অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్రాంతి - సంక్రాంతి

క్రాంతి - సంక్రాంతి

కొద్ది నిమిషాల్లో తన మాతృ భూమిపై కాలు మోపబోతున్న భారతికి వళ్ళు పులకరించి నట్లనిపిస్తోంది. ఎప్పుడో తను నాలుగేళ్ళు పాపగా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళింది. తండ్రి మోహనరావుకు అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఏడేళ్ళ తరువాత తిరిగి ఇండియాకి వచ్చి నానమ్మ వాళ్లను చూడబోతోంది భారతి.

భారతి నానమ్మ వాళ్ళది పల్లెటూరు.A.jpg సంక్రాంతి పండుగ ఇక రెండు రోజులే ఉంది. సంక్రాంతి పండుగకు పిల్లలతో రావాలని తల్లిదండ్రులు కోరడంతో మోహనరావుకు ప్రయాణం తప్పలేదు. భారతి తల్లిదండ్రులతో, తమ్ముడు కిశోర్ తో ఉదయం 5.00 గంటలకే పల్లె ముంగిట్లో వాలింది. ముంగిళ్ళలోని రంగవల్లులు భారతికి స్వాగతం పలికాయి. పొగమంచు తెరలలో పల్లె మేలిముసుగులోని పెళ్ళి కూతురిలా ఉంది.

ఇంటికి చేరగానే నానమ్మ తాతయ్య, కిరణ్ బాబాయి, పిన్ని వాళ్ళ పిల్లలు వినోద్, వినీత, భారతిని చుట్టేశారు. అమెరికా విశేషాలన్నీ అడిగి చెప్పించుకున్నారు. భారతి ఒక్కపూటలోనే ఆ వీధి మొత్తం చుట్టేసింది. ఇంట్లో వారితో బాటు, ఆ వీధిలోని కుటుంబాలతో మాటా మాటా కలిపేసింది.

కిరణ్ బాబాయి పక్క ఊళ్లోనే స్కూల్ టీచర్ గా పనిచేస్తాడని విని భారతి ఆ స్కూల్ వివరాలు గురించి తెలుసుకుంది. పిల్లలకు బాగా చదువు చెప్పడానికి బాబాయి తయారు చేసిన, చార్టులు, పరికరాలు పరిశీలించింది. తన తీరిక సమయంలో బాబాయి జన విజ్ఞాన వేదికలో పని చేస్తాడని తెలుసుకొని వాళ్ళ కార్యక్రమాల వివరాలు తెలుసుకుంది.

బోగి పండుగ రానే వచ్చింది.B.jpg భోగి మంటల కోసం కావాల్సిన ఎండుటాకులు ఇంట్లోని పనికిరాని వస్తువులు పోగేవాడు కిరణ్. భారతి బాబాయ్ వద్దకు చేరింది. ఈ బోగి మంటలు ఎందుకు వేస్తారు బాబాయ్ అంది. చలికాలం కదమ్మా, మూడు రోజుల సంక్రాంతి పండుగను ఇలా వెచ్చని భోగిమంటలతో ప్రారంభిస్తారు. వామనుడికి మూడడుగులు నేలను దానం చేసి, పాతానికి తొక్కబడ్డ బలి చక్రవర్తి, బోగి పండుగ రోజు భూలోకానికి వస్తాడనీ, ఆయనకు భోగి మంటలతో స్వాగతం పలకాలని కొంత మంది నమ్ముతారు. ఏదేమైనా చలికాలం భోగిమంటల వద్ద చలికాచుకోవడం చాలా సరదాగా ఉంటుంది కదూ, అన్నాడు కిరణ్. బాబాయ్ ఇలా ప్రతి ఇంటి ముందూ భోగిమంట వేయడం కంటే వీధిలోని వాళ్ళందరూ కలిసి ఒకే చోట భోగి మంట వేయడం చాలా బాగుంటుంది. కదా అంది భారతి.

పూర్వం ఇలాగే పండుగలు జరుపుకునేవారు. క్రమేణా ఇవి ఇంటి వరకే పరిమితమయ్యాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్ , కేరళ లాంటి చోట్ల భోగిమంటలు సామూహికంగానే వేస్తారు అన్నాడు కిరణ్. భారతి ఒక్క గంతులో ఆ వీధిలో వారందర్నీ కలిసి, సామూహిక భోగిమంటలకు ఒప్పించింది. అందరి ఇళ్ళలో తయారైన పిండి వంటలు కలిపేసి, పంచుకొని తిన్నారు.

సంక్రాంతి రోజు హరిదాసులు, గంగిరెద్దులు, గొబ్బిపాటలు, బుడబుక్కలవారి ఢమరుకాలు, గిరిజనుల డప్పుల, నృత్యాలతో ఎటు చూసినా కోలా హలంగా ఉంది. భారతి వాళ్ళ నానమ్మ మాత్రం అందరికీ దోసిళ్ళతో ధాన్యం పోసి పంపుతోంది. కనీసం వంటిపై చొక్కా కూడా లేని, పిల్లలు గిన్నెలతో అడుక్కుంటూ వచ్చారు. భారతి మనస్సు చివుక్కుమంది. తన వంటి మీద పట్టు పరికిణీ వైపు చూసుకొంది. బాబాయ్ ఈ పిల్లలకెందుకు బట్టలేవు బాబాయ్. పండుగ రోజు మనలాగే వీళ్ళు కూడా పండుగ చేసుకోకుండా అడుక్కొంటూ మనింటికి రావడమేమిటి ? నానమ్మ వీళ్ళందరికీ దానాలు చెయ్యడమేమిటి ? అసలు కొందరు దానాలు చేసేవాళ్ళుగా మరికొందరు అడుక్కుతినే వాళ్ళుగా ఎందుకుండాలి ? దేవుడు చాలా మంచి వాడు కదా అందర్నీ సమానంగా చూడకుండా ఈ తేడా లెందుకు ? అంది.

C.jpgబారతి లేతమనస్సులోని ఈ ఆలోచనలకు కిరణ్ చలించి పోయాడు. చూడమ్మా భారతీ రైతులు సంవత్సరమంతా శ్రమించి పంట చేతికొచ్చిందన్న సంబరంతో జరుపుకొనే పండుగే ఈ సంక్రాంతి తమకు సహాయపడ్డ శ్రామికులకు, ఇతర వృత్తుల వారికి, యాచకులకు దాన ధర్మాలు చేయడం మన సాంప్రదాయం.

ప్రజల్లో అసమానతలు తొలగి అందరూ సమానంగా, సగౌరవంగా జీవించాలంటే ప్రకృతి ప్రసాదించిన వనరులపైన సంపదలపైన అందరికీ సమాన వాటా ఉండాలి. అలాంటి సమాజం ఏర్పడితేనే నిజమైన సంక్రాంతి అన్నాడు కిరణ్. భారతి మనస్సులో చిగురించిన ఆలోచనల నుండి తేరుకోక ముందే పిల్లలు గాలి పటాలు ఎగురవేద్దాంరా అక్కా అంటూ భారతిని లాక్కువెళ్ళారు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate