పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్యాస్ పైప్ లైన్ లీక్

గ్యాస్ పైప్ లైన్ లీక్ కావటం గురించి తెలుసుకుందాం.

july11ఆ రోజు జూన్ 27వ తేదీ, శుక్రవారం. తెలతెలవారే సమయం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ లీకై గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతంలో దట్టంగా వ్యాపించింది. ఆ ప్రాంతంలోని ఇళ్ళలో చాలా మంది ఇంకా నిద్రపోతున్నారు. కాని అప్పుడే నిద్రలేచిన ఒక హోటల్ లోని వ్యక్తికి తెలియదు పాపం తనచుట్టూ గ్యాస్ రూపంలో మృత్యువు కమ్ముకుని ఉందని. టీ కాచుకుందామని స్టౌ వెలిగించాడు. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ చుట్టుపక్కల 400 మీటర్ల పరిధిలో అగ్నికీలలు వ్యాపించి 15 మంది సజీవదహనమైపోయారు. 30 మందికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. 50 ఎకరాల పరిధిలో సుమారు 2 వేలకు పైగా కొబ్బరిచెట్లు మాడి మసైపోయాయి. తీవ్రమైన గాయాలతో చికిత్సపొందుతూ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇంతటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం, భీభత్సం సృష్టించిన ఈ ఘోర దుర్ఘటన ఎందుకు సంభవించింది? తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణమా? లేదా అధికారుల నిర్లక్ష్యం కారణమా?

సహజవాయువు, పెట్రోలియం, నేలబొగ్గు వంటి ప్రకృతి వనరులు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. కాని వీటిని వెలికి తీసేటప్పుడు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే సహజవాయువు (నేచురల్ గ్యాస్) ను గృహాలకు లేదా పరిశ్రమలకు పైప్ లైన్ ద్వారా సరఫరా చేసేటప్పుడు అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ లీకేజీ పసిగట్టడంలోను, అటువంటి సందర్భంలో ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలోను ప్రజలకు అవగాహన కలిగించాలి. ఇందుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం, సదస్సులు నిర్వహించడం లాంటివి చేయాల్సిన అవసరముంది. ఎక్కడో లోపం జరిగింది. అందుకే ఈ దుర్ఘటన జరిగింది.

సహజవాయువు అంటే ఏమిటి?

సహజవాయువు ప్రధానంగా కొన్ని హైడ్రోకార్బన్ల మిశ్రమం. దీని రసాయన సంఘటనం అన్ని చోట్లా ఒకేలా ఉండదు. కాని సాధారణంగా దీనిలో మిథేన్ 85-95 శాతం దాకా ఉండవచ్చు. ఈథేన్

2.5-8.0%, ప్రొపేన్ 0.6% బ్యుటేన్ 0.06%, పెంటీన్లు 0.02% ఉంటాయి. వీటితోపాటు నైట్రోజన్ 1.6%, కార్బన్ డై ఆక్సైడ్ 0.09%, స్వల్పంగా హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S), నీటి ఆవిరి కూడా ఉంటాయి.

సహజవాయువుకు స్వతహాగా రంగు, వాసన లేవు. గాలి కన్నా తేలికైంది. తేలిగ్గా అంటుకుని మండుతుంది. ఈ గ్యాస్ అధిక పీడనంలో ఉన్నప్పుడు నిప్పంటుకుంటే భారీ విస్ఫోటనం సంభవిస్తుంది. ప్రమాణ ఉష్ణోగ్రతా పీడన పరిస్థితుల్లో 4 పిపిఎమ్ (ppm -parts per million) కంటే ఎక్కువగా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉన్న గ్యాస్ ను సవర్ గ్యాస్ (sour gas) అంటారు. H2S చాలా స్వల్ప మొత్తాల్లో ఉంటే దానిని స్వీట్ గ్యాస్ (Sweet gas) అంటారు.

పైప్ లైన్ లో లీక్ సంభవించినప్పుడు క్షణాల్లో చుటు వక్కల ప్రదేశంలో వ్యాపించి గాలిలో కలిసి పోతుంది. వాయువులన్నింటికి 'వ్యాపనం' (diffusion) అనే లక్షణం ఉంటుంది. ఈ లక్షణం వల్లే ఏదైనా పాత్రలో వున్న వాయువు ఆ పాత్రమూతను తీస్తే చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది. బరువైన వాయువుల కన్నా తేలికైన వాయువులు వేగంగా వ్యాపిస్తాయి. సహజవాయువుకు రంగు లేదు కాబట్టి, గ్యాస్ లీకైనా కనిపించదు. అలాంటప్పుడు గ్యాస్ లీకవుతోందని ఎలా పసికట్టగలం?

ఇందుకు మూడు మార్గాలున్నాయి. వాసన (smell), శబ్దం (hear), చూపు (look).

సహజవాయువుకు వాసనలేదు కాబట్టి దానికి కుళ్ళిన కోడిగ్రుడ్డు వాసన కలిగిన మెరాస్టాన్ వంటి సల్ఫర్ సమ్మేళనాన్ని కలుపుతారు. గ్యాస్ లీకైతే పరిసర ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని తేలికగా గుర్తుపట్టవచ్చు. మన వంటింట్లో గ్యాస్ స్టవ్ కు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ లీకవుతుంటే ఇలాంటి వాసన గమనిస్తాం. నిజానికి, వాసన కలిగించే ఈ సమ్మేళనం గాఢత చుట్టుపక్కల గాలిలో ఎంత ఉందో తెలియజేసే ఎక్కువ సున్నితత్వం వున్న పరికరాలు ఈ రోజుల్లో గ్యాస్ సంస్థలకు అందుబాటులో ఉన్నాయి. ఈ వాసనలో ఎక్కువ సేపు కొనసాగితే, ఆ వాసన తెలియదు. రొంప, ఎలర్జీ వంటి సమస్యలున్నా, పొగాకు, ఆల్కహాల్, మత్తు మందులు వాడుతున్నా ఈ వాసన పసిగట్టే శక్తి తగ్గుతుంది.

అలాంటప్పుడు ధ్వని, చూపు కూడా ఉపయోగించాలి. గెయిల్ సంస్థ పైప్ లైన్ గ్యాస్ కు మెర్కాప్టాన్ కలిపారా లేదా అనేది సందేహాస్పదమే. ఎక్కువ పీడనంతో గ్యాస్ లీకవుతుంటే, ‘హిస్’ మంటూ లేదా గర్జిస్తున్నట్లు శబ్దం వెలువడుతుంది. వినికిడి ద్వారా ఈ శబ్దాన్ని బట్టి గ్యాస్ లీక్ ను పసిగట్టవచ్చు.

గ్యాస్ లీకవుతుంటే, దానికి రంగు వుండదు కాబట్టి అది కంటికి కనిపించదు. కాని కంటికి కనిపించే ఇతర తార్కాణాలను బట్టి కూడా గ్యాస్ లీక్ ను పసిగట్టవచ్చు. దుమ్ము పైకి లేవడం, సమీపంలోని నీటికుంటలు లేదా చెరువుల్లో బుడగలు వేగంగా ఏర్పడుతుండడంను గమనించి, గ్యాస్ లీకవుతుందని పసిగట్టవచ్చు.

గ్యాస్ లీకను పసిగట్టినప్పుడు ఏం చేయాలి?

పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకవుతోందని పసిగట్టినప్పుడు వెంటనే ఆ ప్రదేశం నుంచి బయటికి పారిపోవాలి. ఒక్క నిప్పురవ్వ భారీ విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి నిప్పురవ్వలను సృష్టించే ఏ పని చేయకూడదు. స్టౌ వెలిగించడం, సిగరెట్ కాల్చడం, సెల్ ఫోన్ లేదా టెలిఫోన్ ఉపయోగించడం, స్విచ్ వేయడం లేదా ఆర్పడం, మోటారు వాహనాన్ని స్టార్ట్ చేయడం చేయకూడదు. తెలియక చేసిన ఇలాంటిపనే నగరం గ్రామంలో ఘోర అగ్నిప్రమాదానికి దారి తీసింది.

గ్యాస్ లీకవుతున్న ప్రాంతం నుంచి దూరంగా సురక్షిత ప్రాంతంలోకి పోయిన తర్వాత సంబంధిత అధికారులకు ఫోన్ చేయాలి.

గ్యాస్ లీక్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలుగుతుంది?

పెద్ద ఎత్తున గ్యాస్ లీకైతే, చుట్టుపక్కల ప్రదేశంలోని గాలిలో గ్యాస్ అధిక గాఢతలో ఉంటుంది. ఈ గ్యాస్ అసంపూర్ణంగా దహనం చెందినప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఇది విషవాయువు. ఈ వాయువును పీలిస్తే, అది రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ను ఏర్పరుస్తుంది. దీనివల్ల రక్తం ఆక్సిజన్ ను మోసుకుపోయే లక్షణాన్ని కోల్పోతుంది. తలనొప్పి, తల తిరగడం, వికారం, ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈ వాయువు గాలిలో కలిసి, పర్యావరణం కలుషితమౌతుంది. సహజవాయువు పూర్తిగా మండినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ అని అందరికీ తెలిసిందే.

ఇంతేకాకుండా, సహజవాయువు ఎక్కువ గాఢతతో గాలిలో ఉన్నప్పుడు, కొన్ని అనుకూల పరిస్థితుల్లో అంటే ఎక్కువ సూర్యరశ్మి, ఆక్సీకరణ ప్రీ రాడికల్స్ ఏర్పడడం వంటి పరిస్థితుల్లో ‘ఫోటో కెమికల్ స్మాగ్' అనే సమస్య కూడా ఏర్పడుతుంది. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ (PAN) వంటి కాలుష్యాలు ఏర్పడి గాలిలో గోధుమరంగు పొగలు కమ్ముకుంటాయి. కళ్ళు, ఊపిరితిత్తుల్లో మంట మొదలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులే గతంలో లాస్ ఏంజిల్స్, డెన్వర్ వంటి చోట్ల ఏర్పడ్డాయి.

కొంత పరిమితమైన ప్రాంతంలో సహజవాయువు కమ్ముకున్నప్పుడు, అప్పుడు అది గాలిలోని ఆక్సిజన్ ను తొలగించడం వల్ల ఊపిరాడకపోవడం కూడా జరుగుతుంది.

గ్యాస్ పైప్ లైన్ లీకైతే ఎంతటి ఘోర ప్రమాదానికి దారి తీస్తుందో నగరం సంఘటన తెలియజేస్తుంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరుగకుండా గెయిల్ వంటి సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి. పైప్ లైన్ పై నిరంతర నిఘా ఉంచుతూ, ఏమాత్రం గ్యాస్ లీక్ ను గుర్తించినా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరమత్తులు చేపట్టాలి. పైప్ లైన్ లో 'క్షయం' (corrosion) లేదా ఇతర లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని సరిచేయాలి. జనావాసాల మధ్యన పైప్ లైన్ ఉంటే మరింత భద్రత అవసరం. పైప్ లైన్ పరిసరాల్లో తవ్వకాలు జరపాల్సి వస్తే ముందుగానే సంబంధిత అధికారులకు తెలియజేసి వారి పర్యవేక్షణలోనే తవ్వకం చేపట్టాలి.

గతంలో కోనసీమలోనే ఎన్నో ప్రమాదాలు:

కెజి బేసిన్ లో ఆయిల్, గ్యాస్ వెలికితీత పనులు చేపట్టిన తర్వాత ప్రమాదాలు జరుగడం ఇది మొదటిసారి కాదు. 1995లో బోడసకుర్రు గ్రామంలో 'బ్లో అవుట్' సంభవించిన 2 నెలల దాకా మంటలు అదుపులోకి రాలేదు. భూకంపాలు వంటి ఉపద్రవాలు సంభవిస్తాయేమోనని ఎన్నో భయాలు, పుకార్లు వ్యాపించి కోనసీమ తల్లడిల్లి పోయింది.

ఆ తర్వాత తాండవపల్లి, ఈదరాడ వంటి చోట్ల కూడా బ్లోఅవుట్ లు సంభవించాయి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పటికైనా ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయిల్, గ్యాస్ కంపెనీలు కళ్ళు తెరవాలి. భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలి.

ఇతర దేశాల్లో:

ఒక్క అమెరికాలోనే గ్యాస్ పైప్ లైన్ ద్వారా 71 మిలియన్ గృహాలు, వాణిజ్య సంస్థలకు సహజవాయువు సరఫరా జరుగుతొంది. అత్యున్నత ప్రమాణాలు పాటించడం వల్ల సురక్షితంగా వ్యవస్థ పనిచేస్తోంది. ప్రమాణాలు నివారించి, భద్రత కల్పించేందుకు వీలుగా పైప్ లైన్ ల నిర్వహణకు ఏటా అట్మాస్ ఎనర్జీ వంటి సంస్థలన్నీ కలిసి 7 బిలియన్ డాలర్లను ఖర్చుపెడుతున్నాయి. పైప్ లైన్ మార్గంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, కర్రపత్రాలు, సదస్సుల ద్వారా అవగాహన కలిగించడం చేస్తున్నాయి.

మనదేశంలో ఈ రకమైన అంతర్జాతీయ ప్రమాణాలతో భద్రతా చర్యలు తక్షణం తీసుకోవాలి. లేదంటే కోనసీమ వ్యాప్తంగా భూమిలో ఉన్న ఈ గ్యాస్ పైప్ లైన్ లు పేలడానికి సిద్ధంగా ఉన్న మందుపాతరలు అవుతాయి. మరో భోపాల్ సంఘటన లాంటి పెనుప్రమాదం జరక్కముందే మేల్కోవాలి. తస్మాత్ జాగ్రత్త.

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం

3.01497005988
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు