హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / భారతావని గుండె చప్పుడు కల్పనా చావ్లా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

భారతావని గుండె చప్పుడు కల్పనా చావ్లా

కల్పనా చావ్లా గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో బాలికలు చదువుకునేందుకు స్కూళ్లకొచ్చిందే 19వ శతాబ్దం చివరిలో! 20వ శతాబ్ద ప్రారంభంలో సైతం స్త్రీలు గ్రంథాన్ని తాకటమే పాపమని భావిస్తూ వచ్చారు. అయితే స్వల్పకాలంలోనే మహిళలు తాము ఏ విషయంలోనూ పురుషులకేమాత్రం తీసిపోబోమని నిరూపించారు. అలాంటి ప్రతిభా సంపన్న మహిళలల్లో కల్పనా చావ్లా ఒకరు. భారతదేశ హృదయ స్పందనగా ఎంతో కాలం ప్రజల హృదయాల్లో ఆమె నిలిచుంటారు. ప్రసంశనీయమైన మహిళా శాస్త్రవేత్తగా, అంతరిక్ష వీరాంగనగా కల్పనా చావ్లా అంతరిక్ష యాత్ర చేసిన మొట్టమొదటి భారతీయ మహిళా వ్యోమగామిగా ప్రసిద్ధి చెందారు. ఆమె 1961 సంవత్సరం జులై ఒకటో తేదీ హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో జన్మించారు.

వారిది మధ్యతరగతి కుటుంబం. నలుగురు పిల్లల్లో ఆమె చివరిది. కర్నాల్ లోని ఠాగూర్ పాఠశాలలో కల్పన 1976లో తన స్కూలు విద్య ముగించారు.

mar0011.jpgచదువులో మాత్రమే గాక ఆటపాటలు, సైన్సు ప్రయోగాల్లో ఆమె అందరికన్నా ముందుండేవారు. ఆ చిన్నతనంలోనే తాను భవిష్యత్తులో వైమానిక ఇంజనీరవుతారని చెప్పగానే అందరూ విస్మయం చెందారు. ఆమె తండ్రి అసలు ఎన్నో రోజులు ఆమెతో మాట్లాడనేలేదు. తల్లికి కూడా తన కుమార్తె విమాన పైలెట్ కావడం అసలు ఇష్టం లేదు. అయితే కల్పనా దృఢచిత్తం వారందరికీ బాగా తెలుసు. కల్పనా ఆ కాలంలో ఎక్కువగా రాత్రుల్లో మేడపైన పడుకుని ఆకాశం వైపు తీక్షణంగా చూస్తూ ఉండేవారు. ఆకాశంలోని నక్షత్రాలను కనురెప్ప వేయకుండా చూడటమంటే ఆమెకు మహా సరదా. ఏదో ఒక రోజు తాను కూడా ఆ నక్షత్రాల మధ్యే ఉంటాననే వారు. అందువల్ల కర్నాల్ లోని వారు ఆమెను 'స్టార్' అని పిలిచేవారు. కల్పనా తండ్రికి కూడా తెలియకుండానే అక్కడి వైమానిక శిక్షణా సంస్థలో చేరి పైలెట్ గా కూడా లైసెన్సు సంపాదించుకున్నారు.

తదనంతరం ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో వైమానిక శాస్త్ర శిక్షణలో చేరి డిగ్రీ చదవనారంభించారు. ఆ విభాగంలో అంతవరకు మహిళలెవ్వరూ చేరనేలేదు. అందువల్ల అక్కడ ప్రథమ మహిళగా కల్పనాయే వైమానిక శిక్షణ పొందారు. అక్కడ డిగ్రీలో ప్రథమరాలుగా ఉత్తీర్ణురాలై అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. అప్పుడు ఆమె తండ్రిగారి మనస్సు కలిగింది. ఆకాలంలో వైమానిక శాస్త్ర ఉన్నత విద్య అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో మాత్రమే ఉండేది. అందువల్ల కల్పనను ఆమె బంధుమిత్రులు అమెరికాకు వెళ్లనీయలేదు. అయితే కల్పన పట్టుదల అందరికీ తెలిసిందే. అందువల్ల సుదీర్ఘ పోరాటం తరువాత తండ్రి కల్పనకు అమెరికా ప్రయాణానుమతినిచ్చారు. 1984లో ఇది జరిగింది. ఆ ఏడే భారతదేశ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి రికార్డు నెలకొల్పారు. అది కూడా కల్పనాను ఎంతో ప్రేరేపించింది. అంతరిక్ష పయనం ఆమె ఏకైక లక్ష్యంగా మారిపోయింది.

mar0010.jpgఅమెరికాలో కల్పనా కొలరాడో యూనివర్శిటీలో వైమానిక శాస్త్ర అధ్యయనం చేసి 1988లో డాక్టరేటు పొందారు. ఆ శాఖలో డాక్టరేటు సంపాదించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఆమే. స్కూలు రోజుల్లో కర్నాల్ పట్టణంలో పైలెట్ గా శిక్షణ పొందుతున్నప్పుడు ఆమె తండ్రి తీవ్రంగా వ్యతిరేకించినప్పుడు కల్పన సోదరుడు సంజయ్ తండ్రికి చెప్పిన ఒక మాట కల్పన ఎన్నటికీ మరువలేదు. ఆ మాట ఏమిటంటే ప్రతిఒక్కరూ వారికైన పోరాటం వారే చేయాలి'.భారత దేశ మహిళలు తమ పరిసరాల వాతావరణం ఛేదించుకుని వెలుపలకొచ్చి కలలు కనటం నేర్చుకోవాలని కల్పన తరచుగా చెబుతుండేవారు. 1988లో ఆమె తన ఏకైక లక్ష్యంగా 'పాలపుంత పయనం' చేయాలని సంకల్పించుకున్నారు. ఆ సంవత్సరమే ఆమె అమెరికా అంతరిక్ష పరిశోధనారంగంలో ప్రవేశం పొందారు. మొదట ఆమె అంతరిక్ష పరిశోధకురాలిగానే తన ఉద్యోగం ప్రారంభించారు. తరువాత వ్యోమగామిని పరీక్షలో 1993లో పాల్గొన్నారు. జూన్ పియరీ హారిసన్ అనే విమానాశ్రయ శిక్షకుడిని కల్పన 1988లోనే వివాహమాడారు. ఆమె సాధించిన విజయాలన్నింటికీ అతడే ప్రేరేపకుడిగా నిలిచాడు.

కల్పన రాత్రింబవళ్లు నిద్రకు వీడ్కోలిచ్చి కఠోరమైన పరిశోధనలకు తనను తాను అప్పజెప్పుకున్నారు. ఒక శాస్త్రవేత్తకు రాత్రయినా, పగలైనా ఒక్కటే. అన్ని కాలాలూ పరిశోధనలకు అనువై నవే. అన్ని స్థలాలు పరిశోధనాగారాలే.

వ్యోమగాములయ్యేందుకు అమెరికాలో సుమారు 3,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందరిలోనూ కల్పనాయే ప్రప్రథమరాలుగా వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. అప్పుడే కల్పన భారతీయ మహిళ అనే విషయం ప్రపంచమంతా తెలుసుకుని విస్మయం చెందింది.

ఆమె 1995 మార్చి మాసంలో జాన్సన్ అంతరిక్ష కేంద్రంలో చేరారు. అక్కడామెకు మూడు సంవత్సరాలు కఠినమైన శిక్షణ ఇచ్చారు. మరో మహిళ అయితే ఆ శిక్షణను భరించలేకపోయేవారేమో. కల్పనా మాత్రం ఎల్లప్పుడూ అలసిపోకుండా ఉత్సాహంతో ఉరకలెత్తుతూ ఉండేవారు! ఆమె శిక్షకులే ఆమెను చూసి విస్మయం చెందేవారు.

భారత దేశంలోని 100 కోట్ల ప్రజలకు ఆదర్శమహిళగా విరాజిల్లటం అంతసులభమైన పనేమీ కాదు. కల్పన బాలికగా ఉన్నప్పుడు తోటలోని సీతాకోక చిలుకలను పట్టేందుకు బదులుగా ఆకాశంలోని విమానాలను పట్టాలని ఉవ్విళ్లూరేవారు. ఆ ఆసక్తే ఆమెలో చివరి వరకు నిండుంది. భారతీయ వ్యోమగామి. రాకేష్ శర్మను 'మీరు బాల్యంలో అంతరిక్షంలో విహరిస్తామని అనుకున్నారా....? అని ప్రశ్నించినప్పుడు ఆయనన్నాడు. “నిజంగా అలాంటి గొప్ప విషయాలను కలలో కూడా నేను అనుకోలేదు'. ఎందుకంటే రాకేష్ శర్మకు మార్గదర్శకులు ఆ రంగంలో ఎవ్వరూ లేకపోయారు. అయితే కల్పనాచావ్లా తన దేశాన్నీ, ఆసియా ఖండాన్ని, భూమండలాన్ని అధిగమించి కలలు కన్నవారు. కన్నకలలను వట్బదలతో నిజం చేసుకున్నవారు.

1997వ సంవత్సరం నవంబర్ 19 నుంచి డిసెంబర్ 5 వరకు కల్పనా చావ్లా తన 'కొలంబియా అంతరిక్ష యానం'లో వ్యోమగామినిగా భూమిని 104 మిలియన్ కిలోమీటర్లు, 760 గంటల సేపు, 252 సార్లు చుట్టొచ్చారు. 'అదిగో గంగానది...! ఇదిగో నేను పుట్టిపెరిగిన భూమి...!” అంటూ ఆమె మహోత్సాహంతో అంతరిక్ష యానంలోనే ఎన్నో రకాల పరిశోధనలు గావించారు. యోగాభ్యాసం నుంచి ఒక కొత్త ఉపగ్రహం పంపే వరకు ఆమె చేసిన పరిశోధనల సంఖ్య 300 దాటుతోంది. అంతరిక్షంలో అత్యధిక పరిశోధనలు, ప్రయోగాలు చేసిన మహిళా శాస్త్రవేత్తగా ఆమెను పరిగణిస్తారు, ప్రశంసిస్తారు.

కల్పనా చావ్లా తిరిగి 2003 జనవరి 16న తన 16 రోజుల అంతరిక్ష పయనం ప్రారంభించారు. అంతరిక్షయానంలోనే తన చివరి 80 పరిశోధనల ఫలితాలను ఖచ్చితంగా నిర్ధారించి భూమికి కృత్రిమ ఉపగ్రహం ద్వారా పంపించేశారు. అయితే భూమికి తిరిగొచ్చేందుకు ఇంకా 16 నిమిషాలు మాత్రమే ఉనప్పుడు ఒక ప్రయోగం విఫలమై కొలంబియా అంతరిక్షనౌక పేలిపోయింది. అందులో పయనించి తిరిగొస్తున్న ఐదుగురు వ్యోమగాములతో పాటు మన కల్పనా చావ్లా కూడా మరణించారు.

దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె కోసం కన్నీరుగార్చింది. ఆమెను “దేశ స్వప్నాలరాణి' అంటూ కీర్తించింది. కల్పనా చావ్లా పేరు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అప్పటి దేశాధ్యక్షులు అబ్దుల్ కలాం గారు ఆమెకు సంతాపం తెలుపుతూ రాసిన ఒక కవిత మనందరినీ శోకతప్తులు గావిస్తుంది.

"ఆకాశ నక్షత్రాలను

ఇకపై చూసినప్పుడల్లా

నీవే మాకు

గుర్తుకొస్తావు కల్పనా..”

3.00872093023
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు