অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పగ పట్టిన పాము

పగ పట్టిన పాము

snakeman.jpg(దడ, దడ లాడుతూ! రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రఘురాం తాతగారి ఇంటి ముంది ఆగింది. బుర్రమీసాలు, విశాలమైన ఛాతి, ఆరు ఆడుగుల పొడవు కల ఆజాను బాహుడు బండి దిగాడు.)

వంశీ : తాత! మీసాల రెడ్డప్ప వచ్చారు!

తాత : (బయటకు వస్తూ...) భడవా! పెద్దవారిని పేరుపెట్టి పిలుస్తావా!

రెడ్డప్ప : ఫర్లేదండీ, నమస్కారం!

తాత : రండీ! కూర్చోండీ! చాల రోజుల తరువాత కలిశాం కుశలమేనా?

రెడ్డప్ప : పర్లేదు! చిన్న సాయం కోసం వచ్చాను.

తాత : తప్పకుండా! ఏం చేయాలో చెప్పండి.

రెడ్డప్ప : (రెండు క్షణాలు తటపటాయించి...) నన్నొక త్రాచు పాము పగబట్టింది!

తాత : (చిరునవ్వుతో) పాము పగబట్టిందా? ఎప్పట్నుంచి ? ఎలా?

రెడ్డప్ప : (దిగులుగా) నిన్న సాయంత్రం, మా తోట నుండి ఇంటికి వస్తూ చూసుకోకుండా, నా ఎన్ఫీల్డ్ బైక్ తో, ఒక త్రాచుపామును తొక్కించేశాను.

తాత : పాము కరిచిందా?

రెడ్డప్ప : లేదండీ... కానీ అది పగబట్టి నన్ను చంపాలని కాపేసింది.

తాత : కాపేసిందా? మీకెలా తెలుసు?

రెడ్డప్ప : బండి శబ్దం వినగానే, బండల మద్యనుండి జర, జర బయటకు వచ్చేసింది.

తాత : అది వేరే పామేమో?

రెడ్డప్ప: కాదండి! ఆ ప్రాంతంలో అంత పెద్ద త్రాచుపాము మరొకటి లేదు. (నానమ్మ వంశి వచ్చి తాతయ్య ప్రక్కనే కుర్చున్నారు!)

రెడ్డప్ప : మళ్ళీ పని మీద, రెండు మూడుసార్లు అదే దారిలో తిరిగాను.

తాత : ప్రతిసారి పాము కనిపించిందా?

రెడ్డప్ప: ఔనండి! జరజర అటు, ఇటు పాకడం కూలీలందరూ చూశారు.

తాత : కొట్టి చంపేశారా?

రెడ్డప్ప : అయ్యో! అంతదైర్యం ఎవరికుంది?

తాత : మరి ఏమిచేశారు?

రెడ్డప్ప : నా బావమరిదిని తోటపనికి పంపి మీదగ్గరకి వచ్చాను.

తాత : నేనేం చేయాలి?

రెడ్డప్ప : పాములు పట్టే వీరయ్యను, ఆ త్రాచును పట్టమని పంపాను, ఎంతవెతికినా అది కనిపంచలేదట, నన్ను ఒకసారి బండి మీద అక్కడికి రమ్మంటున్నాడు.

తాత : వెళ్లిరండి! (నసుగుతూ!) భయంగా వుంది! తోడుగా వస్తారేమోనని...!

తాత : (పకపక నవ్వుతూ!) ఈ ముసలాడి సహాయం కావాలా! పామువస్తే గట్టిగా కర్రతో కూడా కొట్టలేనండి!

నానమ్మ : సాయం అంటే నవ్వుతారే! తోడుగా వెళ్ళకుండా ...

తాత : (లేస్తూ)పదండి పోదాం!

(తోట దగ్గర పడేకొద్ది రెడ్డిప్ప నిటారుగా నిలుక్కోవడం చూస్తే అతనిలోని భయం ఎంతుందో తెలుసూనే వుంది! టప టప ధ్వనులతో బైక్ ముందుకు పోతూవుంది.!)

రెడ్డప్ప : రఘురాం గారూ, అదిగో ఆ కల్వర్టర్ దగ్గరే.! (అంటున్నాడు! ప్రక్కనేవున్న గడ్డి నుండి, పొడవాటి త్రాచుపాము రోడ్డుపైకి వచ్చేసింది.)

రెడ్డప్ప : (భయంతో బ్రేక్, క్లచ్ అదిమేసి, బైక్ రేజ్ చేస్తు, బీటింగ్ విపరీతంగా పెంచేస్తున్నాడు.)

తాత : రెడ్డప్ప! బైక్ యింజన్ ఆపు! క్రింద పడ్డామా ఎముకలు విరుగుతాయి.

రెడ్డప్ప : పాము! పాము! (అరుస్తున్నాడు)

తాత: ఛ! ఊరుకో అది మనవైపు రావడంలేదు. రోడ్డు దాటాలని చూస్తోంది.

రెడ్డప్ప : (ఇంజన్ ఆపాడు!) (పాము పాకడం ఆపి వేసి, రోడ్డు మధ్యన పడగవిప్పి నిలబడి పోయింది.)

రెడ్డప్ప: (ఫోన్ చేసూ!) ఒరే! వీరయ్య ఏడ సచ్చినావురా! పాము ఈడుంది.

వీరయ్య : (కల్వక్టర్ క్రింది నుండి వస్తు). తస్సాదియ్య! నేను క్రింద దూరితే ఇది పైకొచ్చేసిందే?

తాత : జాగ్రత్త! వీరయ్యా పట్టడానికి వీలుకాకపోతే తరిమేసై!

వీరయ్య : నడ్డి విరిగి, సరిగా పాకలేక పోతోంది! అదెక్కడికి పోతుంది. సామి?

(దగ్గరకు వస్తున్న వీరయ్యను చూసి, త్రాచు బుసలు కొడుతూ పడగ మరింత పైకి లేసింది)

వీరయ్య : (చేతితోని తువ్వాలు, పడగ ముందు ఆడిస్తూ, మరోచేతో చటుక్కున త్రాచు తోకను పట్టి పైకి లేపేసాడు.)

రెడ్డప్ప : కొట్టు వీరయ్య! దాన్ని కొట్టి చంపెయ్యి

వీరయ్య : సామి! ఇప్పటికే, సగం చంపావు, ఇంకే దాన్నేం చంపుతావులే!

రెడ్డప్ప : నేనా! అదే నన్నే చంపాలని చూసింది.

వీరయ్య : నిన్న మీరు తొక్కించినపుడు, మీ బండి బరువుకు, మీ బరువు కలసి దాని పొట్టపగిలింది. నడ్డివెముక విరిగి సగం చచ్చింది.

తాత : (మసి, మసి నవ్వులతో) అంటే అది రెడ్డిప్పను పగతో కరవను రాలేదా?

వీరయ్య : కల్వర్టర్ క్రింద కట్టెతో కదిపితే, భయపడి రోడ్డుపైకి వచ్చిందంతే!

రెడ్డప్ప : ఉదయం నుండి రెండు, మూడుసార్లు నాకు కనిపించింది?

వీరయ్య : దానికి నేను చెపుతానండి, పాములకు దృష్టిజ్ఞానం కంటే, కంపనాలు గుర్తించే శక్తి ఎక్కువ, బైక్ శబ్దానికి ప్రతిసారి మళ్ళీ ఏదో ప్రమాదం వస్తుందని, తప్పించుకొనే తాపత్రయంలో, అది నీకంట పడివుంటుంది.

వీరయ్య : (పామును, తాను తెచ్చుకొన్నకుండలో వదిలి, మూతికి గోతాంపట్ట కడుతూ) సామి! ఒకసారి తొక్కించినందుకే ఈ త్రాచు నిన్ను పగపడితే, రోజు వీటిని పట్టి, పొట్టపోసుకొనే మమ్మల్ని ఈ త్రాచుపాములు బ్రతక నిచ్చేవా?

తాత : మనుష్యులలో జ్ఞాపక శక్తికి కారణం అనుమస్తిష్కము అనే మెదడులోని భాగం. కాని సరీసృపాలలో, అంటే పాములలో ఈ భాగం అంతగా ఎదగలేదని శాస్త్రం చెపుతోంది. కాబట్టి వాటికి జ్ఞాపకం పెట్టుకొనేంత శక్తి కూడా లేదు.

రెడ్డప్ప: వీరయ్యా దాన్నేం చేస్తావు?

వీరయ్య : చంపేసి, కాల్చిబూడిద చేసేస్తానులే సామి!

తాత : రెడ్జెప్పగారు, మీరెళ్ళండి, నేను వీరయ్యతో వెళ్ళి పామును చంపడం చూసొస్తాను.

రెడ్డప్ప : థాంక్స్ అండీ! దానిని చంపాక, కాల్చాడా లేదా నాకోసారి ఫోన్ చేసి చెప్పగలరా?

వీరయ్య : చంపాక, దాని నోట్లో రూపాయి బిళ్ళవుంచి, పాలుపోసి కాల్చి బుగ్గిచేసి, నేనే మీకు ఫోను చేస్తాగా! మీరు నిశ్చింతగా ఇంటికి పొండి.

(తాత వీరయ్య అడవి వైపు నడవసాగారు.)

వీరయ్య : (తటపటయిసూ) ఛ! లేదండి. దూరంగా అడివిలో వదిలేస్తాను

తాత : ప్రతి సారీ ఇంతేనా!

వీరయ్య : (మౌనంగా తల ఉపాడు) త్రాచుపాములు ప్రమాదకరమైనవేనండి. కాని పగపట్టడం ఒట్టి భ్రమ. నా చిన్నతనంలో మా తాత వీటి విషం తీసి ఆయుర్వేద మందులు చేసే వారికి ఇవ్వడం నేను చూశాను. నా బావమరిది ఇప్పటికీ బతికుండగానే వీటి చర్మాలు తీసి అమ్ముతున్నాడు.

తాత : అది చట్టరీత్యా నేరం! కఠిన శిక్షలు పడతాయని చెప్పు.

వీరయ్య : నామటుకు నేను మొదట్లో, వీటికోరలు పీకి బుట్టలో పెట్టి ఆడిసూ జనానికి వినోదం కల్గించేవాడిని. కాని కోరలు పోవడం వల్లనో సరైన తిండి, వ్యాయామం లేకనో రెండునెలకే అవి చనిపోయేవి.

తాత : (శ్రద్దగా వింటున్నాడు.)

వీరయ్య : అది పాపమని నేనే మానేశా! "బ్రతుకు బ్రతికించు” అని మా తాత చెప్పేవాడండి. "దానర్థం మనుషులను మాత్రమే కాదురా! అన్ని జీవులను" అని అమ్మచెప్పింది సామీ.

(తాతయ్యకు వీరయ్యలో ఒక పరిణితి చెందిన పర్యావరణవేత్త కనిపించాడు.)

తాత : పాత రోజుల్లో త్రాచు పాములు, పగ పడతాయనే అపోహను ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పడు అది మూఢనమ్మకంగా మారి త్రాచుపాముల జాతినే అంతరింప చేస్తుంది.

వీరయ్య : నిజమే సామీ! కాని జనానికి ఈ నిజం అర్థమైయే సరికి త్రాచుపాముల జాతి నాశనమైపొయ్యేలా వుంది. (కుండకున్న పట్ట విప్పడంతో, త్రాచుపాము స్వేచ్చగా అడవిలోకి ప్రాక సాగింది. ప్రాదు గుంకుతుండటంతో తాత, వీరయ్యల అడుగులు ఇంటి వై వు వేగంగా పడుతున్నాయి.)

రచయిత:- జి చంద్రశేఖర్, సెల్:949474624© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate