অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిచ్చుకలను రక్షించుకుందాం

nov8తెలతెలవారుతుండగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణంలో కిచకిచలతో, కిలకిలలాడుతూ వాకిల్లకు కట్టిన ధాన్యపు కంకులపై వాలి ధాన్యాన్ని లాఘవంగా ముక్కుతో ఒలుస్తూ వాటిలో బియ్యాన్ని తింటూ, ఇంట్లో ఉన్న ధాన్యపు బస్తాలపై వాలి బస్తాలకున్న చిన్న చిన్న సందులను పెద్దవి చేసి ఆ ధాన్యాన్ని ముక్కుతో ఒలిచి బియ్యపు గింజలను తినటము, వంటింట్లో ఉన్న గృహిణి కాళ్ళకు అడ్డుపడుతూ సందడి చేసే పిచ్చుకల అద్భుత దృశ్యాలను చూసి ఎంత కాలమయ్యిందో?

పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోను మానవుని పరిసరాల్లో కనిపించే కాకులు, పావురాలు, గోరువంకలు, కొంగలు కన్న అత్యధిక సంఖ్యలో ఉండి ప్రకృతి ఒడిలో ఒరిగిపోయిన ఆమాయకపు పిచ్చుకల సంఖ్య గత 40 సంవత్సరముల నుండి తగ్గిపోతూ వస్తుంది. ఇవి ప్రస్తుతం అనేక పట్టణాలు, నగరాలలో కనబడటం లేదు. గ్రామాల్లో కూడా వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయి కొన్ని గ్రామాల్లో కనిపించడం లేదు. తగ్గిపోతున్న వీటి సంఖ్య భారతదేశమంతటా ఒకే విధముగా ఒకే క్రమంలో లేదు. కొన్ని ప్రాంతాల్లో అసలు కనపడకపోవటము, కొన్ని ప్రాంతాల్లో కొద్ది సంఖ్యలోను, కొన్ని ప్రాంతాల్లో సంతృప్తికరమయిన సంఖ్యలో ఉన్నాయి. మొత్తము మీద పిచ్చుకల (sparrow) పరిస్థితి అనుకూలముగా లేదు.

వర్గీకరణ శాస్త్రీయనామము


పిచ్చుకలు పేసరీ ఫార్మిస్ (passeri formes) వర్గానికి చెందిన పెసరిడే (passeridae) కుటుంబంలోనిది. వీటి శాస్త్రీయ నామము పేసర్ డొమస్టికన్ (passer domestiene) ఇది లాటిన్ భాష నుండి తీసుకొనబడింది.

ఈ పేపర్ ప్రజాతికి చెందిన పిచ్చుకలు 5 జాతులు మన దేశంలో నివసిస్తున్నాయి. వీటిలో యూరేసియన్ ట్రీస్పేరో మన రాష్ట్రంలో కూడా ఉత్తరకోస్తాలో నివసిస్తుంది.

శరీర నిర్మాణము – వర్ణన

సుమారు 15 సెం.మీ. పొడవు ఉండే ఈ పిచ్చుకలలో ఆడ, మగ రంగులలో తేడా ఉంటాయి. మగపక్షి ముదురు రంగులో ఉంటుంది. ప్రత్యేకత కలిగిన వీటి ముక్కు శంఖు ఆకారములో కుదిమట్టుగా ఉండి, పప్పులు, ధాన్యాలను, గింజలను తినటానికి, ధాన్యము పైపొట్టును లాఘవముగా ఒలిచి తినటానికి అనువుగా ఉంటుంది.

వ్యాప్తి చెందిన ప్రదేశాలు

nov9యూరప్, భారత ఉపఖండము సహా ఆసియాలో చాలా భాగము, మిడిటేరియన్ ప్రాంతాలు. వీటి సహజమైన వ్యాప్తి చెందిన ప్రదేశాలు. 19 వ శతాబ్దపు మధ్యభాగము నుండి మానవుడు తనతో తీసుకువెళ్ళి ఇతర ప్రాంతాలలో ప్రవేశ పెట్టడము, ఓడలు మొదలైన ప్రయాణ సాధనాలలో చేరి ఈ ఉరపిచ్చుకలు అంటార్టికాలో తప్ప ప్రపంచమంతా అన్ని ఖండాలకు విస్తరించాయి. 1852లో ఇంగ్లండు నుండి తీసుకువెళ్ళి న్యూయార్క్ లో ప్రవేశ పెట్టబడ్డాయి. 1859 న్యూజిలాండ్ లోను, 1863 ఆస్ట్రేలియాలో ప్రవేశ పెట్టబడ్డాయి. ఆయా ప్రదేశాల నుండి క్రమేపి వాటి చుట్టుప్రక్కల ఉన్న ఇతర ప్రదేశాలకు, దీవులకు వ్యాప్తి చెందాయి. ఈ విధముగా విస్తరించుట వలన ఇవి ప్రపంచములో ఎక్కువగా వ్యాప్తి చెందిన పక్షులుగా ఉన్నాయి. అనేక రకాలయిన ఆవాస ప్రదేశాలలో నివసిస్తున్న ఈ పిచ్చుకలు అడవులు ఎడారులలో నివసించడానికి ఇష్టపడవు. ప్రవేశ పెట్టబడిన లేక చేరిన అనేక ప్రదేశాలలోని వాతావరణాన్ని, ఇతర పరిస్థితులను తట్టుకొని విజయవంతంగా మనుగడ సాగించాయి.

అలవాట్లు

ఇవి సంఘ జీవులు. మానవునితో సహజీవనం చేస్తూ మానవుల నివాసాలను, పరిసరాలను ఆధారం చేసుకొని జీవిస్తాయి. ఏదైనా దూర ప్రాంతాములో మానవులను చేరి నివాసప్రాంతముల ఏర్పరుచుకుంటే అక్కడ చేరతాయి. ఇళ్లల్లోకి నిర్భయముగా ప్రవేశించి డ్రాయింగు రూములలోను, వరండాలలోను, వంట గదుల్లోను పడిపోయిన ఆహార పదార్థాల కోసము గుళ్లు నిర్మించుకోవటానికి అనువయిన స్ఠలాల కోసము తిరుగాడుతుంటాయి. ఇవి ఇళ్ళలోని అద్దాల ముందు గంటల తరబడి కాలక్షేపం చేస్తాయి. కనబడే వాటి ప్రతి బింబాలను ముక్కులతో పొడుస్తూ వాటి కిచకిచలతో కాలక్షేపం చేస్తాయి. ఇలాగా అయిదారు పిచ్చుకలు ఇంట్లో చేరి కిచకిచలాడుతూ గోలచేస్తూ గదిలో ఒక మూల నుండి ఇంకొక మూలకు, నేలపై నుండి గదికప్పు వరకు కలయతిరుగుతూ తీవ్రంగా పోట్లాడుకుంటాయి. వీటి కిచకిచ శబ్దాలే ఇవి గుంపులుగా ఉన్నప్పుడు గాని లేక మన పక్షులు ఆడపక్షులను ఆకర్షించి జత కట్టడానికి గాని, గూడు కట్టిన ప్రదేశాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి గాని చేస్తుంటాయి.

ఈ పిచ్చుకలు గుంపులుగా చేరి మెత్తటి మట్టిలో గాని ఇసుకలో గాని రెక్కలు అతి వేగముగా విదుల్చుకుంటూ, పొట్ట, ఛాతి భాగాలను అటూ ఇటూ త్రిప్పుతూ, పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ స్నానము చేస్తాయి. ఇవి నీళ్లోలో గూడు స్నానం చేస్తాయి.

ఇవి మిగితా వ్యక్తులాగా నడవలేవు. గెంతుతూ ఉంటాయి. ఇవి సూర్యాస్థమయానికి దట్టముగా ఆకులతో కూడుకున్న చెట్లపై గాని, పెద్ద పొదలలోగాని గుంపులు గుంపులుగా చేరి రాత్రి విశ్రాంతి తీసుకుంటాయి. బాగా చీకటి పడేవరకూ వీటి కిచకిచలతో ప్రతిధ్వనించే విధముగా శబ్ధాలు చేస్తాయి. అలాగే తెల్లవారేసరికి ఆహార సంపాదనకు బయలుదేరిపోతాయి.

గూళ్లు – వీటి సంఖ్య

nov10ఇవి 1950 – 1960 దశకముల వరకు చాలా ఎక్కువగా ఉండేవి. అప్పటి గృహ నిర్మాణము మానవుని జీవన విధానము పిచ్చుకల మనుగడకు చాలా అనుకూలముగా ఉండేవి. గ్రామాలంతా అనేకపూరిల్లు, పెంకుటిల్లుతో నిండి ఉండేవి. దాబాలు మేడలు చాలా తక్కువ. ఈ డాబాలు మేడలు పై కప్పు ఇప్పటి కాంక్రీటు లాగా కాకుండా దూలాలతో కూడుకొని అక్కడక్కడ చిన్న సందులు కలిగి, వెడల్పాటి గోడలతో వెంటిలేటర్లతో గూళ్లు నిర్మించుకోవటానికి అనుకూలముగా ఉండేవి. పట్టణాలలో కూడా అనేక పెంకుటిల్లు, పూరిల్లు ఉండేవి. పట్టణాలలో కూడా అనేర పెంకుటిల్లు, పూరిల్లు ఉండేవి. ఇళ్ల చూర్లతోను, పూరింట కప్పులతోను, పటాల వెనుక, గోడల కన్నాలు, సందులలోను, బయటి ఎలక్ట్రికల్ లైట్ల బల్బుల షెడ్డులలోను గూళ్లు కట్టుకునేవి. ఎండుగడ్డి వరకలు దారాలు, పీచు, ఆకులు ఉపయోగించి గుళ్ళు కట్టుకుంటుండేవి, కాళ్లపట్టాలు, గోనె ముక్కల నుండి ఎంతో శ్రమతో శక్తినంతా ఉపయోగిస్తూ కాళ్లను నేలకు గట్టిగా తన్నిపెట్టి ముక్కతో పీచును, దారాలను సేకరించేవి. ప్రతీ పూరింట్లోను సంవత్సరము పొడుగునా రెండుగాని మూడుగాని గూళ్లుండేవి. పెద్ద పూరిళ్లలో ఐదు, ఆరు గూళ్ల వరకు ఉండేవి, పెంకుటిల్లు డాబా ఇళ్లలో గూడా రెండు మూడు గూళ్లుండేవి. పిచుకల సంఖ్య మనుష్యుల సంఖ్య కన్నా రెండు మూడురేట్లుండేవి. 1960 దశకము మొదట్లో భారతదేశపు జనాభా 43 కోట్లు ఉండగా పిచ్చుకల సంఖ్య 900 మిలియన్లకు పైగా ఉండివుండవచ్చు.

ఇవి చెట్లపైన, చెట్లకున్న చిన్నకన్నాలతోను గూళ్లు కట్టుకుంటాయి అయితే ఇలాంటివి చాలా తక్కువగాను అరుదుగాను ఉంటుంది. డా. సలీమ్ అలీ క్వెట్టా ప్రాంతంలో చెట్లపై ఎక్కువ సంఖ్యలో గూళ్లు నిర్మించుకుంటాయని తెలిపారు. ఈ చెట్లపై గూడు గుండ్రముగా ఇంచుమించు ఫుట్ బాల్ సైజుల ఉంటుంది.

ఆహారము

ఇవి ధాన్యము, పప్పులు, గింజలు, పూలమొగ్గలు, లేత ఆకుచిగుర్లు, రొట్టెముక్కలు, ఇళ్లలోని పడిపోయిన ఆహారము, పురుగులు ఆహారంగా తీసుకుంటాయి.

మానవుని ఆహారము – వైద్యము

మానవుడు సృష్టిలోని ఏ ప్రాణిని తన ఆహారముల నుండి విడిచిపెట్టకుండా ఉండటం లేదు. కొన్ని జాతుల వారు పిచ్చుకలను కూడా తింటారు. ఇవి వైద్యానికి కూడా ఉపయోగిస్తున్నారు. పుంసత్వము పెరుగుతుందని ఊరపిచ్చుక మాంసముతో ఊరపిచ్చుక లేహ్యము తయారుచేస్తారు. యునాని వైద్యము కూడా పుసంత్వము పెరుగుటకు, ప్రసవములో స్త్రీలకు కూడా వాడుతున్నారు.

సంఖ్య తగ్గిపోవుటకు కారణాలు

పిచ్చుకల సంఖ్య తగ్గిపోవుటకు అనేక కారణాలున్నాయి. ముఖ్యముగా వాటి గూళ్లను మానవ నివాసాలను ఆధారము చేసుకొని కట్టుకోవడము. గత నాలుగయిదు దశాబ్దాలుపైగా గృహనిర్మాణములో క్రమేపి మార్పు చెందటము వలన పిచ్చుకలకు గూళ్ల స్థలములు దొరకకపోవటము 1970 తరువాత నీలిరంగు ఫ్యానులు విరివిగా వాడకములోనికి రావడము, పిచ్చుకలు ఎంతో జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఈ ఫ్యానుల రెక్కల చివరలకు పిచ్చుకలు తగిలి చనిపోవటమేగాక గూళ్లలోని పిల్లలకు ఆహారము దొరకకపోవటము, గుడ్లు పాడైపోవటము జరిగి పిచ్చుకల ప్రత్యుత్పత్తి చాలావరకు తగ్గిపోవటము ఒక ముఖ్య కారణము. ఈ రెండు ముఖ్య కారణాలతోబాటు మిగితా కారణాలైన ఆహారపు కొరత ముఖ్యము. పట్టణాలు నగరాలలోని ఆహారపు కొరత, పిచ్చుకలను కొన్ని జాతులు ఆహారముగా తీసుకనుట  వైద్యానికి ఉపయోగించటము కొంత కారణము.

ఈ పిచ్చుకలు పొలాలలోని ప్రవేశించి క్రిమిసంహారక మందులను లోనయిన పప్పు ధాన్యలతోపాటు పురుగులను కూడా తినటము కొంత కారణము.

ఈ పిచ్చుకలు పొలాలలోనికి ప్రవేశించి క్రిమిసంహారక మందులకు లోనయిన పప్పు ధాన్యాలతోపాటు పురుగులను కూడా తినటము కొంత కారణము. ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ, సెల్ టవర్లనుండి వెలువడే తరంగాల ప్రభావం వల్ల పిచ్చుకల సంఖ్య తగ్గిపోతున్నట్టుగా శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. సెల్ టవర్ల ప్రభావంపై ఇంకా పరిశోధన జరగాలి.

పర్యావరణ – మానవ జీవితం – పిచ్చుకలు

మానవ జీవితం, మనుగడ జీవితం, మనుగడ పూర్తిగా పర్యావరణ సమతుల్యతపై ఆధారపడి ఉంది. ఈ పర్యావరణము కాలుష్యము, ఆడవులు, చిత్తడి నేలలు, వివిధ ఆవాస ప్రదేశాలు, జీవ వైవిధ్యము, వన్యప్రాణులు మొదలగు ప్రకృతి సంబంధించిన అంశాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఎక్కడ లోపమేర్పడినప్పటికీ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇవి మానవులకు అవసరమయిన పప్పు ధాన్యాలను ఆహారంగా పొలంలో తీసుకున్నప్పటికి వీటితే పాటు పంటలను నాశనం చేసే కీటకాలను అదుపు చేస్తాయి. తమ రెట్టల ద్వారా మొక్కల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అయితే మానవుడు ఈ పప్పు ధాన్యాలపై ఆధారపడి ఉన్నందున ఇవి పంటలను నాశనము చేస్తున్నాయని భావిస్తున్నాడు. కాని నిజానికి మానవ మనుగడకు దోహదము చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి కాదు.

1950 దశకములో చైనాలో జరిగిన సంఘటన చూస్తే ఇవి మానవుని జీవితములో ఎంత ముఖ్యపాత్ర  వహిస్తున్నాయో తెలుస్తుంది. చైనాలో మన పిచ్చుకలతో ఒకటయిన యూరోపియన్ ట్రీ స్పెరోలు నివసిస్తున్నాయి. ఇవి ఎలుకలు లాగానే పంటలను నాసనము చేస్తున్నాయని చైనీయులు భావించి ఈ పిచ్చుకల సాముహిక నిర్మూలనను చైనా ప్రజానికమంతా సిద్ధమయి 1958 సం.లో ఒక రోజు నిర్ణయించారు. ఆ రోజున చైనాలో నివసించే ప్రజలంతా పట్టణాలలో, పల్లెలలోను, పొలాలలోను కనబడిన ప్రతి పిచ్చుకను చంపివేయడము, గుడ్లను పగలగొట్టడము, అవి అలిసిపోయి ఆఖరుకు ఎగురలేక కిందపడి చచ్చిపోయేవరకు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వాటిని వెంటవడడము లాంటి దారుణ హింసాకాండలో ఆ రోజు లక్షలాది పిచ్చుకలు చవిపోయాయి.

అయితే తదుపరి ఏర్పడిన తీవ్ర తప్పిదాని తెలుసుకున్నారు. క్రిమికీటకాదులు అడ్డు అదుపూ లేకుండా పెరిగిపోయి పంటలను నాశనం చేసాయి. లక్షలాది ప్రజలు చనిపోయారు. దీనిని బట్టి మానవుని మనుగడకు పిచ్చుకలు తోడ్పడుతున్నాయని తెలుస్తోంది.

పిచ్చుకల రక్షణ చర్యలు

జీవ వైవిద్యములో భాగమయిన మానవ మనుగడకు తోడ్పడే పిచ్చుకలను నశించనీయకుండా రక్షించుకోవలసి ఉంటుంది. వీటి రక్షణకు గూళ్లను అమర్చటము, ఆహార సదుపాయం, పచ్చని మొక్కలు విరివిగా పెంచడం చేయాలి. పూరిళ్లు, పెంకుటిల్లు, ఇతరాత్రా గూళ్లు కట్టుకునే అవకాశము లేని చోట పిచ్చుకలు కనిపిస్తే వాటిని చిన్న చంక్కపెట్టలతో గానీ ఏర్పాటు చేయాలి. అవసరమయితే వాటికి ఆహార సదుపాయము ధాన్యాన్ని పిట్టగోడ మీద గాన, కృతిమ గూళ్ల ప్రదేశాలలో గాని ఏర్పరచాలి. ఈ ధాన్యముతేబాటు రొట్టె ముక్కలు, పప్పుదినుసులు, గింజలు, ఇతర వంటింట్లో ఆహార పదార్థాలను కూడా పెట్టవచ్చు అయితే కాకులు ఎక్కువగా తిరిగేచోట కాకులు ధాన్యాన్ని తప్పించి మిగితావాటిని తినేస్తాయి. గూళ్లు పిచ్చుకలను కాకులను అందే విధముగా ఉండకూడదు. ఒకవేళ కాకులతో ప్రమాదముందని తెలిస్తే కొద్ది లోతుగా గట్టిగా ఉన్న గూళ్లను గాని, జల్లెడలాంటి తడక లాంటిది కలిగి ఉన్న వరండాలలో గానీ, కాకులు సులభముగా ప్రవేశించని ప్రదేశాలలో గాని గూళ్లు అమర్చాలి. పిచ్చుకల క్రమేపి అలవాటుపడి మనము అమర్చిన గూళ్లతో గూళ్లుకుంటాయి.

ఈ విధముగా బడిపిల్లలు గూళ్లు అమర్చి వాటి రక్షణ చర్యలు చేపట్టవచ్చు. పిచ్చుకలు గూళ్లు కట్టుకొని వాటి పిల్లలకు ఆహారాన్ని పెడుతుంటే ఆ బడి పిల్లలు పొందే ఆనందము చెప్పనలవి కాదు. ఈ ఆనందముతో బాటు పిచ్చుకల రక్షణ ద్వారా కూడా జరుగుతుంది.

ఒక్కోసారి పిచ్చుకలు వెంటనేరావు. నేను చేసిన ప్రయత్నంలో (2003 సం.) పిచ్చుకలు గూళ్లో చేరి సంతానోత్పత్తి చేయటానికి 6 నెలలు పైగా పట్టింది. మేముండే వీధిలో అరడజను వరకు పిచ్చుకలు చూసేవాడిని. మేముండే అపార్ట్మెంట్ లోకి వచ్చేవికావు. మొదట పిట్టగోడమీద రొట్టెముక్కలు, బిస్కెటు ముక్కలు, గింజలు వేసేవాటిని. కాని వాటిని కాకులు తినివేసేవి. ఆలోచించి ధాన్యాన్ని అలవాటు చేశాను. తరువాత నెల్లూరు లోనికి ఆ తరువాత బాల్కనిలోనికి వచ్చే విధముగా చేసాను.

బాల్కనీలోకి వచ్చి అలవాటయిన తరువాత బాల్కనీలో అట్టపెట్టె తో ఒక గూటిని అమర్చాను. ఆ గుటిని చాలారోజులు పరిశీలించాయి. కాని గూడు కట్టలేదు. తరువాత పక్కనే ఉన్న వెడల్పాటి నీటి గొట్టాల పంపుతో గూళ్లు కట్టడానికి ప్రయత్నించాయి కాని కుదరలేదు. తరువాత రెండో గూటిని అమర్చాను. దానిని పరిశీలించి గూడుకట్టి పిల్లలను చేసాయి. తరువాత ఏర్పరచిన మూడవ గూటిలో రెండు పక్కల గూటిని కట్టుకోవడానికి అనువుగా చేసారు. రెండు వైపుల గూళ్లు కట్టి సంతానోత్పత్తి చేసాయి.

అట్టపెట్టెలతో గూళ్లు ఏ విధమయిన శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అయితే ఒక్కోచోట ప్రదేశాననుసరించి చెక్క పెట్టెల గూళ్లు అవసరమవుతాయి. పరిస్థితుల అనుకూలావిన బట్టి, బాగా అనుకూలంగా ఉంటే వెంటనే గూళ్లు కడతాయి.

1996 సంవత్సరములో మా ఇంటి వెంటిలేటరు వద్ద గూడుకట్టడానికి ప్రయత్నించాయి. చాలాకాలము గూళ్లు కట్టే పదార్థాలయిన గడ్డిపరకలు, దారాలు పీచుతో ప్రయత్నించాయి కాని గోడ చాలా సన్నగా ఉండడము వలన గూడు నిలవటం లేదు. అప్పుడు చిన్న అట్టముక్కను సపోర్టుగా అమర్చాను. గూడు కట్టుకోవడానికి అనువుగా ఏర్పడి గూడు నిర్మించి గుడ్లు పొదిగి పిల్లలను చేసాయి. మనమిచ్చే ఈ చిన్ని సహాయం పిచ్చుకలను ఎంతో మేలు చేస్తుంది. వాటి సంతానాభివృద్ది చేసుకోవటానికి ఎంతో సహాయపడుతూ పిచ్చుకల జాతిని రక్షించటానికి తోడ్పడుతుంది. మనవంతు ప్రయత్నంతో పిచ్చుకలు అంతరించిపోయే జాతి లోనికి రానీయకుండా చేద్దాం. కృషితో నాస్తి దుర్భిక్షం.

ఆధారం: కోకా మృత్యుంజయరావు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate