హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే

సావిత్రిబాయి పూలే గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

mar009.jpgసావిత్రిబాయి పూలే - మహాత్మాగాంధీ లేదా స్వామి వివేకానందులవలె ప్రసిద్ధ కాకపోవచ్చు. కానీ భారతీయ మహిళా విముక్తి పై ఆమె ప్రభావం అద్భుతమైనది. 19వ శతాబ్దపునాటి సంకెళ్ళను తెంచి సమాజంలో దళితులకు, మహిళలకు, వితంతువులకు, బాలికలకు విద్య మరియు గౌరవాన్ని సాధించిన మహిళ ఆమె. సావిత్రిబాయిని భారతీయ మొదటితరం స్త్రీవాదిగా వర్ణిస్తారు.

సావిత్రిబాయి మహారాష్ట్రలో సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలో నైగావ్ అనే కుగ్రామంలో కాండోజి పాటిల్, లక్ష్మీబాయ్ లకు జనవరి 3, 1831లో మొదటిసంతానంగా జన్మించింది. చింతకాయలు కొట్టుకుతినడం, రేగుపండ్లు కోసుకుతినడం, గులకరాళ్ళను, దుమ్మును తన్నుకుంటూ చేలల్లోపడి పరిగెత్తే 9యేళ్ల అమాయకపు పసిప్రాయంలో సావిత్రిబాయిని పూణేలో వుండే పూలే కుటుంబంలోని 13 యేళ్ల జ్యోతిరావ్ కిచ్చి 1840లో వివాహం చేశారు.

అత్తగారింట అడుగుపెట్టిన చిన్నారి సావిత్రి భర్త చదివే పుస్తకాలను ఆసక్తితో గమనించేది. సహజంగా జ్ఞాన తృష్ణకలిగిన జ్యోతిరావు పూలే ఆమెను తన మొదటి శిష్యురాలుగా మార్చుకున్నారు. తన భావాలను, ఆలోచనలను, భవిష్యత్ ప్రణాళికలను ఆమెతో పంచుకున్నారు. ఆడవారు చదువుకోవడం పాపంగా భావించే ఆ కాలంలో తండ్రిని ఎదిరించి సావిత్రిని విద్యావంతురాలిని చేయగలిగారు. ఆడదంటే వంటింటికి, వంటింట్లో పొయ్యికి పరిమితం కావాల్సిన ఆరోజుల్లో సావిత్రిబాయికి చదువుపట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి జ్యోతిరావుపూలే చదువు నేర్పించారు. ఎంతగొప్ప కదా! ఆ చదువే భారతదేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి పునాదులు వేసింది.

మహిళలను పశువల కంటే దారుణంగా చూసే ఆ రోజుల్లో సావిత్రిబాయి తొలి భారత మహిళా ఉపాధ్యాయిని అయ్యారు. ఆమె దాని కోసం కొల్హాపూర్ లోని ఫర్రర్ ఇన్ స్టిట్యూట్లో, పూణేలోని మిచెల్ పాఠశాలలో శిక్షణ పొందారు.

mar008.jpgఆనాటి బ్రాహ్మణీయ వ్యవస్థలో ఇతర కులాల ప్రజలకు, పిల్లలకు విద్యా హక్కు నిరాకరించబడింది. సావిత్రిబాయి, ఆమె భర్త జ్యోతిరావుపూలే ఈ నియమాలను ఉల్లఘించి జనవరి 1, 1848లో మొదటి బాలికల పాఠశాలను వివిధ కులాలకు చెందిన 8 మంది అమ్మాయిలతో పూణెలోని భేడ్ వాడాలో స్థాపించారు. ఇంటి నుండి బయటి పనులకు పంపని రోజుల్లో అడుగు బయట పెట్టి మహిళల విద్య కోసం ఉద్యమించింది మన సావిత్రిబాయి. ఆమెను పాఠశాలకు వెళ్లేటప్పుడు రాళ్లతో, మట్టితో, పేడతో కొట్టేవారు. అయినా ఆమె వెనకడుగు వేయక చీరమార్చుకొని పాఠశాల నిర్వహించేవారు. ఇలా అనేక అడ్డంకుల మధ్య ఆమె అదే సంవత్సరం పెద్దలకు మరొక పాఠశాలను ప్రారంభించింది. 1851 నాటికి ఆమె 150 మంది అమ్మాయిలతో మూడవ పాఠశాలను ప్రారంభించింది.

నేడు సర్వశిక్షా అభియాన్, విద్యాహక్కు చట్టం మరియు విద్యను ప్రోత్సహించడానికి మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలు, ప్రోత్సాహకాలు ఉండవచ్చు. కానీ 16 దశాబ్దాల క్రితం, సావిత్రిబాయి పిల్లలు బడి మానకుండా వుండేందుకు వేతనాలు కూడా ఇచ్చేది.

మహిళలను విద్యావంతులుగా చేయడంతో పాటు సావిత్రిబాయి యువ వితంతువుల, బలాత్కరింపబడిన వితంతువుల శ్రేయస్సు కోసం కూడా పనిచేసింది.

సావిత్రిబాయి మహిళల విషయంలో ఒక విద్యాసంస్కర్తగా మరియు సంఘ సంస్కర్తగా పనిచేశారు. 19వ శతాబ్దంలో బాల వివాహాలు ఎక్కువ. వితంతువుల తలలకు క్షారము ఆపాలని ఆమె సమ్మెలు నిర్వహించారు. ఆ కాలంలో నిస్సహాయులైన మహిళల పైన వితంతువుల పైన బలత్కారాలు ఎక్కువగా జరిగేవి. ఆ కారణంగా గర్భవతులైన వితంతువులు ఆత్మహత్యలకు పాల్పడకుండా, నవజాత శిశువులను చంపకుండా పిల్లల సంరక్షణా గృహం 'బాల హత్య ప్రతిబంధక గృహాలను' ఏర్పాటు చేశారు.

దేవుడు ఒక్కడే, మనందరం ఆయన పిల్లలం. ఆయనను ప్రార్థించేందుకు మధ్య దళారీలు ఎందుకు? అనే ఉద్దేశ్యముతో సత్యశోధక సమాజాన్ని 1873 సెప్టెంబర్ 23న ఆవిష్కరించారు. డిసెంబర్ 25న మొదటి వివాహాన్ని సమాజం పద్ధతిలో జరిపించి, ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్లారు. తన దత్తకుమారుడు యశ్వంత్ యొక్క వివాహము కూడా సమాజం పద్ధతిలో పూజారులు లేకుండా, కట్నకానుకలు లేకుండా ఆదర్శవంతంగా చేసి చూపించారు మన సావిత్రిబాయి.

సావిత్రిబాయి, జ్యోతిరావుపూలే సంఘం కోసమే ఎప్పుడూ పనిచేశారు. 1877లో తమ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ఈ జంట “విక్టోరియా బాల ఆశ్రయం' పేరుతో ప్రతి రోజూ వెయ్యి మందికి అన్నదానం నిర్వహించేవారు. 1868లో దళితులను అంటరానివారని, త్రాగునీటిని బావిలో నుండి తీసుకొనుటకు అగ్రవర్ణస్తులు నిరాకరిస్తే తమ సొంత బావిలోని నీటిని తీసుకోవలసిందిగా దళితులను స్వాగతించిన ఆదర్శమూర్తి మన సావిత్రిబాయి.

సావిత్రిబాయి నిజంగా అన్నపూర్ణే. తమ ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా పంపేది కాదు. యువ వితంతువులను, వారి పిల్లలను అక్కున చేర్చుకునేది. జ్యోతిరావుపూలే పక్షవాతానికి గురైనప్పుడు దగ్గరుండి సేవచేసి నయం చేసిన దయామూర్తి ఆమె.

1890లో జ్యోతిరావు పూలే అంత్యక్రియల ఊరేగింపులో సావిత్రిబాయి మరో ని షేధాన్ని అధిగమించింది. నేటికి కూడా హిందూమతంలో కర్మలు పురుషులు మాత్రమే చేస్తూ వస్తుండగా, ఆనాడే దానికి విరుద్దంగా సావిత్రిబాయి ఆచారాలను ఎండగడుతూ, సాంప్రదాయాలను సంస్కరిస్తూ అంత్యక్రియలకు మట్టికుండ పట్టి ఊరేగింపులో నడిచింది.

మృత్యుభయం కూడా సావిత్రిబాయి ధైర్యాన్ని అడ్డుకోలేకపోయింది. 1897లో పూణెలో ప్లేగు ప్రబలింది. కానీ ఆమె ముందంజచేసింది. ఇలాంటి సమయంలో తక్కువ కులాల వారికి సహాయపడాలని వెళ్లింది సావిత్రిబాయి. ప్లేగువ్యాధి సోకిన పాండురంగ బాబాజీ గైక్వాడ్ అనే పదేళ్ల బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి కాపాడింది. ఆ సమయంలో ఆ మహమ్మారి ప్లేగు అంటువ్యాధి ఆమెను కూడా కబళించింది. ఆమె ప్లేగు వ్యాధి సోకి తన ఆదర్శప్రాయమైన జీవనయానాన్ని 1897, మార్చి 10న ముగించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా సామాజిక సంస్కర్తలను గుర్తించాలని సావిత్రిబాయి పూలే పేరున ఒక అవార్డును ఏర్పాటు చేసింది. జులై 2014లో ప్రభుత్వం ఆమె గౌరవార్థం పూణే విశ్వవిద్యాలయాన్ని సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. 1998 మార్చి 10న భారతదేశం ఆమె గౌరవార్ధం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

ఆమె నిరుపమాన సేవలను నిత్యం స్మరించుకోవాల్సిన బాధ్యత ఆధునిక సమాజంపై ఉంది. తగిన గుర్తింపు ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఆధారం: ఎస్. సునీత.

2.9855907781
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు