పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఫలం... ఆరోగ్యానికి వరం

పలు రకాల పండ్లల్లో లభించే పోషకాల గురించి తెలుసుకుందామా.

may15వేసవిలో పండ్లతో ప్రయోజనాలెన్నో... రోగాలను దూరం చేసే దివ్యౌషధాలు

పండ్లు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యవరదాయునులు. పచ్చివైనా, పండినవైనా ఫలాల్లోని పోషక విలువలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అలసటను తొలిగించి తక్షణ శక్తినిస్తాయి. పలు రకాల పండ్లల్లో లభించే పోషకాల గురించి తెలుసుకుందామా.

కొలెస్ట్రాల్ నిరోధానికి ద్రాక్ష

ద్రాక్ష కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. ఇందులోని పాలీఫినాల్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను పెరగకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. సోడియం, లవణాలు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా నివారిస్తుంది.

ఆకలిని తగ్గించే అరటి

సామాన్యుడికి అందుబాటులో ఉండేది అరటి పండు. జీర్ణక్రియ సమస్య ఉన్నవారు తీసుకుంటే ఫలితం ఉంటుంది. తక్షణ శక్తినిచ్చి ఆకలి తీర్చడంలో దీని మించింది లేదు. కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటిపండులో నీరు 70.01 గ్రాములు, ప్రోటీన్లు 1.2 గ్రాములు, కొవ్వు 0.3 గ్రాములు, పిండి పదార్థాలు 27.2 గ్రాములు, కాల్షియం 17 మిల్లీగ్రాములు, ఇనుము 0.4 మిల్లీగ్రాములు, సోడియం 37 మిల్లీగ్రాములు పొటాషియం 88 మిల్లీగ్రాములు, జింక్ 0.15 మిల్లీగ్రాములు క్రోమియం 0.004 మిల్లీగ్రాములు, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, రిబోఫ్లావిన్ 0.08 మిల్లీగ్రాములు, థయామిన్ 0.05 మిల్లీగ్రాములు, నియాసిస్ 0.5 గ్రాములు ఉంటాయి. ఒక అరటి పండు 116 క్యాలరీల శక్తినిస్తుంది.

చర్మ సౌందర్యానికి దానిమ్మ

ఎండదెబ్బ నుంచి రక్షించడంతో పాటు చర్మ సౌందర్యాన్ని కాపాడటానికి దానిమ్మ ఉపయోగపడుతుంది. ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నావారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

చల్లదనానికి పుచ్చకాయ

శరీరాన్ని తక్షణం చల్లబరచడంలో పుచ్చకాయ ఉపయోగపడుతుంది. ఇందులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల తక్షణం దాహార్తిని తీరుస్తుంది. కెరోటినాయిడ్స్, బీటా కోరోటిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం 'ఎ' విటమిన్ గా మార్చుకుంటుంది. బీ6, సి విటమిన్లు పీచు పదార్థాలు, సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లు ఎక్కువగా లభిస్తాయి.

అందరి ఫలం బొప్పాయి

షుగర్ పేషెంట్స్ సహా ప్రతి ఒక్కరు తినగలిగే పండు బొప్పాయి. విటమిన్ 'ఎ' వృష్కలంగా లభిస్తుంది. దీనితోపాటు బి, సి విటమిన్లు కెరోటిన్ అధికంగా ఉంటాయి. ప్లేవొలాయిడ్స్, పాంథోనిక్ ఆమ్లాలు, పీచు పదార్థాలు బొప్పాయిలో దొరుకుతాయి. బీటా కెరోటిన్ కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది.

పుల్లగా...తీయగా పైనాపిల్

పుల్లపుల్లగా... తీయతీయగా... తినగానే అనిపించే పండు పైనాపిల్. దీనిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. 87.8 శాతం నీరు ఉంటుంది. ప్రోటీన్లు 0.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రాములు, పిండి పదార్థాలు 10.8 గ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు ఉంటాయి.

జామలో మల్టీ విటమిన్స్

జీవకణాల ఆరోగ్యానికి జామ బాగా పనిచేస్తుంది. 100 గ్రాముల పండలో 496 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. మల్టీవిటమిన్స్ కోసం టానిక్లు తీసుకోవడం కన్నా ఒక జామ పండు తీసుకుంటే అంతటి ఉపకారం చేస్తుందని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.

జీర్ణశక్తికి సపోటా

జీర్ణక్రియ సామర్థ్యాన్ని పెంచడంలో సపోటా పండు ఉపకారిగా పని చేస్తుంది. కాల్షియం, ఐరన్, సమృద్ధిగా లభిస్తాయి. బీ1, బీ6, బీ12 తో పాటు విటమిన్ ఇ సపోటలో లభిస్తుంది. వీటితో పాటు నీరు ఎక్కువగా ఉండడం వల్ల వేసవిలో దాహార్తిని తీరుస్తుంది.

వడదెబ్బ నుంచి రక్షణకు నిమ్మ

వడదెబ్బ నుంచి రక్షణ కల్పించడంలో నిమ్మ పండును మించింది లేదు. సీ విటమిన్ నిధిగా చెప్పుకోవచ్చు. వేసవిలో నిమ్మ రసానికి కాస్త ఉప్పు, పంచదార కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధిక శక్తి ఎక్కువ. జలుబు చేసిన వారికి, జీర్ణక్రియ సక్రమంగా లేనివారికి నిమ్మ పండు ఎంతో మేలు చేస్తుంది. చర్మసౌందర్యాన్ని కాపాడుతుంది.

రక్త శుద్ధికి ఆపిల్

ఆపిల్ రక్తాన్ని శుద్ధిచేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. దీనిలో ఉండే పెక్టిన్ అనే రసాయనం పేగులను రక్షించే బాక్టీరియాను పెంచుతుంది. పేగులకు హాని చేసే సూక్ష్మక్రిములను నియంత్రిస్తుంది.

పసందైన పండు బత్తాయి

విటమిన్ సీ లోపం ఉన్నవారికి దివ్యౌషధం. లాలాజలం ఊరడానికి బత్తాయి బాగా పని చేస్తుంది. పంటి చిగుళ్లు, గొంతు సంబంధమైన ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. దీనిలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ముడతలు పడకుండా, పొడిబారకుండా కాపాడుంతుంది.

వేసవి ఫలం మామిడి

వేసవిలో మాత్రమే లభించే మామిడిలో విటమిన్లు ఎక్కువ. పాలీఫినోల్ క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు తోడ్పడుతుంది. 15 శాతం చక్కెర, ఏ, బీ, సీ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థాలు 17 గ్రాములు, పీచు పదార్థాలు, 1.8 గ్రాములు, కొవ్వు పదార్థాలు 0.27 గ్రాములు, మాంసకత్తులు 51 గ్రాములు, విటమిన్ బి6 0.134 మిల్లీగ్రాములు, సి విటమిన్ 27.7 మిల్లీగ్రాములు, కాల్షియం 10 మిల్లీగ్రాములు, ఇనుము 0.13 గ్రాములు, మెగ్నీషియం 9 గ్రాములు, భాస్వరం 11 మిల్లీగ్రాములు, పొటాషియం 156 మిల్లీగ్రాములు, జింకు 0.04 మిల్లీగ్రాములు మామిడిపండులో ఉంటాయి.

చల్లచల్లని కర్బూజా

కర్బూజా తిన్నవారికి అలసట మటుమాయమవుతుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. బరువు తగ్గడానికి, మలబద్ధకం, మూత్రనాళాల సమస్యలు, ఎసిడిటి, అల్సర్ లాంటి సమస్యలు నివారించే గుణాలు దీనికి ఉన్నాయి.

ఆధారం: డి. ప్రేమాజీ

3.00298507463
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు