অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

క్షమ

క్షమ

చంపదగినయట్టి శత్రువు తనచేత

చిక్కనేని కీడు చేయరాదు

పొసగమేలు చేసి పొమ్మనుటేచావు

విశ్వదాభిరామ! వినుర వేమ!

“చంపవలసిన శత్రువు చేతికి దొరికినా, చంపకూడదు. పైగా మేలు చేసి 'పో’ అంటే అదే చావుతో సమానం.” కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్రర్యం ఈ ఆరింటిని అరిషేడ్వర్గాలని మన పూర్వీకులు చెప్పారు. ఇవి మనలో ఉన్న మన శత్రువులన్న మాట. వీటిని జయించడం, వీటిని వదులుకోవటం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు. అలాగని వీటిని మన మనస్సు నిండా నింపుకొని రగిలిపోతూ ఉంటే చెడిపోయేది మనమే. కామంతో రావణుడు, మాతర్యంతో దుర్యోధనుడు ఇలా ఒక్కొక్కరు దుర్గుణంతో పతనమైపోయారు. మనుషుల వ్యక్తిత్వాల వల్ల గాని, సామాజిక పరిస్థితుల వల్ల గాని ఒక వ్యక్తికి మరొక వ్యక్తి, ఒక గుంపుకు మరోక గుంపు శత్రువుగా మారడానికి అవకాశముంది. శత్రుత్వం ముదిరిపోయినప్పుడు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక గుంపును మరొక గుంపు తుదముట్టించాలని చూస్తుంటారు. ప్రతీకారేచ్ఛ మనలోని మనిషిని ధ్వంసం చేస్తుంది. రాజకీయ కక్షలు, ముఠా కక్షలు ప్రతీకార హత్యలకు దారితీసి మారణహోమం సమాజాన్ని అతలాకుతలం చేసిన సందర్భాలున్నాయి. కంటికి కన్ను పంటికి పన్ను సిద్దాంతం ఈ మారణకాండకు కారణం. ఒకర్నొకరు చంపుకుంటూ ఉంటే అది నాగరిక సమాజమనిపించుకోదు. దాడికి ప్రతిదాడులు, పేలుళ్లకు ప్రతి పేలుళ్లు, నరికివేతలకు ప్రతినరికివేతలు, అత్యాచారానికి ప్రతీఅత్యాచారం, హత్యకు ప్రతిహత్య మనదేశ చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. శత్రుత్వం పరిష్కరించరాని స్థాయికి చేరుకున్నప్పుడు దానిని ఎవడూ ఆపలేకపోవచ్చుమోగాని, చాలా సందర్భాలలో మనం శత్రుత్వాన్ని జయించడానికి దానిని చంపుకోడానికి అవకాశముంది. వీడిని చంపితే తప్ప నా కసి తీరదు అన్నంత శత్రువు చేతికి దొరికినప్పుడు చంపేశామనుకో అది చాలా సహజ విజయంగా మిగిలిపోతుంది. అదే శత్రువుకు అతను చేసిన తప్పును ఎత్తిచూపి, ఇలాంటి పనులు ఇకమీదట చేయొద్దు పొ

అని వదిలిపెట్టేశామంటే అతనికి అదే చావు, మరణ శిక్షతో సమానమంటాడు వేమన. ఇలా చెయ్యడానికి మనిషి ఎంతో ఎదగాలి. ఇంద్రియాలను జయించాలి. క్రోధం అనే నరాన్ని తెగనోసుకోవాలి. మనదేశంలోనే మరణశిక్ష విధించబడిన ఖైదీలకు, వాళ్ల చేతిలో మరణించిన కుటుంబాల వాళ్లు, క్షమాభిక్ష పెట్టమని ప్రభుత్వాలకు విన్నవించిన సందర్భాలున్నాయి. ఆ చీటికిమాటికి చిన్న చిన్న కారణాలతో చంపుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఒక వ్యక్తి చేతిలో నష్టపోయిన వ్యక్తి, ఆ వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడం ఉన్నతమైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వ వికాసమంటే ఇదే. కోపం వచ్చినప్పుడు ఒకటి రెండు అని ఒకటికి పది సార్లు లెక్కబెట్టమంటారు మనవాళు. ఎందుకంటే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవడం కోసం. తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకం కూడా చెబుతుంది.

ఆధారం: ప్రొ. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate