పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రపంచ గమనాన్ని మార్చిన వ్యవసాయం

మానవుడు వ్యవసాయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలుపెట్టాడో తెలుసుకందాం.

jan12నూతన సంవత్సరం 2018 లోకి అడుగిడిన మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. పంటల పండగ సంక్రాంతికి స్వాగతం. భారత దేశం గ్రామాల్లోనే నివశిస్తోందన్న మహాత్ముని మాటలు వినే ఉంటారు కదా! అంటే 70 శాతం పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే మనదేశాన్ని వ్యవసాయక దేశమని అంటారు. సేద్యం అంటే పైరు. పంటలు. పొలాలు. రైతులు. పంట పండితే సంబరాలు. ఎండితే కరువు కాటకాలు.

రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందంటారు. ఈ పంటలు పండించటం, వ్యవసాయం చేయటం ఎలా వచ్చింది? ఎవరు సృష్టించారు? ఆలోచించారా ఎపుడైనా? మనం తినే ఆహార పంటలు మనిషి ఆవిర్భవించిన నాటి నుండి ఉన్నాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు వచ్చాయి. దీన్ని వివరించడనాకి కొన్ని సిద్దాంతాలు వచ్చాయి కూడ? ఈజిప్షియన్లు, గ్రీకులు వ్యవసాయం దేవుడిచ్చిన వరం అని నమ్మేవారు. మొక్కల్ని ఒకచోట చేర్చటం వల్ల, తీరుగా ఒకే జాతి మొక్కల్ని పెంచటం నుంచి వ్యవసాయంగా ఎదిగిందిదన్న సిద్దాంతం కూడా ఉంది.

చెత్త చెదారం, పెంటకుప్పలపై మొక్కలు దృఢంగా పెరగటం కూడా వ్యవసాయాభివృద్ధికి తోడ్పడింది. ఇదేదో ఉన్న పళాన ఊడిపడిన వరం కాదని, ఇదొక క్రమపద్ధతిలో పరిణామం చెందిందని పురావస్తు శాస్త్రవేత్తలు పాత సిద్ధాంతాలను తిప్పికొట్టారు. ఇందుకు ఆయా కాలాల్లో ప్రజలు వాడిన పరికరాలను సాక్ష్యంగా చూపారు. ఆ పరికరాల ఆధారంగా శాస్త్రజ్ఞులు గత కాలాన్ని వివిధ యుగాలుగా విభజించారు.

రాతి యుగం: దీనిని పాతరాతి యుగం, కొత్త రాతి యుగమని రెండుగా విభజించారు. పాతరాతి యుగం (Paleolithic) మనిషి ప్రధానంగా వేట ఆహార సమీకరణ పైనే ఆధారపడ్డాడు. కొత్తరాతి యుగంలో (Neolithic) మొక్కలను పెంచటం, జంతువులను సంకరం చేయటం చేశాడు.

ఇవి గాక ఇత్తడి, ఇనుము యుగాలను కూడ గుర్తించారు. పరిణామక్రమంలో కొత్త కొత్త పని ముట్లను మనిషి తయారు చేసుకుని మానవనాగరికతా వికాసానికి బాటలు వేశాడు.

మానవ జాతి ఆవిర్భవించి సుమారు నాలుగు లక్షల సంవత్సరాలు అయింది. నాటి నుండి ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు, కందమూలాలతో జీవించింది. అది ఆహార సేకరణ దశ. ఆ పైన జంతువులను ఆహారంగా స్వీకరించడం మొదలైంది. మొక్కలను తనకు కావలసిన రీతిలో తన అవసరాల కోసం సేద్యం చేయటాన్ని లేదా వ్యవసాయాన్ని ఇటీవలే అంటే 10 వేల సంవత్సరాల క్రిందటే మొదలైంది.

ఎక్కువ కాలం ఆహారాన్ని వెతుక్కోవటానికి, జంతువులను వేటాడటంలోనే గడిపిన మానవుడు శ్రమతో, మేధస్సుతో ప్రకృతి వనరుల్ని వాడుకుని అభివృద్ధి చేసిందే వ్యవసాయం. జీవ పరిణామానికి ప్రకృతి వరణం లేదా ఎంపిక (Natural Selection) చోదక శక్తి అయితే, మనిషి తన అవసరాల కోసం మొక్కల్ని కృత్రిమంగా ఎంపిక చేయటం (Artificial Selection) వ్యవసాయ పరిణామానికి ఇరుసుగా పనిచేసింది.

jan14వ్యవసాయం (పంటలు పండించటం) అనేది. లేని కాలంలో మనిషి తన మనుగడకు, ఆహారానికి సహజంగా లభించే వన్య ప్రాణులు, మొక్కల పైనే ఆధారపడ్డాడు. పదివేల సంవత్సరాల క్రితం మానవ జనాభా సుమారు 5 మిలియన్లు. అప్పుడు ప్రతి 25 చ.కి.మీ. కు ఒకరుండేవారు. ఇప్పుడు ఏడు బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ప్రతి చదరపు కి.మీ.కు 25 మంది ఉన్నారు. మనిషి తాను బతికటం కోసం, శక్తినిచ్చే (కేలరీలు) మొక్కల అన్వేషణ చేపట్టాడు. నేటికి సుమారు 5 వేల జాతులకు పైగా మొక్కల్ని ఆహారానికై వాడుతున్నాం. మొత్తం ఈ భూమ్మీదవున్న మొక్కల జాతుల్లో ఇవి కేవలం 1 శాతం కంటే తక్కువే! సువారు 150 కిపైగా జాతులను ఆహారం కోసం వాణిజ్యపరంగా సాగుచేస్తున్నారు.

తొలిరోజుల్లో వ్యవసాయం

వేటాడటం, సేకరించటమే (Hunter-Gatherings) పధానం. దొరికిన ఆహారాన్ని తినటం తప్ప వేరే మార్గం లేదు. దాదాపు 60-80 శాతం మొక్కల నుండే ఆహారం లభించేది. అడవుల్లో సహజంగా పెరిగే వన్యవరి (Wild Rice), చిరుధాన్యాల గడ్డిగింజలు, వేరు పంటలు, కాయలు, ఫలాలు పేర్కొనదగినవి. నూనె మాత్రం జంతువుల నుండి, కొబ్బరి, ఆలివ్, షియా, ఆయిల్ పామ్ వంటి కొన్ని మొక్కల్నుండి లభించేది.

వ్యవసాయం ఎప్పుడు, ఎక్కడ మొదలైంది?

జంతువులను వేటాడుతూ, జంతువులతో పోటీపడి జీవనం సాగించే మనుషులు వేటాడటానికి సమూహాలుగా గుంపులుగా, తెగలుగా ఏర్పడినారు. సంచార జాతులు వ్యవసాయం వచ్చాక నదీ పరీవాహక ప్రాంతాల్లో స్థిర నివాసాలేర్పరచుకుని నూతన నాగరికతా వికాసానికి తలుపులు తెరిచారు. క్రీ.పూ. ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల సం. ప్రాంతంలో మెసపుటోమియా ప్రాంతంలో వ్యవసాయానికి తొలి బీజం పడింది. గోధుమ, బార్లీ, శనగలు, ఓట్లు, ఆలివ్, ద్రాక్ష, దానిమ్మ వంటి పంటలు పండించటం, మొదలైంది. ఆఫ్రికా మధ్య ప్రాంతంలో (Central Africa) కాఫీ, జొన్న, చిరుధాన్యాలు, కంద, అలసంద వంటి పంటలను క్రీ.పూ. 4000 సం. కాలంలో సాగు చేయనారంభించారు. అదే కాలంలో చైనాలో కూడా వ్యవసాయం ఆరంభమైంది. అక్కడ ప్రధానంగా వరి, చిరుధాన్యాలు (Millets), మల్బరీ, పోయాబీన్, ఆప్రికాట్, హాజిల్నట్, చెస్చ్ నట్ వంటివి పెంటారు. ఆసియా నైరుతి ప్రాంతంలో క్రీ.పూ 6000 సం. క్రితమే వ్యవసాయం మొదలైంది. ఇక్కడ ముఖ్యంగా వరి, చెరకు, కొబ్బరి, అరటి, మామిడి, నారింజ, కంద, చేమగడ్డలను సాగు చేశారు. అమెరికా ఖండంలో 5 వేల నుండి 7 వే సం. మధ్య కాలంలో మొక్కజొన్న చిలగడదుంప ఆలుగడ్డ, టమాట, పత్తి, బొప్పాయి. అనాస వంటి పంటలు ఉనికిలోకి వచ్చాయి. దక్షిణ అమెరికా వ్యవసాయ పంటల సాగులో ముందుండగా ఉత్తరమెరికాలో కేవలం కొన్ని పంటలు మాత్రమే సాగులోకొచ్చాయి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఈ పంటలు విస్తరించినాయి.

వ్యవసాయం ఎలా మొదలైంది?

శాకీయంగా పెరిగే మొక్కలను ముందుగా పెంచినట్లు తొలి సాక్ష్యాలు చెబుతున్నయి. ద్రాక్ష, మల్బరీ, దానిమ్మ, ఆలివ్, ఫిన్లు ముఖ్యమైనవి. వీటిలో బాగా పెరిగే వాటిని గుర్తించి, ఎక్కువ సంఖ్యలో పెంచేవారు. విత్తనాల ద్వారా పంటలు పెంచటం ఎక్కువ పంటదిగుబడికి తోడ్పడింది. పెద్ద విత్తనాలు బలిష్టమైన మొక్కల్నిస్తాయని అనుభవంలో తెల్సుకున్నారు.

వావిలోవ్ కేంద్రాలు

భూగోళం పై ఎక్కడెక్కడ పంటలు ఆవిర్భవించాయి? ఆధునిక పంటలకు వన్య రకాలైన చోటే కొత్త కొత్త వాటి సమీప బంధువుల వంటి మొక్కలున్న పంటలు వచ్చాయి. వావిలోవ్ అనే రష్యన్ జీవ శాస్త్రవేత్త భూగోళంపై ఏ ఏ ప్రాంతాల్లో మొట్టమొదట పంటలను సాగుకు తెచ్చారో గుర్తించాడు. అటువంటి ఎనిమిది కేంద్రాలను 'వావిలోవ్ కేంద్రాలు' గా పిలుస్తారు. ఈ ప్రాంతాలు అమూల్యమైన జన్యు వనరులుగా మొక్కల సంకరణం చేసే జన్యు శాస్త్రవేత్తలకు ఉపయోగపడతాయి. ఈ కేంద్రాలు జీవవైవిధ్యానికి పెట్టని కోటలు. అంతమాత్రాన పంటలు వాటంతటవే అభివృద్ది చెందలేదు. మానవ ప్రయత్నం, శ్రమ, మేధస్సుతోనే వ్యవసాయం వెలుగు చూసింది. వ్యవసాయం మనిషికి ఆహార రక్షణ నిచ్చింది. వేటకు, ఆహారానికి నిరంతరం తిరిగిన మనిషికి వ్యవసాయం కొంత స్వాంతనను, చేతులకు కొంద విశ్రాంతిని ఇచ్చింది. దీనితో మానవ మేధస్సు కళలు, సంగీతంపై దృష్టిపెట్టింది. ఇది నిజమని ఎలా నమ్మాలి? గుహల్లో ఆదిమానవులు వేసిన పెయింటింగు (బొమ్మలు) లను కనుగొనటంతో ఇలా జరిగిందనటానికి రుజువులు దొరికాయి. ఎముకల్ని సంగీత వాద్యాలుగా మలచారు. తవ్వకాల్లో వీటి రూపాలు లభించాయి. మనిషి మొట్టమొదట తయారు చేసిన సంగీత పరికరం ఏదో చెప్పగలరా? అదే ఈల కర్ర లేదా వేణువు. 30 వేల సం. నాటి ఈ వేణువు మనకు తవ్వాకాల్లో లభించిన తొలి ఆధారం. కొత్తరాతి యుగంలో పాడిన కుండలు, కొదవళ్లు పిండి చేసే రాళ్లు కూడా లభించటంతో పరిణామం చెందుతున్న మానవ నాగరికత , వ్యవసాయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం.

వ్యవసాయంతో ఏమిటి ప్రయోజనం?

సంచార జీవనం కంటే మెరుగైన స్థిర జీవనానికి తోడ్పడింది. మొత్తం జీవనశైలినే మార్చివేసింది. మెరుగైన ఆరోగ్యంతో జీవిత కాలం కూడ పెరిగింది. సాంస్కృతికంగా అభివృద్ది చెందటం సాధ్యమైంది. ఎందుకంటే వ్యవసాయం ఇచ్చిన ఖాళీ సమయంలో కొందరు తమ నైపుణ్యాలను పెంచుకునే వీలు చిక్కింది. కళల, పనిముట్ల తయారీ అభివృద్ధి చెందాయి. మొక్కలు, జంతువుల పెంపుతో వ్యవసాయంలో దిగుబడి పెరిగింది. మేలు రకాలు ఎంపిక చేశాడు. విత్తనాల నిచ్చే పంటలను, పోషకాహారం ఉండే పంటలను అభివృద్ధి చేశాడు. ఎక్కువ కాలం నిల్వ ఉంటే సామర్థ్యం పెంచాడు. మనిషి జీవన శైలి ఏకంగా వ్యవసాయక జీవన శైలికి మారిపోవటంతో మార్పులు గొప్పగా చోటుచేసుకున్నాయి. తన అవసరం కోసం మనిషి కనిపెట్టి, అభివృద్ధి చేసిన వ్యవసాయం ప్రపంచ గమనాన్నే మార్చివేసింది గదా!

ఆధారం: ప్రొ. కట్టా సత్య ప్రసాద్

3.02545454545
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు