పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మన నేల, మన భూమి, మన భవిష్యత్తు

డిసెంబర్ 5వ తేదీని ప్రపంచ నేలల దినోత్సవంగా (World Soil Day) ప్రతి సంవత్సరం జరపాలని పిలుపునిచ్చారు.

nov4నేల తల్లి సమస్త జీవరాశికీ అమ్మఒడి. ప్రతి జీవికి జవం, జీవం కూడా ఈ నేలే. తొలకరి చినుకులకు తడిసిన నేలమ్మ మట్టివాసనను పీల్చి పరవశించని మనిషి ఉండకపోవచ్చు. నేలను నమ్ముకునే రైతు వందల కోట్ల ప్రజలకు అన్నం పెడుతున్నాడు. మరి ఆ నేలకు ఆపద వస్తే... మనిషి కాలుకింద నేల జారిపోతే... సకల జీవకోటికి తిరుగులేని ఆధారం కాస్త తరిగిపోతే... మళ్ళీ మళ్ళీ సృష్టించలేని అమూల్యమైన వనరు కనుమరుగైతే మానవజాతి భవిష్యత్తు ఏమిటి? నేల తల్లిని కాపాడుకోవటంలోనే మన వర్తమానం, భవిష్యత్తు రెండు ఆధారపడి ఉన్నాయి. ‘నేల విడిచి సాము’ చేయరాదంటారు పెద్దలు. కాని మనం చేస్తున్నది అదే. అన్ని వనరుల్లానే దీన్ని ప్రమాదంలో పడేశాం. కాదు కాదు మనమే ప్రమాదంలో వడిపోయాం... నేలను, నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలోనే ప్రపంచ ప్రజల ఆహార, పోషకాహార (Nutrition) భద్రత ఇమిడియున్నది వేగిరంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పు (Climate Change) నుండి బయట పడేందుకు, సమగ్రాభివృద్ధికీ నేలను కాపాడుకోవటం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (Food and Agriculture Organisation) డైరెక్టర్ జనరల్ జోస్ గ్రాజియానో ధ సిల్వ (Jose Graziano da Silva) చెప్పారు. nov5అందుకే 2015 సంవత్సరాన్ని అంతర్జాతీయ నేలల సంవత్సరంగా ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదీని ప్రపంచ నేలల దినోత్సవంగా (World Soil Day) ప్రతి సంవత్సరం జరపాలని కూడా పిలుపునిచ్చారు.

నేలంటే ఏమిటి? నేలలు ఎలా ఏర్పడ్డాయి? ఎన్ని రకాల నేలలున్నాయి? అవెలా ప్రమాదంలో ఉన్నాయి? వాటిని రక్షించుకోవటం ఎలా? అనే ప్రశ్నలు మీకు వచ్చాయా? మట్టిలో పుట్టి, మట్టినే నమ్ముకున్న మట్టిమనుషుల (మంచి మనుషులు) జీవితాలకు స్థారకత రావాలంటే భూమిపై నేలపొరలు ఏర్పడిన నాటినుంచి, నేటి నేల కాలుష్యం వరకూ ఒక సమగ్ర అవగాహన కావాలి. భూమి ఉపరితలంపై పరచుకుని ఉన్న ఒక పలుచని పొరను మనం నేల అంటాము. నేల ఏర్పడటం వెనుక పెద్ద కథే వుంది. ఇది ఒకరోజులోనో, ఒక ఏడాదిలోనో జరిగింది కాదు. ఇందుకు దశాబ్దాలు, శతాబ్దాలు, సహస్రాబ్దాలు, ఇంకా మిలియన్ సంవత్సరాలు జరిగిన మార్పుల్లోంచి ఈ నేల పొర పుట్టుకొంచింది. మనం అనాలోచితంగా నష్టపరిచే ఈ నేల ఒక సెంటీమీటర్ మందం ఏర్పడటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. నేల ఏర్పడటం అనేది ఆనేక కారకాలపై (Factors) ఆధారపడి ఉంటుంది. అది ఏ రకం రాతి నుండి ఏర్పడుతున్నది? అక్కడున్న వాతావరణం వగైరా. ఒక మాదిరి వాతావరణంలో ఒక సెం.మీ నేల ఏర్పడేందుకు 200 నుండి 400 సంత్సరాలు పడితే తేమ గలిగిన అనుకూల వాతావరణంలో కొంత వేగంగా ఏర్పడుతుంది. నేల ఏర్పడగానే సంబరం కాదు. ఆ నేల సారవంతమై ఉండాలి. ముఖ్యంగా మొక్కల పెరుగుదలకు అవసరమైన పలు రకాల పోషకాలు కావాలి. అటువంటి సారవంతమైన నేల 1 సెం.మీ. ఏర్పడటానికి దాదాపు 3 వేల సంవత్సరాలు పడుతుంది. అందుకే విజ్ఞులు నేల అనేది మళ్ళీ మళ్ళీ తయారయ్యే వనరు కాదంటారు. ఒకసారి కోల్పోతే ఆ నష్టం శాశ్వతం.

జాతీయ సహకార నేలల సర్వే ప్రకారం ప్రపంచంలో 20 వేల రకాల నేలలున్నాయి. భారతదేశంలో స్థూలంగా ఆరు రకాల నేలలున్నాయి.

 1. ఒండ్రు నేలలు (Alluvial Soils): నదీనదాలు తీసుకొచ్చి మేటవేసినందున ఈ నేలలు ఏర్పడుతాయి. ఇవి ఉత్తర భారతదేశంలో నదీపరీవాహక ప్రాంతాల్లో ఉండే సారవంతమైన డెల్టా భూములు.
 2. నల్ల నేలలు (Black Soils): ఇవి వాల్కెనోల నుండి ప్రవహించిన, లావా వల్ల ఏర్పడిన రాళ్ళ నుండి ఏర్పడతాయి. ఇవి ప్రధానంగా దక్కను పీఠభూమి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించాయి.
 3. ఎర్ర నేలలు (Red Soils): దక్కను పీఠభూమి రూపాంతరం (Metamorphic) చెందిన రాళ్ళ నుండి ఏర్పడి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, అంతటా ఒరిస్సాలో కొంతప్రాంతం విస్తరించినాయి. ఈ నేలల్లో ఇనుము (Fe) ఎక్కువగా ఉండటం వలన వీటికి ఎరుపు రంగు వచ్చింది.
 4. లాటరైట్ నేలలు (Laterite Soils): పర్వత శిఖర ప్రాంతాల్లో నుండి బాగా ఇంకినందువల్ల (Leaching) ఏర్పడే నేలలు. పర్వత శిఖరాల్లో అస్సాం, ఒరిస్సా, కొండ ప్రాంతాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్గడ్ లలో వున్నాయి.
 5. పర్వత నేలలు (Mountain Soils): అడవుల నుండి వచ్చిన సేంద్రీయ పదార్థం పోగు పడటం వలన ఇవి ఏర్పడతాయి. హిమాలయ ప్రాంతంలో ఇవి కనిపిస్తాయి.
 6. ఎడారి నేలలు (Desert Soils): వర్షపాతం తక్కువగా ఉండే రాజస్థాన్ ప్రాంతంలో వుండే ఈ నేలల్లో లవణ సాంద్రత ఎక్కువగా వుండి ఉపరితలంపై పెంకు ఏర్పడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా వుండే ఇసుక నేలలివి.

మొత్తటి అతి సూక్ష్మమైన బంకమట్టి (Clay). ఇసుక, సన్నటి ఇసుక (Silt) వివిధ పాళ్ళతో ఏర్పడుతుంది. నేల పైభాగంలో గలస, మొరం వంటి చిన్న చిన్న రాళ్ళు కూడా కల్సివుంటాయి. నేల అంటే కేవలం ఇసుక, మట్టి మాత్రమే కాదు. విడదీయలేని మరో గొప్ప అణుఘటికం కూడా వుంది. అదే సూక్ష్మజీవులు. ఇవన్నీ కలిస్తేనే నేల వాతావరణం ఏర్పడుతుంది. ఈ సూక్ష్మ జీవుల వల్లనే మొక్కల జంతువుల కళేబరాలు క్షయం చెంది నేలలో కలిసి సారవంతమైన నేలలు ఏర్పడుతున్నాయి. బంకమట్టి ఎక్కువగా ఉండే నేలలు మొక్కలు పెరగటానికి, పంటలకు అనుకూలం. ఈ నేలలు తేమను ఎక్కువ కాలం కాపాడుకోగలవు. అదే ఇసుక నేలలయితే తొందరగా నీరింకిపోయి తేమను నిలబెట్టుకోలేవు. అందుకే ఇటు ఇసుక, బంకమట్టి సమానపాళ్ళలో ఉండే మిశ్రమ నేలలు సారవంతమైనవిగా చెప్పుకోవచ్చు.

nov6మీరు మీ క్లాసులో చిన్న ప్రయోగం చేసి నేలలో వుండే ఇసుక, మన్ను, సన్నటి ఇసుక ఏఏ పాళ్ళలో ఉన్నాయో తెల్సుకునే ప్రయత్నం చేయండి. మీ ఊరిలో ఎన్ని రకాల నేలలున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మీ ప్రాంతం లేక గ్రామంలో ఉండే నేలల నీటి నిల్వ సామర్థ్యాన్ని (Water helding capacity) అంచనా వేయండి. ఇవి రెండు చాలా తేలిక కూడా. నేల స్వభావాన్ని కూడా pHను తెల్సుకోవటం ద్వారా అంచనా వేయవచ్చు. మీ మెదడుకు పదను పెట్టి చూడండి. ఏమో! మీరేమైనా కొత్త పద్ధతిని కనిపెట్టవచ్చు కూడా!

భూమి పైపొరనే నేల అన్నాం కదా! ఈ నేల పొరలో, దాని క్రింద మరింకెన్ని పొరలు దొంతరలుగా పేర్చుకుని ఉన్నాయో! పరిశీలించండి. మీ ఊరిలో బావులు తవ్వేటప్పుడు గమనిస్తే ఆ పొరలు కనిపిస్తాయి. వాటినే హోరైజన్స్ అంటారు. ఎ, బి, సి... ఇలా ఏ రాతి నుండి ఏర్పడిందో దాన్ని బట్టి నేల ప్రొఫైల్ (Soil Profile) లేదా నిలువు కోత ఉంటుంది. ఒక హోరైజన్ రంగులో, నిర్మాణంలో దానికి దిగువన ఉన్న పొరకంటే భిన్నంగా కనిపిస్తుంది.

దురదృష్టం ఏమిటంటే ప్రపంచంలో మూడోవంతు నేలలు ఇప్పటికే క్షయం లేదా నాశనం అయ్యాయి. ఇలాగే నేలలు కోల్పోవటం కొనసాగితే 1960 నాడున్న సారవంతమైన నేలల్లో నాలుగో వంతు నేలలు 2050 నాటికి అదృశ్యం అవుతాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు తోడు సారవంతమైన నేలలు కూడా పోతే వచ్చే ఆహార సమస్య, ఆహార భద్రత ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి! నేలలో ఉండే సేంద్రియ పదార్థం నేల సారాన్ని నిర్ణయించే మరో ముఖ్యకారకం. ఇది నేల నీటిని పట్టివుంచే సామర్థ్యాన్ని, మొక్కల పోషణకు అవసరమైన దాతువులను కల్గివుండే సామర్థ్యాన్ని పెంచుతుంది. పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో నేలలను కాలుష్య దిబ్బలుగా మారుస్తున్నారు. నేలలో కలుస్తున్న పురుగు మందులు నేలలో నివసించే సూక్ష్మజీవుల్ని చంపి, నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయి. నీటి కాలుష్యం గురించి మాట్లాడుతాం కానీ నేల కాలుష్యం గురించి మరిచిపోతాం. నేల ఆరోగ్యం (Soil Health) గురించి ఆలోచించవలసిన సమయం వచ్చింది.

నేలను కాపాడుకోవటం (Soils Conservation) నేటి అవసరం. నేలల వైవిధ్యాన్ని నిలబెట్టుకుంటేనే మానవ సమాజం బ్రతుకుతుంది. ఇందుకోసం 2015వ సంవత్సరం అంతర్జాతీయ నేలల సంవత్సరంగా ప్రకటించారు.

 • నేలల ప్రాముఖ్యాన్ని, నేలల పట్ల సమాజంలో అవగాహనను పెంచాలి. విధాన నిర్ణేతలు చట్టాలను అమలు పరిచి నేల ఆరోగ్యాన్ని కాపాడేలా చేయాలి.
 • ఆహార భద్రతలో, వాతావరణ మార్పు(Climate Change)లో నేలకున్న పాత్రను ఆర్థం చేయించి పేదరిక నిర్మూలన సమగ్రాభివృద్ధికి తోడ్పడాలి.
 • నేల వనరులను రక్షించే విధానాలకై చర్యలకై ప్రభుత్వాలపై ఒత్తిడి, మంచి విధానాలను ప్రొత్సహించాలి.
 • నేల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా అభివృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సహించాలి.
 • సమగ్రాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తీసుకునే చర్యలను బలవత్తరం చేసి 2015 తదనంతరం ఏం చేయాలో కూడా ఎజెండా ఏర్పరచాలి.
 • నేలల సమాచారాన్ని వివరాలను స్థానికంగా, ప్రాంతీయంగా, జాతీయంగా వివిధ స్థాయిల్లో, క్రోడీకరించి వినియోగించుకోవాలి.

పైన పేర్కొన్న లక్ష్యాలను అంతర్జాతీయ నేలల సంవత్సరం మన ముందుంచింది. అందుకే మనం మన నేలలు, మన భూమి, మన భవిష్యత్తు పట్ల విరివిగా ప్రచారం చేయటం, నేలను కాలుష్యం కాకుండా నివారించడం కోసం పూనుకుందాం.

ఆధారం: కె. సత్యప్రసాద్

3.01282051282
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు