অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరల్డ్ డెఫ్ డే

మన చెవులు శబ్దాన్ని ఎలా గ్రహిస్తాయి?

sep7మన చెవిలో మూడు ముఖ్య భాగాలుంటాయి. 1. వెలుపలి చెవి, 2. మధ్య చెవి, 3. లోపలి చెవి.

వెలుపలి చెవి మనకు బయట కన్పించే భాగం. మధ్యచెవి 2.5 సెం.మీ. పొడవైన ఒక గొట్టం లాగా వుండి లోపలి వైపు కర్ణభేరితో మూసుకుపోతుంది. మధ్యచెవి గొట్టం అటూ ఇటూ వెడల్పుగా మధ్యలో ఇరుకుగా వుండి శాండ్ క్లాక్ ను పోలి వుంటుంది.

కర్ణభేరి దాటి ఇంకా లోపలికెళ్తే లోపలి చెవి భాగాలుంటాయి. ఇవి మూడు ఎముకలు జాయింట్ గా వుండి కర్ణభేరిని లోపలి నత్త ఆకారంలో వున్న కాక్లియాను కలుపుతాయి. కాక్లియాలో శబ్దాన్ని గ్రహించే ప్రత్యేక నాడి కణాలుంటాయి. ఈ నాడీకణాల చివర్లన్నీ కలిసిపోయి 'ఆడిటరీ నాడీ' (శ్రవణ నాడి) అనే ఒకే ఒక్క పెద్ద నాడీ తయారవుతుంది. కాక్లియానించి బయల్దేరిన శ్రవణ నాడి మెదడులోని శబ్ద కేంద్రానికి అనుసంధానమై ఉంటుంది.

శబ్దాన్ని గ్రహించడం చెవి పని, శబ్దాన్ని విశ్లేషించడం మెదడు పని.

మన చుట్టూ సృష్టించబడుతున్న అన్ని ధ్వని తరంగాలు మొదట వెలుపలి చెవిలోంచి మధ్యచెవిలోకి ప్రయాణించి కర్ణభేరిని తాకుతాయి. వాటికనుగుణంగా కర్ణభేరి కంపిస్తుంది. ఈ ప్రకంపనలను మధ్య చెవిలోని మూడు ఎముకలు కాక్లియాకు చేరవేస్తాయి. కాక్లియాలోని శబ్దనాడీ కణాలు ఈ ప్రకంపనలను ఎలక్ట్రిక్ సిగ్నల్ గా  :మార్చి శ్రవణ నాడీ ద్వారా మెదడుకి చేరవేస్తాయి. మెదడు పూర్వ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి అవి ఎక్కడినించి వచ్చాయి? ఎంత దూరం నుండి వచ్చాయి? ఏ స్థాయిలో, తీవ్రతతో వున్నాయి లాంటి విషయాల్ని విశ్లేషించి వాటికి సమాధానంగా శరీర భాగాలన్నింటికీ సంకేతాల్ని పంపుతుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ శబ్దాన్నించి మామూలు సంభాషణల్ని వేరు చేసి తెలియపరుస్తుంది.

‘చెవుడు’ రావడానికి ప్రధాన కారణాలు

 1. sep8జన్యులోపాల వల్ల పుట్టుకతో వచ్చేది.
 2. పెరుగుతున్న క్రమంలో చెవికి సోకే రకరకాల వ్యాధులు, కంతులు, తరచూ చీము కారడం, కర్ణభేరికి రంధ్రం పడటం లాంటివి.
 3. వృత్తి రీత్యా శబ్దకాలుష్యమెక్కువ ఉన్న చోట పనిచేయాల్సి రావడం. ఉదా: భవన నిర్మాణ కట్టడాలలో యంత్రాల శబ్దాలు, డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నప్పుడు, నీళ్ల కోసం బోర్లు వేస్తున్న ఉద్యోగం, కలప పరిశ్రమలో రంపము శబ్దం, విమాన యాన రంగంలో విమానం ఎగిరేప్పుడు మరియు దిగేటప్పుడు, నిత్యం వాహనాల రద్దీతో హారన్ల మోతతో రోడ్ల మీద ఎక్కువ వుండటం, జెట్ ఇంజన్ లు, రాకెట్ లాంచింగ్ కేంద్రాల్లో పని చేయడం, మైనింగ్ పరిశ్రమలో బ్లాస్టింగ్  తదితరాలు.
 4. మనం ఎంజాయ్ చేస్తున్నామనుకొని మన చెవుల్ని మనమే తూట్లు పొడుచుకుంటున్న వైనం. ఉదా: దీపావళి బాంబులు పేలుస్తున్నాం. డిజిటల్ స్టీరియో పేరుతో సినిమా థియేటర్లలో చెవులు గింగుర్లనిపించే సౌండ్ వింటున్నాం. హోరెత్తిపోయే శబ్దంతో పాటల్ని వింటున్నాం. రయ్యుమని దూసుకుపోయే మోటార్ సైకిల్ రేస్ లలో పాల్గొంటున్నాం.
 5. చెవిలో గుబిలి (Ear wax or Cerumen) పేరుకుపోయి తాత్కాలికంగా చెవి వినపడకపోవచ్చు.
 6. వయస్సు పెరుగుతున్న కొద్దీ కాక్లియాలోని నాడుల సంఖ్య తగ్గి చెవుడు రావచ్చు.
 7. జెంటోమైసిన్ లాంటి యాంటీ బయోటిక్ మందులు, ఎక్కువ మోతాదులో ఆస్పిరిస్ లాంటి నొప్పి మందులు, కొన్ని రకాల మలేరియా మందులు చెవిలోకి శబ్దనాడుల్ని బలహీన పరుస్తాయి. వీటితో తాత్కాలిక చెవుడు రావచ్చు.

శబ్ద తీవ్రత:

శబ్ద తీవ్రతను డెసిబెల్స్ లో కొలుస్తారు. ఏ పనులకు ఎంత శబ్దతీవ్రత?

ప్రమాదం లేని శబ్ద తీవ్రత.

డెసిబెల్స్

శబ్దాలు

30

చిన్నగొంతుతో మాట్లాడుకోవడం

60

మామూలు సంభాషణ

78

వాషింగ్ మిషన్ శబ్దం

 

కాస్త ప్రమాదంతో కూడుకున్నది

డెసిబెల్స్

శబ్దాలు

80 – 90

ట్రాఫిక్ రద్దీలో ఎక్కువ సేపు వుండటం.

90

హైస్పీడ్ మోటార్ సైకిల్ శబ్దం. పెద్ద వాల్యూమ్ తో  గ్రామోఫోన్ శబ్దం.

100

డ్రిల్లింగ్ మిషన్ సౌండ్

110

25 మీటర్ల దూరంలో మైనింగ్ బ్లాస్ట్, రంపము శబ్దం, పెద్ద హోరుతో మ్యూజికల్ నైట్ శబ్దం,

 

ఖచ్చితంగా చెవుడుని కలిగించే శబ్దాలు

డెసిబెల్స్

శబ్దాలు

120

అంబులెన్స్ సైరన్ (ఎక్కువ సమయం వింటే)

140

జెట్ ఇంజన్ స్టార్ట్ అయ్యేప్పుడు

165

ప్రేలుడు పదార్థాల బ్లాస్టింగ్

180

రాకెట్ లాంచింగ్ సౌండ్ సమీపంలో

 

90 డెసిబెల్స్ దాటిన శబ్ద తీవ్రతను కాలుష్యంగానే పరిగణించాలి. అది ఎంతమేర చెవికి సోకితే అంత ఎక్కువ చెవి నాడీకణాలు దెబ్బతింటాయి. కొద్ది కాలానికి పనిచేయకుండాపోతాయి. మనం వినికిడి శక్తిని కోల్పోతాం.

శబ్ద కాలుష్యం ప్రస్తుత సమాజంలో మన చెవులకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు. దీని ద్వారా సంక్రమించే చెవుడు పర్మనెంట్ గా వుంటుంది. మందులు పనిచేయవు. హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకొని తిరగాల్సిందే!

అలాగే తరచూ చెవికి సోకే వ్యాధులు, చెవి నుంచి ఎప్పుడూ చీము కారుతుండడం పట్ల నిర్లక్ష్యం వహిస్తే పర్మనెంట్ గా చెవుడు వస్తుంది. పర్మనెంట్ చేవుడుకి హియరింగ్ ఎయిడ్స్ వాడడం, కర్ణభేరికి రంధ్రం పడితే రంధ్రం మూసే ఆపరేషన్, కాక్లియా ప్రాబ్లమ్ వుంటే కాక్లియార్ ఇంప్లాంట్స్ తదితరాలు కొన్ని వైద్య చికిత్సలు.

చెవిలో ‘గుబిలి' గురించి కొన్ని విషయాలు

దీన్ని ఇయర్ వ్యాక్స్ లేదా సెరుమన్ (Cerumen) అంటారు. వెలుపలి చెవిలో వుండే తైలగ్రంథులు, స్వేదగ్రంథులు స్రవించేదే గుబిలి. దీన్లో చెవి చర్మం నించి రాలిపోయిన చర్మకణాలు, వెంట్రుకలు కూడా కలిసిపోయే వుంటాయి. గుబిలిలో 30% క్రొవ్వు పదార్థం వుంటుంది కాస్త ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. (pH 6.1)

గుబిలి చేసే మేలు:

 1. చెవి లూబ్రికేషన్ కి ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే చెవి ఎండిపోయినట్లయి దురద పెడుతుంది.
 2. బయటినించి బాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మ జీవులను పట్టేసుకొని లోపలి చెవిలోకి పోకుండా నిరోధిస్తుంది.
 3. ఆమ్లగుణం కలిగి ఉండటం వలన చెవిలో కొన్ని రకాల బాక్టీరియాలు వృద్ధి చెందవు.
 4. స్నానం చేస్తున్నప్పుడు, ఈత కొడుతున్నప్పుడు లోపలికి నీళ్లు పోకుండా వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది.

గుబిలి ఎలా పోతుంది?

సహజంగా ఉత్పత్తి అయిన గుబిలి మనం ఆహారం నమిలేప్పుడు, దవడలు కదిలించే చర్యల వలన చెవి వెలుపలి వైపుకి నెట్టబడుతుంది. క్రమక్రమంగా వెలుపలికి నెట్టబడిన గుబిలి ఎండిపోయి మన ప్రయత్నమేమీ అవసరం లేకుండా అదే పొలుసులుగా రాలిపోతుంది.

చెవి పుల్లలు (ఇయర్ బడ్స్ Ear Buds) అవసరమా?

అమెరికన్ అకాడమీ సభ్యులైన పెద్ద పెద్ద చెవి వ్యాధుల డాక్టర్లు ‘ఇయర్ బడ్స్' ఉపయోగించడం ప్రమాదం అని నొక్కి చెప్పారు. మధ్య చెవికున్న ప్రత్యేక నిర్మాణం వలన చెవి పుల్లలతో గుబిలిని తీయడానికి ప్రయత్నించినప్పుడల్లా గుబిలి లోపలి వైపుకి నెట్టబడుతుంది తప్ప బయటికి రాదు. అలా ప్రతిసారి లోపలికి నెట్టబడిన గుబిలి కర్ణభేరి మీద పేరుకొనిపోతుంది. పైగా ఈ పుల్లలు కర్ణభేరికి గట్టిగా తగిల్తే కర్ణభేరి పగిలే ప్రమాదముంది.

ఎన్నో సంవత్సరాలుగా చెవి వ్యాధి డాక్టర్లు ఈ విషయాలను చెప్తున్నా ఒక అమెరికన్ బహుళ జాతి సంస్థ ‘ఇయర్ బడ్స్'ని తయారు చేస్తూ రకరకాల ప్రచారాల్లో ప్రజల్ని మభ్య పెట్టి కొన్నివేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. ఈ కంపెనీ ఆ మధ్య 'బేబీ ఆయిల్'తో కూడా ప్రజల్ని మోసపుచ్చి వ్యాపారం చేసింది.

ఇదంతా ఒక ఎత్తు. చాలా మంది చెవుల్లో చీరల పిన్నులు పెట్టి తిప్పి గుబిలి తీస్తుంటారు. టవల్ కొసలను మలితిప్పి చెవిలోపలికి పోనిచ్చి శుభ్రం చేశామనుకుంటారు. ఇదంతా అనవసరమైన, ప్రమాదకరమైన కసరత్తు.

మరి గుబిలితో ఏమి ప్రమాదం లేదా?

ఇందాక చెప్పినట్టు గుబిలిని తీయడానికి ప్రయత్నాలు చేస్తే అది కర్ణభేరి మీద రాయిలాగా పేరుకుపోతుంది. వినికిడి తాత్కాలికంగా లోపిస్తుంది. డాక్టరు దగ్గరికి వెళ్లే గుబిలిని కరిగించే మందు చెవిలో

మూడు నాలుగు రోజులు వేసుకోమంటారు. తర్వాత దాన్ని ప్రమాదం లేకుండా తీసేస్తారు. అన్నింటికీ మించి మనం మన చెవుల పట్ల, ఆరోగ్యం పట్ల సరైన అవగాహనతో వుంటే వినికిడి శక్తిని కాపాడుకోగలం. చెవి కేవలం వినేందుకు మాత్రమే కాదు, అది మన

శరీర సమతుల్యత లేదా సమతూకాన్ని (Balance) ఇచ్చే ఒక అవయవం కూడ. అందుకే మనం శబ్ద కాలుష్యాన్ని నివారిస్తే మనకూ, మన తోటి వారికి తోడ్పడగలం. ఆలోచించండి!

ఆధారం: డా. వి. ప్రభావతి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate