অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విచిత్ర వివాదం - వింత పరిష్కారం కథానిక

విచిత్ర వివాదం - వింత పరిష్కారం కథానిక

ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు వుండేవారు. అన్న మహాధనవంతుడు. తమ్ముడు మాత్రం నిరుపేద.

ఒకనాడు పేదవాడి ఇంట్లో కట్టెలు నిండుకున్నాయి. అవి లేనిదే పొయ్యి రాజుకోదుగా. అందుకే అతగాడు వెంటనే అడవికి పోయి బోలెడన్ని కట్టెలు కొట్టుకున్నాడు. రేపో ఎల్లుండే వానలు మొదలవుతాయి. అందకని సాధ్యమైనన్ని కట్టెల్ని ఈ రోజే తీసుకుపోవాలి అనుకున్నాడు. ఆలోచన బాగానే వుంది. కాని కట్టెల్ని ఇంటికి తీసుకొచ్చేందుకై అతని దగ్గర ఓ ఎడ్లబండిగాని, గుర్రంగాని, చివరకు గాడిదగాని ఏమీ లేవు. మరిప్పుడెలా?!

పేదవాడు బాగా ఆలోచించి తన అన్న దగ్గరికి వెళ్ళాడు. 03.jpgసంగతి చెప్పి, తనకో గుర్రాన్ని ఇమ్మని, రెండు - మూడు గంటల్లో తిరిగి ఇచ్చేస్తాననీ అన్నాడు. ధనవంతుడు ముఖం మాడ్చుకున్నాడు. తన తమ్ముడ్ని చాలాసేపు అలాగే కూర్చోబెట్టాడు.

తరువాత సరే, ఈ ఒక్కసారికీ నీకు నా గుర్రాన్ని ఇస్తాను. కాని దానితో మరీ ఎక్కువ బరువు లాగించొద్దు. సరేనా అన్నాడు కటువుగా. ఇదిగో, ఇప్పుడు గుర్రాన్ని కదా అని చీటికీ మాటికీ వచ్చి అదీ ఇదీ అడిగేవు. అలాంటిదేమీ కుదరదని గుర్తుంచుకో. ఈ రోజు గుర్రమడిగావు. రేపు మరేదో అడుగుతావు. ఇలా నువ్వడిగినవన్నీ ఇచ్చుకుంటే పోతే చివరకు నాకు చిప్ప చేతికొస్తుంది. అందుకని నేను ముందే చెబుతున్నాను. అన్నాడు. మరింత కఠినంగా.

పాపం, అతని మాటలకు పేదవాడికి చాలా బాధ కలిగింది. అయినా తప్పదు. అవసరం తనది. ఏం చేస్తాడు. మనసులో బాధని మనసులోనే దాచుకొని అన్న ఇచ్చిన గుర్రాన్ని తీసుకొని అడవికొచ్చాడు. తీరా అడవికొచ్చాక, తన అన్న గుర్రాన్నైతే ఇచ్చాడుగానీ దాని కళ్ళాన్ని ఇవ్వలేదని గుర్తుకొచ్చింది. ఇప్పుడెలా ?

తిరిగి వెనక్కి వెళ్ళి అడగడం వలన ఎలాంటి లాభమా వుండదు.04.jpg తన అన్న ఆ కళ్ళాన్ని ఇవ్వడు గాక ఇవ్వడు. పైగా ఇంకెప్పుడూ ఏదీ అడగొద్దని ఇంతకు ముందే చెప్పాని కదా. అంటూ మరిన్ని మాటలంటాడు. ఎందుకొచ్చిన తంటా, అందుకని పేదవాడు తన కట్టెలబండిని గుర్రం తోకకు కట్టేసి, ఇంటికి బయలుదేరాడు.

దారిలో అతని చక్రం ఒక చెట్టు మొద్దులో ఇరుక్కుపోయింది. అది గమనించని పెదవాడు, గుర్రం తనకు తానుగా ఆగిపోయిందనుకొని చెర్నాకొలుతో దానికి ఒకటిచ్చుకున్నాడు. ఆ గుర్రం ముందే కాస్త కోపిష్టి స్వభావంది. దానికి తోడు వంటి మీద దెబ్బ పడే సరికి దానికి మరింత మంట పుట్టింది. తనన బలనంత పెట్టి ఒక్క ఉదుటున ముందుకు కదిలింది. ఆ దెబ్బకు దాని తోకతోకంతా ఊడి వచ్చింది.

ఓరి దేవుడోయ్, ఇప్పుడెలా పేదవాడికి కలిగిన ఆందోళన ఇంతా అంతా కాదు. అయినా ఏం చేయగలడు పాపం. గుర్రాన్ని, ఊడివచ్చిన దాని తోకని తీసుకొని భయం భయంగా అన్న ఇంటికి వెళ్ళాడు.

గుర్రాన్ని చూసిన ధనవంతుడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తన తమ్ముడ్ని బండభూతులు తిట్టాడు. నువ్వు నా గుర్రాన్ని సర్వనాశనం చేశా వంటూ గావుకేకలు పెట్టాడు. చివరకు ఇదిగో, నిన్నిలా ఊరికేవదిలి పెడతాననుకోకు. నాకు జరిగిన నష్టానికి అణాపైసలతో సహా వసూలు చేస్తాను అంటూ చిందులు తొక్కాడు. అన్నట్లుగానే ఆఘమేఘోల మీద పట్నం వెళ్ళి న్యాయ స్థానంలో తన తమ్ముడి మీద ఫిర్యాదు చేశాడు.

కొన్ని రోజులు గడిచాక, న్యాయస్థానానికి రమ్మంటే అన్నదమ్ములిద్దరికీ తాఖీదులు నచ్చాయి. 05.jpgఎవరికి వారు విడివిడిగా పట్నం బయలుదేరారు. పట్నం పోతున్నాడన్న మాటేగానీ పేదవాడికి మనసంతా గందరగోళంగా వుంది. రెక్కాడితేగాని డొక్కాడని తను ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం ఎంత కష్టం అనుకున్నాడు.

ఏమీ లేని పేదవాడు ఒక డబ్బున్న వాడితో తలపడటం అంటే... బలమూ, శక్తీ లేని ఒక బక్కపీచు మనిషి ఒక పెద్ద వస్తాదుతో తలపడటం లాంటిదే. ఇందులో నేను గెలిచే అవకాశం ఎంత మాత్రం వుండదు. నేను కావాలని ఏ తప్పూ చేయనప్పటికీ నేను దోషినేనని అతను నమ్మిస్తాడు అనుకుంటూ పేదవాడు పరధ్యానంగా నడుస్తున్నాడు.

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అతనో వంతెన మీదకొచ్చాడు. ఆ వంతెనకు అటూ ఇటూ ఎలాంటి అడ్డుకట్టలూ (రెయిలింగ్) లేవు. ఇంకేముంది. పరధ్యానంగా నడుస్తున్న పేదవాడు దభేలున జారి పడిపోయాడు.

ఆ వంతెన కిందివాగు ఆ సమయంలో ఎండిపోయి వుంది. అయితే ఎవరో ఒక వ్యాపారి జబ్బున పడ్డ తన ముసలి తండ్రిని బండిపై పడుకోబెట్టుకొని, వైద్యం చేయించేందుకై ఆ వాగులోంచి బండిని తోలుకుంటూ పొరుగూరికి తీసుకుకొని పోతున్నాడు.

వంతెన మీద నుంచి జారిపడిన పేదవాడు సరాసరి బండిమీద పోతున్న ముసలాడు మీద పడ్డాడు. 06.jpgపాపం ముందే అతను పోతున్న ముసలాడు మీద పడ్డాడు. పాపం ముందే అతను ముసలివాడు దానికి తోడు జబ్బుపడ్డాడు. అది చాలదన్నట్లు ఓ మనిషొచ్చి దభీమని అలా పడ్డాడు. ఇక చెప్పేందుకేముంటుందని. ఆ ముసలాడు పాపం అక్కడిక్కక్కడే హరీమన్నాడు.

ఓరి దుర్మార్గుడా నువ్వు నా తండ్రీని అన్యాయంగా చంపేశావు అంటూ వ్యాపారి రంకె వేశాడు. తాడోపేడో తేల్చుకుందాం పద కోర్టుకి అంటూ పేదవాడ్ని పట్టుకొని పట్నం వైపు బయలుదేరాడు.

పాపం ఇప్పుడు పేదవాడి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లుంది అంటారు చూడండి. సరిగ్గా అలా వుంది అతని పరిస్థతి. ఇక ఇప్పుడు నాకు శిక్ష ఖాయం. చాలా పెద్ద శిక్ష వేస్తారు అనుకొన్నాడు. ఏ తప్పూ చేయకుండా ఇలా జైలుకి వెళ్ళే బదులు ఏదో ఒక తప్పు చేసి శిక్ష అనుభవించడం న్యాయంగా వుంటుంది కదా అని అతనికి అన్పించింది. వెంటనే అటూ ఇటూ చూసి కంటిని కన్పించిన ఒక బండరాయిని తీసుకొని ఒక బట్టలో మూటలా చుట్టి తన దగ్గర పెట్టుకున్నాడు.

నాకు గానీ శిక్ష పడాలి... ఆ ధనవంతుడ్ని ఈ వ్యాపారినీ దీంతో చితకబాదుతాను. అవసరమైతే జడ్జిగారికి కూడా ఓ రెండు తగిలిస్తాను అనుకొన్నాడు పేదవాడు.

కొంత సేపటికి ముగ్గురూ న్యాయస్థానంలో వున్నారు. విఆచరణ మొదలయ్యింది. జడ్జిగారు ముగ్గుర్ని ఎన్నెన్నో ప్రశ్నలడుగుతున్నారు. అయితే మన పేదవాడు అదేమీ పట్టించుకోకుండా.

వినిపించండి జడ్జిగారూ, వినిపించండి మీ తీర్పు. కానీ ముందుగా నా దగ్గర ఏముందో చూడండి. అంటూ తను పట్టుకున్న రాయి మూటను చూపించాడు. ఆ మాటను ఒకసారి ఊరుకోకుండా మాటిమాటికీ అనసాగాడు.

ఈ తగాదాను చూస్తున్న జడ్జిగారు కాస్త డబ్బు కక్కుర్తి మనిషి, అందుకే ఇతను ఇన్నిసార్లు ఆ మూటని చూపిస్తున్నాడంటే అందులో చాలా విలువైనదే వుండి వుంటుంది. బహుశా అందులో ఏ బంగారు కడ్డీయో వుండి వుండవచ్చు లేదా కనీసం ఒక వెండి దిమ్మయినా వుండవచ్చు. అయితేనేం దానికి కూడా బోలెడన్ని డబ్బుతొస్తాయి. అనుకున్నాడు. ఏమైతేనేం సమయం గడిచే కొద్దీ అతనికి మూట మీద ఆశ మరింతగా పెరిగిపోయింది. దాంతో ఇలా తీర్పు చెప్పాడు.

నీ గుర్రానికి తిరిగి తోక మొలిచి, అది పెరిగే దాకా దానిని అప్పగించు అని ధనవంతుడ్ని ఆదేశించాడు.

తరువాత వ్యాపారి వంక తిరిగి నీ తండ్రి గారి చావుకి కారణమయ్యాడు కాబట్టి నువ్వు కూడా ఇతడ్ని అదే పద్ధతిలో చంపేసేయ్. ఇతను వాగు మధ్య నిలపడుతాడు. నువ్వు వంతెనపై నుండి అతని మీదకి దూకు. అదే ఇతనికి తగిన శిక్ష అన్నాడు. ఆ వెంటనే కొర్టు పని ముగిసిపోయిందని ప్రకటించాడు.

ధనవంతుడు మహా గాభరా పడిపోయాడు. జడ్జిగారు తనకేదో నష్టపరిహారం ఇప్పిస్తారనుకుంటే ఇలా జరిగిందేమిటి అని విస్తుబోయాడు. వెంటనే పేదవాడితో పోనీలే తమ్ముడూ జరిగిందేదో జరిగిపోయింది. ఆ తోకలేని గుర్రాన్నే తీసుకుంటాను అన్నాడు.

అరె, అదెలా కుదురుతుంది. జడ్జిగారు ఎలా చెప్పారో అలాగే జరగాలి. నీ గుర్రానికి తిరిగి తోక మొలిచే దాకా దాన్ని నా దగ్గరే వుంచుకుంటాని అన్నాడు పేదవాడు.

దాంతో ధనవంతుడికి చెమటలు పట్టాయి. తన గుర్రాన్ని తనకిచ్చేయమని పేదవాడ్ని రకరకాలుగా బతిమాతాడు. చివరకు నా గుర్రాన్ని నా కిచ్చేస్తే నీకు ఐదొందల రూపాయలిస్తాని అంటూ బేరం పెట్టాడు.

పేదవాడు కొంచెం సేపు ఆలోచించినట్లు నటించి సరే, నీ మాటను ఎందుకు కాదనాలి. అలాగే కానివ్వు అన్నాడు. ధనవంతుడు హమ్మయ్య అనుకుంటూ వెంటనే పేదవాడికి తను ఇస్తానన్న సొమ్ము ఇచ్చేశాడు. దానితో వారిద్దరి మధ్యన ఉన్న సమస్య పరిష్కారమైయింది.

ఇక వ్యాపారి బతిమాడడం మొదలు పెట్టాడు. అతను వాగులో నిలబడడం ఏమిటి తను అతని మీదకు దూకడం ఏమిటి అలా దూకినందుకు అతను చావడం మాట అలా వుంచి తన కాలో చెయ్యో విరిగితే తన ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఇంకేమన్నా వుందా. మొదటికే మోసం రాదూ. అందుకే ఇదిగో తమ్ముడూ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పడదంతా మర్చిపోదాం పోయిన మా నాన్న ఎలాగూ పోయాడు. ఇప్పుడు నేను మీదకు దూకి నీ ప్రాణాలు తీయడం దేనికి. అన్నాడు.

అరరే అలా ఎలా కుదురుతుంది జడ్జ్ గారు చెప్పినట్లు చెయ్యాల్సిందే నువ్వు వంతెనపై నుంచి నా మీదకు దూకాల్సిందే అన్నాడు పెదవాడు. వ్యాపారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. పేదవాడ్ని రకారకాలుగా బతిమాలి, చివరకు నువ్వెంత చెప్పు. నీ మీదకు దుకడంలాకు ఇష్టం లేదు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు వెయ్యిరూపాయలు బహుమతిగా ఇస్తాను అన్నాడు.

పేదవాడు కొంచెం సేపు మౌనంగా ఊరుకొని సరేతే నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఆ వెయ్యి ఇలా ఇచ్చి నీ దారిని నువ్వుపో అన్నాడు. అతనా మాటను అనడసే ఆలస్యం వ్యాపారి వెయ్యి రూపాయలూ అతని చేతిలో పెట్టి, అక్కడి నుంచి మాయమైపోయాడు.

గదిలో పేదవాడు ఒక్కటే వుండటం చూసి జడ్జిగారు మెల్లగా అక్కడకు వచ్చారు. నాకదేదో ఇస్తానన్నావుగా అన్నాడు మూట వంక చూపిస్తూ... అయ్యో అదా అది మీకు ఎందుకూ పనికిరాదు జడ్జిగారూ. ఇది తీసుకోండి. అంటూ తన చేతిలోని డబ్బుని అతని ముందుంచాడు పేదవాడు.

ఈ డబ్బూ గిబ్బూ నాకేమీ వద్దు. నువ్విస్తానన్న ఆ మూటే ఇవ్వు. అని గద్దించాడు జడ్జిగారు.

సరే మీ ఇష్టం అంటూ బండమాటని అతని చేతుల్లో పెట్టి, ఈల వేసుకుంటూ ఇంటిముఖం పట్టాడు పేదవాడు.

రచయిత : డా. గంగిశెట్టి శివకుమార్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate