పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అద్భుత ఫలం అరటి పండు

అద్భుత ఫలం అరటి పండు గురించి తెలుసుకుందాం.

aug21అరటి పండంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. పసిపాపకు తొలిసారి తినిపించే అమృతఫలం... వయస్సుతో పనిలేకుండా, పేదా గొప్పా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సునాయాసంగా తీసుకోగలిగే అద్భుత ఫలం అరటి పండు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో దీన్ని పండిస్తున్నారు. బియ్యం, గోధుమ, మొక్కజొన్న తర్వాత స్థానాల్లో వున్న ప్రధాన ఆహారపంట ఇదే. దీని స్వస్థలం మాత్రం ఆసియా దేశాలే.

విత్తనాలు ఉండకపోవడానికి కారణమేమిటి?

పండ్లన్నింటిలోనూ చిన్నదో పెద్దదో గింజ ఉంటుంది. కానీ అరటిపండులో మాత్రం గింజలుండవు. నిజానికి మొదట్లో అరటిపండులోనూ గింజలుండేవి. దాన్నే "అడవి అరటి” అని అంటారు. గట్టి విత్తులుండే ఆ పండు తినడానికి పనికివచ్చేది కాదట, అయితే దాదాపు పదివేల సంవత్సరాల క్రిందట దీని జన్యువుల్లో కొన్ని మార్పులు చేసుకోవడంతో మొలిచిన ఓ చెట్టు వంధ్యంగా మారి విత్తులేని ఫలాన్ని కాసిందట.. అదే అరటి పండుగా నేడు మనందర్ని అలరిస్తోంది. అప్పట్లో విత్తుల్లేని ఆ పండును రుచి చూసిన రాతియుగం మనిషి ఈ జాతిని ఎలాగైనా సాగుచేయాలనే ఉద్దేశంతో దాని కాండాల్ని కత్తిరించి పాతి పెంచడం ప్రారంభించాడట. ఆ విధంగా ఆ పిలకల సాగు ద్వారానే ఎన్నో రకాల అరటిపండ్ల జాతుల్ని ఈనాడు మనం సృష్టించుకున్నాం.

విత్తులేకపోవడంతో సంకరణం కుదరకపోయినా టిష్యుకల్చర్ ద్వారా రూపొందించిన ఎన్నో వందల రకాలను ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్నారు. మనదేశంలో విరివిగా పండే కర్పూర, కేళి, చక్రకేళి, అమృత పాణి కూడా ఇలాంటివే. అరటిలో ఎన్ని రకాలున్నా త్వరగా పండకుండా ఎక్కువకాలం నిల్వఉండటంతో సంవత్సరం పొడవునా కాలెండిష్డే రకానిదే నేటికీ పై చేయి. ముఖ్యంగా ఆఫ్రీకా దేశాల్లో దీని సాగు మరింత ఎక్కువ, ఎందుకంటే ఎగుంతికి ఇవి ఎంతో అనువుగా వుంటాయి.

ఎన్ని రకాలు ఉన్నాయి?

aug22ఫాలబెర్రి’గా పిలిచే అరటిపండు మనకు తెలిసి సఖ్యంగా రెండు రకాలే. పచ్చిగా ఉండి తర్వాత మగ్గి పండులా మారేది ఒకటైతే, ఎప్పటికీ పచ్చిగా ఉండేది రెండో రకం. దీనినే మనం ‘పచ్చి అరటి’ లేదా ‘కూర అరటి’ అంటూ కేవలం కూరలకు మాత్రమే ఉపయోగిస్తాం. కానీ, అరటిపండును ఐదు రకాలుగా చెబుతుంటారు. ఆకుపచ్చనుండి ఎరుపురంగులోకి మారే "ఎర్రని అరటిపండ్లు” మొదటిరకం. వీటి గుజ్జు గులాబీరంగులో ఉంటుంది. కానీ రుచికి పసుపురంగు అరటి పండ్లలాగానే ఉంటాయి. ఎర్రగా ఉండే ఈ పళ్లలో కెరోటిన్, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి పసుపురంగు వాటి కన్నా ఆరోగ్యకరమైనవని చెబుతారు. రెండో రకం మాత్రం ఏ సందేహం లేకుండా అంతా తినే ఫ్రూట్ బనానానే, 15 - 20 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటుంది. మూడో రకం 'యాపిల్ బనానా' ఇది 8 - 10 సెం.మీ. పొడవుండి, తొందరగా పండిపోతుంది. పసుపురంగులోనే ఉండే 'బోబిబనానా' కేవలం 6 - 8 సెం.మీ. పొడవు మాత్రమే ఉంటుంది. అరటిపండ్ల జాతులన్నింటిలోకి ఇదే తియ్యనిదట. 'బేకింగ్ బనానా' 30 - 40 సెం.మీ. పొడవు కలిగిన ఈ పండు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో దొరుకుతుంది. వీటిని నేరుగా తినలేం. అమెరికా వంటి కొన్ని దేశాల్లో కేవలం అలంకరణ చెట్లుగా వాడే అరటిరకం గూడా వుంది.

అగ్రస్థానం ఎవరిది?

ప్రపంచ వ్యాప్తంగా అరటి ఉత్పత్తిలో అగ్రస్థానం మనదేశానిదే. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో దాదాపు 50 కోట్ల మంది ప్రజలు అరటిపండ్ల మీదే ఆధారపడి జీవిస్తున్నారట. ముఖ్యంగా చీకటి ఖండంలోని పేద దేశాలకు ఆకలి తీర్చే అమృతఫలం ఇది. దీని పువ్వును సైతం వంటల్లో ఉపయోగించడం ఎన్నో చోట్ల వాడుకలో ఉంది. నీటి బొట్టు పడితే జారిపోయే అరటిఆకు ప్రాశస్త్యం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల వంటకాల్ని అరటిఆకుల్లో ఉడికిస్తుంటారు. ఒరిస్సాలో అయితే అరటివేరు నుంచి తీసిన రసాన్ని కామెర్ల వ్యాధికి మందుగా వాడతారు. మరికొన్ని ప్రాంతాల్లో అరటిపండులో తేనెను కలిసి తింటే ఈ వ్యాధి తగ్గుతుందని చెబుతారు. దీని కాండం నుంచి వచ్చే పీచును చేనేత పరిశ్రమ, హస్తకళలు, కాస్మోటిక్స్, రంగుల తయారీలో ఉపయోగిస్తున్నాయి. కిడ్నీలో రాళ్లున వారికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

పోషకాలు ఎన్నెనో!

ప్రతిరోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే లేదు అని యూరోపియన్లు తెలిపారు. కానీ నిజానికి ఈ మాట అరటిపండుకు చక్కగా వర్తిస్తుంది. ఎలాగంటారా....

  • అరటిపండును పూర్తిస్థాయి ఆహారంగా చెప్పవచ్చును. మరే పండులోనూ లేని ఎ, బి1, బి2, బి6, సి... ఇలా అన్ని ముఖ్యమైన విటమిన్లూ ఇందులోనే వున్నాయి. శరీరానికి అవసరమయ్యే ఎనిమిది అమైనో ఆమ్లాలు ఇందులో చక్కగా లభిస్తాయి. మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా వుంటాయి. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇది మంచి శక్తివంతమైన ఆహారం.
  • అరటిపండు నుంచి కొంచెం కూడా కొలెస్ట్రాల్ శరీరంలోకి చేరకపోవడం విశేషం. మధ్యాహ్నం సమయంలో స్నాక్స్ లా కూడా దీన్ని తీసుకోవచ్చును. ఒక వందగ్రాముల పరిమాణం ఉన్న అరటిపండు నుంచి 90 కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది. 23 గ్రాముల పిండి పదార్థాలు, 12 గ్రా. చక్కెర, 2.6 గ్రా పీచు పదార్ధం, 1 గ్రా. ప్రొటీన్, 9 మి.గ్రా. విటమిన్-సి, 358 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. చెప్పాలంటే ఒక యాపిల్ కన్నా నాలుగు రెట్లు ప్రొటీన్లు, రెండు రేట్లు పిండిపదార్ధాలు, మూడింతల ఫార్ఫరస్, ఐదింతల విటమిన్ ఎ, ఐరన్ లు రెండింతల ఇతర విటమిన్లు, ఖనిజాలు అరటిపండులో ఎక్కువగా లభిస్తాయి.
  • తోటకూర కాడలాగ వేలాడిపోయే స్థితిలో ఉండే మనిషికి సైతం ఒక్క అరటిపండు తింటే చాలు.. వెంటనే శక్తి వస్తుంది. ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్, పీచుపదార్థాలు ఇందులో ఉన్నాయి. ఇన్సులిన్ స్రావాన్ని వెంటనే పెంచడంతో పాటు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం కూడా ఇదే. అందుకే జిమ్ కి వెళ్లే ముందు రెండు అరటిపండ్లు తింటే చాలు సరిపడా శక్తి లభిస్తుంది. క్రీడాకారులకు దీన్ని మించిన పౌష్టిక ఆహారం గల ఫలం మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు.

ఔషధ విలువలూ ఎక్కువే

  • అరటి పండులో ఎక్కువ పీచు ఉండడం వల్ల మలబద్దకాన్ని లేకుండా చేస్తుంది. గుండెలో మంటకి ఈ పండు మంచి మందులా పనిచేస్తుంది.
  • కడుపులో పుండ్లుంటే దీన్ని మించిన ఫలం లేనేలేదు.
  • ఈ ఫలంలో ఎక్కువగా ఉన్న ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ ను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.
  • అరటిపండులో ఎక్కువగా ఉన్న పొటాషియం, రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో అరటిపండు తీసుకునే వాళ్లలో గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఇతరుల కంటే 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. పైగా ఈ మధ్యకాలంలో ప్రాసెసింగ్ ఆహారపదార్థాలు తినడం, ఒత్తిడి మొదలైనవి శరీరంలో పొటాషియం శాతాన్ని కూడా తగ్గిస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజూ ఈ పండు తింటే మందులు మింగే బాధ తప్పుతుంది.
  • ఉదయం మధ్యాహ్నం వేళ్లలో అల్పాహారంలో అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. షుగర్ ఉన్నవారు తినకూడదు.
  • చలికాలంలో 'శాడ్' (సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్)తో బాధపడేవాళ్లకి ఇది మంచి మందు. ఫ్రీమెనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధపడేవారు ట్యాబ్లెట్లకు బదులుగా ఓ పండు తిన్నట్లయితే గ్లూకోజ్ శాతం సమానంగా ఉండి.. మానసిక స్థితి బాగుంటుంది.

ఆధారం: డి. ప్రేమాజీ

3.01445086705
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు