హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / చదువుల సాహసికి నోబుల్ శాంతి పురస్కారం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చదువుల సాహసికి నోబుల్ శాంతి పురస్కారం

చదువు కోసం పోరాటం.

nov018.jpgఅదొక అందాలలోయు, ఎటు చూచినా పచ్చని చెట్లు, వేగంగా పారుతున్న నదులు. చుట్టూ పర్వతాలు. దాన్ని తూర్పు స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. దేవతలక్కడ తిరుగుతుంటారని పేరు.

మరి అక్కడున్న ఆడపిల్లలు నిజానికి హంసలమల్లే ఎగురుతుండాలి. చిలకలమల్లే కిలకిలమంటుండాలి. నెమళ్ళమల్లే ఆడుతుండాలి. ఆ అందాలలోయకే అందాలు తేవాలి. కానీ అక్కడ ఆడపిల్లలు ఆడుకోకూడదు. బయట అడుగు పెట్టకూడదు. నవ్వకూడదు. తెల్లదుస్తులు వేసుకోకూడదు. అంతేనా చివరకు టి.వి. నైనా చూడకూడదు! ఇక చదువుకోవడం ఎక్కడ?

ఇంతకూ ఈ లోయ పేరేమిటి? స్వాత్. అది ఎక్కడుంది? పాకిస్తాన్ లో. ఈలోయలోని ఒక ఆడపిల్లకు డాక్టర్ కావాలని కల. సైంటిస్టయినా కావాలని కల. రాజకీయాల్లోకి వచ్చి రాజ్యమేలాలనీ కల. కానీ అప్పటికే నాలుగు వందల స్కూళ్ళు ఆ లోయలో మూసి వేశారు. బాంబులతో పాఠశాలల్ని ధ్వంసం చేశారు. స్కూల్లో ఒక్క బోర్డు వుంటే వొట్టు. ఆడపిల్ల బడికెళితే, ఆమెను బడికి పంపితే శిక్ష ఏమిటో తెలుసా? నిలువునా కాల్చెయ్యడమే! పాకిస్తాన్ కూ తాలిబాన్లకూ జరిగే యుద్ధంలో జనం బిక్కుబిక్కుమంటూ పిల్లలంతా బడిమానేసారు. లేదంటే ఊళ్ళకి ఊళ్ళే ఖాళీ చేసి దూరంగా వెళ్ళిపోయి అక్కడ చదువుసాగించారు.

ఇక మన అమ్మాయి సంగతో? ఆ పిల్ల అందరు పిల్లల్లా పారిపోలేదు. బడిమానెయ్యలేదు. వాళ్ళ నాన్న అందరినాన్నల్లా ఎందుకు గొంతుమీదికి తెచ్చుకోడమని. బడిమాన్పించనూ లేదు. తనకూతురు సాహసికావాలి. ఆప్షన్, బ్రిటీష్ యుద్ధంలో ఎప్పుడో 19వ శతాబ్దంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన మాలాలాయ్ అంత సాహసి కావాలి. అందుకోసం తెగించి ఆయనే బడినడుపుతున్నాడు. చిన్నారి కూతురికోసం ప్రాణాలను పణంగా పెట్టి పది మందికీ చదువుచెపుతున్నాడు.

ఇప్పటికి ఆపిల్ల ఎవ్వరో మీకు తెలిసిపోయి వుంటుంది. ఆ తండ్రి ఎవ్వరో కూడా తెలుసుకోవాలని వుంటుంది. ఆమె మలాలా, ఆయన జియాఉద్దీన్ యూసఫ్ జాయ్. మీకన్పించవచ్చు చదువుకోడం కూడా ఇంత తప్పా అని. చదువుకొంటే ఇంత కోపం దేనికని? ఇంత శిక్షలెందుకని? విచిత్రంగా వుంది గదూ! పాకిస్తాన్ లో తాలిబాన్ల రాజ్యమే అంత! వాళ్ళ సిద్ధాంతమే అంత. అదొక రాక్షస రాజ్యం. ఆడపిల్లల పాలిట దెయ్యాల రాజ్యం.

మలాలా అమ్మ తన బిడ్డకు పిరికి మందు నూరిపొయ్యలేదు. కొంగుచాటున దాచుకోలేదు. ధైర్యం నూరి పోసింది. బాక్సులో టిఫిన్ పెట్టి, నుదుటిమీద ముద్దు పెట్టి, భుజంతట్టి ఒక మహావీరమాత యుద్దానికి బిడ్డను పంపినట్టే మలాలాను బడికి పంపేది. ఇక నాన్న సంగతి సరేసరి! ఇంతమంచి అమ్మా నాన్నలు ఎందరికి దొరుకుతారు? అదే మలాలా అదృష్టం! ఎప్పుడూ మలాలా అదే చెపుతుంటుంది. దానికే గర్వపడుతుంటుంది.

అది అక్టోబర్ 9వ తేదీ మలాలా బడికి బయలుదేరింది స్కూలు బస్సులో. అది బస్సా? డొక్కు వ్యాను. బస్సు ఒక మలుపు తిరిగిందోలేదో తాలిబాన్ కసాయిలు చుట్టుముట్టారు. కుషాల్ స్కూల్ బస్సు ఇదేనా అని అడిగారు. మలాలా ఎవరు అని ఓ కుర్రాడు తుపాకీతో బెదిరించి ఆరాతీసాడు. ఒకటికి మూడుసార్లు ఆమెను కాల్చేశారు. ఆమె రక్తం మడుగులో కూలిపోయింది. కంటి లోపలికి ఒక బుల్లెట్ దూసుకెళ్ళింది. భుజం మీదా చెవిమీదా రెండు బుల్లెట్లు దూసుకెళ్ళాయి. బడికి వెళ్ళినందుకు, చదువుకొంటున్నందుకు, నేనూ మనిషినే నాకూ మానవ హక్కులుంటాయన్నందుకు చిన్నారి మలాలాకు, పట్టుమని 12 ఏళ్ళు రాని ముక్కుపచ్చలారని పసిపిల్ల మలాలాకు పడిన శిక్ష ఇది! ఇంత ముందుకెళ్లి, ఆడవాళ్ళు దేశాలనేలుతున్న రోజుల్లో, 'ఆడపిల్లల చదువు ప్రపంచానికే వెలుగు' అని అందరం వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్న కాలంలో జరిగిన దారుణమిది!

మలాలాకు మంచి వైద్యం అందింది. దేశ విదేశాలకు తీసుకెళ్ళారు. పుర్రెనే తొలగించి టైటానిక్ ప్లేట్ అమర్చారు. లండన్ క్వీన్ ఎలజిబెత్ ఆసుపత్రిలో జరిగిన చికిత్సతో నాలుగు నెలల్లో ఆమె కోలుకొంది. లేచి కూచోగల్గింది. ప్రపంచమంతా ఆ చిట్టితల్లి కోసం ప్రార్థనలు చేశారు. తాలిబాన్లు మాత్రం మేం చేసింది సరైనదేనని సిగ్గువిడిచి ప్రకటించారు.

ఇప్పుడు మలాలా పాకిస్తాన్ కు దూరంగా బర్మింగ్ హామ్లోని ఓ పాఠశాలలో చదువుకొంటోంది. పాకిస్తాన్ కు రావాలని ఆమెకు ముచ్చట. వచ్చే పరిస్థితులు ఇప్పటికీ లేవే! మలాలా అక్కడతో ఊరుకోలేదు. బుద్ధిగా చదువుకొంటే సరిపోతుందనుకోలేదు. ప్రతి బిడ్డా చదువుకోవాలి. ప్రపంచానికి శాంతి కావాలి. చదువుకోసం నేనెంత దూరమైనా పోరాడతాను. ప్రాణాలైనా ఇస్తాను' అంటూ ఆడపిల్లల విద్యకోసం పోరాటం మొదలు పెట్టింది.

ఐక్యరాజ్యసమితి జులై 12 మలాలా పుట్టిన రోజును మలాలాడే గా ప్రకటించింది. ప్రపంచాన్ని మార్చడానికి పెన్నూ, పుస్తకం, ఉపాధ్యాయుడూ వుంటే చాలు' అని ధీమాగా ఆవేదిక మీదినుంచే మాట్లాడింది. 'ఐ యామ్ మలాలా' అనే పుస్తకాన్ని రాసింది. ఈ మధ్య ఒబామాకు తుపాకులతో కాదు పుస్తకాలతో ప్రపంచాన్ని మార్చండి” అని అందరూ విస్తుపోయ్యేలా ఒక చురక కూడా వేసింది.

ఆమెకు చాలా పురస్కారాలు వచ్చాయి. అంతర్జాతీయ బాలల శాంతి పురస్కారం, పాకిస్తాన్ యువశాంతి పురస్కారం, మదర్ థెరిస్సా స్మృతి అవార్డు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నైనా! ఇప్పుడు ఏకంగా నోబుల్ శాంతి బహుమతే అభించింది. అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సరసన, మదర్ థెరిస్సా పక్కన పదిహేడేళ్ళ మలాలా నిలబడిందన్న మాట!

ఆశ్చర్యంగా వుంది గదూ! ఆనందంగా వుంది గదూ! అవును ఇప్పుడు 'చదువు' అంత గొప్ప విషయం. చదువుకోడం గొప్ప మానవహక్కు ప్రపంచంలోని పిల్లల్లో బడికి పోనివాళ్ళు సగానికిసగం మంది మన దేశంలో, పాకిస్తాన్ లో వున్నారు!

వీళ్ళందరికీ చదువు రావడానికి ఇంకెందరు మలాలాలు పుట్టాలి? ఒక్క మలాలాతోనే ఈ సుందర స్వప్నం సాకారమైతే ఎంత బావుంటుంది?

ఆధారం: వి. బాలసుబ్రహ్మణ్యం.

3.01763224181
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు