অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

30 వసంతాల శాస్త్ర ప్రచారం

30 వసంతాల శాస్త్ర ప్రచారం

mar18విశ్వాసం మూఢ విశ్వాసంగా పరిణమిస్తే భగవంతునికి మనిషి నరబలి సమర్పించడమే కాదు, ఆత్మబలిదానం కూడా చేసుకుంటాడు. అన్నీ మన పురాణాల్లో వున్నాయనీ, అన్నింటినీ కనుగొన్నది మనమేనని నమ్మింపజూస్తున్న పాలకులు నూతన పారిశ్రామిక సాంకేతికత కోసం దిగే విమానం ఎక్కే విమానం అని లేకుండా దేశాలన్నీ చుట్టి రావడమెందుకో అర్థం కాదు.

‘ఏదిసత్యం/ఏదసత్యం ఓమహాత్మా ఓ మహర్షి’ అని ప్రశ్నించిన కవికి శాస్త్రమే సత్యమని నిశ్చయంగా తెలుసు.

విజ్ఞాన శాస్త్రం మాత్రమే సత్యాన్ని ప్రవచిస్తుంది. ఈ శాస్త్ర ప్రచారం కొనసాగిస్తున్న సంస్థ జనవిజ్ఞాన వేదిక ఫిబ్రవరి 28, 2018 తో ఈ సంస్థ ఆవిర్భవించి 30 ఏళ్ళు పూర్తవుతున్నది. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక, తెలంగాణా హైద్రాబాదులో సుందరయ్య కళానిలయంలో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో దేశంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో, సామాజికవేత్తలతో ఒక సెమినార్ నిర్వహించింది. అలాగే జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి 25 న గుంటూరులో సెమినార్ నిర్వహించింది. కేవలం జనవిజ్ఞాన వేదిక సంస్థనే కాకుండా 'ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్’ సంస్థకు కూడా 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 40 సంస్థలతో కూడిన నెట్ వర్క్ శాస్త్రీయ దృక్పథం, హేతువాదం ప్రజల్లో విస్తరించడానికి కృషి చేస్తున్న శాస్త్ర ప్రచార సంస్థల నమూహం.

'అఖిల భారత్ ప్రజా సైన్స్ సంస్థల అల్లిక' ఒక ప్రజాసైన్సు ఉద్యమం. ఈ నెట్ వర్క్ మొదటి అఖిలభారత ప్రజాసైన్సు కాంగ్రెస్ సభల్లో 1988, కన్నూర్ (కేరళ) లో ఏర్పడింది. ఈ సభలు ప్రతి రెండేళ్ళకొక సారి జరుగుతాయి. కార్యవర్గం కొత్తగా ఎన్నుకుంటారు. 1973 లో మొదటిసారిగా బాబా అణుపరిశోధనా కేంద్రం (Bhabha Atomic Research centre - BARC) ముంబాయి శాస్త్రజ్ఞులు దేశంలో ఒక సైన్సు ప్రచార సంస్థ వుండాలని, ఆ సంస్థ సామాన్య ప్రజల అవసరాలు తెలుసుకుంటూ మెరుగైన జీవనవిధానాల కోసం వారితో కలసి పనిచేయాలని భావించారు. భావించడమే తడవుగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది Federation of Indian Literary Scientific Association – FILSA. ఈ సంస్థ 1973 నుండి 1978 వరకు పని చేసింది. తదనంతరం కొంత కాలం కార్యకలాపాలు పడుతూ వచ్చాయి. తిరిగి 1988 లో ఈ సంస్థనే పునరుజ్జీవింప చేయాలన్న ఉద్దేశంతో కేరళ రాష్ట్రంలో దేశంలోని శాస్త్రజ్ఞులు, సామాజిక వేత్తలు అందరూ సమావేశమై All India People’s Science Network (AIPSN) ప్రారంభించారు. ఈ సంస్థ, దాని అనుబంధ సంస్థలు దేశంలో ప్రజలు వివిధ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి తగిన సూచనలతో ప్రత్యామ్నాయ విధానాలు ప్రభుత్వాలకు సూచించాలని భావించింది. అందుకు అనుగుణంగా శాస్త్ర ప్రచారం, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, శక్తివనరులు, సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణ సాంకేతికత, అధికార వికేంద్రీకరణ, మహిళా సమస్యల పరిష్కారం కోసం సమత, సాంస్కృతిక ప్రచారాల కోసం శాఖలు ఏర్పర్చి సామాన్య ప్రజలకు ఆయా రంగాల్లోని సమస్యలను విశదీకరించి అభివృద్ధి పథం వైపు దేశం పురోగమించడానికి తగిన కృషి చేయాలని భావించింది.

ఒక వైపు సైన్సు రంగం ఎంత పురోగమిస్తున్నదో, అంతకంటే బలంగా అవే సైన్సు పరికరాలను ఉపయోగించి ప్రజలను కుల, మతాల పేరుతో, మూఢ విశ్వాసాలను ప్రజలలో వ్యాప్తి చేయడానికి ఒక బలమైన వర్గం సమాజంలో పని చేస్తున్నది. మన విద్యావిధానంలో కూడా మూఢమైన ఆలోచనలు విద్యార్థుల్లో నింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలకులు లౌకిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వదవుల నధిష్టించి ఆ లౌకిక ఆశయాలకు తూట్లుపొడుస్తున్నారు. దేశ, రాష్ట్ర సౌభాగ్యం కోసం, అహర్నిశలు శ్రమించవలసిన వాళ్ళు పూజలు, పుష్కరాలకు అత్యధిక సమయం కేటాయిస్తూ ప్రజలను మత్తులోకి దింపుతున్నారు. నేటి జీవిత విలువలు నేర్పని విద్య యువకులను కూడా నిష్కియా పరులుగా తయారుచేస్తున్నది.

‘ఎక్కడ మనస్సు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతాడో

ఎక్కడ ప్రపంచం ముక్కముకులై ఇరుకైన గోడల మధ్య మగ్గి పోవదో

ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో

ఎక్కడ అవిరామమైన అన్వేషణ, పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో

ఎక్కడ పరిశుద్ధ జ్ఞాన వాహిని మతాంధ విశ్వాసపు టెడారిలో ఇంకిపోదో

తలపులో, పనిలో, నిత్యవిశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో,

ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, దేశాన్ని మేల్కాంచేట్టు...’

అని విశ్వకవి రవీంద్రుడు ఆకాంక్షించాడు. ఆ మార్గంలోకి ప్రజలను మళ్ళించే దిశగా జనవిజ్ఞాన వేదిక, అలాగే AIPSN పనిచేస్తున్నాయి. ఆ పనిలో భాగంగానే జనవిజ్ఞాన వేదిక చెకుముకి పత్రికను నిర్వహిస్తున్నది. 30 వసంతాల శాస్త్రప్రచారంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ఈ పత్రిక రవీంద్రుని ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తుందని, మనందరం, మీరూ మేమూ చేతులు కలిపి ముందుకు, మున్ముందుకి ప్రయాణం చేస్తామని, ఒక శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజ నిర్మాణ కృషిలో భాగం పంచుకుంటామని పునరుద్ఘాటిస్తూ అడుగులు వేద్దాం.

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate