অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పనిలో నైపుణ్యత కథానిక

పనిలో నైపుణ్యత కథానిక

ఒకానొక కాలంలో ఒక బలశాలి అయిన చెట్లు నరికే అతను, ఒక కొయ్యల వ్యాపారిని అడిగి పని సంపాదించుకొన్నాడు. అతని పనికి తగ్గట్లుగా మంచి జీతం కూడా పొందాడు. అందువల్ల ఆ చెట్లు నరికే అతను బాగా కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకొన్నాడు.

07.jpgఅతని యజమాని అతనికి ఒక గొడ్డలి ఇచ్చి అతను చెట్లునరకాల్సిన ప్రదేశాన్ని చూపించాడు. మొదటి రోజు అతను 15 చెట్లు నరికాడు. దానికి యజమాని అతన్ని అభినందించి ఇదే విధంగా పని కొనసాగించవల్సిందిగా చెప్పాడు.

యజమాని మెప్పును పొందిన అతను బాగా కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకొన్నాడు. అయితే మరునాడు అతను 10 చెట్లను మాత్రమే నరకగలిగాడు. మూడన రోజు ఇంకా బాగా కష్టపడి పనిచేసినప్పటికీ ఏడు చెట్లను మాత్రమే నరకగలిగాడు. రోజు రోజుకు అతను నరకవలసిన చెట్ల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. దాన్ని బట్టి చెట్లు నరికే అతను నేను నా శక్తిని కోల్పోతున్నానని భావించాడు. అతను యజమాని వద్దకు వెళ్ళి జరుగుతున్న దానికి క్షమాపణలు చెపుతూ ఎందువల్ల ఈ విధంగా జరగుతున్నదో తనకు అర్థం కావడంలేదన్నాడు.

నీవు నీ గొడ్డలికి పదును పెట్టించి ఎంత కాలమయిందని అతన్ని యజమాని ప్రశ్నించాడు. పదునా నా గొడ్డలికి పదును పెట్టించేందుకు నాకు సమయం చిక్కడం లేదు. నేను చెట్లు నరకడంలో ఎప్పుడు బిజీగా వుంటున్నాను. అని అతను బదులు చెప్పాడు.

మనలో ఎక్కువ మంది పనిలో నైపుణ్యం పెంచుకొనేందుకు కృషి చేయరు. మనం నేర్చుకొన్నదే చాలా ఎక్కువ అని అనుకొంటారు. అయితే ఎప్పుడు కూడా ఒక విజయంతోనే సరిపెట్టుకోకూడదు. అంతకంటే మెరుగైన మరికొన్ని విజయాల కోసం కృషి చేస్తూ వుండాలి. అనునిత్యం మన నైపుణ్యానికి పదును పెట్టడమే విజయానికి కీలకం.

నిన్న మొన్నటి దాకా నేను కిరోసిన్ స్టౌవ్ మీదే వండుకునే వాడిని ఈ పరిసరాలలో ఎక్కడా వంటగ్యాస్ దొరకదు. ఇక్కడి వారందరూ అయితే కట్టేల పొయ్యి మీద, లేకపోతే కిరోసిన్ స్టౌవ్ సాయంతో వంట వండుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం బొగ్గుల కుంపటిని వాడతారు

నా ఒక్కడి వంట కోసం ప్రతిసారీ కట్టెల పొయ్యిని లేదా బొగ్గుల కుంపటిని రాజెయ్యడం, ఆర్పడం మళ్ళీ రాజెయ్యడం - ఆర్పడం ఇదేమంత గిట్టుబాటయ్యే పనిలా కన్పించలేదు. అదీగాక రోజంతా ఏదో ఒక పని వుండటంతో కట్టెల పొయ్యి పైన వంట చేసుకునేంత తీరిక వుండేది కాదు. దాంతో కిరోసిన్ స్టవ్వుకే నేను బాగా అలవాటు పడిపోయాను.

కాని ఇప్పుడు కిరోసిన్ రేటుకూడా బాగా పెరిగిపోయింది. పైగా అది దొరకడం కూడా చాలా కష్టమయ్యింది. దాంతో వంటాగింటా అన్నీ మానేసి, రోడ్డు పక్కన ఉన్న భోజనం హోటల్లో తినడం మొదలుపెట్టాను. అక్కడి వంటకాలు ఘోరంగా ఏమీ లేవు. కానీ ఒక రెండు మూడు వారాలు తినే సరికి విసుగెత్తింది. అదీగాక ఆ భోజనానికై డబ్బు కూడా బాగా ఖర్చైపోతోంది. ఓరి దేవుడోయ్ ప్రతిరోజు హోటల్ లో తింటే ఇంత ఖర్చవుతుందా .... నెల తిరక్కుండానే నా కళ్ళు బైర్లు కమ్మాయి.

ఇక లాభం లేదు. వంటకై ఏదో ఒకటి చెయ్యాల్సిందే అనుకున్నాను. బాగా ఆలోచించి ఒక సోలార్ కుక్కర్ ని (సౌరశక్తితో పనిచేసే కుక్కర్) కొని తెచ్చుకున్నాను.

ఆదివారం ఉదయం పూట కాస్త పొద్దెక్కాక సోలార్ కుక్కర్ ని పెరట్లో ఎండ బాగా తగిలే చోట పెట్టాను. అంతకు ముందే కుక్కర్ లోని ఒక్కో గిన్నెలో ఒక్కో పదార్థాన్ని ఉంచి గట్టిగా మూతపెట్టాను. ఒక గిన్నెలో బియ్యం కడిగి పెట్టాను. మరొక దానిలో పప్పు పెట్టాను. వేరొక దానిలో కోసిన కూరగాయ ముక్కలను పెట్టాను. ఎలాగైతేనేం సోలార్ కుక్కర్ లో వండుకోవడానికి సిద్ధమయ్యానే గాని, ఇదే మొదటిసారి కావడం అదసలు పని చేస్తుందో లేదో, నా వంటకాలు ఉడుకుతాయో లేదో నాకే కాస్త అనుమానంగా వుంది.

కుక్కర్ ని ఎండలో పెట్టిన కొద్ది సేపటికే ఇరుగుపొరుగువాళ్ళు మా ఇంటి దగ్గర గుమికూడారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదేం పెట్టె నారాయణా చాలా తమాషాగా వుంది అని నన్ను అడగడం మొదలుపెట్టారు.

మీరన్నట్లు చూడ్డానికి ఇదొక పెద్ద డబ్బాలాగే కన్పిస్తుంది లెండి. కాని ఇది ఉత్తుత్తి డబ్బా కాదు. అన్నం వండే డబ్బా. ఇందులో ఒక దర్పణము, ఇంకా ఒక దళసరి గాజు పలక వుంటాయి. ఈ గాజు పలక, దర్పణమూ కలిసి సూర్యుడి కాంతిని ఉడకాల్సిన పదార్థాలపై పడేలా చేస్తాయి. ఆ వేడికి అన్నం, పప్పు అన్నీ ఉడికి భోజనం తయారైపోతుంది. అని సోలార్ కుక్కర్ గురించి అందరికీ వివరించి చెప్పాను.

నేనీ పెట్టెలో అన్నం వండుతానని తెలియగానే అందరికీ దాని మీద మరింత ఉత్సాహం కలిగింది. నా కుక్కర్ చుట్టూ మూగి రకరకాల ప్రశ్నలడగడం మొదలుపెట్టారు.

ఈ పెట్టెలో ఆ నాలగు నల్ల డబ్బాలు ఎందుకున్నాయి... సూర్యుడి వేడితో నిజంగానే అన్నం - పప్పు ఉడుకుతాయా లేక ఇదంతా ఒట్టిదేనా అని ఒకరడిగితే, ఏమిటి ఇంత తక్కువ నీళ్ళతోనే ఉడికిపోతాయా అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒకో సందేహం అడగసాగారు.

ఒకసారి దీనికి ఎండనైతే తగలనీయండి. అవన్నీ ఉడుకుతాయో లేదో మనకే తెలుస్తుంది. అన్నాను నేను ఒపిగ్గా.

కుక్కర్ లో దర్పణాన్ని సరిగ్గా అమర్చాక, ఎవరింట్లోకి వారు వెళ్ళి పోయారు. నేను ఇంట్లో ఉంటూనే కుక్కర్ మీద ఒ కన్నేసి వుంచారు. అప్పుడప్పుడు కొందరు పిల్లలు వచ్చి సోలార్ కుక్కర్ దగ్గర మూగుతున్నారు. ఇంతలోనే, నేన్నుండటం గమనించి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటున్నారు.

ఆ తరువాత ప్రతి పావుగంటకూ, అరగంటకూ ఎవరో ఒకరు రావడం, ఏమన్నా, నీ వంట తయరైపోయిందా అని అడగడం నాకు మామూలైపోయింది. దాని విషయంలో అందరికీ ఆతృతగానే వుంది మరి.

నేను ప్రతి పదహేను నిమిషాలకు ఒకసారి కుక్కర్ దగ్గరికి వెళ్ళి, సూర్యకిరణాలు సూటిగా దానిపై పడేలా దర్పణాన్ని సరిచేసి వస్తున్నాను. కాని ఇలా ఎంతసేపు.

ఓ గంటన్నర గడిచేసరికి ఇక నేను కూడా ఉండబట్టలేకపోయాను. ఒక మసిగుడ్డను చేత్తో పట్టుకుని నల్లడబ్బాలపై మూతగా వున్న దళసరి గాజును పైకి లేపాను. దానినిలా తెరిచానో లేదో లోపను నుంచి వేడి వేడి ఆవిరి, ఉడికిన పప్పు తాలూకు కమ్మటి వాసన వచ్చాయి.

తలెత్తి చూద్దును కదా నా చుట్టూ మళ్ళీ జనం గుమికూడిపోయి ఉన్నారు. వాళ్ళ మొహాలలో చెప్పలేనంత కుతూహలం కన్పించింది. ఇక దాంతో నాకు అన్నం, పప్పు డబ్బా మూతలను తెరవక తప్పలేదు.

అన్నం డబ్బాలోని ప్రతి బియ్యపు గింజా పొత్తులా ఉడికి వుంది. చాలా మంది నమ్మలేనట్లుగా చూశారు. ఇక పప్పు డబ్బా మూత తెరచి చూడాలి.

“అన్నమైతే ఎలాగోలా ఉడికింది గాని పప్పు మాత్రం చచ్చినా వుడకదు” అని ఎవరో అన్నారు. డబ్బా మూత తెరచారు. పప్పు కొంచెం పలుగ్గా ఉన్న మాట నిజమే. కాని బాగానే ఉడికింది. చుట్టూ ఉన్న జనం డబ్బా నుంచి వచ్చిన వాసనను పీల్చి “వారేవా” అన్నారు.

ఏమైతేనేం, ఈ పొయ్యి లేని వంట అందరికీ నచ్చింది అన్పించింది. (అన్నట్లు మీ ఇంట్లోను, మీ చుట్టు పక్కలా ఇళ్ళలోనూ వంట చేసేందుకై ఏయే ఇంధనాలను ఉపయోగిస్తున్నారో మీరెప్పుడైనా గమనించారా వాటి వల్ల అంటే ఆయా ఇంధనాల వల్ల ప్రకృతికి గాని, వాతావరణానికి గాని ఏవైనా హాని జరుగుతుందా జరిగితే ఏమిటది సౌరశక్తితో పనిచేసే హాని జరుగుతుందా? జరిగితే ఏమిటది? సౌరశక్తితో పనిచేసే పరికరాలను వాడటం వలన కూడా అలాంటి హాని జరుగుతుందా? మీ చుట్టు పక్కల ఎవరైనా సౌరశక్తితో పనిచేసే కుక్కర్ లను గాని హీటర్ లను గాని (నీళ్ళను వేడిచేసే పరికరం). ఫ్యాన్ లను గాని, ఉపయోగిస్తున్నారా సౌరశక్తితో పనిచేసే పరికరాలు మన రాష్ట్రంలో ఎక్కడ దొరుకుతాయి? వాటిని ఉపయోగించడం వలన మనకేం లాభం ఇలాంటి ప్రశ్నల గురించి ఒకసారి లోతుగా అలోచిస్తారు కదూ! సరేనా!

రచయిత -వంగీపురం శ్రీనాథాచార్య.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate