జీలకర్ర, బెల్లము : శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. మనుష్యుల శరీరములొ విద్యుత్ దాగిఉంటుంది . అదే జీవశక్తి వివాహ సమయం లో ఎవరు ముందుగా జీలకత్త బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది . ఆ ప్రవాహశక్తి జీవితాంతం పనిచేస్తుంది అని , ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో మారిమాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం .జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయము గా అయితే పెళ్ళి కూతురు తో ముందు పెట్టిస్తారు .మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాల ప్రధానమైన అంశము. కానీ, మనలాంటి చాలామందికి, వివాహ సమయంలో చెసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు (ఉదాహరణకు: స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర-బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి...). వివాహం చేసుకునేవాళ్ళు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్ధము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడంవల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము.వేద మంత్రములతో, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా ముత్తయిదువులు మంగళ గీతములు ఆలాపన చేయగా వధువు, వరుని నెత్తిపై జీలకర్ర, బెల్లం ముద్దగా చేసినది పెడుతాడు. అట్లే వధువు నెత్తిన జిలకర్ర, బెల్లం ముద్దగా చేసి బ్రహ్మరంధ్రం వద్ద ఉంచుతారు. ఈ సందర్భంలో పెళ్లికుమారుడు ఈ మంత్రాన్ని చెబుతాడు.అబ్రత్రుఘ్నీం వరుణ అపరిఘ్నీం బృహస్పతే ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితంస్స :
ఓ వరుణదేవా! సవిత వలన ఈమెకు కలిగిన లక్ష్మీసోదరులకు అభివృద్ధిని కలిగించాలి. నీ దయవల్ల ఓ బృహస్పతీ ఈమె భర్తకు అభివృద్ధిని కలిగించేది కావాలి. ఇంద్రా! ఈమె పుత్రసంతానం పొందునట్లు అనుగ్రహించు.
జవాబు: అన్ని సందర్భాలలోను ఇది వర్తించకపోయినా ఇందుకు ఒక కారణం ఉంది. నోట్ పుస్తకాలు, న్యూస్‌పేపర్‌కు వాడే మామూలు కాగితాలకు, కరెన్సీ నోట్ల తయారీకి ఉపయోగించే కాగితానికి మధ్య చాలా తేడా ఉంటుంది. మామూలు కాగితాలను చెట్ల నుంచి వచ్చే సెల్యులోజ్ పదార్థంతో తయారు చేస్తారు. కరెన్సీ నోట్లకు వాడే కాగితాన్ని పత్తి, ఊలు మిశ్రమంతో కూడిన లినెన్, గుడ్డ పీలికల నార నుంచి తయారు చేస్తారు. ఇందులో పోగులు చాలా దగ్గరగా బంధించబడి, మామూలు కాగితంలోని పోగుల కన్నా దృఢంగా ఉంటాయి. ఇవి నీటి వల్ల అంత త్వరగా ప్రభావితం కావు. సెల్యులోజ్‌తో చేసిన మామూలు కాగితం నీటిలో పడితే వెంటనే నీటిని పీల్చుకుని పోగులు విడిపోతాయి. దాంతో అది చిరిగిపోయి ఉండలు చుట్టుకుపోతుంది. కరెన్సీ నోట్లను నాణ్యమైన కాగితంతో చేయడం వల్ల అది అంత తొందరగా చిరిగిపోవు. అంతేకాకుండా మనం చేతులతో ఉతికినంత తీవ్రంగా వాషింగ్ యంత్రం దుస్తులను ఉతకదు. అది కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దుస్తులను తిప్పడం ద్వారా వాటిలోని ధూళి కణాలను వేరు చేస్తుంది. ఇందువల్ల కూడా దుస్తుల జేబుల్లో ఉండిపోయిన కాగితాలు చిరిగిపోయేంత తీవ్రమైన ప్రభావానికి గురికావు.
- పొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జవాబు: ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో పాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటాం. అదే టోకెన్‌ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్‌ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా 'యూరో'ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
జ ; ఇది వాస్తుశాస్త్రం నకు సంభందినది . ఒక గృహాన్ని వాస్తుశాస్త్ర ప్రకారము నిర్మించుకోవాలని అంటారు . మనము నివసించే ఇల్లు మంచి గాలి , వెలుతురు వచ్చేదిగాను , కాలుష్యరహితం గాను ... ముఖ్యము గా శబ్ద కాలుష్యము లేనిదిగాను ఉండాలి . ఇక్కడ కరివేపాకును అందరూ కూరలలో వేసుకునే సుగంధద్రవ్యము గా వాడుతారు . ఆ ఆకులు కోసము ఇరుగు పొరుగు వారు రావడము జరుగుతుంది ... ఇది ఇంటిలో ఉన్న కుటుంబసభ్యులకు చిరాకు కలిగించేదిగా ఉంటుంది.. మరియు గుమ్మం ముందు చెట్టుంటే నడకకి ఇబ్బంది, వస్తువుల్ని తీసుకురావడం, పోవడం కష్టం. అదీ కాక ఆ వేళ్లు ఇంటిలోనికి పాకి నేలకి పగుళ్లు తెస్తాయి. అన్నిటికీ మించి పెద్ద గాలికి విరిగి పడితే ఇంట్లో వారికి ప్రమాదమని భావించిన పెద్దలు ఇంటి గుమ్మానికి ముందు చెట్లు వద్దన్నారు. ఈ దృష్టితో ఆలోచించుకుని గుమ్మానికి బాగా దూరంగానైతే... కరివేపాకు అనేది పెద్ద చెట్టు కాదు కాబట్టి ఉంచుకోండి. శాస్తప్రరంగానైతే ఇది వనస్పతి వృక్షం (పువ్వులు, పళ్లు లేనిది) కాబట్టి దోషం లేదు ఉంచినట్లయితే...
--డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు , రామాయణ సుధానిధి
జవాబు: పప్పు సాధారణంగా పిండి పదార్థంతోను, మాంసకృత్తులు (ప్రోటీన్లు)తోను నిండి ఉంటుంది. పప్పులోని పిండిపదార్థం తొందరగానే ఉడికినా ఎక్కువ సేపు వండితేకానీ ఉడకనివి మాంసకృత్తులే. బాగా ఉడకడం అంటే పొడవైన ప్రోటీను అణువులు చిన్న చిన్న ముక్కలవడమే. ఇవి మన జీర్ణవ్యవస్థలో సులభంగా అరిగిపోతాయి. నీటి సమక్షంలో ప్రోటీను అణువులు ముక్కలవడాన్ని జలవిశ్లేషణం(hydrolysis)అంటారు. నీటిలో ఉప్పు వేయడం వల్ల ఈ ప్రక్రియ మందగిస్తుంది. అందుకే వేయరు. అంటే ఉప్పు దగ్గర మన పప్పులు ఉడకవన్నమాట.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
జవాబు: పప్పు దినుసుల్ని, తదితర పోషక విలువలున్న ఇతర ధాన్యపు గింజల్ని నీళ్లలో నానబెట్టిన చాలా సేపటికి గమనిస్తే ఒక రకమైన చెడు వాసన వస్తుంది. కారణం ఆయా ఆహార విలువలున్న ధాన్యపు గింజలు, పప్పు గింజలు కుళ్లిపోవడమే.భూమ్మీద ఉన్న జీవుల మనుగడకు శక్తి కావాలి. ఆ శక్తి వాటికి, మనకు ఆహార పదార్థాల్లోని పిండి పదార్థాల నుంచి, కొవ్వు పదార్థాల నుంచి వస్తుంది. మాంసకృత్తుల్ని ఆయా జీవులు తమ శరీర నిర్మాణానికి, జీవన కార్య కలాపాలకు అవసరమైన ఎంజైముల్ని, ప్రోటీన్లను తయారుచేసు కునేందుకు వాడుకుంటాయి.ఇలాంటి ఎన్నో దైనందిన జీవన కార్య కలాపాలకు నీరు ఓ వేదిక లేదా మాపకం లాగా పనిచేస్తుంది. అందుకే మనలాంటి ఎన్నో జీవుల్లో 70శాతం వరకు నీరే ఉంటుంది. కుళ్లిపోవడం లేదా పులియటం అనే విధానానికి కారణం వాతావరణం, నీరు వంటి పలు ప్రదేశాల్లో ఎపుడూ అవకాశం కోసం చూస్తున్న బ్యాక్టీరియాలే. ఇందులో ఈస్ట్ అనే బ్యాక్టీరియా ప్రధానమైంది. ఈ కార్యకలాపాలకు కూడా నీరు అవసరం. మామూలు ఎండు ధాన్యాలు, పప్పు దినుసుల్లో నీటి శాతం బాగా తక్కువగా ఉండడం వల్ల బాక్టీరియాలు నీటిని ఆశించినా వాటిపై ప్రభావం ఉండదు. మరో మాటలో చెప్పాలంటే నీటి శాతం అల్పంగా ఉన్న పప్పు గింజల దగ్గర బ్యాక్టీరియాల పప్పులుడకవు. కానీ నానేసిన పప్పు ధాన్యాల్లో చెమ్మదనం నీటి అవకాశం బాగా ఉండడం వల్ల బ్యాక్టీరియా దాడి అధికం అవుతుంది. అవి పోషక విలువల్ని స్వాహా చేసే ప్రక్రియల్లో విడుదల చేసే గంధక తత్వం, భాస్వర లక్షణం ఉన్న పదార్థాల నుంచే ఈ దుర్గంధం వస్తుంది.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
జ : వేసవిలో పగటి పొద్దు ఎక్కువ ఉంటుంది , చలికాలములో రాత్రి పొద్దు ఎక్కువకాలము ఉంటుంది .. ఈ రెండింటి మధ్య వుండే తేడా భూమిమీద ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది . భూమి అక్షం 23 1/2 డిగ్రీలు వంగి ఉండడమువల్ల , బూపరిభ్రమణం వల్ల ... ఉత్తరధృవం ధృవనక్షత్రాన్ని ఎప్పుడూ సూచిస్తున్నందున ఈ వ్యత్యాసము ఏర్పడింది. దీనివల్ల వేసవిలో ఎక్కువభాగము భూమి మీద కాంతికిరణాలు పడతాయి ... ఫలితముగా పగలు ఎక్కువవుతుంది. అక్షాంశములు పెరుగేకొద్దీ వేసవిలో పగటికాలం పెరుగును.
జవాబు:మాటలు బాగా నేర్చుకున్నాక, పెద్దయ్యాక, ఏదైనా ప్రమాదవశాత్తూ చెవుడు (deaf) వస్తే వారేమీ క్రమంగా మూగ (dumb) వారు కారు. కేవలం పుట్టుకతోనూ లేదా మాటలు రాని వయసులోనూ చెవుడు వస్తే వారు తప్పకుండా మూగవారవుతారు. ఎందుకంటే ప్రతి మనిషి తన చుట్టుపక్కల ఉన్న సమాజపు, కుటుంబపు, పరిసరాల్లో జరిగే సంభాషణలను వింటూ ఆ వ్యక్తుల ముఖకవళికలను చూడ్డం ద్వారా (మాట్లాడే భాష) నేర్చుకుంటాడు. అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడే తల్లిదండ్రుల బిడ్డను పుట్టిన కొన్ని నెలలకే ఒరియా భాష మాత్రమే మాట్లాడే పరిసరాల్లో పెంచితే ఆ బిడ్డ క్రమేపీ ఆ భాషనే మాట్లాడేలా ఎదుగుతాడు.చెవుడు ఉన్న బిడ్డ తన చుట్టూ ఉన్న శబ్దాలను, భాషను వినలేడు కాబట్టి ఏ విధంగా తన నోటిలోని శబ్ద వ్యవస్థను కదిలిస్తే ఎలాంటి శబ్దాలు పుడతాయో తెలసుకోలేడు. కాబట్టి ఏ భాషా రాని 'బ' 'బ' 'బ' శబ్దాలు (ఇదే అతిసులువైన శబ్దం) మాత్రమే చేయగలడు.మాట్లాడడం సామాజికాంశం. గొప్ప భాషా పండితుల బిడ్డయినా అడవిలో తప్పిపోయి అక్కడే పెరిగితే మాటలు రాని 'టార్జాన్' మాత్రమే కాగలడు.ముక్కు, వూపిరితిత్తులు, సప్తపథ (pharynx), నాలుక, పళ్లు, దవడలు, పెదాలు, అంగిటి లాంటి అనేక భాగాల సమన్వయంతో చేసే శబ్దాన్ని వినలేకపోతేే వాటి సాయంతో పలకగలిగే శక్తిరాదు.
జ : వేదాలలో ఋఉగ్వేదము రంగు " తెలుపు " , సామవేదము రంగు " నలుపు " . ఆ రెండు వేధాల రంగులే ..... పగలూ ,రాత్రి . అందుకే పూర్వము ఆ వర్ణాలు గల జింక చర్మము మీద తపస్సు చేసేవారు. జింక చర్మము మీద తపస్సు అనేక వ్యాధులను దూరము చేస్తుందని ఆయుర్వేద శాస్త్రాల సారాంశము ద్వారా తెలుస్తోంది.ఈ కాలములో జింక చరమము మీద తపస్సు చాలా పెద్ద నేరము . పూరం కాలము లో కాలం చెల్లిన జింక చర్మాలను మాత్రమే ఋషులు ఉపయోగించేవారు .
జవాబు:ఎడారుల్లో అనేక రకాలున్నాయి. పూర్తిగా ఇసుకతో నిండి ఉండేవాటితో పాటు, బల్లపరుపుగా ఉండే రాతి నేలలు, అత్యంత వేడిగా ఉండేవి, చాలా చల్లగా ఉండే ఎడారులు కూడా ఉన్నాయి. ఎడారుల్లో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఇవి నివాసయోగ్యం కాని నిర్జన ప్రదేశాలు.ఎడారులు ఏర్పడడానికి కారణం అనేకం. భూమిపై గాలి ఒకే దిశలో ఎక్కువ దూరం పయనిస్తే, ఉష్ణం వల్ల ఆ గాలిలోని తేమ ఆవిరై, రాన్రాను ఆ గాలి పొడిగా మారుతుంది. ఈ పొడిగాలులు వీచినంత మేర భూమిపై ఉండే తేమ కూడా ఆవిరైపోతుంది. అలా ఆ భూభాగం ఎండిపోవడం ఆరంభిస్తుంది. తడిలేక పోవడంతో ఆ ప్రదేశంలోని మొక్కలు, చెట్లు ఎండిపోయి నేల సారం కోల్పోతుంది. క్రమేణా ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. ఎడారులు చాలా వరకూ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. దీనికి కారణం ఆ ప్రాంతంలో వేడి అధికంగా ఉండడంతో నేలలో ఏమాత్రం తడి ఉండకపోవడం. భూమధ్య రేఖకు దూరంగా ఉన్నా, సముద్రాలకూ భూభాగానికీ మధ్య అనేక పర్వత శ్రేణులుంటే, తేమగాలులు ఆ పర్వతాలను దాటి అవతలి వైపు వెళ్లకపోవడం వల్ల ఇటువైపే వర్షాలు కురిసి, ఆవలి వైపు ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితులున్న ప్రదేశాల్లో శిలలు నిత్యం గాలుల తాకిడికి అరుగుదలకు లోనవుతూ, రాన్రానూ విచ్ఛిన్నమవుతూ వివిధ పదార్థాలుగా విడిపోతాయి. వాతావరణంలో అప్రయత్నంగా కురిసే యాసిడ్ వర్షాల వంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలాభాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌లా మారిపోతాయి. వీటిలో కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరికొన్ని ఇసుకగా మిగిలిపోతాయి. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది శిలలు విచ్ఛిన్నమవడం వల్లనే.
జవాబు: ఏదైనా ఒక ద్రవం ఆవిరయ్యే సమయం దాని అంతర్గత అణునిర్మాణం, పరిసరాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ద్రవాల్లో అణువుల మధ్య ఉండే బంధాల బలాలు, అణువుల ద్రవ్యరాశి కూడా ప్రభావం చూపిస్తాయి. అణువుల మధ్య బంధం ఎంత బలంగా ఉంటే ఆ ద్రవం అంత స్థిరంగా ఆవిరి కాకుండా ఉంటుంది. అసలు ఆవిరి కావడం అంటే అణువులు తమ మధ్య ఉండే బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా వాతావరణంలో కలవడమే. అలాగే అణువుల ద్రవ్యరాశి ఎంత తక్కువ ఉంటే అంత తొందరగా ఆవిరవుతాయి. ఇప్పుడు నీటి విషయానికి వస్తే అణువుల మధ్య ఉండే బంధ బలం ఎక్కువ. కానీ పెట్రోలు అణువుల మధ్య బంధాలు బలహీనంగా ఉంటాయి. పెట్రోలు అణువుల భారం కన్నా, నీటి అణువుల భారం తక్కువే అయినా ఇక్కడ బంధ బలమే ప్రభావం చూపుతుంది. అలాగే పరిసరాల్లోని వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత కూడా ద్రవాలు ఆవిరయ్యే వేగాన్ని, తీరును ప్రభావితం చేస్తాయి. పెట్రోలు సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే ఆవిరయిపోతుంది.
-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
జవాబు: నలుపు తెలుపు ఫొటోల్లో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నలుపు తెలుపు ఫిల్మ్ మీద సిల్వర్ బ్రొమైడు లేదా సిల్వర్ అయొడైడ్ అనే రసాయన పూత ఉంటుంది. కెమేరాను క్లిక్ చేసినప్పుడు వస్తువు నుంచి వచ్చే కాంతి కెమేరా కటకం ద్వారా ఫిల్మ్ మీద పడుతుంది. దాని మీద ఉండే పూతకి కాంతి సమక్షంలో వియోగం (photo dissociation) చెందే లక్షణం ఉంది. అంటే కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం పారదర్శకంగా మారుతుంది. ఇక డెవలప్ చేయడమంటే ఫిల్మ్‌లోని పూతపై జరిగిన రసాయనిక చర్యను తొలగించడమే అనుకోవచ్చు. అప్పుడు కాంతి ఎక్కువగా పడిన ప్రాంతం నల్లగా మారుతుంది. మన శరీరం లేదా వస్తువుల మీద తెల్లని భాగాలు (పళ్లు, కంటిపాప, తెల్ల దుస్తులు, గోడలు...) నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందుతుంది కాబట్టి ఆయా ప్రాంతాలు నెగెటివ్‌లో నల్లగా కనిపిస్తాయి. అలాగే శరీరం లేదా వస్తువుల మీద ఉండే నల్లని భాగాలు (తలవెంట్రుకలు, నల్లని దుస్తులు, కనుగుడ్లు, గొడుగులు...) తమ మీద పడిన కాంతిని ఎక్కువగా శోషించుకుని తక్కువ కాంతిని పరావర్తనం చేస్తాయి. అలా తక్కువ కాంతి పడిన భాగాలు నెగెటివ్‌లో తెల్లగా కనిపిస్తాయి.
జవాబు: బాణసంచా కాల్చినప్పుడు వెలువడే రంగులకు కారణం రకరకాల రసాయన పదర్థాలే. బాణసంచాను సాధారణంగా పొటాషియం నైట్రేట్, సల్ఫర్, బొగ్గు పొడి మిశ్రమంతో తయారు చేస్తారు. ఇవి చాలా వరకు ధ్వనులను ఉత్పన్నం చేస్తాయి. ఇక లోహలవణాలైన స్ట్రాంషియమ్, బేరియం రంగులను వెదజల్లుతాయి. ఈ లవణాలను పొటాషియం క్లోరేట్‌తో కలుపుతారు. బేరియం లవణాలు ఆకుపచ్చ రంగును, స్ట్రాంషియమ్ కార్బొనేట్ పసుపు వర్ణాన్ని, స్ట్రాంషియమ్ నైట్రేట్ ఎరుపు రంగును వెదజల్లుతాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా బాణసంచాకు ఖర్చు చేసే మొత్తం అక్షరాలా 5000 కోట్ల రూపాయలు!
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జవాబు: హాని కలిగిస్తున్నామా, మేలు చేస్తున్నామా అనే విషయం ఆయా సూక్ష్మజీవులకు తెలీదు. వాటి మానాన అవి జీవిస్తుంటాయి. ఇక ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం అనేది వాటి జీవన విధానంలో ఒక భాగమే. సాధారణంగా మనం ప్రమాదాన్నే గుర్తిస్తాము కానీ మేలును కాదు. పెరుగు తింటున్నప్పుడల్లా మనం ఈస్ట్ బ్యాక్టీరియాను తలుచుకోము. ఏ దగ్గో, జ్వరమో వస్తే అందుకు కారకమైన సూక్ష్మజీవుల గురించి ఆరా తీస్తాము. మొత్తానికి హానిచేసేవైనా, మేలు చేసేవైనా అవి ఒకరి నుంచి ఒకరికి చేరుతూనే ఉంటాయి.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
జ : పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయి. రాణి చీమలు రోజుకి 92 సార్లు మాత్రమే నిద్రపోతాయి. కాని నిద్రపోయే కాలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిసారి ఆరు నిముషాల పాటు నిద్రపోతాయి. అంటే రోజు మొత్తంలో 9.4 గంటల సమయం నిద్రిస్తాయి.సాధారణంగా చీమలు నిద్రపోవని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే రాత్రివేళల్లో చీమలు పని చేయవు కాబట్టి అవి ఏదో ఒక రూపంలో విశ్రాంతి తీసుకుంటాయి. కానీ నిద్రపోయే సమయం ఒక్కొక్క చీమకు ఒక్కొక్క రకంగా ఉంటుందని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు.
జవాబు: అన్ని గబ్బిలం జాతులు రక్తాన్ని పీల్చము . . . కాని " వాంఫైర్ " జాతి గబ్బిలాలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. రాత్రివేళ పశువులమీద వాలి తమ నోటిలోని పదునైన పళ్ళతో చర్మాన్ని కొరికి గాయము చేస్తాయి. ఆ గాయము నుండి కారే రక్తాన్ని పిల్లి పాలు తాగినట్లు గా నాలుకతో నాకి తాగుతాయి. ఒక సారి మదలుపెడితే అరగంట సేపు రక్తము తాగుతాయి. సంవత్సరము లో ప్రతి వాంఫైర్ గబ్బిలము సుమారు 25-26 లీటర్ల రక్తము తాగుతాయని అంచనా.
జవాబు: సాధారణంగా సెల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోకముందే ఆఫ్ చేస్తే, ఆ బ్యాటరీ శక్తితో సమాచారం సెల్‌ఫోన్ సర్క్యూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి ఫోన్ మెమొరీలో ఉన్న కాంటాక్ట్ పేర్లు వగైరా సమాచారమంతా అలాగే ఉంటుంది. అందుకే తిరిగి ఆన్ చేసినపుడు తేదీ, సమయం, ఇతర వివరాలు కూడా ఉంటాయి. కానీ సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్ చేస్తే దానిలోని బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది. అప్పుడు ఫోన్ మెమొరీలో ఉండే సమాచారం మొత్తం ఖాళీ అవుతుంది. తిరిగి ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే ఆ సమాచారం తిరిగి రాదు. కానీ తేదీ, కాలం మాత్రం బాగానే కనిపిస్తాయి. ఇందుకు కారణం ఫోన్ మెమొరీ కాదు. మనం ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో, ఆ టవర్‌తో లింకు ఏర్పడి వారి సర్వీసు సర్వర్ కంప్యూటర్‌తో సంధానించుకుంటుంది. అయితే కాంటాక్ట్స్, ఇతర వివరాలను సెల్‌లో ఉండే మైక్రోచిప్‌లోకానీ, సిమ్ మెమొరీలో కానీ దాచుకుంటే ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి వాడుకోవచ్చు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,--వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
జ : ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి, దానిని, కేంద్రకం క్రియా రహితం చేయబడిన లేదా తొలగించిన వేరొక ఫలదీకరణం చెందని అండకణం లోనికి ప్రవేశ పెట్టే ప్రక్రియ క్లోనింగ్. క్లోనింగ్ రెండు విధాలుగా ఉంటుంది:
ప్రత్యుత్పాదక క్లోనింగ్ : కొంత విభజన తరువాత అండకణాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టినపుడు అది దాత కేంద్రకంతో జన్యుపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది.
చికిత్సాయుత క్లోనింగ్ : అండాన్ని రాతి గిన్నె (పెట్రి డిష్ )లో ఉంచినపుడు అనేక రుగ్మతలపై ప్రభావ వంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి రోగాల చికిత్సలకు ఉపయోగిస్తారు .
1997 లో రోస్లిన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలిసి గొర్రె క్షీర గ్రంధుల నుండి డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా సృష్టించినపుడు ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. డాలీని సృష్టించిన ప్రక్రియ లోనే మానవ క్లోనింగ్ కూడా సాధ్యమేనని చాలా మంది భావించారు. ఇది నైతిక వివాదాలను సృష్టించింది. ఇటువంటి క్లోనింగ్ మనుషులమీద చేస్తే ఎక్కువకాలము బతకరనీ , త్వరగా చనిపోతారనీ, ఇది చాలా అపాయకరమైన ప్రయోగమని , చెయ్యవద్దని " విల్ మట్ " స్పష్టముగా చెప్పారు . ఈ హ్యూమం క్లోనింగ్ ని అమెరికా , బ్రిటన్ వంటి దేశాలు నిషేదించడమే కాదు ... ఇటువంటి ప్రయోగాలు మానవజాతిపట్ల జరిగే అపచారం , హత్యతో సమానం అని అన్నారు
జవాబు: మనం చూడగలిగినట్టు ప్రాణులన్నీ వివిధ రంగులను చూడలేవు. బొద్దింకలు (కాక్రోచ్) పసుపు రంగును చూడలేవు. ఎందుకంటే వాటి కళ్లలో ఆ రంగు పౌనఃపున్యానికి స్పందించే కణాలు ఉండవు. అందువల్ల వాటికి పసుపు రంగు నలుపుగా కనిపిస్తుంది. అందువల్లనే పసుపు రంగు గాజు పెట్టెను అవి చీకటి ప్రాంతంగా భ్రమించి అక్కడ క్షేమంగా దాక్కోవచ్చనే భావనతో అందులోకి చేరుకుంటాయి. అందుకనే ఆ రకమైన పెట్టెలను వాటికి బోను (trap)ల్లాగా ఉపయోగించి వాటి బెడదను వదిలించుకుంటారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జవాబు: దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం వరకు డైనోసార్లు ఈ భూమ్మీద ఉండేవన్నది పచ్చినిజం. వివిధ ప్రజాతులకు చెందిన డైనోసార్ల శిలాజ (fossil)అవశేషాలు వాటి ఉనికికి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆ దశలో భూమ్మీద అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాలు కూడా కలిసే ఉండేవి. కానీ విపరీతమైన ప్రకృతి వైపరీత్యాల వల్ల, వాటి దేహ నిర్మాణంలోని అసౌకర్యం వల్ల, వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల ఇవి క్రమేపీ అంతరించాయి. ఓ సిద్ధాంతం ప్రకారం ఓ పెద్ద గ్రహశకలం భూమిపై పడిన ఆతాకిడి కలిగించిన తీవ్రమైన పరిస్థితుల వల్ల ఒక్కమారుగా డైనోసార్లు అంతరించాయని, కేవలం చిన్న జీవులే బతికాయని చెబుతారు. అయితే డైనోసార్లు ఇప్పుడు లేవు. జురాసిక్ పార్క్ లాంటి సినిమాల్లోను, కొన్ని ఛానెల్స్‌లోను చూపించే డైనోసార్లు కేవలం కల్పితం. కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా యానిమేషన్ చేసి అవి మన మధ్యే తిరుగుతున్నట్టు చూపిస్తారంతే.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@Eenadu hai bujji .
జవాబు: ఒక వస్తువును నిరోధ బలాన్ని (resistant force) అధిగమిస్తూ కొంత దూరం జరపవలసినప్పుడే శక్తి అవసరం అవుతుంది. ఒక పదార్థపు ఉష్ణోగ్రతను లేదా శక్తిస్థాయి (energy level)ని తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకు చేర్చడానికీ శక్తి కావాలి. భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ (spin) ప్రక్రియలో కానీ, సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ(revolution) ప్రక్రియలో కానీ భూమి ఎదుర్కొనే ఘర్షణ (friction) లేదా అవరోధ బలం (opposing force) అంటూ ఏవీ లేవు. అంటే భూమి తన భ్రమణ, పరిభ్రమణ ప్రక్రియల్లో శక్తిని ఖర్చు పెట్టవలసిన అగత్యం ఏమీ లేదు. అంటే భూమి కదలికల వెనుక శక్తి పనిచేయడం లేదని కాదు అర్థం. భూమి కదలికలకు అవసరమైన శక్తి తన పుట్టుకతోనే విశ్వజనీనంగా లభ్యమైంది. అలా లభ్యమైన శక్తి ఎంత మాత్రం ఖర్చు కావడం లేదు. అందువల్ల భూమి శక్తి అయిపోవడమనే ప్రశ్నగాని, భూమి ఆగిపోతుందనే భయంగాని అవసరం లేదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
జవాబు: భూమి సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరగడానికి కారణం సూర్యుడు భూమిని ఆకర్షించడం, భూమికి గల ద్రవ్యవేగం (momentum). ఒక వస్తువు ద్రవ్యవేగం దాని ద్రవ్యరాశి(mass), వేగం (velocity) పై ఆధారపడి ఉంటుంది. భూమి ద్రవ్యరాశి ఎంత అధికంగా ఉంటుందంటే దానిపై ఉండే వస్తువుల ద్రవ్యరాశిలోని మార్పులు, చేర్పులు దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. అంటే దాని ద్రవ్యరాశిలో కానీ, వేగంలో కానీ ఎలాంటి మార్పులు ఏర్పడవు. అంతేకాకుండా న్యూటన్ మొదటి గమన సూత్రం ప్రకారం ఒక వస్తువు గమనంలో మార్పు తీసుకురావాలంటే ఆ వస్తువుపై బలాన్ని (force) ప్రయోగించాలి. ఇది బాహ్య బలమై ఉండాలి. అంటే వస్తువు వెలుపల నుండి కలగాలి. గమనంలో ఉన్న బస్సులోని ప్రయాణికులు వారి ముందుండే సీట్లను బలంగా నెట్టడం ద్వారా బస్సు వేగాన్ని పెంచలేరు కదా. అలాగే భూమి ఉపరితలం నుండి దాని గురుత్వాకర్షణ శక్తి పనిచేసే 'పై వాతావరణం' వరకు ఒక సంవృత వ్యవస్థ (closed entity) మొత్తాన్ని ఒక బస్సులాగా ఉహిస్తే, అందులోని ప్రాణుల, వస్తువుల కదలికలు భూమి గమనంలో ఏ మార్పునూ తీసుకురాలేవు. అందువల్ల భూమిపై ఉండే మనుషులందరూ ఒకేసారి పైకెగిరి దూకినా ఏమీ జరగదు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
రాత్రివేళ పొలాల్లో కొరివి దెయ్యాలను చుశామంటారు , అవి అడవిలో మరీ ఎక్కువగా కనిపిస్తాయని , మంటతో వెలుతుంతాయని అంటారు . ఆది అంతా భయమే తప్ప దెయ్యాలు ఉండవు .అయితే మంట విషయం నిజమే కాని అవి దెయ్యాలు మాత్రం కానే కావు . పక్షుల రెట్టలు , వృక్ష , జంతుజాల అవశేషాలలో ఉండే సోడియం , గంధకం , ఫాస్ఫరస్ వంటి తేలికగా మండే గుణం గల ధాతువులు భూమిమీద ఉష్ణోగ్రత మార్పుల వల్ల మండుతాయి . ఇలా మండటం పగలు జరుగుతుంది కాని మనం పగటి కాంతిలో వాటిని గమనించే అవకాశమూ వుండదు ... రాత్రివేళ మండినపుడు చీకటి వల్ల కనిపిస్తాయి . .. . అవే కొరివి దెయ్యాలని మనము భ్రమపడుతుంటాము .
జవాబు: ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ద్రవాభిసరణము (osmosis) అనే ప్రవాహుల (fluids) ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేర్వేరు గాఢతలు (concentrations) గల ద్రవాలను ఒక సన్నని పొర (మెంబ్రేన్) విడదీస్తుంటే, నీరు ఎక్కువ గాఢతగల ద్రవం వైపు ప్రవహిస్తుంది.మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం, దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం, మొప్పల ద్వారా శోషింపబడుతుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలక పోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పునీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటకి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పునీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు, నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరక ముందే మొప్పలు ఉప్పునీటిలోని ఉప్పును విసర్జిస్తాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జ :ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు . చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలుకాని రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచము దూరము లో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము . శత్రువులనుంది రక్షించుకునేందుకు , ఆహారము వేటాడే సమయములో వేగముగా చలించేందుకు ఇలా ఎగురుతాయి.
జవాబు :చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి అవి ఎప్పుడు చూసినా కళ్లు తెరిచే ఉన్నట్టు కనిపిస్తాయి. అయితే అవి కూడా ఎంతో కొంత సేపు నిద్రపోతాయి. కొన్ని చేపలు పగటివేళ నిద్రిస్తే మరికొన్ని రాత్రివేళల్లో నిద్రిస్తాయి. నిద్రపోయే సమయం రాగానే సముద్రంలో ఉండే చేపలు నీటిలోతుల్లో ఉండే గుహల్లోకి, పగడపు లోయల్లోకీ వెళ్లి బంకమన్నులాంటి పదార్థాన్ని పూతగా తమ దేహాలపై ఏర్పాటుచేసుకుని తమ ఉనికిని ఇతర ప్రాణులు కనిపెట్టకుండా జాగ్రత్తగా నిద్రపోతాయి. చేపలు నిద్రించేపుడు వాటి జీవ ప్రక్రియలు కొంతమేర నెమ్మదించడంతో అవి అంత చురుగ్గా ఉండవు. అంతే కానీ అవి తమ స్పృహను పూర్తిగా కోల్పోవు. నిద్రించే చేపలపై పరిశోధనల మూలంగా తేలిందేమంటే అవి గాఢనిద్రలోకి చేరుకోకుండానే నెమ్మదిగా నీటిలో ఈదుతూనే ఉంటాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జవాబు: ఒంటెలు తమ వీపుపై ఉండే మూపురాల్లో నీటిని నిల్వ చేసుకుంటాయని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. వాటి మూపురాల్లో ఉండేది కొవ్వు పదార్థమే. మండుటెండల్లో ఏమాత్రం తడిలేని ఎడారుల్లో కూడా ఒంటెలు అలసట లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అందుకు తగిన శక్తిసామర్థ్యాలను అవి తమ మూపురాల్లో ఉండే కొవ్వు ద్వారానే పొందుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించే ఒంటెల మూపురాలలో కొవ్వు కొంత కరిగిపోయి వదులవడానికి కారణం ఇదే. మొత్తం మీద ఒంటెలు ఎడారుల్లో నీరు తాగకుండా రెండు మూడు వారాల వరకు ప్రయాణించగలవు. వాటి ముక్కుల్లో ఉండే సన్నని వెంట్రుకల సాయంతో అవి గాలిలో ఉండే తేమను గ్రహిస్తూ, శరీరం నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటిని భర్తీ చేసుకోగలవు. అలా ఒంటెలు తమ శరీర ఉష్ణోగ్రతను పది డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గించుకోగలవు. నీరు లభించినప్పుడు ఒంటెలు కేవలం కొన్ని నిముషాల్లోనే దాదాపు 100 లీటర్లు తాగగలవు. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్తకణాలు గోళాకారంలో ఉండడం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హానీ జరగదు.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
జ : చెట్ల ఆకులు రంగులు మార్చవు . అప్పుడే పుట్టిన ఆకులు(చిగురాకులు) లేత ఆకుపచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఆ తర్వాత పూర్తి ఆకుపచ్చగా మారుతాయి. అయితే ఇది రంగు మార్చుకోవడము కాదు . లేత ఆకు తన మీద కీటకాలు దాడిచేసి తినకుండా వుండేందుకు చేసుకున్న ఏర్పాటు . ఆ ఎరుపు రంగును కీటకాలు గుర్తించలేవు . లేత ఆకుల్లో ఉండేటటువంటి ఒక రకమైన రసాయనము దానిని రుచిలేని ఆకుగా మారుస్తాయి. పైగా లేత ఆకుల్లో పత్రహరితము కాక " ఎంథోసైనిన్ " అనే వర్ణకము అధికముగా ఉండి ఎరుపు రంగును ఇస్తుంది. ఈ వర్ణకము సూర్యుడి ఎండతీవ్రతకు లేత ఆకు మాడకుండా రక్షిస్తుంది.
జవాబు: 'బిగ్ బ్యాంగ్' వల్ల విశ్వం ఉత్పన్నమైనట్లే భవిష్యత్తులో 'బిగ్ క్రంచ్' ప్రక్రియ ద్వారా విశ్వంలో అన్ని రకాల జీవజాలం అంతరిస్తుందనేది శాస్త్రజ్ఞుల ఊహ. ప్రస్తుతం విశ్వం విస్తరిస్తున్నా కొంతకాలం తరువాత ద్రవ్య, శక్తుల సాంద్రత పలచబడటంతో జీవం కొనసాగడానికి అవసరమైన శక్తి లభించే అవకాశం లేకపోవచ్చు. ఈ పరిస్థితులకు తగ్గట్టు జీవ ప్రక్రియలు తొలుత అతి నెమ్మదిగా కొనసాగినా ఒక దశలో అది కూడా సాధ్యం కాకపోవచ్చు. పరిసరాల ఉష్ణోగ్రత జీవజాలాల ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నంత వరకే జీవులు శక్తిని విడుదల చేయగలవు. విశ్వంలోని ఉష్ణోగ్రత ఒక కనిష్ఠ స్థాయి వరకు చేరుకోగలదు. ఆ ఉష్ణోగ్రత మైనస్ 273.15 సెంటీగ్రేడ్. విశ్వంలోని జీవం ఉష్ణోగ్రత అంతకన్నా ఏ మాత్రం తగ్గినా జీవాల మనుగడకు ముప్పు ఏర్పడుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గినా జీవులన్నిటితో పాటు మనమూ అసౌకర్యానికి, అనారోగ్యానికి గురవుతామనేది తెలిసిందే కదా?
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు,హైదరాబాద్
జవాబు: జీవం పుట్టుకకు మరియు దాని మనుగడకు కావలసిన వాతావరణం మనకు తెలిసి కేవలం ఈ భూమి మీదనే ఉంది.మిగతా గ్రహాలమీద నీరు లేకపోవడము,అధిక వేడిమి లేదా అతి శీతలం,ప్రాణ వాయువు లేకపోడము వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల కారణంగా జీవం ఉండదనే చెప్పాలి.కాని....ఈ భూమి మీద లాగానే ఏ సుదూర గ్రహం మీదో అనుకూల పరిస్థితులు ఉంటే తప్పకుండా జీవం ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం.
ఆధారము: వందనా శేషగిరిరావు గారి బ్లాగు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020
మనకు తెలియని కిన్ని ప్రశానలకు శాస్త్రీయ సమాధానాలు.
నిత్యజీవితంలో మనము అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు త...
శాస్త్రీయ విధానంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు.
కొన్ని ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు.