పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

నమిలే జిగురు బుడగల బంక

మరి ఈ చూయింగ్ గం, బబుల్ గం గురించి తెలుసుకుందాం.

july3నమిలే జిగురు, బుడగల బంక తమాషాగా వుంది కదూ? ఓ టి.వి. ప్రకటనలో ఆవు గబగబా నములుతూ నెమరువేస్తూ 'ఈ' అని పళ్ళికిలించి తెల్లని పళ్ళను చూపుతుంది. గమనించారా? అది నమిలింది. ఏమిటో తెలుసా? చాలా మంది పిల్లలు, యువకులూ టి.వి. చూస్తూనో, టూరులో వెలుతూనో అదే పనిగా నములుతుంటారు నిర్విరామంగా... ఏమిటో తెలుసా? కొంతమంది నములుతూ అప్పుడప్పుడు బుడగలు ఊదుతూ ఉంటారు. అవి టప్ మని పగలకొడుతూ, నములుతూ ఉంటారు. ఏమిటో తెలుసా? ఆ అదే నమిలే జిగురు - చూయింగ్ గం - బుడగల బంక – బబుల్ గం. అదన్నమాట. మరి ఈ చూయింగ్ గం, బబుల్ గం గురించి ఈ మాసం తెలుసా-తెలుసా లో తెలుసుకుందాం.

5 వేల సంవత్సరాలకు ముందే నియోలిథిక్ కాలంలోనే చెట్టు బెరడు నుండి వచ్చే జిగురుతో చూయింగ్ గం తయారు చేసి వాడినట్లు ఫిన్లాండులో త్రవ్వకాలలో బయటపడింది. ఈ చూయింగ్ గం ఔషధ గుణాలను కలిగివుండేది. పురాతన అజ్టిక్ వాసులు ఒకరకమైన చెట్టు నుండి కారే పాలలాంటి ద్రవం 'చికెలో (chicle) ను ఉపయోగించి బంక (Gum) లాంటి పదార్థాన్ని తయారుచేసి మహిళలు నోటి దుర్వాసనను నివారించడానికి వాడేవారు (Freshener).

పురాతన గ్రీకు ప్రజలు కూడా రకరకాల చూయింగ్ గం ను వాడినట్లు ఆధారాలు వున్నాయి. వారు చెట్టు నుండి కారే గం (Mastic) ను చూయింగ్ గం గా వాడేవారు. రెడ్ యిండియన్లు స్ప్రూస్ (spruce) చెట్టు నుండి ద్రవం (Sap) ను సేకరించి దానితో చూయింగ్ గం తయారు చేసుకునేవారు.

క్రీ.శ. 1848లో జాన్ బి కర్టీస్ అనే అతను మొదటి వాణిజ్య పరమైన చూయింగ్ గం తయారు చేసి అమ్మాడు. దాని పేరు 'ది స్టేట్ ఆఫ్ మెయిన్ ఫ్యూర్ స్ప్రూస్ గం’. 1850లో పారఫిన్ మైనము (wax)తో తయారుచేసిన చూయింగ్ గం తయారయ్యింది. ఇది స్ప్రూస్ చూయింగ్ గం ను త్రోసి రాజని ప్రజాదరణ పొందింది. 1869 డిసెంబర్ 28న విలియం సెంపిల్ అనే ఆయన చూయింగ్ గం తయారీ కోసం మేథోపరమైన (Patent right) హక్కును పొందాడు.

1892లో చికాగోలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చూయింగ్ గం కంపెనీ WRINGLES స్థాపించబడింది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో ఈ కంపెనీ సైనికులకు చూయింగ్ గం ను ఉచితంగా సరఫరా చేసేవారు. Wringles చూయింగ్ గంను నములుతూ వుండడం ఆనాటి సైనికులకు ఓ ఫ్యాషన్ అయింది. ఈ చూయింగ్ గం నమలడం వల్ల వత్తిడి నుండి ఉపశమనం కలిగేది, పొగత్రాగడానికి ప్రత్యామ్నాయంగా వుండేది.

ఇక అసలు విషయం బుడగల బంక Bubble gum కు వస్తాం. Fleer అనే చూయింగ్ గం కంపెనీకి చెందిన వాల్ట్ ఇ. డీమర్ అనే అతను 1928లో కొత్త రుచులు గల చూయింగ్ గం కోసం కొన్ని పదార్థాల మిశ్రమంతో ప్రయోగాలు చేస్తున్నాడు. ఒక రకమైన మిశ్రమం సాధారణ చూయింగ్ గం కంటే తక్కువ బంకతో సులభంగా సాగే గుణం చూపింది. ఈ మిశ్రమం గల చూయింగ్ గం బుడగలు ఊదేటందుకు చాలా అనువుగా వున్నది అని వాల్ట్ కనుగొన్నాడు. Fleer కంపెనీ ప్రెసిడెంటు ఈ బుడగల చూయింగ్ గంని Double Bubble అని పేరు పెట్టి మార్కెట్లో విడుదల చేసాడు.

Double Bubble చూయింగ్ గం ను పింక్ రంగులో తయారు చేస్తారు. ఎందుకంటే అప్పుడు వారి దగ్గర ఆ రంగు మాత్రమే తయారుగా వున్నదట. కొంత మంది ఉద్యోగులకు Fleer కంపెనీ వారు డబుల్ బబుల్గంలో బుడగలు ఎలా ఊదాలో ప్రత్యేక శిక్షణ యిచ్చి ఆంగళ్ళ దగ్గర ప్రదర్శన ఏర్పాటు చేసారు. దాంతో జనం ఈ కొత్తరకం డబుల్ బబుల్ గంను తినడం (నమలడం) ఎక్కువ అయింది. బుడగలు ఊదటం అలవాటయింది. రెండవ ప్రపంచయుద్ధం తరువాత ... బబుల్ గం మార్కెట్ ప్రవేశం చేసేవరకు డబుల్ బబుల్ గం మాత్రమే అందుబాటులో వుండేది.

ఆధునిక చూయింగ్ గం ను ‘చికిల్' ఉపయోగించి తయారు చేసేవారు. తరువాత సహజ రబ్బరు ఉపయోగించేవారు. కానీ దీనికై చాలా రకాలయిన శుభ్రత పరీక్షలు అవసరం. కృత్రిమమైన , సింథటిక్ రబ్బరు కనుగొన్న తరువాత 'చికెల్' వాడకం తగ్గిపోయింది. కృత్రిమమైన సింథటిక్ గంలో అనుమతింపబడిన హైడ్రో కార్బన్లు, స్టెరీన్ బ్యూటడైన్ రబ్బరు, ఐసోబ్యుటలీన్, పారఫీన్ వాక్స్, పెట్రోలియం వాక్స్లు వుంటాయి.

వివిధ కంపెనీలు తయారుచేసే చూయింగ్ గం ఉపయోగించే పదార్థాలు చాలా గోప్యంగా వుంచుతారు. చాలా వరకు అన్ని చూయింగ్ గం/బబుల్ గం లలో ప్రాథమికంగా జిగురు మూల పదార్థం, మొత్తపరిచే పదార్థం, తీపి మరియు రుచి కలిగించే పదార్థాలు వుంటాయి. నములుతూ వున్నప్పుడు గం గట్టిపడి పొడిపొడిగా మారకుండా వుండేందుకు గ్లిజరిన్ లేక కూరగాయల నూనె (vegetable oil) వాడతారు. తీపికొరకు జున్ను రసం, గనిసిగడ్డల రసం, చక్కెర వాడుతారు. సింథటిక్ తీపి పదార్థాలయిన Xylitol, Serbitol, Mani aspartame లను వాడుతారు. రకరకాల రుచుల కోసం క్రింది విధంగా రసాయనాలు వాడుతారు.

రసాయనం

స్ట్రాబెర్రీ - మిథైల్ ఫినైల్ గైసిడేట్

బనానా - ఐసోమైల్ అసిటేట్ లైమొనైన్

ఆపిల్ - మాలిక్ ఆసిడ్

పైనాపిల్ - అల్లి హెక్సోనేట్

ఫ్రూట్ పంచ్ - ఇథైల్ ప్రొపినేట్

పట్ట - సిన్నమిక్ ఆల్డిహైడ్

చెర్రి - అరటిఫినోన్

పైన చెప్పినట్టు రకరకాల పళ్ళ రుచుల కోసం అనేక రసాయనాలు వాడుతున్నారు. వేల సంవత్సరాలుగా చూయింగ్ గం అందరికీ ఇష్టం. వాటివల్ల లాభాలు, నష్టాలు వున్నాయి. లాభాలు ఏమిటంటే, మొదటగా దీని రుచుల వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే దుర్వాసన తగ్గుతుంది. నమలడం వల్ల లాలాజలం (సలైవా) ఊరి పళ్ళను శుభ్రపరుస్తుంది. కాస్త ఆకలిగా వుంటే... ఇది నమిలితే ఉపశమనం కలుగుతుంది. పళ్ళలో గుంటలు ఏర్పడకుండా కాపాడుతుంది.

తీపి కోసం వాడే Xylitol పళ్ళకు స్నేహకారిగా మారి పళ్ళలో వుండే మైక్రో ఆర్గానిజంలను చంపుతుంది. ఇక నష్టాలు. అదే పనిగా చూయింగ్ గమ్ నమలడం వల్ల కొంతమందిలో దవడలలో ఓ రకమైన శబ్దం రావడం మొదలవుతుంది. దవడ కండరాలలో ఇదివరకే సమస్యలు వుంటే చూయింగ్ గం తినడం వల్ల సమస్య మరింత అవుతుంది. (Temporo mandibular joint condition) దవడలలోని కాల్టిలేడ్ ను తగ్గించి సమస్య తీవ్రతరం కావడానికి ఆస్కారం అవుతుంది.

కొన్ని నాసిరకం చూయింగ్ గంల వల్ల పళ్ళు దెబ్బతినే ఆస్కారం వుంది. చక్కెర బదులుగా వాడే asparteme వల్ల క్యాన్సర్, చక్కెర వ్యాధి, నరాల సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కనుక బబుల్/చూయింగ్ గం కవరు పై గల పదార్థాల పట్టిక క్షుణ్ణంగా చదివి వినియోగించాలి. అది మనకు మంచిదో కాదో తెలుసుకొని తినాలి.

సరైన మోతాదులో, మితంగా చూయింగ్/బబుల్ గం నమలడం మంచిదే. కానీ ఉమ్మివేసేటప్పుడు జాగ్రత్తగా ఓ చిన్న కాగితంలో చుట్టి చెత్తబుట్టలో పడవేస్తే మంచిది. అలాగే ఉమ్మివేస్తే ఇతరులకు ఇబ్బందికరం సుమా.

కొసమెరుపు:

బబుల్ గం బుడగలు ఊదటంలో గిన్నీసు రికార్డు ఎంతో తెలుసా? 1996లో కాలిఫోర్నియా సుసాన్ మొంటోగోమెరీ 60 సెం.మీ. ల (23 అంగుళాల) బబుల్గం బుడగను ఊదాడు.

ఇక చేతులతో పట్టుకోకుండా 24.4.2004న కాడ్ ఫెల్ 50.8 సెం.మీ. ల (20 అంగుళాల) బబుల్ గం బుడగ ఊదాడు.

ఆధారం: యుగంధర్ బాబు

3.01538461538
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు