పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ది మార్షియన్

"ది మార్షియన్" అనే సినిమా కథ.

dec16చెకుముకి బాలలూ! చంద్రుడి తర్వాత మానవ ఖగోళ విజ్ఞానాన్ని పెంచిన ఖగోళ వస్తువు కుజ గ్రహమే. దీనినే అంగారక గ్రహం అని కూడా అంటారు. ఇంగ్లీషులో దీనిని Mars అంటారు. ఆ మధ్య మన ISRO వాళ్లు మంగళయాన్ పేరుతో అంగారక గ్రహం మీదకు, నౌకను పంపి పరిశోధనలు చేశారు. సూర్యుడి నుంచి 4వ గ్రహంగా, మన భూమి తర్వాత తదుపరి గ్రహంగా కుజగ్రహం ఉంది. దానిమీదకు వెళ్ళిన వ్యోమగాముల కథాకమామీషును ది మారియన్ (The Martian) అనే పేరుతో రిడ్లీస్కాట్ (Ridley Scott) అనే ప్రసిద్ధ హాలీవుడ్ దర్శక నిర్మాత నిర్మించాడు. మాట్ డామన్ (Matt Damon) కథానాయకుడుగా నిర్మించిన ఈ చిత్రాన్ని సైన్సుఫిక్షన్ సినిమాలలో ఓ అద్భుత సినిమాగా దీనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఈ సినిమా చూడ్డం ద్వారా మనకు కుజగ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులు, నేల స్వరూపం తెలియడంతో పాటు, పొరపాటున అక్కడ తప్పిపోతే బ్రతికి బయటపడడం ఎంత కష్టమో తెలియజేసే సాహసగాధ ఈ సినిమాలో ఉంది. వైజ్ఞానిక కాల్పనిక చిత్రమే అయినా శాస్త్రీయ అంశాలకు వ్యతిరేకంగా ఏ దృశ్యమూ లేకపోవడం వల్ల మీకు ఆ సినిమా గురించి టూకీగా చెప్పాలనుకొంటున్నాను. అడపాదడపా అది టీవీ సినిమాలలో కూడా వస్తోంది. YouTube లో కూడా మొత్తం గానీ కొన్ని అద్భుత దృశ్యాలనుగానీ చూడగలరు.

కథ: నవంబరు నెల 25వ తేదీన మార్స్ గ్రహం మీద కొందరు వ్యోమగాములు పరిశోధనలు చేస్తుంటారు. మార్స్ గ్రహం మీద ఆక్సీజన్, నీరు లేవని మీకు తెలుసనుకుంటాను. కాబట్టి వారందరు పరిశోధనశాల నుండి బయటికి వస్తే వ్యోమవస్త్రాలు ధరించాలి. ఆక్సీజన్ సిలెండర్ వీపున తగిలించుకోవాలి. అలా అందరూ బయట పరిశోధిస్తుండగా ఉన్నట్టుండి పెద్ద మట్టి తుఫాను సంభవిస్తుంది. ఆ వ్యోమగాముల్లో ఒకరయిన మార్క్ వాట్నీ (పాత్రను పోషించినది మాట్ డామన్) తప్పిపోతాడు. ఎంతసేపు చూసినా వాటీనుంచి సంకేతాలు రాకపోవడం వల్ల అతడు చనిపోయాడనుకొని మిగిలిన వ్యోమగాములు Mars Ascent Vehicle (MAV) లో తిరుగు ప్రయాణం చేపడతారు. నిజానికి వాట్నీ వస్రాలో ఉన్న రేడియో పరికరం చెడిపోవడం వల్ల వారికి సంకేతాలు రాలేదు.

dec17తుఫాను వెలిశాక చూస్తే ఎవరూ ఉండరు. ఒక్కడే ఏకాకిగా అక్కడ ఉండి పోతాడు. తనదగ్గరున్న ఆక్సీజన్ ఇక సంవత్సరం కూడా రాదు. ఆహారం రెండు మూడు నెలల కన్నా మించిలేదు. తనకున్న ఏకైక మార్గం ఒక్కటే. అప్పట్నుంచి 4 సంవత్సరాల తర్వాత అతడున్న చోటుకి షుమారు 3,200 కి.మీ. దూరంలోకి (2039 సం.) రాబోతున్న మరో వ్యోమనౌక కుజగ్రహ పరిశోధనకు పరిశోధనా బృందం వస్తుంది. మరి అందాకా బ్రతికేదెలా? ఉన్న ఆహారం, ఆక్సీజన్ అంతవరకు సరిపోవు కదా!

వాట్నీ తెలివైన వ్యోమగామి, అతడు నిజానికి వృక్షజీవ శాస్త్రవేత్త (Botanist) వ్యోమగాములు నిర్మించుకొన్న గుడారంలో ఉన్న రాకెట్ ఇంధనమయిన హైడ్రోజనును, శ్వాసక్రియ కోసం ఉపయోగించే అదనపు ఆక్సీజన్ సిలండర్లలోని ఆక్సీజనను జాగ్రత్తగా కలిపి నీటిని తయారు చేస్తాడు. మార్స్ మట్టితో చిన్నపాటి పొలం (కొన్ని చదరపు అడుగులు మాత్రమే! నిర్మిస్తాడు.

తన దగ్గర ఉన్న కొన్ని బంగాళా దుంపల్ని తన మూత్రము, మలము, ఎరువులుగా పాడి ఆ పొలంలో కూరగాయలను పండించి, వాటిని తిని బ్రతుకుతుంటాడు.

గతంలో మార్స్ మీదకు పంపిన పాత్ ఫైండర్ అవశేషాల దగ్గరకు పోయేందుకు తమ గుడారంలో ఉన్న వస్తువులతో కుజగ్రహం మీద నడిచేలా రోవర్ ను నిర్మిస్తాడు. అందులో ఉన్న పరికరాలతో కెమెరా, ఆంటెన్నా సాయంతో హెక్సాడెసిమల్ పద్ధతిలో భూమి మీదకు సంకేతాలను పంపుతాడు. ఆ సంకేతాలను పసిగట్టిన NASA శాస్త్రవేత్తలు వాట్నీ బ్రతికే ఉన్నాడని తెలుసుకుంటారు. కుజగ్రహం చుట్టూ తిరుగుతూ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న Aris III వ్యోమగాములకు NASA నాయకులలో మానవత్వ ధోరణి ఉన్న వ్యక్తి వాట్నీ బ్రతికే ఉన్నాడన్న సమాచారం తెలుపుతాడు.

కానీ Aris III తిరిగి కుజగ్రహం మీదకు వచ్చేలా సాంకేతిక గాని, సామాగ్రి గానీ లేవు. MSV కూడా చెడిపోయి ఉంది. ఇక మిగిలించి ఒకటే మార్గం. Aris III కొంత దూరం కుజగ్రహం వైపు ప్రయాణించాలి. అలాగే వాట్నీ కూడా అంతరిక్ష ప్రయాణం ద్వారా మధ్యలో Aris IIIకి చేరుకోవాలి. ఇదెలా సాధ్యం?

వాట్నీ తన సునిశితమయిన తెలివితో తన దగ్గర, పాత్ ఫైండర్ దగ్గర, గుడారంలోపల ఉన్న వస్తువులను ఉపయోగించి ఓ చిన్నపాటి రాకెట్ ను తయారు చేస్తాడు, Aris III కుజగ్రహం వైపు, వాట్నీ వాహననౌక Aris III వైపు ప్రయాణిస్తాయి. అయితే ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరం ఉండగానే వాట్నీ రాకెట్ తునాతునకలవుతుంది. ఇక పోరాడితే పోయేదేమీ లేదు. సాహసం చేసి జయప్రదం అయితే జీవం లేదంటే మరణం అనుకుంటూ తన వ్యోమవస్త్రానికి చిల్లు పెడతాడు. అందులో ఉన్న గాలి బెలూన్లోంచి బయటికి వచ్చినట్లు వేగంగా రావడం వల్ల న్యూటన్ గమన సూత్రం ప్రకారం వేగంగా వెళ్ళి Aris IIIలో పడతాడు. ఆ విధంగా రక్షించబడ్డ వాట్నీ తిరిగి భూమిని చేరుకుంటాడు.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

2.99157303371
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు