অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శనీశ్వర ప్రీత్యర్థ – తిలాదానం? (నమ్మాలా-వద్దా)

శనీశ్వర ప్రీత్యర్థ – తిలాదానం? (నమ్మాలా-వద్దా)

మాచిరెడ్డి గారు భార్యాసమేతంగా వచ్చి పిలవడంతో రఘురాం తాత గారు, నానమ్మతో కలసి మాచిరెడ్డి గారి ఇంట్లో జరిగే నవగ్రహ శాంతి హూమానికి వచ్చారు. పుజాకార్యక్రమాలలో నానమ్మ మమేకవగా, తాతగారేమో ప్రక్కవారితో మాట కలిపారు. రఘురాం తాత: ఏమండి! ఈ హూమం ఎందుకు చేస్తున్నారు.

పెద్ద మనిషి : రెడ్డి గారి కుమారుడు మెడిసిన్ రెండో సంవత్సరం పరీక్షలు ఫెయిలయినాడట !

తాత : ఫెయిలయితే ?

పెద్దయన : వాడి జాతకంలో శని ఎడవ ఇంటిలో వుండి శుక్రుడితో కలిసి, గురువును వక్రదృష్టిలో చూడటం వలన అబ్బాయి కి శనిదోషం కలిగి ఫెయిలయినాడని చెప్పారు!

తాత : ఎవరు చెప్పారు ?

పెద్దాయన : ఆ పూజ చేయిస్తున్నారే, ఆ ప్రధాన పూజారి గారు.

తాత : ఆహా! (సాలోచనగా)

పెద్దాయన : రెడ్డి గారికి ఒకడే సంతానం! పొయినేడే ఉన్నదంతా పెట్టి కొడుకును పేమెంట్ సీటులో మెడిసిన్ లో చేర్చాడు.

తాత : అదీ సంగతి ! ఈ హూమానికి మళ్ళి చాలానే ఖర్చు చేస్తూన్నాడే ?

పెద్దాయన : ఖర్చేమరి! ఐదుగురు బ్రాహ్మణులు, పూజా ద్రవ్యాలు, వస్త్రాలు, దానాలు, భోజనాలు అన్ని కలుపుకొని అరవై వేలు పై మాటే !

తాత : అమ్మో ! (అంటూ హూమం వైపు చూశారు)

తాత : పూజా మంత్రాలు చెప్పకుండా, వరండాలో ఒంటరిగా గూర్చున్నారే ఆ స్వామి ఎవరండి ?

పెద్దాయన : అమ్మో! ఆయన వైపు చూడకండి.

తాత : ఏం?

పెద్దాయన : శనేశ్వర ప్రీతి కోసం తిలాదానం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి.

తాత : తిలాదానం అంటే ?

పెద్దాయన : శని దేవునికి ప్రితికరమైన నువ్వులు, నల్లని గుడ్డ, తైలం దానం అన్నమాట! (పూజ పుర్తయి దానాల కార్యక్రమం ప్రారంభమైంది)

(ప్రధాన పూజారి ఒక్కక్క గ్రహం పేరు చెప్పి వారి ప్రీత్యర్ధం అంటే తనకు, తన వెంట వచ్చిన బ్రాహ్మణులకు సువర్ణం, గోవు, భూమి, శయ్య, గొడుగు, చెప్పులు, దానాలుగా రెడ్డి గారి దంపతులతో ఇప్పిస్తున్నారు)

ప్రధాన పూజారి : ఎప్పుడు తిలాదానం! అయ్యా, వేదశర్మా లేచిరా! అమ్మా, ప్రక్కకు జరిగి ఆయనను పంపండి. (అందరి చూపు పేదబాపని పైనే. అతని మాసిన గడ్డం, దుస్తులు, మురికిపట్టిన జంధ్యం పోగు, అతని చుపులోని నిర్లిప్తత అక్కడ ఎవరి మనస్సు కరిగించలేదు)

ముత్తైదువ : వదినా! ప్రక్కకు జరుగవే! ఆయనకు తగలవద్దు.

ప్రధాన పూజారి : రెడ్డి గారు ! ఈ నువ్వుల సంచి, నల్లగుడ్డ, తిలాకోండి (అంటు మంత్రం చదవసాగాడు)

ప్రధాన పూజారి : శనేశ్వర ప్రీత్యర్ధం.. శని దోషా నివారణార్ధం.. సర్వపీడా సమాప్తి కరేని.. తిలాదానం.. సమర్పయామి!

రెడ్డి గారు : సమర్పయామి (అంటూ దంపతులు పేద స్వామికి నువ్వుల దానం ఇచ్చి పాద నమస్కారం చేయబోయారు)

పెద్దాయన : రెడ్డి గారు, పాదాలు తాకవద్దు. దూరం నుంచే మొక్కండి!

(దానం పొందిన వస్తువులు, దక్షణ తాంబూలంతో పేద స్వామి గేటు వైపు నడవసాగారు)

రఘురాం తాత : స్వామీ! భోంచేయరా?

స్వామి: అలాగే ! (అంటూ ఓ ములన కుర్చీలో కూర్చున్నాడు) (అతనిని వెనక్కు పిలవడం నచ్చన చాలామంది రఘురాం తాతవైపు కోపంగా చూసారు)

తాత : ఎంత దక్షణ ఇచ్చారు? అభ్యంతరం లేకుంటేనే చెప్పండి!

స్వామి : రెండు వందలా పదహార్లు.

తాత : తిలాదానం ఎందుకీస్తారండి ?

స్వామి : ఈ దానంలో పాటు వారికి దోషాలు, అరిష్టాలు పోతాయని....!

తాత : అవి మీకు ప్రాప్తిస్తాయని కూడా కదా !

కావచ్చు!

మీకు బాధ కాని, భయం కాని లేదా?

అనందంగా వుంది ?

వారి కష్టాలు తిర్చారనా?

కాదు, నా కుటుంబ కస్టాలు తీరుతున్నాయని.

ఇలా వచ్చిన దానితోనే మేం మూడు పూతల తింటున్నాం. నా పాపను మంచి చదువు చదివిస్తున్నాను కూడా!

అమ్మాయి ఏం చదువుతుంది?

శనేశ్వర స్వామి దయ వలన... రెడ్డి గారి కుమారుడు చదివే కాలేజిలోనే మేడిసన్ సిటు వచ్చింది (అతని గొంతులో రవ్వంత గర్వం !)

మీ సంపాదనతో ఎలా సాధ్యమైంది ?

తాను మెరిట్కోటాలో ఫ్రీసీట్ తెచ్చుకొంది. ఫీజ్ రీయంబర్స్మెంట్, స్చోలోర్ షిప్ లు వస్తున్నాయి.

మరి పుస్తకాలు, పై ఖర్చులకు?

అమ్మాయి సాయంత్రాలు వాచ్ సెంటర్ లో పార్ట్ టైం జాబ్ చేసి రెండు వేల వరకు సంపాదిస్తుంది.

మీ ఆవిడ గారు?

టైలరింగ్ చేసి తానూ కొంత సాయపడుతుంది.

(కళ్ళల్లో ఆనందం, నీటి చుక్కల రూపంలో పొంగసాగింది)

ఇవన్నీ మి మెప్పు పొందటానికి చెప్పడం లేదు !

(లేచి స్వామి పాదాలనంటి నమస్కరించారు. విషయం తెలియని అందరు వారిద్దరి వంక విచిత్రంగా చూడసాగారు. నాన్నమ్మ తాత ప్రక్కన చేరిపోయింది)

తాత : (గద్గద స్వరంలో) స్వామి! మీ అమ్మాయి కి వీలైనప్పుడు ప్రతి రోజు నా మనవడు వంశీకి ఒక గంట ట్యూషన్ చెప్పమనండి. నెలకు 4000 రూపాయల వరకు ఫీజుగా ఇవ్వగలరు.

(రెడ్డి గారి కొడుకు ద్వారా పేద బ్రాహ్మణుడి కూతురు డాక్టర్ చదువుతుందని తెల్సి అందరు అయన చుట్టు చేరిపోయారు)

తాత : ఇప్పుడు వేదశర్మ గారి ప్రిత్యర్ధం వీరి అమ్మాయి చదువుకు దక్షిణగా (అంటు తాత గారు ఒక తట్టలో వేయి రూపాయలు చేశారు)

(నిమిషాలలో వందల నోట్లతో తట్ట నిండింది. రెండో మూడో బంగారు ఉంగరాలు కూడా అందులో వున్నాయి)

స్వామి : అమ్యా ! చాల సంతోషం, మీ సాయం నెను, నా బిడ్డ ఎన్నటికీ మరువం.

రెడ్డి గారు : స్వామీ! మా వాడిని దీవించండి .. వీలైతే మీ అమ్మాయిని వీడికి చదువులో సాయం చేయమనండి.

స్వామి : తప్పకుండ (రెడ్డి గారి కుమారుని దీవించి) నాయనా, దైవత్వం అంటే ఇతరులకు మేలు చేయడమే. సంకల్పబలం. ఏకాగ్రత, కష్టపడే గుణం ఉంటె ఏ గ్రహపిడ ఏమి చేయలేదు. వాటి శాంతికి హూమాలు అక్కర లేదు.

రఘురాం : గ్రహ ఫలాలే వుంటే అందరి శనిని ఆనందంగా తీసుకునే ఈ స్వామి, ఆయన కుటుంబం నాశనమయ్యేది కదా?

పెద్దాయన : ఔనండి మనకు తెలీకుండానే ఎన్నో మూడాచారాలకు బలవుతుంటాం లేదా పాలుపంచుకొంటూ వుంటాము.

(కొందరు ఉత్సహంగా స్వామితో సేల్ఫిలు దిగుతున్నారు. రెడ్డి గారేమో స్వామికి భోజన ఏర్పాట్లు చేయడంతో బిజీగా వున్నారు!)

రచయిత: జి. చంద్రశేఖర్, సెల్:-9494746248

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/19/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate