పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చింపాజీలు మాట్లాడగలవా ?

చింపాంజీలు మాట్లాడలేవు కాని శబ్దాలు చేస్తూ తమభావాలను తెలుపుతాయి

ఒక రెండు చింపాజీలు ఒక దానితో మరొకటి ఏదో విషయాన్ని చెప్పాలనుకున్నాయనుకోండి, అప్పుడవి ఏం చేస్తాయి ? అవి తమ గొంతులతో ఏవో కొన్ని శబ్ధాలను చేస్తాయి. తమ ముఖాన్ని రకరకాలుగా పెడతాయి. లేదా తమ చేతులతో ఏవో సంజ్ఞలను చేస్తాయి.

282.jpgప్రాణుల్లో మానవులకు అతి దగ్గరి బందువులైన చింపాజీలు తమలో తాము ఏదైనా ఒక విషయాన్ని తెలియజేసుకునేందుకై ఈ పద్ధతినే అనుసరిస్తాయి. అయితే మనుషుల్లాగా అవి కూడా పదాలనూ, వాక్యాలనూ చెప్పగలవా ? వాటికి మాటలు గీటలూ రావు. సరే. నేర్పిస్తే నేర్చుకుని వాటిని మళ్ళీ ఉపయోగించలేవా ? ఇలాంటి ఆలోచనలతో కొన్ని రకాల చింపాజీలు, ఇతర వానరులకు భాషలను నేర్పించే ప్రయత్నాలు 1960 వ ధశకంలోనే మొదలయ్యాయి.

ముచ్చటగా 4 మాటలు

చింపాజీల లాంటి జంతువులు మనలాగా మాటలను పలకడం కష్టమని పలువురు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో రుజువయ్యింది. ఏ చింపాంజీ కూడా ఒక 4 మాటలకన్నా ఎక్కువగా పలకలేకపోయింది. అది కూడా ఎంతో కష్టం మీదగాని అవి పలకలేక పోయాయి. అందుకు ప్రధాన కారణం వాటి సర్వతంత్రులేనని తేల్చారు. మనుషుల భాషలో ప్రయోగించబడే సున్నితమైన హెచ్చుతగ్గులను పలికించగలిగే స్ధాయికి వాటి స్వరతంత్రులు అభివృద్ధి చెందలేదు.

మూగభాష బాగా వచ్చింది.

ట్రిక్సీ, ఐలన్ గార్టనర్ అనే శాస్త్రజ్ఞులు (ఇద్దరూ భార్యాభర్తలు) చింపాజీలకు మరొక విధంగా భాష నేర్పించడానికి ప్రయత్నించి సఫలమయ్యారు. మనుషుల్లో చెవిటి మరియు మూగవారు ఉపయోగించే సంకేతబాషను వారు చింపాజీలకు నేర్పించేందుకు ప్రయత్నించారు. ఆ వైజ్ఞానిక దంపతులు నాలుగేళ్ళపాటు ఎంతగానో శ్రమించి, వాశూ, అనే ఓ చింపాంజీకి తొలిసారిగా ఓ 132 సంకేతాలను నేర్పించగలిగారు.

చెవిటి మరియు మూగవాపు ఉపయోగించే సంకేత భాషను వాశూ బాగానే ఒంటబట్టించుకుంది. దానికి యాపిల్ తెమ్మని చెబితే పళ్ళ బుట్టలోంచి యాపిల్ నే తీసుకొచ్చేదిగాని అరటిపండు తీసుకొచ్చేది కాదు. అంతేకాదు. అది ఇంకొంచెం ముందుకెళ్ళి రెండేసి మాటలను కలిపి ప్రయోగించడం కూడా నేర్చుకుంది. ఉదాహరణకు అరటిపండు ఇవ్వు. దయచేసి తొందరగా వంటి వ్యాక్యాలను అది ప్రయోగించగలిగేది. అంతేగాక, ఎవరూ తనను చూడటం లేదని అనుకున్నప్పుడు అది తనతో తనే ఈ సంకేత భాషలో మాట్లాడుకునేది. ఉదాహరణకు, అక్కడికి వెళ్ళోద్దు అని దాన్ని నిషేధించిన ప్రదేశానికి అది రహస్యంగా వెళ్ళినప్పుడు తనకు తానే చప్పుడు చెయ్యెద్దు అన్న సంకేతాన్ని ఇచ్చుకునేది.

మామూలు మాటల్నేకాదు ఒక విధంగా తిట్లను కూడా వాశూ నేర్చుకుంది. ఏదైనా వస్తువుగాని లేదా మనిషిగాని దానికి నచ్చకపోతే ఛీ, కంపుకంపు అనే సంకేతాన్ని అది చేసేది.

ఇలా సంకేతభాషను నేర్పించిన పెద్ద చింపాంజీలను చిన్న చింపాంజీలను గార్డనర్ దంపతులు ఒకే చోటికి చేర్చినప్పుడు అవన్నీ కలిపి తాపీగా ఆ సంకేత భాషలో మాట్లాడుకోవడం వారు గమనించారు. అంతేగాక, అవి తమకు తాముగా ఈ సంకేత పదాలను కలిపి వాక్యాలను కూడా రూపొందించాయి. ఉదాహరణకు హంస గురించి మాట్లాడేటప్పుడు అవి నీటి పక్షి అనే సంకేతాన్ని ఉపయోగించాయి.

వ్యాకరణం వచ్చా...

చింపాంజీలు తాము నేర్చుకున్న మాటలను (పదాలను) ఒక ప్రత్యేక క్రమంలో ఉపయోగించడానికి ఇష్టపడతాయని శాస్త్రజ్ఞులు గమనించారు. ఉదాహరణకు వాటికేమైనా పానీయంగాని, షర్బత్తుగాని మరి కొంచెం కావలసి వస్తే ఇంకొంచెం షర్బత్తు అనేవే గాని , షర్బత్తు ఇంకొంచెం అనేవి కాదు. దీనిని బట్టి బహుశా వాటికి వ్యాకరణం కూడా ఎంతో కొంత వచ్చు అని చెప్పాల్సి వుంటుంది.

అయితే మరికొందరు ఇతరు శాస్త్రజ్ఞులు మాత్రం సంకేత బాషనే అయినప్పటికీ మనుషుల్లా చింపాంజీలు భాషను ఉపయోగించలేవని వాదిస్తున్నారు. చింపాంజీలు రెండు కన్నా ఎక్కువ శబ్ధాలను కలపలేవని, అదీగాక తమకు ఆ భాషను నేర్పించిన వారిని అవి పూర్తిగా అనుకరిస్తాయని వారు అంటున్నారు.

ఏమైతేనేం, మనుషుల్లాగా చింపాంజీలు కూడా తమ ఆలోచనలను ఏదో ఒక రూపంలో వ్యక్తీకరించగలవని రుజువయ్యింది. అది చాలు కదా...

283.jpg

2.9801980198
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు