పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

కృత్రిమ ఉపగ్రహాలు

కృత్రిమ ఉపగ్రహాల గురించి తెలుసుకుందాం.

పిభ్రవరి 15న ఒకే ప్రయోగంలో ఏకంగా 104 ఉపగ్రహాలు తమ తమ కక్ష్యల్లో ప్రవేశించాయి. SLV-C37 రాకెట్ తో ఈ చరిత్రను ఇస్రో సృష్టించడంతో నిజంగానే ఉపగ్రహాలను గురించి అందరిలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. వీటిని గురించి కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవడం విజ్ఞానదాయకము.

ఏదైనా ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించేది గ్రహం. గ్రహం చుట్టూ పరిభ్రమించే చందమామ లేదా యంత్రపరికరాన్ని ఉపగ్రహం (Satellite) అంటారు. మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాబట్టి అది ఒక గ్రాహం. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం. ఇవి సహజ ఉపగ్రహాలు (Natural satellites). కానీ భూమి చుట్టూ పరిభ్రమించేందుకు ప్రయోగించిన యంత్రాలను (Machine) కృత్రిమ ఉపగ్రహాలుగా వ్యవహరిస్తుంటాం. ఇలాంటి కృతిమ ఉపగ్రహాలెన్నో మన భూమి చుట్టూ, ఇతర గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఎన్నో రకాలుగా సేవలందిస్తూ ఈ కృత్రిమ ఉపగ్రహాలు మానవ నాగరికతకు నగిషీలు దిద్దుతున్నాయి. మానవ మేధస్సుకు అద్దం పడుతున్నాయి. కొన్ని ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ వాతావరణానికి సంబంధించిన ఫోటోలు తీస్తూ ముందస్తు హెచ్చరికలు అందిస్తాయి. తుఫాను సమయాల్లో వాటి గమనాన్ని అనుక్షణం గమనిస్తూ, నష్ట నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా సాయపడతాయి. మరికొన్ని ఉపగ్రహాలు ఇతర గ్రహాలు, సూర్యుడు, కృష్ణబిలాలు (Black holes), సుదూర గెలాక్సీల ఫోటోలు తీస్తూ మన విజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతున్నాయి. చాలా ఉపగ్రహాలు కమ్యూనికేషన్లకు ఉపయోగపడుతున్నాయి. మన ఇళ్ళలో కూర్చుని వేర్వేరు టివి ఛానెల్స్ లో ప్రోగ్రామ్లు చూస్తున్నాం. ప్రపంచ నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ కి, కంప్యూటర్లకు ఇంటర్నెట్ అనుసంధానానికి ఎన్నో అవసరాలకి ఉపగ్రహాలే ఆధారం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS) కూడా చాలా మందికి అనుభవమే. మనం ఎక్కడికి వెళ్లినా మనం ఉన్న ప్రాంతాన్ని ఖచ్చితంగా తెలుసుకునేందుకు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణ మార్గాన్ని చూపేందుకు GPS తోడ్పడుతుంది. సుమారు 20 ఉపగ్రహాల వ్యవస్థ GPS కు రూపకల్పన చేస్తుంది. ఏ క్షణంలోనైనా భూమి మీద సువిశాలమైన ప్రదేశాన్ని కొంత ఎత్తు నుంచి నిశితంగా చూస్తూ, భూమి మీద ఉండే ఏ ఇతర పరికరం కన్నా ఎక్కువ వేగంగా సమాచారాన్ని ఉపగ్రహం గ్రహిస్తుంది. టివి సిగ్నల్స్ ను, ఫోన్ కాల్స్ ను పై దిశలో ఉపగ్రహానికి పంపిస్తారు. వెన్వెంటనే ఉపగ్రహం వీటిని గ్రహించి, తిరిగి భూమ్మీద వేర్వేరు ప్రాంతాలకు పంపిస్తుంది. ఉపగ్రహాలు వేర్వేరు సైజుల్లో, వేర్వేరు ఆకృతుల్లో ఉంటాయి. కాని ప్రతి ఉపగ్రహానికి ఒక ఆంటినా (Antenna), ఒక శక్తి జనకం (Power Source) తప్పనిసరిగా ఉంటాయి. ఆంటీనా భూమి నుంచి అందే సిగ్నల్స్ ను అందుకొని వాటిని స్థాయి పెంచి తిరిగి భూమికి పంపిస్తుంది. శక్తి జనకం సాధారణంగా ఒక సోలార్ ప్యానల్ తో చార్జింగ్ పొందే బ్యాటరీ కావచ్చు. సోలార్ ప్యానల్ సూర్యకాంతిని విద్యుచ్ఛక్తిగా మార్చి ఘనస్థితి బ్యాటరీ (solid state battery) లను చార్జింగ్ చేస్తుంది. ఆ శక్తీ ఉపగ్రహంలోని యంత్రాలను నడిపిస్తుంది. రాకెట్ సాయంతో ఉపగ్రహాన్ని దానికి నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ రాకెట్లు ప్రయోగవాహనం (Launch Vehicle) అంటారు. ఇది సాధారణంగా భూమ్మీద ఉండే ఒక ప్రయోగ వేదిక (Launch Pad) నుంచి పైకి లేస్తుంది కొన్ని ఉపగ్రహాలను సముద్రం నుంచి జలాంతర్గామి ద్వారా లేదా సముద్రం మీద కదిలే ప్లాట్ ఫారం నుంచి లేదా ఒక విమానం నుంచి ప్రయోగిస్తారు. ఉపగ్రహాలను చాలా వరకు కంప్యూటర్లతో నియాంత్రిస్తారు ఉపగ్రహంలో ఉండే ఉపవ్యవస్థలు (Sub units) శక్తి ఉత్పత్తి, ఉష్ణనియంత్రణ, టెలిమెట్రీ, ఎత్తు నియంత్రణ కక్ష్య నియంత్రణ వంటి ఎన్నో పనులు చేస్తాయి.

ఉపగ్రహం భూకక్ష్యలో పరిభ్రమించాలంటే దాని వేగం వేగం, భూమి గురుత్వాకర్షణను అధిగమించేలా ఉండాలి అది ఎక్కువయితే ఉపగ్రహం ఒక రేఖీయ మార్గంలో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది తక్కువయితే తిరిగి భూమ్మీద పడిపోతుంది. ఉపగ్రహాలు వేర్వేరు ఎత్తులో వేర్వేరు కక్ష్యల్లో, వేర్వేరు వేగాలతో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. అంతరిక్షంలో అనేక ఉపగ్రహాల తిరుగుతూనే ఉన్నాయి. వీటిని అంతరిక్షంలో అమెరికా వారి నాసాతో బాటు, ఇతర అంతర్జాతీయ సంస్ధల అనుక్షణం గమనిస్తూనే ఉంటాయి. అంతరిక్షంలో ఎన్నో ఉపగ్రహాలు తిరుగుతున్నప్పుడు అవి ఒక దానితో ఒకటి ఢీ కొట్టుకోకుండా ఎలా ఉంటాయి? ఈ సందేహం చాలా మందికి వస్తుంటుంది. కాని ఇలా జరగడం చాలా

అరుదు ఎందుకంటే, ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించేటప్పుడు అది ఇతర ఉపగ్రహాలను తప్పించుకునేలా దాని కక్ష్యను నిర్దేశిస్తారు. కానీ రానురాను అంతరిక్షంలో ఇలాంటి ఉపగ్రహాల సంఖ్య ఎక్కువైపోతూ అవి ఢీకొనే అవకాశాలు ఎకువవుతున్నాయి. ఇలాంటి సంఘటన ఇప్పటికే ఒకసారి జరిగింది. ఫిబ్రవరి 2009లో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్లు ఢీకొన్నాయి. వీటిలో ఒకటి అమెరికాది కాగా మరోది రష్యాది.

ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1ని అక్టోబర్ 1957లో సోవియట్ యూనియన్ ఉపయోగించింది. అదే ఏడాది ప్రయోగించిన స్పుత్నిక్-2 ఎంతో పాటు 'లైకా' పేరున్న ఒక కుక్కను కూడా దూసుకెళ్లింది. ఇక మనదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహ ఆర్యభట్ట. 1975లో వేరే దేశం రాకెట్ తో దీన్ని ప్రయోగించారు. కాగా 1980 జూలై 18న మన సొంత గడ్డపై నుంచి SLV రాకెట్ ద్వారా రోహిణి D, ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మనదేశం ఇప్పటిదాకా ప్రయోగించిన ఉపగ్రహాల్లో ప్రస్తుతం పని చేస్తున్నవి 34. వీటిలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలు 13, భూమి పరిశీలన (Earth Observation) కోసం 12, నావిగేషన్ కోసం 7 పనిచేస్తున్నాయి. మిగతా రెండింటిలో ఒకటి మామ్ (Mars Orbitor Mission) లేదా మంగల్యాన్, రెండోది ఆస్టోశాట్ 2013 అక్టోబర్ నాటికి భూమి చుట్టూ వివిధ కక్ష్యల్లో తిరుగుతున్న ఉపగ్రహాలు 1071. వీటిలో సగం అమెరికావి. ఈ మొత్తం 1071 ఉపగ్రహాల్లో సగం భూమి నుంచి తక్కువ ఎత్తు కక్ష్యల్లో (Low Earth Orbits) తిరిగేవే. 20 శాతం మధ్యస్థ (Intermediate) కక్ష్యల్లో, సుమారు 20 వేల కి.మీ. ఎత్తులో తిరిగే గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్లు. మిగతావి 36 వేల కి. మీ. తిరిగే జియో స్టేషనరీ శాటిలైట్లు. ఇవే కాకుండా భూమి చుట్టూ తిరిగే చెత్త (Junk) కూడా ఎక్కువే. చిన్న, పెద్ద శకలాల వంటివి దాదాపు 10 కోట్ల దాకా ఈ చెత్తలో ఉన్నాయి. వీటిలో పాత శాటిలైట్లు వదిలేసిన పరికరాలు, రాకెట్ల ముక్కలు, చెక్కలు ఎన్నో ఉన్నాయి. వీటిని వదిలించుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారం. శాస్త్రజ్ఞులు చెప్పేదేమంటే మున్ముందు అంతరిక్ష ప్రయోగాలకు ఈ వ్యర్థాలు చాలా ఇబ్బందికరంగా మారవచ్చునని, ఈ వ్యర్థాలను తొలగించేందుకు ఇటీవల జపాన్ కు చెందిన ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఒక టెదర్ (Tether) ప్రయోగించింది. కాని ఈ టెదర్ దానిని మోసుకొళ్ళిన కార్గోషిప్ నుంచి విడుదల కాకపోవడం వల్ల ఈ ప్రయోగం విఫలమైంది.

ఈ ఉపగ్రహాలు ఎన్నో రకాలు. అవి తిరిగే కక్ష్యల ఆధారంగాను, వాటి ప్రయోజనాల ఆధారంగా ఉపగ్రహాలను వర్గీకరిస్తారు.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం

3.00809716599
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు