অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రశ్నలు వేయకూడదా?

ప్రశ్నలు వేయకూడదా?

రాజయ్య గారు హైదరాబాదులో కాపురం ఉంటున్నారు. వాళ్ళమ్మాయి ఉష. రాజయ్య గారు సైన్సువాది. ఆయన కూతురు ఉషను కూడ సైన్సువాదిగానే పెంచదలచుకున్నాడు. అందువలన ఏ అంశం మీదనై నా ప్రశ్నలు వేయమనీ, వాటికి రుజువులతో కూడిన సమాధానాలు వస్తేనే నమ్మమనీ, అలా కాకపోతే నమ్మవద్దనీ కుమార్తెతో చెప్పేవాడు. ఉష తననేగాక, తన మిత్రులనీ ఇరుగుపొరుగు “అంకుల్స్'నీ ప్రశ్నలు అడుగుతుంటే మురిసిపోయేవాడు.

ఇలా ఉండగా వాళ్ళ పక్క ఇంట్లోకి నారాయణశాస్త్రి అని ఒకాయన తన కుటుంబంతో అద్దెకు దిగారు. కొద్ది రోజుల్లోనే తన చొరవతో ఉష, శాస్త్రి గారింట్లో ఒక పిల్లగా కలిసిపోయింది.

ఒక రోజున తన అలవాటు ప్రకారం ఉష, 'శాస్త్రి అంకుల్! జ్యోతిష్య శాస్త్రమా?' అని అడిగింది. నారాయణశాస్త్రి 'అవునమ్మా!' అని సమాధానం చెప్పాడు.

అంకుల్! జ్యోతిషం ప్రకారం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడట గదా? మా సైన్సు పుస్తకాల్లో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని రుజువు చేయబడింది గదా? మరి తప్పుడు సిద్ధాంతం మీద ఆధారపడ్డ జ్యోతిష ఫలితాలు తప్పుకాక శాస్త్రం అవుతాయా?' అని ఉష ఆయన్నడిగింది.

శాస్త్రి 'తప్పమ్మా! అలా వితండ వాదం చేయకూడదు. జ్యోతిష్యం మన పెద్దలు ఏనాటి నుండో మనకందించిన విజ్ఞానం. దాన్ని ప్రశ్నించకూడదు' అన్నాడు.

ఉష మౌనంగా ఇంటికి వచ్చింది.

ఇంకో రోజు ఉష శాస్త్రి వాళ్ళింటికి వెళ్ళి కబుర్లు చెబుతూ గోరు ఒకటి తీసి ప్రక్కకు పడేసింది.

శాస్త్రి కంగారుగా “అయ్యయ్యో! గోరు తీసి అట్లా ఇంట్లో పడవేయ కూడదమ్మా! ఇంట్లో ఉన్న డబ్బంతా నష్టం అవుతుంది' అన్నాడు.

ఉష 'అదేంటి అంకుల్! మా నాన్న ఫ్రెండు విశ్వం అంకుల్ అది వట్టి మూఢనమ్మకం అంటారు. ఆయన హాండ్ బాగ్ లో ఎప్పుడూ ఒక గోరు ఉంటుంది. అది పదేళ్ళ నుంచీ ఆ బ్యాగ్ లోనే ఉందట. ఆయన అందరికీ ఆ గోరు చూపిస్తుంటారు. ఆయనకేమీ డబ్బు నష్టం జరుగలేదు గదా?? అన్నది.

శాస్త్రి వద్ద సమాధానమే లేదు.

ఇలా వాళ్ళింటికి వెళ్ళినప్పుడుల్లా ఉష శాస్త్రిని ఇలాంటి ప్రశ్నలతో విసిగిస్తుండేది. శాస్త్రి యీ ప్రశ్నల ప్రవాహాన్ని శాశ్వతంగా ఆపాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించి పెట్టుకున్నాడు.

మరునాడు ఉష, శాస్త్రి వాళ్ళింటికి వచ్చి 'అంకుల్! ఏదైనా పనికి బయలుదేరినపుడు ఎవరైనా తుమ్మితే అది అపశకునం అనేది మూఢనమ్మకమట. గదా? మా నాన్న చెప్పారు. గాలిలోని ధూళి కణాలు ఎక్కువగా ముక్కులోకి పోతే, మన శరీరం తుమ్ము ద్వారా ఆ కణాలను బయటకు నెట్టి వేస్తుందట. అంతే కాని తుమ్ముకూ, మనం బయలుదేరిన పనికీ సంబంధం లేదట. అవునా?' అని అడిగింది.

వెంటనే శాస్త్రి “తప్పమ్మా! చిన్న పిల్లవు నీవు అలాటి ప్రశ్నలు వేయకూడదు. పిల్లలు అలా ప్రశ్నలు వేస్తే, వాళ్ళ తండ్రి చనిపోతాడు అని శాస్త్రం చెబుతోంది. ఇంకెప్పుడూ అలాంటి ప్రశ్నలు వేయకు' అన్నాడు.

అంతే! ఉష దిగ్ర్భాంతి చెందింది. ప్రశ్నలు వేస్తే తన తండ్రి చనిపోతాడని అంకుల్ చెప్పారు. ఇంకెప్పుడూ ఎవరినీ ఏ ప్రశ్నా వేయకూడదు అని నిర్ణయించుకుంది.

నెల రోజుల గడిచాయి. ఈ నెలలో తననుగాని, తన తండ్రిని గానీ ఒక్క ప్రశ్న కూడా ఉష వెయ్యక పోవడాన్ని రాజయ్య గమనించాడు. ఒక రోజు ఉషను పిలిచి, దగ్గర కూర్చోబెట్టుకొని 'అమ్మలూ! నెల రోజుల నుంచీ నిన్ను గమనిస్తున్నాను. ఇంతకు ముందు గలగలా మాట్లాడుతూ, సెన్సుకు సంబంధించిన నీ డౌట్లు అన్నీ అడుగుతూ ఉండే దానివి. ఈ నెల రోజుల నుంచీ ఒక్క ప్రశ్న కూడ వెయ్యలేదెందుకనిరా?” అని అడిగాడు.

ఉష ముందు మౌనంగా ఊరుకుంది. మళ్ళా అడిగితే 'ఏం లేదు డాడీ' అంది.

ఏదో ఉందిరా! నతో చెప్పు. ఫరావాలేదు అని రాజయ్య ఆ అమ్మాయిని ఒత్తిడి చేశాడు.

వెంటనే ఉష పెద్దగా ఎదవసాగింది.

రాజయ్యకు ఆశ్చర్యం వేసింది. ఆమెను ఓదారుస్తూ ఎందుకు ఏడుస్తున్నావురా? చెప్పు అన్నాడు.

ఉష ఏడుస్తూనే నేను ప్రశ్నలు వేస్తే నువ్వు చచ్చిపోతావుట, శాస్త్రి అంకుల్ చెప్పారు. అందుకని నేనెవరినీ ప్రశ్నలు వేయును' అంది.

రాజయ్యకు విషయం అర్థమైంది. శాస్త్రి మీద కోపం వచ్చింది. అయినా తమాయించుకొని, కొంచెం సేపు ఆలోచించుకొని ఉషతో ఇలా అన్నాడు. పిచ్చి తల్లీ! అదంతా అబద్ధంగా, నన్ను చూడు. నేను నా చిన్నతనం నుంచీ మీ తాతయ్యను నీలాగే ప్రశ్నలు అడుగుతున్నాను. తాతయ్యకిప్పుడు 70 ఏళ్ళు, ఆయనింకా ఆరోగ్యంగా ఉన్నాడుగదా? పిల్లలు ప్రశ్నలు వేస్తే వాళ్ళ తల్లితండ్రులు చనిపోతారనడం తప్పుడు ప్రచారం. దాన్ని నమ్మకు" అన్నాడు.

ఉషకు కూడ నాన్న చెప్పిందే నిజమనిపించింది. వెంటనే నవ్వుతూ అయితే ఇక నుంచి నేను మరలా సైన్సు ప్రశ్నలు వేస్తుంటాను డాడీ! అంది. 'వెరీగుడ్' అన్నాడు రాజయ్య. (నోట్: జరిగిన కథలోని పేర్లు మార్చబడ్డాయి).

ఆధారం:  కె. ఎల్. కాంతారావు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate