অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హరితం... హరితం... ఆనంద భరితం

హరితం... హరితం... ఆనంద భరితం

july4చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అంటారు పెద్దలు మన తెలివిలేని తనాన్ని వెక్కిరిస్తూ, నిజమే జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఏడిచి ఏం లాభం! కనీసం చేతులు కాలినాకనైనా తెలివి వచ్చిందని సంతోషపడటమా? తెలివి లేక పోయెనని నిందించుకుంటూ కాలం గడపటమా? అంటే మొదటిదే ఒకందుకు మంచిందని చెప్పాలి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పటికే మీకు తట్టే ఉండాలి. ఒకనాడు ఎక్కడో దూరాన ఒక చెట్ల గుంపు ఆకుపచ్చగా కనిపిస్తే అక్కడో ఊరుందని ఊరట చెందేవాడు దాహంతో నాలుక పిడచగట్టుకుపోతున్న బాటసారి. మరిప్పుడు ఊరొస్తుదంటే కనుచూపుమేరలో చెట్లే కనపడవు. అభివృద్ధి పేరుతో కాంక్రీటు అరణ్యాలు నిర్మించి ప్రకృతి మనకందించిన వనాలను మాయం చేశేశాం. వాగులు, వంకలూ, యేర్లూ, సెలయేళ్ళూ, నదీనదాలు, అభయారణ్యాలు ఇలా చెప్పుకుంటూపోతే ప్రకృతినీ, ప్రకృతి ఇచ్చిన సంపదనూ నవ నాగరికత పేరుతో ఒకటొకటే అభివృద్ధికి నైవేధ్యం ఇచ్చాం. 'ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాన్ని తీరుస్తుంది. కానీ వారి దురాశను కాదన్న' (Nature meets the Needs of everyone but not the Greed) మహాత్ముడి మాటలు అక్షర సత్యాలైనాయి. అడవులు చాలా మాయమైపోయాయి పోతున్నాయి. పర్యావరణం ప్రమాదంలో పడింది. భూమి వేడెక్కుతోంది. నేల, నీరు భూమి సమస్తం కలుషితం అయ్యాయి. పరిస్థితులిలాగే కొనసాగితే ఈ శతాబ్దాంతానికి ఈ భూమ్మీద చాలా దేశాలు, ముఖ్యంగా సముద్రతీర దేశాలు, దీవులు అదృశ్యమయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు రుజువులతో సహా మరీ హెచ్చరిస్తున్నారు. భూతాపాన్ని పెంచే వాయువులను విచ్చలవిడిగా వాతావరణంలోకి వదిలి అభివృద్ధి చెందామని గొప్పలు పోతున్నారు. భూతాపాన్ని పెంచే వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్. దీనితో పాటు విష వాయువులైన కార్బన్ మోనో ఆక్సైడ్ వంటి అనేక హానికర వాయువులను ఆటోమొబైల్ పరిశ్రమలు, వాహనాలు అదే పనిగా నిత్యం విడుదల చేస్తూనే ఉన్నాయి. వీటి విడుదలను తగ్గించుకోకపోతే, నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని శాస్త్ర ప్రపంచం చెబుతోంది. తాను జీవించడానికి అవసరమైన ఆక్సీజన్ ను వాడుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను జంతు ప్రపంచం వాతావరణంలోకి వదిలి పెడుతుంది. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ఒక జీవన క్రియ. మరి ఆక్సీజన్ ను ఇలా వాడుకుంటూపోతే కొన్నాళ్లకు వాతావరణంలో ఆక్సిజన్ మాయమై కార్బన్ డై ఆక్సైడ్ మిగిలిపోవచ్చు. కాని అలాంటి ప్రమాదం జరగకుండా జీవప్రపంచంలో మరో ప్రధాన స్రవంతైన వృక్షజాతి కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని తన ఆకుపచ్చని భాగాల్లో, అంటే ఆకుల్లో తనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు కేవలం వాటికి కావలసిన ఆహారాన్ని మాత్రమే తయారు చేసుకోవటం కాదు, ఈ భూమి మీద జీవించే జంతుజలానికి కావలసిన ఆహారాన్ని సైతం అందిస్తాయి. july7ఈ క్రమంలో అవి మానవ మనుగడకే (జంతువులకు కూడ) కీలకమైన ప్రాణవాయువు ఆక్సీజన్ ను విడుదల చేసి ప్రకృతిలో గొప్ప సమతుల్యతకు మూలమైనాయి మొక్కలు. ఇంతటి విశిష్టత కల్గిన మొక్కలు, వాటికి నెలవైన అడవులు అంతరించిపోతే జరిగే దుష్పరిణామాలు ఊహించలేం. మనకు వానలు పడటంలో కూడా అడవులది ఒక విశిష్ట పాత్ర. రుతుపవనాలు రావటం, వానలు పడటంలో అడవులు కీలకం. అడవులు అంతరించటం, పర్యావరణ కాలుష్యం కలగలిసి నేటి వానలు పడని స్థితి. దీన్నుండి బయటపడటం ఎలా?

మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 'హరితహారం' కార్యక్రమం చేపట్టింది. ఇది కోట్లాదిగా మొక్కలు నాటే ఉద్యమం. నాటటం ఒక ఎత్తైతే వాటిని పెంచటం మరో ఎత్తు. మొక్కల్ని పెంచటం, పరిసరాల పచ్చదనాన్ని కాపాడటం ఒక ఆర్భాటం కాకూడదు. అది ఒక అలవాటుగా మారాలి. మొక్కై వంగనిది మానై వంగదు కదా! మీలా బడిలో ఉన్నప్పుడే సరైన అలవాట్లకు దారిపడాలి. అలాంటి అవగాహన, చైతన్యం లోపించడం వల్లనే మన పెద్దలు పర్యావరణ పరిరక్షక్షులుగా కాకుండా కాలుష్య కారకులవుతున్నారు. మన వాతావరణాన్ని, పరిసరాలనూ మనమే చెడగొట్టి దాన్ని మరెవరో వచ్చి బాగుచేయటం లేదని గగ్గోలు పెడతాం. అంటే చెడగొట్టటం మన హక్కయినట్లు, బాగుచేయటం మాత్రం వేరే వాళ్ల బాధ్యతన్నట్లు.

july8మందుగా మన ఇల్లు, మన బడి, మన ఊరు ఇలా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి రోగాలు మన దరిచేరవు. పేరుకుపోయిన చెత్తను ఎత్తివేయడం అవసరమే. కాని అలా అక్కడ ఆ చెత్త ఎందుకు పేరుకుపోయిందో ఆ కారణాన్ని కనిపెట్టినప్పుడే సరైన పరిష్కారం లభిస్తుంది. లేదంటే తీసే మురికి తీస్తుంటే వేసే చెత్త వేస్తూనే ఉంటారు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని కనుగొనటమే శాస్త్రీయ ఆలోచన. మన స్కూలు ఆవరణను మొక్కలతో నింపండి. మీరు నాటిన మొక్కకు మీరే బాధ్యత తీసుకుని పెంచండి. రెండేళ్లలో మీ స్కూలు ఒక వనం అవుతుంది. ఈ పనిని సర్కారు బడుల్లో చదివే సగటు విద్యార్థులే చేయగలరు. డిజీ, బిజీ విద్యార్థులు చేద్దామన్నా వారి స్కూల్లో వాళ్లకే సరైన స్థలం ఉండదు. మొక్కలు పెంచే స్థలం అంటే గొంతెమ్మ కోరికే అవుతుంది. సర్కారు బడులు ఆటస్థలలకూ, పచ్చదనానికి మాత్రమే పట్టుగొమ్మలు కాదు. చురుకైన మీలాంటి పిల్లలను తీర్చిదిద్దే శిక్షణ పొందిన గురువులకూ పెట్టింది పేరు. ఏ పేర్లు పెట్టుకున్నా సర్కారు టీచర్లకు సాటిరాగల ఉపాధ్యాయులు మరెక్కడా లభించరు.  వారి విజ్ఞాణాన్ని మరింతగా ఉపయోగపడేటట్లుగా తల్లిదండ్రులు చొరవ తీసుకొని తమ పిల్లలను సర్కార్ బడిలో చదపించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి.  ప్రతి బడిలో వన మహోత్సవం జరగాలి. ప్రతి బడి ఒక శాంతినికేతనమై వెలగాలి. అప్పుడే మన బడులు హరితమై మన పిల్లలు పచ్చపచ్చగా వాళ్ల జీవితాలు ఆనందభరితంగా రూపుదిద్దుకుంటాయి.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate