పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మన పంటల పండుగ సంక్రాంతి

సంక్రాంతి పండుగ సూర్యమాన కొలమానాలకు తగినట్లుగా వచ్చిందని విశ్లేషకుల భావన.

jan3

మీకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! ప్రతి పండుగ సందర్భంగా మిత్రులకు బంధువులకు శుభాకాంక్షలు తెలుపుకొంటూ ఉంటాము. అలాగే ప్రతి పండగ ఏదో ఒక విధంగా మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. మన జీవితాల్లో కొత్తదనాన్ని తెస్తుంటుంది. ఆ సందర్భంగా నలుగురం కలుస్తాం. అందరికీ రాష్ట్రాన్ని, ఆనందాన్ని కలిగించే మిఠాయిలూ, పానీయాలూ, పాయసాలు పండగలప్పుడు తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. కొత్త బట్టలు కట్టుకొంటాం. యిల్లు వాకిలి శుభ్రం చేసుకొని నూతన శోభను కలిగించే ప్రయత్నం చేస్తాం. అందుకే పండుగల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆహ్వానిస్తారు. నిజానికి ఈ పండగలు మన జీవితాల్లోకి ఎలా ప్రవేశించాయి? అవి మన సంస్కృతిలో ఎలా భాగమయ్యాయి? అని మిమ్మల్ని ప్రశ్నింపజేయడమే ఈ ప్రయత్నం.

మనం తినే ఆహారానికి, కట్టుకొనే బట్టలకు, నివశించే ఇంటికీ, ఆరోగ్యాన్ని నిలుపుకొనే మందులకూ, మన వ్యవసాయానికి, అనగా ఆహార సంపాదనకు సంబంధమున్నట్లే మన సంస్కృతికీ అందులో భాగమైన పండుగలకు, ముఖ్యంగా సంక్రాంతికి సంబంధముంది. వ్యవసాయమనేది ఎలా మొదలైందో కొంచెం చరిత్రలోకెళ్లి తొంగిచూస్తే అర్థమౌతుంది.

పిల్లలూ! మీరందరూ జీవశాస్త్రం చదువుకుతున్నారు. అందులో సూక్ష్మక్రిముల, వృక్షాల, జంతువుల పరిణామక్రమాన్ని చదివారు. డార్విన్ మహాశయుడు మనకూ (మనుష్యులకు) వాటికీ వున్న సంబంధాన్ని శాస్త్రీయంగా విపులీకరించాడని కూడా నేర్చుకొన్నారు. కోతులకు కొనసాగింపుగా జీవనగొలుసులో రూపొందిన మనుష్యులు మొదట్లో కోతుల్లాగానే ఆకులు, పండ్లు, కందమూలాలు, గింజలు తిని పెరిగారు. ఆ క్రమంలో అవి దొరకని చోట్ల చాలా జంతువుల్లాగానే మనుష్యులు కూడా అందిన జంతువుల్ని చంపి తినేవారు. ఫలితంగా వేట కోసం బాణాలు, ఈటెలు రూపొందాయి. అయితే చాలా సందర్భాల్లో జంతువులు దొరక్కుండా పోవడం లేక అరుదైపోవడంతో మళ్లీ మనుష్యులకు ఆహారకొరత ఏర్పడ్డది.

మనిషి మనుగడకు చెట్ల (మొక్కల) నుండి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆహారం లభిస్తుందని గుర్తించిన మనుష్యులు కృత్రిమంగా మొక్కలను, చెట్లను, పెద్ద పెద్ద వృక్షాలను పెంచే నైపుణ్యం సంపాదించారు. మొదట తమ సంచార జీవితానికి తగ్గట్టుగా “పోడు” వ్యవసాయంతో (అనగా అడవుల్ని తగలబెట్టి నిర్ణీత భూభాగంలో తనక్కావల్సిన పంట మొక్కల్నే పెంచడం) మనుష్యుల మనగలిగారు. దాన్నుండే నదీ తీరాలవెంట స్థిర నివాసమేర్పరుచుకొనే స్థాయికెదిగారు. తన శరీర పెరుగుదలకు, రక్షణకు, పునరుత్పత్తికి తగిన వ్యవసాయాన్ని-పంటలసాగు, పశువుల-పక్షుల పెంపకం, అటవీ ఉత్పత్తుల్నీ కూడగట్టడం, వంట చెరకు, గృహవసతికి తగిన వృక్షాల్ని వృద్ధిచేయడం, జల, జంతువుల్ని వృద్ధి చేయటం రూపొందించుకొని అనగా వ్యవసాయం యధాతదంగా ప్రకృతిలో అది మనిషి కృత్రిమమైన రూపకల్పన (నేడు ఆ అతిగా వాడే “ప్రకృతి వ్యవసాయం” అనే మాట తప్ప అవగాహన కలిగిస్తుంది).

jan4కాలక్రమేణా తనకు తగిన ప్రాంతానికి, పంటకాలానికి అనుగుణమైన పంట మొక్కల సాగు ప్రక్రియను పరిపుష్టం చేసుకొన్నారు మనుష్యులు. ఆ విధంగా వచ్చినవే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి తృణ ధాన్యాలూ, పెసర, మినుము, కంది, శనగ, అలసంద, చిక్కుడు వంటి పప్పు జాతి పంటలు, వేరశనగ, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజలు, వివిధ రకాలైన కూరగాయలు, పండ్లు సుగంధ ద్రవ్యాలూ, మందులిచ్చే మొక్కలు.

సమాంతరంగా ఆవు, ఎద్దు, బర్రె, మేక, గొర్రె, గుర్రం, గాడిద, ఒంటె వంటి అనేక జంతువులు మనుష్యుల జీవనంలో, అనగా వ్యవసాయంలో భాగమయ్యాయి. పశుపాలన పంటల సాగును పరిపుష్టం చేసింది. మనుష్యుల ఆహార సముపార్జనలో సుస్థిరత ఏర్పడ్డది. అయితే సంఖ్యాపరంగా మనుష్యులు పెరిగినంతగా ఆహార ఉత్పత్తులు పెరగలేదు. ముఖ్యంగా శాస్త్ర జ్ఞానం విస్తరించని ప్రాంతాల్లో తరచుగా ఆహారకొరత ఏర్పడుతూ వచ్చేది. మన దేశంలో కూడా బెంగాల్ కరువొచ్చి ఆకలితో ఎక్కువ మంది చచ్చిపోయారు. దీనిక్కారణం మన వ్యవసాయాన్ని అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు. అంతేగాక తిండి గింజల పంపకంలో అశ్రద్ద వహించారు. స్వతంత్ర భారతదేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర వెలుగులో మన దేశప్రజలు కూడా తమ వ్యవసాయాన్ని మార్చుకొని ఆహారోత్పత్తి పెంచుకోగలిగారు, దాన్నే మనం హరితవిప్లవమని, శ్వేతవిప్లవమని, నీలి విప్లవమని చెప్పుకొన్నాం. ఈ విప్లవాలకు మూలం శాస్త్ర విజ్ఞానం, శ్రమజీవుల త్యాగం. అయితే ఇక్కడ పంటలకు, పశువులకు కీలకంగా ఉన్న మన వ్యవసాయానికి, మన సంస్కృతిలో భాగమైన సంక్రాంతికి ఉన్న సంబంధ మేమిటి? అని కదా మనం చర్చ మొదలెట్టాం మళ్లీ అక్కడికెళ్దాం.

ఈ పండుగ సూర్యమాన కొలమానాలకు తగినట్లుగా వచ్చిందని విశ్లేషకుల భావన. భూకేంద్ర సిద్ధాంత దశలో అనగా సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణానికి మరల్తాడనీ, మన వాతావరణ మార్పుకి అది సూచికని చెప్పుకొచ్చారు. ఈ పండుగను దక్షిణాదిన (మన తెలుగు రాష్ట్రాల్లో కూడా) ‘పొంగల్' అంటారు. అనగా కొత్త వరిధాన్యంతోనూ, పాలు, చెరకు రసం, లేత కొబ్బరితోనూ పొంగించిన అత్యంత మధురమైన వంటకం దానికి ప్రతీక, అలానే అన్ని విధాలా మేత, నీళ్లూ, ఆహారం, గింజలు లభించే ఈ దశలో పశువులకు, పక్షులకు కూడా ఇదొక ముఖ్య సందర్భం (పండగ).

ప్రాంతాల్ని బట్టి పంటల మార్పిడికి తగిన సమయం కూడా యిది. బియ్యం పిండితో గారె, లడ్డు వంటి వాటిని చేసుకొని నలుగురు కలిసి తింటారు. అవియల్, పొంగల్ (మిశ్రమం) రుచికరంగా చేసుకొని పండుగ జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ పండగ సందడి ఎక్కువ. కారణం ఈ ప్రాంతంలో పంటలు ఎక్కువగా ఉండి పండుగల శోభను పెంచుతాయి.

సమాజంలో మొదటి నుండి ఉత్పత్తి వృత్తులేగాక ఇంకా అనేక వృత్తులతో జీవించే ప్రజలు అనేక మంది ఉన్నారు. అటువంటి వారే గంగిరెద్దులు, బుడబుక్కలు, జముకుల కథకులు. ఆహర అభద్రతలో ఉన్న వీరు కూడా ఈ పండగ సందర్భంగా సమాజంలో భాగస్వాములవుతారు. మన రాష్ట్రంలో, తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాల్లో సముద్రతీర ప్రాంతంలో బ్రతికే జాలర్లకు తగిన సంక్రాంతి పండగ రూపాల్ని చూస్తాం.

వ్యవసాయంలో అనేక రకాలుగా ఉపయోగపడే ఎద్దుల్ని, ఆవుల్నీ, దున్నల్నీ ముస్తాబు చేస్తారు. చాలా చోట్ల ఎద్దులు, దున్నలతో జల్లికట్టు, పశువుల పందేలు జరుపటం ఆనవాయితీ. కొన్నిచోట్ల కోడిపందేలు, గొర్రె పొట్టేళ్ల పోటీలు ఈ పండగ రోజుల్లో అత్యంత సంబరంగా జరుపుతారు. మనం పల్లెకు దూరంగా పట్టణాల్లో బ్రతుకుతున్నా, ఎంత ఆధునిక సంస్కృతిని అబ్బించుకొన్నా ఈ పండగల కోసమే తప్పక పల్లెలకు వెళ్లి వ్యవసాయంలో జీవిస్తున్న బందుమిత్రులను కలుస్తుంటాం. ఈ సాంప్రదాయాన్ని పాటించడం మీకూ ఎంతో సంతోషం కదూ!

ఇక సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులూ, పోటీలు మన సాంప్రదాయం. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, జముకల కథలు వంటి కళా రూపాల ప్రదర్శనలు బందు మిత్రుల సంగమాలు. అందుకే సంక్రాంతి అంటే మనందరికి అంతిష్టం.

ఆధారం: ప్రొ. వేణుగోపాల్ రావు

3.00363636364
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు