অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నమ్మకానికి, సత్యానికి దూరమెంత ?

నమ్మకానికి, సత్యానికి దూరమెంత ?

మంత్రాలు వేసి, దయ్యాల్ని, భూతాన్ని, పారదోలవచ్చు, భాణమతి ప్రయోగించి మనుషుల్ని పశువుల్ని అనారోగ్యానికి గురిచేయవచ్చు. మంత్రం వేస్తే కామర్ల వ్యాధి తగ్గిపోతుంది. తాయెత్తు చేతికి, మొలతాడుకు కట్టుకుంటే పాము కాటు వేయదు. 4aa.jpgతుమ్మితే ఏమో అవుతుంది. అంటే తుమ్ము కీడుకు సంకేతం. ప్రయాణ సమయంలో పిల్లి ఎదురైతే చాలా ఫలమయ్యే పని కూడా విఫలం అవుతుంది. ఎర్ర నీళ్లతో దిష్టితీస్తే జ్వరం, వాంతులు తగ్గిపోతాయి. ఇంటిమీద లేదా చెట్టుమీద, పెద్దపిట్ట అరిస్తే ఏదో కీడు సంభవిస్తుంది. పాముకాటుకు, తేలుకాటుకు, పిచ్చికుక్క కాటుకు మంత్రాలు వేస్తే విషం విరుగుడవుతుంది. ఇంకా పాములు పగబట్టడం, ఇవన్నీ నమ్మకాలు మాత్రమే. నిత్య జీవితంలో చాలా మంది ప్రజలు నమ్మేవే. అలా నమ్మేవాళ్లు ఆ దయ్యాల్ని, భూతాల్ని ఎవరైన ఎప్పుడైనా చూశారా ? నిజంగా అవి ఉన్నాయని ఎలా చెబుతున్నారు ? ఏ ఆధారంతో వారా నిర్ణయానికి వచ్చారు ? రుజువు చేయాలంటే చేయలేరందుకు ?

ఇంకా మంత్రాలున్నాయని కూడా చాలా మంది నమ్ముతుంటారు. అయితే మంత్రమంటే ఏమిటి ? వాటిని ప్రయోగించి రుజువు చేయగలరా అంటే ఎవరూ ముందుకు రారు. రుజువు చేసిన దాఖలాలు ఎక్కడాలేవు. తాయెత్తు కట్టుకుంటే పాముకాటు వేయదంట. దీనిని చాలా మంది నమ్ముతుంటారు. తాయెత్తు ప్రబావం పాముకెలా తెలుస్తుంది ?

తుమ్మితే కీడు, పిల్లెదురైతే కీడు - చెడు. ఈ కీడు – చెడు జరుగుతుందనే ఆలోచనకి ఆధారమేంటి ? ఇలాంటి నిర్ణయాలు సహేతుకం, శాస్త్రీయం అవుతాయంటారా ? విచారణ చేస్తే ఇవన్నీ నమ్మకాలు మాత్రమేనని తేలుతాయి.

తుమ్ము అంటే ఏమిటి ? తుమ్ము ఎందుకు వస్తుంది ? తెలిస్తే అలా మాట్లాడుతారా ? తుమ్ముకి మనం చేసే పనికి సంబంధంమేమిటి ? ముక్కు, నోరు నుండి గాలిని బయటికి పంపించే చర్యనే మనం తుమ్ము అని అంటాం. తుమ్ము అనుకోకుండా రావచ్చు. ఎందుకంటే అది అసంకల్పిత ప్రతీకారచర్య అయితే తుమ్ము ఎందుకు వస్తుందంటే మన ముక్కులో మ్యూకస్ పొరనేది ఒకటుంటుంది. ఆ పొర ఉబ్బినపుడల్లా తుమ్ము వస్తుంటుంది. అయితే ఆ మ్యూకస్ పొర ఉబ్బడానికి కూడా కారణముంది. ముక్కులో ఏవైనా పుల్లలు పెట్టినా, పొగాకు పీల్చినా తరచుగా తుమ్ములు వస్తుంటాయి. వాతావరణ పరిస్థితులను కూడా అప్పుడప్పుడు తుమ్ములు వస్తుంటాయి. తుమ్ములను కీడుకు సంకేతంగా సూచించడం అర్ధరహితం. ఆధారరహితం. తుమ్మితే ఏమి అవుతుందని అనుకోవడం అజ్ఞానం, అవివేకం తప్ప మరొకటికాదు.

జర్వం ఎలా వస్తుంది ? జర్వం వస్తే మందుశరీరంలో పనిచేసి వ్యాధిని ఎలా తగ్గిస్తుందో మనకు ప్రయోగాల వల్ల నిరూపణ అయ్యింది. అయితే ఎర్రనీళ్ల దిష్టితో జర్వం తగ్గడానికి గల సంబంధం ఏమిటి ? దీనిని మీరు తెలిసే నమ్ముతున్నారా ? అని ప్రశ్నిస్తే చాలా మంది ఏమి సమాధానం చెబుతారంటే మా పెద్దలు చెప్పారు కదా మేము వాటిని ఆచరిస్తే తప్పేమిటి ? అని అంటుంటారు.

ఏ విషయాన్నైనా మనం గుడ్డిగా నమ్మవచ్చా? నమ్మరాదు. పరిశీలించకుండా, విచారణ చేయకుండా ఏ విషయాన్ని అయినా సత్యంగా అసత్యంగా పరిగణించరాదు. సత్యా సత్యాల దగ్గర, వాస్తవ అవాస్తవాల దగ్గర మనిషి విశ్వాసాన్ని కలిగి ఉండరాదు. విశ్వాసపాత్ర వివేకాన్ని కలిగించదు. విచారణకు సిద్దపడడు. ప్రశ్నతోటే జ్ఞానం సిద్దిస్తుంది ప్రశ్నించడం ప్రగతికి మార్గం. ప్రశ్నించడంతోనే మనిషి అనేక విషయాల్ని తెలుసుకోగలుగుతున్నాడు. పరిశీలన పరిశోధనల నుండి సైన్స్ పుట్టింది. ప్రశ్నే సైన్స్ కు మూలం. చెట్టు నుండి రాలిన పండు నేల మీద నే ఎందుకు పడింది ? పైకి ఎందుకు వెళ్లలేదు. అని న్యూటన్ శాస్త్రవేత్త ప్రశ్నించకపోతే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఎలా తెలిసుండేది ? అలాగే మరుగుతున్న పాత్ర మీద మూత కదలుటను జేమ్స్ వాట్ ప్రశ్నించకపోతే ఉష్ణశక్తి ఆవిరిశక్తిగా మారుతుందని, దానికి చలనశీలత ఉందని ఎలా తెలిసేది ?

ఎందుకు ? ఏమిటి ? అనే ప్రశ్నలు అనేక విషయాల్ని కనుగొనుటకు కారణమయ్యాయి. ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా, నిరూపణ చేయకుండా ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి. అది మన నమ్మకమే అవుతుంది. తప్ప సత్యం కాదు. ప్రశ్నించుకొని నిరూపణ చేశాకే ఒక నిర్ణయానికి రావాలంటుంది సైన్స్ సైన్స్ పెరగడానికి, బ్రతకడానికి ప్రశ్నే పునాది. ఆ క్రమంలోనే అది పురోగమనం చెందుతుంది.

ప్రశ్న విశ్వాసానికి పెద్ద శత్రువు ప్రశ్నించడం అంటే విశ్వాసానిక అసలుగిట్టదు. ఎందుకనీ ? ప్రశ్న రుజువును కోరుకుంటుంది. నమ్మకానికి - విశ్వాసాన్ని రుజువుతో పనిలేదు. సైన్స్ ఆలోచించమంటుంది. నమ్మకానికి ఆలోచనతో పనిలేదు. నమ్మకమేది ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ రుజువు మీద ఆధారపడి ఉంటుంది.

భూమి ఒక దేవత అంటుంది నమ్మకం. కాదు భూమి ఒక గ్రహము అంటుంది. - సైన్స్ అలానే దైవం విషయంలో దేవుడున్నాడంటుంది. నమ్మకం. కాదు కాదు. అది తేలని, అనిర్థారితమైన అంశమంటుంది సైన్స్. దైవం భావం అనేది సత్యనిర్థారణ కాని అంశమని కేవలం అదొక నమ్మకం మాత్రమేనని సైన్స్ చెబుతుంది. సత్యమే సైన్స్. సైన్స్ సార్వత్రికం అందరూ అంగీకరించేది. నమ్మకం వ్యక్తిగతం. అందరికి అనంగీకారం. నమ్మకమనేది అనుభవ సహితం కావచ్చు. కాకపోవచ్చు. కాని సైన్స్ మాత్రము అనుభవ సహితం, ఆధార సహితం కలిగి ఉంటుంది. అనుభవరహితమైన జ్ఞానం - సైన్స్ ఉండదు.

నిప్పు కాలుతుంది. మంచు గడ్డ చల్లగా ఉంటుంది. ఇది నా నమ్మకం అంటే చెల్లుతుందా ? చెల్లదు ? అనుభవ సహితం కావాలి. అంటే ఒకసారి మనం వాటిని తాకి ఇంద్రియ గ్రహణశక్తి ద్వారా ఫలితాన్ని గ్రహించి, ఉందా ! వేడిగా ఉందా ! తెలుసుకోవడమే సైన్స్ .

సైన్స్ కు సాంప్రదాయానికి ఘర్షణ జరుగుతుంది. సైన్స్ సైన్స్ కోసమే కాదు. సైన్స్ సమాజంకోసం. సైన్స్ ఎవరికోసం ? సైన్స్ సాధారణ మానవుల కోసం ఉంది. సైన్స్ ను కనిపెట్టినవారు మనుషులే. నిప్పును కనిపెట్టిందెవరు మొదట ? సాధారణ మానవులే . సాధారణ మానవుల సమిష్టి దృష్టి నుండే పుట్టింది. సైన్స్ నుండి వచ్చిన ప్రయోజనాలు - ఫలితాలు సామాన్య ప్రజలకు అందడం లేదు. సమాజమే సైన్స్ ను సృష్టించింది. వారికే ఆ ప్రయోజనాలు అందాలి.

సైంటిస్టువాడుతున్న పరికరాల్ని కూడా సామాన్యుల నుండే వచ్చాయి. సైన్స్ ను మనం నిత్యం వాడుతున్నాం. సైన్స్ అనేది ఒక సాధనంలాంటిది. సైన్స్ అనేది ఒక వస్తువు కాదు. సైన్స్ అనేది ఒక సంస్కృతి . ఒక జీవన సరళి. కంప్యూటర్ లో కూడా సైన్స్ కు వ్యతిరేకమైన భావాల్ని ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరి వల్లనో కాదు మానవులందరూ కలిసి సాధించుకున్నది - సైన్స్. నమ్మకాలు వేరు సామాజిక జీవితం వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జీవితమంతా సైన్స్ తో ముడిపడి ఉంది. అవునా కాదా ?

సైన్స్ లేకుండా నువ్వు, నేనూ, అందరమూ ఒక నిముషం కూడా బ్రతకలేం. సైన్స్. సైన్స్ దృక్ఫథంగానే జీవితం ఉండాలి. శాస్త్రాయ దృక్ఫథం అంటే 100 కు 100 మార్కులు తెచ్చుకోవడం కాదు. దానిని సహజంగా అలవర్చుకోవాల్సిందే . సైన్స్ కోసం పనిచేయడం అంటే సత్యం కోసం పనిచేయడమే.

సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా అశాస్త్రాయ భావాల సాహిత్యం పెరిగిపోతుంది. కొన్ని విషయాల్ని మనమిక్కడ పరిశీలిద్దాం ! జనక మహారాజు భూమిని దున్నుతుంటే నాగటి సాలులో ఒక పెట్టేలో శిశువు రూపంలో సీతాదేవి దొరికిందట. అందుకే ఆమే అయోనిజ అయిందట. భూగర్భంలో ఉన్న పసిబిడ్డకు గాని, ఆహారం, ఎలా అందినవి అంటుంది. - సైన్స్.

కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని వలన కర్ణునికి జన్మనిచ్చినట్లు భారతంలో కర్ణుని జన్మవృత్తాంతం తెలుపుతుంది. సూర్యుడు కొన్ని కోట్ల ఫారన్ హీట్ డిగ్రీల వేడితో మండుతున్న అగ్నిగోళం కదా ! మరి ఆ గోళం ఒక జీవి జన్మకు ఎలా కారణం ? ఇది సాద్యమా\ అంటుంది సైన్స్ .

(మిగతా భాగం వచ్చే సంచికలో)

రచయిత:-తుమ్మల రాములు, టీచర్

బాపూజీ పాఠశాల ,కిషన్ పుర, హన్మకొండ.

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate