অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ విజ్ఞానం IV

శాస్త్రీయ విజ్ఞానం IV

 1. కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?
 2. వేసవి కాలములో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతు ఉంటాయి ... ఎందుకు?
 3. డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి? నీటిలోనే ఆక్సిజన్‌ ఉంటుంది కదా?
 4. గుర్రంలాగా గాడిద ఎందుకు పరిగెత్తదు?
 5. టీ,కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే పళ్లు వూడిపోతాయంటారు? నిజమేనా?
 6. సాలెపురుగు, బల్లి, నల్లి లాంటి కొన్ని జీవులు ఎప్పుడూ నీరు తాగవు కదా, మరి ఎలా బతకగలుగుతున్నాయి?
 7. పాలకూర, టమాటా కలిపి వండితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు, నిజమేనా?
 8. పావురము చెట్టుమీద వాలదా?
 9. కలలు నిజ జీవితం పై ప్రభావం చూపుతాయా?
 10. కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా?
 11. చెవిలో గులిబి ఎందుకు వస్తుంది? దాని వల్ల ఉపయోగం ఏమిటి?
 12. ఎత్తయిన ప్రదేశంలో నిలబడి చుట్టూ చూస్తే చాలా దూరంలో భూమి, ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఎటు చూసినా అలాగే ఉంటుంది. అవి నిజంగా కలుస్తాయా?
 13. సూర్యుని చుట్టూ భూమి ఏ శక్తితో తిరుగుతోంది? తిరిగే ఏ వస్తువైనా శక్తిని కోల్పోతుంది కదా? భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది?
 14. అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి?
 15. భూమి బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా? బొంగరం కాసేపటికి ఆగిపోయి పక్కకు పడిపోయినట్టే భూమి కూడా పడిపోతుందా?
 16. భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా! మరి విమానాలు గాలిలో ఎగిరేప్పుడు కింద భూమి తిరిగిపోతే అవి గమ్యస్థానాలను ఎలా చేరుకోగలుగు తున్నాయి?
 17. విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?
 18. పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎలా ప్రభావితం అవుతుంది ?.
 19. ఈఫిల్ టవర్ సంగతేమిటి ?
 20. సైన్సు విషయంలో చాలా చిక్కు ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఉదాహరణకు 'కోడి ముందా? గుడ్డు ముందా?' అన్న మీమాంసకు సమాధానం ఏమిటి? అలాగే 'విత్తు ముందా? చెట్టు ముందా?' అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి?
 21. కోడిగుడ్డులోని తెల్లసొనను గిలక్కొడితే గట్టిపడుతుంది, ఎందుకు?
 22. భారతీయ సంప్రదాయంలో వివాహం ఎన్ని రకాలు?
 23. కరంటు తీగలు ఎందుకు వదులుగా ఉంటాయి ? రెండు కరంటు స్థంభాల మధ్య ఉండే వైర్లు వదులుగా ఉండి కాస్త కిందికి వేళ్ళాడుతుంటాయి . వాట్నిని గట్టిగా బిగించి కట్టరు . కారణము ఏమిటి ?
 24. బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడాన్ని గమనించాను. ఎందుకు?
 25. కరెంటు స్తంభాల మధ్య ఉండే తీగ పురి తిప్పి ఉంటుంది. ఎందుకు?
 26. కరెంటు నీటిలో పాస్‌ అవుతుంది. మరి గాలిలో ఎందుకు పాస్‌ కాదు?
 27. వర్షం కురిసినపుడు వచ్చే మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు అదెలా సాధ్యం?
 28. రైళ్లలో ఫ్యాన్లకు, లైట్లకు విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది?
 29. ఏనుగుకు అంత పెద్ద చెవులు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి?

కాలం గడిచే కొద్దీ సూర్యుడి బరువు తగ్గుతుందా?

సూర్యునిలో ప్రతి సెకనుకు 700 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ రూపాంతరం చెంది హీలియంగా మారుతుంటుంది. ఫలితంగా కాలం గడిచే కొద్దీ సూర్యుని ద్రవ్యరాశి (mass) తగ్గి తేలికవుతాడు. సూర్యుని అంతరాల్లో జరిగే కేంద్రక సంయోగ చర్య (nuclear fusion) ద్వారా నాలుగు హైడ్రోజన్‌ పరమాణువులు ఒక హీలియం పరమాణువుగా మారుతుంటాయి. ఈ ఒక్క హీలియం పరమాణువు ద్రవ్యరాశి, నాలుగు హైడ్రోజన్‌ పరమాణువుల ద్రవ్యరాశి కన్నా తక్కువ.అంటే హైడ్రోజన్‌ పరమాణువులు కోల్పోయే ద్రవ్యరాశి శక్తిగా మారుతోందన్నమాట. ఇలా ద్రవ్యం, శక్తిగా మారడాన్ని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ రూపొందించిన E = mc2 సమీకరణం ద్వారా లెక్క కట్టవచ్చు. ఇక్కడ m కోల్పోయిన ద్రవ్యరాశి అయితే, c శూన్యంలో కాంతి వేగం. ఆ విధంగా ప్రతి సెకనుకు సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవిత కాలంతో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో 0.01 శాతం మాత్రమే!

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌.

వేసవి కాలములో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతు ఉంటాయి ... ఎందుకు?

వేసవి కాలములో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా ... మనుష్యులు , జంతువులూ దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరము గా ఉండాలి . మనుష్యుల దేహములో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి . అందులో ముఖ్యమైనది చర్మము ... దీనిలోని స్వేదగ్రందులు ద్వారా చెమట శరీరుపరితలం పైకి వస్తుంది .ఆ చెమట ఎప్పటికప్పుడు భాస్పీకరణం (Evaporation) చెంది ఆరిపోవడానికి మనశారీరము నుండే ఉష్ణాన్ని గ్రహిస్తుంది ... అందువల్ల శరీరము చల్లబడుతుంది . కాని కుక్కలాంటి జంతువులకు స్వేదగ్రందులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు ..అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావము వల్ల పెరుగుదలకు లోనవుతుంది . కుక్క అందుకనే తన నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం (panting) చేస్తుంది . దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరము గా ఉంటుంది .

డాల్ఫిన్లు గాలి కోసం బయటకు ఎందుకు వస్తాయి? నీటిలోనే ఆక్సిజన్‌ ఉంటుంది కదా?

అన్ని జలచరాలకీ ఒకే రకమైన శ్వాసక్రియ ఉండదు. చేపల్లాంటి పూర్తి స్థాయి జలచరాలు తమకుండే మొప్పల్లాంటి అవయవాల సాయంతో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్‌ను రక్తంలోకి వ్యాపనం (diffusion) చేసుకోగలవు. కప్పలు, కొన్ని రకాల ఉభయచరాలు గాలిలో ఉండే ఆక్సిజన్‌ను ముక్కు రంధ్రాల ద్వారా పీల్చుకోగలిగినా, చర్మపు పొరలోకి కూడా నీటిలోని ఆక్సిజన్‌ను సైతం కొంతలో కొంత సేకరించుకోగలవు. కానీ నీటిలోనే నివాసం ఉంటున్నా నీటిలోని ఆక్సిజన్‌ను గ్రహించలేని జలచరాలు కూడా ఉన్నాయి. నీటి పాములు, తాబేళ్లు, మొసళ్లు, సీల్స్‌, డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి జీవులకు మొప్పలు ఉండవు. చర్మపు నిర్మాణం కూడా నీటిలోని ఆక్సిజన్‌ను తీసుకోగల స్థితిలో ఉండదు. వాటికి ఊపిరితిత్తులు (lungs), నాసికా రంధ్రాలు (nostrils) ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరి ద్వారా గ్రహించగలిగే శ్వాస వ్యవస్థ (pulmonary respiration) మాత్రమే వీటిలో ఉంటుంది. అందువల్లనే ఇలాంటివి సముద్రంలోనే ఉన్నా పదేపదే నీటి ఉపరితలం పైకంటా వచ్చి గాలిని వదిలి, కావలసినంత గాలిని పీల్చుకుని తిరిగి నీటిలోకి వెళ్లిపోతూ ఉంటాయి.

గుర్రంలాగా గాడిద ఎందుకు పరిగెత్తదు?

వివిధ జంతువులకు వివిధ రకాలైన శారీరక నిర్మాణం ఉంది. గుర్రానికి, గాడిదకు కొన్ని పోలికలు ఉన్నా శరీర నిర్మాణం ఒకేలా ఉండదు. గాడిదకు, గుర్రానికి ఉన్న జన్యు సారూప్యత (genetic proximity) కన్నా, జీబ్రాకు, గుర్రానికి మధ్య ఎక్కువ జన్యు సారూప్యత ఉంది. గుర్రం దేహంలో వేగంగా పరిగెత్తడానికి వీలైన బాహ్య, అంతర వ్యవస్థలు ఉన్నాయి. దాని కాలి కండరాల దృఢత్వం ఎక్కువ. ఆ కాళ్లను, మడమలను నియంత్రించే మెదడు భాగానికి, దాని కండరాలకు మధ్య ఉన్న నాడీసంధానం గాడిదకు లేదు. గుర్రం కాళ్లు పొడవుగా ఉండడం, మెడ భాగం దృఢంగా ఉండడం వల్ల పరిగెత్తేప్పుడు అది తన శరీరాన్ని బాగా నియంత్రించుకోగలదు. పరిగెత్తడంలో గుర్రం తోక పాత్ర కూడా ఎక్కువ.ఇలాంటి శారీరక అనుకూలతలే జంతువుల పరుగు సామర్థ్యాలను నిర్ణయిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

టీ,కాఫీ తాగిన వెంటనే మంచి నీళ్లు తాగితే పళ్లు వూడిపోతాయంటారు? నిజమేనా?

టీ పొడిని, తేయాకు చెట్ల గుబురు పొదల్లోని లేత ఆకుల్లోంచి, కాఫీ పొడిని కాఫీ చెట్ల గింజల్నుంచి తయారు చేస్తారు. టీలో రకరకాల నాణ్యతలున్నాయి. గ్రీన్‌టీ, బ్లాక్‌టీలలో ఫ్లావనాయిడ్లు, అమైనోఆమ్లాలు, విటమిన్లు, క్యాటికిన్లు అనే ధాతువులు బాగా ఉంటాయి. టీ పదే పదే తాగాలనిపించే సున్నిత వ్యసనాన్ని కలిగించే కెఫిన్‌ ఈ తేనీళ్లలో తక్కువగా ఉంటుంది. కేన్సర్‌ నిరోధానికి, వూబకాయాన్ని నివారించడానికి ఇలాంటి తేనీరు మంచిదని వైద్యులు సూచిస్తారు. కానీ సాధారణంగా మనం తాగే ఎక్కువ రకాల టీ పొడుల్లో కెఫిన్‌తో పాటు, ఫ్లోరైడు ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్లకు గార పట్టించే టానిన్‌ పదార్థాలు కూడా కొద్ది మోతాదులో ఉంటాయి. కాఫీ పొడిలో టీ కన్నా అధిక శాతం కెఫిన్‌ ఉంటుంది. నాణ్యమైన కాఫీని మితంగా తాగే అలవాటున్న వాళ్లకు కేన్సర్‌, గుండెజబ్బులు, ఆల్జీమర్స్‌ వంటి జబ్బులు సోకకుండా ఉంటుందనీ అమితంగా తాగితే అందులో ఉన్న కెఫిన్‌ వల్ల కాలేయ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు.
ఇందులో కొద్దో గొప్పో ఫ్లోరైడు ఉండే అవకాశం ఉంది. కాబట్టి టీ, కాఫీలు తాగిన వెంటనే నీరు తాగినా, పుక్కిలించి వూసినా పంటిపై గార పట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ. టీ, కాఫీల తర్వాత నీళ్లు తాగితే పళ్లేమీ వూడిపోవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

సాలెపురుగు, బల్లి, నల్లి లాంటి కొన్ని జీవులు ఎప్పుడూ నీరు తాగవు కదా, మరి ఎలా బతకగలుగుతున్నాయి?

ఏ జీవీ నీటి వినియోగం లేకుండా ఉండలేదు. ఎందుకంటే జీవులన్నీ జీవకణాలతోనే నిర్మితమయ్యాయి. ఆ జీవకణంలో 70 శాతం వరకూ నీరే ఉంటుంది. కొన్ని జీవులు నీరు తాగవనుకోవడం అపోహ మాత్రమే. ఏదో రూపంలో అవి నీటిని గ్రహిస్తాయి. చాలా జీవులకు నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. తాము తీసుకునే ఆహారం ద్వారానే వాటికి కావాల్సిన నీరు శరీరానికి అందుతుంది. ఉదాహరణకు నల్లి మనను కుట్టినప్పుడు మన రక్తంలో ఉండే కణాల్లో సీరం రూపంలో ఉండే నీరు దానికి అందుతుంది. అలాగే బల్లి ఏదైనా కీటకాన్ని భోంచేసినప్పుడు దానిలో ఉండే పోషక పదార్థాలతో పాటు నీరు కూడా బల్లి పొట్టలోకి వెళుతుంది. సాలెపురుగు విషయమూ అంతే. వాటి గూళ్ల మీద ఉదయాన్నే ఏర్పడే మంచు బిందువుల్ని కూడా అవి గ్రహిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

పాలకూర, టమాటా కలిపి వండితే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయంటారు, నిజమేనా?

పాలకూర, టమాటా కలిపి వండుకుని తింటే చాలు రాళ్లు ఏర్పడతాయనేంత తీవ్ర స్థాయిలో దీన్ని నమ్మక్కర్లేదు. అయితే ఇలా చెప్పడానికి కొంత వరకూ కారణం కూడా లేకపోలేదు. పాలకూరతో పాటు ఏ కూరలోనైనా, నీళ్లలో అయినా కాల్షియం, మెగ్నీషియం లవణాలుంటాయి. టమాట, చింతపండు వంటి వాటి రసాల్లో టార్టారిక్‌, ఆక్టాలిక్‌ ఆమ్ల లవణాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం అయాన్లు, టార్టరేట్‌ లేదా ఆక్సలేట్‌ అయాన్లు కలిసినప్పుడు వాటి గాఢత ఎక్కువ మోతాదులో ఉంటే అవి కాల్షియం టార్టరేట్‌ లేదా కాల్షియం ఆక్సిలేట్‌గా అవక్షేపం (precipitate) అవుతాయి. వీటి ద్రావణీయత (solubility) తక్కువ. అయితే కిడ్నీలు వడబోయలేనంత అధికమోతాదులో ఈ లవణాలను కూరగాయల్లో ఉండవు. కాబట్టి పరిమిత స్థాయిలో వాడితే ప్రమాదం లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక

పావురము చెట్టుమీద వాలదా?

పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని నమ్మకము ... అభిప్రాయము . అయితే పావురము చెట్టుమీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరంటు తీగలమీద , వైర్లు మీద వాలదు . గోడలమీద , బిల్డింగ్ ల మీద మాత్రమే వాలుతుంది.  అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణము . మిగతా పక్షులకు కొమ్మలను ,తీగలను పట్టుమునేందు వీలుగా కాలు వేళ్ళు వంగుతాయి. ఆ పట్టువల్ల ఎంత గాలివీచినా కింద పడిపోవు . . . అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు . నేలమీద , ఎత్తుపళ్ళాలు లేని రాళ్ళమీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలము లేదు. అందుకే పావురాలు చెట్టు కొమ్మలమీద కనిపించవు .

కలలు నిజ జీవితం పై ప్రభావం చూపుతాయా?

కలలకు జీవితానికి ఏ సంబంధమూ లేదు. వేల, లక్షల కలల్లో ఏదో ఒకటి మాత్రమే అర్థమున్నదై ఉంటుంది. మీ జీవితాన్ని దిశమార్చగల ఆ దర్శనం మీ కలల్లో లభిస్తే, దానికి మీరు అర్థం వెతుక్కుంటూ తిరిగే పరిస్థితి ఎప్పుడూ రాదు. కల పూర్తి అయినా దాని ప్రభావం మాత్రం తప్పక అలాగే నిలిచి ఉంటుంది.
చాలా మందికి కలలో తమకు ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మెలకువ వచ్చేస్తుంది. తర్వాత వారు కల మధ్యలోనే మెలకువ వచ్చేసిందని బాధపడుతుంటారు. చాలా మంది ఇంతే కలలోనూ తమ గుణం మార్చుకోలేక ఊరికే ఉండిపోతారు. కలల్లో తేలిపోకుండా... నిజ జీవితంలోని తీవ్రతను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిద్దట్లో వచ్చే పిచ్చి కలల్ని నిర్లక్ష్యం చేయండి. మీ నిద్రనే పోగొట్టే గొప్ప కలల్ని మర్చి పోతూ బతకండి.మిమ్మల్ని, మీరు బతికున్న ఈ భూమినీ గొప్పగా తీర్చిదిద్దే కలలు కనండి. అలాంటి కలలు లేని బతుకు జీవాధారంలేని జీవమైపోతుంది. కళ్ళల్లో కలలుండవచ్చు. అయితే, కాళ్ళను మాత్రం నిజంలో నిలదొక్కుకోండి. అప్పుడే అమృతాన్ని రుచి చూస్తారు.

కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా?

పానీయాల్లో చాలావరకూ స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే క్షారాలు (alkaloids) ఉంటాయి. ఉదాహరణకు కాఫీలోని కెఫైన్‌, టీ లోని థియోఫిలైన్‌, కోక్‌లోని కొకైన్‌. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో, ఈ క్షారాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం పానీయాలు కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలను సడలించి సేదతీర్చడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువ పని చేయించడమే కాక, మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువవుతుంది. అలసట తగ్గుతుంది. ఏదో కొత్త ధైర్యం, సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ నూతనోత్సాహం తాత్కాలికమే. ఎక్కువ సేపు నిలవదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువ సార్లు తాగితే భ్రమలకు లోనై స్థబ్దత కలుగుతుంది కూడా.

చెవిలో గులిబి ఎందుకు వస్తుంది? దాని వల్ల ఉపయోగం ఏమిటి?

పంచేంద్రియాల (sensory organs) లో చెవి కూడా ఒకటి. ఇవి పరిసరాలకు తెరిచి ఉంటాయి. దాదాపు ఒక అంగుళం మేర లోతుగా గొట్టంలాగా ఉన్న బయటి చెవి భాగం చివర కర్ణభేరి (ear drum) ఉంటుంది. గాలిలో ప్రయాణించే శబ్ద కంపనాలకు అనుగుణంగా సున్నితమైన కర్ణభేరి కంపనం చెందుతుంది. ఆ కంపనాలకు అనుసంధానంగా ఆవలి వైపుగా అంటుకుని ఉన్న ఎముకలు, ఆపై కాక్లియా అనే మరింత సున్నితమైన భాగం కూడా శబ్ద సంకేతాల్ని గ్రహిస్తాయి. గాలిలో ఉండే దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చెవిలో ప్రవేశిస్తే సున్నితంగా ఉండే కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల ప్రకృతి సిద్ధంగా చెవి గొట్టంలో సెబేషియస్‌ గ్రంథులు ఉంటాయి. ఇవి నూనె లాంటి జిగురుగా ఉండే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల దుమ్ము, ధూళి కణాలు ఆ జిగురుకు అంటుకుపోతాయి. అలా క్రమేపీ పోగయినవన్నీ కలిసి గులిబి (wax) అనే మెత్తని అర్ధఘన (semisolid) పదార్థం ఏర్పడుతుంది. దీన్ని వైద్యుడు మాత్రమే తొలగించగలడు. సొంతంగా పిన్నుల లాంటి పరికరాలు వాడడం ప్రమాదకరం.

ఎత్తయిన ప్రదేశంలో నిలబడి చుట్టూ చూస్తే చాలా దూరంలో భూమి, ఆకాశం కలిసిపోయినట్లు కనిపిస్తాయి. ఎటు చూసినా అలాగే ఉంటుంది. అవి నిజంగా కలుస్తాయా?

భూమ్యాకాశాలు ఎక్కడా కలవవు. ఎందుకంటే భూమి అనే వస్తువు వాస్తవమే అయినా, ఆకాశమనేది వస్తువూ కాదు, వాస్తవమూ కాదు. మన కంటికి తోచే ఖాళీ ప్రదేశమే ఆకాశం. కేవలం భూమి మీదున్న వాతావరణం వల్లనే ఆకాశం నీలం రంగులో కనిపిస్తుందే కాని, ఆ పరిధి దాటి పైకి వెళితే కనిపించేదంతా కటిక చీకటి లాంటి అంతరిక్షమే. నక్షత్రాలు కనిపిస్తాయి కానీ మిణుకుమనవు. సూర్యుడు ప్రచండమైన కాంతితో గుండ్రంగా గీత గీసినట్టు కనిపిస్తాడు. రేఖల్లాగా మెరుపులు కనిపించవు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల, మన కంటికి పారలాక్స్‌ అనే దోషం ఉండడం వల్ల భూమ్యాకాశాలు కలిసిపోయినట్లు అనిపిస్తుంది. దగ్గరగా చూస్తే వెడల్పుగా ఉండే రైలు పట్టాలు దూరానికి కలిసిపోయినట్టు అనిపించినట్టే ఇది కూడా. గోళాకారంలో ఉండే భూమి ఒంపు వల్ల ఈ భ్రమ (illusion)కలుగుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

సూర్యుని చుట్టూ భూమి ఏ శక్తితో తిరుగుతోంది? తిరిగే ఏ వస్తువైనా శక్తిని కోల్పోతుంది కదా? భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది?

సూర్యుని చుట్టూ భూమి, మిగతా గ్రహాలు తిరగడానికి కారణం సూర్యుడు వాటిపై ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తి. న్యూటన్‌ విశ్వగురుత్వాకర్షణ సూత్రం ప్రకారం విశ్వంలోని రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ బలం వాటి ద్రవ్యరాశులపైన, వాటి మధ్య ఉండేదూరంపైన ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువు తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువును ఆకర్షిస్తుంది. వాటి మధ్య దూరం ఎక్కువయ్యేకొలదీ ఆకర్షక బలం తగ్గుతుంది. సూర్యుని ద్రవ్యరాశితో పోలిస్తే గ్రహాల ద్రవ్యరాశి ఎంతో తక్కువ కాబట్టి గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్ష్యలలో తిరుగుతూ ఉంటాయి. సౌరకుటుంబం మొత్తం ద్రవ్యరాశిలో 99 శాతం సూర్యునిదే!
తిరిగే వస్తువు శక్తిని విడుదల చేస్తున్నప్పుడే దాని శక్తి తగ్గుతుంది. సూర్యుని చుట్టూ తిరిగే భూమి ఎలాంటి శక్తిని విడుదల చేయడం లేదు కాబట్టి, అది శక్తిని కోల్పోయే ప్రమాదం లేదు. అయితే సూర్యుడు వెలువరించే కాంతి, ఉష్ణశక్తులు దాని అంతర్భాగంలో ఉండే హైడ్రోజన్‌ వాయువులో జరిగే కేంద్రక సంయోగ చర్య (nuclear fusion) ద్వారా లభించడం వల్ల కాలం గడిచేకొలదీ సూర్యుని ద్రవ్యరాశి తరిగిపోతుంది. ఇలా ప్రతి సెకనుకూ సూర్యుడు ఐదు మిలియన్‌ టన్నుల బరువు తగ్గిపోతున్నాడు. ఇది మనకు పెద్ద పరిమాణంగా అనిపించినా, సూర్యుని జీవితకాలంలో పోలిస్తే ఇది దాని ద్రవ్యరాశిలో కేవలం 0.01 శాతం మాత్రమే. అలా సూర్యుని ద్రవ్యరాశిలో అంత తేడా లేకపోవడంతో సూర్యుడు, భూమి మధ్య ఉండే ఆకర్షణ బలంలో మార్పు లేదు. అందువల్ల సమీప కాలంలో భూమి తన కక్ష్య నుండి వైదొలగే ప్రమాదం లేదు. కాబట్టి అది తిరగడం మానేసే ప్రశ్న అంతకన్నా లేదు. కానీ ఇప్పటి నుంచి 5 బిలియన్‌ సంవత్సరాల తర్వాత సూర్యుని అంతర్భాగంలోని హైడ్రోజన్‌ పూర్తిగా తరిగిపోయి సూర్యుని పరిమాణం పెరిగిపోయి రెడ్‌జెయింట్‌గా మారతాడు. అప్పుడు తనకు దగ్గరగా ఉన్న బుధ, శుక్ర గ్రహాలను కబళించే ప్రమాదం ఉంది. సూర్యుడు ఇప్పటికన్నా 2300 రెట్లు అధికంగా ప్రకాశించడం వల్ల భూమిపై జీవం నశించిపోయి అదొక లావా సముద్రంలాగా మారిపోతుందని శాస్త్రవేత్తల అంచనా.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, -హైదరాబాద్‌

అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి?

భూమి అనేక పొరలు కలిగి ఉంటుంది. పై పొరను క్రస్ట్‌ (crust) అంటారు. భూమి మొత్తాన్ని ఒక యాపిలు పండుతో పోలిస్తే దాని తొక్క ఎంత పల్చగా ఉంటుందో, భూమికి క్రస్ట్‌ కూడా అంత పల్చగా ఉంటుంది. దీని మందం దాదాపు 70 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇదంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ముక్కల సముదాయం. ఈ ముక్కలను 'ఫలకాలు' అంటారు. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉండే లోపలి పొర (మాంటిల్‌)పై తేలుతూ ఉంటాయి. ఇలాంటి రెండు ఫలకాలు ఒక దానికి ఒకడి రాపిడికి గురికావడం వల్లనే భూకంపాలు ఏర్పడతాయి. ఫలకాలు కలుసుకునే సరిహద్దుల్లోనే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ఫలకాలు ఒకదానినొకటి ఢీకొనడం, రాసుకోవడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పైగా సులువుగా జరిగేది కూడా కాదు. రెండు ఫలకాలు ఒకదానిని ఒరుసుకుని ఒకటి కదలడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి మొత్తం ఒకేసారి బయట పడదు. సంవత్సరాల తరబడి ఫలకాల మధ్య పేరుకున్న ఒత్తిడి శక్తి రూపంలో భూమి పొరల్లో వ్యాపిస్తుంది. ఆ శక్తి అంతకంతకు పెరిగి మొదట భూమి పొరలను వంచి, తర్వాత ఫలకాలు పగిలిపోయే దశకు చేరుస్తుంది. ఆ దశలో ఫలకాలు ఒక్కసారిగా ఊగిపోతాయి. ఫలకాలు పగిలే దశలో ఏర్పడే శక్తి తరంగాలనే 'సీస్మిక్‌ తరంగాలు' అంటారు. ఈ తరంగాలు కొన్ని వేళల్లో శబ్దాలతో కూడుకుని భూమి మొత్తాన్ని కంపింపచేస్తాయి. అప్పుడే ఆ ప్రదేశాల్లో భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉండే ప్రదేశాల్లో ఏర్పడతాయి. కారణం రెండింటికీ మూలం ఫలకాల కదలికలే.

భూమి బొంగరం మాదిరిగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా? బొంగరం కాసేపటికి ఆగిపోయి పక్కకు పడిపోయినట్టే భూమి కూడా పడిపోతుందా?

మొదట భూమి ఎందుకు తిరుగుతోందో తెలుసుకుందాం. పాలపుంతలో నక్షత్రాలు, సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, మన భూమి.. ఇవన్నీ కూడా తన చుట్టూ తాను పరిభ్రమిస్తున్న వాయు-ధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. పరిభ్రమిస్తున్న వాయువుల నుంచి ఏర్పడిన ఏ వస్తువైనా ఆ వాయువుల ధర్మాన్ని కలిగి ఉండాలన్నది ఒక భౌతిక శాస్త్ర నియమం. దీనిని కోణీయ ద్రవ్య వేగ సూత్రం (law of conservation of Angular momentum) అంటారు. ఈ నియమం ప్రకారమే పాలపుంత, సౌరకుటుంబం కూడా తన చుట్టూ తాను పరిభ్రమించే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే భూమి కూడా రోదసిలో నిరంతరంగా బొంగరంలాగా తిరుగుతూనే ఉంది. ఇప్పుడు బొంగరం ఎందుకు ఆగిపోతుందో చూద్దాం. బొంగరం తిరిగేప్పుడు దాని చుట్టుపక్కల ఉండే గాలి వల్ల, అది ఆని ఉన్న ఉపరితలం వల్ల కలిగే ఘర్షణలాంటి బలాలు దానిపై పనిచేసి కాసేపటికి వేగం క్షీణించి పక్కకు పడిపోతుంది. అయితే భూమిపై పనిచేయడానికి అలాంటి బలాలేమీ అంతరిక్షంలో లేవు. అంతరిక్షంలో ఉండే ఘర్షణశక్తులు చాలా స్వల్పం (శూన్యానికి దగ్గర) కాబట్టి భూమి తన చుట్టూ తాను సెకనుకు 460 మీటర్ల వేగంతో (అంటే నిమిషానికి 27,600 మీటర్లు) తిరుగుతూనే ఉంటుంది. అది అలా తిరుగుతూ తిరుగుతూ అనేక వేల మిలియన్ల సంవత్సరాల తర్వాత, బహుశా పరిభ్రమణ వేగం తగ్గి, బహుశా గురత్వాకర్షణ ఎక్కువవడం వల్ల ఉత్పన్నమయ్యే బిగ్‌క్రంచ్‌ అనే ప్రభావం వల్ల ఆగిపోతుందేమో!

భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా! మరి విమానాలు గాలిలో ఎగిరేప్పుడు కింద భూమి తిరిగిపోతే అవి గమ్యస్థానాలను ఎలా చేరుకోగలుగు తున్నాయి?

మనం బస్సులో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లేప్పుడు ఈ సందేహం రానేరాదు. ఎందుకంటే భూమితో పాటు వివిధ ప్రదేశాలు, రోడ్డు, రోడ్డు మీది బస్సు కూడా తిరుగుతున్నాయి కాబట్టి గమ్యం చేరుకుంటామని అనిపిస్తుంది. అయితే విమానం గాలిలో ఉన్నప్పుడు దానికి భూమితో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సరైన చోట దిగడం ఎలాగనే సందేహం కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పుకునే ముందు ఒక సంగతి గుర్తు చేసుకుందాం. వేగంగా వెళుతున్న రైలులో కూర్చుని ఒక బంతిని పైకి విసిరామనుకోండి. ఆ బంతి గాలిలో ఉండగా రైలు ముందుకు కదిలిపోతుంది కాబట్టి అది వెళ్లి రైలు గోడలకు గుద్దుకోవాలిగా? కానీ అలా జరగదు. బంతి తిన్నగా వచ్చి మీ చేతుల్లోనే పడుతుంది. ఎందుకంటే రైలులో ఉండే గాలికి, అందులోని ప్రతి అణువుకి కూడా రైలు వేగమే ఉంటుంది. అలాగే భూమి కూడా గుండ్రంగా చాలా వేగంగా తిరుగుతున్నా, దాని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం మొత్తం దానిని అంటుకుని అదే వేగంతో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ వాతావరణంలోనే ప్రయాణించే విమానం కూడా భూ ప్రభావానికి లోబడే ఉంటుంది. అందువల్ల విమానం తప్పిపోతుందనే ఆలోచన అక్కర్లేదు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?

భూమి ఆత్మప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నమాట నిజమే. ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా బస్సులాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ప్రోద్బలమో (forwarding force), లేదా వ్యతిరేక బలమో (force of resistance), భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో కొన్ని బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ బలమూ పనిచేయని వాహనంలో సమవేగంతో మనం ప్రయాణిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు. భూమి మీద అపలంబ బలము, అపకేంద్ర బలము, సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వబలము కలగలిపి పనిచేసినా వాటి నికర బలం(effective force) శూన్యం. అందువల్ల భూమి భ్రమణ, పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు. అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎలా ప్రభావితం అవుతుంది ?.

ప్రాధమిక పాఠశాలకు వెళ్ళే పిల్లలు సగటున ఒక గంట -ఇరవై నిముషాలు కంప్యూటర్ల పై గడుపుతున్నారని పరిశోధనలు పేర్కొంటున్నయి. నిద్ర పోయే ముందు ఒక గంట ముందుగా కంప్యూటర్ల ముందు కూర్చోవడంవల్ల వారి మెదడు ఎక్కువగా ప్రభావితం అవుతుందని నిపుణులు చెప్తున్నారు . ఏ వయసు పిల్లలు ఎంతసేపు ఆన్‌లైన్‌ లో ఉండవచ్చుననేది ఒక్కోదేశం ఒక్కోరకంగా లెక్కలు చెప్తుంది . అయితె 11 యేళ్ళ వయసులోపు పిల్లలు రెండు గంటలు మించి కంప్యూటర్ల్ స్క్రీన్‌ ముందు కూర్చున్నట్లైతే మానసిక సమస్యల రిస్కు 60 శాతము కంటే ఎక్కువ ఉంటుందని బ్రిటన్‌ లో జరిగిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సంతోషము గా లేని పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్‌ చూడడానికి ఇష్టపడుతున్నారని పరిశోధకులు తెలుపుతున్నారు . అది పిల్లల ఎటెన్షన్‌ ను దెబ్బతీస్తుందని , ప్లానింగ్ , ఎటెన్షన్‌ , స్వయంనియంత్రణ లకు మెదడులో బాధ్యత వహించే కార్టెక్స్ దెబ్బతింటుందని వివిరించారు శాస్త్రజ్ఞులు. 2 గంటలు మించి కంప్యూటర్ గేమ్‌స్ ఆడినా , టెలివిజన్‌ చూసినా వారిలో ఎటెన్షన్‌ సమస్యలు రెండింతలు పెరుగుతాయి.
దీంతో కొందరిలో దుష్ఫ్రభావాలూ తలెత్తే అవకాశమూ ఉంది. వాటిల్లో కొన్ని..
 • మణికట్టు వద్ద కండరాల నొప్పి
 • మెడనొప్పి
 • కుంగుబాటు
 • భావోద్రేకాల్లో మార్పులు
 • గేమ్‌లను ఆడొద్దంటే కోపంతో రెచ్చిపోవటం
 • కుటుంబంలో, బయటా జరితే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం
 • స్నేహితులతో చనువుగా మెలగకపోవటం
 • భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
 • హోంవర్క్‌ పూర్తి చేయకపోవటం
 • తరగతుల్లో పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం
కంప్యూటర్‌ గేమ్‌ల్లో మునిగిపోయిన పిల్లలు నలుగురిలోకి రావటానికి సిగ్గుపడుతున్నా, ఆందోళనతో కనిపిస్తున్నా ముప్పు పొంచి ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. మున్ముందు ఇవి వారి మానసిక ఎదుగుదలలో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే కంప్యూటర్‌ గేమ్‌లకు పిల్లలు ఎక్కువగా అతుక్కుపోతున్నట్టు గమనిస్తే వాటి నుంచి దృష్టి మళ్లించటానికి వెంటనే తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
 • ఇలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువసేపు మాట్లాడుతుండాలి.
 • కంప్యూటర్‌ వాడకంలో ముందే పరిమితి విధించాలి.
 • అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచాలి.
 • అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారన్నదీ గమనిస్తుండాలి.
 • కొన్నిసార్లు పిల్లలు ఆడే ఆటల్లో పాలుపంచుకోవటమూ మంచిదే.
 • పిల్లలతో కలిసి తరచూ షికార్లకు వెళ్తుండాలి.
--- డా.వందన శేషగిరిరావు -శ్రీకాకుళం .

ఈఫిల్ టవర్ సంగతేమిటి ?

1052 అడుగుల ఎత్తు దాదాపు 7000 టన్నుల బరువు , 2.5 ఎకరాల విస్తీర్ణము , ఉన్నా ఈఫిల్ టవర్ ప్రపంచం లోనే అత్యున్నత కట్టడాలలో ఒకటి గా పేరుతెచ్చుకున్న ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో ఘనతను కుడా పొందింది . తాజమహల్ , చైనాగోడ , స్తాత్యు అఫ్ లిబర్టి , ఇలా పపంచం లో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే , అభిమానించే కట్టడం గా పేరుతెచ్చుకుంది .

 • ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టిక్కెట్టు కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్ దే మొదటి స్థానము . ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది సందర్శించారు .
 • ఫ్రాన్సు లోని పారిస్ లో ఉన్న దీన్ని " గుస్తావా ఈఫిల్ " అనే ఇంజినీర్ ఇంర్మించాడు . నిర్మాణానికి రెండు ఏళ్ళ రెండు నెలలు పట్టింది . 1889 మార్చి 31 న పూర్తీ చేసారు .
 • 1930 వరకు ఇదే ప్రపంచం లో ఎత్తైన కట్టడం ,
 • దీని నమూనా కోసం 50 మంది ఇంజినీర్లు 5,300 బొమ్మలు వేశారు .
 • 18,000 విడిభాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీనిని నిర్మించారు .
 • ప్రతి ఏడు ఏళ్లకొకసారి రంగులు వేస్తారు . పూర్తిచేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది , 50 టన్నుల రంగు అవసరమవుతుంది .
 • దీనిపై మొత్తం 20,000 విద్యుత్ బుల్బులు అమర్చారు .
 • మూడు అంతస్తులుగా నిర్మించిన దీనిలో రెండు రెస్టారెంట్లు , ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి .
 • దీన్ని పేల్చివేయడానికి 1986 లో ఉగ్రవాదులు బాంబ్ పెట్టేరు ... అదృష్టవశాత్తు అది పేలలేదు .
 • దీంట్లో సందర్శకులకు పైకి తీసుకువెళ్ళే లిప్టులు తిరిగే దురాన్ని లెక్క కడితే ఏటా ౧౦,౦౦,౦౦౦ కిలోమీటర్లు అవుతుంది .
 • ఈఫిల్ టవర్ చివరి నిల్చుని 42 మైళ్ళ దూరం వరకు చుడొచ్చును .
 • దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి .
 • బలం గా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది . 1999 లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్లు మేర ఊగింది .
 • ఈ టవర్ ను శుబ్రం చేయడానికి 4 టన్నుల సామగ్రి కావాలి . డిటార్జంటలు 400 లీటర్లు అవసరమవుతాయి ,
 • దీని పొడవు వేసవి లో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది , శీతాకాలం లో 6 అంగుళాలు తక్కువవుతుంది ... ఇనుము వ్యాకోచ , సంకోచాలే ఇందుకు కారణము .
 • దీని నిర్మాణము లో 25, ౦౦,౦౦౦ రివిట్లను ఉపయోగించారు .

మూలము : ఈనాడు న్యూస్ పేపర్.(Jan2010)

సైన్సు విషయంలో చాలా చిక్కు ప్రశ్నలు వేధిస్తుంటాయి. ఉదాహరణకు 'కోడి ముందా? గుడ్డు ముందా?' అన్న మీమాంసకు సమాధానం ఏమిటి? అలాగే 'విత్తు ముందా? చెట్టు ముందా?' అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటి?

ఇలాంటి అనేక ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సవివరంగా, ససాక్ష్యంగా సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం చెట్టు కన్నా విత్తే ముందు. అలాగే కోడి కన్నా గుడ్డే ముందు. ఎలాగంటే బిడ్డ పుట్టాకే గత జీవి కన్నా పరిణామంలో అగ్రగామి అనగలం. బొద్దింకలు, సీతాకోకచిలుకలు, కప్పలు, పాములు, పక్షులు గుడ్లు పెడతాయి. క్రమేపీ ఒక జీవి పరిణామ క్రమం గుడ్లలో ఫలదీకృతమవుతూ తర్వాతి తరం మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అంటే గుడ్డులో కోడి కన్నా ప్రాచీన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సముద్రాలలోని నీరు ముందా? నదుల్లోని నీరు ముందా అంటే పారే నీరే సముద్రాలకు ఒకప్పుడు చేరిందన్న విషయం మరవకూడదు. చెట్టు ఒక తరం కాగా, దానికి మూలం విత్తనం ఏర్పడిన తొలినాటి పరిస్థితులే.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

కోడిగుడ్డులోని తెల్లసొనను గిలక్కొడితే గట్టిపడుతుంది, ఎందుకు?

కోడి గుడ్డులోని తెల్లసొనలో 90 శాతం నీరుంటుంది. నీటితోపాటు అందులో పొడవైన ప్రోటీన్‌ అణువులు కూడా ఉంటాయి. ఇవి గోళాల రూపంలో ఊలు బంతులను పోలి ఉండి తెల్లసొనలోని నీటి అణువులను వదులుగా బంధించి ఉంటాయి.తెల్లసొనను గిలక్కొట్టినప్పుడు అందులోని నీటిలో గాలి బుడగలు ఏర్పడి నీరు, ప్రోటీన్ల మిశ్రమంలోని ప్రోటీన్లు వేరవుతాయి. ఈ స్థితిలో ప్రోటీన్లలో కొన్ని నీటి అణువుల్ని ఆకర్షిస్తే, కొన్ని వికర్షిస్తాయి. ఈ ప్రొటీన్లు నీటి అణువుల, గాలి బుడగల హద్దులకు అంటుకుని ఒక పొరలాగ ఏర్పడటంతో తెల్లసొన గట్టిపడుతుంది. గట్టిపడిన తెల్ల సొనను మరీ గిలక్కొడితే నీటి అణువులు ప్రోటీన్ల నుంచి వేరుపడి అప్పటివరకు తెల్లసొనను గట్టిపరుస్తున్న ప్రక్రియ వృధా అవుతుంది.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్‌

భారతీయ సంప్రదాయంలో వివాహం ఎన్ని రకాలు?

సాధారణంగా వివాహం అంటే యువతీ యువకుడు అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లాడటమన్నది సంప్రదాయం. అలాంటి వివాహం మన శాస్త్ర, పురాణాల్లో ఎనిమిది రకాలుగా ఉన్నాయి.

1. బ్రహ్మం, 2.దైవం, 3.ఆర్షం, 4.ప్రాజాపత్యం, 5.అసురం, 6.గాంధర్వం, 7.రాక్షసం, 8.పైశాచం.  

 1. బ్రహ్మ వివాహం : వేదం చదివి, సదాచారము కలిగిన  సచ్ఛీలవంతునికి వస్త్ర భూషనాదులచేత అలంకరించి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.
 2. దైవ వివాహం : జ్యోతిష్టోమాదియజ్ఞాలను చెసే సందర్భములో,ఆక్రతు విధానాన్ని చేయించిన ఋత్విజుని (యజ్ఞంలో రుత్విక్‌‌కు) అలంకరించి తమ కన్యనిచ్చి  కన్యాదానం చేయుటను దైవ వివాహము అని  చెపుతారు.
 3. అర్ష (అర్షం) వివాహం : గోమిధునాన్ని(రెండు గోవులను) వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు.
 4. ప్రాజాపత్య వివాహం : గృహస్థాశ్రమాన్ని విడవననీ, సంతానాన్ని పొందుతాని వరునిచేత ప్రమాణము చేయించి (మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని) వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.
 5. అసుర వివాహం : వరుడు (జ్ఞానులు) .... కన్యకు , కన్యకు సంబంధిన పెద్దలకు , ఆమె తల్లిదండ్రులకు ,  శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు.
 6. గాంధర్వ వివాహం : వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా పెద్దల ప్రమేయము లేకుండా  వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు.
 7. రాక్షస వివాహం : బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి కన్య తల్లిదంద్రులు , బంధువుల అంగీకారము లేకుండా వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు.
 8. పైశాచ వివాహం : నిద్రిస్తున్న లేదా మత్తులో ఉన్నఆత్మరక్షణచేసుకోలేని  స్త్రీని తల్లిదండ్రులకు గాని బంధువులకు కాని తెలియకుండా.. రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు.

కరంటు తీగలు ఎందుకు వదులుగా ఉంటాయి ? రెండు కరంటు స్థంభాల మధ్య ఉండే వైర్లు వదులుగా ఉండి కాస్త కిందికి వేళ్ళాడుతుంటాయి . వాట్నిని గట్టిగా బిగించి కట్టరు . కారణము ఏమిటి ?

కరంటు తీగలు లోహము తో తయారు చేయబడతాయి . ఇనుము లేదా అల్యూమునియం తో తయారైన ఆ తీగలు ఎండ వేడి్మికి వ్యాకోచించి , చలికి అంకోచిస్తాయి . తక్కువ ఉష్ణోగ్రత సమయం (కాలము) లో సంకోచించినా స్థంభాలు లాగినట్లు అవకుండా ఉండేందుకు ఈ వదులు సరిపోతుంది . అందుకని వాటిని అలా వదులుగా వేళ్ళాడే విధంగా ఏర్పాటు చేస్తారు .

చెత్త నుంచి కరెంటును ఎలా ఉత్పత్తి చేస్తారు? ఇది ఎన్ని దేశాల్లో అమల్లో ఉంది?
చెత్త అంటే పనికిరాని పదార్థాల సముదాయం. కానీ చెత్తతో కూడా ఉపయోగం ఉందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఈ మధ్య అన్ని దేశాల్లో ఘనవ్యర్థ పదార్థాల కార్యకలాపం (solid waste management) ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉదాహరణకు... తినగా మిగిలిన పదార్థాలు కుళ్లిపోవడం వల్ల కానీ, మనం పారేసిన చెత్త పదార్థాలు కానీ అన్నీ కూడా సేంద్రియ రసాయనాలే. వాటిల్లో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అలాంటి వ్యర్థ కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, ప్లాస్టిక్కులు, పేపర్లు, ఆకులు, పాచీ వగైరా పదార్థాల్ని ఎండబెట్టి వాటిని మండించడం ద్వారా విడుదలయ్యే ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చగలం.
వ్యర్థ కాగితాల్ని తిరిగి నానబెట్టి గుజ్జుగా మార్చి కొత్తగా కాగితాన్ని తయారు చేయవచ్చు. ఇలా ఎన్నో వ్యర్థ పదార్థాల్ని తిరిగి పునర్వినియోగం చేసే కార్యకలాపం మన దేశంతో సహా అన్ని దేశాల్లో ఉంది.

- ప్రొ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; --కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

బాగా వర్షం వచ్చేప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడాన్ని గమనించాను. ఎందుకు?

సాధారణ వర్షం కురిసేప్పుడు విద్యుత్‌ సరఫరాను ఆపరు. కేవలం మెరుపులు, వేగంగా వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేస్తారు. బాగా మెరుపులు వచ్చేప్పుడు అవి విద్యుత్‌ తీగలను తాకితే వేల ఓల్టుల విద్యుత్‌ శక్మం (electrical potential) తీగల ద్వారా ఇళ్లు, సబ్‌స్టేషన్లలోకి ప్రసరించే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల విద్యుత్‌ సాధనాలు, పరికరాలు పాడయిపోతాయి. విద్యుత్‌ను ముందుగానే ఆపితే నష్టం కొంత నివారణ అవుతుంది. పెనుగాలులు వీచేప్పుడు చెట్లు, స్తంభాలు కూలిపోయి వైర్లు కలిసి విద్యుత్‌ హ్రస్వ వలయం (electrical short circuit) ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

కరెంటు స్తంభాల మధ్య ఉండే తీగ పురి తిప్పి ఉంటుంది. ఎందుకు?

కరెంటు స్తంభాల మధ్య ఉన్న తీగ ఒకే తీగ కాదు. నిజానికి ఇది కొన్ని తీగల కలయిక. బావిలో నీళ్లు తోడుకునే చేంతాడులాగా, మొలతాడులాగా ఇది కొన్ని తీగలను కలిపితే ఏర్పడినదన్నమాట. ఇక కరెంటు తీగలో సాధారణంగా మధ్యలో వెన్నుపూసలాగా ఒక దృఢమైన ఇనుప స్టీలు తీగ ఉంటుంది. ఈ తీగకు అదనపు బలాన్ని గట్టిదనాన్ని ఇచ్చేందుకు ఆ స్టీలు తీగ చుట్టూ అయిదారు అల్యూమినియం తీగల్ని కూడా జోడిస్తారు. ఈ తీగలన్నీ చాలా దూరం పాటు కుదురుగా వెళ్లాలి కాబట్టి అన్నింటినీ కలిపి ఉంచడానికి వాటిని పెనవేస్తారు. ఇవి మధ్యలో ఉండే స్టీలు తీగను హత్తుకుని మెలివేసుకోవడం వల్ల మరింత కుదురుగా ఉంటాయి.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక @హైయ్  బుజ్జి

కరెంటు నీటిలో పాస్‌ అవుతుంది. మరి గాలిలో ఎందుకు పాస్‌ కాదు?

ఒక పదార్థం గుండా విద్యుత్‌ సరఫరా కావడం అంటే ఆ పదార్థంలో ఎలక్ట్రాన్లు లేదా విద్యుదావేశం ఉన్న కణాలు లేదా అయాన్లు ప్రవహించడమే. లోహాలు(metals), బొగ్గు, గ్రాఫైటు వంటి అలోహాల్లో (non-metals) స్వేచ్ఛగా అటూ ఇటూ కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఉప్పు ద్రావణం, సముద్రపు నీరు, తాగే నీరు, గంధకామ్లం వంటి ద్రవ పదార్థాల్లో విద్యుదావేశం ఉన్న అయాన్లు ఉంటాయి. ఇలాంటి ఘన, ద్రవ పదార్థాలను విద్యుత్‌ పొటన్షియల్‌ ఉన్న రెండు బిందువుల (poles) మధ్య ఉంచినపుడు విద్యుత్‌ సరఫరా అవుతుంది. అంటే రుణధ్రువం వైపునకు ధనావేశిత (positively charged) కణాలు, ధనధ్రువం వైపు రుణావేశిత (negatively charged) కణాలు ప్రయాణిస్తాయి. ఈ స్థితినే మనం విద్యుత్‌ ప్రవహించడం అంటాం. అయితే గాలిలో అణువులు తటస్థం(neutral)గాను, దూరదూరంగాను ఉంటాయి. కాబట్టి ఇలాంటి సాధారణ వాయువులను సాధారణ పొటెన్షియల్‌ తేడా ఉన్న బిందువుల మధ్య ఉంచితే, ఆ వాయువుల్లో చలించే విద్యుదావేశిత కణాలు ఏమీ లేకపోవడం వల్ల కరెంట్‌ పాస్‌ కాదు. స్వచ్ఛమైన నీరు, బెంజీన్‌, అసిటోన్‌, ఆల్కహాలు వంటి ద్రవాల్లో కూడా కరెంటు ఏమంత గొప్పగా పాస్‌ కాదు. కానీ అధిక వోల్టేజి ఉండే బిందువుల మధ్య గాలిలో కూడా విద్యుత్‌ ప్రసరిస్తుంది. అప్పుడు వాయు అణువులు అయనీకరణం చెందుతాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

వర్షం కురిసినపుడు వచ్చే మెరుపుల్లో విద్యుచ్ఛక్తి ఉంటుందంటారు అదెలా సాధ్యం?

సాధారణంగా నేల నుంచి 2 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘాలే మెరుపులు, ఉరుముల్ని కలిగిస్తాయి. ఈ మేఘాల్ని క్యుములోనింబస్‌ మేఘాలు అంటారు. వేసవి ఎండల వల్ల సముద్రపు నీరు ఆవిరై భూప్రాంతాలకు విస్తరించినపుడు అక్కడున్న దుమ్ము, ధూళి కణాలతో ఢీకొన్న మేఘాల్లో స్థిర విద్యుత్‌ పోగుపడుతుంది. అనువైన పరిస్థితి ఏర్పడ్డపుడు విద్యుదావేశాలు పరస్పర ఆకర్షణ ద్వారా గాలిలో ప్రవహిస్తాయి. గాలి ప్లాస్మా స్థితికి చేరడం వల్ల ఆ వేడికి కాంతి పుడుతుంది. ఇవే మెరుపులు.
మెరుపులు క్షణికంగా మెరిసినా అందులో ఉన్న విద్యుత్‌ ప్రవాహం కొన్నిసార్లు వందలాది కిలో ఆంపియర్లుగా ఉంటుంది. పొటన్షియల్‌ భేదం ద్వారా ఆ విద్యుత్‌ ప్రవాహం సంభవించడం వల్ల ఎన్నో కూలుంబుల విద్యుదావేశం మేఘాల మధ్య మేఘాలకు నేలకు మధ్య వినిమయం అవుతుంది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

రైళ్లలో ఫ్యాన్లకు, లైట్లకు విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుంది?

మన ఇళ్లలో ఉన్న ఫాన్లకు, రైళ్లలో ఉన్న ఫ్యాన్లకు కొంత తేడా ఉంది. ఇళ్లలో ఉన్న ఫ్యాన్లు సుమారు 230 వోల్టుల విద్యుత్‌ శక్మం ఉన్న ఆల్టర్నేటింగ్‌ కరెంటు(ac) తరహా విద్యుత్‌లో నడుస్తాయి. రైళ్లు స్టేషన్‌లో ఆగి ఉన్నా లోపలున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఫ్యాన్లు తిరగాలి కాబట్టి బ్యాటరీల ద్వారా నడిచే ప్రత్యక్ష విద్యుత్‌ (direct current)లో నడిచేలా ఉంటాయి.వీటిని 'మోటార్లు' నడిపిస్తాయి. రైలు పెట్టెల కింద చాలా బ్యాటరీలు శ్రేణిలో కలిపి ఉంటాయి. రైలు నడుస్తున్నపుడు ఇరుసులకు సంధానించుకున్న విద్యుదుత్పత్తి సాధనాలు లేదా డైనమోలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా ఆ విద్యుత్‌తో ఎప్పటికపుడు బ్యాటరీలను ఛార్జ్‌ చేస్తారు. లైట్లు కూడా ఇదే బ్యాటరీల విద్యుత్‌తో నడుస్తాయి. ఆధునిక రైళ్లలో లెడ్‌ స్టోరేజి బ్యాటరీలకు బదులుగా ఘనస్థితి బ్యాటరీలను వాడుతున్నారు.

ఏనుగుకు అంత పెద్ద చెవులు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి?

సాధారణంగా నాలుగు కాళ్ల జంతువులకు తోక పొడవుగా ఉండడం వల్ల శరీరం మీద వాలే ఈగల్ని, దోమల్ని, ఇతర పదార్థాలను విదిలించుకుంటాయి. శరీరంలో వెనుక సగభాగానికీ తగిలేలా తోక పొడవు ఉంటుంది. మిగతా భాగాన్ని పొడవైన మెడ, మూతి సాయంతో శుభ్రపరుచుకుంటాయి. ఇక ఏనుగుది భారీ శరీరం. తోక చూస్తే చిన్నది. తొండం ఉన్నా మెడ పొట్టిగా కదపలేని విధంగా ఉండడం వల్ల శరీరమంతా తడుముకోలేదు. ఇక్కడే దాని చెవులు ఉపయోగపడతాయి. చేటల్లాగా ఉండి మృదువుగా కదిలే చెవుల సాయంతో అది కీటకాలను తోలుకోగలదు. ఇంత పెద్ద చెవుల వల్ల దానికి మరో ప్రయోజనం కూడా ఉంది. ఏనుగు వేడిని అంతగా తట్టుకోలేదు. అందుకనే స్నానం చేసిన వెంటనే అధమ ఉష్ణవాహకమైన బురదను, ఇసుకను ఒంటిపై జల్లుకుంటుంది. చెవుల్లో దానికి సూక్ష్మమైన రక్త నాళికలు విస్తరించి ఉంటాయి. వీటిని తరచు వూపడం వల్ల దాని శరీరానికి గాలి తగలడంతో పాటు, లోపలి రక్తం కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. ధ్వని తరంగాలను ఒడిసి పట్టుకోవడంలో కూడా ఈ చెవుల ప్రాధాన్యత ఉంటుంది.

ఆధారము: డా.వందనా శేషగిరిరావు గారి బ్లాగు.

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate