పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గురజాడ - అడుగుజాడ

కవి గురజాడ గారి గురించి తెలుసుకుందాం.

gurajadaఅది 1910 సం. ఏప్రిల్ 20 వ తేది. జనమంతా గుండెలను చేత పట్టుకొని బిక్కుబిక్కు మంటున్న రోజు. జ్యోతిష్యులు, సిద్ధాంతులు, పండితులు రోజుల తరబడి ఊదరగొట్టి ఈ రోజు ఏ నాయకుడికో కాలం చెల్లుతుందనీ, అసలు భూమికి ఏ అరిష్టం చుట్టుకోనుందో అని, ఇల్లు విడిచి రావద్దనీ సవాలక్ష పుకార్లు షికార్లు చెయ్యటంతో లోకం బిక్కచచ్చినరోజు.

ఇదంతా దేనివల్ల అంటారా ? ఆ రోజు “హేలీ తోకచుక్క” సూర్యుడి సమీప బిందువు (పెరిహీలియన్) దాటి భూమికి దగ్గరైంది. తోకచుక్క, భూమికి సూర్యుడికి ఒకే దిక్కులో వుండి భూమి మీది వారికి కన్పించబోతుంది. ఈ తోకచుక్క భూమికి ఎంత దగ్గరవుతుందంటే తోక చుక్క తోకలోంచి భూమి దూసుకుపోతోంది.

అలా అయితే ఇంకేమైనా వుందా ? తోకచుక్క లోని “సైనైడ్” వంటి విష పదార్థాల వల్ల భూమి వాతావరణమంతా కలుషితమై సర్వనాశనం జరుగుతుందని శాస్త్రవేత్తలు సైతం చెబితే అందరూ తలుపులు బిడాయించుకొని కూర్చున్నారు.

అప్పుడో కవి

“దూర బంధువు ఇతడు భూమికి

దారిబోవుచు చూడవచ్చెను !

డెబ్బదెనుబది యేండ్ల కొకతరి

నరుల కన్నులపండువై”

అంటూ అందర్నీ తోసిపుచ్చి తోకచుక్కకు స్వాగతం చెప్పాడు. “వెర్రి పురాణ గాధలు నన్నచెల్లునే” అని ధిక్కరించి “సంఘ సంస్కరణ పతాక” అంటూ హేలీ తోకచుక్కకు ఓ బిరుదు కూడా ఇచ్చాడు.

కవులంటే ఊహల్లో తేలియాడాలి. సూర్యుడు ఏడుగుర్రాల మీద ఎక్కి వస్తున్నాడనాలి. భూమి బల్ల పరిపుగా వుందనాలి. హిరణ్యాక్షుడు దాన్ని చాపలా చుట్టాడనాలి. నక్షత్రాల్ని చంద్రుడి ప్రియురాళ్ళని కనవిత్వం రాయాలి. రాహువు, కేతువూ చందమామను అమాంతం మింగేస్తారని పురాణాలు చెప్పాలి.

మరి ఈ కవి సైన్స్ చెబుతాడేంటి ? ఆ సైన్స్ చెప్పడం కోసం అర్థం గాని పద్యాల్ని అవతల పారవేసి ముత్యాల సరాల్లాంటి గేయాల్ని పాడతాడేమిమి ఇలాంటి కవులు కూడా వుంటారా ? అసలు వీళ్ళని కవులనవచ్చా?

ఇలా ఎవరేమైనా అనుకోనీండి, ఇలా సైన్స్ ను చేప్పినాయన కవి అయ్యాడు. మధురకవి అయ్యాడు. తెలుగు వాళ్ళు మరచి పోలేని మహాకవి అయ్యాడు. ఆయనే మన గురజాడ అప్పారావు.

రుజువుకు నిలబడని దాన్ని నమ్మనందువల్లే ఇంగ్లీషు వాల్లు ఇంత వాళ్లయ్యారని మనసారా నమ్మి, మనం భారతీయులం ఈ దృష్టిని అలవరుచు కోవాలని, అప్పటిదాకా మనకు మంచికాలం రాదని, బంతికింతకాలం చెవిలో ఇల్లు కట్టుకోమని చెప్పాడాయన.

గురజాడ గాలిలో మేడలు కట్టడు. ఆకాశంలో షికార్లు కొట్టడు. ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తాడు. చూసిందాన్ని చూసినట్లు చెపుతాడు.

అసలు దేశమంటే ఏంది ? అని ప్రశ్నవేసి దేశమంటే మట్టి కాదోయ్ ! “దేశమంటే మనుషులోయ్ ! అని ఏ మాత్రం తడబడకుండా చెపుతాడు.

ఈ మనుషులు  మనుషులుగా వుడాలంటే ఏంకావాలి ? ఏముందీ.

“తిండి కలిగితే కండకలదోయ్

కండగల వాడేను మనిషోయ్”

అని ఒక జీవశాస్త్రవేత్త చెప్పినట్టు చెపుతాడు. దేశం దరిద్రంలో మగ్గిపోతుంటే, జనం కూటికి కూడా నోచుకోకుంటే ఎన్ని స్వాతంత్య్రాలు వచ్చి ఏ లాభం ?

అందుకే ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ ఈ సంగతి మరచిపోయి కులం, మతం పేర కొట్టాడుకోవడం గురజాడకు ఏమీ నచ్చదు.

“అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్” అని నీతిచెప్పి

“మతములన్నియు మాయిపోవును

జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును”

అని భవిష్యత్ ప్రపంచం విజ్ఞానానిదే అని ఢంకా బజాయిస్తాడు.

గురజాడకు చివరి రోజులు వచ్చి ప్రాణం పావడానికి క్షణాల ముందర “బతికి వుంటే నేను ఆహార శాస్త్రం మీద ఒక పుస్తకం రాస్తా” అని డాక్టరుతో అన్నాడంటే సైన్స్ మీద ఆయనకెంత మమకారమో వేరే ఇంకేం చెప్పాలి.

శాస్త్ర జ్ఞానం అభివృద్ధి మీద ఇంత చింత వుండబట్టే ఆయన్ని మనం “చెకుముకి” లో స్మరించుకొంటున్నాం. సెప్టెంబరు 21న ఆయన పుట్టిన రోజున గురజాడ అడుగుజాడలో నడవాలని మళ్ళీ మననం చేసుకొందాం.

ముఖచిత్రం :  బి. కిరణ్ కుమారి, తిరుపతి.

2.98404255319
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు