অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీటిని కాపాడుకుందాం

గాలి, నీరు అనేవి, మనిషికి అతి ప్రధానమైన జీవనాధారాలు. అందులోనూ మంచిగాలి, మంచినీరు, అనేవి మరింత అమూల్యమైనవి. అయితే గాలిని మనుషులు రకరకాలుగా కలుషితం చేస్తూ తమ ఆరోగ్యానికి తామే చేటు తెచ్చుకుంటున్నారు. ఇక నీటి విషయంలోనూ వారు ఇలాంటి నిర్లక్ష్యాన్నేచూపిస్తున్నారు. ఒక విధంగా గాలి కన్నా నీటి విషయంలో వారు మరింత పెద్దతప్పు చేస్తున్నారు. నీటిని నానారకాలుగా కలుషితం చేయడమేకాక అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని వారు పొదుపుగా వాడుకోలేక పోతున్నారు.

నీటి విలువను నూటికి నూరు శాతమూ గుర్తించిన ఒక విజ్ఞుడు మూడో ప్రపంచ యుద్ధమంటూ జరిగితే అది కేవలం నీటి కోసమే జరుగుతుందని ఎన్నో దశాబ్దాల కిందటే ప్రకటించాడు. ఆ మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచందాకా ఎందుకు ? మీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించండి.

దేశ రాజధాని నగరంలో ప్రతిరోజు 21 కోట్ల గ్యాలన్ల తాగునీటిని పొందుతున్నారు. అంటే 94.5. కోట్ల లీటర్లన్న మాట. ఆ నీరు వారిని చేరడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే ఈ నీటిలో ప్రతి బొట్టూ సద్వినియోగం అవుతుందని చెప్పడానికి లేదు. ఇందులో కనీసం 10 శాతం నీటినైనా నగరవాసులు వృధా చేస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు. పది శాతం అంటే మాటలా. 9.45 కోట్ల లీటర్ల నీరు. రూపాయల్లో లెక్కబెడితే దీని విలువ ఎన్ని పదుల కోట్లో కదా.

కేవలం తాగడానికి మాత్రమే కాదు. రోజువారీ పనులకు, ఇంకా పంటలు, కర్మాగారాలు, యంత్రాలు వంటి వాటెన్నిటికో ప్రతిరోజూ కోట్లకోట్ల గ్లాలన్ల కొద్దీ నీరు అవసరమవుతుంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ నీరు కూడా భారీగా వృధా చేయబడుతొంది. తాగునీటి కన్నా ఎక్కువ మొత్తంలో ఈ తరహా నీటిని మనుషులు వృధా చేస్తున్నారు. నీరు వృధాఅవుతుందంటే.

  • వివిధ పనులకై అవసరమైన దాని కన్నా ఎక్కువగా వాడడం.
  • కొన్నిటికై అవసరం లేకున్నా వాడడం.F.jpg
  • ఒకసారి ఒక పనికై వాడిన నీటిని మరో పనికై ఉపయోగించ గల్గినప్పుడు అలా ఉపయోగించ కుండా దానిని నేరుగా మురుగునీటి కాలువపాలు చేయడం.
  • ఏ పనీ జరగనప్పటికీ నీటిని వాడడం మీరు జాగ్రత్తగా గమనించాలే గానీ చాలా మంది చాలా రకాలుగా నీటిని వృధా చేస్తూ మీకు కన్పిస్తుంటారు. ఏమైతేనేం, ఎవరు ఏ రకంగా, ఎంత మొత్తంలో వృధా చేసినప్పటికీ వృధా అనేది వృధాయే. దాని పర్యవసానాన్ని మనుషులందరూ (సమాజం) సంయుక్తంగా అనుభవించాల్సి వుంటుంది. కొందరు వృధా చేస్తే, దాని పర్యవసానాన్ని అందరూ అనుభవించడమేమిట అని మీలో కొందరికి అనుమానం రావచ్చు. కదా. ఈ క్రింది ఉదాహరణలని గమనించండి.

ఒకచోట ఓ పదిళ్ళున్నాయి. ఆ పదిళ్ళు వారూ తన నీటి అవసరాలకై భూగర్భజలంపైనే ఆధారపడి ఉన్నారు. ఎవరింటికి వారు బోర్లు తవ్వుకున్నారు. ఒకప్పుడు 50 అడుగుల లోతు తవ్వితే చాలు పుష్కలంగా నీరు వచ్చేది కాని, ఈ పదిళ్ళలో ఒక ఇంటివారు బోరుమోటారు ఆన్ చేసి కొన్ని గంటలు తరబడి ఇక దాని విషయం పట్టించుకొనే వారు కాదు. కొన్నిసార్లు రాత్రి పూట ఇలా జరిగితే మరికొన్నిసార్లు పగలే ఇది జరిగేది. ఏమైతేనేం కనీసం నెలకు ఓ ఆరేడు సార్లయినా ఆ ఇంటివారు ఇలా మోటారు సంగతి మర్చిపోయేవారు. వారలా మర్చిపోయిన ప్రతిసారీ కాలనీ మొత్తం అవసరాలను తీర్చగలిగే నీటికన్నా కనీసం ఓ రెండు మూడు రెట్లు నీరు వృధాగా మురుగు కాల్వలోకి చేరుకునేది. పోయేది వాళ్ళ నీళ్ళు. కాలేది వాళ్ళ కరెంటు. మనకేం పట్టింది అనుకుంటూ మిగతా తొమ్మిదిళ్లవారూ మౌనంగా ఊరుకునే వారు. చివరకు ఏమయ్యిందో తెలుసా ఒక రెండేళ్ళయినా తిరగకుండానే మొత్తం అందరి బోర్లూ వట్టిబోయాయి. మొర్రోమని మళ్ళీ అందరూ మరో 50 అడుగుల లోతికి బోర్లు తవ్వుకోవలసి వచ్చింది. బోలెడంత ఖర్చయ్యింది.

హైదరాబాద్ శివార్లలో ఉన్న కాలనీ కథ ఇలా ఉంది.G.jpg ఈ కాలనీలో సుమారు ఓ 100 గడపలున్నాయి. అందరూ భూగర్భజలంపైనే ఆధారపడి తమ మనుగడ కొనసాగిస్తున్నారు. లవణాలు అతి తక్కువగా వుండే చక్కటి భూగర్భజలాలు వుండటంతో, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ వాళ్ళ ఇళ్ళు కట్టుకున్నారు. ఒక రెండు మూడేళ్ళు బాగానే గడిచింది. ఈ లోగా రాబందులాంటి ఒక నీళ్ళ వ్యాపారి కళ్లు ఆ కాలనీ జలాల మీద పడ్డాయి. ఇంకేం కాలనీలో కాసింత స్థలం సంపాదించి, ఓ పెద్ద బోరు తవ్వేసి. రాత్రిపగలు తేడా లేకుండా యధేచ్ఛగా నీళ్ళు తోడి ట్యాంకర్లతో అమ్ముకోవడం మొదలు పెట్టాడు. కాలనీ వాళ్ళు అందుకు అభ్యంతరం చెప్పినప్పటికీ, తగిన స్థాయిలో అతడ్ని ప్రతిఘటించడం గానీ, అతడి వ్యాపారాన్ని ఆపడం గానీ చేయలేకపోయారు. దాంతో రెండేళ్ళు తిరగకుండానే మొత్తం మరో ఏడెనిమిది మంది నీళ్ళ వ్యాపారులు రంగంలోకి దిగారు. ఒక ఐదేళ్ళపాటు కాలనీ భూగర్భజలాలను జలగల్లా పీలుస్తూ, ఆ నీళ్ళ వ్యాపారులందరూ లక్షాధికారులయ్యారు. ఈ లోగా కాలనీ వాళ్ళ బోర్లన్నీ ఎండిపోయాయి. ఉమ్మడిబోరు కూడా పనిచేయడం మానేసింది. మూడుసార్లు దాన్ని మరింతలోతుకి తవ్వినప్పటికీ లాభం లేకపోయింది. నీళ్ళ వ్యాపారులు మాత్రం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి, ఎంత లోతుకైనా భూమిని తవ్వేస్తూ నీళ్ళు తోడుకోగల్గుతున్నారు. దాంతో చివరకు .........ఆ నీళ్ళ వ్యాపారాల వద్దే నీళ్ళు కొనుక్కుంటూ బతకాల్సిన దుర్గతి కాలనీ వాళ్ళకు పట్టింది. ఎంత దయనీయమైన పరిస్థితి.........

అయితే ఇకపై నీటిని మీకు చాతనైనన్ని విధాలుగా కాపాడండి. మీకీ పనుల్లో సాయం చేసే ఉద్దేశంతో ఇందుకు సంబంధించిన కొన్ని చిట్కాలను మీకు అందజేస్తున్నాం.

మొహం కడుక్కొనేటప్పుడు

మీరు ప్రతి రోజూ మొహం కడుక్కునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు కుళాయిధారను (నల్లాను) గాక ఓ బకెట్టునీ, మగ్గునీ ఉపయోగించినట్లయితే చాలా నీరు ఆదా అవుతుంది. ఉదాహరణకు కుళాయి ముందు నిలబడి మొహం కడుక్కునేటప్పుడు, సుమారు 10 లీటర్ల నీరు ఖర్చయితే మగ్గుతో కడుక్కున్నప్పుడు కేవలం 1 నుంచి 2 లీటర్ల వరకూ మాత్రమే ఖర్చవుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే కొళాయి కింద స్నానం చేసినప్పుడు 40 లీటర్ల దాకా నీరు, ఖర్చయితే, బకెట్టులో నీరు నింపుకొని చేసినప్పుడు 20 లీటర్లు మాత్రమే కడుక్కోవడం, స్నానం చేయడం, చేతులు, కాళ్ళు కడుక్కోవడం, వంటి వాటన్నింటికీ, మగ్గు ని ఉపయోగించినట్లయితే చాలా నీరు ఆదా అవుతుంది.

బట్టలుతికేటప్పుడు

H.jpgబట్టలను ఉతికేందుకు ఎంత ఎక్కువగా సబ్బుని వాడితే అంత ఎక్కువగా నీరుని ఖర్చు పెట్టవలసి వస్తుంది. అందుకని సాధ్యమైనంత తక్కువ సబ్బుతో లేక సర్ఫుతో మురికిని వదలగొట్టేందుకు ప్రయత్నించండి. బట్టలను గోరువెచ్చని సర్ఫునీటిలో నానబెట్టి ఉతకడం వలన వాటికి మురికిని సులభంగా తొలగించవచ్చు. అలాగే, బట్టలను నీళ్ళలో అద్ది, గుంజేటప్పుడు కొళాయిని కట్టివుంచండి. కొళాయిని అలాగే వదిలి బట్టలు గుంజినట్లయితే సుమారు 60 నుంచి 80 లీటర్ల నీరు వృధా అవుతుంది.

మొక్కలకు నీరు పోసేటప్పుడు

నరజాతి మనుగడకు ఆధారం చెట్లు. నాటండి వేలవేలుగా నేల ఈనినట్లు ........అన్న పాటను మీరందరూ వినే వుంటారు. కదూ. మీ ఇంటి పెరటిలోనూ, పరిసరాల్లోనూ మీకు సాధ్యమైనన్ని మొక్కల్ని పెంచండి. ఒక మనిషిగా మీరు తప్పక చేయాల్సిన పనుల్లో (వీధుల్లో) అది కూడా ఒకటని గుర్తించండి. మొక్కలకై స్థలం లేకపోతే కనీసం కుండీల్లోనైనా వాటిని పెంచండి. ఇక వాటికి నీటినిపోసే విషయంలో ఈ క్రింది సూత్రాలు పాటించడం ద్వారా ఒక పక్క నీటిని పొదుపు చేస్తూనే మరోపక్క చక్కటి మొక్కలనూ పెంచవచ్చు.

ఎండాకాలంలోకాక ఏదైనా చల్లగా వుండే రుతువులో మొక్కలను నాటండి.

మొక్కలలో కొన్నింటికి చాలా నీరు అవసరంకాగా మరికొన్నింటికి కొద్దిపాటి నీరే సరిపోతుంది.

ఇంటి వద్ద పెంపకానికై ఈ రెండో రకం వాటినే ఎంపిక చేసికోండి. కొన్ని మొక్కలకు ప్రతిరోజు నీరు అవసరం కాగా, మరికొన్ని మొక్కలకు రోజులకు ఒకసారి నీళ్ళుపోస్తే సరిపోతుంది. ఇంకొన్ని మొక్కలకు వారం పది రోజులకొకసారి నీళ్ళు పోస్తే చాలు.

ఇలా, వేర్వేరు నీటి అవసరాలను బట్టి మొక్కలను వేరుచేసి, ఒకే అవసరం ఉన్నవన్నీ ఒకేచోట పెరిగేలా చూడండి. అంటే అలాంటి వాటన్నింటినీ ఒకేచోట నాటండి.

బాగా పొద్దెక్కాక గాని, ఎండ వేడిమి బాగా ఉన్న సమయంలోగాని మొక్కలకు నీరు పెట్టకండి. వాతావరణం చల్లగా ఉండే సమయంలోనే నీరు పెట్టడం, పొయ్యడం వల్ల మీరు పోసే నీరు చాలా మేరకు సద్వినియోగమవుతుంది.

మొక్కలకు పోసిన నీరు వృధాగా ఇగిరిపోకుండా వాటి మొదళ్ళ చుట్టూ ఏదైనా సేంద్రియ పదార్థాన్ని (ఉదా..పేడ) ఉపయోగించండి.

బియ్యం, పప్పు, కూరగాయలు వంటివి కడిగినప్పుడు వచ్చే నీటిని మొక్కలకు పొయ్యడం వలన, ఆ నీరు రెండోసారి ఉపయోగింపబడటమే గాక, మొక్కలకు అదనంగా కొన్ని పోషక పదార్థాలూ లభిస్తాయి. కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు వచ్చే నీరు కూడా మొక్కలకు పోయేలా చూడండి. అలాగే మీ సైకిలునిగాని, స్కూటరుని గాని కడిగినప్పుడు వచ్చే నీటిని, పెంపుడు జంతువులకు స్నానం చేయించేటప్పుడు వచ్చేనీరు మొక్కలకు పోయేలా చూడండి. ఇలాంటివన్నీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను నిజం చేస్తూ, మీ నీటిని సార్థకం చేస్తాయి.

తక్కువ నీటిలో బతికే మొక్క మూలంగా ఏడాదికి సుమారు 2500 లీటర్లు నీరు ఆదా అవుతుంది. సాధ్యమైనంత వరకు ఇలాంటి మొక్కల పెంపకాన్ని చేపట్టండి. ఎవరికైనా నీళ్ళిచ్చేటప్పుడు

మీ ఇంటికి వచ్చిన వ్యక్తులు (అతిధులు) దాహంతో ఉన్నారా లేదా ఉంటే ఎంత దాహంతో ఉండి ఉండవచ్చు అన్న దానిని గుర్తించి వారికి మంచినీరివ్వండి. ఇందుకై మరీ చిన్నగానూ, మరీ అంత పెద్దగానూ లేని గ్లాసులను ఉపయోగించండి. అలానేకుండా ఇంటికొచ్చిన వారందరికీ పెద్ద పెద్ద గ్లాసులతో నీరిచ్చినట్లైతే ఎక్కువగా ఉంటుంది. అలాగే, మీరు నీళ్ళు తాగేటప్పుడు కూడా గ్లాసునిండా తీసుకొని, అందులో కొంచెం తాగి మరికొంచెం వదిలేయడం అనేది తరచూ జరుగుతుంటుంది. ఇకపై అలా జరగకుండా చూసుకోండి.

వంటగదిలో

I.jpgపళ్ళు, కూరగాయలు వంటి వాటిని ఒక పాత్రలో నీళ్ళుపోసి కడిగినప్పటి కన్నా నేరుగా కొళాయికింద కడిగినప్పుడు చాలా నీరు ఖర్చవుతుంది. పైగా ఆ నీరు రెండోసారిగా వినియోగానికి పనికిరాదు. అలాగే, ఒక వంటకాన్ని (దానికి తగిన) చిన్న పాత్రలో కన్నా పెద్ద పాత్రలో వండినప్పుడు ఎక్కువనీరు ఖర్చవుతుంది. చాలా మంది కాకరకాయలు, ఆలుగడ్డలు వంటి వాటిని ఉడకబెట్టేటప్పుడు , కూరలు చేసేటప్పుడు అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ నీరుని వాడుతుంటారు. దాని మూలంగా ప్రతిపూటా కొంత నీరు వృధా కావడమేగాక, అంతకన్నా ముఖ్యంగా ఆయా ఆహారపదార్థాల ద్వారా మన శరీరానికి అందాల్సిన పలుపోషక పదార్థాలని కూడా మనం కోల్పోతాము. ఈ రకంగా వృధా అయ్యే నీరు ఏ ఇంటికా ఇంటికి చాలా తక్కువగా అన్పించినప్పుటికీ దేశమంతటినీ (కొన్ని చోట్ల కుటుంబాలు) లెక్కలోకి తీసుకున్నప్పుడు ఆ వృధా రోజుకి కొన్ని పదుల లక్షల గ్యాలన్ల చొప్పున వుంటుంది. ఆ లెక్కన, ఈ ఒక్క, ఉడకబెట్టడమనే ప్రక్రియ ద్వారానే నెలకు ఎన్ని కోట్ల గ్యాలన్ల నీరు వృధా అవుతుందో మీరు అంచనా వేయవచ్చు.....

వంటగదిలో జరిగే మరో భారీ నీటి వృధా అంట్లుతోమేటప్పుడు చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కుళాయికింద అంట్లుతోమే వారి ఇళ్ళల్లో తోమిన గిన్నెలను, పక్కన పాత్రలో నీరు పెట్టుకొని కడిగినప్పటికన్నా కుళాయితిప్పుకొని దాని కింద నేరుగా కడిగినపుడు, మొదటి పద్దతిలో కన్నా కనీసం 2 రెట్లు ఎక్కువ నీరు ఖర్చవుతుంది. గిన్నెలను కడిగేందుకు రెండు పద్దతుల్లోనూ నీరు సమానంగానే ఖర్చయినప్పటీకీ, కొళాయికింద కడిగినప్పుడు మధ్య మధ్యలో నీటిధార వృధాగా పోవడమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ఇది నిజమో కాదో మీరు మీ పరిసరాలను గమనించి నిర్థారణకు రండి, ఒకవేళ ఇది నిజమైతే దీనికి పరిష్కారం ఏమిటో కూడా మీరు ఆలోచించండి.

సెకనుకు ఒక చుక్క చొప్పున

బిందువు బిందువు కలిసి సింధువవుతుంది. (ఒక్కోనాటి చుక్కా కలిసి చివరకు ఓ మహాసముద్రం అవుతుంది అని అర్థం) అని మనకో నానుడి వుంది. ఆ మాట అక్షరాలా నిజమే. మీరు గమనించారో లేదోగాని, మన దేశంలో చాలా మంది ఇళ్ళలో నీటి పైపులకో, కుళాయివద్దో, లేదా నీటి ట్యాంకు దగ్గరో ఓ చిన్న రంధ్రం (లీకు) ఉంటుంది. ఈ రంధ్రం నుండి నిమిషానికి కొన్ని చుక్కలేగా, అనుకుంటూ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. రిపేరు చేయడానికి, చేయించడానికి బద్ధకిస్తుంటారు. కాని సెకనుకి ఒక్క చుక్క చొప్పున నీరు నేలపాలవుతుంటే, ఒక ఏడాదికాలంలో ఎంత నీరు వృధా అవుతుందో తెలిస్తే ఇలాంటి వారందరూ ఆ, అని ఆశ్చర్యంతో నోరు తెరవక మానరు.

ఏదైనా ఒక చిన్న రంధ్రం నుంచి సెకనుకి ఒక చుక్క చొప్పున నీరు కారిపోతుందను కుంటే ఆ రంధ్రం గుండా ఒక సంత్సరానికి 2700 గ్యాలన్ల నీరు జారిపోతుంది. మెల్లమెల్లగా జారుకుంటూనే చిన్నచిన్న నీటిబొట్లు మనకు తెలియ కుండానే ఎంత నష్టాన్ని కల్గిస్తున్నాయో గమనించారుగా. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి లీకులేమైనా ఉంటే వెంటనే వాటి పని పట్టించండి. జలాన్ని మనం కాపాడితే జలం మనల్ని కాపాడుతుంది. ఈ మాటను ఎల్లవేళలా గుర్తుంచుకోండి. అందుకే మన పూర్వీకులు జలాన్ని ఒక దేవటలాగా భావించి, పూజించేవారు.. మనం అలా పూజించాల్సిన అవసరం లేకపోయినా నీటిని, నీటి వసరులనీ మనస్ఫూర్తిగా గౌరవించి వాటిని కాపాడవలసిన బాధ్యత మాత్రం వుంది. ఏమంటారు...?

రచయిత:- కె.ఆదర్శ సామ్రాట్

 

 

 

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate