పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఒత్తిడి జయించడం ఎలా ?

ఎ సమయం లో చేసే పని ఆ సమయం లో చేస్తే ఒత్తిడిని జేయించగలం.

అనగా అనగా ఒక ఊరు ఆ ఊర్లో ఓ పేద రైతు. రెండు దున్నపోతులతో తన చిన్న వ్యవసాయం చేస్తుండేవాడు. ఉన్నట్లుండి తన దున్నల జతలో ఒకటి జబ్బుచేసి చనిపోయింది. అప్పుచేసి ఆదివారం సంతకెళ్లి మళ్లీ ఓ దున్నపోతును కొనుక్కొచ్చాడు. తన దగ్గర ఉన్న దున్నకంటే కొన్నది కొంత కండబట్టి బలంగానే ఉంది. కొత్తగా వచ్చిన జోడీని చూసి రెండో దున్న కూడా తన పని సులువైపోతుందని సంబరపడింది. వానలొచ్చే కాలం కూడా ముందుగానే అయ్యింది. రోజూ పడే వానలకు దున్నల జత ఒకింత హాయిగానే కాలం గడుపుతున్నాయి. కొత్త దున్న కూడా పెద్దగా పని లేనందుకు సంతోషంగానే ఉంది. ఒకనాడు రైతు అరకను సగేసుకుని, దున్నలకు కాణీ వేసి పొలానికి తోలుకపోయాడు. mar08.jpgకొత్తగా వచ్చిన దున్న పాతదానితో మనం ఎక్కడికి పోతున్నాం, ఏం పని చేయిస్తాడు మనతో అని ఆరాతీసింది. పొలం దున్నటానికి పోతున్నామని చెప్పింది రెండోది. కాస్త బద్ధకం జాస్తి అయిన కొత్తదున్న అయిష్టంగానే కాడికందకు వచ్చిండి. ఎంతపొలం దున్నాలో అని అనుమానంతోనే అడుగులు వేసింది. పోతూ పోతూనే చెరువుగట్టుకు చేరుకున్న తర్వాత తేరాపార చూసింది పొలంవైపు మనం దున్నే పొలం ఇదేనా అంది కొత్తదున్న. తలాడించింది. రెండోది. గుండెల్లో గుబులు మొదలయ్యింది కొత్తదానికి, పొలంలో పోయినాక కోటేరుదించి, అరక పన్నినాడు రైతు. ఒకటి రెండు అడుగులు వేసిందో లేదో కాణి పడేసి అడం తిరిగింది కొత్తగా కొన్న దున్న. రొక్కం బోసి కొన్న దున్న అడ్డం తిరిగే సరికి రైతుకు పైప్రాణాలు పైన్నే పోయాయి. ఏమీ తోచక తలపట్టుకున్నాడు. రైతు బాధ గ్రహించిన పాతదున్న కొత్త నేస్తంతో మాట్లాడింది. ఎందుకు అంకె వేస్తున్నావని అడిగింది. బాబోయ్ ఈ పొలాన్నంతా దున్నటం నాతో కాదు, ఇది నా శక్తికి మించిన పని, ఉన్నాళ్లుగా నీవెలాజేస్తున్నావో గాని నాకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి అంది. కొత్తదున్న గాబరా చూసి పాత దున్న నవ్వుకుంది. పొలాన్నంతా అని దీర్ఘాలు తీస్తున్నావ్, ఎంత పొలం దున్నాలని కనుచూపు ఆనే వరకు ఉంది పొలం, దాన్ని దున్నటం నాతరం కాదు అంది. ఈసారి పాత దున్న నవ్వు ఆపుకోలేకపోయింది. కనుచూపుమేర వున్న పొలమంతా మన ఆసామికి ఉంటే నిన్ను, నన్నెందుకు కొనుక్కుంటాడు? దున్నపోతులతో వ్యవసాయమెందుకు చేస్తాడు? ఏకంగా పెద్ద ట్రాక్టర్ కొనేవాడు. లేనిపోని అనుమానాలు మాని కాడికిందికి రా. మనం దున్నవలసింది మన ఆసామికున్న రెండకరాలే. ఈ మూడు ముక్కలు విన్నాక కొత్తదున్న చటుకున్న లేని కాడికిందికొచ్చింది. ఇక లాభం లేదని దిగాలు పడ్డ పేదరైతు ఆశ్చర్యంతో, ఆనందంతో పొలం దున్నటం మొదలెట్టాడు.

మన శక్తి కొలదీ కష్టపడి పనిచేయాలేకాని చేయాల్సిన పని కష్టమనీ, పెద్దదనీ నీరు కారిపోకూడదని ఈ కథ చెబుతోంది. లేనిపోనివి ఊహించుకుని చతికిలబడటం సరైంది కాదని, పరీక్ష రాసే మన చిన్నారులకు, ఈ కథకు ఏమైనా పోలిక ఉందో లేదో కాని ఒక్కటి మాత్రం నిజం. తాను చేయవలసిన పనిని పెద్దదెయ్యం'లా ఊహించుకుని ముందే నీరసపడకూడదు. ఎంత పెద్ద పనికైనా ఒక చిన్న ప్రారంభం ఉంటుంది. చేసుకుంటూపోతే అదే మన దారికొస్తుంది.

మార్చినెల వస్తుందంటే చిన్నారుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఎందుకంటే ఇది పరీక్షల కాలం కాబట్టి. పరీక్షలనగానే సహజంగా ఉండే భయానికి తోడు మంచి మార్కులు రావాలని, ర్యాంకులు కొట్టేయాలనే కోరిక పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది. చదువంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు. కాని మన విద్యావిధానం చదువుల్ని ఆ స్థాయికి దిగజార్చింది. ఇది వాస్తవం. దీనికి తోడు మన తల్లిదండ్రుల కోరికలు, ఆశలు, ఆకాంక్షలు. తమ బిడ్డ మంచి ర్యాంకు సాధించాలనీ, దీనితో ఏ డాక్టరు కోర్సులోనే, ఇంజనీరింగ్ లోనో సీటు ఖాయంజేసుకోవాలనీ కోరుకుంటున్నారు. స్కూలు నుండే ఐఐటి ఫౌండేషన్ కోర్సులనీ రకరకాల మాటలగారడీతో తలకు మించిన భారాన్ని పిల్లలపై మోపుతున్నారు. ఇవీ, అవీ తడిసి మోపెడై చివరకు చిన్నారులు బెంబేలెత్తిపోయి, ఒత్తిడికి తట్టుకోలేక కాడిపడేస్తున్న సందర్భాలు కోకొల్లలు. పసి మనస్సుల్లో ఒత్తిడి వల్ల ఏర్పడే భయం జీవితాంతం నష్టం కల్గిస్తూనే ఉంటుంది. వారి మేథోశక్తి మసకబారేలా చేస్తుంది. కేవలం బట్టీపట్టి తాత్కాలికంగా గండం గట్టెక్కే ప్రయత్నం చేస్తుంటారు. దీని వలన ఒరిగేదేమీ ఉండదు. వారి ఆలోచనా శక్తి ఏరకం గానూ పెంపొందదు. ఇవాళ మనం చూస్తున్నది పిల్లలు రాస్తున్నవీ అన్నీ దాదాపుగా కేవలం వాళ్ల జ్ఞాపకశక్తికి పరీక్షలే. వాటిని సక్రమంగా ఎదుర్కొవాలన్నా ముందుగా మన పిల్లలు ఒత్తిడి అనే మహమ్మరి బారిన పడకుండా కాపాడుకోవాలి. ఒత్తిడిలో ఉన్న వాళ్లు మంచి ఫలితాలు సాధించలేరు. వారిని ఒత్తిడికి గురిచేస్తున్న పద్ధతుల్ని ఒక్కరోజులో మనం మార్చలేకపోయినా మనవంతుగా మనం పిల్లలపై ఏ రకమైన ఒత్తిడిని కలిగించకూడదు. దీనిలో తల్లిదండ్రుల బాధ్యత, నిర్వహించవలసిన పాత్ర చాలా ముఖ్యమైంది.

పరీక్షలంటే ముందుగా మనలో భయం పోవాలి. దాన్ని రోటీన్ గా జరిగే ఒక విషయంగానే అర్థం చేసుకోవాలి. ఫలితంపై దృష్టిపెట్టి లేనిపోని ఒత్తిడికి గురికావద్దు. మనం చేసే పనిని సవ్యంగా చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. మనం చేసేపని ఒక క్రమపద్ధతిలో చేయాలి. కేవలం పరీక్షలొస్తున్నాయనో, లేదంటే మంచి ర్యాంకు రావాలనో పరీక్షలకు ముందు మాత్రమే అన్నీ మానేసి బట్టీ పట్టటం అంత మంచిది కాదు. మీకు పరీక్షలంటే ఆందోళన, భయం ఉండవచ్చు. ఉండటం సహజం కూడా! అదేదో మీకు ఒకరికే వుందనీ, నేనేమీ చేయలేకపోతున్నానీ అనుకోవద్దు. అందరిలాగే మీరు పరీక్ష రాసేదేమీరొక్కరే కాదు. మీ మిత్రుల్లాగే మీరు కూడా. నాకొక్కడికే ఈ భయం, బాధ వున్నాయని అనుకోవద్దు. అందరిలా నేనూ వ్రాస్తున్నాననీ, అందరిలాగే నేనూ ఆందోళన చెందుతున్నాననీ తెల్సుకుంటే ఈ భయం నుండి బయట పడవచ్చు.

mar09.jpgఅన్నింటికంటే ముఖ్యం మీకు తెల్సినదానిపై దృష్టి పెట్టండి. తెలియని దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు. నాకు తెలియదు. తెలియటం లేదు అనే ఆందోళన దరి చేరనివ్వకండి. మీరు ఎంచుకునే లక్ష్యాలు సాధ్యమైనంత వాస్తవంగా ఉండాలి. అందని పొందని లక్ష్యాన్ని ఊహించుకుని, దాన్ని చేరుకోలేక నీరసపడటం సరైంది కాదు. అందుకే ఎప్పుడో వచ్చేదాని గురించి కాకుండా రేపేం చేయాలి లేకుంటే వచ్చేవారంలో ఏం చేయాలి అనే దానిమీద ధ్యాసపెట్టండి. అలా చేస్తే మన సమీప లక్ష్యం నుండి అనుకున్న సుదూర లక్ష్యాన్ని కూడా సునాయాసంగా చేరుకోవచ్చు. కిందిమెట్టు మీద నిల్చుని ఆఖరి మెట్టుకు దూకలేం కదా! ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పై మెట్టును చేరుకోగలం. ఇవేవీ మీకు తెలియనివి కావు కాని ఒత్తిడి వలన లేక అతిగా అంచనా వేసుకోవటం వల్ల ఇబ్బందులు పడతాం. మనం చేసే పనుల్లో ఏది ముఖ్యమైందో, ఏది త్వరగా పూర్తి చేయాలో ముందుగా ఒక అంచనాకు వచ్చి తగిన విధంగా ప్రణాళిక వేసుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారం పని చేయటం (అది మామూలు సమయంలో కావచ్చు లేదా పరీక్షలప్పుడు కావచ్చు) అలవాటు చేసుకుంటే ఒత్తిడి మీదరిచేరదు. ఆందోళన అనేది మీ దరిదాపుల్లోకే రాదు. పరీక్షలైతే మరింత పకడ్బంధీగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఏ సబ్బెళ్లు ఎప్పుడు చదవాలో ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఎప్పటికీ ఒకే సబ్జెక్టు చదివినా అది సరిగ్గా బుర్రకెక్కదు. మీరు ఏదైనా సబైకు చదివేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే ఆ సబ్జెక్టును మార్చి వేరే మీకు ఇష్టమైన మరో సబ్జెక్టు చదవం చాలాసార్లు పరీక్షలున్నాయని వేరే విషయాల జోలికి పోము. కాని వేరే వాటిని కూడా అప్పుడప్పుడూ చదివితే మైండ్ కు రిలీఫ్ గా ఉంటుంది. కొంతమందికి సంగీతం వింటే రిలీఫ్ రావచ్చు. కొందరికి ఫజిల్స్ పూర్తిచేస్తే రిలీకి రావచ్చు. అందుకే మనం వేసుకునే ప్లాన్ లో అన్నీ వుంటే దాన్ని ఖచ్చితంగా పాటిస్తే మేలు. మనం వేసుకున్న ప్రణాళికలు కేవలం పరీక్షల కోసమే ఉండకూడదు. మనం ప్రతిదినం చేసే పనులకూ ఇది వర్తించాలి. చదువులకు కేటాయించిన సమయంలో చదువుకోవటం, ఆటల సమయంలో ఆటలు ఇలా జీవితంలో అన్నింటికీ సమపాళ్లు ఉంటేనే కేవలం పరీక్షలనాడే ఆందోళన పడి చదివే బాధ, భయంపోతాయి. చదువుతున్నప్పుడు అదే పనిగా చదవటం కాక మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వండి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి కూడా తోడ్పడుతుంది.

మనం ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నప్పుడు ఒకోసారి ఒత్తిడి కూడా మనకు కొంతమేలు చేయగలదు. మనం చేయకూడనివి రెండున్నాయి. అందులో ముఖ్యమైంది మనల్ను ఇతరులతో పోల్చుకోవటం. నేడున్న పోటీ ప్రపంచంలో దీన్నుండి బయటపడటం కష్టమే కాని అసాధ్యం కాదు. నీకు నీవే మంచి పోటీదారుడివని గుర్తుంచుకో. నీవు నిన్న సాధించిందాన్ని ఈ రోజు మరింత మెరుగుపర్చుకునే ప్రయత్నం చెయ్యి. అలా చేసే రేపు, ఆ మర్నాడు ఇలా ఎన్నో మెరుగైన ఫలితాలు సాధించగలవు. పోల్చుకోవటం నీలో ఒత్తిడిని దానంతటదే నిన్ను పైకి తీసుకుపోతుంది. అంతేకాదు నీలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది.

మనం చేయకూడని మరో ముఖ్య అంశం ఏమంట సకారాత్మక దృక్పథాన్ని కలిగి ఉండటం. అంటే ఎల్లప్పుడూ సకారాత్మకంగా ఆలోచించడం అవసరం. నకారాత్మాక, సకారాత్మక దృక్పథం గురించి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మీరొక గ్లాసులో నీళ్లు నింపుతున్నారనుకోండి. నీళ్లు సగానికే వచ్చినప్పుడు ఏమంటాము. గ్లాసింకా సగమైనా నిండలేదని ఆలోచిస్తే అది నకారాత్మకం. ఫర్వాలేదు గ్లాసు సగం నిండింది అనుకుంటే సకారాత్మకం. ఇంకో సగం నింపడమెంత చిటికెలో పని అనిపిస్తుంది సకారాత్మకంగా ఆలోచిస్తుంది. అదే మొదటిలా ఆలోచిస్తే ఇన్ని పోసినా సగమైనా నిండలేదు మిగిలిన సగం నింపడం కాని పని అనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలో కూడా మనం సకారాత్మకంగా ఆలోచించవచ్చు. ఆలోచించగలం కూడా. పోయిన పరీక్షలో 60 శాతం మార్కులొస్తే ఈ సారి 70 శాతం సాధించగలననే ధైర్యాన్నిస్తుంది. ఈ దృక్పథం ప్రయత్నించి చూడండి.

పిల్లలు ఒత్తిడిని జయించడానికి పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా వారినెప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. వారు నీరసపడినప్పుడు, ఓటమినెదుర్కున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు మళ్లీ వాళ్లను కార్యోన్ముఖుల్ని చేస్తాయి. గెలుపు, ఓటములు రెండింటినీ సమానంగా స్వీకరించే స్ఫూర్తిని పిల్లల్లో నింపవలసిన బాధ్యత తప్పకుండా పెద్దలదే. వారేచిన్న విజయం సాధించినా వాళ్లను మెచ్చుకోండి. అది టానిక్ లా పనిచేస్తుంది. వెనుకబడినప్పుడు మాత్రం తిట్టకండి. అనునయించి నీవు మరింత ప్రయత్నిస్తే సాధించగలవనే ధైర్యాన్ని ఇవ్వండి. మార్కుల గురించి మర్చిపోయి కూడా మాట్లాడకండి. వేరే పిల్లలతో పోల్చకండి. అప్పటికే ఒత్తిడిలో ఉన్నవాణ్ణి మరింత ఒత్తిడికి గురికానివ్వవద్దు. పరీక్షలు, మార్కులు ఎలా ఉన్నా మేమున్నాం అనే భరోసా ఇవ్వండి. ఒత్తిడికి గురైనప్పుడు సాధారణంగా పిల్లలు సరిగ్గా తినలేరు. సరైన ఆహారం తీసుకోకపోతే ఏ పని మీద సరిగ్గా ధ్యాస పెట్టలేరు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. తృప్తిగా తినటం చాలా అవసరం. ఎక్కువగా నీరు తీసుకోవటం కూడా మంచిది. బోర్ అనిపిస్తే కొద్దిసేపు నడవండి. లేదంటే ఏదైనా పజిల్స్, సరదా సంభాషణన్ చేయండి. రాత్రుళ్లు నిద్రమాన పరీక్షలకు చాలా మంది తయారవుతుంటారు. కాని నిద్రలేకపోతే మన మెదడు, శరీరం చురుగ్గా పనిచేయవు. అందుకే మంచి నిద్ర కూడా అవసరం. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం కూడా మీ పరీక్షల తయారీకి తోడ్పడుతుంది. అన్నింటికీ మించిన మంచి పని కలసి చదువుకోవటం. ఒక్కరే కూర్చుని అదే పనిగా చదివితే సాధించలేనిది కలిసి తెలియనివి చర్చించుకుని చదివితే తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. గ్రూప్ స్టడీ అంటే ముచ్చట్లు పెట్టి టైం వృధా చేస్తారనుకుంటారు కాని దాని వలన మనలో ఏర్పడే ఒత్తిడి పోతుంది. ఒత్తిడి మన నెత్తిన కూర్చోకుంటే ఏదైనా ఇట్టే చిటికెలో సాధించగలo .

ఆధారం: ప్రో. కట్టా సత్యప్రసాద్.

2.9975308642
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు