অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జాతీయ వృక్షం మర్రి చెట్టు

జాతీయ వృక్షం మర్రి చెట్టు

apr2“జుట్టు జడలు కట్టి యుందు

కానీ సన్యాసి కాదు

ఎర్రెర్రని పిల్లలుండు

కానీ మనిషి కాదు” – అంటూ పొడుపు కథ అడిగితే ‘మర్రిచెట్టు’ అనే సమాధానం వస్తుంది. చల్లని చెరువులు, ఆ చెరువుల గట్లపై శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రిచెట్లు, ఆ చెట్ల నిండా వందలాది పక్షులు. మనల్లోని అందమైన దృశ్యాలు. అంతే కాదు మర్రిచెట్టు మన జాతీయ వృక్షం కూడా. మర్రిచెట్టు ‘మారేసి‘ కుటుంబానికి ‘రోజేలిస్‘ క్రమానికి చెందిన చెట్టు. దీనిని సంస్కృతంలో ‘వటవృక్షము‘ అంటారు. దీని యొక్క శాస్త్రీయ నామము ‘ఫైకస్ బెంగాలెన్సిస్‘. మర్రిచెట్టు విత్తనాలు చాలా చిన్నవి కానీ మహావృక్షాలుగా పెరుగుతాయి. మర్రికాయలు మృదువుగా పియర్ ఆకారంలో అసంఖ్యాక విత్తనాలతో నిండి ఎర్రగా చిన్నవిగా చెట్టునిండా ఉంటాయి. కాయలోని గుజ్జు తియ్యగా ఉండి ఇష్టంగా తింటారు. వీటి వేర్లు భూమి పైకే కన్పిస్తుంటాయి. వీటి కొమ్మలు ఊడలుగా మార్పుచెంది కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. చెట్లు చాలా పెద్దగా ఉండటం వలన గాలులకూ, వర్షాలకూ పడిపోకుండా ఈ ఊడలు ఊతమిస్తాయి. ఈ చెట్లను ‘ఎపిఫైట్లు‘ అంటారు. వీటి విత్తనాలు బీటలు వారిన గోడల్లో, వంతెనల్లో కూడా మొలకెత్తుతాయి. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా పెరుగుతాయి. రహదారి పక్కనున్న చెట్లు దారినపోయే బాలసారులకు నీడను ఇస్తాయి.

మన దేశంలోని పల్లెటూళ్ళలో మర్రిచెట్టు చుట్టూతా అరుగు కట్టుకొని దానినే రచ్చబండగా ఉపయోగిస్తారు. అనాదిగా మనదేశంలో వ్యాపారాలన్నీ ఈ చెట్టు కిందనే జరిగేవి. వర్తకులు కందిపప్పు, చింతపండు లాంటి వస్తువులు ఈ చెట్లకింద కూర్చునే అమ్ముకునేవారు. ఈ వ్యాపారులను ‘బనియాలు’ అంటారు. గుజరాతీ భాషలో ’బనియా’ అంటే వ్యాపారి అని అర్థం. 1634 వ సం. నుంచి ఇంగ్లీషు రచయితలు ఈ చెట్టును ’బనియన్ ట్రీ’ గా పిలవడం మొదలు పెట్టారు.

లావుగా మందంగా ఉండే మానులతో, అనేక శాఖలతో, దీర్ఘ వృత్తాకార ఆకులతో, చిన్న చిన్న ఎర్రని పండ్లతో మర్రిచెట్టు పెద్ద పెద్ద ఊడలతో జడలు విరబోసుకున్న వృక్షంలా కనిపిస్తుంది. ఆకులు మెత్తగా, మెరిసే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకులమొగ్గలు అన్నీ ’ఫిగ్ ట్రీ’ ల వలె రెండు పొడవైన వృంతాలతో కప్పబడి ఉంటాయి. ఆకు పెరిగే కొద్దీ పత్రవృంతాలు రాలిపోతాయి. మర్రిచెట్లు వయసు పెరిగే కొద్దీ ఊడల్ని నేలలో దింపేసి, ఎకరాలకు ఎకరాలు వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి చెట్లు కొన్నింటి గురించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీ. ల దూరంలో ’తిమ్మమ్మ మర్రిమాను’ అనే ఒక మర్రిచెట్టు ఉన్నది. ఇండియన్ బొటానికల్ గార్డెన్స్ లెక్కల ప్రకారం ఇది 200 సం. పైబడిన వయసుకలది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షంగా పేరుగాంచినది. దీని కొమ్మలు ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా పేరుగాంచింది. దీని కొమ్మలు ఎనిమిది ఎకరాల మేర వ్యాపించి ఉన్నాయి. 1989 వ సం. లో ఈ చెట్టు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ లలో కెక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో అనేక శాకోపశాఖలతో ’పిల్లల మర్రి’ అనే పేరుతో దాదాపు 3 ఎకరాలో విస్తీర్ణంలో 800 వందల సంవత్సరాల కాలం నాటి మర్రిచెట్టు ఉంది. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు టూరిస్ట్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అలాగే కోల్కత్తాలో ’ద గ్రేట్ బనియన్’ పేరుతో ఒక మర్రిచెట్టు 250 సం. వయసు గలిగిన చెట్టు ప్రఖ్యాతి పొందినది. అలాగే బెంగళూరు శివారు ప్రాంతాలలో ’దొడ్డా అలాడా మారా’ అనే పేరుతో నున్న మర్రిచెట్టు సుమారు 2½ ఎకరాలలో వ్యాపించి ఉన్నది. గుజరాత్ లోని కబీర్ వాడ్ ప్రాంతంలో 300 సం. ల వయసు పైబడిన మర్రిచెట్లు ఉన్నాయి. అలాగే కాంబోడియాలోని ’ఆంగ్కోర్ వాట్ దేవాలయం’ లో అతి పెద్ద మర్రిచట్లు పెరిగాయి.

భారతదేశంలోని అనేక పల్లెటూళ్ళలో మర్రిచెట్ల కింది రచ్చబండలు గ్రామస్తులకు చర్చా వేదికలుగా ఉపయోగ పడతాయి. అందుకే ఇది మన జాతీయ వృక్షంగా రూపుదిద్దుకుంది.

ఆధారం: కందేపి రాణీప్రాసాద్



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate