పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గోరింటాకు... మెహందీ... హెన్నా... హన్నా

గోరింటాకు గురంచి తెలుసుకుందామా..

mehandi1గోరింట పూచింది కొమ్మా లేకుండా... అని సినిమా పాట. భారతీయ సాంప్రదాయాలలో, అన్ని శుభ సందర్భాలలో ఆడవారందరూ అరచేతులకు రకరకాల ముగ్గులు, బొమ్మలు, తీగలు, అల్లికలు అనేక డిజైన్ లు గీసుకుంటారు దీనితో. అదే గోరింటాకు.. లేదా మెహందీ లేదా హెన్నా.. హన్నా!!! అని ఆశ్చర్యపోయే రకంగా ఈ గోరింటాకును పెట్టుకుంటారు మహిళలు. గోర్లకు పెట్టుకునే ఆకు కనుక గోరింటాకు అయింది. మరి ఈ గోరింటాకు గురంచి తెలుసుకుందామా..

మెహందీ, హెన్నా... గోరింటాకు ఆకును నున్నగా నూరి ముద్ద చేసి ఆడవారు, మగవారు అలంకరణ కోసం వాడేటువంటి పదార్ధము ఈ గోరింటాకు. సంస్కృతంలో ‘మెహెందీకా’ (Paste) నుండి ‘మెహెందీ’ అన్న పదం పుట్టింది. పసుపు, గోరింటాకుల వినియెాగం వేదాలలోను, ధార్మిక గ్రంథాలలోను వివరించబడింది. హల్దీ (పసుపు), మెహెందీ (గోరింటాకు) సూర్యుని యెుక్క వెలుపలి (బాహ్య), లోపలి (అంతః) భాగాలకు ప్రతీకలుగా పేర్కొన్నారు. బారత, శ్రీలంకా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల మహిళలు పెళ్ళికి, పండుగలకు, సాంప్రదాయ ఉత్సవాలలో గోరింటాకు విరివిగా వాడుతారు. 5 వేల సంవత్సరాలకు ముందే అరబ్బులు గోరింటాకును అదృష్టానికి చిహ్నంగా భావించేవారు. ఈజిప్ట్ సమాధులలోని మమ్మీలకు గోర్లు, వెంట్రుకలలో ఎరుపు గోధుమ రంగు మరకలు గోరింటాకేనని నిరూపించబడినది. రోరింటాకు ఈజిప్టులో పుట్టి భారతదేశానికి ప్రాకింది. క్రీ.పూ.700లలో భరతదేశంలో హెన్నా వాడిన రుజువులు వున్నాయి.

గోరింటాకు చెట్టు శాస్త్రీయ నామము లాసోనియా ఇనేర్మిస్ (Lawsonia inermis). ఈ చెట్లు పొడి, వేడి వాతానరణంలో పెరుగుతాయి. ఇవి 6 నుండి 25 ఇడుగుల ఎత్తుకు పెరుగుతాయి. ఆకులు 2 నుండు 3 సెం.మీ. వుంటాయి. ఈ గోరింటాకు ఆకులుో లాసోన్ (Lansone) అనే పిగ్మెంట్ (రంగు కలిగించే పదార్ధం) వుంటుందీ. ఆకు విరిగినప్పుడు మాత్రమే ఈ పదార్ధం బయటకు వస్తుంది. ఆకును నలపకపోతే ఇది బయటకురాదు. అందుకే గోరింటాకును బాగా నూరాలి. గోరింటాకును నూరి పూసుకున్నప్పుడు మెల్లగా ఈ ‘లాసోన్’ గోరింటాకు నుండి చేతి వెలుపల పొరను చేరుతుంది. అక్కడి ప్రోటీన్ లలో చేరి రంగు ముద్ర ఏర్పడుతుంది. చేతి చర్మంపై మృతకణాలు వుంటాయి. వీటిగుండా ‘లాసోన్’ రంగు బాగా చొచిచుకుని పోయి నిల్వ వుంటుంది. ఈ మృతకణాల పొర క్రింది నశించడానికి సిద్ధంగా వున్న కణాలు వుంటాయి. లాసోన్ రంగు వీటిని కూడా చేరి రంగు ముద్రను ఏర్పరుస్తుంది. రోజు స్నానం చేయడం వల్ల ఈ మృతకణాలు రాలిపోతూ వుంటాయి. వాటితోపాటు గోరింటాకు రంగు కూడా వెలిసి పోతూ వుంటుంది. కొన్ని రోజులకు గోరింటాకు మచ్చలు పూర్తిగా పోతాయి. కాబట్టీ గోరింటాకు డిజైన్లు శాశ్వతం కావు. తాత్కాలికం మాత్రమే. ఇలా గోరింటాకు చేతిపై రంగును కలిలిస్తోంది.

mehandi2గోరింటాకు లేక మెహెందీ డిజైన్ లలో అరబిక్ డిజైన్, ఇండియన్ డిజైన్, పాకిస్తానీ డిజైన్ అని 3 రకాల డిజైన్ లు వున్నాయి. చరిత్ర ప్రకారం పూర్వకాలంలో హెన్నాను మందులలో, బట్టలకు రంగు అద్దకంలో, చర్మపు వస్తువులపై రంగులు, తలవెంట్రుకలకు, గుర్రాల జూలుకు, ఇతర జంతువుల వున్నిపై రంగులు అద్దడం కోసం వాడేవారు. ముఖ్యంగా భారత్, అరబ్బు దేశాలలో చర్మంపై ఈ తాత్కాలిక రంగుల అలంకరణ కోసం హెన్నాను వాడేవారు. భారతీయ సినిమాల వల్ల పాశ్చాత్య దేశాలలో కూడా హెన్నా సంస్కృతి పాకింది. 1990ల తరువాత పాశ్చాత్య దేశాలలో హెన్నా ఓ ఫ్యాషన్ గా మారింది. ఆడవారు అరచేతులకు, మెాచేతివరకు, పాదాలపై, కొంతమంది వీపున ఈ గోరింటాకు డిజైన్లు వేసుకుంటారు. ఆయా భాగాలలో చర్మం మృదువుగా వుండి, రంగు తక్కువగా (Pigment) వుంటుంది కనుక గోరింటాకు బాగా ఎర్రగా ముద్ర పడుతుంది. దీన్నే గోరింటాకు బాగా పండిందని, గోరింట పూచింది అని అంటారు.

ఆధునిక కాలంలో గోరింటాకు చెట్ల నుండి తెచ్చి నూరి తయారు చేసేవారు విరివిగా లేరు కాబట్టి గోరింటాకు పొట్లాలు (కోన్) ల రూపంలో లభిస్తోంది. ఈ కోన్ ల సహాయంతో సన్నటి గీతలాగ గోరింటాకును పెట్టుకోవచ్చు. రకరకాల డిజైన్లు ఈ కోన్ల సహాయంతో సులభంగా గీసుకోవచ్చు. గోరింటాకును మిషన్లలో రుబ్బి ఇతర పదార్ధాలు కలిపి ఈ కోన్లలో నిల్వ ఉంచుతారు. నిల్వ వుంచేందుకు కలిపే రసాయనాల వల్ల కొంతమందికి ఈ కోన్ (ప్లాస్టిక్ కోన్, పేపర్ కోన్ లు వుంటాయి) అలర్జీ రియాక్షన్ అవుతుంది జాగ్రత్త. పెద్ద పెద్ద నగరాలలో బ్యూటీ ఫార్లర్ లలో బ్యూటీషియన్లు ఈ గోరింటాకు వేయడానికి తయారుగా వుంటారు. పెళ్ళిళ్ళలో ఇంటిల్లిపాదీ గోరింటాకు పెట్టుకోవడానికి ఒకటి రెండు రోజులపాటు ఈ హెన్నా బ్యూటీషియన్లను పిలిపించుకుంటారు. వీరికి చెల్లింపు వేలల్లో ఉంటుంది.

పచ్చబొచ్చును “టాటూ” అంటారు కదా. అది శాశ్వతమైన మచ్చ ఏర్పకుస్తుంది కదా. హెన్నా మచ్చ (లేదా డిజైన్) తాత్కాలికం. కనుక హెన్నా మచ్చలను “హెన్నా టాటూ” అంటారు. పచ్చబొట్టు వేసుకోవడానికి, ఆ సూదులు గుచ్చడం భయపడేవారికి ‘హెన్నా టాటూ’ ఓ వరం. కానీ నల్ల ‘హెన్నా టాటూ’ (Black Henna) లో నల్లరంగు కోలం పెరా ఫినైలనెడియామైన్ (PPD) అనే డై రంగును హెన్నాలో కలుపుతారు. ఈ PPD చర్మానికి అలెర్జీ కలుగజేస్తుంది. తల రంగుకు వాడే బ్లాక్ హెన్నాలో కూడా ఈ పిపిడి కలిగిన ఇండిగో పౌడర్ (ఇండిగో ఫిరా టింక్టీరిటా) ను కలుపుతారు. దీని వల్ల తీవ్ర అలర్జీ, శాశ్వతమైన మరకలు చర్మంపై ఏర్పడుతుంది. కనుక బ్లాక్ హెన్నా వాడడం మంచిది కాదు.

కాబట్టి సాధ్యమైనంత వరకు సహజ గోరింటాకు వాడడం మంచిది.  లేనిచో ‘కోన్’ లు కొనేటప్పుడు మరీ పాత స్టాకు కొనకుండా మంచి కోన్లను కొనడం మంచిది. మెుదట కొంత చర్మంపై పూసుకొని పరీక్షించుకొని హెన్నా కోన్ లను వాడడం మంచిది. అందమైన డిజైన్లు ఎప్పుడూ ఆనందమే. కానీ వాటి వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదు.

ఆధారం: యుగంధర్ బాబు

3.00864553314
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు