పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ముక్కు నుండి రక్తం

ముక్కు నుండి రక్తం రావడానికి కారణం, దాని నివారణ తెలుసుకుందాం.

nov15పిల్లల్లో ముక్కు వెంట రక్తం పడటమన్నది చాలా తరచుగా కనిపించే సమస్య. ఈ సమస్య మండు వేసవిలో, చలికాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. వైద్య పరిభాషలో దీన్ని 'ఎపిస్టాక్సిస్' అంటారు. ఇంటి వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడి బారి చర్మం చిట్లినట్లవుతుంది లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని కెలుకుతుంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఎక్కడి నుండి?

మన ముక్కు గోడల్లో చాలా రక్తనాళాలుంటాయి. ముఖ్యంగా ముక్కు కొనకు ఒక అంగుళం లోపలగా, సిరలు పై చర్మం కిందే, చాలా సున్నితంగా కూడా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని 'లిటిల్స్ ఏరియా' అంటారు. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలా మందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తుంటుంది. కాకపోతే దీన్నే ముక్కులోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు.

కారణమేమిటి?

 • ముక్కులోపల వేలు పెట్టి కదిలిస్తుండటం.
 • జలుబు, అలర్జీల వంటివి వచ్చినప్పుడు చాలా బలంగా తుమ్ములు రావడం, లేదా గట్టిగా చీదటం.
 • వేసవిలో వేడి మరీ ఎక్కువగా ఉండటం.
 • ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్ల వంటి వస్తువులు పెట్టుకోవడం.
 • ఈ సందర్భాలన్నింటిలోనూ 'లిటిల్స్ ఏరియా’లోని రక్తనాళాలు చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది.

తక్షణం ఏం చేయ్యాలి?

nov16కంగారు పడకుండా బిడ్డను సాంత్వన పరచటం ముఖ్యం. ఈ సమయంలో బిడ్డ ను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకుని ఉండేలా కూర్చోబెట్టి ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తిపట్టాలి. దీని వల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు.

ఇలా 10 నిమిషాలు ఒత్తిపట్టి ఉంచాలి. మధ్యమధ్యలో ఆగిందా? లేదా? అని వదలి చూసే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. 10 నిమిషాల తర్వాత కూడా ఇంకా రక్తం వస్తుంటే మరో 10 నిమిషాలు పట్టుకుని ఉండాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చేయ్యొద్దు.

అప్పటకీ తగ్గకుంటే?

ముక్కును పైన చెప్పినట్లుగా పది నిమిషాల చొప్పున రెండు దఫాలుగా ఒత్తిపట్టినా కూడా రక్తం వస్తుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లటం మంచిది. ఇదే కాదు, మనకు తెలియకుండా లోపల ముక్కులో ఏదైనా ఉందన్న అనుమానం ఉన్నా, అలాగే కేవలం ముక్కు నుంచే కాకుండా చెవులు, చిగుళ్ల వంటి వాటి నుంచి కూడా రక్తం వస్తున్నా, రక్తం మరీ ఎక్కువగా వేగంగా పోతున్నా, లేదా ఆటల్లో పడిపోవటం, ముక్కుకు బలంగా దెబ్బతగలటం వంటి

సందర్భాల్లో కూడా వెంటనే వైద్యుని వద్దకు తీసుకెళ్లటం మంచిది. రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్ నైట్రేట్ సాయంతో లేదా విద్యుత్ పరికరాలతో ఆ ప్రాంతాన్ని 'కాటరైజ్’ చేస్తారు. మొత్తానికి ముక్కు నుంచి రక్తం రావటమన్నది తల్లిదండ్రుల్లో భయాందోళనలను పెంచేదే గానీ మరీ అంత ప్రమాదకరమైన సమస్య మాత్రం కాదు.

నివారించేదెలా?

 • ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించేయ్యాలి. పిల్లలకు
 • తప్పనిసరిగా గోళ్లు తీసెయ్యాలి.
 • బలంగా ముక్కు చీదనివ్వద్దు.
 • ముక్కు రంధ్రాల్లో పక్కులు ఎక్కువగా కడుతుంటే, ముక్కులో వేసేందుకు సెలైన్ చుక్కల మందులు దొరుకుతాయి. వాటిని రెండు పూటలా ముక్కులో వేసి, మెత్తబడిన తర్వాత శుభ్రం చేయ్యటం మంచిది.
 • వాతావరణం బాగా పొడిగా ఉండే వేసవిలోనూ, చలికాలంలోనూ పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ (వాజ్లైన్) రాయటం మంచిది.

ఆధారం: డా. ఎం. రమాదేవి

3.01416430595
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు