অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తల్లిదండ్రుల బాధ్యత

పెద్దవాళ్ల మాటలు

మా చెల్లెలికి నాకు నాలుగు ఐదు ఏళ్ళప్పుడు మేం ఒకసారి మా తాతయ్య ఇంటికి వెళ్ళాం. అక్కడ మేం రోజు డాబా మీద పడుకునే వాళ్లం. ముందు మమ్మల్ని పడుకోబెట్టేసి పెద్దవాళ్లు కిందకెళ్లి కబుర్లు చెప్పుకునేవాళ్లు. వాళ్లున్న గది కిటికీ డాబా పిట్టగోడ దగ్గర్నుండీ కనిపించేది. మేం పిట్టగోడ దగ్గర నక్కి కూర్చుని వాళ్ల మాటలు వినడానికి ప్రయత్నించే వాళ్లం. అక్కడక్కడ తప్ప వాళ్ల సంభాషణలు సరిగా వినిపించేవి కావు. ఒక రోజు అలాగే వింటూ వింటూ ఆ పిట్టగోడ పక్కనే నిద్రపోయాం. తరువాత పెద్దవాళ్లు వచ్చి మేం పక్కల మీద లేకపోవడం చూసి మమ్మల్ని లేపి దుమ్ము దులిపేరో, ఉతికి ఆరేసేరో, మరే ఇతర పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించేరో నాకు జ్ఞాపకం లేదు. కాని ఒక్కటి మాత్రం నిజం. పెద్దవాళ్ల మాటలంటే పిల్లలకి ఎందుకో చెప్పలేని ఆకర్షణ ఉంటుంది. దగ్గర్లో ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఏదో సాకుతో వెళ్లి వాళ్ళ పంచన చేరతారు. ఈ విషయం చెప్పి, పెద్ద వాళ్ల సంభాషణల నుండి పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చుఅని అంటే చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు ఒప్పుకోరు. అది మీలాంటి గొప్పింటి కుటుంబాల్లో గొప్ప గొప్ప వాళ్లు వచ్చిపోతుంటారు కనుక చెల్లుతాయి. మాలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో అవన్నీ ఎక్కడవుతాయి? అని నిష్ఠూరం వేస్తారు. కాని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చెప్పడానికి ఆసక్తి కరమైన విషయం ప్రతి ఒక్కరి దగ్గరా ఏదో ఒకటి ఉంటుంది. స్టడ్స్ టెర్కెల్, రాబర్ట్ కోల్స్ వారి వారి పుస్తకాల్లో వివరించినట్టు ప్రతి ఒక్కరి దగ్గర చెప్పడానికి ఎన్నో మంచి కథలు ఉంటాయి. పెద్ద వాళ్లు మాట్లాడుతుంటే చాలు అందులో ఏమాత్రం సారం ఉన్నా వాళ్ల ముఖాల్నే చూస్తూ, మాటలు వింటూ పిల్లలు మై మరచిపోతారు.

అడగని బోధన

చదువు విషయంలో మనకి పిల్లలకి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే మనం ఈ లోకంలోకి చాలా ముందే వచ్చేశాం. వాళ్ల కన్నా మనకి ఎన్నో తెలుసు. మనకి చాలా అనుభవం ఉంది. ఈ ప్రపంచ రచన మనకి తెలుసు. లోకపు వ్యూహా లేంటో మనకి తెలుసు. పెద్దలు పిల్లలకి చేయవలసింది ఏంటంటే ఆ ప్రపంచాన్ని పిల్లల అందుబాటులోకి వచ్చేట్టు చెయ్యడం, దాని స్వరూపం స్పష్టం అయ్యేట్టు చెయ్యడం. ఇక్కడ కీలకమైన పదం - అందుబాటు. మనుషులు, స్థలాలు, అనుభవాలు, మనం ఉద్యోగాలు చేసే సంస్థలు, మనం వెళ్లే మార్కెట్టులు, ఇళ్ళు, ఊళ్లు - ఇలా వీలైనన్ని అందుబాటులోకి వచ్చేట్టు చూడడం. అలాగే బొమ్మలు, పుస్తకాలు, ఇంట్లో వాడుకునే చిన్న చిన్న వస్తువులు మొదలైనవి అందుబాటులో ఉండేట్టు చూడడం. రహస్యం ఏంటంటే పిల్లలకి వాళ్ల కోసం మనం కొనే బుజ్జి బుజ్జి బొమ్మల కన్నా, పెద్దవాళ్ళు వాడుకునే అసలైన వస్తువుల మీదే ధ్యాస. వంటింట్లో పిల్లలు ఆడుకునే తీరు గమనిస్తే వీళ్లు బయట కొనే బొమ్మల కన్నా మూకుళ్లు, గరిటెలతో చక్కగా ఆడుకుంటారేమో అనిపిస్తుంది. అలాగే పిల్లల ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం కూడా అవసరం. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పిల్లవాడు ఒక చిన్న ప్రశ్న వేయగానే “ఆహా! ఇప్పుడు దొరికావురా బుజ్జీ! ఇక చూస్కో నా తడాఖా!” అని వాడికొక ముప్పావుగంట క్లాసు పీకాలన్న ఉబలాటం పెద్దవాళ్లలో మెండు. దీని గురించే ఒక కథ ఉంది. ఒకసారి ఓ పిల్లవాణ్ణి స్కూల్లో పెంగ్విన్ పక్షుల మీద ఓ పుస్తకం చదివి వ్యాసం రాసుకు రమ్మన్నారట. పిల్లవాడు అలాగే రాసుకొచ్చాడు. మొదటి పేజీ పైన తన పేరు, రోల్ నంబరు, మొదలైన సమాచారం ఉంది. ఆ తరువాత పుస్తకం పేరు, రచయిత పేరు ఉన్నాయి. ఆ తరువాత వ్యాసం క్లుప్తంగా ఇలా ఉంది - ఈ పుస్తకంలో పెంగ్విన్ ల గురించి నాకు అవసరమైన దాని కన్నా చాలా ఎక్కువ ఉంది.” పిల్లలు ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా ఇలా అతి చేసే ప్రమాదం ఉంది. పై కథ లాంటిదే మరొకటి ఉంది. ఒక పాప వాళ్ళమ్మని ఏదో ప్రశ్న అడిగిందట. వాళ్లమ్మ పాపం తీరిక లేకో, జవాబు సరిగా తెలీకో “వెళ్లి నాన్నని అడుగు” అంది. "నాకు దాని గురించి మరీ అంత తెలుసుకోవాలని లేదులే!” అని ప్రయత్నం మానుకుందట ఆ పాప. పిల్లలకి ఇంకా ఎక్కువ కావాలంటే వాళ్లు అడుగుతారు. అడిగిన ప్రశ్నకి సూటిగా క్లుప్తంగా సమాధానం చెప్పొచ్చు. తెలీకపోతే “నాకు తెలీదు. పద ఫలానా పుస్తకంలో ఉంటుంది చూద్దాం” అనొచ్చు. అక్కర్లేని బోధన వల్ల నేర్చుకోవడం జరక్కపోగా నేర్చుకోవడానికి అది అడ్డుపడుతుంది! ఈ సత్యం మింగుడు పడడం కొంచెం కష్టమే. నూటికి తొంభై తొమ్మిది సార్లు అడగని చదువు వల్ల ఫలితం ఉండదు. చదువుకి అడ్డు పడుతుందంతే. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే తల్లిదండ్రులకి దీనికి నిదర్శనాలు ఎన్నయినా కనిపిస్తాయి. ఎన్నో సందర్భాల్లో, ఉత్తరాల్లో, మాటల్లో, తల్లిదండ్రులు చెప్పడం విన్నాను. “మా పిల్లాడు (లేదా పాప) ఆ మధ్య ఏదో విషయం అర్థం కాక ఇబ్బంది పడుతుంటే సహాయం చేయబోయాను. కాసేపయ్యాక వాడు ‘ఇక చెప్పింది చాల్లే. దీని సంగతి నేనే చూసుకుంటాను అని నా మీద విరుచుకు పడ్డాడు. పిల్లవాడికి చాలా కోపం వచ్చింది. ఎందుకిలా జరిగింది?” తల్లిదండ్రులు సహాయం చెయ్యాలని మంచి ఉద్దేశంతో వెళ్లినా పిల్లల్లో అలాంటి విపరీతమైన స్పందన ఎందుకు కలుగోంది? దానికి కారణం ఉంది. చాలా లోతైన కారణం ఉంది. మనం ఎవరికైనా, ఎప్పుడైనా, ఏదైనా అడక్కుండా బోధించాలని బయలుదేరినప్పుడు మనకి తెలిసో తెలీకో అందులో అంతర్లీనంగా అవతలి వారికి రెండు విషయాలు సూచింపబడతాయి. మొదటి విషయం ఏమిటంటే - నీకు నేను చాలా ముఖ్యమైన విషయం నేర్పిస్తున్నా సుమా! కాని ఎంచేతనో అదెంత ముఖ్యమైన విషయమో తెలుసుకోలేనంత అధ్వాన్న స్థితిలో ఉన్నావు మరి నువ్వు. నేను పూనుకుని నీకిది నేర్పిస్తే తప్ప అదెంత ముఖ్యమో నీకు ఎప్పటికీ అర్థం కాదు. రెండవది ఏంటంటే - ఇప్పుడు నేను నీకు బోధించబోయేది ఎంత కష్టమైనది అంటే నేను నీకు చెప్పకపోతే నీ అంతకు నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవేమో! పిల్లల పట్ల పెద్దలు చూబించే ఈ అవిశ్వాస భావం, చులకన భావం పిల్లలకి సులభంగా తెలిసిపోతాయి. మాటలని బట్టి కాక అవతలి వాళ్ల భావావేశాన్ని బట్టి విషయాన్ని గ్రహించడంలో పిల్లలు చతురులు. కనుక అలాంటి అడగని చదువు నిజంగా వాళ్లకి కోపం తెప్పిస్తుంది. అడగని చదువులో ఎప్పుడూ ఈ అవిశ్వాసం, చులకన భావం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒకసారి ఈ సత్యాన్ని స్పష్టంగా గ్రహించిన తరువాత ప్రతీ సందర్భంలోను నన్ను నేను నిగ్రహించుకోవాల్సి రావడం గమనించాను. అవతలి వాడికి ఉత్సహించి ఏదో చెప్పబోయి ఆగిపోవడం ఎన్నో సార్లు జరిగింది. అసలు సమస్య ఎక్కడొస్తుంది అంటే మనందరికీ బోధించడం ఇష్టం. మనలో ఆ బోధించే గుణాన్ని నిగ్రహించుకోవాలి. బోధించడం మానుకోవాలి... అవతలి వాళ్లు అడిగితే తప్ప.

పెద్దల ఆదర్శమే పిల్లల పాఠం

ఇంట్లో గాని నర్సరీ స్కూల్లో గాని పిల్లలు ఏం చెయ్యాలో దిక్కుతోచక అల్లరికి దిగితే వెంటనే పెద్దలు వీళ్లకి నియమబద్ధంగా ఏదో పని పెట్టాలి. లేకపోతే గాలి పట్టిపోతారు, అంటుంటారు. పిల్లల మీద నియమబద్దతని ఆపాదించే విషయంలో నేను కొంచెం సంకోచిస్తాను. ఎందుకంటే సామాన్యంగా పెద్దవాళ్లు ఈ మాటని ప్రయోగించేటప్పుడు వాళ్ల మనసులో ఒక్కటే ఉంటుంది - పిల్లల నెత్తి మీద కూర్చుని చచ్చినట్టు వాళ్ల చేత కొన్ని పనులుచేయించడం’.

పిల్లలకి తప్పకుండా ఏకాగ్రత, శ్రద్ధ, ఓర్పు మొదలైన లక్షణాలు అవసరమైన ఆటలు, కార్యకలాపాలు, పరికరాలు, విద్యాసామగ్రి మొదలైన వాటికి ఎవరో ఒకరు పరిచయం చెయ్యాలి. అది వేరు. వాళ్లకి ఇంకా ఇంకా కష్టమైన పనులు ఇస్తూ వాళ్ల చేత బలవంతంగా చేయించడం వేరు. ఎందుకంటే అలా చేయించేటప్పుడు ఆ పనికి ప్రోద్బలం అలా చేయిస్తున్న పెద్దవారి సంకల్ప బలం మాత్రమే. అంతే గాని ఆ ఆట యొక్క, లేదా పని యొక్క స్వతస్సిద్ధమైన లక్ష్యాలు కావు. కాని పిల్లలకి కావలసింది అది కాదు. తమ కన్నా పెద్ద పిల్లలు రకరకాల పనులు, క్రీడలు వారికి వారే ఎంచుకుని, వాటి మీద కొంత కాలం వెచ్చించి, తీరుగా వాటిని పూర్తి చేయడం చిన్న పిల్లలు చూస్తారు. అలాగే వాళ్లూ చేయాలని ఆరాటపడతారు, ఆరంభిస్తారు. తీరుగా, సమర్థవంతంగా పనులు ఎలా చెయ్యాలో పిల్లలు ఇతరుల నిదర్శనాన్ని తీసుకుని నేర్చుకుంటారు. ఒక బొమ్మ కుర్చీ చెయ్యడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత శ్రమ కావాలో, ఎంత కౌశలం కావాలో తెలియాలంటే బొమ్మ కుర్చీ చెయ్యడం చూడాలి. అలాగే ఓ చిత్తరువుని చిత్రించడం. ఓ సైకిలు మరమ్మత్తు చెయ్యడం చూసి, చేసి పిల్లలు విషయాలు నేర్చుకుంటారు. డెన్మార్క్ లో నై లిల్ స్కోల్ ’ అని అద్భుతమైన స్కూలు ఉందని ఇంతకు ముందే ఒక చోట ప్రస్తావించాను. ఆ స్కూలు గురించి ఎన్నో సందర్భాల్లో వ్రాశాను. అక్కడ పని చేసే టీచర్లు ఎన్నో రకాల ఉద్యోగాలు చేసి చివరికి అక్కడికి వచ్చి చేరారు. అన్ని రకాల వృత్తులు, నిపుణతలు నేపథ్యంలో ఉండడం చేత అక్కడి శిక్షణ కూడా ఎంతో వైవిధ్యంతో కూడి ఉంటుంది. ఒకావిడ మంచి గాయని, నర్తకి కూడా. మరొక ఆవిడకి నేత పని తెలుసు. మగ టీచర్లలో ఎంతో మందికి కంసాలి పని, వడ్రంగి పని కూడా తెలుసు. ఒక టీచరు తనకు తానే ఓ లోహపు వయోలా తయారు చేసుకున్నాడు. ఆ కృషిలో కొందరు పెద్ద పిల్లలు కూడా పాల్గొన్నారు. కాస్త చిన్న పిల్లలు ఆ ప్రయత్నానికి ప్రేక్షకులు అయ్యారు. కాస్త సాయం చేశారు కూడా. ఇంకా చిన్న పిల్లలు బుద్ధి పుట్టినప్పుడు అటువైపు ఓ సారి వచ్చి చూసి పోతుండేవారు. మొత్తానికి కొంచెం పెద్దపిల్లల దగ్గర్నుండి అందరి కన్నా చిన్న పిల్లల వరకు అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతోందని తెలిసి అది ఎలా పురోగమిస్తోందో కని పెట్టుకు ఉండేవారు. పిల్లలకి తీరుగా, సలక్షణంగా చేసిన పనులంటే ఇష్టం. అలాంటి పనుల్లో వంట ఒకటి వండుతున్నపుడు గిన్నెలోని పదార్థం రూపు రేఖలావణ్యాలు క్రమంగా మారుతుంటాయి. మునుపు లేని రుచి వస్తుంది. చూస్తేనే నోరు ఊరుతుంటుంది. ఈ పరిణామ క్రమం పిల్లలకి ముచ్చట కలిగిస్తుంది. అలాగే చిన్న చిన్న వస్తువులకి రంగులు వేయడం, చిత్రలేఖనం మొదలైన హస్త కళలు చిన్నప్పట్నుంచీ నేర్చుకోవచ్చు. పిల్లలు చూస్తుండగా పెద్దలు తమ కళలు అభ్యసించాలి. ఏ కళా రాదంటే ఒప్పుకోను. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యాపకం ఉంటుంది. అవసరమైతే నేర్చుకుని పిల్లలకి కనిపించేలా అభ్యసించవచ్చు. అలాంటివి చూసి పిల్లలు క్రమంగా, అప్రయత్నంగా పెద్ద వాళ్ల కార్యకలాపాల్లోకి, వాళ్ల ప్రపంచంలోకి ప్రవేశించగలుగుతారు. ఇలా అంటే తల్లిదండ్రులు ఒక అభ్యంతరం చెబుతారు. “ఒక చిత్రాన్ని గీసినప్పుడు, ఓ శిల్పాన్ని మలచినప్పుడు ఓ తెల్లకాగితం, ఓ బండరాయి క్రమంగా రూపాంతరం చెంది అందమైన ఆకృతిని సంతరించుకోవడం చూస్తాం. కాని మా లాంటివృత్తుల్లో బయటికి చూడ్డానికి అంత విశేషంగా ఏమీ ఉండదు” అంటారు. నేను ఒప్పుకోను. ఉదాహరణలో నా వృత్తినే తీసుకుందాం - రచనా వృత్తి. పైపైన చూస్తే ఈ వృత్తిలో కూడా బయటికి చూడ్డానికి విశేషంగా ఏమీ ఉండదు. కాని కొంచెం పరిశీలించి చూస్తే చాలా ఉంది. రచన అనేది కొంత కాలం పాటు సాగే ప్రక్రియ. ముందుగా ఆ వ్యాసానికో, పుస్తకానికో అవసరమైన మూలగ్రంధాలు తెచ్చుకోవాలి. వాటి నుండి నోట్సు తీసుకోవాలి. క్రమంగా ఓ చిత్తు ప్రతి తయారవుతుంది. దాన్ని దిద్దాలి. మార్పులు చేర్పులు చేస్తూ పోవాలి. చివరికి మ రెవరికైనా ఇచ్చి చదవమనాలి. తర్వాత ప్రూఫ్ రీడింగుకి వెళ్తుంది. ఆ దశ పూర్తయ్యాక ముద్రణకి వెళ్లి, ఏ పత్రికా వ్యాసంగానో, పుస్తకంగానో వెలువడుతుంది. ఈ ప్రక్రియలో ప్రతీ దశలోను రచయితలైన తల్లిదండ్రులు వాళ్లు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, తరువాత ఏం చేయనున్నారో క్లుప్తంగా వివరిస్తూ (పిల్లలు అడిగినంత మేరకు) రావచ్చు. అంత అయ్యాక అచ్చయిన వ్యాసం తెచ్చి పిల్లలకి చూబించొచ్చు. కావాలంటే ఆ వ్యాసరచన కోసం వాళ్లు సేకరించిన సమాచారంతో ఓ పటం లాంటిది తయారు చేసి పని దశలవారీగా ఎలా పురోగమించిందో మామూలు మాటల్లో వివరించొచ్చు. ఇలాంటిది స్కూళ్లలో చేయడం చాలా సులభం. దీని వల్ల విలువైన రచన చేయడానికి ఎంత శ్రమ, సమయం కావాలో పిల్లలకి అర్థం అవుతుంది. ఏ పనైనా కాలానుగతంగా పరిణామం చెందే ఒక ప్రక్రియ అన్న భావన పిల్లలలో కలగడం ముఖ్యం. తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని తమ ఆఫీసులకి తీసుకెళ్లక పోయినా వాటిని పోలిన చిన్న సంస్థలేవైనా ఉంటే తీసుకెళ్ళచ్చు. ఉదాహరణకి ఓ పత్రికా విలేఖరి తన కొడుకుని లేదా కూతుర్ని ఓ చిన్న ముద్రణాలయానికి తీసుకువెళ్లచ్చు. అక్కడ పెద్ద పెద్ద యంత్రాల రొద, అచ్చయిన కాగితం యంత్రాల్లోంచి పొడవైన దుప్పటిలా బయటికి రావడం - ఇవన్నీ పిల్లలకి పెద్ద వింతలా ఉంటాయి. కాని అంత మహమ్మారి యంత్రాలని కూడా తమ తండ్రులు, తల్లులు సునాయాసంగా నియంత్రించడం చూసి, ఏదో ఒక రోజు వాళ్లు కూడా అలా చేయగలరని అనుకుంటారు. పిల్లలకి పెద్దవాళ్లు తమ జీవితాల్లోకి ప్రవేశాన్నివ్వడం పిల్లల అత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

బోధన ఓ ప్రత్యేక శాస్త్రం

పిల్లలకి చదువు చెప్పడం, విద్యారంగంలో వాళ్లు ఎదిగేట్టు చెయ్యడం – ఇది కూడా ఓ ప్రత్యేక శాస్త్రం. ఓ అరుదైన మొక్క పెంపకానికి, లేదా ఓ అరుదైన జంతు జాతి సంరక్షణకి, లేదా డాల్ఫిన్లతోనో, తిమింగలాలతోనో సంభాషించడానికి ఎలాగైతే ఓ ప్రత్యేక శాస్త్రం, ఓ ప్రత్యేక కౌశలం కావాలో పిల్లల శిక్షణకి కూడా ఎంతో ప్రత్యేకమైన శాస్త్రపరిజ్ఞానం కావాలి. అందు చేత ప్రకృతిని నిశితంగా పరిశీలించి, పరిశోధించే శాస్త్రవేత్తలకి ఉండే లక్షణాలే టీచర్లకి కూడా కావాలి. విషయాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి సవివరంగా నమోదు చేసే నైపుణ్యం కావాలి. పందొమ్మిదవ శతాబ్దపు మధ్యదశలో లూయీ అగాస్సీ అని ఓ జంతు శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన క్లాసు మొదలెట్టే ముందు ఓ చేపని తెచ్చి పళ్లెంలో పెట్టి విద్యార్థులని ఆ చేపని వర్ణించమనేవాడు. వాళ్ళు ఆ చేపని ఎగాదిగా చూసి కనిపించిందంతా వివరంగా రాసి తెచ్చి ఇచ్చేవాళ్లు. టీచరు ఆ కాగితాలని పక్కన పెట్టి “ఇంకా?” అనడిగేవాడు. అదే చేపని ఇంకా ఇంకా తరచి తరచి చూడమనే వాడు. వాళ్లు మొదట్లో ఊహించిన దాని కన్నా వంద రెట్ల సమాచారం అందులో కనిపించిన దాకా ఆగొద్దనేవాడు. సూక్ష్మంగా చూసి, చూసిన దాన్ని క్షుణ్ణంగా చెప్పగలగడంలోనే ఉంది. ప్రకృతి శాస్త్రవేత్తల గొప్పదనం. అలా ఓర్పుతో కూడిన పరిశీలనా శక్తి టీచర్లలో కొంచెం అరుదే. కాని ? కొత్త మాటలు నేర్చుకునేటప్పుడు పిల్లలు నేర్చుకునే రెండు ముఖ్యమైన మాటలు ఉన్నాయి. అవి కుడిఎడమ ఈ మాటలు వాటి అర్థాలు పిల్లలు సులభంగానే నర్చుకుంటారు. కాని ఈ విషయంలో తల్లిదండ్రులలో ఆ గుణం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తమ పిల్లలంటే వాళ్లకి సహజంగా ప్రేమ ఉంటుంది, వాళ్ల బాగోగుల మీద శ్రద్ధ ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకి సందర్బోచితంగా ఎన్నో సూచనలివ్వగలరు. తమ అనుభవాలని పిల్లలతో పంచుకోగలరు. వాళ్లు చెప్పేది పిల్లలకి ఎంత వరకు ఉపయోగపడుతోందో చూసి దాన్ని బట్టి వాళ్లు చెప్పేదాన్ని సవరించుకోగలరు. పిల్లలలో కూడా ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రత్యేక పంథాలో నేర్చుకుంటారు. ఒక్కొక్క గతిలో పురోగమిస్తారు. వారి పురోగతిలో మధ్యంతర దశలని ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో చేరుకుంటారు. అన్ని దశలనీ అందరూ ఏక కాలంలో చేరుకోరు. మనం వారి సహజ పరిణామగతిలో కలుగజేసుకుని, వారి విద్యావేగంలో, పురోగమన కాలక్రమంలో మార్పులు తీసుకురావాలని చూస్తే వాళ్ల వేగం ఇంకా తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. ఈ పరిణామాన్ని చిన్న పిల్లల్లో గమనించడం చాలా సులభం. ఎందుకంటే వాళ్లు నేర్చుకునే విషయాలు సులభంగా బయటికి కనిపించే విషయాలు - అక్షరాలు చదవడం, రంగుల పేర్లు, కొత్త పదాలు మొదలైన ప్రాధమిక విషయాలు. ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు పదే పదే మనకి అక్షరాలు అడుగుతున్నాడు అనుకుందాం. వాడు అడిగింది చెప్పడం మానేసి మనం వాణ్ణి తిరిగి ప్రశ్నించి పరీక్ష మొదలెడితే వాడు ఆ అడిగేది కూడా అడగడం మానేస్తాడు. అంటే ఆ క్షణం వాడి పురోగతి నిలిచిపోయినట్టే కదా. చిన్న పిల్లల ప్రవర్తనలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వాళ్ల భావావేశాలని, ఆలోచనలని బయటికి తెలీనీకుండా దాచుకునే చాతుర్యం ఇంకా వాళ్లు అలవరచుకోలేదు. (అసలు పిల్లల భావాలు, ఆలోచనలు, భావావేశాలు, తలంపులు, అంతెందుకు వారి అనుభవమంతా కూడా అడ్డుగోడలు లేని ఓ అఖిల ఘనరాశి.) కొంచెం పెద్ద పిల్లలు వాళ్ల మనోభావాలని దాచుకోగలుగుతారు. కాని కొన్ని సార్లు ఒకటో తరగతి పిల్లలు కూడా భయం కొద్ది విషయాన్ని దాచి, ఏవో కుంటి సాకులు చెప్పి ఎగెయ్యడం నేర్చుకుంటారు. పిల్లలెలా వైఫల్యం చెందుతారు? అన్న పుస్తకం రాయడానికి నేను ఎన్నో నెలల పాటు నా క్లాసులో పిల్లల్ని గమనించి ఎంతో నోట్సు తయారు చేసుకున్నాను. పిల్లలు తమలోని ఆత్మన్యూనతా భావాన్ని కప్పిబుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆ అధ్యయనాలలో స్పష్టంగా తెలిశాయి. కనుక తల్లిదండ్రులు గాని, టీచర్లు గాని, పిల్లల శ్రేయోభిలాషులు గాని వారి కేదైనా చెయ్యాలనుకుంటే లూయీ అగస్సీ వంటి ప్రకృతి శాస్త్రవేత్తల అడుగుజాడల్లో నడిచిన ఎందరో మహానుభావుల ఆదర్శాన్ని తీసుకోవాలి. ఆ కోవకి చెందిన కొనాడ్ లా రె, నికో టిన్బెర్గెన్, జేన్ గుడాల్, ఈ.ఓ.విల్సన్ మొదలైన వాళ్లు ఎందరో ఉన్నారు. లేదంటే నేరుగా పిల్లల దగ్గరికే వెళ్లొచ్చు. విజ్ఞానం’ అనేది కేవలం వైజ్ఞానికుల సొత్తు కాదు. ఏదైనా సమస్యకి పరిష్కారం కోసం శోధిస్తున్న ప్రతీ ఒక్కరూ వైజ్ఞానికులే. అనుక్షణం తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, నిశితంగా పరిశీలిస్తూ, ప్రతిపాదనలు చేసుకుంటూ, ప్రయోగాలు చేస్తూ, పాత సిద్దాంతాలు కూలదోసుకుంటూ, కొత్త వాటికి ఊపిరి పోస్తూ సౌమ్యంగావికాసం చెందే పిల్లల కన్నా గొప్ప వైజ్ఞానికులు ఇంకెవరు?

ఎవరి కుడిచేయి?

కొన్ని స్కూళ్లు చాలా హడావుడి చేస్తాయి. మీ పిల్లలకి మీరే నేర్పండి అన్న పుస్తకంలో ఈ అంశం గురించి చర్చించాను. పిల్లలు కొన్ని సార్లు అక్షరాలని కుడి నుండి ఎడమకి చదివినా, లేదా పదాలనే అలా తప్పు క్రమంలో చదివినా, అలా కుడి ఎడమైతే పొరబాటు లేదన్నట్టు ప్రవర్తిస్తే పెద్దవాళ్లు వెంటనే దానికి ఓ మానసిక ఋగ్మత అని ముద్ర వేసి “మిశ్రమ ప్రాబల్యం” అని, “ఐంద్రియ వైకల్యం” అని, “అభ్యాస బలహీనతలు అని ఏవేవో విచిత్ర పదజాలం ప్రయోగిస్తారు. ఇక దాంతో నిపుణులు రంగప్రవేశం చేసి రాజ్యం చేస్తారు. ఒక సారి ఒక ప్రాధమిక క్లాసు తరగతిలో డెస్కు నుండి ఏదో కావాల్సి వచ్చి ఓ పిల్లవాణ్ణి పిలిచి కొంచెం అది. తెచ్చి పెడతావా అనడిగాను. ఎక్కడుందని అడిగాడు వాడు. డెస్కులో కుడివైపు పైఅరలో ఉందన్నారు. ఒక్క నిముషం ఆలోచించాడు. “ఎవరి కుడివైపు, నాదా, డెస్కుదా?” అడిగాడు వాడు. ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు. ఏమిటి వీడి ఉద్దేశం? కాస్త ఆలోచిస్తే అర్థమయ్యింది. డెస్కు ఈ కుర్రవాడికి ఓ ప్రాణం గల జీవంలా కనిపోస్తుందేమో. “నీ కుడి చేయి” స్పష్టం చేశాను. వెళ్ళి చిటికెలో నేను అడిగింది తెచ్చాడు. జీవం లేని వస్తువుల్లో సజీవతని ఆపాదించే లక్షణం చాలా మంది పిల్లల్లో ఉంటుందని ఆ తర్వాతే అర్థమయ్యింది. అప్పుడు అనిపించింది. ఎంతో మంది పిల్లలకి ఇదే సమస్య ఉన్నా ఆ విషయం బయటికి చెప్పక, స్పష్టంగా అడక్క అవస్థ పడుతుంటారు కాబోలు. మరి సరైన సమాధానం ఏమిటో వీళ్లు ఎలా తెలుసుకుంటారు? అనుభవం మీద తెలుసుకుంటూ ఉండి ఉండాలి. అంటే ముందు డెస్కుయొక్క కుడి అర తీసి చూడ్డం, అందులో లేకపోతే వాళ్ల కుడి చేతి వైపున్న అర తీసి చూడ్డం. అలా అలవాటు మీద మాటకి అర్థం గ్రహిస్తూ ఉంటారు. అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న ఓ చిన్న పాప కూడా అదే పద్ధతి అనుసరించడం ఓ సారి గమనించాను (ఈ విషయాన్ని ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు? అన్న పుస్తకంలో ప్రస్తావించాను.) ఈ పాప భోజనం దగ్గర నాకు ఉప్పు కావాలి, మిరియాల పొడి కావాలి…’ ఇలా నానా పదార్థాలూ కావాలని మారాం చేసేది. పెద్దవాళ్లు అవి తెచ్చిస్తుంటే ఆ మాటలకి అర్థం ఏంటో తెలుసుకునేది. కాని కొందరు పిల్లలు అలా అనుకోరు. పెద్దవాళ్లే డెస్కు విషయంలో పొరబడ్డారు అనుకుంటారు. లేదా ఏది కుడో, ఏది ఎడమో తెలీక వాళ్లే తికమక పడుతున్నారని ఒప్పేసుకుంటారు. తప్పులు జరుగుతాయేమో నని ఊరికే బెదిరిపోయే పిల్లలు వీళ్లు (దానికి కారణం ‘తప్పు జరిగిందో నీ తల వేయి. అని బెదరగొట్టే తల్లిదండ్రులు). ఎక్కడ తేడా వచ్చినా నింద వాళ్ల మీదే వేసుకుని హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకునే తత్వం గల వారు. చాలా మంది పిల్లలకి కుడి ఎడమల విషయం ఓ సమస్యే కాదు. ఎందుకంటే వాళ్లు దాన్ని ఎప్పుడూ నిర్దిష్టంగా గుర్తించరు. మరి కొందరు గుర్తించినా దాని గురించి గాభరా పడరు. దాన్ని వెంటనే చక్కదిద్దేయాలి అని ఆత్రుత పడరు. అదలా ఉందంతే అని ఊరుకుంటారు. కాని మరి కొందరు పిల్లలు తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని అంత సులభంగా విడిచి పెట్టరు. ఎక్కడైనా ఏదైనా సరిగ్గా లేకపోతే దాన్ని సరి చేసినంత వరకు నిద్రపోరు. ఇక మరి కొందరైతే బెదిరిపోతారు, భయపడతారు. ఈ కుడి ఎడమ సమస్య ఇంకా పై తరగతులలోను, ఆ పై జీవితంలో కూడా మారకుండా ఉండే పిల్లలు ఈ కోవకి చెందిన వాళ్లే. కుడి ఎడమలతో పాటు పడలేక కొంత కాలనికి విసుగెత్తి “ఈ కుడి ఎడమల గోలేంటో నాకీ జన్మకి అర్థం కాదు. నేనొట్టి మొద్దుని” అనుకుని రాజీ పడి ఊరుకుంటారు. అందుకని ఎక్కడ ఆ రెండు మాటలు వినిపించినా కంగారు పడతారు. అలాంటి పరిస్థితుల్లోంచి బయట పడడానికి నానా రకాల ఎత్తులు వేస్తారు, వ్యూహాలు పన్నుతారు. ఎక్కడైనా కుడి ఎడమల ప్రసక్తి వస్తే ఆ మాటలకి మరేదైనా కొండగుర్తులు చెప్పమని అడుగుతారు -ఆ కిటికీ దగ్గర బల్ల మీద ఉంది అదా?”

అలాంటి పిల్లలకి మనం ఏం చెయ్యగలం? ముందు చెయ్యకూడని విషయం ఒకటుంది. స్కూళ్లు ఈ పొరబాటు చాలా చేస్తుంటాయి. అదేంటంటే కుడి ఎడమ “సూత్రావళి” ఒకటి తయారు చేసి పిల్లలని యాతన పెట్టడం. ఈ రోజుల్లో ప్రతీ విషయానికి “సూత్రాలు” తయారు చెయ్యడం ఎక్కువవుతోంది. ఉచ్చారణ నేర్చుకోడానికి సూత్రాలు, రంగుల పేర్లకి సూత్రాలు, ఆకృతులు నేర్చుకోడానికి సూత్రాలు... ఈ సూత్రాలు వినా ప్రపంచ చరిత్రలో ఎవడూ, ఏదీ నేర్చుకోలేదన్నట్టు ప్రవర్తిస్తారు ఈ సూత్రకారులు. చేతులున్న బొమ్మలు, చేతుల్లేని బొమ్మలు ఇలా నానా రకాల అభ్యాసాలతో వర్కుబుక్కులు రాస్తున్నారు. కుడి ఎడమల మీద ఏకంగా పరీక్షలు పెట్టి పసివాళ్లని హింసిస్తున్నారు. చాలా మంది పిల్లలు పెద్దగాగ ఇబ్బంది లేకుండానే కుడి ఎడమ తేడాలు నేర్చుకుంటారు. “ఇది నీ కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి.” అని ఒకటి రెండు సార్లు చేస్తే మెల్లగా అర్థం చేసుకుంటారు. పిల్లవాడు ఏమైనా తికమక పడితే  ‘ఇది నీ ఎడమ చెయ్యి అనో ఇది చొక్కా ఎడమ చేయి అనో చిన్న చిన్న ఉదాహరణలు చూబించి చెప్పొచ్చు. మొదట్లో కొంచెం విచిత్రంగా అనిపించినా పిల్లలకి అలవాటు అవుతుంది. లేదంటే మరొకటి చెయ్యొచ్చు. ఒక గుడ్డ మీద చిన్న పిల్లవాడి ఆకృతి గీసి దాన్ని గోడకి ఆన్చి పిల్లవాణ్ణి ఆ చిత్రానికి వీపు పెట్టి నించోమనాలి. బొమ్మలో కుడి ఎడమ పాదాలని సూచించాలి. బొమ్మలో కుడి ఎడమలు పిల్లవాడి కుడి ఎడమలతో ఎలా సరిపోతున్నాయో పిల్లవాణ్ణి స్వయంగా చూసుకోనివ్వాలి. ఇలా చిన్న చిన్న ఆటలాడిస్తూ పిల్లలకు సులభంగా కుడి ఎడమ విచక్షణ నేర్పించొచ్చు.

తప్పులు దిద్దుకోవడం

అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు ఒక ప్రత్యేక వస్తువు పేరుతో ఆ వస్తువు ఏ జాతికైతే చెందిందో ఆ జాతి సమస్తాన్నీ వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకి పచ్చికి మేసే నాలుగు కాళ్ల జంతువులన్నిటినీ ఆవులు(అవి గుర్రాలైనా, గొర్రెలైనా) అంటుంటారు. అలాంటి తప్పులు చక చక దిద్దేయడం మంచిది కాదని నా అభిప్రాయం. ఎందుకంటారా?

1. పొరుగు రాష్ట్రం నుండి ఓ అతిథి మీ ఇంటికి వచ్చాడు అనుకుందాం. వచ్చీ రాని తెలుగు మాట్లాడుతుంటాడు. మీకు నవ్వు వస్తుంటుంది. పాపం సలక్షణంగా మాట్లాడాలనే ఉంటుందా పెద్దమనిషికి. అంచేత ఆయన నోటంట తప్పు దొర్లిన ప్రతీ సారి ఠక్కున సరిదిద్దుతుంటే ఆయన చిన్న బుచ్చుకోడూ? అలా చెయ్యడం మర్యాద కాదు కదా? కాని పిల్లల విషయంలో మర్యాదలకి స్థానం ఏముంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది.

2. కలగాపులగంగా ఉండే దృశ్యప్రపంచం లోంచి ఓ వస్తుజాతిని గుర్తుపట్టి దానికి ఓ పేరు ఉందని తెలుసుకున్న పిల్లవాడు ఓ మహత్కార్యం సాధించినట్టే. ముందు ఆ విజయాన్ని మెచ్చుకోవాలి. పిల్లవాడి స్థానంలో మీరే ఉన్నట్టు ఊహించుకోండి. పరాయి రాష్ట్రంలో ఉన్నారు. కొత్త భాష మట్లాడుతున్నారు. మీరన్న ప్రతీ పొరబాటు మాటని ఎవరో వేలెత్తి చూబిస్తుంటే మీకే మనిపిస్తుంది? అలాగే సాగితే మీరు అసలు మాట్లాడడమే మానేస్తారు. నాకు తెలిసిన ఓ పెద్దమనిషి ఉన్నాడు. ఈయన ఆ రేడు ఏళ్లు మెక్సికోలో ఉన్నాడు. అయినా పట్టున ఓ ఇరవై పదాలు కూడా స్పానిషో మాట్లాడలేడు. అందుకంటే ఒక్క తప్పు కూడా లేదని నమ్మకం కుదిరితేనే నోరు విప్పాలనిఇతడి నియమం.

3. “మరి ఏమీ చెయ్యకపోతే, ఏమీ చెప్పకపోతే పిల్లలు ఎలానేర్చుకుంటారు?” అంటారేమో. సరిగ్గా అ విషయానికే వస్తున్నాను. మనం మామూలుగా మాట్లాడుతూ పోవడమే. పిల్లలకి అంతకన్నా అక్కర్లేదు. పెద్దలు కొన్ని జంతువుల్ని గుర్రాలు అని మరి కొన్నింటిన గొర్రెలు అని అంటుంటే విని పిల్లలు తమ తప్పును సహజంగా, సందర్భోచితంగా దిద్దుకుంటారు. కనుక సారాంశం ఏంటంటే పిల్లల తప్పుల్ని మనం పని కట్టుకుని దిద్దనక్కర్లేదు. ప్రత్యేకించి వాళ్లకి క్లాసులు తీసుకోనక్కర్లేదు.

4. ఎప్పుడూ కూడా పిల్లలకి ఎవరో వచ్చి చెప్పకుండా మెల్లగా వాళ్లంతకు వాళ్లే తెలుసుకోవడం మంచిది. అయితే ఆ తెలుసుకునే ప్రయత్నంలో ప్రమాదం లేకుండా చూసుకోవడం మన బాధ్యత. ఉదాహరణకి రోడ్డు దాటడం వంటి విషయాల్లో పిల్లల్ని తమంతకు తాము తెలుసుకోనివ్వడం’ మంచి పద్ధతి కాదని వేరే చెప్పనక్కర్లేదు. అది తప్ప మనసుకి సంబంధించిన విషయాల్లో ఈ సూత్రం తప్పకుండా వర్తిస్తుంది. ఈ సూత్రాన్ని పాటించడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే తమంతకు తాము తెలుసుకున్న విషయం బాగా గుర్తుంటుంది. రెండవది ఏంటంటే తమంతకు తాము ఏదైనా తెలుసుకుంటే తమ స్వశక్తి మీద నమ్మకం పెరుగుతుంది.

5. లేదు, లేదు మెత్తగా చెబితే నొచ్చుకోరు అనుకోవడం మనని మనం మోసుపుచ్చుకున్నట్లే. పెద్దవాళ్ల విషయంలో ఏదైన తప్ప ఎత్తి చూబించాలంటే ఎంత సౌమ్యంగా, లౌక్యంగా మాట్లాడినా అవతలి వాళ్ల మనసుని నొప్పించకుండా ఉండడం కష్టం. అలాంటప్పుడు ఆత్మాభిమానం, అహంకారం ఇంకా బలహీనంగా ఉండే పిల్లల విషయంలో మనసు నొచ్చుకోకుండా ఎలా ఉంటుంది? ఈ విషయంలో మాత్రం నాకు కొంచెం స్థిరాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సత్యానికి నిదర్శనాలు నా కళ్లతో నేను చాలా సార్లు చూశాను.

6. పిల్లలు నేర్చుకోవాలని కోరుతారు అనడం ఒక విధంగా నిజమే. ఒక విధంగా నిజం కాదు కూడా. పిల్లలు నేర్చుకోవడం అనేది వాళ్లు శ్వాస తీసుకోవడం అంత సహజంగా, సునాయసంగా ఉంటుంది. నేర్చుకోవడం వారి సహజ ప్రవృత్తి. చదువు వారి సహజ ధర్మం. ఈరోజు నేను ఫలానా విషయం నేర్చుకోబోతున్నాను” అనుకుని బయలుదేరరు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని  పరిశీలించడం, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం – ఇదంతా వాళ్లకి స్వభావ రీత్యా వస్తుంది. అలా కాకుండా నేర్చుకోవడం అనేది ఓ ప్రత్యేకమైన, కఠినమైన ప్రక్రియ అనే భావన కలుగజేసి, వాళ్లలో ఆ సహజ క్రియ పట్ల కృత్రిమమైన ఆత్మవిమర్శ కలుగజేస్తే, “నేను నేర్చుకుంటున్నానా లేదా?” అని మనసులో అలజడి పడతారు. ఒక మౌలిక సత్యం ఏంటంటే జీవితం యొక్క తాకిడులకి, ప్రపంచపు స్పర్శలకి గురైన ప్రతి వాడు, ఆ తాకిడులకి, స్పర్శలకి సమర్ధవంతంగా, సముచితంగా స్పందించే ప్రయత్నం చేస్తున్న ప్రతి వాడు, నేర్చుకుంటున్నాడు. అసలు విద్యకి అదే నిర్వచనం. పిల్లలకి ఎలా నేర్పించాలా అని పెద్దలు బుర్రబద్దలు కొట్టుకోవడం వల్లనే ఈ సహజగతి భంగం చెందుతోంది. ప్రపంచం ఓ ప్రమాదకరమైన రంగం అని అనిపించి దాని నుండి పారిపోయి తమ కలుగులో దాక్కోవాలని చూస్తారు. భద్రత కోసం పరితపిస్తారు. ఇకజీవితాన్ని నిండుగా సజావుగా బతకడం మానేసి, బిక్కు బిక్కు మంటూ సంశయంతో బతకడం మొదలెట్టిన రోజు చదువు చచ్చిపోతుంది.

7. ఏ వయసు పిల్లలైనా కొన్ని సార్లు ప్రత్యేక ప్రయత్నం చేసి, ఉద్యమించి ఏదో ఒక విషయం నేర్చుకోవడం చూస్తుంటాము. అంత మాత్రం చేత మనం వెళ్లి సహాయం చేయాలని కాదు. ఉత్సాహం గల పిల్లవాడైతే తనకు తానే చివరికి కష్టపడి నేర్చుకుంటాడు.

మెచ్చుకునే పిచ్చి

పిల్లలు ఏం చేసినా తెగ ముచ్చటపడి, మెచ్చేసుకుని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలని పుస్తాకాల్లో చాలా రాశారు. నన్నడిగితే ఇది పెద్ద పొరబాటు. ఈ విషయాన్ని చాలా ధృడంగా నమ్ముతున్నాను. నేను మొట్టమొదట పని చేసిన ప్రాధమిక స్కూలులో ఈ మెచ్చుకునే పిచ్చి మెండుగా ఉండేది. అలా మెచ్చుకోలు మీద పెరిగిన పిల్లలు ఐదో క్లాసుకి వచ్చేసరికి ఆ మెచ్చుకోలుకి ఎంతగా అలవాటు పడిపోయారంటే, ఎంతగా ఆధారపడడం నేర్చుకున్నారంటే అక్కణ్ణుంచి ఏ పని చేసినా మెచ్చుకుంటారా అని చూడడం, మెచ్చుకోరేమో అని బెంగ పడడం, దాంతోబాటు అనవసరమైన అపరాధ భావన వంటి దోరణులు వారిలో బయలు దేరాయి. చివరికి ఏ లక్ష్యం కోసమైతే స్కూల్లో ఈ మెచ్చుకోలు సాంప్రదాయం మొదలయ్యిందో దానికి సరిగ్గా వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. టీచర్లందరూ పిల్లల ఆత్మవిశ్వాసం పెంచాలని మెచ్చుకున్నా పిల్లల మీద మాత్రం దాని వల్ల దుష్ఫలితాలే కనిపించాయి. పిల్లలు గొప్పింటి బిడ్డలు. తెలివితేటలు ఉన్నవాళ్లు. అయినా కూడా సరిగ్గా ఆ ఆత్మవిశ్వాసమే తీవ్రంగా లోపించింది. నేను చూసినంత మేరకు మెచ్చుకోలు మేలు కన్నా కీడే చేస్తుంది. జీవితమంతా ప్రశంసలు మూటగట్టుకున్న వాళ్లు కూడా తీవ్రమైన ఆత్మన్యూనతా భావంతో మథన పడడం చూశాను. “వాళ్ల పని చేయించుకోడానికి ఊరికే పొగుడుతారు.” అని పిల్లలు ఫిర్యాదు చేయగా విన్నాను. కొందరు పిల్లలైతే ప్రశంస లోని ఉద్దేశాన్ని ఒక పక్క సందేహిస్తూనే మరో పక్క స్తుతిని వాంఛిస్తూ ఉంటారు. ఇంత కన్నా దయనీయమైన స్థితి ఉండదు. బహిరంగమైన ప్రేరణ రెండు రకాలుగా ఉంటుంది. బహుమతులు, బిరుదులు మొదలైన వాటితో ధనాత్మకంగా ఉంటుంది. తిట్లు, తలవంపులు మొదలైన వాటితో ఋణాత్మకంగా కూడా ఉంటుంది. కాని ఈ రెండు రకాల ప్రేరణలతోను వచ్చిన చిక్కేంటంటే అది అంతరంగ ప్రేరణని అణచి వేసి స్థానభ్రంశం చేస్తుంది. పాపాయిలు పెద్దాళ్ల మెప్పు కోసం పాకరు. పాకడం వాళ్ల సహజ ధర్మం కనుక పాకుతారు. వాళ్లు చేసిన ప్రతీ దానికి మనం ప్రశంసిస్తూ ఉంటే ఇక తరువాత ఏం చేసినా, ఏం చదివినా మన ప్రశంస కోసమే చేయడం మొదలెడతారు. ఏం చేస్తే ప్రశంస నిలిచిపోతుందో, శిక్షగా మారుతుందో అని బెంగ పడతారు. పిల్లల పట్ల మనం చూపవలసింది వివేకంతో కూడుకున్న శ్రద్ధ. వాళ్లు చేసే దాన్ని మనం పట్టించుకోవడం అవసరం. దానికి తగినంత విలువ నివ్వడం అవసరం. వాళ్లతో సాదరంగా, సముచితంగా వ్యవహరించడం అవసరం. స్తుతి అనవసరం.

అక్కర్లేని సహాయం

ఈ మధ్యే మా ఆఫీసులో ఓ చిన్న సంఘటన జరిగింది. పిల్లల ఆత్మగౌరవం, అత్మాభిమానం ఎంత పెళుసైనవో, వాటితో వ్యవహరిస్తున్నప్పుడు పెద్దవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పడానికి అదొక చక్కనినిదర్శనం. ఓ రోజు ఓ యువతి తన పద్దెనిమిదేళ్ళ పాపని తీసుకుని నా ఆఫీసు కొచ్చింది. ఆ తల్లి మా ఆఫీసులో పుస్తకాలు తిరగేస్తుంటే పాప ఆఫీసంతా కలయతిరుగుతోంది. చివరికి తల్లి నాలుగు పుస్తకాలు కొనుక్కోడానికి ఎన్నుకుంది. పాప వాటిని మోస్తానని అడిగింది. తల్లి ఇచ్చింది. కాని మోస్తుంటే మధ్యలో ఉన్న పుస్తకాలు జారి పడిపోతున్నాయి. ఇది చూసి పాపకి చికాకు కలిగింది. పాపకి పుస్తకాలు కింద పడిపోవడం ఇష్టం లేదని గమనించి ఓ రబ్బరుబాండుతో దాన్ని కడదామని అనుకున్నాను. ఓ రబ్బరు బాండు తెచ్చి ఒకటి రెండు సార్లు ఆ పాప చూస్తుండగా దాన్ని లాగి, అది ఎలా వ్యాకోచిస్తుందో చూబించి, దాంతో పుస్తకాలు కట్టి ఇచ్చాను. పాప చూసింది. పుస్తకాలు ఇప్పుడు జారడం లేదు. అంతే తన కళ్లంట నీళ్లు బొటబొట కారాయి. ఎన్నో ఏళ్లుగా పిల్లలని గమనిస్తూ ఉండడం వల్ల నాకు విషయం అర్థమయ్యింది. నేను పుస్తకాల చుట్టూ రబ్బరు బండు పెట్టి పుస్తకాలు జారిపోకుండా చెయ్యడం ఆ పాప అశక్తత మీద ఎత్తిపొడుపులా స్ఫురించిందా పాపకి. “నేను రబ్బరు బాండు కట్టకపోతే నువ్వా పుస్తకాలు మోయలేవు సుమా!” అని అంటున్నట్టు అనిపించింది. కించపరిచినట్టు అయ్యింది. దాంతో కోపం వచ్చింది. విషయం అర్థమయ్యి తప్పు సరిదిద్దుకున్నాను. “అయ్యో! సరే అయితే. రబ్బరు బాండు తీసేస్తున్నా!” అంటూ రబ్బరు బాండు తీసేశాను. వెంటనే పాప ఏడుపు ఆపేసింది. అయినా ఇంకా బిక్క మొహంతోనే ఉంది ఎందుకంటే నిజానికి ఆ సమయంలో పాపకి ఆకలి కూడా వేస్తోంది. దాంతో కొంచెం తిక్కగా కూడా ఉంది. కాని బాగా ఆలోచిస్తే నేను చేసింది తప్పు కాదనిపించింది. పుస్తకాలు జారిపోతూ ఉండడం ఆ పాపకి ఇబ్బంది గానే ఉంది. బహుశ అలా ఆకలిగా లేకపోయుంటే,  తిక్కగా లేకపోయుంటే, నాలా కొత్త మొహం కాక ఎవరైనా తెలిసిన వాళ్లు అయ్యుంటే సముఖంగా స్పందించేదేమో. ఆ రబ్బరు బాండు తనే తీసుకుని ఆడుకునేదేమో. కాని ఆకలి, తిక్క, కొత్తదనం, పుస్తకాలు చేతిలో నిలవడం లేదన్న ఉక్రోషం ఇవన్నీ కలిసి నేను అందజేయబోయిన సహాయానికి అలా వ్యతిరేకంగా స్పందించేట్టు చేశాయి. నేను వెంటనే నా సహాయాన్ని ఉపసంహరించుకున్నాను. తన ఇబ్బంది నాకు అర్థం కావడం గుర్తించి పాప కూడా వెంటనే ఏడుపు ఆపి మళ్లీ తన ధ్యాసలో పడిపోయింది. అలా కాకుండా నేను రెట్టించి, బలవంతం చేసి ఆ రబ్బరు బాండు అలాగే ఉండాలి అని పట్టుబడితే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. పెద్దగా ఏడుపు అందుకుని చాలా మారాం (ఆ పదం నాకు నచ్చదు) చేసి ఉండేది. పిల్లలకి అనవసరమైన సహాయాన్ని అందించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో వివరిస్తూ ఒక స్త్రీ నాకు చక్కని ఉత్తరం రాసింది. ఆవిడకు నలుగురు మగపిల్లలు. ఒకసారి ఆవిడ వాళ్లబ్బాయిలకి ఓ పెద్ద జిగా పజిల్ కొనుక్కు వచ్చిందట. అదొక ప్రపంచ పటం. దాంతో పాటు దాన్ని ఎలా వాడాలో సూచనలు ఉన్నాయి. ఒక బాధ్యతగల తల్లిగా ఆమె ఆ సూచనాలన్నీ అధ్యయనం చేసి, అందులో పొందుపరచబడ్డ శిక్షణా పద్దతులన్నీ ఆకళింపు చేసుకుని పిల్లలతో చేయించడానికి ఉపక్రమించింది. తరువాత జరిగిందేంటో ఆమె ఉత్తరంలోనే ఉంది. ఒకసారి కేల్ (అప్పటికి ఆ రేళ్లవాడు) పజిల్ బయటికి తీసి ఆడుతున్నాడు. పజిల్ ముక్కల్ని నేల మీద పేర్చి దక్షిణ అమెరికా ఖండాన్ని అమరుస్తున్నాడు. అంతలో పదమూడేళ్ళ జా రెడ్ రెండవ ప్రపంచ యుద్ధం గురించి బాగా తెలిసిన వాడు గనుక వచ్చి జర్మనీ, జపాన్ దేశాల ముక్కలు బయటికి తీశాడు. ‘ఇదుగో చూడండి! ఈ రెండు దేశాలూ మిగతా ప్రపంచం అంతటితో పోరాడి ఇంచుమించు విజయం సాధించాయి అన్నాడు. అంతలో పదకొండేళ్ల కామ్ ‘ఏయ్! నువ్వు ఆసియా ఖండం, కమ్యూనిస్టు దేశాలు ఎక్కడున్నాయో పట్టుకోగలవా? అని సవాలు చేశాడు. జారెడ్ మళ్లీ తన ప్రపంచ యుద్ద కథనం మొదలెట్టాడు. ఇంతలో తల్లి ఆటని అలా ఆడాలి, ఇలా కాదు అంటూ వచ్చి కలుగజేసుకుంది. కొద్ది నిముషాల తరువాత కామ్ వంటగదిలోకి వెళ్లిపోయాడు. కేల్ బయటికి వెళ్ళి ఆటలో పడ్డాడు. ఇంట్లో ఆ తలి ఒక్కర్తీ పజిల్ అంతా పేర్చుకుంటూ కూర్చుంది.” అయ్యో! అలా జరిగిందా తల్లీ! కాని ఇక్కడ ఒక మంచి వార్త ఏంటంటే ఆ తల్లి ఈ సంఘటన నుండి ఒక పాఠం నేర్చుకుంది. అందుకే నాకు ఉత్తరం రాసింది. ఆ తరువాత ఎప్పుడో అప్పుడు ఆ తల్లీ కొడుకులు అందరూ కలిసి పజిల్ పూర్తి చేసే ఉంటారని ఆశిద్దాం. ఈ వృత్తాంతం వలన మనకొక ముఖ్యమైన విషయం అర్థమవుతోంది. పిల్లల ఆటల్లోను, చదువులోను అతిగా కల్పించుకోవడం వల్ల వాళ్ల పురోగతి నిలిచిపోతుందని ఎంతో మంది తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. మరి స్కూళ్లలో పాఠాలు నేర్పే టీచర్లు ఈ విషయం ఎందుకు గ్రహించలేక పోతున్నారు. దానికి కూడా సమాధానం ఉంది. పైన చెప్పుకున్న జిగా పజిల్ ఉదంతంలో పిల్లలకి నచ్చకపోతే బయటికి వెళ్ళిపోయే స్వతంత్రం ఉండబట్టి వాళ్లకి ఆ ఆట నచ్చలేదని తల్లికి తెలిసింది. అలా కాకుండా స్కూల్లోలాగ తప్పనిసరిగా ఆ ముక్కలన్నీ ఓ హోమ్ వర్కులా అమర్చవలసి వస్తే బయటి కేం కనిపించదు. అదే జరిగిన పక్షంలో పిల్లలు వీలైనంత తక్కువ పని చేసి బయటపడాలని చూస్తారు. లేదంటే హాయిగా దిక్కులు చూస్తూ కూర్చోవడమో, చేసేశామని దబాయించడమో, ఎలా చెయ్యాలో తెలీలేదండీ టీచరు గారండీ అని వినమ్రంగా  పని ఎగ్గొట్టడమో, లేదా తప్పు తప్పుగా చేసి టీచరుకి ఒళ్లు మండేట్టు చేయడమో చేసి ఉండేవారు. కాని ఈ చర్యలన్నీ కూడా పైపైన చూస్తే పాపం పిల్లలు ఏదో ప్రయత్నిస్తున్నారు అన్న భావన కలుగ జేస్తాయి కనుక టీచరుకి (సూక్ష్మ బుద్ధి కలవారైతే తప్ప) అసలు రహస్యం అర్థం కాదు. వాక్స్వాత్రంత్ర్యం లేని ప్రేక్షకుల నుండి ఎప్పుడూ ఎలాంటి స్పందనా ఉండదు. మీరు ఒక హోటలు నడుపుతున్నారు అనుకుందాం. ఒక రోజు ఎప్పుడూ వండిన వంటలతో బాటు చేపల పులుసు వడ్డించేరు అనుకోండి. జనానికి అది నచ్చిందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. అదే మిలిటరీ హాస్టలు మెస్సయితే ఏం పెట్టినా చచ్చినట్టు తినాలి కనుక తెలీదు. అయితే మీరు ఎంగిలి పళ్లేల్లో ఏం మిగిలిందో కొంచెం పరీక్షగా చూస్తే మిగిలపోయిన చేప ముక్కల్ని బట్టి అది నచ్చలేదని తేలుతుంది. సూక్ష్మ దృష్టి గల తల్లిదండ్రులు ఎంగిలి పళ్లేల్లో’ ఏముందో పట్టేస్తారు. మొదట్లో పొరబాట్లు చేసినా తమ పిల్లల స్పందన బట్టి వాళ్లు నేర్పించేది ఎంత వరకు మేలు చేస్తోందో, ఎంత మేరకు కీడు చేస్తోందో తెలుసుకుని మసలుకుంటారు.

ఒక చిన్న సూక్ష్మం

అనవసరమైన సహాయం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తల్లిదండ్రులతో చెప్తే మరి ఏది అవసరమో, ఏది అనవసరమో ఎలా తెలుస్తుందండీ? అని అడుగుతారు. మీ పిల్లల స్పందనే దానికి సమాధానం అంటాను నేను... ఆ విషయాన్ని పిల్లలు మాటలతో బిగ్గరగా చెప్పకపోవచ్చు. వాళ్ల చర్యల బట్టి వారి నుండి మౌనంగా వచ్చే సందేశాలని పెద్దలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ‘ఇంక నువ్వు చెప్పొద్దు, నేనే చదువుకుంటాలే’ అంటే బాధపడకుండా ఉండడం నేర్చుకోవాలి. వాళ్లే చదువుకుంటాం అన్నప్పుడు దాని గురించి హడావుడి చెయ్యకుండా వాళ్లంతకు వాళ్లని చదువుకోనివ్వాలి. వాళ్లు అలా అన్నందుకు, మన సహాయాన్ని తోసిపుచ్చినందుకు కోపగించుకో కూడదు. ‘ఎంత పొగరు!అని బెత్తం చేతిలోకి తీసుకోకూడదు. అయితే కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే పిల్లలు ఏదో ప్రశ్న అడుగుతారు. పెద్దవాళ్లు దానికి సమాధానం చెప్పి ఆ సమాచారాన్ని పరిపూర్ణం చెయ్యడానికి ఇంకా ఎన్నో చెప్పాలనుకుంటారు. ఇక్కడే వస్తుంది చిక్కు. ఒక పిల్లవాడితో వ్యవహరించే టప్పుడు మనం అనేది, చేసేది అంతా బోధనా చింతతో చేసేది అయితే, ఇదే అదనుగా తీసుకుని వీడికి మరి నాలుగు విషయాలు ఎలా బోధించాలి? అన్న ఆలోచన ఎప్పుడూ నేపథ్యంలో ఉంటే ఇల్లు కూడా స్కూల్లా తయారవుతుంది. ప్రతీ మాటలోను పాఠం ఉండనక్కర్లేదు. ఉండరాదు కూడా. అయితే ఈ రెండిటి మధ్య వాసి చాలా చిన్నది, సూక్ష్మమైనది. ఇప్పుడు నా మిత్రులతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్లకి తెలిసినవి నాకు తెలియనివి ఏవైనా చెప్తే ఆసక్తికరంగా వింటాను. అలాగని సంభాషణ అంటే అవతలి వాళ్లని చవటల కింద జమకట్టి ఉపన్యాసాలు ఇచ్చే ధోరణి అంటే ఎవరికీ గిట్టదు. బాగా చిన్న పిల్లలైతే మీరు ఏం చెప్పినా వాళ్లకి విచిత్రంగానే ఉంటుంది. కాని వాళ్లకి కొంచెం వయసు వచ్చాక మీరు మీ తోటి వాళ్లతో ఎలా మాట్లాడాతారో గమనిస్తారు. కనుక మీరు పిల్లలతో మాట్లాడేటప్పుడు స్వరం మార్చి అధికార దర్పం వంటివి కనబరిస్తే పిల్లలు సులభంగా పట్టేస్తారు. పిల్లలతో ఆడుకునేటప్పుడు కూడా ఈ పొరబాటు చేసే అవకాశం ఉంటుంది. ఏదో కొత్త ఆట, సరదాగా ఉంటుంది అని కలిసి ఆడడం వేరు. ఇదుగో అలా కాదు, ఇలా ఆడాలి అని వాళ్ల ఆటని అణువణువునా నియంత్రించడం వేరు. పిల్లలు స్వయంగా, “అరే! తమాషగా ఉంది. మళ్లీ చేసి చూపించవూ?” అని అడిగితే సరే. లేకపోతే అతి చొరవ (దుడుకుతనం) కూడదు. సలహా ఇవ్వడం తప్పు కాదు. కాని ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీస్కోవాలి. అది నిజంగా ఆజ్ఞ కాక సలహా మాత్రమే అయితే దాన్ని త్రోసిపుచ్చే స్వాతంత్రం పిల్లవాడికి ఉండాలి. పిల్లవాడు దాన్ని పాటించడానికి సిద్ధంగా లేకపోతే, లేదా పాటించిన ఉత్సాహం లేకుండా అనుకరిస్తే ఆ విషయాన్ని ఇక అక్కడితో మరచిపోవడం మేలు. బలవంతం మీద చేయిస్తూ పోతే ఎప్పటికో అప్పటికి వాడికే నచ్చుతుందిలే అన్న సిద్ధాంతంలో బలం లేదు. పిల్లల నుండి “వద్దు” అన్న జవాబుని సమ్మతించే ఔదార్యం పెద్దవాళ్లకి ఉండాలి. పిల్లలు మాట విననప్పుడు, పెద్దలు నిరుత్సాహ పడినట్టు, బాధపడినట్టు కనిపిస్తే, అలా వరుసగా కొన్ని సార్లు జరిగితే పిల్లలు ఇలా ఆలోచిస్తారు -అయ్యో! అమ్మా నాన్నలు చెప్పింది చెయ్యకపోతే బాధపడతారు.” ఇలా పిల్లల మీద మమకారంతో ఒత్తిడి తెచ్చి వాళ్ల విధేయతని సాధించడం ఇంకా ఘోరం. పిల్లలు తమ సలహాలని కాదన్న ప్రతీసారి లోలోపల బాధ పడేకన్నా పెద్దవాళ్లు సలహాలు ఇవ్వకపోవడమే మేలు. ఆటల్లో ఇచ్చే సలహాలైతే పిల్లలు వినే అవకాశం ఎక్కువ. అలాగని సలహాలు మరీ అతిగా ఇవ్వడం కూడా మంచిది కాదు. పిల్లలకి అన్నీ మనమే ఆలోచించి పెడితే వాళ్లకి ఇక ఆలోచించకోవడానికి అవకాశం ఉండదు. మంచి మంచి ఆలోచనలన్నీ ఎప్పుడూ పెద్దవాళ్లకే వస్తాయన్న భావన కలిగి అతిగా పెద్దవాళ్ల మీద ఆధారపడానికి అలవాటు పడతారు. పిల్లలని అప్పుడప్పుడు ఆడించాలి. నిజమే. కాని ఎప్పుడూ పాఠాలు చెప్పే కార్యక్రమం వదిలి, ఎప్పుడూ ఆటలు ఆడించే కార్యక్రమంలోకి దిగడం కూడా అంత మంచి పని కాదు. కనుక ప్రతీ విషయంలోను మధ్యేమార్గంలో పోవడం శ్రేయస్కరం.

ఆధారము:-చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate