অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ విజ్ఞానం V

శాస్త్రీయ విజ్ఞానం V

 1. ఎలిఫేంట్‌ సీల్ కధ ఏమిటి?
 2. విశ్వంలోని శక్తులు ఎన్ని?
 3. సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి కొన్నివందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు. ఎందువల్ల?
 4. కంటిరెప్పలు అదురుతాయెందుకు?
 5. కనురెప్పలను తరచు ఆర్పడం మూలంగా ఉపయోగమేంటి?
 6. కొందరు సైట్‌ (చత్వారం) ఉందని కళ్లద్దాలు పెట్టుకుంటారు. అసలు కళ్లకు సైట్‌ ఎందుకు వస్తుంది?
 7. పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?
 8. ఏదైనా విషయంలో కలవరపడినప్పుడు విభ్రాంతికి లోనయినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. ఎందుకు?
 9. వివిధ దేశాల్లో ఉండే ప్రజల ముఖాలు వివిధ రకాలుగా ఉండడమెందుకు? ఆఫ్రికా వాళ్ల ముఖాలు ఒక తీరుగా, భారతదేశంలో మరో తీరుగా చైనావారివి మరోలా ఉంటాయెందుకు?
 10. గదిలో ఫ్యాను వేయగానే మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్ల?
 11. ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?
 12. ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయని విన్నాను. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు?
 13. నుదిటిపైన, కనుబొమ్మల మధ్య చూపుడు వేలును నుదుటికి తాకకుండా గుండ్రంగా తిప్పితే అక్కడ నొప్పి పుట్టినట్టనిపిస్తుంది. ఎందుకు?
 14. చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు?
 15. బాణాసంచా పుట్టుక కథేంటి?
 16. ఈత రాని చేపలు ఉంటాయా?
 17. మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?
 18. మిల మిల మెరిసే మిణుగురు చేపల కథేంటి?
 19. ఎగిరే పాముల రహస్యమేమిటి?
 20. మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు)దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి?
 21. ప్రపంచం లో అతి చిన్న నక్క?
 22. ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు?
 23. ఎండకాలము తరువాత వాన పడినవెంటనే హఠాత్తుగా కప్పలు ఎక్కడనుండి వస్తాయి?
 24. కప్పలను పట్టుకొంటే జారిపోతాయెందుకు?
 25. పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?
 26. కొన్ని పండ్లు తియ్యగాను, కొన్ని పండ్లు పుల్లగాను ఉంటాయెందుకని?
 27. పాలకు, పెరుగుకు, వెన్నకు మండే స్వభావం ఉండదు. కానీ వెన్న నుంచి తీసిన నెయ్యికి మాత్రం మండే స్వభావం ఉంటుంది. ఎందుకు?
 28. జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?
 29. బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి? మన రాష్ట్రంలో బంగారపు గనులు ఎక్కడున్నాయి?
 30. రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

ఎలిఫేంట్‌ సీల్ కధ ఏమిటి?

ఏనుగు తొండంలాంటి ముక్కు.. నాలుగువేల కిలోల బరువు.. 20 అడుగుల పొడవు.. ఈ జీవి పేరు.. ఎలిఫేంట్‌ సీల్‌ దీని గురించి కొత్త విషయం బయటపడింది.. సముద్ర జీవులెన్నో పిల్లల్ని పెట్టడానికో, లేదా కాలం మారినప్పుడో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసవెళతాయని తెలుసుకదా! అలాగే ఎలిఫేంట్‌సీల్‌లు కూడా శీతాకాలం వచ్చేసరికి ప్రతి ఏడాది కాలిఫోర్నియా నుంచి అలస్కా తీరానికి పసిఫిక్‌ సముద్రం మీదుగా వలస వెళతాయి. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయో తెలుసా? 2000 నుంచి 3000 కిలోమీటర్లు. సుమారు రెండు నుంచి ఎనిమిది మాసాల వరకు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి. మరి ఇవి అలసిపోవా? ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి? ఎప్పుడు నిద్రపోతాయి? ఈ సందేహాలన్నీ శాస్త్రవేత్తలకు వచ్చాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడం కోసం పెద్ద పరిశోధనే చేశారు.

జపాన్‌లోని టోక్యోలోని శాస్త్రవేత్తలు ఆరు ఎలిఫేంట్‌ సీల్స్‌ని తీసుకుని వాటి వీపులకి ఎలక్ట్రానిక్‌ టాగ్‌లు కట్టారు. అవి ఉపగ్రహాలతో అనుసంధానమై ఉంటాయి. అందువల్ల సీల్స్‌ ఎంత వేగంతో, ఎంత లోతులో ఈదుతున్నాయి, ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? వాటి ప్రయాణ మార్గం ఎలా ఉంది, ఇలా అన్ని వివరాలూ ఎప్పటికప్పుడు నమోదై ఉపగ్రహాలకి ప్రసారం అవుతుంటాయి. అవి తిరిగి పరిశోధకులకు అందుతాయి. కంప్యూటర్లలో ఆ సమాచారాన్ని విశ్లేషించి వివరాలు సేకరిస్తారు. ఇలా పరిశోధించేసరికి కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు బయటపడ్డాయి.
ఎలిఫెంట్‌ సీల్స్‌కి అలసట వస్తే వెల్లకిలా తిరిగి అలా ఉండిపోతాయి. ఈదడం ఆపేయడం వల్ల అవి నెమ్మదిగా లోతుల్లోకి జారిపోవడం మొదలుపెడతాయి. ఎలాగో తెలుసా? గుండ్రంగా తిరుగుతూ. చెట్టు మీద నుంచి పడే ఆకు గిరగిరా తిరుగుతూ పడినట్టన్నమాట. అదే వాటి విశ్రాంతి. అలా కాసేపు కావాలని మునిగిపోయాక చటుక్కున లేచి ఓసారి ఒళ్లు విరుచుకుని జామ్మంటూ ఈదడం మొదలెడతాయి. సాధారణంగా డాల్ఫిన్లు, తిమింగలాలు లాంటి సముద్రపు క్షీరదాలు ఈదుతూనే నిద్రపోగలవు. వాటి మెదుడులో సగభాగం విశ్రాంతి తీసుకుంటే, రెండో భాగం పని చేస్తూఉంటుంది. వీటికి భిన్నంగా ఎలిఫెంట్‌ సీల్స్‌ ప్రవర్తిస్తాయన్నమాట. భలే ఉంది కదూ!
*ప్రపంచంలో ఉన్న సీల్‌ చేపలన్నింటిలో ఎలిఫేంట్‌ సీల్‌ పెద్దది. వీటిలో రెండు జాతులు ఉన్నాయి.
*ఇవి పిల్లల్ని కనడానికి మాత్రమే భూమి మీదకి వస్తాయి.
*ఒకసారి ఊపిరి పీల్చుకుంటే రెండు గంటలపాటు సముద్రంలో ఈదగలవు.
*చర్మం దళసరిగా ఉండడం వల్ల ఎంత చలినైనా తట్టుకోగలవు.

విశ్వంలోని శక్తులు ఎన్ని?

ఈ విశాల విశ్వాన్ని నడిపించే శక్తులు నాలుగు

1. గురుత్వాకర్షణ శక్తి: కుర్చీల లాంటి వస్తువులు నేలకు అంటుకొని ఉండడానికి, మనం నేలపై నిలకడగా నిలబడి ఉండడానికి, చెట్టునుంచి రాలిన పండు నేలపై పడడానికి కారణం గురుత్వాకర్షణ శక్తే. నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడేందుకు, కక్ష్యల్లో తిరిగేందుకు కూడా ఇదే కారణం. అన్ని శక్తుల్లోకెల్లా బలహీనమైంది. కానీ దీని వ్యవధి (range) అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది.

2. విద్యుదయస్కాంత శక్తి: విద్యుదావేశాల మధ్య ఆకర్షణ, వికర్షణలకు పరమాణు నిర్మాణానికి, కాంతి వెలువడేందుకు కారణం ఈ శక్తే. విద్యుత్‌ బల్బులు వెలిగేందుకు, లిఫ్టులు, టీవీ, కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం. దీని అవధి అనంతం (infinite)

3. దుర్బల కేంద్రక శక్తి: ఇది పరమాణు కేంద్రకానికి సంబంధించిన శక్తి. యురేనియం లాంటి రేడియోధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నపుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది. దీని అవధి చాలా తక్కువ. 10-14 మీటర్లు మాత్రమే!

4. ప్రబల కేంద్రక శక్తి: పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడగా ఉంచే శక్తి ఇది. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటిలో ఉండే క్వార్కులు, ఇలా పరమాణు కేంద్రకంలో వాటినన్నింటినీ బందించి ఒకే చోట ఉంచేది ఈ శక్తే. ఈ శక్తి అవధి 10-11 మీటర్లు మాత్రమే.

కేంద్రక శక్తుల వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మూలకాలు ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఉన్న కార్బన్‌, ఆక్సిజన్‌లకు కూడా కేంద్రక శక్తులే కారణం. బిగ్‌బ్యాంగ్‌ వల్ల విశ్వం ఏర్పడక ముందు ఈ శక్తులన్నీ ఒకటిగా కలిసి ఉండేవి. ఆ తర్వాత నాలుగుగా విడిపోయాయి. ఈ శక్తులమధ్య సంబంధం ఏమిటన్న విషయం తెలిస్తే విజ్ఞాన శాస్త్రం ఎంతో పురోగమించడమే కాకుండా మనం ఏదో తెలియని అతీత శక్తుల అధీనంలో ఉన్నామనే కొందరి అపోహలు తొలగిపోతాయి.

సూర్యుని అంతర్భాగంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి కొన్నివందల సంవత్సరాలకు గానీ సూర్యుని ఉపరితలంపైకి రాదు. ఎందువల్ల?

జవాబు: సూర్యుడు భూమికన్నా సుమారు 3,30,000 రెట్లు ఎక్కువ బరువుంటాడు. సూర్యుడిలో 3/4 భాగం హైడ్రోజన్‌ ఉంటే మిగతాది హీలియం. సూర్యుడు అంత బరువుగా ఉండబట్టే అక్కడ గురుత్వాకర్షణ శక్తి అత్యధికంగా ఉండి అందులోని వాయువులను ఒకే చోట పట్టి ఉంచడమే కాకుండా గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు.

సూర్యుని అంతర్భాగం కేంద్రం నుంచి 25 శాతం వ్యాసార్థం మేర వ్యాపించి ఉంటుంది. ఇక్కడ సూర్యునిలోని ద్రవ్యాన్ని (వాయువు) అంతా గురుత్వశక్తి కేంద్రంవైపు ఆకర్షించడంతో విపరీతమైన పీడనం (ఒత్తిడి) ఉత్పన్నమవుతుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటుందంటే, హైడ్రోజన్‌ వాయువు పరమాణువులు ఒక చోటకు చేరి కేంద్రక చర్యలు ప్రారంభమవుతాయి. రెండు హైడ్రోజన్‌ పరమాణువులు కలుసుకొని, హీలియం పరమాణువులతో పాటు కొంత శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ దశలో ఉష్ణోగ్రత 15 మిలియన్‌ డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. ఈ శక్తి కిరణాలు, నీలలోహిత కిరణాలు, కంటికి కనిపించే కాంతి, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల రూపంలో వెలువడుతుంది. సూర్యుడు శక్తిమంతమైన న్యూట్రాన్లు, ప్రోటాన్లతో కూడిన 'సౌర పవనాలు' వెలువరిస్తాడు. ఈ శక్తి వికిరణ, సంవాహన మండలాలు దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. సూర్యుని అంతర్భాగం నుంచి 55 శాతం మేర వ్యాపించి ఉండే వికిరణ మండలంలో అంతర్భాగం నుంచి వెలువడే శక్తి 'ఫోటాన్ల' ద్వారా రవాణా అవుతుంది. ఫోటాన్ల నుంచి వాయుకణాలు శక్తి సంగ్రహించి వేడెక్కడంతో కొత్త ఫోటాన్లు ఆవిర్భవిస్తాయి. అవి మళ్లీ వాయుకణాలను వేడెక్కించడం ద్వారా శక్తి సంవాహన మండలాన్ని చేరుకుంటుంది. సంవాహన మండలం మిగతా 20 శాతం సంవాహన ప్రక్రియ ద్వారా క్రమేణా సూర్యుని ఉపరితలానికి చేరుకుంటుంది. ఈ మండలంలోని కొన్ని పొరలలో వేడెక్కిన వాయు ప్రవాహం పైకి లేస్తుంది. ఈ ప్రవాహం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న పొరల వాయువులతో ఉష్ణాన్ని పంచుకుంటుంది. చల్లారిన పొరలు మళ్లీ కిందికి పయనిస్తాయి. ఈ విధంగా ఫోటాన్లకు, వాయుకణాలకు మధ్య జరిగే పరస్పర చర్యల ద్వారా ఉష్ణ, కాంతి శక్తులు వికిరణ, సంవాహన మండలాల్ని దాటి సూర్యుని ఉపరితలానికి చేరుకుంటాయి. సూర్యుడు సెకనుకు 400 మిలియన్‌ టన్నుల హైడ్రోజన్‌ను పూర్తి శక్తిరూపంలోకి మారుస్తాడు. సూర్యుని వికిరణ మండలం నుంచి ఒక ఫోటాన్‌ సూర్యుని ఉపరితలానికి చేరుకోవడానికి పట్టే కాలమే సుమారు లక్ష నుంచి రెండు లక్షల ఏళ్ల వరకు ఉంటుంది.

ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

కంటిరెప్పలు అదురుతాయెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

కంటిని ఆవరించుకొని ... బయట (external) , లోపల (internal) కండరాలు అమరి ఉంటాయి . లోపల కండరాలు కంటి ఫోకస్ ని , ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేస్తాయి . బయట కండరాలు కన్ను చూసే వస్తువుల దిశానిర్దేశాలను , వస్తువును నిత్యమూ కదెలే స్థితి ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి . కంటి నరాలలో కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యవలన కనురెప్పలు అదురుతాయి . దీనిని " ఐ లిడ్ మయోకిమియా" అని అంటారు . పై రెప్పలకన్నా క్రింది రెప్పలు లోనే ఇది ఎక్కువగాజరుగుతుంది . దీని గురించి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి . మన భారతీయ సంప్రదాయాలలో కంటిరెప్పలు అదిరితే అశుభానికి , ఉపద్రవానిని సూచన గా భావిస్తారు ... ఇది ఒక నమ్మకము మాత్రమే . శుభ ... అశుభాలు మనము చేసే పని మంచి చెడుల మీద ఆదారపడి ఉంటుంది .

కనురెప్పలను తరచు ఆర్పడం మూలంగా ఉపయోగమేంటి?

కంటి రెప్పలను ఆర్పడమనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. సున్నితమైనది. రెప్పలు తరచు ఆర్పడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిముల నుంచి కంటికి రక్షణ కలుగుతుంది. కంటి రెప్ప పడినప్పుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటి లోపల ఉండే చిన్న గ్రంథుల్లో నుంచి స్రవించే ఈ నీటినే మనం కన్నీరు అంటాం. ఈ నీటితెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. కంటి మీదకు పడే సూక్ష్మమైన అవాంఛిత కణాలను కంటి కలికిలోకి చేరే విధంగా కంటి కదలికలు తోడ్పడుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

కొందరు సైట్‌ (చత్వారం) ఉందని కళ్లద్దాలు పెట్టుకుంటారు. అసలు కళ్లకు సైట్‌ ఎందుకు వస్తుంది?

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకు కలిగే సర్వ పరిజ్ఞానానికి ప్రధాన అవయవాలు కళ్లు. కన్ను సంక్లిష్టమైన నిర్మాణం. అందులో భాగాలు ప్రధానమైనవి. ఒకటి కంటిపాప (pupil). ఇందులో నుంచే కాంతి కంటి లోపలికి చేరుకుంటుంది. రెండోది కంటి కటకం (eye lens). ఇది పారదర్శక కండర నిర్మాణం. కంటిపాప నుంచి లోనికి వచ్చే కాంతిని సంపుటీకరించే శంఖాకార కటక లక్షణం దానికి ఉంది. ఇక మూడోది నేత్ర పటలం. లేదా రెటీనా. మనం చూసే వస్తువుల నిజమైన బింబాలు (true images) ఈ తెరలాంటి నిర్మాణం మీద తలకిందులుగా పడేలా కంటి కటకం కాంతిని కేంద్రీకరిస్తుంది. కంటికి సైటు కంటిపాపలో సమస్యల వల్ల రావడం చాలా అరుదు. సాధారణంగా కంటికి సైటు కంటి కటకపు వ్యాకోక సంచోచాలు సక్రమంగా లేనపుడు వస్తుంది. లేదా ఆ కటక పారదర్శకత లోపించడం వల్ల వస్తుంది. ఈ పరిస్థితిని తెల్లగుడ్డు (cateract)అంటారు. రెటీనాలో కాంతిని గ్రహించే జ్ఞాన కణాలు ఉంటాయి. సూర్యుడి కాంతిని, ఇతర ప్రకాశవంతమైన కాంతిని ఎక్కువ సేపు చూడ్డం వల్ల గానీ ఎ విటమిన్‌ లోపం వల్ల గానీ రెటినా పొర సరిగా పనిచేయకపోతే సైటు శాశ్వతంగా వస్తుంది. దీనికి చికిత్స దాదాపు కష్టం. కానీ కటకపు సంకోచవ్యాకోచాలు సరిగాలేనపుడు వస్తువుల బొమ్మ రెటీనా కన్నా ముందే (హ్రస్వదృష్టి) లేదా అవతలో (దూరదృష్టి) పడుతుంది. కళ్లద్దాలు వాడి ఈ సమస్య నుంచి బయటపడతారు. తెల్లగుడ్డు సమస్యవస్తే ఆపరేషన్‌ చేసి నయం చేయగలరు. కంటికలక వచ్చినపుడు కూడా దృష్టి మాంద్యం కలుగుతుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

పొగ కళ్లలోకి వెళ్లినపుడు కళ్లు మండుతాయి. ఎందుకని?

పాక్షికంగా మండిన ఇంధనం వల్లనే పొగ వస్తుంది. 'నిప్పు లేనిదే పొగరాదు' అన్న సామెత సబబే అయినా నిప్పున్నంత మాత్రాన పొగ రావాల్సిన అగత్యం లేదు. నిప్పులకు సరిపడినంత ఆక్సిజన్‌ దొరికితే పొగ లేకుండానే నిప్పులు మండగలవు. పచ్చిగా ఉన్న వంట చెరకు, తడిగా ఉండే బొగ్గులు, మలినగ్రస్తమైన తారు తదితర పెట్రోలియం ఇంధనాలు, ప్లాస్టిక్కులు, రబ్బరులు, కిరోసిన్‌ దీపాలు, గాలి సరిగా సరఫరా కాని కిరోసిన్‌ పొయ్యిలు, సిగరెట్లు, బీడీలు పొగల్ని బాగా ఇస్తాయి. ఆయా మండే పదార్థాల్లో ఉన్న రసాయనిక సంఘటనాన్ని బట్టి వచ్చే పొగలో ఉన్న పదార్థాల సైజు ఆధారపడుతుంది. మండే పదార్థాలు ఏమైనా వాటిలో పొగలో సాధారణంగా తేలికపాటి కర్బన రేణువులు, నత్రికామ్ల బిందువులు ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్‌ సరిపడా అందకపోతే ఇంధనంలో ఉన్న కర్బన పరమాణువులన్నీ కార్బన్‌డయాక్సైడుగా మారవు.
పొగ తెల్లగా ఉండటానికి ప్రధాన కారణం కర్బనరేణువులే.కర్ర, సిగరెట్టు వంటి ఇంధనాలలో డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇందులో ఉన్న నత్రజని సమ్మేళనాలు మండినపుడు వెలువడే నైట్రిక్‌ ఆక్సైడ్‌, హైడ్రోజన్‌ భాగం మండగా ఏర్పడే నీటి బిందువులతో కలిసి నత్రికామ్లము, నైట్రస్‌ ఆమ్లం ఏర్పడుతాయి. కర్బన రేణువుల మీద పాక్షికంగా జతకూడని ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటికి చర్యాశీలత చాలా ఎక్కువ. ఇటువంటి చర్యాశీలత అధికంగా ఉన్న కర్బన రేణువులు, సహజంగానే అవాంఛనీయమైన ఆమ్ల బిందువులు ఉన్న పొగ మన కళ్లను చేరినపుడు కంటి పొరల్లో ఉన్న జీవ కణాల్ని వాటి కార్యకలాపాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఈ అవాంఛనీయమైన రసాయనిక ప్రేరణలే నొప్పిగా, మంటగా మన మెదడు భావించి వెంటనే కన్నీటి గ్రంథుల్ని ప్రేరేపించి కన్నీళ్ల ధారలో మలినాల్ని, పొగలోని రసాయనాల్ని కడిగేయడానికి ప్రయత్నించడం వల్లే మనకు ఆ సమయంలో నీళ్లు కూడా కారుతుంటాయి. అవే ముక్కు ద్వారా కూడా వస్తాయి.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, --శాస్త్రప్రచారవిభాగం (తెలంగాణ)

ఏదైనా విషయంలో కలవరపడినప్పుడు విభ్రాంతికి లోనయినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. ఎందుకు?

చర్మంలో రక్తనాళాలు వ్యాకోచిస్తే, మన శరీరం కొంత ఎర్రబడుతుంది. ఏదైనా శారీరక శ్రమ చేసినా, పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది. మనం ఉన్నట్టుండి ఉద్రేకపడినా, అయిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నా మన శరీరంలో ఒత్తిడి (stress) కలిగించే హార్మోన్లు అధిక రక్తపోటును కలిగిస్తాయి. దాంతో చర్మానికి ఎక్కువ రక్తం ప్రసరిస్తుంది. ఈ మార్పు ముఖం, మెడలపై స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే ముఖం కందిపోవడం, జేవురించడం, ఎర్రబడడం అంటారు. మొహం కందగడ్డలా మారిందనడం కూడా ఇందువల్లే. ఇలా ముఖం ఎరుపెక్కడం కొన్ని క్షణాల పాటే ఉంటుంది. కొందరిలో ఈ మార్పు కనిపించదు. కొందరిలో కొన్ని కారణాల వల్ల ముఖానికి రక్తప్రసరణ ఎక్కువ కాలం జరిగి ఎర్రబడు తుంది. ఈ ఆరోగ్య సమస్యను 'ఎరిత్రోఫోబియా' అంటారు. దీనిని సైకోథెరపీ, రిలాక్సికేషన్‌ థెరపీల ద్వారా నివారించవచ్చు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

వివిధ దేశాల్లో ఉండే ప్రజల ముఖాలు వివిధ రకాలుగా ఉండడమెందుకు? ఆఫ్రికా వాళ్ల ముఖాలు ఒక తీరుగా, భారతదేశంలో మరో తీరుగా చైనావారివి మరోలా ఉంటాయెందుకు?

జీవజాతులు (species) పరిణామ క్రమం (evolution) ద్వారా రూపుదాల్చాయని చెప్పే డార్విన్‌ సిద్ధాంతం గురించి చదువుకుని ఉంటారు. ముఖాలు వేర్వేరుగా ఉండడం అందుకొక సాక్ష్యం. పరిసరాలకు అనుగుణంగా, ప్రకృతితో తలపడేందుకు అనుకూలంగా జీవులు రూపొందుతాయనేదే పరిణామ సిద్ధాంతం. ప్రతి జీవీ ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు, పరిస్థితులలో నెగ్గుకు వస్తూ జీవించేలా మార్పులు సంతరించుకుంటుంది. పరిసరాలు వేడిగా ఉన్న ప్రాంతాల్లో ఉండే జీవులకు దాన్ని తట్టుకునేందుకు వీలైన చర్మం, రూపం లాంటివి ఏర్పడతాయి. అందులో భాగంగానే మెలనిన్‌ వర్ణద్రవ్యం వాటి చర్మంలో పెరుగుతుంది. దీని వల్లనే ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, మధ్య అమెరికాలాంటి ఉష్ణప్రదేశాల్లో మనుషులు నల్లగా లేదా చామనఛాయగా ఉంటారు. చైనా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వేడి తక్కువ కాబట్టి మెలనిన్‌ తక్కువగా ఏర్పడి వారు తెల్లగా ఉంటారు. ఇలాగే రకరకాల భౌతిక స్థితిగతులు శరీరపు ఎత్తును, ముఖం నిర్మాణాన్ని నిర్దేశిస్తాయి.

గదిలో ఫ్యాను వేయగానే మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్ల?

ఫ్యాన్‌ వేయగానే చల్లగాలి వస్తుంది కానీ, ఆ గాలి కానీ, చల్లదనం కానీ ఫ్యానులో లేవు. నిజానికి ఫ్యాన్‌ వేయగానే గదిలోని గాలి వేడెక్కుతుంది. ఎందుకంటే గదిలోని గాలి అణువులలో కదలిక ఎక్కువై ఒకదానితో మరొకటి రాసుకోవడం వల్ల ఉష్ణం జనిస్తుంది. కాబట్టి ఫ్యాన్‌ గదిని చల్లబరచదు. ఫ్యాన్‌ గదిలోని గాలిని అన్ని దిశలకూ వేగంగా వ్యాపింపజేస్తుంది. అందువల్ల మన చర్మం ఉపరితలంపై ఉన్న చెమట ఆవిరవుతుంది. దీన్నే బాష్పీభవనం (Evaporation) అంటారు. ఈ ప్రక్రియలో మన శరీరంలోని వేడి తగ్గి మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన చేతిపై అత్తరు చల్లుకున్నా చల్లగా అనిపించడాన్ని గమనించే ఉంటారు. ఇది కూడా బాష్పీభవనం వల్లనే. త్వరగా బాష్పీభవనం చెందే అత్తరులాంటి ద్రవాలు మన శరీరంలోని వేడిని గ్రహించి ఆవిరవడంతో ఇలా జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎంత ఎక్కువగా, త్వరగా జరిగితే అంత చల్లదనాన్ని అనుభవిస్తాం. అందువల్లనే ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఫ్యాను వేసుకుంటే చల్లదనాన్ని ఎక్కువగా అనుభవిస్తాం.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ఫ్యానుకు సాధారణంగా మూడు రెక్కలే ఉంటాయి. ఎందుకు?

ఫ్యానుకు ఒకే రెక్క ఉండడం వీలు కాదు కాబట్టి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగని రెక్కలు మరీ ఎక్కువయితే వాటి మధ్య ఎడం తక్కువైపోతుంది. ఫ్యాను చేసే పనే తన వెనుక గాలిని రెక్కల ద్వారా ముందుకు నెట్టడం. అలాంటప్పుడు రెక్కల మధ్య ఎడం తక్కువైతే గాలి త్వరితంగా ముందు వైపునకు రాలేదు. కాబట్టి మధ్యే మార్గంగా మూడు రెక్కలతో సర్దుకోవడం ఆనవాయితీ. పెద్దపెద్ద సభల్లోనూ, పెళ్లిపందిళ్లలోనూ తీవ్రమైన వేగంతో గాలిని దూరంగా నెట్టే తుపాన్‌ ఫ్యాన్లకు రెండే రెక్కలు ఉంటాయని గమనించండి. కొన్నిచోట్ల నాలుగు రెక్కల ఫ్యాన్లు కూడా ఉంటాయి. బాత్‌రూంలు, వంటగదులు వంటి గదుల్లోంచి అవాంఛనీయ వాయువుల్ని బయటికి నెట్టే (exhaust) ఫ్యాన్లకు ఐదు, లేదా ఆరు రెక్కలు కూడా ఉండడం కద్దు. సైద్ధాంతికంగా ఫ్యాను రెక్కలు ఒకటికన్నా ఎక్కువ ఉండాలన్నదే రూఢి అయిన విషయం. ఇక వేగం, అవసరాల ఆధారంగా రెక్కల సంఖ్య మారుతూ ఉంటుంది.

ఆడదోమలు మనిషి రక్తాన్ని, మగ దోమలు చెట్ల రసాన్ని తాగుతాయని విన్నాను. ఆహారం విషయంలో ఈ తేడాలెందుకు?

ఆహారం విషయంలో ఆడదోమలు, మగదోమలు రెండింటికీ పోషక విలువలను ఇచ్చేవి పళ్ల రసాలు, చెట్ల రసాలు, పుష్పాల మకరందాలే. కానీ ఆడదోమ గ్రుడ్లు ఏర్పడ్డానికి కావలసిన ప్రత్యేక ప్రొటీను, క్షీరదాల (mammals) ఎర్ర రక్త కణాల్లోనే ఉంటుంది. అందువల్ల సంతాన ప్రాప్తి స్థాయికి వచ్చాక మాత్రమే ఆడదోమలకు క్షీరదాల రక్తదాహం ఏర్పడుతుంది. అంటే కేవలం ప్రత్యుత్పత్తి అవసరాలకే ఆడదోమ మనిషి రక్తాన్ని ఆశిస్తుంది. మిగిలన క్షీరదాలు అందుబాటులో లేకపోవడం, వాటి చర్మం మందంగా, రోమాలతో కూడి ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మనిషి రక్తానికి అలవాటు పడ్డాయి. మన చర్మం నుంచి విడుదలయ్యే ప్రత్యేక వాసనలు, కార్బన్‌ డయాక్సైడును గుర్తిస్తూ అవి మనిషి ఉనికిని కనిపెడతాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

నుదిటిపైన, కనుబొమ్మల మధ్య చూపుడు వేలును నుదుటికి తాకకుండా గుండ్రంగా తిప్పితే అక్కడ నొప్పి పుట్టినట్టనిపిస్తుంది. ఎందుకు?

శరీరంలో తల (skull) భాగం చాలా విశిష్టమైంది. ఇందులోనే శరీరం మొత్తాన్ని నియంత్రించే మెదడుతోపాటు పంచేంద్రియాలన్నీ ఉన్నాయి. నుదుటి మీద చూపుడు వేలు దగ్గరగా ఉంచి అటూయిటూ తిప్పినపుడు, ఆ వ్యక్తి అప్రయత్నంగా తన తలకు, కళ్లకు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అన్నట్టు రెండు కళ్లను ఆ వేలి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన కళ్లు రెండూ దృష్టినాడి (optical nerve) ద్వారా అనుసంధానం కావడం వల్ల అవి ఎపుడూ ఒకేవైపు కలిసి తిరుగుతూ ఉంటాయి. ఇది నొప్పి (strain)లేని ప్రక్రియ. కానీ కళ్లకు దగ్గరగా చూపుడు వేలు తిప్పేటప్పుడు రెండు కళ్లూ కనుబొమ్మల మధ్యకు (అంటే కుడికన్ను ఎడమవైపునకు, ఎడమకన్ను కుడివైపునకు కొద్దిగా) తిరగాలి. ఇది అసహజ ప్రక్రియ. అందువల్ల కనుబొమ్మలు ఇబ్బంది (strain) పడతాయి.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.

ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.

- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

బాణాసంచా పుట్టుక కథేంటి?

దీపావళి రోజున , పెళ్ళి రోజున , ముఖ్యమైన ఉత్సవాల సందర్భము లోను , అమ్మవారు పండగల సీజన్‌ లోను, ఊరేగింపులలోను బాణాసంచా కాల్చుతూ ఉంటారు . దీపావలీ రోజున పిల్లలైతే ఎంతో ఆనందిస్తారు . బాణాసంచా కాల్చి ఆనందించడమే కాని దాని పుట్టుగ గురించి ఎవరూ అలోచించరు . మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ...
పూర్వము 2000 (రెండు వేల)ఏళ్ళ క్రితం చైనా లో ఓ వంటవాడు తమాసా గా ఒకరోజు వంటగదిలోని మూడు పొడులను కలిపి ఏదో చేద్దామని బానలి (పెనము) పై వేడి చేసున్నాడు . ఇంతలో పొయ్యిలోనుంచి ఒక నిప్పురవ్వ పడి ఆ మిశ్రమము పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది . ఆ పొడులు సాదారణము గా వంటగదిలో ఉండే .. బొగ్గుపొడి , గంధకము , ఒక రకమైన ఉప్పు . ఇక దాంతో ప్రయోగాలు మొదలు పెట్టేడు . ఆ పొడులను కలిపి వెదురు బుంగ లో కూరి మంటలో పడేస్తే అది ' డాం ' అని పేలింది . అలా పుట్టింది బాణాసంచా.

బాణాసంచా కనిపెట్టింది చైనా వాళ్ళయినా వాటిని అద్బుతమైన కళగా మార్చింది ఇటాలియన్‌ లు . రంగురంగులతో మిరుమిట్లు గొలిపే సామగ్రిని తయారు చేసింది వాళ్ళే . బాణాసంచా కాలుస్తున్నప్పుడు ఏర్పడే రంగులకు కారణము రసాయనాలే ... బేరియం నైట్రేట్ వల్ల ' ఆకుపచ్చ కాంతి ' , కాపర్ సాల్ట్ వల్ల ' నీలము ' , స్టాటియం నైట్రేట్ వల్ల ' ఎరుపు ' , కార్బన్‌ వల్ల ' కాసాయము ' , మెగ్నీషియం-అల్యూమినియం వల్ల ' తెలుపు ' , సోడియం సాల్ట్ వల్ల పసుపు కాంతి విడుదల అవుతాయి .

బాణాసంచా రికార్డులు :

 • జపాన్‌ లో 1988 లో తయారు చేసిన అతిపెద్ద చిచ్చుబుడ్డి గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది . 54.7 అంగులాల వ్యాసము , 750 కిలోల బరువు ఉండే దీన్ని వెలిగించినపుడు రవ్వలు 3,937 అడుగుల వ్యాసము వరకూ విరజిమ్మినాయి .
 • మలేషియా లో 1988 లో 33,38,777 టపాలను ఉపయోగించి చేసిన 18,777 అడుగుల పొడవైన దండ ను పేల్చితే 9 గంటలు 27 నిముషాల పాటు ఆగకుండా పేలింది .
 • పోర్చుగల్ లో 2006 లో ఏకంగా 66,326 ఫైర్ వర్క్స్ ను కాల్చి ప్రపంచరికార్డు సృస్టించారు . ఇవి ఒకదాని తర్వాత ఒకటి గా ఆకాశములోకి దూసుకుపోఇ వెలుగుపూలు విరజిమ్మాయి .
 • బ్రిటన్‌ లో కేవలం 30 సెకనుల్లో 56405 ఫైర్ వర్క్స్ కాల్చడం ఒక రికార్డు .
 • బ్రితన్‌ లో బీచ్ నుంచి ఒకేసారి 40.000 తారాజువ్వల ను వెలిగించి వదిలారు .
 • అమెరికాలో 1992 లో ఇడాహో జలపాతము దగ్గర అతిపెద్ద భూచక్రాన్ని కాల్చారు . 47.4 అడుగుల వ్యాసము ఉన్న ఇది 3 నిముషాల 47 సెకనులు పాటు గిర్రుమంటూ తిరిగింది .

ఈత రాని చేపలు ఉంటాయా?

చేప అంటే నీటిలో ఈది తీరాలిగా? కానీ ఈతరాని చేపలున్నాయంటే నమ్ముతారా! అవును 'హాండ్‌ ఫిష్‌లు' ఆ రకమే. ఇవి ఈదలేవు. మరేం చేస్తాయి? సముద్రం అట్టడుగు మట్టంపై చేతులతో నడుస్తాయి. చేపకు మొప్పలుంటాయి కానీ చేతులేంటి? అదే వీటి ప్రత్యేకత. వీటికి మొప్పల స్థానంలో బలమైన కండరాలు పొడుచుకు వచ్చి ఉంటాయి. అచ్చం చిన్న చిన్న చేతుల్లాగా. వాటితో నడుస్తాయి. ఆస్ట్రేలియా సముద్రాల్లో మాత్రమే కనిపించే ఈ నడిచే చేప ఈదలేకపోడానికి కూడా కారణం ఇదే. ఇవి ఇలా నడచుకుంటూ నీటి అడుగున ఉండే క్రస్టసీన్‌లు, చిన్నచిన్న జీవులు కనిపిస్తే గుటుక్కుమనిపిస్తుంటాయి. అందుకే దీనికి 'హాండ్‌ ఫిష్‌' అని పేరొచ్చింది. ఈ మధ్యే వీటిల్లో 9 కొత్త జాతుల్ని కనుగొన్నారు. మొత్తం 14 జాతులున్నాయి.
ఈ చేప ఎంతుంటుందో తెలుసా? నాలుగు అంగుళాలు అంటే 10 సెంటీమీటర్లు. చూడ్డానికి రంగురంగుల్లో భలే అందంగా కనిపించే ఈ చేపల్లో పింక్‌ హాండ్‌ ఫిష్‌ అనే దానిపై ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసి హడావుడి చేశారు. ఎందుకో తెలుసా? అక్కడి సముద్రాల్లో జీవ వైవిధ్యం బాగా దెబ్బతింటోందిట. అలా ముప్పు పొంచిన ఉన్న జీవుల్లో మొదటి స్థానంలో ఉంది ఈ చేపే మరి.
ఎప్పుడో 11ఏళ్ల క్రితం 1999లో కనిపించిన ఈ జాతికి చెందిన పింక్‌ హాండ్‌ ఫిష్‌ మళ్లీ ఇప్పుటి వరకూ జాడలేకుండా పోయిందంటే ఇవెంత ప్రమాదస్థితిలో ఉన్నాయో అర్థమవుతుంది. దాదాపు 5 కోట్ల ఏళ్ల క్రితం ఈ చేపలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఉండేవట. వాతావరణ కాలుష్యం, వేట, సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇవి క్రమంగా అంతరించిపోయాయి.
బ్యాట్‌షిఫ్‌ కూడా..
ఇలా నడిచే చేపల జాబితాలో బ్యాట్‌ఫిష్‌లు కూడా ఉన్నాయి. వీటిల్లో రెండు కొత్త జాతుల్ని మెక్సికోలోని సముద్ర తీరంలో కనుగొన్నారు. మన అరచేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉండే ఇవి అట్టడుగున సముద్ర తలంపై చకచకా నడిచేస్తాయి. వీటికి దృఢమైన భుజాల్లాంటి మొప్పలు ఉన్నాయి. అదాటున చూస్తే గబ్బిలం నడుస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి బ్యాట్‌ఫిష్‌ అని పేరొచ్చింది. గల్ఫ్‌ తీరంలో డీజిల్‌, పెట్రోల్‌ అవశేషాలు సముద్రంలో కలుస్తాయి కదా, వాటి వల్ల ఈ చేపలు చాలా ప్రమాదంలో పడ్డాయి. వీటి ఆహారమైన ప్లాంక్‌టన్‌లు విషపూరితమైపోతున్నాయి. అలాగే వాటి గుడ్లు కూడా పిల్లలవ్వకుండానే చనిపోతున్నాయి.

మొక్కల్లో మాంసాహారాన్ని తీసుకునేవి ఉంటాయని విన్నాను. నిజమేనా?

కొన్ని మొక్కల్లో కీటకాలను ఆకర్షించి, బంధించే వ్యవస్థ ఉన్నవి ఉన్నాయి. బంధించిన కీటకాలను ఎంజైములు, బ్యాక్టీరియా సాయంతో జీర్ణించుకునే వీలు వాటిలో ఉంటుంది. ఇలాంటి మొక్కలను మాంసాహారపు మొక్కలు (carnivorous plants) అంటారు.
ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా ఉండే ఇలాంటి మొక్కల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉదాహరణకు వీనస్‌ ఫ్త్లెట్రాప్‌ అనే మొక్క ఆకులు తెరిచిన దోసిలిలాగా అమరి ఉంటాయి. వాటి అంచుల్లో సన్నని వేళ్లలాంటి కాడలు ఉంటాయి. ఆకుల లోపలి గ్రంథులు సువాసనలను వెదజల్లే స్రావాలను విడుదల చేస్తాయి. అందువల్ల ఆకర్షితమైన కీటకాలు ఆకుల మధ్యకు చేరుకోగానే, అంతవరకూ దోసిలిలా ఉండే భాగాలు చటుక్కున మూసుకుపోతాయి. అంచుల్లో ఉండే కాడలు కూడా మనం వేళ్లను బిగించినట్టుగా బిగిసిపోతాయి. దాంతో లోపలి కీటకం ఎటూ తప్పించుకోలేదు. ఆకుల లోపలి భాగంలో స్రవించే ఎంజైములు, ఆమ్లాల వల్ల కీటకం శరీరం విచ్ఛిన్నమై ద్రవరూపంలోకి మారుతుంది. మొక్క దాన్ని శోషించుకుంటుంది. ఇలా దొన్నెల్లాగా, మూతల్లాగా రకరకాల ఆకారాల్లో ఉండే ఈ మాంసాహార మొక్కల్లో కొన్ని చిన్న చిన్న జంతువులను సైతం పట్టి అరాయించుకునే శక్తి కలవి ఉంటాయి.

ప్రొ||ఈ.వి.సుబ్బారావు

మిల మిల మెరిసే మిణుగురు చేపల కథేంటి?

చేపలు రంగురంగుల్లో ఉంటాయని తెలుసు... కానీ మిణుగురుల్లా... రాత్రి పూట వెలిగే చేపల్ని చూశారా? అదే ఫ్లోరోసెంట్‌ ఫిష్‌!

అక్వేరియంలో చేపలు సందడి చేస్తేనే సంబర పడతాం. మరి అవి మిలమిలా కాంతులతో మెరిసిపోతే? కేరింతలు కొడతాం కదూ! అలాంటి చేపలు ఎక్కడున్నాయో తెలుసా? తైవాన్‌లో సందడి చేస్తున్నాయి. మరి ఇన్నాళ్ల నుంచి ఎందుకు మన కంటపడకుండా తిరిగాయబ్బా? ఏ సముద్రం అడుగునో దాక్కున్నాయా? కాదు. ఈ చేపల్ని శాస్త్రవేత్తలే సృష్టించారు. జన్యు మార్పిడి విధానం తెలుసుగా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జన్యు మార్పిడి పరిజ్ఞానంతో చేసిన అతిపెద్ద చేపలు ఇవే. ఇంతకీ ఎందుకీ ప్రయోగం? ఎందుకంటే ఈ ప్రక్రియ వల్ల జంతువుల్లోను, మనుషుల్లోను జన్యుపరంగా వచ్చే వ్యాధులను ఎలా నివారించవచ్చో తెలుస్తుంది.

సుమారు ఆరు అంగుళాల వరకు పెరిగే ఏంజెల్‌ చేపల్ని తీసుకుని ప్రయోగాలు చేసి, వాటి శరీరానికి మెరిసే లక్షణం వచ్చేలా చేశారు. అంటే ఇప్పుడు వీటి పేరు ఏంజెల్‌ ఫ్లోరోసెంట్‌ ఫిష్‌ అన్నమాట. తైవాన్‌లో ఓ బయోటెక్నాలజీ సంస్థ వారు ఎన్నో పరిశోధనలు చేసి ఇది సాధించారు. మరి ఈ ప్రయోగాలు అంతక్రితం ఏవీ జరగలేదా? నిజానికి 2001లోనే జరిగాయి. అయితే ఆ చేపలు పూర్తి స్థాయిలో వెలుగులు విరజిమ్మలేదు. తర్వాత ఏడేళ్లు శ్రమించి ఏంజెల్‌ చేపల శరీరం మొత్తం మెరిసిపోయేలా చేశారు. వీటి ప్రత్యేకతేంటో తెలుసా? వీటికి పుట్టే పిల్లలకి కూడా ఇలా మెరిసే లక్షణం వచ్చేస్తుంది. అలా మొత్తం అయిదు తరాల వరకు ఈ జన్యు లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. అంటే వీటి మనుమలు, మనవరాళ్లు కూడా వాటి తాతల్లాగే వెలిగిపోతాయన్నమాట. మరి వీటిని వండుకుని తినచ్చా? ఓ నిక్షేపంలా. మిగతా చేపల్ని తిన్నట్టే వీటినీ లొట్టలేసుకుంటూ ఆరగించొచ్చు. కాకపోతే ధరే ఎక్కువ. ఒక్కోటి రూ.1300 పలకొచ్చని అంచనా. ఇంకో రెండేళ్లలో వీటిని అక్వేరియాల్లో పెంచుకోవచ్చు.

మీకు జెల్లీ ఫిష్‌ తెలుసుగా? దానిపై ఏదైనా వెలుతురు పడినప్పుడు మెరుస్తూ కనిపించడానికి కారణం దాంట్లో సహజంగా ఉండే ఫ్లోరోసెంట్‌ మాంసకృత్తులే. దాన్ని వేరు చేసి ఈ చేపల్లో ప్రవేశపెట్టారన్నమాట. అన్నట్టు... ఈ జన్యువును గతంలో పిల్లులు, ఎలుకలు, పందుల్లోకి ప్రవేశపెట్టారు. అయితే వాటికి కూడా శరీరంలోని కొద్ది భాగం మాత్రమే వెలుగులీనింది. ఇప్పుడు ఈ ఏంజెల్‌ చేపలు మాత్రం పూర్తి స్థాయిలో మెరిసిపోతూ ముచ్చట కలిగిస్తున్నాయి.

ఎగిరే పాముల రహస్యమేమిటి?

పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!!

మీకు గ్త్లెడింగ్‌ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్‌ స్నేక్స్‌ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు.

గ్త్లెడింగ్‌ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్‌ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు)దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి?

తీసుకున్న ఆహారపదార్థాలలోని పిండిపదార్థాల్లోంచి గ్లూకోజు, ఫ్రక్టోజులు, మాంసకృత్తుల నుంచి వివిధ అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల నుంచి కణత్వచాని (cell wall) కి ఉపయోగపడే లిపిడ్లు ఉత్పన్నమవుతాయి . అవి చిన్నప్రేవులో ఉండే విల్లై అనే కణపొర ద్వారా రక్తంలో కలుస్తాయి . ఇంతవరకు బాగానే ఉంది. అయితే నోటి నుంచి గుదము (anus) వరకు వ్యాపించిన దాదాపు 2, 3 మీటర్ల పొడవుండే జీర్ణకోశ వ్యవస్థలో పలుచోట్ల పలురకాలైన భౌతిక రసాయనిక స్థితులు ఉంటాయి. అనువైన చోట్ల మన పుట్టుక వెంటనే ఎన్నో బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో తమ స్థావరాల (colonies) ను ఏర్పరుచుకొంటాయి. ఇందులో అపాయకరమైన బాక్టీరియాలు, ఉపయోగపడే బాక్టీరియాలు రెండూ ఉంటాయి. మనకు నోటిలో పుండ్లు రావడం, విరేచనాలు రావడం, వాంతులు రావడం, అజీర్తి వంటి పలు అవాంఛనీయమైన లక్షణాలకు కారణం ప్రమాదకర బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో ఉండడమే. ఇచరేరియాకోలై (E.Coli), సాల్మొనెల్లా, జియార్డియా, క్రిప్టోస్పోరిడియం వంటివి ప్రేగుల్లో ఉంటాయి. ఉపయోగపడే బాక్టీరియాను ప్రొబయోటిక్స్‌ అంటారు. ఇందులో లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ , బైఫిడోబాక్టీరియా బైఫ్రిడమ్‌ వంటివి ఉదాహరణలు.
మంచి బాక్టీరియా అయినా చెడు బాక్టీరియా అయినా అవీ బతకాలి. తమ సంతానాన్ని పుంఖాను పుంఖాలుగా పెంచుకోవాలి. కాబట్టి వాటికీ ఆహారం అవసరం. కొన్ని బాక్టీరియాలు వాటి సంఖ్య మించితే మనకు వాంతులు, విరేచనాలు, కలరా, డయేరియా లాంటి వ్యాధులతో తెలిసిపోయినా వాటి సంఖ్య అదుపులో ఉన్నంతవరకు వాటిని మన తెల్లరక్తకణాలు నాశనం చేస్తుంటాయి. కాబట్టి బాక్టీరియాలు మన కణాల్ని తింటూ వాటి విసర్జక పదార్థాల్ని జీర్ణమవుతున్న మన ఆహారపదార్థాల మిశ్రమంలోనే కలుపుతాయి. అందులో చాలా దుర్గంధభరితమైన గంధకం, ఫాస్ఫరస్‌, నత్రజని సమ్మేళనాలు ఉంటాయి.
చాలాసార్లు మన ఆహారాన్నే అవీ భాగం పంచుకొని మనలాగా కాకుండా మరో విధమైన అవాయు ప్రక్రియ (anaerobic metabolism) ద్వారా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే శక్తిని పొంది తమ జీవన కార్యకలాపాల్ని కొనసాగిస్తాయి. అవాయు ప్రక్రియల్లో ఎన్నో దుర్గంధభరితమైన పదార్థాలు విడుదలవుతాయి. ఉపయోగపడే బాక్టీరియాలు కూడా పెద్దప్రేవుల్లో ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి బతుకుతుంటాయి.అవి ఒక్కోసారి దుర్గంధాన్ని తగ్గిస్తాయి. మరోసారి దుర్గంధాన్ని పెంచుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న పంచభక్ష్య పరమాన్నాలు, సుగంధభరిత పానీయాలు, షడ్రుచుల ఆహారదినుసులు నోటి వరకే వాటి సౌభాగ్యం. ఆ తర్వాత అవి రకరకాల రసాయనిక ప్రక్రియల్లో, జీవ రసాయనిక ప్రక్రియల్లో, బాక్టీరియా కౌగిళ్లలో ... లోగిళ్లలో పడిపోయి వివిధ మార్పులకు లోనవుతాయి. చివరకు దుర్గంధ భరితమైన మలమూత్రాదుల రూపంలో బయటపడతాయి. ఇందులో ఉపయోగపడే బాక్టీరియాల వంతూ ఉంది కాబట్టి ఆ కంపే ఆరోగ్యానికి ఇంపు అనుకోకతప్పదు.

ప్రపంచం లో అతి చిన్న నక్క?

గబ్బిలం చెవులు.. ఒళ్లంతా బొచ్చు.. అరచేతిలో ఇమిడే శరీరం.. ఇదేంటో తెలుసా? ప్రపంచంలోనే అతి చిన్న నక్క!

మామూలుగా నక్క అనగానే అడవిలో జింకల్ని సైతం వేటాడగలిగే జంతువు గుర్తొస్తుంది కదా? కానీ నక్కల జాతిలోనే అతి చిన్నదొకటుంది.మహా ఎదిగితే ఇది 16 అంగుళాల పొడవుంటుందంతే. బరువైతే కేవలం కిలోన్నరే. అంటే బలిసిన పిల్లి ముందు చూస్తే ఇదే చిన్నగా కనిపిస్తుందన్నమాట. అదే ఫెన్నెక్‌ ఫాక్స్‌. ఎడారి నక్కని కూడా అంటారు.

ఈ బుజ్జినక్క రూపం భలే ముచ్చటగా ఉంటుంది. ఒళ్లంతా బొచ్చు. అదాటుగా చూస్తే బుల్లి కుక్క పిల్లలా కనిపిస్తుంది. చేతులతో ఎత్తుకుంటే దోసిట్లో చక్కగా ఇమిడిపోతుంది కూడా. ఇక దీని చెవులు పెద్దగా, దొప్పల్లా ఆరు అంగుళాల పొడవుంటాయి. ఇవి ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో కనిపిస్తాయి. ఇంత చిన్నది పాపం.. అక్కడి వేడికెలా తట్టుకుంటుందనే సందేహం అక్కర్లేదు. ఇది కేవలం రాత్రిళ్లే తిరుగుతుంది. అంటే నిశాచర (నాక్టర్నల్‌) జీవన్నమాట. మరి పగలు? నేలలో బొరియలు తవ్వుకుని లోపల పడుకుని నిద్రపోతుంది.

ఇవి గుంపులుగా తిరుగుతాయి. ఒక్కో గుంపులో కనీసం పది నక్కలైనా ఉంటాయి. ఇంతకీ ఇవి తినేదేంటో తెలుసా? ఎడారి మొక్కలు, గడ్డితో పాటు ఎలుకలు, కీటకాలు, బల్లులు, పక్షులు, గుడ్లు. దీనికో విచిత్ర గుణం ఉంది. నీళ్లు తాగకపోయినా చాలా రోజులు హాయిగా ఉండగలదు. తినే మొక్కల్లో ఉండే తేమ వీటికి చాలన్నమాట. పైగా వీటి మూత్రపిండాలు కూడా ప్రత్యేకంగా పని చేస్తూ, ఎక్కువ నీరు బయటికి పోకుండా కాపాడుతాయి.

అన్నట్టు.. దీని చర్మానికి బోలెడు గిరాకీ తెలుసా? అందుకే పాపం, అక్కడి ప్రజలు వీటిని కనిపిస్తే చాలు, వేటాడేస్తుంటారు. ఇవి లేకపోతే ఎడారి ఎలుకల సంతతి తీవ్రంగా పెరిగిపోతుంది. కనుక వీటిని కాపాడుకోవలసిన అవసరం ఉందని అక్కడి ప్రభుత్వాలు గుర్తించాయి. ఆడ నక్క ఏడాదికి అయిదు వరకు పిల్లల్ని కంటుంది. ఇవి కేవలం పది నెలలకే పెద్దవై పోతాయి. వీటికి వినికిడి శక్తి చాలా నిశితంగా ఉంటుంది. నేల కింద తచ్చాడుతున్న జీవుల రాకపోకలను ఇది గ్రహించగలదు.
మీకు తెలుసా?
* నక్కల్లో మొత్తం 25 జాతులు ఉన్నాయి.
* ఒక నక్క రోజుకి ఒక కిలో మాంసాన్ని ఆహారంగా తింటుంది.
* జపాన్‌లో నక్కలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు.
* ఏదైనా జీవిని పట్టుకున్నాక కాసేపు వాటితో చెలగాటమాడి ఆ తర్వాతే తింటాయి.

ఫ్రిజ్‌ల్లో ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చే చిన్న పెట్టెలాంటి ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. దాన్ని ఫ్రిజ్‌కు కింది భాగంలో ఎందుకు పెట్టరు?

రిఫ్రిజిరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ (Freon) అనే ద్రవ పదార్థాన్ని సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపజేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజిరెంట్‌' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగజేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లోని కండెన్సర్‌ ద్వారా పీడనానికి గురై మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటప్పుడు అది అంతకు ముందు గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనక భాగం నుంచి బయటకు పోతుంది. ఫ్రిజ్‌లోని పదార్థాలలోని వేడిని గ్రహించి ఆవిరిగా మారిన ఫ్రియాన్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆవిరిగా మారిన దాని సాంద్రత (density)తక్కువ కావడంతో ఆ ఆవిరి ఫ్రిజ్‌ పైభాగానికి పయనిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల ఫ్రిజ్‌లో చల్లదనం ఏర్పడి ఉష్ణోగ్రత 5 డిగ్రీల సెల్షియస్‌కు తగ్గుతుంది. ఫ్రీజర్‌ను ఫ్రిజ్‌ అడుగు భాగంలో అమరుస్తే అక్కడ ఉష్ణోగ్రత మరీ తగ్గడం వల్ల వెలువడే ఉష్ణకిరణాలు పైవైపు ప్రయాణించి అక్కడ అంతకు ముందు చల్లబడిన పదార్థాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందువల్లనే ఫ్రీజర్‌ను పైభాగంలోనే అమరుస్తారు. అక్కడ వెలువడిన ఉష్ణకిరణాలు అక్కడి నుంచే బయటకు వెలువడుతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ఎండకాలము తరువాత వాన పడినవెంటనే హఠాత్తుగా కప్పలు ఎక్కడనుండి వస్తాయి?

వర్షము పడి నీరు నిలవగానే అప్పటి వరకూ కనిపించని కప్పలు బెకబెక మంటూ కుప్పలు కుప్పలు గా కనిపిస్తాయి. అలా హఠాత్తుగా కనిపించేసరికి కొందరు పిల్లలు అవి వర్షము తో పడ్డాయనుకుంటారు. అలా జరుగదు . కప్పలు వేసవిలో ఎండతీవ్రతకు , నీరు ఇంకిపోవడము వలన భూమిలో బురదలోకి చొచ్చుకుపోయి నిద్రపోతాయి. అది సాదారణ నిద్రకాదు . దీనిని " సుప్తావస్థ -Hibernation" అంటారు. వేసవినుండి రక్షించుకునేందుకు కప్పలు ఏర్పాటు చేసుకున్న మార్గమిది. వర్షము తో చెరువు నిండగానే లోపల బురదలో ఉండిపోయిన కప్పలు ఆనందముగా బయటకు వచ్చి తిరగడం మొదలుపెడతాయి.

కప్పలను పట్టుకొంటే జారిపోతాయెందుకు?

నీటిలోనే కాకుండా నేలపై చరించే కప్పవంటి ఉభయ చరాల శరీరాలపై ఉండే చర్మంపై పొర తడిగా, జిగురుగా పట్టుకొంటే జారిపోయే ధర్మం కలిగి ఉంటుంది. దీనివల్ల అవి వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి పొడిబారిపోకుండా ఉంటాయి. కప్ప శరీరంపై ఉండే చర్మం దృఢంగా ఉండకుండా పలుచగా ఉండడంతో ఆ చర్మానికి భాష్పీభవనం (evaporation) నుండి అంతగా రక్షణ లభించదు. దాంతో 25 శాతం నుంచి 30 శాతంకన్నా దేహంలోని ద్రవపదార్థాలు ఆవిరైతే అది జీవంతో ఉండలేదు. అందువల్ల కప్ప చర్మం నిరంతరం శ్లేష్మం (mucus)ను, ఇతర పదార్థాలను స్రవించే గ్రంధులను కలిగి ఉంటుంది. గ్రంధుల నుండి స్రవించే ఈ స్రావాలు కప్పదేహంలోని నీటిని సమతుల్యంలో ఉంచుతాయి. అలాగే ఆ స్రావాలలో ఉండే విషంతో కూడిన సమ్మేళనాలు కప్పలను వాటిని తినే ప్రాణుల నుండి, బాక్టీరియా, ఫంగస్‌ల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి. కప్పలు తమలో ఉండే గ్రంధుల ద్వారా సూర్యరశ్మి ప్రభావం తమ చర్మంపై పడకుండా ఒక తెరను కూడా ఏర్పరచుకోగలవు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

పండ్లు ఆయా కాలాల్లోనే కాస్తాయెందుకు?

వేర్వేరు పండ్లకు వేర్వేరు రుచులు రావడానికి కారణం ఆయా పండ్లలో ఉండే జన్యు సంకేతాలే (Genetic code).ఆ జన్యు సంకేతాన్ననుసరించే పండ్లలో ప్రత్యేక రుచుల్ని, వాసనలను, ఇచ్చే పదార్థాలే ఉత్పత్తి అవుతాయి. ఏ పదార్థమూ శూన్యం నుంచి ఏర్పడదు. అంటే ఫలాల్లో ఉన్న పదార్థాల తయారీకి కావలసిన ముడి పదార్థాలు చెట్టుకు అందుబాటులో ఉండాలి. పైగా పండ్ల రుచుల, వాసనల తయారీ సమయంలో తగిన విధంగా వాతావరణంలోనూ, నేలలోనూ అనువైన భౌతిక (ఉష్ణోగ్రతగల పీడనం, గాలిలో తేమ, వెలుతురు మొ||వి), రసాయనిక లక్షణాలు ఉండాలి. ఒకే ప్రాంతంలో సంవత్సరం పాటు ఒకే విధమైన భౌతిక, రసాయనిక లక్షణాలు నేలలోను, వాతావరణంలోనూ ఉండవు. అందువల్లే ఆయా ప్రాంతాలకు, ఆయా రుతువులకు అనుకూలంగా వివిధ పండ్ల మొక్కలు పుష్పించి ఫలిస్తాయి. వివిధ పంటలు పండుతాయి. ఎప్పుడూ కాయలనిచ్చే చెట్లున్నాయి, ఏడాదికోసారి ఫలాలనిచ్చేవి ఉన్నాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

కొన్ని పండ్లు తియ్యగాను, కొన్ని పండ్లు పుల్లగాను ఉంటాయెందుకని?

రకరకాల పండ్లలో ఉండే రుచికి కారణం వాటిలోని రసాయనిక సంఘటనమే (chemical composition). ఒకే జాతి పండ్లయినా పచ్చిరంగులో ఉన్నప్పుడు ఒకలా, దోర దశలో ఒకలా, మిగుల ముగ్గినప్పుడు ఒకలా రుచించడానికి కారణం కూడా ఇదే. పండ్లలో చక్కెరల శాతం మిగిలిన పదార్థాల కన్నా ఎక్కువగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి. ఆమ్ల గుణమున్న పదార్థాలు (సిట్రిక్‌ ఆమ్లం, లాక్టిక్‌ ఆమ్లం, ఆస్కార్బిక్‌ ఆమ్లం) ఎక్కువగా ఉంటే ఆ పండ్లు పుల్లగా ఉంటాయి. ఆల్కలాయిడ్లు, క్షార లక్షణాలు అధికంగా ఉండే పండ్లు వగరుగా అనిపిస్తాయి. ఆయా పండ్లలో రసాయనిక సంఘటన మీదనే రుచి, వాసన, రంగు, ఆహారపు విలువలు సైతం ఆధారపడి ఉంటాయి

పాలకు, పెరుగుకు, వెన్నకు మండే స్వభావం ఉండదు. కానీ వెన్న నుంచి తీసిన నెయ్యికి మాత్రం మండే స్వభావం ఉంటుంది. ఎందుకు?

పాలల్లోనే పెరుగు, వెన్న, నెయ్యి దాగున్నాయి. ఒక వస్తువు మండే స్వభావాన్ని ప్రదర్శించాలంటే దాన్ని వెలిగించినా లేదా నిప్పు పెట్టిన వెంటనే మండాలి. అందుకు ముందుగా దానికి తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద చాలా ఇంధనాలు (fuels) మండవు. పాలల్లో నీటి శాతం 80 శాతం కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పాల మీదకు అగ్గిపుల్ల పెడితే అగ్గిపుల్ల ఆరిపోతుంది. దీనికి కారణం అగ్గిపుల్లలో ఉన్న వేడిని పాలలో ఉన్న నీరు సంగ్రహించడమే. ఎంత మంట పెట్టినా పాలలో ఉన్న నీరు కొంచెం మాత్రమే వేడెక్కుతుంది. మహా అయితే 100 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుంది. పాలలో నీరు ఉన్నంత వరకు పాల ఉష్ణోగ్రత అంతకు మించి ఎదగదు. కాబట్టి పాలు మండలేవు. వెన్న ఓ విధమైన ఎమల్షన్‌. అంటే అది రెండు ద్రవాల మిశ్రమణం. అందులో నీరు ఎక్కువ, వెన్న శాతం తక్కువ. కాబట్టి వెన్నకు మంట పెట్టినా అందులో నీరు ఆ మంటలోని ఉష్ణాన్ని సంగ్రహించి ఆవిరవుతూ వెన్న మండడానికి కావలసిన ఉష్ణోగ్రతను చేరకుండా అడ్డుకుంటుంది. ఇక నెయ్యి అంటే నీటి శాతం దాదాపుగా ఏమీ లేని నూనె పదార్థం. ఇలాంటి నెయ్యికి నిప్పు పెట్టినా, మంట తాకినా నెయ్యి ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. నెయ్యి బాష్పీభవన ఉష్ణోగ్రత (boiling point) చాలా ఎక్కువ. అంటే అంతవరకు మంట ద్వారా ఉష్ణోగ్రతకు పెంచగలం. కానీ ఆ లోగానే అది గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండడానికి అవసరమైనంత ఉష్ణోగ్రత రావడం వల్ల మండుతుంది.

జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

సూర్యుడి లాంటి నక్షత్రాల్లో కేవలం వాయువులే ఉన్నా భూమిలాంటి గ్రహాల్లో వాయువులతోపాటు ద్రవాలు, ఘనపదార్థాలు ఉన్నాయి. వీటి అంతర నిర్మాణాన్ని బట్టి మూలకాలు, లేదా సంయోగ పదార్థాలు అనే రెండు కోవలకు చెందుతాయి. మూలకాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు అల్యూమినియం లోహంలో ఉన్నవన్నీ అల్యూమినియం పదార్థంతో కూడిన పరమాణువులే. కానీ సంయోగ పదార్థాలు, కొన్ని మూలకాలు కలవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో వేర్వేరు రకాలైన పరమాణువులు బృందాలుగా ఉంటాయి. ఈ బృందాలను అణువులు అంటాం.సాధారణంగా మూలకాల కన్నా సంయోగ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండడమంటే రసాయనికంగా మార్పును నిరోధించడమే. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం పదార్థాలు మారడానికి కారణం వాటిలో ఉన్న అంతరంగిక శక్తి తగ్గడమే. ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు తక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి ఆ లోహాలు తుప్పుపట్టడాన్ని ఆమోదిస్తాయి. కానీ బంగారం, ప్లాటినం, స్టెయిన్‌లెస్‌ స్టీలు వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు ఎక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి అవి తుప్పు పట్టవు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

బంగారపు గనులు ఎలా ఏర్పడతాయి? మన రాష్ట్రంలో బంగారపు గనులు ఎక్కడున్నాయి?

విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారం (Au) పరమాణువుల్లో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని(metallic bond) ఏర్పరుచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం. అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపలి పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే లభ్యమవుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ ప్రాంతంలో కొన్ని బంగారపు గనులున్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బాగా ఉన్నాయి. మన రాష్ట్రంలో బంగారపు గనులు లేవు

రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.
ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.
కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.
సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

ఆధారము: డా.వందనా శేషగిరిరావు గారి బ్లాగు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate