పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పెంగ్విన్ పక్షులు

పెంగ్విన్ పక్షుల గురించి తెలుసుకుందాం.

jan15హలో చిన్నారులూ! మీరు పెంగ్విన్ పక్షుల్ని చూశారా? చాలా తమాషాగా ఉంటాయి కదూ! వీపంతా నల్లని చర్మం, పొట్టంతా తెలుపు. పెంగ్విన్లు చాలా వరకు చిన్నవి. 'హాంగ్ కాంగ్’ ఓషన్ పార్కులో పెద్ద సైజు పెంగ్విన్లను చూడొచ్చును. పెద్ద పెంగ్విన్లు దాదాపు 1.1 మీటర్లు ఎత్తు, 35 కిలోల బరువును కలిగి ఉంటాయి. ఇలాంటి పెద్ద పెంగ్విన్లను ‘ఎంపరర్ పెంగ్విన్లు' అంటారు. వీటి యొక్క శాస్త్రీయ నామము ‘ఆప్టినోడైట్ ఫారెస్టరీ' (Aptinuodytes Forsteri).

పెంగ్విన్లు అన్నింటిలోకీ అత్యంత చిన్నదైన పక్షి 'లిటిల్ బ్లూ పెంగ్విన్'. దీనిని 'ఫెయిరీ పెంగ్విన్' అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం 'యూడిప్టిలా మైనర్' (Eudlyptulu intinuor) పెంగ్విన్లన్నీ ఎక్కువగా దక్షిణార్థ భూగోళంలోనే నివసిస్తాయి. 'గాలపోగస్ పెంగ్విన్లు’ మాత్రం ఉత్తరార్ధ భూగోళంలో నివసిస్తాయి. పెద్ద పెంగ్విన్లు చలి ప్రదేశాలలో ఉంటాయి.

పెంగ్విన్లు తమ జీవిత కాలంలో సగం నేలమీద, సగం నీటిమీద గడుస్తుంది. కోప్ టౌన్ లో పెంగ్విన్ పార్కులో కనిపించేవి ఆఫ్రికన్ పెంగ్విన్లు. ఇవి చాలా చిన్న కార్డేటా వర్గంలో పక్షుల విభాగానికి చెందినప్పటికీ గాల్లో ఎగరలేవు. వీటి కాళ్ళు నీటిలో ఈదడానికి అనువుగా ఉంటాయి.

ఈ ఆఫ్రికన్ పెంగ్విన్ల యొక్క శాస్త్రీయనామము స్ఫినిస్కస్ డెమర్సస్ (Spheniscus demersus). వీటిని ‘జాకాస్ పెంగ్విన్లు' అని అంటారు. ఇవి చేసే శబ్దాలు గాడిద ఓండ్రలాగా, శబ్దం పెద్ద జంతువుల అరుపు లాగా ఉంటుంది. వీటిని 'బ్లాక్ పుటెడ్ పెంగ్విన్లు' అని కూడా అంటారు.

ఆఫ్రికన్ పెంగ్విన్లు 60 నుంచి 70 సెం.మీల పొడవు ఉంటాయి. ప్రౌఢ పెంగ్విన్లు 3.5 కిలోల బరువు ఉంటాయి. వీటి కళ్ళ పైభాగాన గులాబి రంగు మచ్చలు ఉంటాయి. ఇవి రకరకాల ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నపుడు పెంగ్విన్ శరీరం గ్రంధులలోనికి ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తాయి. దీని వలన శరీరం చుట్టూ ఉన్న గాలిని చల్లబరుస్తుంది. ఆ గ్రంథులలోనికి ఎక్కువ రక్తం ప్రసారం కావడం మూలంగా అవి గులాబీ రంగును సంతరించుకుంటాయి.

మొహానికి నలుపు రంగు మాస్క్ వేసినట్లుగా ఉంటుంది. ఇంకా పొట్ట భాగంలో తెలుపురంగు స్కేలుతో గీత గీసినట్లుగా ఉంటుంది. వీపు భాగం నల్లరంగుతో కప్పబడి ఉంటుంది.

మగ పెంగ్విన్లకు ఆడ పెంగ్విన్లకు కొద్దిపాటి భేదాన్ని కలిగి ఉంటాయి. ఆడ పెంగ్విన్ల కన్నా మగ పెంగ్విన్లు ఆకారంలో కొద్దిగా పెద్దగానూ ఇంకా పెద్ద ముక్కులతోనూ ఉంటాయి. పెంగ్విన్ల పొట్ట మీద ఉండే నల్లని మచ్చలు మరియు నల్లని చారలు మనుష్యుల వేలి ముద్రల లాగా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. మాజిల్లెనిక్ పెంగ్విన్లు కూడా ఆఫ్రికన్ పెంగ్విన్ల వలెనే ఉండటం వల్ల రెండింటినీ కనుక్కోవడం కష్టం. రెండు రకాల పెంగ్విన్లకూ గొంతు, పొట్ట భాగంలో ఉండే మచ్చలు ఒకే రకంగా ఉంటాయి.

పెంగ్విన్లు ఒక్కొక్కసారి రెండు గుడ్లను పెడతాయి. దక్షిణ ఆఫ్రికా పెంగ్విన్లు మార్చినుండి 'మే' నెల వరకు, గుడ్లను పెడతాయి. అదే నమీబియాలోని పెంగ్విన్లు అయితే నవంబరు డిసెంబరు నెలల్లో గుడ్లను పెడతాయి. పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి. బొరియలు తవ్వి లేదా ఇసుకను తవ్వి గుడ్లను పెడతాయి. గుడ్లను నలభై రోజులు పొదుగుతాయి. 12 నుంచి 22 నెలలకు గానీ ప్రౌఢజీవి వలే బొచ్చు రాదు.

గుడ్లు పెట్టేందుకు నేలమీదకు వస్తాయి. 20 వ శతాబ్దం మధ్య నుండి పెంగ్విన్ గుడ్లను సేకరించి అమ్మడం మొదలుపెట్టారు. కానీ సేకరణ అమ్మకాల మధ్య పట్టే సమయం ఎక్కువవ్వటం వల్ల గుడ్లు చెడిపోతుండటంతో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు.

పెంగ్విన్ సముద్రం పై భాగాన తిరుగుతుంటాయి. ఒడ్డు నుండి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉంటాయి. 'పిలోచార్టులు’ అనే పేలాజిక్ చేపలను చిన్న చిన్న క్రస్టేషియన్లను తింటాయి. ఇంకా మెరైన్ ఇన్వర్టిబ్రేట్స్ అయినటువంటి స్వ్కీడ్ (ఒక రకమైన చేపలు) లను తింటాయి.

ఆఫ్రికన్ పెంగ్విన్ల జీవిత కాలం పది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు. కొన్ని పెంగ్విన్లు 30 ఏళ్ళు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సముద్రంలో షార్కులు, సీల్లు వీటిని వేటాడి తింటాయి. నేల మీద ముంగిసలు, లెపాడ్జ్, సాధారణ పిల్లులు, జెనెట్స్, (ఆఫ్రికన్ పిల్లులు) కారాకాల్స్ (రాత్రుళ్ళు సంచరించే ఆఫ్రికన్ పిల్లులు) మొదలైన జంతువులు పెంగ్విన్లకు శత్రువులు.

పెంగ్విన్లు ప్రధానాంశంగా పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు చాలా తీశారు. కార్టూన్లు మరియు టెలివిజన్ డ్రామాలు కూడా ఎన్నో వచ్చాయి. ఇందులో ‘పింగూ' అనే పాత్ర ఎంతో పేరు పొందింది. సిల్వియా మజోలా ఈ 'పింగూ'ను సృష్టించాడు. 1986 లో వందకు పైగా పార్ట్ ఎపిసోడ్లు తీశాడు. రిచర్లు మరియు ఫ్లారెన్స్ అట్ వాటర్ అనే రచయితలు పిల్లల కోసం రాసిన “మిస్టర్ పాపర్స్ పెంగ్విన్" అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. 1982 లో ‘సెగా' అనే అతను 'పెంగో' అనే వీడియోగేమ్ ను విడుదల చేశాడు. వీటి నడక, నాట్యం తమాషాగా ఉండటం వలన పిల్లలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. పెంగ్విన్లును అనేక మస్కట్లుగా కార్టూన్ పాత్రలుగా సృష్టించారు.

ఆధారం: డా. కందేపి రాణి ప్రసాద్

3.0110701107
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు