অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అతి పెద్ద రేడియో టెలిస్కోపు

అతి పెద్ద రేడియో టెలిస్కోపు

dec425 సెప్టెంబర్, 2016 నైరుతి చైనాలో దట్టమైన అడవుల మధ్య అందమైన లోయలో చైనా ఇంజనీర్లు ఒక అద్భుతాన్ని నిర్మించారు.

అది అర కిలోమీటరు వ్యాసం వున్న ఒక పెద్ద డిష్, అంతరిక్షం నుంచి వెలువడే రేడియో తరంగాల్ని ఒడిసిపట్టే రేడియో టెలీస్కోప్ అది. దాన్నే FAST (Five hundred meter Apertue Spherical Telescope) అంటారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్. ఇంతకీ రేడియో టెలిస్కోప్ అంటే ఏమిటి?

తెలుసుకునే ముందు సాధారణ టెలిస్కోప్ గురించి కొంత చెప్పుకుందాం. టెలిస్కోప్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆప్టికల్ టెలిస్కోప్. దీనితో దూరంగా వున్న వస్తువుల్ని దగ్గరగా, స్పష్టంగా చూడొచ్చు.

ఈ రకం టెలిస్కోపులు సుదూర నక్షత్రాలు లేదా గ్రహాల్నించి వచ్చే కాంతిని కుంభాకార, పుటాకార కటకాల సహాయంతో ఆ వస్తువుల్ని పెద్దవిగా, స్పష్టంగా చూపెడతాయి.

వీటిని 1608లో హాలెండ్ దేశంలో తయారుచేశారు. అయితే టెలిస్కోపు సహాయంతో మొదట ఖగోళ పరిశోధనలు చేసింది మాత్రం గెలీలియో, ఆయన ఈ టెలిస్కోపులో కుంభాకార కటకం వస్తు కటకం (ఆబ్జెక్టివ్ లెన్సు)గానూ, పుటాకార కటకం అక్షి కటకం (ఐ లెన్స్) గానూ వుంటాయి. ఈ రకం ఆప్టికల్ టెలిస్కోపుని గెలీలియో టెలిస్కోపు అంటారు.

dec5తర్వాత జోహాన్స్ వీటిని ఇంకొంచెం మార్చాడు. కెప్లర్ టెలిస్కోపులో అక్షి కటకంలో కూడా కుంభాకార కటకాన్నే వాడతారు.

ఆప్టికల్ టెలిస్కోపులో పరావర్తన (రిఫెక్టింగ్) టెలిస్కోపులు ఇంకోరకం. 1663లో జీమ్స్ గ్రిగరీ వీటిని ప్రతిపాదించాడు. ఈ రకం టెలిస్కోపులో కాంతిని ఒక పుటాకార దర్పణం మీద పడేటట్లు చేస్తారు. ఈ టెలిస్కోపుని మొదట తయారుచేసింది ఐజాక్ న్యూటన్. ఆయన దీనిని 1668లో తయారుచేశాడు.

ఇప్పుడు రేడియో టెలిస్కోపు గురించి తెలుసుకుందాం.

ఆప్టికల్ టెలిస్కోపులు కేవలం కంటికి కనపడే వస్తువుల్ని మరింత దగ్గరగా స్పష్టంగా చూపగలవు. కానీ, కంటికి కనపడనివంటే వాయువులు లేదా మరేదయినా మన కన్ను చూడలేని రేడియేషన్ ని వెలువరించే వస్తువుల్ని చూడడం వీటితో సాధ్యపడదు.

ఇది రేడియో టెలిస్కోపు ద్వారా సాధ్యం. రేడియో టెలిస్కోపులో ఒక పెద్ద డిష్ యాంటెన్నా వుంటుంది. అది రేడియో తరంగాల్ని ఒక రిసీవర్ మీదికి ఫోకస్ చేస్తుంది. రిసీవర్ వీటిని ఆవర్ధనం (ఆంప్లిఫై) చేసి కంప్యూటర్ కి పంపిస్తుంది. కంప్యూటర్ల ద్వారా ఈ తరంగాల్ని శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తారు. -

నక్షత్రాలు, నెబ్యులాలు, గెలాక్సీలు చాలా దూరంలో వుండటం చేత వాటి నుండి వెలువడే రేడియో తరంగాలు చాలా బలహీనంగా వుంటాయి. వీటిని సమర్ధవంతంగా గ్రహించాలంటే చాలా పెద్ద డిష్ యాంటెన్నాలు అవసరం. మామూలుగా మనం వాడే రేడియోలు, టీవీలు, వాహనాలు వెలువరించే రేడియోతరంగాలు, అంతరిక్ష రేడియో తరంగాలతో కలిసిపోయి, గందరగోళం కలిగించకుండా ఈ టెలిస్కోప్‌లను జనావాసాలకి దూరంగా నిర్మిస్తారు.

అంతరిక్షం నుంచి వెలువడే రేడియో తరంగాల్ని మొదటగా శాస్త్రవేత్తలు 1932లో గుర్తించారు.

మొదటి రేడియో టెలిస్కోపుని 1937లో గోటిరెబర్ అనే ఔత్సాహికుడు తన ఇంటి పెరట్లో నిర్మించాడు. రేడియో ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీకి అదే ఆరంభం. రెబర్ నిర్మించిన టెలిస్కోపు డిష్ యాంటెన్నా వ్యాసం 9 మీటర్లు.

రేడియో టెలిస్కోపులో డిష్ ఎంత పెద్దది వుంటే అంత ఎక్కువ తరంగాల్ని అది ఒడిసి పట్టుకోగలదు. తద్వారా మరింత దూరం నుంచి వచ్చే బలహీన తరంగాల్ని కూడా విశ్లేషించే వీలుంటుంది.

dec6ప్రపంచంలోనే పెద్దదయిన FAST గ్రావిటేషనల్ వేవ్స్, డార్క్ మ్యాటర్, ఇంకా అంతరిక్షంలో రేడియో తరంగాలు విస్ఫోటనలనీ విశ్లేషిస్తుంది. ఈ టెలిస్కోపు ప్రత్యేకత కేవలం 500 మీటర్ల డిష్ కలిగి వుండటం మాత్రమే కాదు. ఈ డిష్ చిన్నచిన్న కదిలే ఫలకాల సహాయంతో నిర్మించారు. ఈ ఫలకాల్ని కదల్చడం ద్వారా 500 మీటర్ల డిష్‌లో ఒక 300 మీటర్ల వ్యాసం గల కదిలే డిష్ తయారవుతుంది.

ఇలా కదిలే డిష్ వుండటం వల్ల అంతరిక రేడియో తరంగాల్ని భూప్రదక్షణాల్లో నిమిత్తం లేకుండా స్థిరంగా రిసీవర్క్ అందించవచ్చు. FAST లోని అసలైన ప్రత్యేకత ఇదే.

భారతదేశంలో రేడియో టెలిస్కోప్‌లు ఒకటి పుణాలో, మరొకటి ఊటీలో వున్నాయి. వీటి గురించి మరొకసారి తెలుసుకుందాం.

ఆధారం: జి. రాహుల్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate