অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ విజ్ఞానం I

శాస్త్రీయ విజ్ఞానం I

 1. శరీరములో కణాలు మృతిచెందవా?
 2. ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది?
 3. ఒక లోహపు పాత్ర నిండా నీటిని నింపి వేడి చేస్తే ముందుగా పాత్ర లోని నీటి మట్టము కొంచము తగ్గి ఆ తరవాత పెరుగు తుంది . ఎందుకు ?
 4. బంబార్డియర్‌ బీటిల్ సంగతేమిటి ?
 5. ఎవరినైనా చెంపపై 'ఛెళ్లు' మని కొడితే,వాతలు తేలుతాయి. ఎందుకు?
 6. మనం ఊపిరి తీసుకుని బయటికి వదిలినపుడు ముక్కు నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది?
 7. గంటలకు కంచు ఎందుకు వాడారారు ?
 8. ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు?
 9. బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎందుకు పగలవు?
 10. కాల్చిన ఇటుకలు పచ్చిమట్టి కన్నా గట్టిగా ఉంటాయి. ఎందుకు?
 11. సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?
 12. సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా?
 13. ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు?
 14. దిగుడు బావుల నగరము అంటారెందుకు ?
 15. ఒంటె పాలతో పెరుగు తయారవదు అంటారు. ఎందుకని?
 16. ఒంటె కు కోపం వస్తే ఎదుట వారి మీద ఉమ్మేస్తుందంటారు . నినమేనా?
 17. కర్పూరం గొప్పేంటి?
 18. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు పక్షులు వాటిని తెలుసుకుంటాయంటారు. ఎలా పసిగడతాయి?
 19. విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?
 20. మాట్లాడేటప్పుడు వూపిరి పీల్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకని?
 21. మనిషి జీవించడానికి ఆక్సిజన్‌ అవసరం కదా? మరి చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?
 22. ఇంద్రజాలం చేసేవారు కన్ను మూసి తెరిచేలోగానే చేతుల్లో వస్తువుల్నిమార్చుకుని అవే మారినట్టు నమ్మిస్తారు. అతి వేగంగా పనిచేసే కెమేరాతో ఆ మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?
 23. చంద్రుడిపై గాలి లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆక్సిజన్‌ తీసుకెళితే ఏమవుతుంది? మానవ నివాసానికి సాధ్యమవుతుందా?
 24. మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?
 25. కొవ్వొత్తి ఆర కుండా ఎలా వెలుగుతుంది ?
 26. గాలిలోని ఆక్సిజన్‌ వల్ల మంట మండుతుంది. కానీ వెలుగుతున్నకొవ్వొత్తిని వూదితే ప్రకాశంగా వెలగాలి గానీ ఆరిపోతుంది. కారణం తెలపండి?
 27. మొక్కల్లో హరిత రేణువులు ఉండడం వల్ల అవి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాయి కదా. మరి వాటిని జంతువుల్లో ప్రవేశపెడితే వాటంతట అవి ఆహారాన్ని తయారుచేసుకోగలవా?
 28. కార్ల ప్రధాన లైట్లను పలకలుగా ఉండే పెట్టెల్లో పెడుతున్నారెందుకు?
 29. సినిమాల్లో కార్లు వేగంగా వెళ్ళే దృశ్యం చూస్తున్నపుడు , కారు చక్రాలు మొదట్లో ఒక దిశలో తిరిగి మల్లి వెనక్కు తరిగినట్లు కనిపిస్తాయి . ఎందువల్ల ?
 30. మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

శరీరములో కణాలు మృతిచెందవా?

జ : శరీరమంటేనే కణాల సముదాయము .ఇందులో ప్రతి కణానికీ మరణము ఉంటుంది. ఒక్కొక్క రకము కణానిది ఒక రకమైన ఆయుర్ధాయము . మనకు తెలియకుండానే మన శరీరములో కణాలు మరణించడము , వాటి స్థానము లో కొత్త కణాలు పుట్టుకురావడము జరుగుతుంటుంది .పేగు పైపొర కణాలు ప్రతి 5 రోజులకు పాత వాటిస్థానములో కొత్తవి వస్తుంటాయి.తెల్ల రక్తకణాలు 2 నుండి 4 సం.లు ,ఎర్ర రక్త కణాలు 90-120 రోజులు లలో మృతిచెందుతాయి.,మన చర్మము మీద ఉన్న కణాలు ప్రతి 15 నుండి 20 రోజులకొకసారి కొత్తవి వస్తుంటాయి.

ఆవిరి పైకే ఎందుకు వెళుతుంది?

జవాబు: నీటి ఆవిరి వంద డిగ్రీల సెల్సియస్‌ కన్నా అధిక ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది.దీని సాంద్రత తక్కువగా ఉంటుంది. సాధారణ గాలి వేసవి కాలంలో అయినా 45 డిగ్రీల సెల్సియస్‌కు మించదు. అందువల్ల వేడి నీటి ఆవిరి సాంద్రత తక్కువగా ఉంటుంది. ప్లవన సూత్రాల ప్రకారం తక్కువ సాంద్రత గల పదార్థాలు, ఎక్కువ సాంద్రతగల ప్రాంతాలపైకి విస్తరిస్తాయి. అందువల్ల వేడి ఆవిర్లు పైపైకే పాకుతాయిగానీ, కిందివైపునకు పడవు. పైకి పాకుతున్న క్రమంలో ఉష్ణోగ్రత సమతాస్థితి పొంది గాలిలో సమానంగా ఆవిరి కలిసిపోతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ఒక లోహపు పాత్ర నిండా నీటిని నింపి వేడి చేస్తే ముందుగా పాత్ర లోని నీటి మట్టము కొంచము తగ్గి ఆ తరవాత పెరుగు తుంది . ఎందుకు ?

జ: పదార్దాల గుండా ఉష్ణము ప్రవహించే విధానాన్ని " ఉష్ణ లక్షణము (thermal conductivity)" అంటారు . పదార్ధాలను వేదిచేసినపుడు వాటి ఘనపరిమాణము సాధారణము గా వ్యాకోచిన్చదాన్ని 'ఉష్ణ యాంత్రిక (thermal expansivity)' అంటారు . నీటి విసయము లో ఈ రెండు సమన్వయము గా పని చేస్తాయి. లోహాలకు నీటికన్నా అధిక వాహకత్వ లక్షణము ఉంటుంది . అందువల్ల మొదట లోహపాత్రకు ఎక్కువ ఉష్ణము వెళ్లి అది త్వరగా వేడెక్కుతుంది ... కాబట్టి నీటి కన్నా ముందే పాత్ర వ్యాకోచిస్తుంది . .. అంటే పాత్ర ఘనపరిమాణము పెరుగు తుంది . అంతే తీవ్రత తో నీటి ఘన పరిమాణము వ్యకోచిన్చకపోవడం వల్ల మొదట్లో నీటి మట్టము తగ్గుతుంది . క్రమేపి ఉష్ణము నీటికి తాకి పాత్ర , పాత్ర లోని నీరు .. ఉష్ణోగ్రత పరంగా సమతుల్యాన్ని (thermal equilibrium) చేరు కుంటాయి . అయితే ఘన పదార్ధాల కన్నా ద్రవ పదార్ధాలకు ఉష్ణ వ్యాకోచ గుణము ఎక్కువ , ఒకే రకమైన ఉష్ణోగ్రతా వృద్దిని (temperature rise) ఇస్తే అంతే ఘన పదార్ధమైన పాత్ర కన్నా ... ద్రవ పదార్ధమైన నీరు బాగా వ్యాకోచిస్తుంది ... కాబట్టి వేడి చేస్తున్న సమయము లో క్రమముగా నీటి ఘనపరిమాణము పాత్ర ఘనపరిమాణము కన్నా బాగా పెరుగు తుంది .
నీరు ఎక్కువ సేపు మరిగిస్తే ఆవిరై నీరు పరిమాణము తగ్గును . పై న చెప్పిన సిద్ధాంతము వేడిచేయు మొదటిలోనే జరుగుతాయి .

బంబార్డియర్‌ బీటిల్ సంగతేమిటి ?

బంబార్డియర్‌ బీటిల్ సంగతేమిటి చూడ్డానికి చిన్న కీటకమే. కానీ దాని దగ్గర ఓ ఆయుధం ఉంది. పట్టుకోడానికి వెళ్తే ఓ ద్రవాన్ని మీదకి చిమ్ముతుంది. అదెంత వేడిగా ఉంటుందో తెలుసా? 100 డిగ్రీల సెల్సియస్‌! అంటే నీరు మరిగే ఉష్ణోగ్రతన్నమాట. దాని పేరు బంబార్డియర్‌ బీటిల్‌. పైగా ఈ వేడి ద్రవాన్ని సుమారు 20 సెంటీమీటర్ల దూరం చిమ్మగలదు. ఇంతకీ ఆ ద్రవం ఏమిటో తెలుసా? హైడ్రోక్వినాన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ రసాయనాల మిశ్రమం. దాని పొత్తి కడుపులో రెండు వేర్వేరు గదుల్లో ఈ రసాయనాలు ఉంటాయి. కావాలనుకున్నప్పడు ఇది కండరాలు బిగించి వీటిని కలిపి బైటకి పిచికారీ చేయగలదన్నమాట. ఇక దీనికి భయం ఏమిటి చెప్పండి? తిందామని ఆశగా వచ్చిన ఏ జంతువైనా సరే దీని పిచికారీకి పిచ్చెక్కి పలాయనం చిత్తగిస్తుంది! ఉత్తరమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్‌, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో కనిపించే ఈ కీటకాలు సుమారు రెండు సెంటీమీటర్లుంటాయంతే.

ఎవరినైనా చెంపపై 'ఛెళ్లు' మని కొడితే,వాతలు తేలుతాయి. ఎందుకు?

జవాబు:  మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా తెల్లకణాలు నెట్టివేస్తాయి. ఈ ప్రక్రియలో చేతివేళ్లు తీవ్రంగా తాకిన చోట చెంప మీది చర్మం కమిలి వాతలు ఏర్పడతాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

మనం ఊపిరి తీసుకుని బయటికి వదిలినపుడు ముక్కు నుంచి వేడిగాలి ఎందుకు వస్తుంది?

జవాబు: మనం తీసుకున్న ఆహారం జీర్ణక్రియకు లోనవగానే పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్‌ అనే శక్తిమంతమైన అణువులు రక్తంలో కలుస్తాయి. ఒక్కోసారి చాలా కాలం పాటు ఆహారం తిననట్లయితే శరీరంలో ఉన్న కొవ్వు నిల్వల నుంచి కూడా గ్లూకోజ్‌ ఏర్పడుతుంది. శరీరంలో ఉన్న గ్లూకోజ్‌ ప్రతి జీవన కార్యకలాపాలకు కావలసిన శక్తికి ఆధారమని మనం గుర్తించాలి. అయితే ఆ గ్లూకోజ్‌ నుంచి శక్తిని రాబట్టాలంటే దాన్ని రసాయనికంగా ఆక్సీకరణం చెందించాలి. అందుకు మనం గాలిలో ఉన్న ఆక్సిజన్‌ను శ్వాస క్రియలో ఉచ్ఛ్వాసం ద్వారా రక్తంలోకి పంపుతాం. ఆక్సిజన్‌ సమక్షంలో ఆక్సీకరణం చెందిన గ్లూకోజ్‌ కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరిగా విఘటనం చెందే క్రమంలో ఉష్ణశక్తి కూడా పుడుతుంది. ఇందులో చాలా భాగం ADPఅనే అణువు, ATPఅనే శక్తియుత అణువుగా మారడానికి ఉపయోగపడగా కొంత భాగం రక్తంలోనే కలిసిపోతుంది.
రక్తపు ఉష్ణోగ్రత, దేహ ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడతాయి. రక్తంలో కలిసిన కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి దేహ ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీల సెల్సియస్‌) వద్దే ఉంటాయి. అవి నిశ్వాసంలో బయట పడేప్పుడు దేహ ఉష్ణోగ్రత వద్దే బయటికి వస్తాయి. సాధారణంగా సంవత్సర కాలంలో బయట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువే ఉంటుంది. బయట 37 డిగ్రీల సెల్సియస్‌ కన్నా తక్కువ ఉష్ణోగ్రత నుంచి గాలి లోనికి వెళ్తున్నా నిశ్వాసంలో విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌, నీటి ఆవిరి కనీసం 37 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉండటం వల్ల నిశ్వాసంలో వేడి గాలి బయటికి వస్తున్నట్టు ఉంటుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక­

గంటలకు కంచు ఎందుకు వాడారారు ?

దేవాలయాలలో , చర్చిలలో గంటను మోగిస్తారు . ఆ గంటల శబ్దము ఎంతో దూరానికి వినిపిస్తుంది . ప్రార్ధనా స్థలాలు వేరైనా ఆ గంటలు ఒకలాంటివే . అవన్ని కూడా కంచు తో తయారవుతాయి . కంచు లోహమిశ్రమము . కంచుకు స్థితి స్థాపక గుణము అధికము . దీనివలన కంచును కంపింపచేసినప్పుడు గంట ఖంగుమని కంపనాలను ఎక్కువసేపు ఉంచగలదు . అలా ధ్వని వినిపించే శక్తి బంగారానికీ మరియే ఇతర లోహానికీ లేదు ... అందుకే " కంచు మోగునట్టు కనకంబు మోగునా" అన్నాడు శతకకారుడు .

ఆవుపాలు కంటే గేదెపాలు తెల్లగా ఉంటాయెందుకు?

జ : పాలు అన్నీ తెల్లగానే ఉంటాయి. అందుకు కారణము కాల్సియం ఎక్కువగా ఉండడము వలన. ఇక్కడ ఆవుపాలు ... గేదె పాలు కంటే  కొద్దిగా పచ్చగా కనిపిస్తాయి. మీరు నిశితముగా గమనిస్తే కనబడుతుంది. దీనికి కారణము ఆవుపాలలో బి-కెరోటీన్‌ అధిక మోతాదులో ఉండడము వలనే.గేదె పాలలో తెల్ల రంగు కి కారణము అధికము గా కాల్సియం ఉంటుంది.

బులెట్‌ ప్రూఫ్‌ అద్దాలు ఎందుకు పగలవు?

జవాబు: మామూలు అద్దాలు రాయితో కొడితే భళ్లున పగులుతాయి. వాటి గుండా తుపాకీ గుండు సులువుగా దూసుకుపోతుంది. కానీ బులెట్‌ప్రూఫ్‌ అద్దాల విషయంలో అలా జరగదు. ఎందుకంటే ఆ అద్దాలను అత్యంత పటిష్టమైన సిలికాన్‌నైట్రైడ్‌ తో కూడిన పింగాణీ పదార్థంతోను, అతి దృఢమైన స్టీలు తోను, గరుకైన నైలాన్‌ పొరలతోను తయారు చేస్తారు. దృఢమైన పింగాణీ వేగంగా వచ్చే తుపాకి గుండును హఠాత్తుగా ఆపివేయడంతో దాని శక్తి గాజు పలకలోకి చొచ్చుకుపోకుండా, తగిలిన ప్రదేశంలోని పైపొరలోనే వివిధ దిశలకు వ్యాపిస్తుంది. అలా వేగం కోల్పోయిన తుపాకి గుండు గాజు పలక అవతలి వైపునకు పోకుండా ఆ గాజులోని నైలాన్‌ పొరలతో చేసే గజిబిజి జాలీ (వల)లో చిక్కుకుపోతుంది. అందువల్ల బులెట్‌ప్రూఫ్‌ అద్దాలు పగలవు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

కాల్చిన ఇటుకలు పచ్చిమట్టి కన్నా గట్టిగా ఉంటాయి. ఎందుకు?

జవాబు: పచ్చిమట్టిలో కేవలం విడివిడి మట్టి రేణువులు ఉంటాయి. వీటి మీద నీటి అణువులు ఉండడం, ఈ రేణువులన్నీ కలిసి ముద్దగా ఉండడం వల్ల మనం ఆ ముద్దను ఏ రూపంలోకైనా తీసుకురాగలము. ఇటుకల కోసం వాడే ఎర్రమట్టి ఇలాంటిదే. అయితే ఇటుకలు చేసిన తర్వాత ఆరబెట్టినప్పుడు ఆ ఇసుక, మట్టి రేణువుల మధ్య ఇంకా కొన్ని నీటి అణువులు ఉండడం వల్ల ఆ ఇటుక రూపం అలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇటుక దిమ్మెలను బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు గురి చేసినప్పుడు నీటి అణువులు అక్కడి నుంచి ఆవిరైపోయినా, మట్టిలో ఉన్న విడివిడి రేణువుల్లోని ఉపరితలాల వద్ద కొత్త రసాయనిక బంధాలు ఏర్పడుతాయి. పింగాణీ వస్తువులు, కుండలు, ఇటుకలు, గాజు పదార్థాల తయారీలో ఇలాంటి ఉష్ణ రసాయనిక చర్యలు (Thermo chemical reations) కీలక పాత్ర వహిస్తాయి. ఇలా తయారయ్యే పదార్థాలను కాంపోజిట్లు అంటారు. బట్టీలో తయారయ్యే ఇటుకలు ఓ విధమైన కాంపోజిట్లే.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,--వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

జవాబు: మామూలుగా సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ అత్యంత దూరాలు పయనిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే 'అమెరికన్‌ మోనార్క్‌' బటర్‌ఫ్త్లెలు ఉత్తర అమెరికా నుంచి శరత్‌కాలంలో (autumn)లో బయలు దేరి మెక్సికోను చేరుకొని అక్కడ శీతాకాలమంతా జీవనం సాగిస్తాయి. ఈ కీటకాలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో పయనిస్తాయి. ఇవి రోజుకు సరాసరి 70 కిలోమీటర్ల దూరం పయనించగలవు. గాలివాటం అవి పయనించే దిశకు అనుకూలంగా ఉంటే రోజుకు 300 కిలోమీటర్ల దూరం కూడా పయనించగలవు. అవి తమ ప్రయాణంలో ఆకాశంలో ఉండే సూర్యుడు ఉండే స్థానాన్ని మార్గ నిర్దేశకంగా ఉపయోగించుకుంటాయి. శీతాకాలం చివరలో అవి మరలా తమ స్వస్థలాలకు బయలుదేరక ముందే గుడ్లనుపెట్టి, వాటిలోని ఆడకీటకాలు చాలామటుకు, మగకీటకాల్లో కొన్ని మరణించడంతో, మిగిలిన సీతాకోకచిలుకలు వాటి సంతతితో తమ స్వస్థలాలకు చేరుకొంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా?

అందమైన సీతాకికచిలుకలు మరణించినా వాటి శరీరం , రెక్కలు నిలిచి వుండటం కనిపిస్తుంది . దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్తిపంజరమే . ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యం గా ఉండే ఖైటిన్ పొర ద్వార వస్తుంది . ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ , విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి . ఈ ఖైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు , పీతలకు పెంకుపై వుండి వాటికి రక్షణ కల్పిస్తుంది .

ఫ్యాన్‌ గాలి పైనుంచి కిందకు వీస్తున్నా క్యాలెండర్‌ కాగితాలు మాత్రం పైకే ఎగురుతాయి. ఎందుకు?

జవాబు: ఇలా జరగడానికి కారణం గాలి వస్తువులపై ప్రయోగించే పీడన ప్రభావమే. ఉదాహరణకు రెండు ఆపిల్‌ పళ్లను సన్నని దారాలతో ఒకదాని పక్కన మరొక దానిని వేలాడదీసి వాటి మధ్యన ఉండే ఖాళీ స్థలంలో గాలిని వూదితే, ఆ పండ్లు రెండు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతాయని అనుకొంటాం. కానీ, నిజానికి అవి రెండూ దగ్గరగా వస్తాయి. గాలి వూదడం వల్ల అంతక్రితం ఆపిల్స్‌ మధ్య ఉన్న గాలి తొలగిపోయి తాత్కాలికంగా అక్కడ కొంత శూన్యం ఏర్పడుతుంది. ఆ శూన్యాన్ని నింపడానికి పక్కల ఉన్నగాలి తోసుకు వస్తుంది. ఆ గాలి తనతోపాటు ఆపిల్స్‌ను కూడా దగ్గరగా తెస్తుందన్నమాట.
ఫ్యాన్‌ నుంచి గాలి వీస్తున్నపుడు కూడా ఇదే సూత్రం క్యాలెండర్‌ కాగితాలపై వర్తిస్తుంది. పైనుంచి వేగంగా వచ్చే ఫ్యాన్‌ గాలి క్యాలెండర్‌ పేపర్ల వద్ద అంతకు ముందున్న గాలిని తొలగిస్తుంది. ఆ ప్రదేశంలో పీడనం తగ్గడం వల్ల క్యాలెండర్‌ కిందవైపు ఉండే గాలి అక్కడకు వస్తుంది. కింద నుంచి గాలి పైకి వచ్చినపుడు తేలికగా ఉండే క్యాలెండర్‌ కాగితాలు పైకి లేచి రెపరెపలాడుతుంటాయి.

- ప్రొ|| ఈవీ. సుబ్బారావు,-హైదరాబాద్‌

దిగుడు బావుల నగరము అంటారెందుకు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.
బావులలో రకాలు :
* ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
* దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
* గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
* గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది.
దిగుడు బావులు
ప్రజలకు నీటి వనరులు గా ఉపయోగపడుతున్న దిగుడు బావులు, చేదుడు బావులు ఇప్పుడు కాలగర్బంలో కలిసి పోతున్నాయి . దీనితో వాటి ఉనికి కే ప్రశ్నార్ధకంగా మారింది. నాడు ఏ గ్రామంలో చూసిన దిగుడు బావులు, చేదుడు బావులు అధికంగా వుండేవి. ఈ బావులను గ్రామాలలో త్రాగునీటికి , పొలాల్లో వ్యవసాయానికి ఉపయోగించే వారు. భూ గర్భ జలాలు నానాటికి అడుగంటి పోవడంతో బావులు నేడు కనుమరుగు అవుతున్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనార్ధం వచ్చే భక్తుల తాగునీటి అవసరాలు తీర్చడానికి గతంలో పలువురు దాతలు దిగుడు బావులు తవ్వించారు. వాటిలో దిగేందుకు మెట్లు ఏర్పాటు చేశారు.
దిగుడు బావుల నగరము :
బయటి ప్రపంచానికి అంతగా తెలియని ఒక విచిత్రం గుజరాత్ లో ఉన్న దిగుడుబావులు . ఒకప్పుడు మనప్రాంతం లో కూడా ఇటువంటి బావులు ఉండేవి . లోతైన బావిలొకి చక్కని మెట్ల నిర్మాణము ఆనాటి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి చిహ్నము . అటువంటి దిగుడు బావులను మరింత సుందరమైన నిర్మాణాలుగా మలచటం గుజరాతీయుల ప్రత్యేకత . అక్కడి నీటి సమస్య పరిష్కారానికి నాడు కనుక్కున్న పరిష్కారమే ఈ బావులు . వీటి మధ్యలో ఉండే బావి చుట్టూ చక్కని రాతినిర్మాణము ఉంటుంది . అంచెలంచెలుగా విశాలమైన వసారాలు , గదులు కలిగిన ఆ నిర్మాణం లో స్తంభాలు , వాటిమీద లతలు , అల్లికలు , నగిషీలు చెక్కబడి దేవాలయ నిర్మాణాన్ని తలపిస్తాయి .
నాటి ప్రజలు వీటిని గంగామాతగా భావించేవారు . అందుకే ఈ జలాన్ని దేవతగా భావించి ఈ నిర్మాణం చేశారు . అష్టకోణాల నిర్మాణం ఇది . బావిలోకి ప్రవేశించేందుకు మూడువైపులనుండి ప్రవేశద్వారాలుంటాయి. వీటిలో నుండి దిగితే ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు దిగుతూ మొత్తం ఐదంతస్తుల కిందికి దిగాల్సివుంటుంది . అంత లోతునుండి నీరు పైకి చేరవేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే . అందుకే ఆ శ్ర్మ తెలియకుండావుండేందుకే ఇటువంటి విశాలమైన , నెమ్మదిగా ఎక్కే మెట్లు కలిగిన సుందర నిర్మాణాలు చేపట్టారు . ఇనన్నీ 10-11 శతాబ్దాల మధ్య జరిగిన నిర్మాణాలే. ఇటువంటి సుందర దిగుడుబావులు గుజరాత, రాజస్థాన్‌ ప్రాంతాలలో చాలాచోట్ల ఉన్నప్పటికీ , అదలాజ్ వాన్‌ లో విశేషం గా ఉన్నాయి . అదలాజ్ వాన్‌ గుజరాత్ లోని ప్రధాన నగరము . ఇది అహమదాబాద్ కి 18 కి.మీ దూరం లో ఉంది .

ఒంటె పాలతో పెరుగు తయారవదు అంటారు. ఎందుకని?

జవాబు: పాలు పెరుగు కావడం అంటే అర్థం ఆ పాలలో ఉన్న లాక్టోజ్‌ అనే పిండి పదార్థం మీద ఈస్ట్‌ అనే బ్యాక్టీరియా దాడిచేయడమే. లాక్టోజ్‌ తన సమూహాల్ని పెంచుకునే క్రమంలో విడుదలైన ఆమ్ల గుణ లక్షణాలున్న రసాయనాల సమక్షంలో పాలు గడ్డకడతాయి. కాబట్టి పాలు పెరుగు కావడంలో ప్రధాన భూమిక లాక్టోజ్‌ది. ఒంటె పాలలో లాక్టోజ్‌ పరిమాణం తక్కువ ఉంటుంది. ఆమ్లగుణమున్న పదార్థాలమీద ఈస్ట్‌ ప్రభావం తక్కువ. మామూలు గేదెలు, ఆవులు, గొర్రెల పాలలో కన్నా ఒంటె పాలలో ఆమ్ల లక్షణమున్న c- విటమిన్‌ ఎక్కువ. పైగా ఖనిజ లవణాలు పాలూ ఒంటె పాలలో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈస్ట్‌ చేష్టలకు కష్టం కావడం వల్ల ఒంటె పాలు అంత తొందరగా పెరుగుగా మారవు. ఇందువల్లే దూరప్రయాణం చేసేవారు ఒంటెపాలు తమవెంట తీసుకెళతారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ఒంటె కు కోపం వస్తే ఎదుట వారి మీద ఉమ్మేస్తుందంటారు . నినమేనా?

అవును ఒంటెకు కోపము వచ్చినా , విసుగు కలిగినా ఆ విషయము తెలియజెప్పేందుకు ఎదుట వ్యక్కులపైనా , తోటి జంతువులపైనా ఉమ్మేస్తుంది . పాక్షికముగా జీర్ణమైన ఆహారము తిరిగి నోట్లోకి తెచ్చుకోగలిగిన శక్తి దీనికి ఉన్నందున ఆ ప్రక్రియ సాధ్యమవుతుంది . అయితే అది ఉమ్మి తో కలిసిన ఆహారపదార్ధము . బాగా ముద్దగా నమిలిన ఆ పదార్ధాన్ని తుమ్మినట్టుగా చేసి ఎదుటి వారిపైన పడేలా చేస్తుంది . దాని కంపుకు , అశుబ్రతకు మనిషి బాధపడవలసిందే .

కర్పూరం గొప్పేంటి?

కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల? అందులో ఏముంటాయి. మనం తెలుసుకుందామా!
కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందే కొన్ని జంతువులు పక్షులు వాటిని తెలుసుకుంటాయంటారు. ఎలా పసిగడతాయి?

జవాబు : జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. అలాగని 2 సంవత్సరాల తర్వాతో, రెండు నెలల తర్వాతో రాబోయే వాటిని అవి కూడా గుర్తించలేవు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?

జవాబు: ఏదైనా విద్యుత్‌ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్‌ వలయం (electrical circuit)లో విద్యుత్‌ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్‌ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్‌ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్‌ ప్రవహించే తీగను ఫేజ్‌ లేదా లైన్‌ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్‌. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్‌ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;-రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

మాట్లాడేటప్పుడు వూపిరి పీల్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకని?

జవాబు: మాట్లాడ్డం అంటేనే వూపిరిని బయటకు వదిలే నిశ్వాస (expiration) ప్రక్రియకు ధ్వని కూడా తోడవడమే. గొంతులో ఉన్న శ్వాసపథ (lerynx), ఆహారపథ (pharynx) కలిసే చోట శబ్ద పేటికలు (vocal chords) ఉంటాయి. ఆ శబ్ద పేటికల కంపనమే శబ్దం. అది తన కంపనాలను నిశ్వాసంలో వూపిరితిత్తుల నుంచి బయట పడుతున్న గాలిలోకి నింపుతుంది. ఇలా శబ్ద కంపనాలను నింపుకున్న గాలి కంపనాలను భాషకు అనుకూలంగా గొంతు, అంగిటి, నాలుక, దవడలు, పలువరుస, పెదాలు, ముక్కు సమన్వయం చేసుకుంటూ మాటల రూపంలో వ్యక్తం చేస్తాయి. మాటకు, మాటకు మధ్య లేదా వాక్యానికి, వాక్యానికి మధ్య మనం గాలిని లోపలకి పీల్చుకుంటామే తప్ప మాట్లాడే క్రమంలోనే ఉచ్ఛ్వాసం(inspiration) చేయడం చాలా కష్టం.
Courtesy with -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

మనిషి జీవించడానికి ఆక్సిజన్‌ అవసరం కదా? మరి చనిపోయినవారికి ఆక్సిజన్‌ ఇచ్చి బతికించలేమా?

జవాబు: ప్రపంచంలోని మరణాలన్నీ ఆక్సిజన్‌ లేకపోవడం వల్లే జరగడం లేదు కదా? కాబట్టి మరణానికి, ఆక్సిజన్‌ లేమి కారణం కాదు. మనిషులు కానీ, జీవులు కానీ బతికి ఉండడానికి ఆక్సిజన్‌ ఒక్కటే కారణం కాదు. మనం బతికి ఉండాలంటే మనకు ఆక్సిజన్‌తోపాటు నీరు, ఆహారం, రోగనిరోధక శక్తి, సరైన రక్తప్రసరణ, సరైన జీవభౌతిక ధర్మాలు, సరైన వాతావరణం కావాలి. ఇందులో కొన్ని బాహ్యకారకాలు కాగా, కొన్ని అంతర కారకాలు. బయట నుంచి ఎంత మంచి ఆక్సిజన్‌, ఆహారం, వాతావరణం లాంటివి కల్పించినా కాలక్రమేణా శరీరంలోనే కొన్ని కార్యకలాపాలు మందగించడం మొదలెడతాయి. ఆ స్థితినే మనం వృద్ధాప్యం లేదా అవసాన దశ అంటాము. మరికొన్ని రోజుల తర్వాత ఆ శరీర కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోతాయి. అదే మరణం. ఒకసారి మరణం సంభవించాక ఏ విధంగానూ బతికించడం సాధ్యం కాదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌ ,రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ఇంద్రజాలం చేసేవారు కన్ను మూసి తెరిచేలోగానే చేతుల్లో వస్తువుల్నిమార్చుకుని అవే మారినట్టు నమ్మిస్తారు. అతి వేగంగా పనిచేసే కెమేరాతో ఆ మ్యాజిక్‌ను కనిపెట్టగలమా?

జవాబు: ఒక సెకనులో 16వ వంతు కన్నా తక్కువ సమయంలో జరిగే సంఘటనలను మన కన్ను కనిపెట్టలేదు. మానవ నేత్రానికి ఉన్న ఈ పరిమితి ఆధారంగానే సినిమాలను మనం అవిచ్ఛిన్న చలన చిత్రం (continuous motion picture)గా చూడగలుగుతున్నాం. కాబట్టి సెకనుకు 16 సార్ల కన్నా ఎక్కువగా షట్టర్‌ తెరుచుకుంటూ, మూసుకుంటూ పని చేసే స్పీడ్‌ కెమేరాల సాయంతో ఇంద్రజాలికుని చేతి కదలికల్ని ఫొటోలు తీసి వాటిని విడివిడిగా చూస్తే అతడి హస్తలాఘవాన్ని దశలవారీగా గమనించవచ్చు. ఇప్పుడు ఇంతకంటే వేగంగా ఫొటోలు తీయగలిగే కెమేరాలు ఉన్నాయి కాబట్టి వాటితో చిత్రీకరిస్తే మ్యాజిక్‌ ఎలా జరిగిందో కనిపెట్టగలుగుతాము.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

చంద్రుడిపై గాలి లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆక్సిజన్‌ తీసుకెళితే ఏమవుతుంది? మానవ నివాసానికి సాధ్యమవుతుందా?

జవాబు: సాధ్యపడదు . మన భూమ్మీద ఉన్న విధంగానే చంద్రుడిపైన కూడా వాయు సంఘటనం(composition of air) ఉంటేనే మానవ మనుగడ, ఇతర జీవుల మనుగడ సాధ్యం. చెట్లు ఇతర జీవ జాతులు ఉంటేనే సరైన జీవావరణ (BIO SPHERE), పర్యావరణ వ్యవస్థలు సాధ్యమవుతాయి. భూమ్మీద ఆక్సిజన్‌తోపాటు దానికన్నా సుమారు 4 రెట్లు అధికంగా నైట్రోజన్‌ ఉండేలా గాలి ఉంది. పూర్తిగా గాలే ఉంటే మన ఊపిరి తిత్తులు తట్టుకోలేవు. మనం వదిలిన కార్బన్‌డైఆక్సైడ్‌ స్థాయి అక్కడ చెట్లు లేకుంటే మెల్లమెల్లగా పేరుకుపోయి మొత్తం ఆక్సిజన్‌ స్థానాన్ని అదే ఆక్రమిస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ సరఫరా అవుతుండాలి. అలాగే కార్బన్‌డై ఆక్సైడ్‌ పరిమాణం 0.5 శాతానికి మించకూడదు. భూమిపై ఉన్న గాలి ద్రవ్యరాశి సుమారు 5X1018 (లేదా 5 పక్కన 15 సున్నాలు పెట్టినంత కి.గ్రా) దీన్నే 5 ట్రిలియన్‌ టన్నులంటాము. చంద్రునిపై ఉన్న గాలి వ్యాపనం (diffusion) ద్వారా పారిపోకుండా ఉండాలంటే కనీసం 1 ట్రిలియన్‌ గాలి అక్కడుండాలి. అంటే 5 లక్షల కోట్ల టన్నులు. అంత గాలిని, అన్ని చెట్లను, అన్ని జీవుల్ని అక్కడికి మోసుకెళ్ల గలమా?

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--రాష్ట్రకమిటీ, జనవిజ్ఞాన వేదిక

మండే కొవ్వొత్తిని మనం నిటారుగా పట్టుకున్నా, వంచి పట్టుకున్నా, తలకిందులుగా పట్టుకున్నా మంట పైకే వస్తుంది. కారణం ఏమిటి?

జవాబు: మంటలు పైకే ఎగిసి పడడానికి కారణం ఒక విధంగా గాలే. మంట మండుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న గాలిపొరలను వేడెక్కిస్తుంది. దాంతో ఆ గాలి సాంద్రత తగ్గుతుంది. అపుడు తేలికైన గాలి అక్కడి నుంచి వేగంగా నిలువుగా పైకి పోతుంది. అందువల్ల మంట చుట్టూ ఉన్న ప్రదేశంలో పీడనం తగ్గుతుంది. పీడనం తక్కువగా ఉన్న ఆ ప్రదేశంలోకి దూరాల్లో ఉండే చల్లని గాలి వచ్చి చేరుతుంది. వేడెక్కి పైకి పోయే గాలి వేగం, దూరం నుంచి మంటవైపు వచ్చే గాలి వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నిరంతరంగా జరుగుతూ మంట చుట్టూ ఉన్న గాలులు వేగంగా పైకి పోతుండడం వల్ల వాటితో పాటే మంట ఎప్పుడూ పైకే లేస్తుంది.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

కొవ్వొత్తి ఆర కుండా ఎలా వెలుగుతుంది ?

కొవ్వొత్తి వెలిగేందుకు దాంట్లోని రెండు ముఖ్యమైన భాగాలు పనిచేస్తాయి . ఒకటి ఇంధనం లా పనిచేసే కొవ్వు పదార్ధము . . . పారఫిన్ మైనము , రెండోది కరిగిన మైనాన్ని పీల్చుకొనే 'ట్వయిన్ దారము' తో తయారుచేసిన వత్తి .
కొవ్వొత్తి మండుతున్నప్పుడు కరుగుతూ ద్రవరుపం లోకి మారుతున్న మైనము , వత్తిలో ఉన్న అతి సన్నని మార్గాలగుండా పైకి ఎగబాకుతుంది . ఈ ప్రక్రియను కేశనాలికీయత (capillarity) అంటారు . పారఫిన్ వేక్స్ (మైనం) క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఒక రకమైన హైడ్రోకార్బన్ . మనం కొవ్వొత్తిలొని వత్తిని వెలిగించినపుడు ఉత్పన్నమైన ఉష్ణము వత్తిచుట్టు ఉండే కొవ్వును కరిగిస్తుంది . అలా కరిగి ద్రవ రూపం లో ఉన్న మైనాన్ని వత్తి పీల్చుకొని ఆ ద్రవాన్ని పైవైపునకు లాగుతుంది . మంటలోని ఉష్ణం పైకి వచ్చిన మైనపు ద్రవాన్ని భాష్ప రూపంలోకి మార్స్తుంది . ఆ విదంగా కొవ్వొత్తి లో మండేది భాష్ప(ఆవిరి)రూపం లో ఉండే మైనమే .
మండుతున్న కొవ్వొత్తిని తటాలున ఆర్పేస్తే , వత్తి నుంచి వెలువడే తెల్లని పొగ ఒక ప్రవాహం లాగా పైకిపోవడం గమనిస్తాం . ఈ పొగ కంటికి కనబడే విధంగా ఘనీభవించిన పారఫిన్ మైనం భాస్పమే . వత్తి వేడిగా ఉన్నంతవరకు ఈ తెల్లని పొగ పవాహ రూపము లో వస్తూనే ఉంటుంది .

గాలిలోని ఆక్సిజన్‌ వల్ల మంట మండుతుంది. కానీ వెలుగుతున్నకొవ్వొత్తిని వూదితే ప్రకాశంగా వెలగాలి గానీ ఆరిపోతుంది. కారణం తెలపండి?

జవాబు: వెలుగుతున్న కొవ్వొత్తిని వూదితే చాలాసార్లు ఆరిపోతుంది. అయితే ఒకోసారి ప్రకాశవంతంగా వెలగచ్చు కూడా. ఈ రెండింటికీ కారణాలు తెలుసుకుందాం.
కొవ్వొత్తి వెలిగేపుడు కేవలం ఆక్సిజన్‌ సరఫరా ఒక్కటే ఆ వెలుగును నిర్ధరించదు. మంట వేడితో మైనం కరిగి వత్తి గుండా తలతన్యత (surface tension), కేశనాళికీయత(capillarity),విసరణం (diffusion)అనే ధర్మాల ప్రభావంతో మంట వద్దకు చేరుతుంది. తద్వారా మంటకి ఎప్పటికప్పుడు ఇంధన సరఫరా జరుగుతుంటుంది. మంట మండాలంటే వత్తి దగ్గర తగిన ఉష్ణోగ్రత ఉండాలి. మైనపు ద్రవంలోని అణువులు ఆవిరి చెందడంవల్ల త్వరితంగా మండేందుకు కావాల్సిన ఉత్తేజశక్తి (activation energy) లభ్యమవుతుంది. ఇవన్నీ కుదిరాక ఆక్సిజన్‌ సరఫరా బాగా ఉంటే మంట బాగా మండుతుంది. కొవ్వొత్తిని గట్టిగా వూదితే మన నోటి గాలి వత్తి ప్రాంతంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పైగా మనం వదిలేది కార్బన్‌డైయాక్సైడ్‌. అది కూడా ఆక్సిజన్‌ను తొలగించి వేస్తుంది. అందువల్ల ఆరిపోతుంది. ఇక మెల్లగా వూదితే అక్కడ పేరుకుపోయిన కార్బన్‌డయాక్సైడును మనం దూరానికి పంపినవారమవుతాము. అపుడు ఆక్సిజన్‌ బాగా అంది వెలుగు బాగా వస్తుంది.

మొక్కల్లో హరిత రేణువులు ఉండడం వల్ల అవి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతున్నాయి కదా. మరి వాటిని జంతువుల్లో ప్రవేశపెడితే వాటంతట అవి ఆహారాన్ని తయారుచేసుకోగలవా?

జవాబు: మొక్కలు కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) ద్వారా కాంతి సమక్షంలో కార్బన్‌డయాక్సైడును, నీటిని పిండి పదార్థాలుగా మార్చే క్రమంలో హరితరేణువులు (chlorophyl pigments) ప్రధాన పాత్ర వహిస్తాయనేది నిజమే కానీ, ఆ ప్రక్రియ మొత్తం కేవలం వాటిదే కాదు.
ఉదాహరణకు బస్సును నడపడానికి డ్రైవర్‌ అవసరమే కానీ, అదే డ్రైవర్‌ను గుర్రం ఎక్కిస్తేనో, విమానం ఇస్తేనో నడపలేడుగా? అలాగే హరిత రేణువులు మొక్కల్లో మాత్రమే తమ పాత్రను నిర్వర్తించగలవు. పైగా జంతువుల దేహ నిర్మాణం, కణ నిర్మాణం మొక్కలతో పోలిస్తే పూర్తి భిన్నమైనది. కాబట్టి హరిత రేణువులు జంతువుల్లో పనిచేయడమనే ప్రశ్నే లేదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

కార్ల ప్రధాన లైట్లను పలకలుగా ఉండే పెట్టెల్లో పెడుతున్నారెందుకు?

జవాబు: కార్లలాంటి వాహనాలు చీకట్లో ప్రయాణించేప్పుడు దారి కనిపించడం కోసం ప్రధాన దీపాలను (హెడ్‌లైట్స్‌) అమరుస్తారన్న విషయం తెలిసిందే. చాలా కాలం వరకూ వీటిని అర్థచంద్రాకారంలో (పారాబోలిక్‌) ఉండే నున్నని గోడలుగల పెట్టెల్లో అమర్చేవారు. లైట్‌ వెలిగినప్పుడు దాని నుంచి వెనక్కి ప్రసరించే కాంతి కిరణాలు సైతం, ఈ నున్నని ఆకారంపై పడి పరావర్తనం చెంది తిరిగి ముందుకే వెళ్లేవి. ఇందువల్ల వాహనం ముందు ఉండే మార్గంపై ఎక్కువ కాంతి పడేది. అయితే ఇలాంటి అమరికలో ఉండే లైట్ల వల్ల కాంతి ఒక వలయాకారంలో కేంద్రీకృతమై పడేది కానీ, మార్గానికి అటూ ఇటూ ఉండే పరిసరాలపై వెలుగు ప్రసరించేది కాదు. తర్వాత్తర్వాత ఆధునిక హేలోజన్‌ ప్రక్రియ వల్ల అధిక కాంతిని ఇవ్వగల లైట్ల తయారీ మొదలైంది. ఈ లైట్ల వెనకవైపు కాంతి పరావర్తనానికి ఉపయోగపడేలా అమర్చే గోడల పరికరాల్లో సైతం మార్పు వచ్చింది. ఇవి నున్నగా కాకుండా ఉబ్బెత్తుగా అనేక పలకలుండే ఉపరితలంతో కూడినవి వచ్చాయి. లైట్ల నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ పలకలపై పడి అనేక దిశల్లోకి పరావర్తనం చెంది చెల్లాచెదురై మార్గం పైకి ప్రసరిస్తాయి. అందువల్ల కేవలం రోడ్డు మాత్రమే కాకుండా అటూ ఇటూ ఉండే పరిసరాలు కూడా కనిపిస్తాయి. పైగా ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ల మీద బైర్లు కమ్మేలా కాంతి పడదు కూడా.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

సినిమాల్లో కార్లు వేగంగా వెళ్ళే దృశ్యం చూస్తున్నపుడు , కారు చక్రాలు మొదట్లో ఒక దిశలో తిరిగి మల్లి వెనక్కు తరిగినట్లు కనిపిస్తాయి . ఎందువల్ల ?

కారణం ... మన దృష్టి పై కాంతి ప్రదర్చించే ఒక భ్రమ . కారు చక్రాలు తిరుగుతున్నప్పుడు ఆ భ్రమనానికి కొంత పౌన:పుణ్యం (frequency) ఉంటుంది . భ్రమణం/పౌన:పుణ్యం అంటే ... ఒక సెకనుకు కారు చక్రాలు ఎన్ని భ్రమనాలు (turns) చేస్తున్నాయనే సంఖ్య . .. ప్రోజక్తర్ లో రీలు వేగంగా తిరగడం వల్ల తేరా మీద ఒక దాని తర్వాత ఇఒకటిగా నిశ్చల చిత్రాలు చక చక మారి మనకు దృశ్యం కదులు టున్న భ్రమ కలుగుతుంది . ఆ విదంగా సినిమా తేరా మీద పడే ఫిల్మ్ ప్రతిబింబలకు కుడా పౌన:పుణ్యం ఉంటుందన్నమాట . అంటే తెరపై సెకనుకు ఎన్ని చిత్రాలు పడుతున్నయనే (విక్షేపం )సంఖ్యే అది .
మాములుగా సినిమా తెరపై సెకనుకు 24 ఫిల్మ్లు విక్షేపం(appear) అవుతాయి . ఫిల్మ్ లోని Car చక్రాల భ్రమణాలు సెకనుకు 24 కన్నా తక్కువ ఉంటే Car చక్రాలు వెనుకకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది . Car బయల్దేరినపుడు దాని వేగం తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా కనబడుతుంది .Car చక్రాల భ్రమణ పౌ న: పుణ్యం సరగ్గా 24 అయితే చక్రాలు తిరగ కుండా నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తాయి . కారు వేగం ఎక్కువయ్యే కొలదీ చక్రాలు తిరిగే frequency 24 కంటే ఎక్కువవడం వల్ల అవి దిశను మార్చి ముందుకు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి . అంటే కారు చక్రాలు మొదట్లో వెనక్కు తిరిగి తర్వాత కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉంది అ తర్వాత ముందుకు తితుగుతున్నట్లు అనిపిస్తుంది .

పోన్:పుణ్యాల తేడాల వల్ల కలిగే ఈ వింత దృశ్య ఫలితాన్ని భౌతిక శాస్త్రం లో " Stroboscopic effect " అంటారు .

మనిషి గుండె పరిస్థితిని కనిపెట్టే కార్డియోగ్రామ్‌ ఎలా పనిచేస్తుంది?

జవాబు: కార్డియోగ్రామ్‌ పరికరాల్లో రకాలున్నాయి. సాధారణమైనది శబ్దతరంగాల సాయంతో గుండె ప్రతిబింబాన్ని తెరపై కనిపించేట్టు చేస్తుంది. ఈ పద్ధతిలో అతిధ్వని తరంగాలను (ultra sounds) గుండెపై పడేటట్టు ప్రసరింప చేసి, అక్కడి నుంచి పరావర్తనం చెందిన తరంగాలను గ్రహించే ఏర్పాటు ఉంటుంది. పరావర్తన తరంగాల ప్రతిబింబాలను ఒక తెరపై పడేటట్లు చేసి గుండె ఆకృతిని చూడగలుగుతారు. అయితే ఈ కార్డియోగ్రామ్‌ ద్వారా గుండెలో ప్రవహించే రక్త వేగాన్ని కొలవలేము. ఇందుకోసం డాప్లర్‌ ఎకో కార్డియోగ్రామ్‌ను ఉపయోగిస్తారు. ఈ పరికరం నుంచి నిర్దిష్టమైన పౌనఃపున్యం ఉండే ధ్వని తరంగాలను గుండెలోకి ప్రసరింపజేస్తారు. ఆ తరంగాలు గుండెలో చలనంలో ఉన్న రక్తకణాలపై, రక్తనాళాలపై పడి వెనుతిరిగి వస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల పౌనఃపున్యంలో తేడాలు ఏర్పడతాయి. పంపిన తరంగాలు, తిరిగి వచ్చిన తరంగాల పౌనఃపున్యాలను బట్టి గుండెలో రక్తప్రసరణ వేగం, దిశలను గ్రహించగలుగుతారు.

ఆధారము: డా.  వందనా శేషగిరిరావు గారి బ్లాగు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate