অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కూల్ డ్రింక్స్ మానేద్దాం.... సహజ పానీయాలను తాగుదాం

కూల్ డ్రింక్స్ మానేద్దాం.... సహజ పానీయాలను తాగుదాం

apr006.jpgప్రపంచ మొత్తంలో ఒక సంవత్సరానికి రెండు కోట్ల టన్నుల రసాయనాలను కూల్ డ్రింక్స్ రూపంలో ప్రజలు తాగుతున్నారు. ప్రతి లీటరు కూల్ డ్రింక్స్ లో 0.0180 మి.గ్రా క్రిమి సంహారక మందులు ఉన్నాయని మనదేశంలోని 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సిఎస్ఈ) అనే సంస్థ బయట పెట్టింది. అంతేగాక సిఎస్ఇ నిర్ధారణ ప్రకారం 0.0005 మి.గ్రా మాత్రమే ఉండాలి. అంటే 36 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

కూల్ డ్రింక్స్ అమ్మకాలు పెంచుకొనేందుకు కంపెనీలు సినిమా తారలతో వ్యాపార ప్రకటనలు ఇచ్చి అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దీనికి వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పర్యావరణవేత్తలు, మేధావులు కూల్ డ్రింక్స్ ను నిషేధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆందోళన చేపట్టారు. దీని ఫలితంగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే ముందుగా కూల్ డ్రింక్స్ ను నిషేధించింది.

పంజాబ్ విధానసభలోని క్యాంటిన్లో, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి పలురాష్ట్రాలు కూల్ డ్రింక్స్ ను విద్యాసంస్థలలో నిషేధించాయి.

శీతల పానీయాల వల్ల ఆర్థిక నష్టం

apr004.jpgఈ కూల్ డ్రింక్స్ వ్యాపారం వల్ల దాదాపు 50,000 వేల కోట్ల రూపాయల సొమ్ము విదేశాలకు తరలిపోతోంది. అలాగే 300 మి.లీ కూల్ డ్రింక్స్ తయారీఖర్చు కేవలం ఒక రూపాయి. మనకు ఒక కూల్ డ్రింక్స్ పది రూపాయలు అమ్ముతున్నారు. అంటే కంపెనీల ఆదాయం తొమ్మిది రూపాయలు. అంతేగాక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ నీటిని ప్రభుత్వం 2. 50 రూపాయలకు ఇస్తుంది. ఇదే నీటిని మనకు బహుళ జాతీ కంపెనీలు 12-14 రూపాయలకు మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్నారు. ఆరోగ్యపరంగా, సామాజికపరంగా, ఆర్థికపరంగా ఎంతో నష్టాన్ని కల్గజేస్తున్న కూల్ డ్రింక్స్ మాయలో పడడం వల్ల చాలానష్టం.

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల నష్టాలు

  1. వీటిలో పోషక విలువలు ఉండవు. తాగడంవల్ల లాభమేమీ లేదు.
  2. వీటిలోని అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయి.
  3. దీర్ఘకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.
  4. వీటిలోని ఫ్రక్టోజ్ వల్ల అధిక రక్తపోటు వస్తుంది.
  5. కూల్ డ్రింక్స్ వల్ల ఆస్టియో ఫ్లోరోసిస్ వచ్చే అవకాశం ఉంది.
  6. పంటిపై ఉండే ఎనామిల్ పొర కరిగి పిప్పిపళ్లు ఏర్పడతాయి.
  7. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
  8. మెటబాలిక్ సిండ్రోం సంభవిస్తుంది.
  9. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్ ఎద లో మంటకలుగజేస్తుంది.
  10. లివర్ సిరోసిస్ మార్పులు జరిగే అవకాశం ఉంది.
  11. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమవుతాయి.
  12. కూల్ డ్రింక్స్ లో ఉండే కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫారిక్ ఆమ్లాలు శరీర కణాలలోని ఆక్సిజన్ నిల్వలను తగ్గించడం ద్వారా క్యాన్సర్ కు దారితియచ్చు.
  13. కూల్ డ్రింక్స్ లో వాడే అస్పర్టేమ్ అనే కృత్రిమ తీపదార్ధం చెక్కందంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. అది క్యాన్సర్ కు దారితీయవచ్చు.
  14. వీటిలో కలిపే సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ రసాయనం కణాల్లోని డిఎన్ఎ పై ప్రభావం చూపడం ద్వారా కణ వ్యవస్ధకు నష్టం కలుగుతుంది.
  15. కూల్ డ్రింక్స్ ని హానికరమైన స్ధాయిలో వున్న పురుగుమందుల అవశేషాల వల్ల దుష్చలితాలు అనేకం.
  16. ఇవికాక కేరళలోని ప్లాచిమాడ ప్రాంతంలోనూ, రాజస్ధాన్ లోని కాలా డేరా ప్రాంతంలోను కోకోకోలా ప్లాంట్స్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. వ్యర్ధపదార్దాల విసర్జనవల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలయ్యారు.

 

సహజ పానీయాలను తాగుదాం

apr008.jpgనిమ్మరసం: మంచినీటిలో నిమ్మకాయ పిండి, చెక్కెర , ఉప్పు కలుపుకుని నిమ్మరసం చేసుకొని త్రాగవచ్చు. అది రోగనిరోధక శక్తి ని పెంచును.

 

 

చెరుకురసం: ముప్పావు లీటరు చెరకురసం గిన్నెలో వడపోసుకుని 3 చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. కొద్దిగా మిరియాలపొడి కలుపుకుని చల్లబరచుకుని తాగొచ్చు.

apr009.jpgమసాల మజ్జిగ: ఒక వంతు పెరుగు, నాలుగు వంతులు మంచినీరు కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఒక మిర్చి కొద్దిగా అల్లం తురుము తాజా కరివేపాకులు, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు కలుపుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన మసాల మజ్జిగ రెడీ. దీనిలో పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, రైబో ఫ్లేవిన్, విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తాయి.

apr0010.jpgకొబ్బరి నీళ్లు: లేత కొబ్బరి నీళ్లు సహజ తియ్యదనం, రుచి కల్గి ఉండి చల్లదనాన్నిచ్చి, జీర్ణవ్యవస్థకు, మూత్ర వ్యవస్థకు మేలు చేస్తుంది.

 

గంజితో షర్బత్: అన్నం వండేటప్పుడు వార్చినాక చిక్కని గంజి వస్తుంది. దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మజ్జిగ కలుపుకుని తాగితే ఎండాకాలం వడదెబ్బ సోకకుండా రక్షిస్తుంది.

రాగి అంబలి: 100 గ్రాముల రాగుల పిండిని కొద్దిపాటి నీళ్లలో మెత్తని పేస్టులా (గడ్డలు లేకుండా) చేసుకోవాలి. దీనిని సుమారుగా అరలీటరు నుండి లీటరు మరిగే నీళ్లతో కలిపి సన్నని మంటలో 3 నుంచి 5 నిమిషాల సేపు కలుపుతూ ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు లేదా బెల్లం (ఇష్టాన్నిబట్టి) మజ్జిగ కలుపుకోవాలి. వేసవితాపాన్ని చల్లార్చే ఆరోగ్యకరమైన రాగి అంబలి రెడీ.

apr0011.jpgవేసవి పానకం: పావుకేజి తురిమిన బెల్లం గిన్నెలో తీసుకుని ఒకటిన్నర లీటరు మంచినీరు పోసుకుని బాగా కలిపి, బెల్లం కరిగే వరకూ ఉంచాలి. 25 గ్రాముల మిరియాలు, ఆరు యాలకులు పొడిగా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. వేసవిలో చలవనిచ్చే ఆరోగ్యకరమైన పానకం రెడీ. ఇవే కాకుండా పుచ్చకాయ, నారింజ, బొప్పాయి, దానిమ్మ, అనాస, ద్రాక్ష, సపోటా వంటి పండ్లరసాలు విదేశీ కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate