పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మడ అడవులు

మడ అడవులు గురించి పూర్తి వివరాలు.

సాధారణంగా ఉప్పునీటిలో ఏ మొక్కలు జీవించలేవని మనం అనుకొంటాం. కాని ఉప్పు నీటిని తట్టుకునే వృక్షాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి వృక్షాల సమూహాలనే మడ అడవులు (Mangrove forests) అంటారు. ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో, సాగరసంగమ ప్రాంతాల్లో కనిపిస్తాయి. సుమారు 80 రకాల వృక్షజాతులను మడ వృక్షాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా మడ అడవులు 18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం ఇండోనేషియా, బ్రెజిల్, ఇండియా, బంగ్లాదేశ్లలో ఉన్నాయి.

మన రాష్ట్రం మొత్తం వైశాల్యం 2,76,000 చ.కి.మీ., ఇందులో అడవుల విస్తీర్ణం 63,770 చ.కి.మీ. అంటే, భౌగోళిక విస్తీర్ణంలో 23 శాతం. మడ అడవుల విస్తీర్ణం 582 చ.కి.మీ. మొత్తం అడవుల విస్తీర్ణంలో ఇది 0.9 శాతం. గోదావరి పరివాహక ప్రాంతంలో 331.5 చ.కి.మీ., కృష్ణా పరివాహక ప్రాంతంలో 250 చ.కి.మీ. విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఇవి నామమాత్రంగా వుంటే, తూర్పుగోదావరిలో ఎక్కువ విస్తీర్ణంలో మడ అడవులు ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో మడ అడవులు 9 అభయారణ్యాలుగా గుర్తించబడ్డాయి. ఇవి కోరంగి (42.42 చ.కి.మీ), కోరంగి విస్తరణ (194.67 చ.కి.మీ.), భైరవపాలెం (9.71 చ.కి.మీ.), రాతికాల్వ (20.43 చ.కి.మీ.), మాసాని తిప్ప (10.89 చ.కి.మీ.), మట్ల తిప్ప (4.45 చ.కి.మీ.), బలునుతిప్ప (4.75 చ.కి.మీ.), కొత్తపాలెం (0. 58 చ.కి.మీ.), కందికుప్ప (38.02 చ.కి.మీ)

మడ అడవులలో జీవవైవిద్యం

ఈ మడ అడవుల్లో చాలా రకాలైన వృక్షజాతులు, జంతుజాతులు ఉన్నాయి. కోరంగి అభయారణ్యంలో 24 కుటుంబాలకు చెందిన 35 జాతుల మొక్కలు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి నల్లమడ (అవిసీనియా అఫిసినాలిసిస్), తెల్ల మడ (అవిసీనియా మెరీనా), విల్వ మడ (అవిసీనియా ఆలా), తిల్ల (ఎక్స్కొకోరియా అగలోచా), తొగర (సిరియాప్స్ డెకెండ్రా), ఊరుడు (బ్రుగేరియా సైమోనోర్జియా), కలింగ (సోనరేషియా అపటెలా), పొన్న రైజోఫోరా అపిక్యులేటా), గుగ్గిలం (ఏగిసిరప్ కొరిక్యులేటమ్).

ఈ మొక్కల్లో చాలా వాటికి ఔషద గుణాలున్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. గుగ్గిలంను ఆస్తమా, డయాబెటీస్ చికిత్సకు, తెల్లమడ నొప్పుల నివారణకు ఉపయోగపడతాయి. నల్ల వడ యాంటి వైరల్ గా పనిచేస్తుంది. దీని బెరడును పాముకాటుకు నివారణగా వాడతారు. ఊరుడు, కాలింగ లను కామెర్ల చికిత్సకు, తిల్లను విరేచనకారిగాను, మూర్చవ్యాధి చికిత్సకు పళ్ళనొప్పికి వాడతారు. అలాగే సేనుగను జ్వరం, మలేరియా చికిత్సకు వాడతారు. తొగర యొక్క కాండంతో పళ్ళు శుభ్రం చేసుకుంటే పళ్ళనొప్పి తగ్గుతుంది.

మడ అడవుల్లో నీటికుక్కలు (స్మూత్ ఇండియన్ ఆటర్స్), తాబేళ్లు, నత్తలు, పీతలు, మొప్పలు, మడపాములు వంటి జీవులు ఉన్నాయి.

ఎన్నో రకాల పక్షులు కూడా ఈ అభయారణ్యాలను సందర్శిస్తుంటాయి. కోరంగి అభయారణ్యంలో సుమారు 120 జాతుల పక్షులు, ఏటా ఏడిది చేస్తుంటాయి. వీటిలో కొంగల కొక్కిరాయలు, చెకుముకి పిట్టలు, నారాయణ పక్షి నీటికాకి, గునపం కోడి, గువ్వలు, గద్దలు సందర్శకుల ఆకర్షిస్తుంటాయి,

మడ అడవుల ప్రయోజనాలు

apr03.jpgమడ అడవులు తీరప్రాంతానికి, సముద్రానికి మధ్య ఒక అడ్డుకట్టలా ఉంటూ తీరప్రాంతాన్ని వేల కోత నుంచి కాపాడతున్నాయి. ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతాలకు మడ అడవులు సముద్రం నుంచి ఎదురయ్యే పెనుగాలులు, తుపానులు, ఆటుపోట్లు, సునామీ వంటి ప్రమాదాల నుంచి కాపాడుతూ ఒక సహజ రక్షణ కవచంలా ఉంటున్నాయి. నానాటికి తరిగిపోతున్న జీవవైవిధ్యాన్ని ఇవి సంరక్షిస్తున్నాయి. ఎంతో వైవిధ్యభరితమైన జీవరాశులకు ఇవి ఆటపట్టుగా ఉన్నాయి. వలసపక్షులు గూళ్ళు కట్టుకునేందుకు, సముద్రజీవుల సంతానోత్పత్తికి ఈ అడవులు అనువుగా ఉంటాయి. నీటిలోని మాలిన్యాలను, హాని కలిగించే భారలోహాలను శోషించుకుని నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే గాలిలోని కాలుష్యాలను శోషించుకుని గాలిని కూడా శుద్ధి చేస్తున్నాయి. ఇంతేకాదు ఈ అడవులు కలప, వంటచెరకు, పశుగ్రాసం లభించే కేంద్రాలుగా ఉంటాయి. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల కుటుంబాల సంపాదనకు ఆధారంగా కూడా ఉంటున్నాయి.

ఉప్పు నీటిని ఎలా తట్టుకుంటాయి?

ఉప్పు నీటిని తట్టుకుని జీవించేందుకు మడ చెట్లు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఎర్రమడ చెట్లకు ఒక ప్రత్యేకమైన వేళ్ళ వ్యవస్థ ఉంది. ఈ వేళ్ళసాయంతో ఉప్పునీటి నుంచి దాదాపు 99శాతం ఉప్పును తొలగించగలుగుతాయి. నల్లమడ చెట్లు ఆకుల వెనుక భాగంలో, పొట్టిగా, గుబురుగా ఉండే వెంట్రుకల ద్వారా నీటిలోని ఉప్పును విసర్జిస్తాయి. తెల్లమడ చెట్లు ఆకుల మూలల్లో ఉండే రెండు బొడిపెలు ద్వారా ఉప్పును విసర్జిస్తాయి. ఈ వెంట్రుకలు, బొడిపిలనే గ్రంథులు అంటారు. ఇంతేకాకుండా, ఈ మడచెట్లలో కొన్ని ప్రత్యేక జీన్స్ ఉండడం వల్ల కూడా ఇవి ఉప్పునీటిలో మనగలగుతున్నాయి. నల్లమడ వంటి కొన్నింటిని శ్వాసవేళ్ళు నేలనుంచి గాలిలోకి తన్నుకువచ్చి ఆక్సీజన్ ను ఆ చెట్లకు అందిస్తాయి. తెల్లమడ చెట్లకు చెట్టు బోదె అడుగుభాగంలో గాలి నుంచి ఆక్సీజన్ ను తీసుకునే అమరిక ఉంటుంది.

మడ అడవుల విధ్వంసం

apr04.jpgమనకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తున్న మడ అడవులు ప్రతి ఏటా అభివృద్ధి పేరుతో విధ్వంసానికి గురవుతున్నాయి. కోస్తాతీరం వెంబడి జనాభా పెరుగుదల, రొయ్యలసాగు, పామ్ ఆయల్ చెట్ల పెంపకం వంటి కారణాల వల్ల మడ అడవులను నరికి వేయడం జరుగుతుంది. ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ఆగ్నేయ ఆసియా, లాటిన్ అమెరికాలలో కేవలం రొయ్యల సాగుకోసం శాతం మడ అడవుల నరికివేతకు కారణమవుతున్నాయి.

మడ అడవులు దాదాపు 20 బిలియన్ టన్నుల కార్బన్ ను తమలో ఇముడ్చుకున్నందున, ఈ అడవుల నరికివేత వల్ల వాటిలోని కార్బన్ పర్యావరణంలోకి ప్రవేశిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి మడ అడవులను సంరక్షించుకోవడం మన తక్షణ కర్తవ్యం.

మడ అడవులను కాపాడుకొందాం! జీవ వైవిధ్యాన్ని నిలుపుకుందాం!

ఆధారం: డా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

3.02017291066
నవీన్ May 17, 2020 01:34 PM

గ్రామంలో మడ అడవులు నరికేస్తే ఎవరికి తెలియదు చేయాలి ఎలా చేయాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు