పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గ్యాస్ లైటర్

లైటర్ గురించి తెలుసుకుందాం.

నిప్పును పుట్టించడం తెలుసుకున్న తర్వాత మనిషి జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. అప్పటివరకు పచ్చిమాంసం, పచ్చి కాయలు తినే మనిషి ఆహారాన్ని పచనం చేసుకోవడం ఆరంభించాడు. ఇప్పుడు నిప్పు మన నిత్య జీవిత అవసరమైపోయింది. నిజానికి నిప్పును ఉపయోగించుకోవడం అనేది మనిషి వైజ్ఞానిక పరిశోధనల్లోకెల్లా గొప్పది. కొయ్యదిమ్మలో రంధ్రం చేసి దానిలో బిగుతుగా పట్టే కర్రను చేతులతో అటు, ఇటు వేగంగా తిప్పడంలో కలిగే రాపిడి లేదా ఘర్షణ ద్వారా నిప్పును పట్టించడం ఆదిమ మానవుడికి తెలుసు. అప్పట్లో తేలికగా మండే కిరోసిన్, పెట్రోల్ వంటి ద్రవ ఇంధనాల గురించి మనిషికి తెలియదు. నిప్పును పుట్టించడానికి ఎంతో శ్రమపడవలసి వచ్చేది. రెండు చెకుముకి రాళ్ళను (blints) తీసుకొని వాటిని ఒక దానితో ఒకటి బాగా రాపాడిస్తూ పరిశీలించండి. నిప్పు రవ్వలు వెలువడతాయి. అంటే, ఘర్షణలో ఉష్ణంతో బాటు నిప్పు కూడా పుడుతోందన్న మాట. ఇదే గ్యాస్ లైటర్ సిగరెట్ లైటర్ లోని మూల సూత్రం. అగ్గిపెట్టె నిప్పు పుట్టించడాన్ని సులభతరం చేసింది.

వంటింట్లో గ్యాస్ స్టౌను వెలిగించడానికి, ప్రయోగశాలలో బుస్సెన్ బర్నర్ ను వెలిగించడానికి గ్యాస్ లైటర్ చాలా సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఆటోమెటిక్ ఇగ్నిషన్ సిస్టం లేని గ్యాస్ స్టౌలకు ఇది చాలా ఉపయోగం. గ్యాస్ లైటర్ బటన్ ను నొక్కినప్పుడు వెలువడే నిప్పు రవ్వ గ్యాస్ స్టౌకు సిలిండర్ నుంచి వచ్చే గ్యాస్ ను మండిస్తుంది. నిప్పు రవ్వను పుట్టించడానికి పిజో ఎలక్ట్రిక్ ప్రభావం అనే సూత్రాన్ని గ్యాన్ లైటర్ ఉపయోగించుకుంటుంది. పిజో ఎలక్ట్రిక్ స్ఫటికం ప్రక్కలపై పీడనాన్ని కలగజేస్తే దాని అక్షం వెంబడి పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఒక బటన్ ను నొక్కి ఆ స్పటికలపై పీడనం క్రమంగా పెరిగేలా చేస్తారు. దీని వల్ల విద్యుత్ ప్రవాహం క్రమంగా పెరిగి అధిక వోల్టేజిని ప్రేరేపిస్తుంది.

mar002.jpgసాధారణంగా గ్యాస్ లైటర్ స్తూపాకారంలో ఉంటుంది. దీనిలో ఒక పిజో ఎలక్ట్రిక్ స్ఫటికం మీద ఒక స్ప్రింగ్ కు అమర్చిన సుత్తి (hammer) ఉంటుంది. ఈ అమరిక ఒక బటన్ కు కలప బడి ఉంటుంది. బటన్ ను నొక్కినప్పుడు స్ప్రింగ్ సుత్తిని వదులుతుంది. సుత్తి పిజో ఎలక్ట్రిక్ స్పటికాన్ని ఢీకొడుతుంది. పిజో ఎలక్ట్రిక్ ప్రభావం వల్ల, సుమారు 800 వోల్ట్ ల అధిక వోల్టేజ్ పుడుతుంది. గ్యాస్ లైటర్ లో తీగల అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఈ వోల్టేజి రెండు లోహబిందువుల మధ్య స్వల్పమైన ఖాళీ స్థలంలోని గాలిని తాకుతుంది. అధిక వోల్టేజి ప్రభావంతో గాలి అయనీకరణం చెంది, విద్యుదుత్సర్గానికి (electric discharge) వీలు కల్పిస్తుంది. ఈ విద్యుత్ ఉత్సర్గమే నిప్పు రవ్వ అన్న మాట. దీని వల్ల గ్యాస్ అంటుకుని మంట వస్తుంది. సాధారణంగా లెడ్ జిర్కోనేట్ టైటానేట్ (PZT) వంటి పిజోఎలక్ట్రిక్ పింగాణీ రకాలను పిజో ఎలక్ట్రిక్ స్ఫటికాలుగా వాడతారు. ఇవి చవక మాత్రమే కాకుండా చాలా బాగా పనిచేస్తాయి. పిజో ఎలక్ట్రిక్ లైటర్ లు కనుక్కోడానికి ముందు ఫ్లింట్ స్పార్క్ లైటర్ లను గ్యాస్ ను మండించడానికి వాడేవారు.

పిజో ఎలక్ట్రిక్ లైటర్ కు బదులుగా ఎలక్ట్రిక్ లైటర్ లు కూడా వాడుకలో ఉన్నాయి. ఇవి బ్యాటరీ మీద పని చేస్తాయి. ఎలక్ట్రిక్ లైటర్ లోని వలయం (circuit)లో చిన్న బ్యాటరీ (dry cell), కెపాసిటర్, ట్రాన్స్ ఫార్మర్ ఉంటాయి. బటన్ ను నొక్కినప్పుడు వలయం పూర్తవుతుంది. కెపాసిటర్ విద్యుదావేశ పూరితమైనప్పుడు ట్రాన్ఫార్మర్ కు సంబంధించిన సెకండరీకాయిల్ రెండు చివరల మధ్య ఉండే చిన్న ఖాళీలో నిప్పురవ్వ పుడుతుంది. బటన్ ను ఒక్కసారి నొక్కినప్పుడు ముందు వాయువు వెలువడి ఆ వెంటనే నిప్పురవ్వ పుడుతుంది. అప్పుడు వాయువు మండుతుంది.

సిగరెట్ కాల్చేవారు సిగరెట్ వెలిగించేందుకు సిగరెట్ లైటర్ ను వాడతారు. పాతరకం సిగరెట్ లైటర్లో లోహంతో చేయబడిన చక్రం ఒక చెకుముకి రాయి ముక్కపై తిరిగినప్పుడు నిప్పురవ్వ పుడుతుంది. ఇది కిరోసిన్ లో తడిసిన వత్తిని మండిస్తుంది. ఈ మంటతో సిగరెట్ ను వెలిగిస్తారు.

mar001.jpgసిగరెట్ లైటర్ లు పసుపు, నీలం, నారింజ, ఎరుపు, తెలుపు వంటి ఆకర్షణీయమైన రంగుల్లో దొరుకుతాయి. ఈ సిగరెట్ లైటర్ సుమారుగా అగ్గిపెట్టె సైజులో ఉండి చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో ఒక చిన్న పారదర్శకమైన ప్లాస్టిక్ పాత్ర వుంటుంది. దీంట్లో ఒక ద్రవం ఉంటుంది. ఇది ద్రవీకరించబడిన వాయువు. ఈ లైటర్ చేసేదల్లా ఆ వాయువును మండించడానికి నిప్పురవ్వను పుట్టించడమే.

కారులో ఉండే సిగరెట్ లైటర్ లు కారు బ్యాటరీ నుంచి వచ్చే విద్యుత్తు ఉపయోగించుకుని పనిచేస్తాయి.

ఆధారం: డాక్టర్ ఇ.ఆర్ సుబ్రహ్మణ్యం.

3.02058823529
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు