వైజ్ఞానిక పరిభాషలో బలానికి, శక్తికి తేడా ఉంది. బలమున్నా శక్తి ప్రమేయంలేని సంఘటనలూ ఉన్నాయి. కానీ బలం లేకుండా శక్తి ప్రమేయం లేదు. కాబట్టి భూమ్యాకర్షణ శక్తి అనడం కన్నా భూమ్యాకర్షణ బలం భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుందనే విధంగానే మనం చెప్పుకోవాలి. భూమ్యాకర్షణ బలం భూమి నుంచి అనంత దూరం వరకు విస్తరించి ఉంటుంది. శాస్త్రీయంగా అది అనంత దూరం దగ్గర శూన్యం అవుతుంది. భూమ్యాకర్షణ ప్రభావాన్ని మరో ఇతర వస్తువు మీద బలం రూపేణా చూడాలి. ఆ బలాన్ని గెలీలియన్ గురుత్వ బలంగా పరిగణిస్తారు. ఈ బలపు విలువ భూమికి ఆయా వస్తువుకు ఉన్న దూరపు వర్గానికి విలోమాను పాతం గానూ, ఆయా వస్తువుకున్న ద్రవ్యరాశికి అనులోమాను పాతంగానూ ఉంటుంది. సుమారు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుణ్ణి కూడా తన చుట్టూ తిప్పుకోగలిగినంత బలాన్ని ఇదే భూమి ఉపయోగిస్తుండగా, కొన్ని వేల కిలోమీటర్లు దాటిన వెంటనే వ్యోమశకటంలో ఉన్న వ్యోమగాములు గురుత్వ బలం సరిగా లేక శకటంలో దూదిపింజల్లా వేలాడుతుండటం చూస్తుంటాం. ఈ వైవిధ్యానికి కారణం చంద్రుడి విషయంలో దూరం కన్నా చంద్రుడి ద్రవ్యరాశి ప్రభావం అధికం కావడము, వ్యోమగాముల విషయంలో వారి దూరం కన్నా వారికున్న ద్రవ్యరాశి ప్రభావం తక్కువగా ఉండడం. భూమి లాంటి గ్రహం అయినా, సూర్యుడి లాంటి నక్షత్రం అయినా, చంద్రుడి లాంటి ఉపగ్రహం అయినా లేదా మరేదైనా చిన్నా చితకా ఖగోళ వస్తువు అయినా అది ఇతర వస్తువు మీద కలిగించే బలాన్ని ఆయా ఖగోళ వస్తువుకున్న గురుత్వ త్వరణం ద్వారా ఆరా తీయగలం. ఈ విలువ ఆయా ఖగోళ వస్తువు నుంచి దూరపు వర్గానికి విలోమంగా ఉంటుంది. దూరం రెట్టింపయితే బలం నాలుగురెట్లు తగ్గుతుంది. అందుకే బలాల్ని ఆయా ఖగోళ వస్తువుల ఉపరితలం మీద ఎంత ఉందన్నదే ప్రామాణికంగా చూపుతారు.
మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.
ఈ మెలనిన్ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్,--వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)'
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోకెల్లా పొడవైన గోడ. దీని పొడవు సుమారు 8851 కిలోమీటర్లు. ఈ గోడను క్రీస్తుపూర్వం 221 సంవత్సరంలో నిర్మించడం మొదలు పెట్టారు. పూర్తి కావడానికి 15 ఏళ్లు పట్టింది. రాళ్లతో, ఇటుకలతో కట్టారు. మంగోలియన్ల దాడి నుంచి చైనాను రక్షించడానికి దీన్ని నిర్మించారు. ఒకప్పుడు చిన్నచిన్న రాష్ట్రాల రూపంలో విడివిడిగా ఉండే చైనాను ఒకే సామ్రాజ్యంగా మార్చిన చక్రవర్తి షిహూయాంగ్ దేశ రక్షణ కోసం ఈ గోడను నిర్మించాడు. కానీ ఆయన ఆశయం నెరవేరలేదు. ఆ గోడ అనేక చోట్ల పగిలిపోవడంతో మంగోలియన్లు చైనాపై అనేక దండయాత్రలు చేశారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
కొత్త సంవత్సరము , పుట్టినరోజు , పెళ్లిరోజు . పండగరోజు లలో స్నేహితులకు , బందువులకు గ్రీటింగ్ కార్డులు ఇచ్చి పుచ్చుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే . మరి ఇలా కార్డులు ఇచ్చుపుచ్చుకోవడం ఎప్పుడు మొదలైనది ? .. సుమారు 600 ఏళ్ళ క్రితము .. 1400 శతాబ్దములో చేతితో కాగితాల పై బొమ్మలు వేసి వాటిని యూరఫ్ లో ఒకరికొకరు ఇచ్చుకునే వారనడానికి ఆధారాలు ఉన్నాయట . అప్పటి గ్రీటింగ్ కార్డులు ఇప్పటికీ లండన్ మ్యుజేయం లో ఉన్నాయట. వీటిని ఎంతోమంది ప్రతి ఏటా సందర్శిస్తున్నారు . అచ్చుయంత్రం కనిపెట్టాక వీటి హంగామా పెరిగింది . మొదటగా జర్మనీ వాళ్ళు ప్రత్యేక సందర్భాల కోసం గ్రీటింగ్ కార్డులను ప్రింట్ చేయడం మొదలు పెట్టేరు . ఆ తర్వాత దేశదేశాల్లో గ్రీటింగ్ కార్డులు ముద్రణ , అమ్మకాలు విపరీతం గా పెరిగాయి .
కార్డులు కన్నా ముందే ఈజిప్టు లో ఈ సంప్రదాయం మొదలైనదని అంటారు . ఈజిప్తియన్లు చెట్ల బెరడులపై శుభాకాక్షలు రాసి ఇష్టమైన వారికి ఇచ్చుకునే వారని చెబుతారు . కాగితం కనుగొన్న తరువాత రాతలన్ని దాని మీదకు మారాయన్నమాట . మొత్తం మీద 18 వ శతాబ్దం నుంచి వీటి వాడుక పెరిగిపోయింది . ప్రఖ్యాత చిత్రకారులైన "కేట్ గిరవే " , " వాల్టర్ క్రేన్ " లాంటి వారు రకరకాలైన డిజైన్లలో కార్డులు తయారు చేయించి ముద్రించేవారు . 19 శతాబ్దం వచ్చేసరికి 'మదర్స్ డే ' ఫాదర్స్ డే ' లాంటి ప్రత్యేక దినాలు పెరిగిపోవడం తో ఉత్పత్తి పెరిగింది .
మీకు తెలుసా ?...
ప్రపంచ పటంలో నేల భాగాన్ని ప్రాథమికంగా ఖండాలు (continents)గా విభజించారు. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అంటూ ఏడు ఖండాలున్నా, జనాభా ఏమీ లేని అంటార్కిటికాను ఖండాల్లో లెక్కించకుండా రెండు అమెరికాలను ఒకే ఖండం అంటూ ఐదు ఖండాల్నే పేర్కొంటారు. సాధారణంగా ఖండాలుగా ఉన్న ప్రాంతాల చుట్టూ సముద్రాలు లేదా సముద్రపు నీటి ప్రాంతాలున్నా, వాటిని ద్వీపాలు(islands)గా పరిగణించరు. కేవలం ఖండాల్లో అంతర్భాగంగా ఉన్న దేశాలేమైనా ఉండి, వాటి చుట్టూ అన్ని వైపులా సముద్రపు జలాలుంటే అలాంటి సందర్భాలలోనే ద్వీపాలుగా భావిస్తారు. ఆస్ట్రేలియా దేశమే అయినా అది ఓ ప్రధాన ఖండం. ఓ ఖండంగా చూస్తే దీని వైశాల్యం దాదాపు 90 లక్షల చదరపు కిలోమీటర్లున్నా, అందులో ఓ దేశంగా ఉన్న ఆస్ట్రేలియా వైశాల్యం సుమారు 77 లక్షల చదరపు కిలోమీటర్లుంది. కానీ గ్రీన్‌లాండ్ ఉత్తర అమెరికా ఖండంలో ఓ భాగం. మొత్తం ఉత్తర అమెరికా ఖండపు వైశాల్యం 245 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా, గ్రీన్‌లాండ్ ద్వీపపు మొత్తం వైశాల్యం కేవలం 20 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా దేశపు భాగం దాదాపు 85 శాతం కాగా, ఉత్తర అమెరికా ఖండంలోని గ్రీన్‌లాండ్ భూభాగం 10 శాతం కూడా లేదు. కాబట్టి గ్రీన్‌లాండ్‌ను ఓ ద్వీపంగా, ఆస్ట్రేలియాను ఓ ఖండంగా మాత్రమే పరిగణిస్తారు. అయితే ఆస్ట్రేలియాను కూడా అడపాదడపా ద్వీపంగా కూడా చెబుతారు. చుట్టు పక్కల నీరుండడాన్నే గీటురాయిగా తీసుకుంటే అమెరికా ఖండాలు రెండూ ద్వీపాలే. ఆఫ్రికా కూడా ద్వీపమే. ఆసియా-ఐరోపా కలిపి యూరేసియా అంటున్నారు కాబట్టి అది కూడా ద్వీపమే. అన్నీ ద్వీపాలే. ఇది గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రీన్‌లాండ్‌నే అతి పెద్ద ద్వీపంగా లెక్కిస్తారు.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్, వరంగల్;రాష్ట్రకమిటీ, -జనవిజ్ఞానవేదిక
సముద్రపు తీరానో లేక ఒక సరస్సు పక్కన ఉన్న ఇసుకను చేతితో తోడుతూ పోతే కొంతలోతులో నీరు లభిస్తుంది. ఆ నీరే భూగర్భ జలం. నేలపై బావి తవ్వితే అందులో ఊరే నీరు భూగర్భ జలం. భూమిపై కురిసిన వర్షపునీరు, మంచు, వడగళ్లవాన వల్ల ఏర్పడిన నీరు గురత్వాకర్షణ వల్ల నేలపై ఉండే మన్ను, ఇసుక, గులకరాళ్ల పొరలగుండా భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉండే రాతి పొరల్లో పయనించి కొంత లోతులో నిక్షిప్తమవుతుంది. సరస్సులలో నదుల్లో, సముద్రాల్లో లభించే నీరు ఉపరితలపు నీరు (surface water). ఉపరితలపు నీరు, భూగర్భ జలాలు వాటి స్థలాలను మార్చుకుంటాయి. భూగర్భ జలాలు భూమిలోని పొరల గుండా సరస్సుల్లోకి, కాలువల్లోకి ప్రవేశింవచ్చు. అలాగే సరస్సుల్లోని నీరు పక్కనే ఉన్న భూభాగంలోకి 'లీకై' భూగర్భ జలంగా మారవచ్చు.
భూగర్భ జలాలను తనలో ఇముడ్చుకొనే ప్రక్రియలో భూమి ఒక పెద్ద స్పాంజిలాంటి పాత్రను పోషిస్తుంది. భూగర్భ జలాన్ని బావులు తవ్వడం ద్వారా, బోరు పంపులు వెయ్యడం ద్వారా భూమిపైకి తీసుకొని వచ్చి, ఆ నీటిని తాగునీటిగా, సేద్యపు నీరుగా వాడుకుంటాం. ఆ విధంగా భూగర్భజలం మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక బ్యాంక్ ఎకౌంట్ లాంటిది.
భూగర్భజలాలు చాలావరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఎటొచ్చి భూమి లోపల నిర్మించిన ఆయిల్ టాంకర్లు లీక్ అయితేనే, పంటపొలాలకు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వేయడం వల్లో ఆ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది.
ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, -నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.
గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ఫోర్స్డ్ Vibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది .
అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(సౌండ్ బాక్సులు) పై బిగిస్తారు .
వెంట్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో 'మెలానిన్' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. బాల్‌పాయింట్ పెన్ రీఫిల్ నిండా ఇంకు ఉన్నప్పుడు నల్లగాను, ఇంకు పూర్తిగా అయిపోయిన తర్వాత తెల్లగాను కనబడినట్టే ఇది కూడానన్నమాట. ఒకోసారి మెలనోసైటిస్ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
తల వెంట్రుకల రంగులాగే వాటి ఆకారం కూడా జన్యు సంబంధమైన విషయమే. తూర్పు ఆసియా ప్రాంతం వారి తలవెంట్రుకలు సాధారణంగా వంకర లేకుండా తిన్నగా ఉంటే, యూరోపియన్లవి తిన్నగానైనా, ఉంగరాలుగానైనా ఉంటాయి. ఆఫ్రికా దేశవాసుల జుట్లు ఉంగరాలు తిరిగి బిరుసుగా ఉంటుంది. తిన్నగా ఉండే వెంట్రుకల అడ్డుకోత గుండ్రంగా ఉంటే, ఉంగరాల జుట్టు అడ్డకోత అండాకార రూపంలో ఉంటుంది. వివిధ రకాల వెంట్రుకలను వాటిలో ఉండే రసాయనిక సమ్మేళనాలను బట్టి గుర్తించవచ్చు. ప్రతి వెంట్రుకలో ప్రొటీన్ కెరొటిన్ అణువులు ముఖ్యంగా ఉంటాయి. తిన్నగా ఉండే వెంట్రుకల్లో ఇవి సల్ఫర్ బాండ్లలో గంధక బంధనాల (సల్ఫర్ బాండ్ల) ద్వారా ఒకటిగా బంధింపబడి ఉండడంతో అవి సాపుగా, దృఢంగా ఎదుగుతాయి. వీటికి తోడు అదనంగా వదులుగా బంధింపబడి స్థితిస్థాపకత కలిగిన కెరొటిన్ కలిగి ఉండే వెంట్రుకలు వంకర తిరిగి ఉంగరాల జుట్లుగా ఏర్పడతాయి. తిన్నగా ఉండే వెంట్రుకలలోని సల్ఫర్‌బాండ్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని ఉంగరాల జుట్టుగా మార్చవచ్చు. ఈ ప్రక్రియను పెర్మింగ్ అంటారు.
ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
పరిణామ క్రమంలో జంతువులు ఏర్పడ్డాక అవి పరిసరాలలోని ఉష్ణం, శీతలం, తేమ, సూక్ష్మజీవుల తాకిడి లాంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి చర్మం మీద బొచ్చు ఏర్పడ్డం ప్రారంభమైంది. చర్మంలో ప్రధానంగా బయటి పొర , లోపలి పొర అనే రెండు పొరలుంటాయని చదువుకుని ఉంటారు. చర్మం లోపలి పొర పలుచని కండరాలతో కూడి ఉంటుంది. ఇందులో పాదుల్లాంటి గుళికలు ఉంటాయి. వీటినే రోమస్థావరాలు (hair follicles) అంటారు. ఎలాగైతే వరి, జొన్నలాంటి మొక్కలు నేలపాదుల్లో గట్టిగా వేళ్లూనికుని పైకి ఎదుగుతాయో అలాగే ఈ కేశ స్థావరాల్లోంచి వెంట్రుకలు మొలిచి చర్మం బయటి పొర దాటి పైకి వస్తాయి. వెంట్రుకల్లో ఉండేది ఓ విధమైన ప్రొటీన్లు. వీటిని రసాయనికంగా ఆల్ఫా కెరోటీన్లు అంటారు. గంధకం కూడా ఓ అంశంగాగల సిస్టీన్ అనే ఆమైనో ఆమ్లం ప్రధానంగా ఉండే ప్రొటీన్లు ఇవి. ఈ ప్రొటీన్లతో పాటు మెలనిన్ అనే వర్ణ రేణువులు (pigments) విస్తారంగా ఉంటే ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అవి లేనివి తెల్లగా ఉంటాయి.
ఒకప్పుడు 'కీ' ఇవ్వడం ద్వారా ఒక సర్పిలాకార స్ప్రింగ్‌లోకి శక్తిని నింపినపుడు, అది తిరిగి యధాస్థితికి చేరే క్రమంలో విడుదల చేసే యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని గడియారపు ముళ్లు తిరగేవి. నేడు ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ద్వారా ప్రత్యేకమైన విద్యుత్ సర్క్యూట్ ద్వారా క్వార్ట్ ్జ(Quartz) స్ఫటికానికి విద్యుత్‌ను పంపినప్పుడు అది జరిపే సంకోచ వ్యాకోచాల యాంత్రిక శక్తితో గడియారపు ముళ్లను నడిపిస్తున్నారు.ఈ సర్క్యూట్‌కు కావలసిన శక్తిని చిన్న బొత్తాము ఘటం(button cell) ద్వారా సమకూరుస్తారు. కాబట్టి పాత 'కీ' గడియారమైనా కొత్త క్వార్ట్ ్జ గడియారమైనా మొదట తన శక్తిని ఓ చక్రానికి బదలాయిస్తుంది. ఇది ఓ పళ్ల చక్రం . దీనికి వివిధ వ్యాసార్థాలు ఉన్న మూడు వేర్వేరు పళ్ల చక్రాలను అనుసంధానిస్తారు. ప్రధాన చక్రానికి ఉండే పళ్లకు అనుగుణంగా అనుసంధాన చక్రాలకు ఉన్న పళ్ల సంఖ్యను మార్చడం ద్వారా అవి వేర్వేరు వేగాలతో తిరిగేలా చేస్తారు. ఆ చక్రాలకే గడియారం డయల్‌పై తిరిగే ముళ్లను కలుపుతారు. ఆయా చక్రాల వేగాన్ని బట్టి గడియారంలో ఒక ముల్లు గంటలను, ఒక ముల్లు నిమిషాలను, మరో ముల్లు సెకన్లను సూచించేలా వేర్వేరు వేగాలతో తిరుగుతాయి. ఇలా అవసరాన్ని బట్టి మరిన్ని చక్రాలను, ముళ్లను కూడా అనుసంధానించుకోవచ్చును.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్, -వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
నడుస్తున్నప్పుడు చేతులూపడమనేది అసంకల్పితంగా జరిగేదే అయినా, దీని వెనుక బ్యాలన్స్‌కి సంబంధించిన సూత్రం ఉంది. ఇది, శరీరం మధ్య భాగాన్ని కదలకుండా ఉంచడానికి, దేహశక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నడిచేప్పుడు మనపై కొన్ని బలాలు పనిచేస్తుంటాయి. మన శరీరం పైనుంచి కిందికి ఒక నిలువైన అక్షం (axis)ఉన్నట్టు వూహించుకుంటే, కుడికాలును ముందుకు వేసినప్పుడు అక్షంపై ఒక బలం గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. దీనిని అపవర్తన భ్రామకం (రొటేషనల్ మొమెంట్) అంటారు. దీని వల్ల నడుం గుండ్రంగా తిరగడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగితే నియంత్రణ కోల్పోయి పడిపోతాం. ఈ బల ప్రభావాన్ని ఆపాలంటే దీనికి వ్యతిరేక దిశలో మరో బల భ్రామకం పనిచేయాలి. ఇది ఎడమ చేతిని ముందుకు వూపడం వల్ల ఏర్పడుతుంది. అంటే, కుడికాలును ముందుకు వేస్తే ఏర్పడిన బలాన్ని, ఎడమచేతిని ముందుకు ఊపితే ఏర్పడిన బలం 'బ్యాలెన్స్' చేస్తుంది.
కుడికాలును ముందుకు వేసినపుడు కుడిచేతిని, ఎడమకాలును ముందుకు వేసినపుడు ఎడమచేతిని అదే దిశలో వూపి నడవడం సాధ్యంకాదు. అలా చేస్తే మన నడుము, శరీరం పక్కకు ఒరిగిపోయే బలానికి గురవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పరుగెత్తడానికి ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాదు.
- ప్రొ||ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
ఉష్ణశక్తి ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుందని చదువుకుని ఉంటారు. వేడిగా ఉన్న వస్తువు కాసేపటికి చల్లబడడానికి కారణం, దానిలోని ఉష్ణోగ్రత పరిసరాలకు సరఫరా అవడమే. కొయ్యో, పెట్రోలు లాంటి ఇంధన పదార్థాలో మండుతున్నప్పుడు క్రమేణా మంట ఆరిపోవడానికి కారణం ఆయా ఇంధనాలు తరిగిపోవడమే.
ఇక భూమిలోని అత్యధిక ఉష్ణానికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. భూమి ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి గ్రహశకలాలు వచ్చి ఢీకొనడం ఒక కారణం. భూగర్భంలో యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛేదనం (radioactive decay) చెందడం వల్ల భూగర్భంలో 80 శాతం ఉష్ణోగ్రత ఏర్పడుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల జనించే బలాలు (tidal-forces) మరో కారణం. భూమికి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల కొంత, ఇనుము, నికెల్, రాగిలాంటి ఖనిజాలు నిరంతరం భూమి అంతర్భాగం చేరుకునే క్రమంలో మరికొంత ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. ఇలాంటి కారణాల వల్ల భూమి అంతరాంతరాల్లో ఉష్ణోగ్రత 7000 డిగ్రీల కెల్విన్ వరకు చేరుకుంది. ముఖ్యంగా రేడియో ధార్మిక పదార్థాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రత భూమి ఉపరితలానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో భూగర్భంలో వేడి చల్లారకుండా అలాగే ఉంటుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
విమానం చేయలేని పనులను కూడా హెలికాప్టర్ చేయగలదు. రన్‌వే పై పరుగెత్తకుండానే ఉన్న చోట నుంచి నిట్టనిలువుగా పైకి లేవగలదు. కావాలంటే వెనక్కు ఎగరగలదు. ఎగురుతూ కావలసిన చోట ఆగిపోయి ఉండగలదు. గాలిలో పూర్తిగా గుండ్రంగా తిరుగగలదు. ఇన్ని ప్రత్యేకతలతో హెలికాప్టర్ ఎగరడానికి దానిలోని ప్రధాన భాగాలైన మెయిన్ రోటర్, డ్రైవ్ షాప్ట్, కాక్‌పిట్, టెయిల్ రోటర్, లాండింగ్ స్కిడ్స్ దోహదం చేస్తాయి.
మన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌ను తీసుకొచ్చి తిరగేసి బిగించినట్టుగా హెలికాఫ్టర్ మీద పెద్ద పెద్ద రెక్కలున్న పంకా ఉంటుంది. ఈ మొత్తం అమరికను 'మెయిన్ రోటర్' అంటారు. ఈ రెక్కలు గిరగిరా తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేస్తుంది. అంత బరువైన హెలికాఫ్టర్‌ను పైకి లేపేటంత 'లిఫ్ట్' (బలం) ఏర్పడేలా రెక్కలను వేగంగా తిప్పడానికి ప్రత్యేకమైన ఇంజను ఉంటుంది. పంకా రెక్కలు హెలికాఫ్టర్ చుట్టూ ఉండే గాలిని కిందకు నెడతాయి. ఇది చర్య అనుకుంటే, దీనికి ప్రతిచర్యగా హెలికాప్టర్ పైకి లేస్తుంది.
పంకా తిరగడంతో పైకి లేచిన హెలికాప్టర్ దానికి వ్యతిరేక దిశలో గిరగిరా తిరగాలి కదా. మరి దాన్ని ఆపాలంటే, మెయిన్ రోటర్ తిరిగే దిశకు వ్యతిరేకంగా పనిచేసే సమానమైన బలం కావాలి. ఈ బలాన్ని హెలికాప్టర్ తోకకు ఉండే రెక్కలు (టెయిల్ రోటర్) కలిగిస్తాయి. ఈ రెక్కలు తిరగడం వల్లనే హెలికాప్టర్ పైకి లేచిన తర్వాత స్థిరంగా ఉండ గలుగుతుంది. హెలికాప్టర్ తలమీద, తోక దగ్గర ఉండే రెక్కల్ని ఒకే ఇంజను ద్వారా తిప్పే ఏర్పాటు ఉంటుంది.
ఇక 'కాక్ పిట్'లో పైలట్ దగ్గర రెండు రకాల కంట్రోల్సు ఉంటాయి. ఒకటి 'సైకిక్ కంట్రోల్' అయితే, మరొకటి 'కలెక్టివ్ కంట్రోల్'. సైకిక్ కంట్రోల్ ద్వారా పైలెట్ హెలికాప్టర్‌ను ముందుకు, వెనక్కు, కుడి ఎడమలకు తిప్పకలుగుతాడు. కలెక్టివ్ కంట్రోల్ ద్వారా పైకి, కిందికి తిప్పకలుగుతాడు. పైలట్ కాళ్ల దగ్గర టెయిల్ రోటర్ వేగాన్ని నియంత్రించే పెడల్స్ ఉంటాయి. ఇన్ని సదుపాయాలున్న హెలికాప్టర్‌ని 75 సంవత్సరాల క్రితం ఐగర్ సికోరస్కీ అనే ఇంజనీరు రూపొందించాడు.
- ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్-(ఈనాడు దినపత్రిక సౌజన్యము తో)
మన ఇంటిలో పెంచుకునే కోళ్లు ఎగిరే పక్షులకు ఉండే అవయవాలైన రెక్కలు, ఎగిరే కండరాలు, గాలి బాగా పీల్చే ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి ఎగరవు . మరీ ప్రాణహాని అనిపిస్తే మాత్రము ఒక్క సారిగా ఎగిరి ఎత్తయిన ప్రదేశాన్ని చేరతాయి. కోడి ఎగరటం మరిచిపోయేలా చేసింది మానవుడే. ఏ జీవికైనా బతికేందుకు ఆహారము, శత్రు జీవుల నుండి రక్షణ అవసరము. వీటికోసమే పరుగెత్తడము, ఎగరడము. కోడి ఇప్పుడు మనిషి జీవితములో ఒక భాగమైపోయిందది. కోళ్ళను మనిషి పెంపుడు జీవిగా మార్చుకుని వాటికి ఆహారము, భద్రత సమకూర్చాక వాటికి ఎగరాల్చిన అవసరము లేకుండాపోయింది.
మన దేహంలోని ఛాతీ, ఉదర భాగాల్ని వేరు చేసే పలుచని విభాజకం ఒకటుంటుంది. దీనిని ఉదర వితానం (diaphragm) అంటారు. ఇది కిందికి కదిలితే ఛాతీ ఎక్కువ గాలిని నింపుకుంటుంది. పై వైపు కదిలితే ఛాతీలోని కొంత గాలి బయటకు పోతుంది. మనం ప్రతిసారీ ముక్కు ద్వారా గాలిని పీల్చి, వదులుతున్నప్పుడు ఉదరవితానం కిందికీ పైకీ కదులుతూ ఉంటుంది. ఆ విధంగా మనం నిశ్శబ్దంగా శ్వాసిస్తూ ఉంటాం.శ్వాసించడం అనేది లయబద్ధంగా జరిగే క్రమమైన ప్రక్రియ. కాబట్టి శ్వాసనాళిక లోపలికి, వెలుపలికి వచ్చే గాలి నిశ్శబ్దంగా స్వర పేటికలోకి ప్రవేశిస్తుంది. ఒకోసారి ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమైతే ఉదరవితానం తటాలున కుంచించుకుపోయి కింది వైపు కదులుతుంది. అప్పుడు శ్వాసనాళం పై చివర అంటే స్వర పేటిక మూసుకోవడం మొదలవుతుంది. ఆ దశలో దాని ద్వారా హడావుడిగా వెలుపలికి పోయే గాలి, సీసా మూతిని బిగించిన రబ్బరు బిరడాను గబుక్కున లాగితే వచ్చే 'పక్' (యాక్) లాంటి శబ్దం చేస్తుంది. అలాంటి శబ్దాలు మధ్యమధ్య కొంత కాల వ్యవధిలో వరసగా వస్తాయి. అవే వెక్కిళ్లు. కారం ఎక్కువగా ఉండే మసాలా పదార్థాలు తినడం, కడుపులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం, పేగులు సరిగా పనిచేయక పోవడం లాంటి కారణాల వల్ల ఉదరవితానానికి అంటుకుని ఉండే నరం ఉత్తేజితమై వెక్కిళ్లు వస్తాయి.
కొత్త వింతల్లో ఒకటి... ప్రపంచంలోనే ఎత్తయినది... అదే క్రీస్తు విగ్రహం! దాన్నిప్పుడు తీర్చిదిద్దుతున్నారు!
ఓ పెద్ద కొండ. దాని అంచున ఎత్తయిన దిమ్మ. దానిపై నిలబడి చేతులు రెండు వైపులా చాచిన ఓ పెద్ద క్రీస్తు విగ్రహం. ఆర్ట్‌డికో పద్ధతిలో పోతపోసిన విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే ఎత్తయినది. ఆ మధ్య కొత్తగా ప్రకటించిన ఏడు ప్రపంచ కొత్త వింతల్లో ఇది కూడా ఒకటి. ఇదెక్కడుందో తెలుసా? బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఓ కొండ మీద. ఆ కొండే 2296 అడుగుల ఎత్తుగా ఉంటుంది. దాని మీద సుమారు 30 అడుగుల ఎత్తయిన దిమ్మ. ఆ దిమ్మపై సుమారు 100 అడుగుల విగ్రహం. దీని వెడల్పు 98 అడుగులు. అందుకే ఈ భారీ విగ్రహం ఆ చుట్టుపక్కల వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ విగ్రహం పేరేంటో తెలుసా? 'క్రీస్ట్ ద రెడీమర్'.
బ్రెజిల్ పేరు చెబితే చాలు గుర్తొచ్చేంతలా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి వాతావరణానికి సరిపోయే పదార్థాలతో దానికి కోటింగ్ వేస్తున్నారు. ఆ మధ్య ఓ పెద్ద తుపాను బ్రెజిల్‌ని వూపేసింది. ఎన్నో చెట్లు, భవనాలు నేలకూలాయి. అంతటి తుపాను ధాటికి కూడా ఈ విగ్రహం చెక్కచెదరలేదు. ఎందుకంటే దాని పైపూతలకు వాడిన సోప్‌స్టోన్ పదార్థం మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ కల్పించిందట. అయితే ఆ భారీ వర్షాల వల్ల అక్కడక్కడ కొద్దిగా పెచ్చులూడింది. అందుకే ఇప్పుడీ ముస్తాబు.
బ్రెజిల్‌లో ఒక భారీ క్రీస్తు విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన 1850 నాటిది. కానీ అప్పటి యువరాణి ఇసాబెల్ పెద్దగా ఆసక్తి చూపలేదు. తిరిగి 1921లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నో నమూనాలు పరిశీలించి, చివరికి చేతులు చాపినట్టు ఉన్న నమూనానే ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుడికి అందరి పట్లా అంత ప్రేమ ఉంటుందని చెప్పడానికి. ఆపై ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల పాటు శ్రమించి 1931లో పూర్తిచేశారు. ఈ విగ్రహం బరువెంతో తెలుసా? 700 టన్నులు. అప్పట్లో దీని నిర్మాణానికి 11 కోట్ల రూపాయలపైనే అయ్యింది. ఇది 2007 జులై 7న ప్రకటించిన ఏడు కొత్త వింతల్లో చోటు దక్కించుకుంది.
తాచుపాము కాటు విషపూరితమైనదే. కానీ కాటుకు గురైన వారందరూ చనిపోరు. విషం పరిమాణం, వ్యక్తి నిరోధకశక్తి, చికిత్స అందేలోగా గడిచిన కాలం లాంటి అంశాలను బట్టి ప్రమాదం తీవ్రత ఉంటుంది. తేనెటీగల కాటులో విషం ఉంది. అయితే ఒకే ఒక్క తేనెటీగలో మనిషిని చంపేంత మోతాదులో విషం ఉండదు. వందలాది తేనెటీగలు ఒకేసారి కుట్టినప్పుడు ఆ మొత్తం విషం ప్రభావానికి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఏమైనా తేనెటీగలు కుట్టినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.
భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది.
ఈ విషయం సరిగ్గా అర్థం కావడానికి చిన్న ప్రయోగం చేయవచ్చు. ఒక పెద్ద గ్లోబు తీసుకొని దాని మధ్య మధ్య భాగంలో టార్చిలైటు వేశామనుకోండి దాని నుంచి వచ్చిన కాంతి గుండ్రంగా కేంద్రీకృతమవుతుంది. అదే టార్చిని కొద్దిగా వంచి గ్లోబుపై వేశామనుకోండి అది పల్చగా ఎక్కువ భాగం విస్తరిస్తుంది. అందుకే ఆ భాగాల్లో వేడి తక్కువగా ఉంటుందన్నమాట. కిరణాలు ఏటవాలుగా పడితే వేడి తక్కువగా ఎందుకుంటుందో చూద్దాం. భూమి పై ఏటవాలుగా పడే సూర్యకిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వుంటుంది. వాతావరణంలోని గాలి, దుమ్ము కణాలు, నీటి ఆవిరి తదితర పదార్థాలు కిరణాలలోని అధిక భాగం వేడిని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యకిరణాలు, ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించవు. అదే భూమధ్య రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి కాబట్టి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల అవి కోల్పోయే ఉష్ణం కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించగలుగుతాయి.
కేవలం సూర్యకిరణాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో నీటి విస్తరణ, సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, సముద్ర తీరానికే ఎంత దూరంలో ఉందనే అంశాలపైన కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది.
వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్ థామ్సన్ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణా(expansion)నికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్ థామ్సన్ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్ బృందానికి చెందిన ఫ్రియాన్ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్ అయినా ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
చల్లటి గాలిని ఇచ్చే ఏసీ (కండిషనర్ )అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? కానీ, ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా? ఏసీ మొదట్లో ఒక ముద్రణ (ప్రింటింగ్) పరిశ్రమ కోసమే పుట్టింది. అమెరికాలోని బ్రూక్‌లీన్ ప్రింటింగ్ సంస్థలో వేడి, తేమల మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడేవి. ముద్రించిన తర్వాత రంగులు అల్లుకుపోవడం లాంటివి జరిగేవి. దీనిని అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక యువకుడు గమనించాడు. గాలిని చల్లబరిచే ఒక పరికరాన్ని చేసి యజమానికి చూపించాడు దాంతో ప్రింటింగ్ త్వరగా పూర్తి కావడమే కాదు నాణ్యత కూడా పెరగడంతో ఆయన బోలెడు సంతోషించాడు. అదే మన మొట్టమొదటి ఏసీ అన్నమాట. ఆ ఉద్యోగి పేరు విల్లిస్ హావిల్యాండ్ క్యారియర్. 'ఫాదర్ ఆఫ్ ఏసీ'గా పేరు తెచ్చుకున్న క్యారియర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే ఏసీని కనిపెట్టాడు. అప్పట్లో ఆయన జీతం వారానికి 10 డాలర్లు మాత్రమే!
క్యారియర్ 1906లో ఏసీ మీద పేటెంట్ సాధించాడు. అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు చేసి మరింత మెరుగు పరచాలని చూస్తుండేవాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఒక కొత్త సూత్రాన్ని రూపొందించి 1911 లో అమెరికాలోని ఇంజనీరింగ్ సొసైటీకి అందించాడు. ఇప్పటికీ ఈ సూత్రమే ఏసీల తయారీకి ప్రధానమైన ఆధారం. ఈ ఆలోచన ఆయన చాలా చిత్రంగా వచ్చింది. క్యారియర్ ఒకసారి రాత్రిపూట రైలు కోసం చూస్తున్నాడు. అప్పుడు బాగా మంచు కురుస్తుంది. ఇంతలో రైలు రావడంతో మంచు స్థానాన్ని వేడిగాలి ఆక్రమించింది. వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు. వేడిగాలి మూలంగా మంచు చెదిరినప్పుడు. చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడిని తగ్గించవచ్చని గ్రహించాడు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
పరిశ్రమల్లో ఏసీ బాగా ప్రాచుర్యం పొందడంతో క్యారియర్ ఒక కంపెనీని ఏర్పాటుచేశాడు. రకరకాల పరిశోధనలు చేసి ఆరోగ్యానికి హాని కలిగించని 'సెంట్రిప్యుగల్ రిఫ్రిజిరేషన్' యంత్రాన్ని తయారుచేశాడు. దీంతో విశాలమైన ప్రాంతాల్లో కూడా చల్లదనాన్ని కలిగించడానికి అవకాశం ఏర్పడింది. దాంతో వాణిజ్య సముదాయాలు, థియేటర్లలో వాడకం మొదలైంది. ఆతర్వాత చిన్న చిన్న ఏసీల తయారీకి గిరాకి పెరగడంతో 1928 లో ఇంట్లో వాడుకునే 'వెదర్ మేకర్ ' ని సృష్టించాడు. అదే ఇప్పుడు రకరకాల మార్పులతో ప్రపంచమంతా వ్యాపించింది అన్నమాట.
మామూలు ఉష్ణోగ్రతల వద్ద గాలిలోని అణువులు సెకనుకు 500 మీటర్ల వేగంతో కదులుతూ ఒకదానితో ఒకటి తరచూ ఢీకొంటూ ఉంటాయి. వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పుల వల్ల ఉష్ణం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కావడం వల్ల కూడా గాలిలోని అణువులు కలిసిపోతాయి. ఈ విధంగా వాతావరణంలోని వివిధ వాయువుల అణువులు, వాటి సాంద్రతల్లో తేడా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలిసిపోవడం ప్రకృతిలో ఒక సహజమైన ప్రక్రియ. ఈచర్య అనంతంగా కొనసాగడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరగడం. భూమి ఉపరితలం పైన 80 నుంచి 120 కిలోమీటర్ల వరకూ వాతావరణంలోని వివిధ వాయువులు వాటి సాంద్రతలతో సంబంధం లేకుండా వాతావరణంలోని 21 శాతం ఆక్సిజన్, 78 శాతం నైట్రోజన్ విడిపోకుండా సమానమైన గాఢత ఉన్న మిశ్రమ రూపంలో కలిసిమెలిసి ఉంటాయి.
-ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
మీ టీవీ వెనుక తగిలించే కేబుల్ తీగను మీ ప్రాంతంలో ఉండే కేబుల్ ఆపరేటర్ ఏర్పాటు చేస్తాడు. మీ టీవీలో ప్రసారమయ్యే రకరకాల ఛానెల్స్ నిర్వాహకులకు అతడు కొంత సొమ్ము చెల్లించి వాటిని ప్రసారం చేసే హక్కుల్ని పొందుతాడు. ఆయా ఛానెల్స్ వాళ్లు తమ కార్యక్రమాల సంకేతాలను ఉపగ్రహాలకు ప్రసారం చేస్తే వాటిని ప్రత్యేక ఏంటెన్నాల ద్వారా కేబుల్ ఆపరేటర్లు సేకరిస్తారు. అలా సేకరించే ఛానెల్స్ సంకేతాలన్నీ వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. వాటిని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరం గ్రహించి కేబుల్ తీగ ద్వారా ప్రసారం చేయగలిగే ఫ్రీక్వెన్సీలోకి మారుస్తుంది. ఇవన్నీ కలగలిసి కేబుల్ ద్వారా ఇంటికి చేరుకుంటాయి. టీవీ వెనుక ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సాకెట్‌కు తగిలించినప్పుడు ఆ సంకేతాలన్నీ వేర్వేరు ఛానెళ్ల ఫ్రీక్వెన్సీలోకి మారతాయి. ఈ పద్ధతినే డీమాడ్యులేషన్ లేదా విశ్లేషణం అంటారు. ఎంపిక చేసుకున్న ఛానెల్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీని టీవీ సర్క్యూట్ ఉత్పత్తి చేయగా, అదే ఫ్రీక్వెన్సీకి చెందిన అంశాల అనునాదం (resonance) జరుగుతుంది. ఫలితంగా ఆ ఛానెల్‌కి సంబంధించిన కార్యక్రమాలే తెరపై కనిపిస్తాయి. ఈ ప్రక్రియంతా కాంతి వేగంతో జరుగుతుంది.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక
కొండ గుహలలు అధిక శాతము భూగర్భజలాల కదలివల్ల ఏర్పడినవే. భూమిమీదపడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. . . ఆ ప్రయత్నములో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రము చేసి ఆ రంధ్రము గుండా ప్రయాణము చేస్తూ ఒక పెద్ద మార్గాన్ని ఏర్పరుస్తాయి. గాలిలో ఉండే కార్బన్ డై ఆక్షైడ్ వలన నీరు ఆమ్లగుణము సంతరిందుకొని రాతిని తినివేస్తుంది . . . క్రమముగా రాయి కరిగిపోయి పగుళు గా తయారవుతుంది , ఆ పగుళ్ళను నీరు మరింత విశాలము చేసుకుంటూ పోతాయి. ఫలితము గా ఒక గుహ ఏర్పడుతుంది.కొండల పైన పడిన వాననీరు ఈవిధముగా గుహలు ఏర్పడడానికి కారణమవుతుంది.
ప్రపంచము లో ఎన్నో గుహలు ఉన్నాయి . అతి పెద్ద గుహ 530 కి.మీ. పొడవు కలిగినది అమెరికాలో ఉన్నది . మన తెలుగు రాస్ట్రములో అజెంతా-ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి.
మెయిల్ ఎకౌంట్లని తెలియజేయడానికి వాడే @ గు ర్తు . 1885 వ సంవత్సరము నుండే వాడుకలో ఉన్నది . అప్పటిలో ఎకౌంట్ అవసరాలకోసం at the rate of అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవారు . ఆ తర్వాత కాలములో 1971 వ సంవత్సరములో కంప్యూటర్ నెట్ వర్క్ అడ్రస్ లకు మధ్య @ సింబల్ సెపరేటర్ మాదిరి గా వాడడం మొదలైనది . 1885 లో ఈ సింబల్ ని కీ బోర్డ్ లో " అమెరికన్ అండర్ వుడ్ (American Underwood)" మొదటిగా ప్రవేశపెట్టినది . . . కొంతకాలము కనుమరుగై 1971 లో " రేమాండ్ టోమిలిసన్(Raymond టామ్లిన్ son ) ఈ మెయిల్ మెసేజ్ లో నేచురల్ డివిజన్(Natural Division) గా వాడినారు . ఒక్కోక్క దేశము లో @ ని ఒక్కోక పేరుతో పలుకుతారు .
అంతరిక్షంలో ఏ యానకం లేకుండా నక్షత్రాల నుంచి కాంతి మనల్ని ఎలా చేరుతుంది?
కాంతి ప్రయాణించాలంటే యానకం (medium) ఉండాలనుకోవడం తప్పు. శబ్దతరంగాలు, పాదార్థిక తరంగాల వంటివి ప్రయాణించాలంటే యానకం ఉండాలి. కానీ కాంతి ప్రయాణానికి అవసరం లేదు. ఎందుకంటే కాంతి స్వభావ రీత్యా విద్యుదయస్కాంత తరంగాల క్రమానుగమనం (Electro magnetic wave propagation). ఈ విధమైన తరంగాల గమనానికి యానకం అవసరం లేదు. నిజానికి శూన్యంలోని కాంతికి అత్యధిక వేగం ఉంది. విశ్వంలో ఈ వేగానికి (3X108 మీ/సె) మించి మరేదీ ప్రయాణించలేదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
చిలుకలు పలికే పలుకులు వాటి స్వర సంబంధిత అనుకరణ వల్లనే కానీ, వాటికి ఉండే ఏదో ప్రత్యేకమైన పదజాలం వల్ల మాత్రం కాదు. మానవుల, పక్షుల ప్రవర్తన చాలా వరకు గాత్రం వెలువరించే శబ్దాలు, దృష్టి సంకేతాలపై ఆధారపడి
ఉంటుంది.పక్షుల స్వరపేటిక (voice box)ను సిరింక్స్ అంటారు. ఇది మానవుల స్వరపేటికలా కాకుండా అతి సామాన్యంగా ఉంటుంది. అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు.
పక్షుల్లో స్వరపేటిక శ్వాసనాళం కింద ఉంటుంది. స్వరపేటికలో ఉత్పన్నమయిన శబ్ద తీవ్రతను శ్వాసనాళంలోని కండరాలు నియంత్రిస్తాయి. ఆ శబ్దాలు అంతగా హెచ్చుతగ్గులు లేని స్వరభేదంతో వాటి నోటి నుంచి వెలువడుతాయి.చిలుకలు, మైనాలు వాగుడుకాయలు. ఇవి ఒక పర్యాయం 50 పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగలవు. వీటిలో శబ్దాల విడుదలను నియంత్రించే మెదడు ముందు భాగం మగ పక్షులలో ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల అవి శబ్దాలను సంగీత రూపంలో కూడా వెలువరిస్తాయి.మానవులలో శబ్దాలు పక్షులలో వలె కాకుండా శ్వాసనాళంపై ఉండే స్వరపేటిక నుంచి వెలువడుతాయి. స్వరపేటిక వివిధ భాగాలతో సంక్లిష్టంగా నిర్మితమయి ఉండటంతో శబ్దాలు స్పష్టమైన మాటల రూపంలో వెలువడుతాయి. నాలుక, బుగ్గలు, నోరు, పెదాలు స్వరస్థానాలను తగురీతిలో మార్చడమే కాకుండా నియంత్రిస్తాయి.ఆవిధంగా చిలుకలు మనం చేసే శబ్దాలను అనుకరిస్తాయే కానీ, అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు. అందుకనే చిన్న పిల్లలు మనలను అనుకరిస్తూ నంగినంగిగా, ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు మాటలను 'చిలక పలుకులు' అంటారు.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020
విజ్ఞానశాస్త్ర సంబదిత ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధా...
కొన్ని ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలు.
మనకు తెలియని కిన్ని ప్రశానలకు శాస్త్రీయ సమాధానాలు.
నిత్యజీవితంలో మనము అనేక రకాల ప్రశ్నలకు సమాధానాలు త...