অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గాలికధ

గాలికధ

(బడి వాతావరణం, ఇంకా పాఠశాల మోదలవలేదు. అరుణ టీచర్ దగ్గరికి సుబ్బయ్య అనే రైతు వచ్చారు)

సుబ్బయ్య : అమ్మా! మా వాడు రెండ్రోజుల్నించి బడికి రావట్లేదు. మీతో చెప్పడానికి భయపడ్తున్నాడు. నన్ను వెళ్లి మీకు చెప్పమన్నాడు. మీరు క్షమిస్తేనే వస్తాడట.

అరుణ: సుబ్బయ్యా! మామూలుగా మీ వాడు మంచోడే! కానీ అల్లరి తిరుగుళ్ళు తిరుగుతూ చెడిపోతున్నాడు. ఏమీ అనట్లే వెళ్లి తీసుకురాపో! (సుబ్బయ్య వెళ్లిపోయాడు) ఇంతలో సుబ్బయ్య కొడుకు సంకేత్ స్నేహితులు అరుణ మేడం దగ్గరికి వచ్చారు)

ప్రభాకర్: మేడం, సంకేత్ ఉత్త గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు మేడం. మేం బాగా చదువుకో అంటే మమ్మల్నేగాలి కబుర్లు చెప్పొద్దు అని అంటున్నాడండీ!

అరుణ: సంతోషమేస్తే, గాల్లో తేలినట్టుందే అంటారు మీరే! ఎవరన్నా చస్తే గాల్లో కలిసి పోయాడు అంటారు. వృధాగా సోమరిగా తిరుగుతుంటే గాలికి తిరుగుడున్నాడుఅంటారు. మంచిమాటలు చెబితే గాలికబుర్లు చెప్పొద్దు అని అంటారు. మీకందరికీ గాలి అంటే చాలా చులకనయిందిరా!

సంతోష్ : అవును మేడం, ఇంకా పాట కూడా ఉంది. గాలికి కులమేదీ అని. నేలకు నీటికీ కూడా కులం లేదు కదా మేడం. మనకేనా కులాలు మేడం.

అరుణ: ఇవే గాలికబుర్లు అంటే. ఇలాంటి పనిలేని మాటల్నే గాలి కబుర్లు అంటారు. గాలి కబుర్లలో పస లేదు గానీ గాలికి సంబంధించిన కబుర్లలో మాత్రం చాలా పస ఉందిరోయ్. (ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. కొందరు విద్యార్థినులు కూడా ముందే వచ్చారు).

రేవతి: కొండ గాలి పిలిచింది, గుండె ఊసులాడింది అంటూ ఓసారి, చల్లగ . వీచే పిల్లగాలికి కనులు మూసినా కలలాయే అంటూ కూడా గాలిని మంచి వస్తువుగా కూడా కొనియాడారు కదా మేడం!

అంజన: థండీ హవారే' అంటూ హిందీలో కూడా చాలా పాటలున్నాయి.

ప్రభాకర్ : మేడం గాలి కబుర్లు చెప్పం కానీ మీరిక గాలికి సంబంధించిన కబుర్లు కొన్ని చెప్పండి మేడం.

అరుణ: గాలి గురించి బాగా వివరించాలంటే చాలా సమయం పడుంది. ఇవాళ తరగతిలో మీకు గాలికి సంబంధించిన పాఠాన్నే తీసుకుంటా సరేనా.. పదండి తరగతి గదిలోకి! (అనగానే అందరూ తరగతి గదిలోకి వెళ్లారు)

రహీం : మేడం, కిటికీ తెరుస్తాం మేడం, మీరు బోర్డు మీద రాసేవి కనిపించడం లేదు.

అరుణ : తప్పకుండా రహీం. కిటికీలు తెరువు. కిటికీలు తెరిస్తే వెలుతురే కాదు, గాలి కూడా వస్తుంది.

జోసెస్ : గదిలో గాలి ఎటూ ఉంది కదా మేడం, కిటికీలు తెరిస్తే చీకటి పోతుంది కానీ గాలి వస్తే లాభమేముంది!

అరుణ: పిల్లలూ మీకందరికీ గాలి గురించి ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే మీకిలాంటి సందేహాలు యిన్ని వచ్చేవి కావు. అందుకే మీకు గాలి గురించి చెప్పడానికి ఓ పెద్దాయన్ను నేను ఇప్పుడే పిలుస్తాను. ఆయన జనవిజ్ఞాన వేదికలో పనిచేస్తున్న

ఓ శాస్త్రవేత్త. పేరు సేవాసదానందం. పేరుకు తగ్గట్లే ఎల్లప్పుడూ సేవ చేయడంలోనే ఆయనకు ఆనందం. మీరీలోగా నేనిచ్చే బెలూన్లలోకి గాలిని ఊదండి. నేను కొన్ని బెలూన్లలో హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ వాయువుల్ని నింపుతాను, సరేనా. (అనగానే అరుణ మేడం అందరికీ బెలూన్లనిచ్చింది. అందరూ ఊదీరెడీగా ఉంచుకున్నారు. పాఠశాలలో వివిధ వాయువులు లేకున్నా అరుణ మేడం రసాయనిక చర్యల ద్వారా ఆయా వాయువుల్ని ఉత్పత్తి చేసి బెలూన్లలో నింపింది).

శాంతి : మేడం మేమయితే నోటితో గాలిని ఊదాము, అది ఈజీ మీరు ఇన్ని రకాల వాయువుల్ని ఎలా తయారు చేయగలిగారు?

అరుణ: నేను పరీక్ష నాళికలో జింకు ముక్కల్ని ఉంచి కొంత హైడ్రోక్లోరిక్ ఆమ్లాని కలిపాను. హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది దాన్ని ఈ బెలూన్లో నింపాను. మరో మూత ఉన్న పాత్రలో ముందే పైరోగలాల్ అనే ద్రావణాన్ని ఉంచి అందులో మామూలు గాలిని సైకిల్ ట్యూబుతో కొట్టాను, పైగలాల్ లో ఆక్సిజన్ కరిగిపోతుంది. మిగిలినది నైట్రోజన్ దాన్ని, ఇదుగో ఈ బెలూన్లోకి నింపాను చివరిగా మరో పరీక్ష నాళికలోకి అదే నర్రా సోడియం క్లోరైడ్ తీసుకొని సల్ఫ్యూరికామ్లం కలిపాను. క్లోరిన్ వచ్చింది. దాన్ని ఈ బెలూన్లోకి నింపాను ఇవన్నీ మళ్లీ మీకు చూపిస్తాను. అయితే ఈ రసాయనిక చర్యలన్నీ ఎంతో కొంత నేర్పుగా, జాగ్రత్తగా చేయాలి కాబట్టి నేను చేశాను. మీ చేత నేను రేపు జాగ్రత్తగా చేయిస్తాన్లే.

రాజు: మేడం! ఇంతకీ ఈ బెలూన్లకు మేము ఎందుకు నింపినట్లు?

అరుణ: ఇప్పుడు అందరం బెలూన్ల ముడులకు దారాలు కట్టి వదిలేద్దాం. (అందరూ అలాగే బెలూన్లను వదిలేశారు)

జోసెస్: మేడం హైడ్రోజన్ వాయువున్న బెలూన్ స్పీడుగా పైకి పోతోంది.

సంపత్: మేడం, క్లోరిన్ ఉన్న బెలూన్ టపీమని క్రిందకు పడింది మేడం.

రాము: “అరే, నైట్రోజన్ ఉన్న బెలూన్ కూడా మెల్లగా పైకి వెళ్తుంది మేడం.

అరుణ: మేడం, అక్సిజన్ బెలూన్ కూడా క్రిందికే వస్తోంది మేడం.

అరుణ: మీరు ఊదిన బెలూన్ల సంగతి చెప్పలేం.

అందరూ: మేడం మేము గాలి ఊదిన బెలూన్లు కూడా క్రిందికే పడుతున్నాయి మేడం.

సుధ: మేడం, ఇలా కొన్ని బెలూన్లు పైకి, కొన్ని క్రిందికి ఎందుకు రావాలి మేడం? పైగా పైకి వెళ్లేవన్నీ ఒకే వేగంతో పైకి వెళ్లడం లేదు. క్రింద పడేవన్నీ ఒకే వేగంతో క్రింద పడ్డం లేదు. అలా ఎందుకు? గెలీలియో సూత్రం ప్రకారం వస్తువుల ద్రవ్యరాశితో సంబంధం లేకుండా అన్నీ ఒకే వేగంతో క్రిందికి పడాలి కదా!

అరుణ : మన చుట్టూ గాలి లేనట్లయితే మీరన్నట్లు బెలూన్లో ఏ వాయువు ఉన్నా అన్నీ ఒకే వేగంతో నేలమీద పడి ఉండేవి. ఇలా కొన్ని పైకి, కొన్ని కిందకి రావడానికి కారణం మన చుట్టూ ఉన్న గాలే. (ఇంతలో సేవాసదానందం వచ్చాడు)

ఆధారము: ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య.

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/4/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate