অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వాక్యూమ్ క్లీనర్

వాక్యూమ్ క్లీనర్

feb0016.jpgమన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మన ఇల్లు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇంటి గదులు, వసారాలు, ఫర్నీచర్ ఇలా అన్నీ దుమ్ము ధూళి లేకుండా కంటికి ఇంపుగా కన్పించాలంటే వాటిని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి. గదులు శుభ్రం చేయడానికి చీపుర్లు, ఫర్నీచర్ శుభ్రం చేసేందుకు గుడ్డ వాడుతుంటాం. ఈ రోజుల్లో వాక్యూమ్ క్లీనర్ లు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి విద్యుత్ ఆధారంగా పనిచేస్తాయి. ఎక్కువ సామర్థ్యం ఉన్న కొన్ని వాక్యూమ్ క్లీనర్లు 1300w మోటార్ తో సుమారు 3 గం.పాటు ఆగకుండా పని చేస్తాయి. పైగా వేర్వేరు అవసరాలకు వాడుకునే వేర్వేరు ఉపకరణాలను (accessaries) అమర్చుకోవచ్చు. గాలిని పీల్చేందుకు లేదా ఊదేందుకు హోసపైప్ (hose pipe) ఉపయోగపడుతుంది. ఉపకరణాలను దీనికి కలుపుకోవాలి. నాజిల్, రేడియోబ్రష్, కోట్ బ్రష్, జెట్ ఎయిర్ ఎటాచ్ మెంట్ వంటివి ఈ ఉపకరణాల్లో కొన్ని గదులు, ఇంటిపై కప్పులు, సోఫాలు, తివాచీలు, కంప్యూటర్ కీ బోర్డ్ లు, కారు లోపలి భాగాలు ఇలా ఎన్నింటినో శుభ్రం చేసేందుకు వాక్యూమ్ క్లీనర్ లు ఉపయోగపడతాయి. వీటికి అమర్చుకునే ఉపకరణాలు వేర్వేరు సైజుల్లోను, వేర్వేరు ఆకారాల్లోనూ ఉంటాయి. వాక్యూమ్ క్లీనర్ బాడీ మేలు రకం ABS (ఎక్రిలో నైటైల్ బ్యుటడయీన్ స్టెరీన్) ప్లాస్టిక్ తో చేయబడుతుంది. ఇది తక్కువ బరువు, ఎక్కువ గట్టిదనం కలిగి ఉంటుంది. వేడిని, అధిక పీడనాన్ని తట్టుకుంటుంది.

feb0017.jpgఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతున్న వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక గ్లాసు లేదా సీసాలో ఉన్న డ్రింక్ ను తాగేందుకు సాధారణంగా 'స్టాను. ఉపయోగిస్తాం కదా. ఈ సందర్భంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా గమనించారా? డ్రింక్ లేదా జ్యూస్ ను స్ట్రాతో నోట్లోకి పీల్చుకుంటున్నప్పుడు స్ట్రా అడుగు కొనకు, నోట్లో పెట్టుకున్న కొనకు మధ్య పీడనంలో నిమ్నత (drop) ఏర్పడుతుంది. పై పీడనం కంటే క్రింది వీడనం ఎక్కువ కావడంతో జ్యూస్ నోట్లోకి గెంటబడుతుంది. వాక్యూమ్ క్లీనర్ కూడా ఇంచుమించు ఇదే విధానంతో పనిచేస్తుంది. కానీ పని జరిగే తీరులో కొంత క్లిష్టత ఉన్న మాట మాత్రం నిజం.

feb0012.jpgవాక్యూమ్ క్లీనర్ తో గదిలో నేల, తివాచీ, సోఫా వంటి వాటిని శుభ్రం చేసినప్పుడు పీల్చుకోవడం లేదా లాగటం (suction) ద్వారా దుమ్ము, ధూళిని లాగి వేస్తుంది. వాక్యూమ్ క్లీనర్ చూడ్డానికి క్లిష్టమైనదిగా అగుపించినా, దీంట్లో ముఖ్యంగా ఉండే భాగాలు ఆరు మాత్రమే.

  1. లోపలికి ప్రవేశించే ద్వారం (Inlet port) లేదా లాక్కునే కొన (suction end)
  2. నిర్గమ ద్వారం (exhaust port) లేదా గుంజివేసే కొన (blower end)
  3. విద్యుత్ మోటార్
  4. పంకా (fan)
  5. రంధ్రాలున్న సంచి (perforated bag)
  6. మిగతా భాగాలకు చోటు

వాక్యూమ్ క్లీనర్ ప్లగ్ ను సాకెట్ కు తహిలించి స్విచ్ వేస్తే అది పనిచేయడం ప్రారంభిస్తుంది.

  1. విద్యుత్ వల్ల మోటార్ పని చేస్తుంది. ఈ మోటార్ పంకాకు (fan) కలపబడి ఉంటుంది. ఈ పంకా రెక్కలు కొంత కోణీయంగా (angled) మెలికలు తిరిగినట్లుగా ఉంటాయి. మోటార్ AC లేదా DC మీద పనిచేసేలా ఉంటుంది.
  2. పంకా రెక్కలు కదులుతున్నప్పుడు అవి గాలిని ది నిర్గమద్వారం వైపునకు తోస్తాయి.
  3. గాలితో పాటు దుమ్ముకణాలు ముందుకు తోయబడుతుంటే, ఒక బలీయమైన వాయు (గాలి) ప్రవాహం క్లీనర్ బాడీలోకి పోతూ, పీల్చుకునే నాజిల్ ను ఉంచిన నేలా, తివాచీ లేదా సోఫా మీద ఉన్న దుమ్ముకణాలను తనతో పాటు లాక్కుని పోతుంది. ఈ గాలి ప్రవాహం బాడీలో ఒక ఫిల్టర్ గుండా పోతుంది. ఇలా పోతున్నప్పుడు గాలి లాక్కొచ్చిన దుమ్ము ఫిల్టర్ ముందు పోగు పడుతుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగదు.

 

feb0013.jpgచాలా వాక్యూమ్ క్లీనర్స్ లో సంచి వంటి ఫిల్టర్ లు ఉంటాయి. గాలి వీటి లోపలి నుంచి బయటికి పోతుంది. దుమ్ము సంచిలో పోగుపడుతుంది. అందుకే సంచీని అప్పుడప్పుడు ఖాళీ చేస్తుండాలి. కానీ దీని వల్ల ఒక ఇబ్బంది ఉంది. అదేమిటంటే, సంచి దుమ్ముతో నిండుతున్న కొద్దీ గాలి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. ఈ ఇబ్బందిని తొలగించేందుకు కొన్నింటిలో ఫిల్టర్ కు ముందు ఒక ఛాంబర్ ఉంటుంది. దుమ్ము ఈ ఛాంబర్ లో సేకరించబడుతుంది.

గాలి దుమ్మును తనతో పాటు లాక్కుని పోవాలంటే గాలి ప్రవాహం (air flow) తగినంత బలంగా ఉండాలి. ఈ గాలి ప్రవాహం వదులుగా ఉన్న దుమ్ము కణాలను తాకినప్పుడు ఘర్షణ (friction) ద్వారా తనతో లాక్కుని పోతుంది. వాక్యూమ్ క్లీనర్ కు వాడే ఉపకరణాలు గాలి ప్రవాహం ఒక చోట కేంద్రీకృతమయ్యేలా చేస్తాయి. గాలి ప్రవేశించే మార్గం సైజు, ఆకారం మీద సక్షన్ ఆధారపడి ఉంటుంది. మన అవసరానికి తగినట్లుగా వీటిని వాడుకుంటాం. జెట్ ఎయిర్ ఎటాచ్ మెంట్ ను గుంజివేసే కొనకు కలిపి బలమైన గాలి ప్రవాహంతో దుమ్మును గెంటివేయడం వీలవుతుంది. కంప్యూటర్ కీ బోర్డులు వంటి వాటిని ఈ పద్ధతిలో శుభ్రం చేసుకోవచ్చు.

వాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగిస్తున్నప్పుడు దానిని గదిలోని ఏ మూలకైనా నెమ్మదిగా కదిల్చేందుకు, క్లీనర్ వెనుక, ముందు చక్రాలుంటాయి. పవర్ కార్డును కావలసినంత దూరం లాక్కునే వీలుండేలా చుట్టబెట్టే కార్డ్ వైండర్ ఉంటుంది.

వాక్యూమ్ క్లీనర్ లలో రకాలున్నాయి. కొన్ని పెద్దవి. ఇవి ఎన్నో ఉపకరణాలతో వస్తాయి. ఇవి ఎక్కువ సేపు ఆగకుండా పనిచేస్తాయి. కొన్ని చిన్నవి. చేతితో పట్టుకోడానికి (hand held) వీలుగా ఉంటాయి. వీటిలో కొన్ని కార్డ్ తో ఉంటాయి (corded) మరికొన్ని కార్డ్ లేనివి (cordless). కార్డెడ్ వాక్యూమ్స్ AC పవర్ ను ఉపయోగించుకుంటాయి. వీటి ప్లగ్ ను, సాకెట్ కు కలిపితే పనిచేస్తాయి. ఇవికూడా ఎక్కువ సేపు ఆగకుండా పనిచేస్తాయి. కార్ వాక్యూమ్ లు చిన్నవి, తేలిగ్గా ఉంటాయి. 12 వోల్ట్ ల ఛార్జర్ తో కారు ఇంజన్ ‘ఆన్' అయినప్పుడు పనిచేస్తాయి. కారులోపలి భాగాలు శుభ్రం చేసేందుకు ఇవి చాలా అనువుగా ఉంటాయి. వీటిలో కొన్నింటికి సన్నని పగులు ఉన్న సాధనాన్ని కలిపి కంప్యూటర్ కీ బోర్డ్, అదే తరహా ఇతర సాధనాలను శుభ్రం చేసేందుకు ఉపయోగించుకోవచ్చు.

ఆధారం: డాక్టర్ ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate