పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జెండా పండగ వచ్చింది

మనం కుల, మత బేధాలు మరచి ఐకమత్యంగా ఉండాలి.

aug7పిల్లలూ!

మళ్ళీ జెండా పండగవస్తోంది. ఎప్పుడో తెలుసా? ఆగష్టు 15న. ఆ రోజున అన్ని పాఠశాలల్లో, అన్ని కార్యాలయాల్లో, అన్ని నగరాల్లో, గ్రామాల్లో అందరూ మన జాతీయజెండా అయిన మూడు రంగుల జెండాను ఎగరవేస్తారు. మీకందరికీ చాక్లెట్లు పంచి పెడతారు. అందరం సంబరాలు చేసుకుంటాము. అయితే సంబరాలు చేసుకుంటే సరిపోతుందా? శ్రీశ్రీ అనే మహాకవి ఏమన్నాడో తెలుసా? “స్వాతంత్ర్యం వచ్చెననీ! సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయీ!” అన్నారు. మరేం చేయాలి?

మొట్టమొదటిది జెండా పండగ మన భారతీయులందరిదీ అని తెలుసుకోవాలి. అన్ని కులాలు, ప్రాంతాలు, మతాలు, జాతుల వారు అందరూ పండుగను జరుపుకోవాలనే విషయం గ్రహించాలి. కాని యీనాడు జరుగుతున్నదేమిటి? యువతీయువకుల్లో చాలమంది ఆగష్టు 15 మన స్వాతంత్ర్య దినోత్సవం అనే అంశాన్ని మర్చిపోతున్నారు. విద్యార్థుల్లో చాలా మంది స్వాతంత్ర్యం సాధించడంకోసం తమ జీవితాలను బలిచేసిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి స్వాతంత్ర్య సమరయోధుల పేర్లే చెప్పలేకపోతున్నారు. | నాలుగు రోడ్ల కూడలిలో పెద్దలెవరైన జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయగీతాన్ని పాడుతుంటే ఆ సమయంలో ఆగి, జాతీయగీతం అయిపోయేదాకా జెండాకు వందనం చేయాలనే విషయం తెలియకుండా ఉంటున్నారు. పెద్దలను నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. జెండాపండగ అందరిదీ. దీనిని అందరం ఉత్సాహంగా జరుపుకోవాలి అనే భావన దేశ ప్రజలందరిలో రావాలి.

రెండవది... అసలు మనం ఇంత పెద్ద దేశం వాళ్ళం, ఒక చిన్నదేశమైన ఇంగ్లాండు దేశానికి బానిసలుగా ఎందుకయ్యాం? ఏ పొరబాట్లు మనల్ని బానిసలను చేశాయి? అవి తెలుసుకోవాలి. వాటిని సరిదిద్దుకోవాలి. అప్పుడే మనం మరల బానిసలు కాకుండా ఉంటాం. ఆ పొరబాట్లేమిటి?

మన పొరబాట్లలో మొదటిది మనం ఐకమత్యం లోపించడం. ఆనాడు ఝాన్సీ లక్ష్మీభాయ్,  నానాసాహెబ్, తాంతియాతోపే బ్రిటీషువాళ్ళను తరిమివేయడానికి పోరాడుతుంటే గ్వాలియర్, జైపూర్, కాశ్మీర్ మహారాజులు, హైదరాబాద్ నవాబులాంటి వాళ్ళు భారతీయుల ఐకమత్యాన్ని భంగపరిచి, దేశభక్తులకు వెన్నుపోటు పొడిచి, బ్రిటీష్ వారికి సహకరించారు. అందువలననే 1857లో జరిగిన ‘ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం' లో మనము ఓడిపోయాం. ఆ తర్వాత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ ఓ వంక, కమ్యూనిష్టులు మరోవంక పోరాడుతోంటే, ఆనాటి జమీందార్లు 'జస్టిస్ పార్టీ'ని బెట్టి, బ్రిటీష్ వారికి అనూకూల విధానాలు రూపొందించి, స్వాతంత్ర్య పోరాటానికి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించారు. ఐతే, ఆనాడు వారి ఆటలు సాగలేదు. ప్రజలు పెద్దఎత్తున కాంగ్రేసు, కమ్యూనిష్టుల వెనక సమీకరించబడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉవ్వెత్తున పాల్గొన్నారు. వారి ఐకమత్యం వలన మనం విజయం సాధించాం. స్వాతంత్ర్యాన్ని సంపాదించాం.

ఈనాడు కూడా కొందరు గతం నుండి గుణపాఠం తీసుకోవడం లేదు. భారతీయుల ఐకమత్యాన్ని భంగపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజలను కులాలవారీగా, మతాల వారీగా విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. 'ది హిందూ’ అనే ఇంగ్లీషు పత్రికలో ఇటీవల ఒక వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే కొంతమంది మతోన్మాదులు కాలేజీల్లో మగపిల్లలు మగపిల్లలతోనూ, ఆడపిల్లలు ఆడపిల్లలతోనూ, వారు వేరే వేరే మతాల వాళ్ళయితే, స్నేహం చేయకూడదని ఆదేశిస్తున్నారు. అలా స్నేహం చేస్తే వాళ్ళను బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల కొడుతున్నారు. ఇలా ప్రజలు మతాల వారీగా చీలిపోయేట్లుగా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొంతమంది కులోన్మాదులు తమ కులం వారితోనే స్నేహాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీని వలన విద్యార్థులు తమ కులం వారితోనే స్నేహం చేస్తున్నారని 'ది హిందూ' పత్రిక సర్వేలో వెల్లడయింది. అందువలన ఏం జరుగుతోంది? ప్రజల్లో కులాభిమానం మతోన్మాదం పెరుగుతున్నాయి గాని, దేశభక్తి పెరగటం లేదు. వారిలో ఐకమత్యం తగ్గిపోతోంది. ఇది దేశానికి ప్రమాదకరం కాదా?

మన నాయకుల్లో అవినీతి తీవ్రంగా ఉండటం మన దేశానికి పట్టిన రెండో చీడ. ఈ అవినీతి కారణంగా, వేరుపురుగు వృక్షాన్ని మొత్తాన్ని నాశనం చేసినట్లు, ఎన్నో రాజ్యాలు కూలిపోయాయని క్షేమేంద్రుడు అనే మహాకవి ఎన్నడో చెప్పారు. ఈనాడు అవెురికా వంటి దేశాలు అవినీతి పరులైన - మననాయకులను లోబరచుకొని, మన దేశ సంపదను = దోచుకొని తమ దేశానికి తరలిస్తున్నారు. ఉదాహరణకు ‘నవ తెలంగాణ' పత్రికలో వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి గారి ప్రకటనను తెలుసుకుందాం. ఆ మంత్రి గారు ఏమన్నారంటే “విదేశీ పెట్టుబడి దారులు సేవకోసం పెట్టుబడులు పెట్టారు. వారు లాభాలకోసం పెట్టుబడులు పెడతారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం మేం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. వాటి కోసం వారికి అనేక ప్రోత్సాహకాలు అందించాల్సి ఉంటుంది.” అన్నారు. ఏమిటీ విడ్డూరం? విదేశీ పెట్టుబడిదారులు సేవకోసంరారనీ, వారు లాభాల కోసం వస్తారని చెబుతూనే వారికి అనేక ప్రోత్సాహకాలు అందించబోతున్నామని చెప్పడం ఏం సూచిస్తోంది? విదేశీయుల లాభాల కోసం ప్రోత్సాహకాలా? ఇది దేశభక్తిని సూచిస్తుందా? అవినీతినా? ఇంత నిస్సిగ్గుగా చేస్తున్న అవినీతి పనుల వలన దేశసంపద ఇతర దేశాలకు తరలిపోదా?

ముచ్చటగా మూడో పొరబాటు ఏమిటంటే మన దేశప్రజలకు దేశ సమస్యల పరిష్కారం కోసం తాము కూడా ప్రయత్నించాలనే ఆలోచన లేకపోవడం, అనాది నుంది మన దేశస్తులు అలాంటి విషయాలు రాజుల మధ్య ఉండే విషయాలనీ, రాజులు యుద్ధాల్లో వాటిని పరిష్కరించుకుంటారని అనుకోవడమే జరుగుతోంది. ఇప్పుడు కూడ ప్రజల వద్ద ఏదైనా ఒక దేశ సమస్యను ప్రస్తావించితే, సమస్యలు, వాటి పరిష్కారాలు అవన్నీ రాజకీయ నాయకులే ఆలోచించాలనుకొంటున్నారు. 'అవన్నీ రాజకీయాలండీ! నాకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదు.' అని చెప్పి తమ సమస్యల పరిష్కారం విషయంలో కూడా తాము ప్రయత్నం ఏమీ చేయడం లేదు. ఉదాహరణకు ధరల పెరుగుదల ప్రజల సమస్య. అయినా ధరల పెరుగుదలకు నిరసనగా ఓ ర్యాలీ తీస్తే దానిలో కొద్దిమంది రాజకీయ కార్యకర్తలు ఉంటున్నారే గానీ, వేలాదిగా ప్రజలు పాల్గొనడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రతి సమస్యా తమదేననీ, కేవలం రాజకీయ నాయకులది కాదనీ ప్రజలు గుర్తించాలి. అప్పుడే దేశాన్ని విదేశీయులు దోచుకుంటుంటే దానిని ఆపగలరు. అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టగలరు,

పిల్లలూ!

దేశాన్ని గూర్చి మహాకవి గురజాడ ఏమన్నారు? “దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!” అన్నారు. కాబట్టి మీరంతా దేశప్రజల సుఖం కోసం కష్టపడతామనే నిర్ణయం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకోవాలి. మన పెద్ద దేశం, ఒక చిన్న దేశమైన ఇంగ్లాండుకు బానిసదేశంగా దాదాపు 200 ఏళ్ళు ఎందుకుందో? దానికి కారణాలేమిటో? మనవారు గతంలో చేసిన పొరబాట్లు ఏమిటో? మీరు తెలుసుకోవాలి. పెద్దవారయ్యాక, మీ....రు ఆ పొరబాట్లను చేయకుండా ఉండాలి. ప్రజల్లో ఐకమత్యం పెంచాలి. అవినీతిపరులై, దేశసంపదను విదేశీయులకు దోచి పెట్టే నాయకుల భరతం పట్టాలి.

ప్రజాస్వామ్య దేశపు పౌరులుగా, దేశసమస్యల పరిష్కారం విషయంలో మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. అజ్ఞానం, మూఢనమ్మకాలు లేని, శాస్త్రీయ ఆలోచన గల్గిన పౌరులుగా తయారై, దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు నడిపించాలి. అదే మీ భవిష్యత్ కర్తవ్యం .

ఆధారం: కె.ఎల్. కాంతారావు

3.00289017341
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు