పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీబ్రాలు

జీబ్రాల గురించి తెలుసుకందాం.

zebra రోడ్డును దాటేటప్పుడు 'జీబ్రా క్రాసింగ్' వద్దే దాటాలని ట్రాఫిక్ రూల్స్ లో చదువుకున్నారు కదూ! జీబ్రా క్రాసింగ్ అంటే రోడ్డుకు అడ్డంగా నలుపు తెలుపు గీతలు ఉంటాయి. మరి దీనికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా! జీబ్రాలను చూసి వీటీకా పేరు పెట్టారు. జీబ్రాలు తెలుసుకదా! అవి నలుపు తెలుపు చారలతో ఉంటాయి. జీబ్రాలు కార్డేటా వర్గానికి, ఈక్విడే కుటుంబానికి ఈక్వస్ జాతికి చెందుతాయి. ఇవి సంఘ జీవులు. జీబ్రాలలో మౌంటెన్ జీబ్రాస్, ప్లెయిన్స్ జీబ్రాస్ అని రెండు రకాలుంటాయి. ఇలా కొండలలో, మైదానాలలో నివసించేవే కాకుండా నీటిలో జీవించే మరో రకమైన జీబ్రాలు కూడా ఉంటాయి. వీటిని 'ఈక్వస్ గ్రేవీస్' అంటారు. ఈక్వస్ జీబ్రా ఈక్వస్ క్వాగ్గా అని మరో రెండు రకాలు. గ్రేవిస్ జాతి జీబ్రాలు ఎక్కువ రోజులు ఒకదానితో ఒకటి కలిసి ఉండవు. కొన్ని నెలలు మాత్రమే కలిసి ఉంటాయి. పిల్ల జీబ్రాలు తల్లితో నివసిస్తుంటాయి. తండ్రి జీబ్రాలు వీటితో కాకుండా మరల ఒంటరిగా జీవిస్తాయి. ఇవి కూడా గుర్రాల లాగే నిలబడి నిద్రపోతాయి. జీబ్రాలు ఒకదానికొకటి అరుపులు, సకలింపుల ద్వారానే పలకరించుకోవడం, ప్రమాదాల సమయంలో హెచ్చరించుకోవటం చేస్తాయి.

జీబ్రాల వంటి మీదుండే నలుపు తెలుపు చారలు మనిషి యొక్క చేతిరేఖల్లా ప్రతి జీబ్రాకు వేర్వేరుగా ఉంటాయి, ఏ ఒక్కటి కూడా మరొకదాన్ని పోలి ఉండదు. ఈ కారణంగానే ప్రతి జీబ్రాను ప్రత్యేకంగా గుర్తించవచ్చు. మొదట్లో శాస్త్రవేత్తలు జీబ్రాలు తెల్లని శరీరం కలిగి ఉండి క్రమంగా దానిపై నల్లని చారలు ఏర్పడతాయని భావించేవారు. దీనికి కారణం జీబ్రాల పొట్ట భాగం తెల్లగా ఉండటం వలన అలా అనుకునేవారు.

కానీ పిండోత్పత్తి శాస్త్ర అంచనాల ప్రకారం నలుపు శరీరం మీద తెల్లని పొట్ట, తెల్లని చారలు ఏర్పడినాయని తెలుసుకున్నారు. ఈ చారలు తల, తలకిరువైపులా, మెడ, శరీరమంతా కూడా నిలువుగా ఉంటాయి. జీబ్రా వెనకభాగంలోనూ మరియు కాళ్ళమీదా చారలు అడ్డంగా ఉంటాయి. వాటికున్న చారల వలన అది ఏ జీబ్రా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. జీబ్రా గడ్డిలో దాక్కున్నపుడు దానికున్న నిలువ చారల వలన గుర్తుపట్టలేము. జీబ్రాలకు ఈ చారలు ఆత్మరక్షణకు పనికొస్తాయి. జీబ్రాలను ఎక్కువగా వేటాడేవి సింహం, సింహం రంగుల్ని గుర్తించలేదు. దీనికి వర్ణ అంధత్వం ఉంటుంది. పొడవాటి చెట్లమధ్య వాటి వెనుకగా జీబ్రా నిలబడితే సింహానికి కనిపించదు. గడ్డిపోచలు ఎక్కువగా నలుపు తెలుపు రంగుల్లో ఉండటం వలన వాటి మధ్య జీబ్రాను గుర్తించలేరు. అంతేకాకుండా అన్ని జీబ్రాలు గుంపుగా ఒకేచోట నిలబడినప్పుడు వేటాడే జంతువుకు అది ఏ జంతువో అర్ధం కాక మొత్తం ఒకే పెద్ద జంతువులా కనిపిస్తుంది. ఒక్క జంతువు ఉన్నప్పుడు మాత్రమే సింహం వేటాడుతుంది గానీ గుంపు మీద పడి దాడిచేయదు. ఇలా జీబ్రాలను వేటాడేటప్పుడు సింహం తికమక పడటాన్ని జీవశాస్త్రవేత్తలు గుర్తించారు.

జీబ్రాలు గుర్రాల కన్నా మెల్లగా నడుస్తాయి. కాకపోతే ఏదైనా జంతువు వేటాడుతున్నపుడు ఆ చివర నుండి ఈ చివరకు, ఈ చివర నుండి ఆ చివర వరకు వంకర టింకరగా పరుగులు పెడుతుంది. అలాంటపుడు చాలా వేగంగా పరిగెత్తడమేగాక తన వెనకపడే జంతువును వెనక కాళ్ళతో తంతుంది.

జీబ్రాల కంటి చూపు చాలా బాగుంటుంది. ఇవి రంగుల్ని కూడా గుర్తించగలవు. వీటికి కళ్ళు తలకిరువైపులా ఉండటం వలన ఎక్కువ దూరాన్ని చుట్టూరా చూడగలవు. ఇవి రాత్రిపూట కూడా చూడగలవు. గుర్రాల కన్నా పెద్ద పెద్ద గుండ్రని చెవులుండటం వల్ల జీబ్రాలు చాలా బాగా వినగలవు. గుర్రాల వలె జీబ్రా కూడా తన చెవుల్ని ఏదిశకైనా తిప్పగలదు. ఇది వాసననై రుచినీ కూడా పసిగట్టగలదు.

ఇవి సాధారణంగా గడ్డిని తింటాయి. పొదల్లోని కొమ్మలు ఆకులు, చివుళ్ళు అన్నింటినీ తింటాయి. ఆడజీబ్రాలు మూడేళ్ళ వయసు రాగానే పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పిల్ల జీబ్రాను ఏడాది వరకూ తల్లి సంరక్షిస్తుంది. జీబ్రాలు పుట్టిన కాసేపటికే లేచి నిలబడి నడవటం, సకిలించటం మొదలైన పనులన్నీ గుర్రాల మాదిరిగానే చేస్తాయి. పిల్ల జీబ్రా పుట్టినపుడు గోధుమ, తెలుపు రంగుల్లో కానీ, నలుపు తెలుపు రంగుల్లో కానీ ఉంటుంది. కొండ, మైదాన ప్రాంత జీబ్రాల పిల్లలు తల్లి సంరక్షణలోనూ మరియు సంఘ పెద్ద మరియు ఇతర సభ్యుల సంరక్షణలోనూ పెరుగుతాయి. ఆఫ్రికన్ వ్యాధుల బారిన పడకుండా జీబ్రాలు వ్యాప్తి నిరోధకశక్తిని గుర్రాల కన్నా ఎక్కువ కలిగి ఉంటాయి. జిబ్రాల యొక్క చర్మం కోసం, మాంసం కోసం ప్రజలు వేటాడుతున్నారు. వీటి వలననే ఇవి విలువ్తమయ్యే దశకు  చేరుకుంటున్నాయి. మైదాన ప్రాంతాలలో టీబ్రాలలోని ఒక ఉపజాతియైన 'క్వాగ్గా' అనేది ఇప్పటికే విలుప్తమైంది. అందుకని నేషనల్ పార్కుల్లో వీటిని సంరక్షిస్తున్నారు..

చిత్రలేఖనంలో జీబ్రాలకొక విశిష్టమైన స్థానం ఉన్నది. నాల్గవ మొఘల్ రాజైన జపనీర్ ఒక జీబ్రా ఆ బొమ్మను వేయతలచాడు. ఉస్తాన్ మన్సూర్ ఆ చిత్రాన్ని పూర్తిచేశాడు. ఫర్మీచర్ లోను, కార్పెట్లు, చీరల వంటి వాటిలోనూ ఈ జీబ్రా మచ్చలు, వాడటం చాలా ఫ్యాషన్. అంతేకాక కార్టూన్లు, సినిమాలోనూ ఇవి మంచి పాత్రలే పోషించాయి. మదగాస్కర్ రేసింగ్ స్ట్రెప్స్ అనే సినిమాల్లో జీబ్రాలు ప్రధానపాత్రలు, జీబ్రాలను మస్కట్లుగా, చిహ్నాలుగా కూడా ఉపయోగిస్తున్నారు.

ఆధారం: కందేపి రాణీప్రసాద్

2.98843930636
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు