ ని తమలో నింపుకొని శరీర భాగాలకు అందించేవి ఎర్రరక్తకణాలు , అయితే ఇదే రక్తము వెన్నెముకలేని జీవులలో మనలో లా ఎర్రగా ఉండదు. నీలి , తెలుపు రంగులో ఉంటుంది. రక్తము రంగులో తేడా ఆ జీవుల రక్తములోని పదార్ధము వల్లనే వస్తుంది. హీమోగ్లోబిన్‌ ఉన్నరక్తమే ఎర్రగా ఉంటుంది.

బ్లూ గ్రొట్టో గుహ సంగతేమిటి?

సముద్ర తీరంలో ఓ గుహ... రాత్రంతా మామూలుగానే ఉంటుంది... సూర్య కిరణాలు పడగానే అద్భుతం బయట పడుతుంది! ఏంటా అద్భుతం...
ఎక్కడుందా గుహ?
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గుహలు. ఒకో దానిలో ఒకో అందం. కానీ ఆ గుహలోకి వెళితే మాత్రం అద్భుతమనిపిస్తుంది. గుహలోపలి భాగమంతా నీలి కాంతులతో మిలమిలలాడుతూ ఉంటుంది. ఆ కాంతులు ఏ విద్యుద్దీపాలో పెడితే వచ్చినవి కావు. సహజంగా సూర్యకిరణాల వల్ల కలిగినవే. ఆ గుహలోకి వెళ్లాలంటే సముద్రం మీద చిన్న పడవ వేసుకుని మాత్రమే వెళ్లాలి. ఇంత కష్టమైనా దేశదేశాల పర్యాటకులు దీన్ని చూసి ఆనందిస్తుంటారు.
ఇటలీ దగ్గర సముద్రంలో కాప్రి అనే దీవి ఉంది. అందులో సగం సముద్రంలో మునిగి ఉంటుందీ గుహ. పేరు 'బ్లూ గ్రొట్టో'. ప్రపంచ భౌగోళిక వింతల్లో ఒకటిగా పేరుపొందిన ఇది ప్రాచీన రోమన్లకు కూడా తెలుసు. అప్పట్లో దీన్ని దెయ్యాల గుహ అనేవారు. అందులోకి నీలి కాంతి ఎలా వస్తుందో తెలియక వాళ్లు దేవతల విగ్రహాలను అక్కడ పెట్టి భయభక్తులతో పూజించేవారు.
ఇంతకీ ఈ గుహలోకి కళ్లు మిరుమిట్లు గొలిపేంత నీలిరంగు ఎలా వచ్చింది? ఇందులోకి చొచ్చుకొచ్చిన సముద్ర జలాలన్నీ నీలం రంగులో ఉంటాయి. వాటి మీద పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది మరింత నీలి రంగును వెదజల్లుతాయి. గుహ లోపలి భాగమంతా తళతళలాడే నీలి రంగు కాంతులతో నిండిపోయి వింతగొలుపుతుంది. నీలం రంగు రాళ్లు తెలుసుగా? అంత ముదురైన నీలి రంగు అక్కడ పరుచుకుంటుంది. గుహకి కేవలం రెండే రంధ్రాలు ఉన్నాయి. ఒకటి పడవలతో వచ్చే దారి. ఒకసారి ఒక పడవ మాత్రమే పడుతుంది. మరొకటి మొదటి దానికి పదిరెట్లు పెద్దగా వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ రెండు దారుల అమరిక, వాటిలోంచి వచ్చే సూర్యకిరణాల సమ్మేళనం వల్ల గుహలో అద్భుతం ఏర్పడుతుంది. లోపలి గుహ చాలా విశాలంగా, 177 అడుగుల పొడవుంటుంది. లోపల నీళ్లు ఈతకొలనులో ఉన్నంత ప్రశాంతంగా ఉండడంతో చాలా మంది ఈతలు కొడతారు.
జర్మన్‌ రచయిత ఆగస్ట్‌ కోప్షీ 1826లో దీన్ని కనుగొన్నాడు. మిత్రులతో సముద్రంలో ప్రయాణిస్తూ ఓ మత్స్యకారుడి సాయంతో ఇందులోకి వెళ్లాడు. ఆయన దీనిపై ఓ పుస్తకం రాయడంతో ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. పరిశోధనలు చేస్తే ప్రాచీన రోమన్లకు వేల ఏళ్ల క్రితమే దీని గురించి తెలుసినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తు పూర్వం రోమ్‌ను పాలించిన టిబీరియస్‌ చక్రవర్తి దీన్ని వ్యక్తిగత ఈతకొలనులా వాడేవాడు. సామాన్యులు మాత్రం దీన్నొక
దెయ్యాల గుహనుకునే వాళ్లు. అప్పట్లో దీన్ని నిషేధిత ప్రదేశంగా ప్రకటించారు.

ఆధారము: ఈనాడు మరియు డా.వందనా శేషగిరిరావు గారి బ్లాగు :  ఎందుకు?ఏమిటి?ఎలా?

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate