অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చిన్ని కాటు – పెద్ద ప్రమాదం

చిన్ని కాటు – పెద్ద ప్రమాదం

ఏప్రిల్ లో ప్రపంచమంతటా జరుపుకునే ఒక ప్రముఖమైన దినోత్సవం గురించి మీకు తెలుసా!

అదే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. దీనిని ప్రతి యేటా ఏప్రిల్ 7న జరుపుకొంటాం.

“నవంబర్ 14 చాచా నెహ్రూ పుట్టినరోజు. సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాక్రిష్ణన్ పుట్టిన రోజు. మరి ఏప్రిల్ 7 ఎవరి పుట్టినరోజు? అనే ప్రశ్న మీ తెలివైన బుర్రలో మెదిలింది కదూ!

మీ ఊహ సరియైనదే... ఇది కూడా పుట్టిన రోజుకు సంబంధించినదే! ఐతే ఈ పుట్టిన రోజు ఎవరో ఒక వ్యక్తిది కాదు... ఒక సంస్థది. ఆ సంస్థ పేరే "ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation)" దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా W.H.0. అంటారు. 1948 ఏప్రిల్ 7 ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భవించిన రోజు. అందుకే ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పరిగణిస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వివిధ దేశాల మధ్య శాంతియుత సంబంధాలు, సహకారం పెంపొందించడానికి కొన్ని దేశాలు కలిసి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్న విషయం మీకు తెలుసుకదా! ఈ ఐక్యరాజ్య సమితి వివిధ రంగాలలో కృషి చేయడానికి కొన్ని సంస్థలను ఏర్పాటు చేసింది. అలా ప్రపంచ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి, వాటికి మార్గదర్శనం చేయడానికి ఏర్పడినదే ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంది?”, “ఇది ఏం పనులు చేస్తుంది”, “దీని సభ్యులు ఎవరు?”, “దీనిని ఎవరు నడిపిస్తారు?”), ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏమి చేస్తారు?” లాంటి ప్రశ్నలెన్నో మీ చిన్న బుర్రలో మెదులుతూ ఉన్నాయి కదూ! మీ ప్రశ్నలకు సమాధానమే ఈ కథ. మరెందుకు ఆలస్యం? చదవండిక!

ఆగండాగండి...!

ఈ కథ ప్రారంభించబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న సూచన. దీనిలో మీకు అర్థం కాని పదాలేమైనా వస్తే వాటిని మీ నోటు పుస్తకంలో రాసుకోండి. ఇది మీ సొంత పుస్తకమైతే పెన్సిల్తో నీట్ గా డే ఆ పదం కింద గీత గీయండి. మొత్తం చదవడం అయిపోయిన తరువాత మీ టీచర్ ను ఆ పదాలకు అర్థం వివరించమని అడగండి. సరేనా? ఇక చదవండి..

ఆరోగ్యానికి అంతర్జాతీయ సహకారం ఎందుకు..??

పాల్ రసెల్ అనే సామాజిక శాస్త్రవేత్త ఆరోగ్యం గురించి ఇలా చెప్పారు, 'ఆరోగ్యం కంటే ముఖ్యమైన అంతర్జాతీయ అంశం మరేదీ లేదు.” ఎందుకు చెప్పారు? ఎక్కడో మెక్సికో దేశంలో మొదలైన స్వైన్ ఫ్లూ, చైనాలో మొదలైన బర్డ్ ఫ్లూ మన దేశ ప్రజలను ఎంత భయపెట్టాయో మీకు గుర్తుండే ఉంటుంది. ఆఫ్రికాలో మొదలై అమెరికాకు వ్యాపించిన ఎయిడ్స్ వ్యాధి గురించి చెప్పనక్కర్లేదు కదా! ఎక్కడో ఇంగ్లాండు దేశంలో ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మశూచికి టీకాలు కనుగొంటే - అది ప్రపంచంలో అందరినీ ఆ వ్యాధి బారి నుంచి రక్షిస్తుంది.

మనదేశ శాస్త్రవేత్త శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు తయారు చేసిన టెట్రాసైక్లిన్ అనే మందు ప్రపంచంలో ఎందరినో అనేక అంటువ్యాధుల నుంచి నేటికీ రక్షిస్తూనే ఉంది. ఇలా ఒకదేశంలో తలెత్తే జబ్బులు మరొకదేశంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. అలాగే ఒక దేశంలో కనుగొన్న మందులు మరొక దేశం వారికి ఉపయోగపడగలవు. అటువంటప్పుడు ఒక దేశపు వ్యాధులు మరొక దేశానికి వ్యాపించకుండా చూడడానికి, ఒక దేశపు శాస్త్రవేత్తలు కనుగొన్న మందులు మరొక దేశ ప్రజలకు ఉపయోగపడేలా చూడడానికి వివిధ దేశాల మధ్య సహకారం అవసరం కదా!. అలా దేశాల మధ్య ఆరోగ్య విషయాలలో పరస్పర సహకారం పెంపొందించడానికి W.H.0 ఆవిర్భవించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంది? దీనిలో సభ్యులు ఎవరు?

ప్రపంచమంతటా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో ఉంది. దీని అత్యున్నత అధికారిని 'ప్రధాన సంచాలకులు (డైరెక్టర్ జనరల్)' అంటారు. చైనా దేశానికి చెందిన డా. మార్గరేట్ ఛాన్ అనే మహిళ ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నారు. 1948 లో W.H.O ప్రారంభమైనప్పుడు 56 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరి ఇప్పుడు సభ్యదేశాలు ఎన్నో తెలుసా? 194. మనదేశం 1948, జనవరి 12న W.H.O సభ్యత్వం తీసుకుంది. W.H.O.కు ప్రపంచంలో ఆరు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కార్యాలయం మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. ఈ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో మన దేశంతో పాటు, బంగ్లాదేశ్, భూటాన్, ఇండోనేషియా, ఉత్తర కొరియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్లాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. W.H.O ప్రాంతీయ కార్యాలయాలు, వాటి ప్రధాన కేంద్రాల వివరాలు క్రింద చూడండి.

ప్రాంతీయ కార్యాలయం

ప్రధాన కేంద్రం

ఆగ్నేయ ఆసియా

న్యూఢిల్లీ (భారతదేశం)

ఆఫ్రికా

బ్రజవిల్లె (కాంగో)

ఈస్టర్న్ మెడిటెర్రేనియన్

(తూర్పు మధ్యప్రాచ్యం)

అలెగ్జాండ్రియా

(ఈజిప్టు)

పశ్చిమ పసిఫిక్ ప్రాంతం

మనిలా (ఫిలిప్పీన్స్)

ఐరోపా

కోపెన్ హాగన్ (డెన్మార్క్)

అమెరికా ఖండం

వాషింగ్టన్ డి.సి.(యు.ఎస్.ఎ.)

W.H.O. చిహ్నం

apr07.jpgవీకు ఐ క్యరాజ్య సమితి చిహ్నం తెలుసుకదూ! ప్రపంచదేశాలన్నీ శాంతియుతంగా ఉండాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ గ్లోబుపై ప్రపంచపటం, దానికి ఇరువైపులా రెండు ఆలివ్ ఆకులు ఉంటాయి. ఈ చిహ్నం మధ్యలో నిలువుగా ఒక కర్ర, దానిని చుట్టుకుని ఉన్న పాము... ఇదే W.H.O. చిహ్నం . ఈ కర్రను “ఏసల్పియస్ దండం' అంటారు. గ్రీకు పురాణాలలో ఏస్కల్పియస్ ను వైద్యానికి ఆద్యునిగా భావిస్తారు. ఆయన వైద్య ప్రక్రియలలో సర్పానికి ప్రాధాన్యత ఉండేదట. ఆధునిక వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వారిని గుర్తుకు తెచ్చేవిధంగా W.H.O చిహ్నం ఉంటే బాగుండేది.. మీరేమంటారు?

W.H.0. విధులు

  • ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు హాని కలిగిస్తున్న నిర్దిష్టమైన వ్యాధులను గుర్తించి వాటిని నివారించుటకు, చికిత్స చేయడానికి కావలసిన సూచనలు, సహకారం అందించడం,
  • ఉదాహరణ: మశూచి వ్యాధిని నిర్మూలించడంలో W.H.D. పాత్ర కీలకమైనది. ఇప్పుడు W.H.O. నాయకత్వంలో ప్రపంచం పోలియోను నిర్మూలించే దిశలో వేగంగా ప్రయాణిస్తుంది. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధుల పై కూడా కృషి జరుగుతూనే ఉంది.

  • ప్రపంచ దేశాలకు ఆరోగ్య విధానాన్ని, వైద్య వ్యవస్థలను రూపొందించుకొనడానికి కావలసిన సూచనలు, సలహాలు అందించడం.
  • వ్యాధులు, ఔషదాలు తదితర అంశాలపై పరిశోధనలు చేయడమే కాక, ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న పరిశోధనలను సమన్వయం చేయడం.
  • ప్రపంచ దేశాల ఆరోగ్య స్థితిపై గణాంకాలను సేకరించి నివేదికలను రూపొందించడం.
  • ప్రపంచ ఆరోగ్య నివేదిక, W.H.O బులెటిన్ తదితర ప్రచురణల ద్వారా ప్రపంచ ఆరోగ్య సమాచారాన్ని అన్ని దేశాలకు అందించడం.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ఆరోగ్యం కోసం ప్రపంచ దేశాలు ఒకదానికొకటి సహాయం చేసుకునేలా ప్రోత్సహించడం, వాటికి కావలసిన సాంకేతిక సహాయం అందజేయడం అన్నమాట.

‘ఆరోగ్యం' అంటే ఏమిటి?

ఆరోగ్యంగా ఉండడమంటే ఏ జబ్బు లేకుండా ఉండడమేనా...? కాదు. W.H.O ప్రకారము ‘ఆరోగ్యం' అంటే కేవలం జబ్బు లేదా వైకల్యం లేకపోవడం మాత్రమే కాదు, ఆరోగ్యం అంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా బాగుండడం. 2000వ సంవత్సరం నాటికి ప్రజలందరికీ ఆరోగ్యం సాధించాలని 1977వ సంవత్సరంలో W.H.O నాయకత్వంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ప్రతిజ్ఞ చేసాయి. కానీ నేటికీ అది తీరని కలగానే మిగిలిపోయింది. ఆకలి, అజ్ఞానం, అనారోగ్య సమస్యలు మన దేశంతో సహా అనేక దేశాల ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. మనదేశంలోని ఐదేళ్ళలోపు పిల్లలలో 42% పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఇది దేశానికే సిగ్గుచేటని స్వయంగా మన ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఏం చేస్తారు?

ప్రపంచమంతటా ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాలు ఆ రోజున అందరికీ ఆరోగ్యం సాధించడం గురించి చర్చిస్తారు. ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్న ఒక అంశాన్ని గుర్తించి, దానిపై కృషి చేయాలని W.H.0. ఆ రోజు అందరికీ పిలుapr06.jpgపు ఇస్తుంది. ఈ సంవత్సరం ఆరోగ్య దినోత్సవం నినాదం ఏమిటో చెప్పమంటారా... ? మీరు అట్ట మీద చూసేసారు కదా...! “చిన్ని కాటు-పెద్ద ప్రమాదం” అనే నినాదంతో దోమలు, ఈగలు నల్లులు ఇతర కీటకాల వలన వ్యాపిస్తున్న వ్యాధులపై పోరాడాలని W.H.O. పిలుపునిచ్చింది. దోమల ద్వారా మలేరియా, డెంగ్యు, చికెన్ గున్యా, బోదకాలు వంటి వ్యాధులు గత కొన్ని సంవత్సరాలుగా మనల్ని వేధిస్తున్నాయి. ఈ క్రింది పట్టికలో కొన్ని రకాల కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులను చూడవచ్చు.

వ్యాధి

వాహక కీటకం

మలేరియా

అనాఫిలిస్ దోమ

డెంగ్యు

ఎడిస్ ఈజిప్టై దోమ

చికున్ గున్యా

 

ఎడిస్ ఈజిప్టై దోమ

ఫైలేరియాసిస్

క్యులేక్స్ దోమ.

జపాన్ మెదడువాపు వ్యాధి

క్యులెక్స్ దోమ

లీష్మానియాసిస్

శాండ ప్లేస్

ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్

సిసి ప్లేస్

 

గత సంవత్సరం ప్రపంచంలో దాదాపు పది కోట్ల మంది ఈ వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడగా పది లక్షల మంది మరణించారు. ఒక్క మలేరియా జ్వరం వల్లనే ప్రపంచంలో దాదాపు ఆరు లక్షల మంది చనిపోయారని, అందులో ఎక్కువ మంది పిల్లలేనని W.H.O తెలియచేసింది. మన రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలోని గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో మలేరియా, ఇతర జ్వరాల బారిన పడుతున్నారు. డెంగ్యు కేసులు వేగంగా పెరుగుతూ ప్రజలను, నిపుణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ప్రాంతాలలో జనవిజ్ఞాన వేదిక ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నది.

ఈ వ్యాధుల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ఒక ప్రణాళిక లేకుండా పట్టణ జనాభా పెరిగిపోవడం, మురికి వాడలు పుట్టుకు రావడం, పారిశుద్ధ్యం నిర్లక్ష్యానికి గురవ్వడం, పర్యావరణంలో వస్తున్న మార్పులు ఇందులో ముఖ్యమైనవి.

ఈ వ్యాధులను నివారించడం ఎలా?

ఈ వ్యాధులను వ్యాపించే కీటకాలను నిర్మూలించడమే వీటి నివారణలో ముఖ్యమైన అంశం. ఈ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల తయారీ,వాటిని అవసరమైన వారందరికి అందుబాటులో ఉంచడం లాంటి చర్యలు ప్రభుత్వాలు, అధికారుల స్థాయిలో జరుగవలసినవి. పిల్లలుగా మీరు గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు చెప్పి ఈ వ్యాసాన్ని ముగిద్దాం.

  1. దోమలు ఎక్కువగా ఉండే కాలంలో శరీరంలో వీలైనంత ఎక్కువభాగాన్ని కప్పి ఉంచేలా దుస్తులు ధరించండి.
  2. మీ ఇంటి దగ్గర, పాఠశాల దగ్గర మురుగు కాలువలలో నీరు నిల్వ ఉంటే మీ పెద్దలనో, ఉపాధ్యాయులనో ఆ మురుగు నీరు ప్రవహించేలా చూడమని కోరండి.
  3. పనికిరాని పేపర్లు, ప్లాస్టిక్ కవర్లు లాంటి వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కన మురుగు కాల్వలో వేయకండి. అలా ఎవరైనా వేస్తుంటే దాని వలన మురుగు నీరు నిలువ ఉండి, దోమలు పెరిగి, జ్వరాలు వ్యాపిస్తాయని తెలియజేయండి. వ్యర్థ పదార్థాలను చెత్త కుండీలలోనే వేయాలి.
  4. మీ ఇంటిలోని పూల కుండీలు, కూలర్లు వంటి చోట దోమలు పెరుగుతున్నాయేమో గమనించండి. అటువంటి వాటిని వారంలో ఒక రోజు పూర్తిగా నీరు లేకుండా ఉంచండి. దీనినే డ్రై డే పాటించడం అంటారు.

వాహక కీటకాలు కలిగించే వ్యాధుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీ జీవ శాస్త్ర ఉపాధ్యాయులను అడగండి. ఇంటర్ నెట్ సదుపాయం ఉన్న వారు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైట్ నుంచి కూడా వివరాలను తెలుసుకోవచ్చు.

ఆధారం: డా. ఎస్. సురేష్.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate